డ్యాన్సింగ్ మ్యాన్‌హోల్... | Dancing manhole ... | Sakshi
Sakshi News home page

డ్యాన్సింగ్ మ్యాన్‌హోల్...

Published Sat, Nov 29 2014 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 5:17 PM

డ్యాన్సింగ్ మ్యాన్‌హోల్...

డ్యాన్సింగ్ మ్యాన్‌హోల్...

చార్మినార్‌కూ, మదీనాకీ మధ్య గుల్జార్ హౌజ్ అనే కొలను ఉంది. ఇక్కడ ‘హౌజ్’ అంటే ఫౌంటెయిన్ అని అర్థం. హైదరాబాద్ పాలకులు అప్పటి ఇంజనీర్ల సాయంతో ఇలాంటి ఫౌంటెయిన్లు చాలా చోట్ల కట్టించారు. దారి మధ్యలో కట్టించి మరీ నీరు ఉవ్వెత్తున అందంగా ఎగిసేలా చేశారు. అప్పటి ఇంజనీర్లు ఏదో కొన్ని చోట్ల ఇలా హౌజ్‌లు అనే ఫౌంటెయిన్లు కట్టించారేమోగానీ... తమ సంకల్పం లేకుండానే ఈ తరహా ఫౌంటెయిన్లను మన ఆధునిక ఇంజనీర్లూ ఏర్పాటు చేశారు.

కాకపోతే వాళ్లు డ్రైనేజీ మ్యాన్‌హోల్ కవర్స్‌ను ఏర్పాటు చేస్తే... అవి ఆటోమేటిగ్గా గుల్జార్ హౌజ్ లాంటి ఫౌంటెయిన్లుగా రూపుదిద్దుకున్నాయి. తేడా అల్లా ఒక్కటే. గుల్జార్ హౌజ్ ఫౌంటెయిన్ వర్షం కురిసినా, కురవకపోయినా నీళ్లు చిమ్మదు. కానీ మన ఆధునిక ఇంజనీర్లు డ్రైనేజీ కోసం కట్టించిన హౌస్‌లు... అదే ఫౌంటెయిన్‌లు వర్షం వచ్చినప్పుడు నీళ్లు చిమ్ముతాయి. మరో గొప్ప విషయం ఏమిటంటే... వాళ్ల ప్రమేయం లేకుండానే వాళ్లు ఇంకో ఘనమైన రికార్డునూ సాధించారు. అదేమిటంటే... ఈ డ్రైనేజీ ఫౌంటెయిన్‌పై ఉండే మ్యాన్‌హోల్ కవర్‌కు నాట్యం నేర్పడం!
 
వర్షం కురిసి డ్రైనేజీ పొంగడం మొదలుపెట్టగానే మ్యాన్‌హోల్ హౌజ్ అదే ఫౌంటెయిన్‌పై నల్లటి లోహచంద్రుడి షేపులో గుండ్రంగా ఉంటే ఇనుపచక్రం కింద నుంచి ఉవ్వెత్తున పొంగి వచ్చే నీళ్ల తాకిడికి డ్యాన్స్ చేస్తుంటుంది. వర్షం వేళ మ్యాన్‌హోల్‌పై ఉండే సదరు గుండ్రని ఇనుప కవరు మూతకు ఆనకుండా చిత్తడిలో ఇత్తడి పళ్లెంలా  అటూ ఇటూ కదుల్తూ డ్యాన్స్ చేస్తుంటే... డ్యాన్స్ అంటే ఆసక్తి లేనివారైనా సరే కళ్లప్పగించి చూస్తూ ఉండిపోవాల్సిందే.
 
ఇలా మ్యాన్‌హోల్ పైచక్రానికి మణిపురి... డ్రైనేజీపై ఉండే కవర్‌కి కూచిపూడి నేర్పడం అలనాటి ఏ ఇంజనీర్‌కు సాధ్యమైంది చెప్పండి! సాక్షాత్తూ అప్పటి ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య సైతం తాను డిజైన్ చేసిన... మ్యాన్‌హోల్ మూతకూ డ్యాన్సు నేర్పలేకపోయేవాడు. కాబట్టి అలనాటి మోక్షగుండం వంటి ఇంజనీర్ల కంటే ఇప్పటి జలగండం ఇంజనీర్లే గ్రేట్ అని నా అభిప్రాయం.
 
అలనాటి ఇంజనీర్లు మరో అద్భుతం సాధించారట. గోల్కొండ కోట ఎంట్రన్స్‌లో చప్పట్లు కొడితే ఎక్కడో కొండపైన కోట చివర ఉండే నవాబుగారికి వినిపిస్తుందట. అదేదో గొప్ప అనుకుంటున్నారుగానీ... ఇప్పడు మనం అడ్వాన్స్‌డ్ అంటూ పేర్కొంటున్న వైర్‌లెస్ లాంటిదే కదా ఇది. పైగా వాళ్లేదో ఒక్క కోటలోనే ఈ ఏర్పాటు చేసుకున్నారు. కానీ మనం ప్రతి బస్సులోనూ చేసుకున్న ఏర్పాటే కదా ఇది.

టికెట్ల కట్టలు ఉండే హోల్డరుతో కండక్టరు ఒక్క దెబ్బ కొడితే బస్సు ఆగుతుంది. అదే రెండో మూడో దెబ్బలు కొడితే అది బయల్దేరుతుంది. ఇలా ఓ మాటా-ముచ్చటా లేకుండా కేవలం లోహపు చప్పట్లతోనే డ్రైవర్‌కూ, కండక్టర్‌కూ కమ్యూనికేషన్ నడుస్తుంటుంది. ఇది కూడా వైర్‌లెస్సే. మరి వైర్లతో జరిగే కమ్యూనికేషన్ కంటే వైర్‌లెస్‌లు మరింత అభివృద్ధి చెందినవైనప్పుడూ... రోజూ బస్సుల్లో జరిగే ఈ సమాచార వినిమయాన్ని మనం ఎంత గొప్పగా చెప్పుకోవాలి!
 
అందుకే... మనం రోజువారీ ఉపయోగించుకునే టెక్నాలజీ విషయం నిర్మొహమాటంగా మాట్లాడుకోవాలంటే  నిరభ్యంతరంగా మన సిటీ మరింత అడ్వాన్స్‌డే. అటు డ్యాన్సింగ్ మ్యాన్‌హోల్స్ అయినా... ఇటు టాక్‌లెస్ టికెట్ హోల్డర్ అయినా!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement