చార్‌మిరాకిల్
షెహర్ కీ షాన్
ద్రాక్ష పండ్ల గుత్తిని అందుకుని ఆకలితీరా ఆరగించేందుకు అనుమానపు చూపులతో భయంభయంగా గెంతుతున్న ఉడతలు... అవి ఆ పండ్లను మాయం చేసేలోపు కొన్నింటిని నోటగరుచుకునేందుకు కాచుక్కూర్చున్న పక్షులు. ఆధారాన్ని అల్లుకుని ఎగబాకిన లతలు.. వాటికి విరబూసిన పూలు.. నిండుగా విచ్చుకుని కనువిందు చేసే గులాబీలు.. గుదిగుచ్చి పేర్చిన పూలగుత్తులు...
ఈ అందం ఎక్కడిదో కాదు... నగర ఖ్యాతిని
విశ్వవ్యాప్తం చేసిన చార్మినార్‌ది. చార్మినార్ అనగానే... అది హైదరాబాద్‌కు ల్యాండ్‌మార్క్, నాలుగు మినార్లు ప్రధానాకర్షణగా నిర్మించిన కట్టడంగానే చాలామందికి తెలుసు. కానీ ఆ నిర్మాణ కౌశలాన్ని ఓసారి పరిశీలిస్తే ఆశ్చర్యమనిపిస్తుంది. పర్షియన్ నిర్మాణ శైలితో రూపొందిన ఈ కట్టడం పై అంతస్తులో పనితీరు... దాని సౌందర్యాన్ని వర్ణించడానికి మాటలు చాలవేమో అనిపిస్తుంది.
ప్రపంచ నలుమూలల్లో కనిపించే ప్రత్యేకతలన్నీ హైదరాబాద్‌లో కొలువుదీరాలని కలలుగన్న కుతుబ్‌షాహీలు ఈ కట్టడం విషయంలోనూ అదే పంథాను అనుసరించారు. పర్షియా నుంచి ఇంజినీరింగ్ నిపుణులను పిలిపించి దానికి ప్రణాళిక రూపొందించడమే కాకుండా... అది సాధారణ కట్టడంగా ఉండకూడదన్న ఉద్దేశంతో అడుగడుగునా సోయగాలద్దించారు. రెండో అంతస్తులో ప్రత్యేకంగా నిర్మించిన మసీదు గోడలపై నిజంగా గులాబీ కొమ్మలు వేలాడుతున్నాయా అనేంత సహజంగా తీర్చిదిద్దారు. మరికొన్ని కళాఖండాలను పరిశీలిస్తే... గోడలకు అతికించారా అన్న అనుభూతి కలుగుతుంది. ఒకే గోడకు రెండు డిజైన్లు ఉంటాయన్నమాట.
చార్మినార్ అనగానే మనకు నాలుగు మినార్లే తెలుసు. కానీ రెండో అంతస్తు పైభాగానికి వెళ్తే చిన్నచిన్న మినార్లు మరిన్ని కనిపిస్తాయి. కింది నుంచి పై వరకు రకరకాల డిజైన్లతో వాటిని తీర్చిదిద్దారు. ఆ గోడలపై నాలుగు వైపులా లతలు, పూలు, వాటిపై సేదతీరే ఉడతలు, పక్షులు, పైభాగంలో వేళాడుతున్నట్టుగా తామర మొగ్గలు... ఇలా ఒకటేమిటి... ఒకదాన్ని మించింది మరొకటి.
గతంలో ఓ కుటుంబం చార్మినార్ పైభాగం నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవటంతో అక్కడికి సందర్శకులను అనుమతించటం లేదు. దీంతో ఈ సౌందర్యం చూసే అవకాశం లేకుండా పోయింది. అందుకే మీ కోసం ఈ ప్రయత్నం.
ఫొటోలు: అమర్
గౌరీభట్ల నరసింహమూర్తి