కరాచీ గుండెల్లో.. మన చార్మినార్
షహర్ కీ షాన్
మీకు ఓ అందమైన దృశ్యమో, అద్భుతమైన కట్టడమో కనిపించిందనుకోండి ఏం చేస్తారు. ఫొటో తీసి గుర్తుగా పెట్టుకుంటారు. స్నేహితులకు చూపి మురిసిపోతారు. కానీ ‘వారు’ అలా చేయలేదు. ఆ ‘జ్ఞాపకాన్ని’ అంతకుమించిన రీతిలో పదిలపరుచుకున్నారు. అనుకున్నదే తడువుగా అలాంటి రూపాన్ని తమ ఊళ్లో నిర్మించుకున్నారు. మరో అడుగుముందుకేసి ఆ కట్టడం ఉన్న కూడలికి దాని పేరును సుస్థిరం చేశారు.
ఆ నిర్మాణం.. మన చార్మినార్!. అది ఉన్నది.. పాకిస్థాన్ వాణిజ్య నగరం కరాచీ శివారులోని బహదూరాబాద్‌లో..!!
ఇంతకూ నిర్మించింది ఎవరో తెలుసా..??? దేశ విభజన సమయంలో మన హైదరాబాద్ నుంచి వెళ్లి అక్కడ స్థిరపడ్డవారు..!!!
ఆకాశాన్ని ముద్దాడేందుకు ఆతృత చూపుతున్నట్టు అంతెత్తున నాలుగు మినార్లు.. అద్భుత నగిషీలతో మంత్రముగ్ధులను చేసే నిర్మాణ కౌశలం.. ద్రాక్షగుత్తి కోసం ఆరాటపడే ఉడతలు, చటుక్కున పండు నోటకరుచుకెళ్లే పక్షులు.. కట్టడం రెండో అంతస్తులో ఇరాన్ నిర్మాణ శైలితో ఆకట్టుకునే మసీదు.. డంగుసున్నం, నల్లబెల్లం, కరక్కాయ, గుడ్డు సొన, రాతిపొడి మిశ్రమంతో రూపుదిద్దుకుని.. ప్రపంచంలోని అపురూప కట్టడాల్లో ఒకటిగా నిలిచిన చార్మినార్ అందమిది. ఇక్కడికొచ్చే పర్యాటకులు దాని ముందు ఫొటో దిగి అపూరూపంగా దాచుకుంటారు. అలాంటిది దాన్ని చూస్తూ పెరిగినవారు మరో దేశంలో స్థిరపడితే ఎలా ఉంటుంది. దేశ విభజన సమయంలో చార్మినార్‌కు దూరమైన హైదరాబాదీలదీ అదే వ్యథ.
చార్మినార్‌పై అభిమానంతో..
కరాచీ నగర శివారులోని బహదూరాబాద్ వాణిజ్య ప్రాంతం. శరణార్ధులు అధికంగా ఉండే పట్టణం. నిజాం జమానాలో జాగీర్దారైన బహదూర్ యార్ జంగ్ కూడా ఈ ప్రాంతానికి చేరుకోవటంతో ఆయన పేరుతోనే దానికి బహదూరాబాద్ అనే పేరొచ్చింది. దేశ విభజన సమయంలో మన హైదరాబాద్ నుంచి కూడా కొన్ని కుటుంబాలు ఆ ప్రాంతానికి వెళ్లి స్థిరపడ్డాయి. హైదరాబాద్ అనగానే ఠక్కున గుర్తొచ్చేది చార్మినారే కదా. అందుకే వీరికి కూడా చార్మినార్ అంటే ఎంతో అభిమానం.
చార్మినార్‌ను చూస్తూ పెరిగిన వారు పాకిస్థాన్‌కు వెళ్లిపోవటంతో నిరంతరం వారిని ఆ వెలితి వెంటాడుతుండేది. అందుకే ఇండియాకు వచ్చినప్పుడల్లా వీలుచూసుకుని హైదరాబాద్‌కు వచ్చి చార్మినార్ కట్టడాన్ని చూసి, ఫొటోలు దిగి మురిసిపోయేవారు. అయినా ఏదో వెలితి.. ఈ క్రమంలో వారి తరువాతి తరంలోని కొందరికి మెరుపులాంటి ఆలోచన కలిగింది. దాన్ని తోటి మిత్రులతో పంచుకుని స్థానిక ప్రభుత్వ సహకారంతో దాన్ని సాకారం చేసుకున్నారు.
సృష్టికి పునఃసృష్టి
అక్కడి బహదూరాబాద్ చౌరంగీ (కూడలి)లో 2007లో చార్మినార్‌ను పోలిన కట్టడాన్ని నిర్మించారు. మెరుగులు దిద్దే పని 2010లో పూర్తయింది. ప్రస్తుతం ఈ కూడలి పేరు.. చార్మినార్ చౌరంగీ. మన చార్మినార్ అంత ఎత్తు కాకున్నా, మినార్లతో కలుపుకొంటే దాదాపు 50 అడుగుల ఎత్తుతో నిర్మించుకున్నారు. ఇక ఫొటోలలో చార్మినార్‌ను చూసి మురిసిపోయే పాత రోజులకు సెలవు చెప్పారు. ఆ కూడలికి వచ్చి మినీ చార్మినార్‌ను చూసి సంబరపడేవారు. దాన్ని చూసిన తర్వాత... పాకిస్థాన్‌లోని చాలామందికి మన హైదరాబాద్‌లోని అసలు చార్మినార్‌ను చూడాలనే కోరిక పెరిగిందట.
ఇందుకోసం మన నగరానికి వచ్చేందుకు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకునేవారి సంఖ్యా పెరిగిందట. వెరసి... పాకిస్థాన్‌లో మన ‘గుర్తు’సగౌరవంగా నిలబడి అక్కడి వారితో సలామ్ చేయించుకుంటోంది.
- గౌరీభట్ల నరసింహమూర్తి