సాక్షి, సిటీబ్యూరో /శంషాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి పక్షుల బెడద పట్టుకుంది. ఇప్పటి వరకు ఎలాంటి ఉపద్రవాలు చోటుచేసుకోలేదు.. కానీ చుట్టుపక్కల ఉన్న జనావాసాలు, చెరువులు, అపరిశుభ్రమైన పరిసరాల కారణంగా విమానాశ్రయానికి పక్షుల తాకిడి పెరిగింది. ఇటీవల రియాద్ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఎస్‌వీ 744 విమానం లాండ్ అవుతున్న సమయంలో పక్షి ఢీకొని ఏకంగా ముందు భాగానికి సొట్ట ఏర్పడడం పక్షుల బెడద తీవ్రతకు నిదర్శనంగా మారింది. ఈ సంఘటనలో ఎలాంటి ప్రమాదం జరుగకపోయినా పక్షుల సమస్యను ఎత్తి చూపుతోంది. ప్రతి రోజూ పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగించే జాతీయ, అంతర్జాతీయ విమానాలతో నిత్యం రద్దీగా ఉండే ఎయిర్‌పోర్టులో పక్షులు సంచరించకుండా, క్రిమికీటకాలు,దోమల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతూనే ఉన్నారు. విమానాశ్రయం చుట్టూ నెలకొన్న వాతావరణం వల్ల పక్షులు యధేచ్చగా సంచరిస్తున్నాయి. మరోవైపు కొద్ది రోజులుగా చుటుపక్కల పల్లెల్లో పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కారణంగా పెరిగిన చెత్త, వ్యర్ధ పదార్ధాల వల్ల పక్షుల సంచారం కూడా పెరిగినట్లు నిపుణులు పేర్కొంటున్నారు.
ఇలా ఆశ్రయిస్తున్నాయి....
సుమారు 5 వేల ఎకరాలలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరించింది. రెండు రన్‌వేలతో ఉన్న సువిశాలమైన ఎయిర్‌పోర్టులో ప్రతి రోజూ 400 విమానాలు రాకపోకలు సాగిస్తాయి. సుమారు 75 వేలమంది వివిధ ప్రాంతాలకు బయలుదేరుతారు. ఎయిర్‌పోర్టు చుట్టూ 7, 8 కిలోమీటర్ల దూరంలో నివాసప్రాంతాలు ఉన్నాయి. శంషాబాద్ టౌన్‌తో పాటు, మామిడిపల్లి, రషీద్‌గూడ, గొల్లపల్లి, తొండపల్లి, తదితర గ్రామాల్లోని అడవులు,నివాస సముదాయాలు, చెరువులు, చిన్న చిన్న నీటి కుంటలు కొంగలు, కాకులు, డేగలు, తదితర పక్షులకు ఆలవాలంగా ఉన్నాయి. క్రిమి కీటకాలను ఏరుకొనేందుకు, పల్లెల్లో అన్నం, ఇతర వ్యర్థపదార్ధాలను ఆరగించేందుకు కాకులు వచ్చి వాలుతున్నాయి. మరోవైపు గొల్లపల్లి, మామిడిపల్లి,తొండుపల్లిలోని చెరువులతో పాటు, విమానాశ్రయంలోను జలవనరుల సంరక్షణ కోసం కొత్తగా ఒక చెరువును ఏర్పాటు చేశారు. కొంగలే కాకుండా ఇతర పక్షులు కూడా తరచుగా ఈ చెరువుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో పక్షుల సంచారం సర్వసాధారణమైపోయింది.ఇటీవల కాలంలో పావురాలు కూడా బాగా సంచరిస్తున్నట్లు విమానాశ్రయ సిబ్బంది ఒకరు తెలిపారు. కొద్ది రోజుల క్రితం ఇలా విమానాశ్రయంలోకి వచ్చిన పావురాళ్లను పట్టుకొని దూరంగా వదిలి వచ్చారు.
పేరుకుపోతున్న చెత్త
చుట్టుపక్కల పల్లెల్లో చెత్త వేసేందుకు ఎలాంటి డంపింగ్ యార్డులు లేవు. దీంతో ప్రజలు ఎక్కడ పడితే అక్కడ చెత్తను వేస్తున్నారు. దీన్ని తొలగించి కాల్చి వేయాల్సిన పారిశుధ్య సిబ్బంది 15 రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో అన్ని గ్రామాల్లో, చెత్త, వ్యర్థపదార్ధాల నిల్వలు గుట్టలుగా పేరుకుపోయాయి. విమానాశ్రయం రక్షణ కోసం కేవలం విమానాశ్రయంలో మాత్రమే కాకుండా చుట్టుపక్కల పల్లెల్లోనూ రక్షణ చర్యలు చేపడతారు.అయితే ఈ సమ్మె కారణంగా పరిశుభ్రతకు ఆటంకం ఏర్పడింది. దీంతో పక్షులు, ఇతర క్రిమికీటకాల సంచారం బాగా పెరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.‘‘ ‘‘ఒక్క పక్షులపైన మాత్రమే కాదు. దోమలు, బొద్దింకలు, ఇతర క్రిమి కీటకాలు ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించకుండా ఉండేందుకు నిరంతరం అమ్రపత్తత పాటిస్తాం. ఎయిర్‌పోర్టుతో పాటు చుట్టుక్కల గ్రామాల్లోను పరిశుభ్రమైన పరిసరాల పరిరక్షణ ఎంతో ముఖ్యం.ఎందుకంటే జాతీయ,అంతర్జాతీయ ప్రయాణికుల భద్రత, ఆరోగ్యం ఈ పరిసరాలపైనే ఆధారపడి ఉంది...’’ అని విమానాశ్రయంలో పెస్ట్ కంట్రోల్ విధులను నిర్వహిస్తున్న ఉద్యోగి ఒకరు చెప్పారు. వైద్య ఆరోగ్య విభాగం అధికారులు వారానికి ఒకసారి దోమల నివారణపైన సర్వేలెన్స్ నిర్వహించి డిఫినోథిన్ స్ప్రే చేస్తారు.
పక్షి తాకితే...
ఒక్క శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే కాదు. అన్ని చోట్ల ఇలాంటి పక్షుల సంచారం సహజమే. వీటిని అరికట్టడం ఒక్కటే పరిష్కారం. అందుకోసం విమానాశ్రయంలో తరచుగా బాణాసంచా పేల్చడం ద్వారా పెద్ద పెద్ద శబ్దాలు చేయడం ద్వారా పక్షులను పారదోలుతారు. శంషాబాద్‌లోనూ ఈ ప్రక్రియ క్రమం తప్పకుండా కొనసాగుతూనే ఉంది.పక్షుల వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదాలు జరుగలేదు. కానీ గంటకు 525 కిలోమీటర్‌లకు పైగా వేగంతో దూసుకొచ్చే విమానానికి ఏ చిన్న పక్షి తాకినా పెద్ద ప్రమాదమే జరుగుతుంది. అదీ ఒకవేళ విమానం రెక్కల కింద ఉన్న ఇంజిన్‌లోకి పక్షి వెళ్లినపుడు ఒక్కోసారి ఇంజన్ ఆగిపోతుంది. అటువంటి సమయంలో విమానాన్ని వెంటనే దగ్గరలోఉన్న విమానాశ్రయంలో దింపి మరమ్మతు చేస్తారు. ఒక్కోసారి దానికి రెండు వైపులా ఉండే ఇంజన్‌లలో మంటలు తలెత్తవచ్చు.అప్పుడు ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment