birds
-
చిత్తడి నేలలో పుత్తడి పక్షులు
సూళ్లూరుపేట: నిండా నీళ్లతో కళకళలాడుతున్న పులికాట్ సరస్సులో అతిథి పక్షులు సందడి చేస్తున్నాయి. దేశంలోనే రెండో అతి పెద్ద సరస్సుగా పేరొందిన పులికాట్ సరస్సు అసలు పేరు ప్రళయ కావేరి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సరస్సు జలకళ సంతరించుకున్న వేళ.. ఎవరో పిలిచినట్టుగా రంగు రంగుల విహంగాలు సుదూర తీరాల నుంచి వచ్చి వాలిపోతున్నాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నడుమ దాదాపు 250 చ.కి.మీ. వైశాల్యంలో సరస్సు వ్యాపించి ఉంది. వర్షాకాలంలో ఇది 460 చ.కి.మీ. వరకు పెరుగుతుంది. ప్రస్తుతం స్వర్ణముఖి, కాళంగి నదులతోపాటు పాముల కాలువ, కరిపేటి కాలువ, దొండ కాలువ, నెర్రి కాలువలు జోరుగా ప్రవహిస్తుండడంతో పులికాట్ సరస్సులోకి భారీగా నీరు చేరుతోంది. అతిథి పక్షుల ఆవాసాలుగా గ్రామాలు సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నేలపట్టు, వెదురుపట్టు, శ్రీహరికోట, తడ తదితర ప్రాంతాల్లోని గ్రామాలన్నీ అతిథి పక్షులకు ఆవాసాలుగా మారాయి. ఇక్కడి చెట్లపై వలస పక్షులు గూళ్లు కట్టుకుని శీతాకాలమంతా ఇక్కడే ఉండిపోతాయి. గుడ్లుపెట్టి.. పిల్లలను పొదిగి.. అవి పెద్దవయ్యాక మార్చి, ఏప్రిల్ నెలల్లో తిరిగి విదేశాలకు పయనమవుతాయి. పక్షులు ఇక్కడ ఉన్నన్ని రోజులు పులికాట్ సరస్సును ఆహార కేంద్రంగా వినియోగించుకుంటాయి. సందర్శకుల సందడి పులికాట్ సరస్సుకు వలస పక్షుల రాక మొదలవడంతో సూళ్లూరుపేట–శ్రీహరికోట రోడ్డు వెంబడిగల చెట్లన్నీ కళకళలాడుతున్నాయి. వీటిని వీక్షించేందుకు పర్యాటకుల తాకిడి మొదలైంది. పక్షులను తమ కెమెరాల్లో బంధించేందుకు సందర్శకులు, బర్డ్ వాచర్స్ ఈ ప్రాంతంలోనే విడిది చేస్తున్నారు.152 రకాల పక్షుల రాక ఏటా పులికాట్ సరస్సుకు సుమారు 152 రకాల విహంగాలు సైబీరియా, నైజీరియా, రష్యా, పాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, చైనాతో పాటు పలు యూరోపియన్ దేశాల నుంచి వలస వస్తుంటాయి. ఆ దేశాల్లో మంచు, చలి ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడికి వలస వస్తుంటాయి. శీతాకాలంలో ఇక్కడి వాతావరణం సమశీతోష్ణ స్థితి ఉండటంతో పులికాట్‌కు సరస్సుకు నీళ్లు చేరగానే పక్షులు వాలిపోతుంటాయి. పులికాట్ సరస్సుకు ఫ్లెమింగోలతో పాటు పెలికాన్స్, ఎర్రకాళ్ల కొంగలు, నారాయణ పక్షులు, నత్తగుల్ల కొంగలు, నీటికాకులు, తెల్ల కంకణాయిలు, నల్ల కంకణాయిలు, శబరి కొంగలు, నీల»ొల్లి కోడి, బ్లాక్ వింగ్డ్ స్టిల్ట్, పాము మెడ పక్షి, తెల్ల పరజలు భారీగా వస్తుంటాయి. చుక్కమూతి బాతులు, తెడ్డుముక్కు బాతులు వంటి బాతు జాతులే 20 రకాల వరకు ఇక్కడకు వస్తుంటాయి. సీగల్స్, ఇంకా పేరు తెలియని కొన్ని పక్షి జాతులు సైతం ఇక్కడకు వస్తున్నాయి. స్వదేశీ పక్షులు, స్వాతి కొంగలతోపాటు పలు కొంగజాతులు ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నాయి. ఉప్పలపాడులో కిలకిలరకరకాల విదేశీ పక్షుల రాకతో గుంటూరు జిల్లా, పెదకాకాని మండలం, ఉప్పలపాడులోని వలస పక్షుల విడిది కేంద్రం సందడిగా మారింది. ఈ కేంద్రంలో గూడ బాతులు (పెలికాన్స్), ఎర్రకాళ్ల కొంగలు (పెయిడెంట్ స్టార్స్), నత్తగుల్ల కొంగలు (ఓపెన్‌బిల్) పచ్చటి చెట్లపై గుంపులు గుంపులుగా సేదతీరుతూ చూపురులను ఆకట్టుకుంటున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, గుంటూరు. -
ఏ సీమ దానవో.. ఎగిరెగిరి వచ్చావు..
సాక్షి, హైదరాబాద్: ఆయా దేశాల్లో జీవించే పక్షులు అక్కడి ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు వివిధ దేశాలకు వలస వెళుతుంటాయి. కేవలం 12 సెం.మీ సైజు ఉండే ‘రెడ్–బ్రెస్టెడ్ ఫ్లైక్యాచర్’పేరుతో పిలిచే ఈ పక్షిది అద్భుత ప్రయాణం. ఈ పక్షులు వివిధ ఖండాలు, సముద్రాల మీదుగా ఎగురుతూ, వేలాది మైళ్లు ప్రయాణం చేసి హైదరాబాద్ మహానగరానికి వలస వస్తున్నాయి. ప్రస్తుతం తూర్పు ఐరోపా దేశాల్లో తీవ్రస్థాయిలో చలి పెరిగి, మంచుమయమై పోతున్న సమయంలో సమశీతోష్ణస్థితి ఉన్న దక్షిణాసియాలోని మనదేశానికి.. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌కు ఈ పక్షులు చేరుకుంటున్నాయి.ప్రతి ఏడాది నవంబర్ నుంచి మార్చి దాకా విదేశాలు, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో పక్షులు నగరానికి వలస వస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చెరువుల పునరుద్ధరణ, ఆక్రమణల తొలగింపు సత్ఫలితాలు ఇస్తోందని పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు. దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా...గతంలో వివిధ రకాల పక్షులకు, ప్రధానంగా వలస పక్షులకు ఆవాసంగా ఉన్న అమీన్పూర్ చెరువు పరిసర ప్రాంతాల్లో ఈ పక్షి దర్శనమిచ్చి పక్షి ప్రేమికులను ఆనందపరిచింది. సాధారణంగా పక్షులు ఎక్కడ గూడును ఏర్పాటుచేసుకుని పిల్లలి్నకంటాయో అక్కడికే మళ్లీ వలస వస్తాయని నిపుణులు చెబుతున్నారు.తాము గతంలో ఉన్న ప్రదేశంలో గూడు చెదిరినా, చెట్లు, నీళ్లు, పరిసరాల్లో మార్పులు సంభవించినా మళ్లీ అవి అక్కడకు రావని వెల్లడించారు. సాధారణంగా ఇది ‘బ్రీడింగ్ టైమ్’కాబట్టి ఇక్కడకు వచ్చి గూడు ఏర్పాటు చేసుకుని పిల్లల్ని పెడుతుంటాయని తెలిపారు. ఈ సందర్భంగా సాక్షి ప్రతినిధితో హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ అధ్యక్షుడు ఆడేపు హరికృష్ణ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. వలసపక్షుల రాకపై ఆయన మాటల్లోనే... ‘ప్రస్తుతం నగరంలో ‘రెడ్–బ్రెస్టెడ్ ఫ్లై క్యాచర్’పక్షి కనువిందు చేస్తోంది. మనదేశానికి వలస రావడానికి కొన్నిరోజుల ముందు నుంచే బాగా ఆహారం తీసుకుని, శరీరంలో పెద్దమొత్తంలో కొవ్వు నిల్వ అయ్యేలా చూసుకుంటుంది. సముద్రాల మీదుగా ప్రయాణం సాగిస్తున్నపుడు ఈ కొవ్వునే ఇంధనంగా ఉపయోగించుకుంటుంది. మరే దేశంలో లేని విధంగా మనదేశంలో 1,300 రకాల పక్షిజాతులున్నాయి. వీటిలో అత్యధికశాతం అంటే 70 శాతం దాకా వలస పక్షులు హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాలకు వస్తుంటాయి. – ఆడేపు హరికృష్ణ ,అధ్యక్షుడు, హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ -
‘అతిథులు’ ఆగయా..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రానికి విదేశీ వలస పక్షుల రాక మొదలైంది. ఇప్పటికే సంగారెడ్డి సమీపంలోని అభయారణ్యంతోపాటు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని పాకాల సరస్సుకు విదేశీ పక్షులు వచ్చి సందడి చేస్తున్నాయి. వాటిలో నార్తర్న్ షావెలర్.. నార్తర్న్ పిన్‌టైల్.. రెడ్ హెడ్ బంటింగ్.. బ్లాక్ హెడ్ బంటింగ్.. బ్లూత్రోట్.. రోజీ స్టార్లింగ్.. అ్రల్టామెరైన్ ఫ్లైక్యాచర్.. బ్లూథ్రోట్ బర్డ్, వెస్టర్న్ మార్‡్ష హారియర్, లిటిల్ కంఫర్ట్ బర్డ్, కామన్ పోచార్డ్ తదితర పక్షులు ఉన్నాయి. వెచ్చని వాతావరణం ఉండటంతో.. యూరప్, రష్యా, పశ్చిమాసియా దేశాల్లో మంచుచలికాలం నుంచి తప్పించుకోవడం కోసం వేల కిలోమీటర్లు ప్రయాణించి ఏటా నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య తెలంగాణ ప్రాంతానికి విదేశీ పక్షులు వస్తున్నాయి. అక్కడితో పోలిస్తే వెచ్చని వాతావరణం ఉండటంతోపాటు తగినంత ఆహారం లభిస్తుండటం, సంతానోత్పత్తికి అనువైన పరిస్థితులు ఉండటంతో రాష్ట్రంలోని అభయారణ్యాలు, సరస్సులకు విచ్చేస్తున్నాయి.చిత్తడి నేలలు.. స్వచ్ఛమైన నీరు..మంజీరా వన్యప్రాణుల అభయారణ్యంలో జీవవైవిధ్యమున్న చిత్తడి నేతలు, గడ్డి భూములున్నాయి. మంజీరా డ్యాం ఎగువన.. సింగూరు ప్రాజెక్టు దిగువన ఉన్న ఈ జలాశయంలో సుమారు 20 వరకు చిన్న దీవులున్నాయి. అవి స్థానిక పక్షులతోపాటు విదేశీ పక్షులకు గమ్యస్థానంగా మారాయి. మరోవైపు పాకాల సరస్సు వద్ద లిటిల్ కోర్మోరెంట్, మైక్రో కార్బోనైజర్, ఇండియన్ కోర్మోరెంట్, ఫలక్రోకోరాక్స్, ఇండియన్ పాండ్ హెరాన్, ఏర్డియోలాగ్రై, గ్లోసీఇబీస్, ప్లెగడీస్ ఫాల్సినీలియస్ తదితర విదేశీ పక్షులు సంచరిస్తున్నాయి. ఈ సరస్సు కాలుష్యరహితం కావడంతో దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. దీనిచుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం ఉండటంతో పచ్చని చెట్లు విదేశీ పక్షుల విడిదికి నిలయంగా మారాయి. పాకాల అభయారణ్యంలో ఎత్తయిన చెట్లతోపాటు సరస్సులో స్వచ్ఛమైన నీరు ఉండటం వల్ల ఈ ప్రాంతానికి విదేశీ పక్షులు వస్తున్నాయని ప్రకృతి ప్రేమికులు చెబుతున్నారు. వలసపక్షుల సంఖ్య తగ్గిపోతోంది.. మంజీరా అభయారణ్యంతోపాటు అమీన్పూర్ చెరువు, కిష్టారెడ్డిపేట్ చెరువు, పోచా రం అభయారణ్యానికి విదేశీ పక్షులు వచ్చా యి. ఏటా సైబీరియా, చైనా, రష్యా వంటి దేశాల నుంచి ఈ పక్షులు వస్తుంటా యి. పట్టణీకరణ కారణంగా చెరువులు అన్యాక్రాంతం అవుతుండటంతో విదేశీ వలసపక్షుల సంఖ్య తగ్గిపోతోంది. వా తావరణంలో వస్తున్న మార్పులు కూడా ఇందుకు కొంత కారణమవుతున్నాయి. -
రేర్ బర్డ్స్.. నో వర్డ్స్..
రాష్ట్రానికి, నగరానికి ఏడాది పొడవునా వలస పక్షుల రాకపోకలు ఉంటాయి. సమ్మర్లో కొద్దిగా మాత్రమే వస్తాయి. అయితే వర్షాకాలం నుంచి పెరుగుతూ.. వింటర్లో బాగా ఎక్కువగా 2, 3 రెట్లు ఎక్కువగా పక్షులు వలస వస్తాయి. ఒకప్పుడు ఇలాంటి వలస పక్షులకు నగరంలో చాలా స్పాట్స్ ఉన్నాయి. కానీ కాలక్రమంలో లేక్స్ కనుమరుగవుతుండడం వల్ల వీటికి ఆవాసాలు దొరకడం లేదు. చిరునామాలివే.. నగరం చుట్టు పక్కల పక్షుల వీక్షణకు వీలు కల్పించే ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఒకప్పుడు అమీన్పూర్లేక్, జనవాడ వైపు గండిపేట్లేక్, మోకిలా వంటి ప్రాంతాల్లో విపరీతంగా కనిపించేవి. ఇప్పుడు బాగా తగ్గిపోయాయి. ఇప్పటికీ కాలుష్య కాసారాలుగా మారిన లేక్స్‌లో కూడా పక్షలు కనిపిస్తున్నాయి. వాటిని కాలుష్యరహితంగా మారిస్తే మరింత బాగా పెరుగుతాయి. సంజీవయ్య పార్క్ దగ్గర కూడా బోలెడు పక్షులు, డక్స్ ఉంటాయి. నగరంలో ప్రస్తుతం పక్షులు చూడాలంటే కెబిఆర్ పార్క్, బొటానికల్ గార్డెన్స్, సంజీవయ్య పార్క్‌లలో చూడొచ్చు. చుట్టుపక్కల చెరువుల్లో.. నగరం చుట్టుపక్కల అయితే.. అనంతగిరి హిల్స్ బెస్ట్. అక్కడకు వెళ్లినప్పుడల్లా ఒక్కోసారి ఒక్కో ఆశ్చర్యకరమైన పక్షి కనబడుతుందని పక్షి ప్రేమికులు అంటున్నారు. అదే కాక ఉస్మాన్‌సాగర్, కొడకంచి లేక్, కృష్ణారెడ్డి పేట్ చెరువు.. మంజీరా వైల్డ్‌లైఫ్ శాంక్చురీ, పోచారం వైల్డ్‌లైఫ్ శాంక్చురీ, నర్సాపూర్ రిజర్వ్ ఫారెస్ట్, సింగూర్ డ్యామ్ కూడా బర్డ్స్‌కి కేరాఫ్ అడ్రెస్‌గా చెప్పొచ్చు. ఇటీవల సిటీలోని కొన్ని గేటెడ్ కమ్యూనిటీల్లోని కాలనీ పార్క్స్‌లో కూడా బాగా పెరుగుతున్నాయి.సీజన్ స్పెషల్స్ ఇవే.. వానాకాలం మన సమీపానికి వచ్చే పక్షుల్లో రెయిన్ క్వాయిల్, పెయింటెడ్ ఫ్రాంకొలిన్, జాకొబిన్ కుకూ (దీనినే మాన్సూన్ బర్డ్ అని కూడా పిలుస్తారు. ఇది రుతుపవనాల ప్రారంభ సమయంలో వస్తుంది) వంటివి ఉన్నాయి. ఇవి మంజీరాలేక్, యంకతల.. వంటి సరస్సులు, పచ్చని పచి్చక బయళ్లలో కనిపిస్తాయి. ఇక శీతాకాలంలో వచ్చేవాటిలో వర్డియర్ ఫ్లై క్యాచర్, ఇండియన్ బ్లూ రాబిన్, బార్ హెడెడ్ గూస్ (ఇది సరస్సుల దగ్గర బాగా కనిపిస్తుంది. ప్రస్తుతం మంజీరాలేక్ దగ్గర దీనిని చూడొచ్చు. విదేశాల నుంచి హిమాలయాల మీదుగా ఈ పక్షి నగరానికి చేరుతుందట)తొలిసారిగా బర్డ్స్ పై బుక్.. మనకి చాలా చోట్ల పక్షులు కనిపిస్తాయి. కానీ అవేంటో వాటి ప్రత్యేకతలేమిటో తెలీదు. ఈ నేపథ్యంలో కొన్ని కామన్ బర్డ్స్ తీసి ఒక గైడ్‌లాగా ఇస్తే బాగుంటుందనీ, స్టూడెంట్స్‌కి ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ వాళ్లకి ఇస్తే ఉపయుక్తంగా ఉంటుందనే ఆలోచనతో తొలిసారిగా మన రాష్ట్రంలో పక్షుల వెరైటీలపై ఒక పుస్తకం రూపొందింది. రాష్ట్రంలో 430పైగా వెరైటీ పక్షులు ఉంటాయి. ఇందులో 252 రకాల పక్షుల ఫొటోలు, వాటి పేర్లు, విశేషాలు ఉంటాయి. రెగ్యులర్‌గా అనంతగిరికి ట్రెక్కింగ్‌కి వెళ్తుంటారు. అలాంటివారికి ఇవి ఇస్తే ఉపయుక్తం. ప్రభుత్వ పాఠశాలలకు, కళాశాలల విద్యార్థులకు లక్ష కాపీల వరకూ ఉచితంగా పంపిణీ చేయాలనే ఆలోచన చేస్తున్నారు. అమెరికా నేర్పిన అలవాటుగతంలో ఒకసారి అమెరికాలో కొంతకాలం ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో నేనున్న ప్రాంతానికి దగ్గరలో పెద్ద అడవి ఉండేది. అక్కడ రంగు రంగుల పక్షుల్ని కళ్లార్పకుండా చూడడం అలవాటైంది. ఇక్కడకు వచ్చాక సిటీలో పక్షులును అన్వేషిస్తూ.. సంజీవయ్య పార్క్‌కు తరచూ వెళ్లేవాడిని. ప్రస్తుతం విభిన్న ప్రాంతాలకు వెళ్లి పక్షుల్ని చూడడం ఒక నిత్యకృత్యం. ఈ అభిరుచితోనే హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ ప్రారంభించాం. తాజాగా బర్డ్స్ మీద బుక్ లాంచ్ చేశాం. అంతేకాకుండా జనవరి నుంచి బర్డ్ అట్లాస్ పేరుతో వైవిధ్యభరిత కార్యక్రమం చేపడుతున్నాం. నగరం చుట్టుపక్కల విభిన్న ప్రాంతాల నుంచి దీనికి కంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఏ పక్షి ఎప్పుడు ఎలా కనిపిస్తుంది? అనేది రికార్డ్ చేసి ఒక మ్యాప్ తయారు చేయాలని ఆలోచన. అయితే దీన్ని పూర్తి చేయడానికి కనీసం ఏడాది పడుతుంది. – హరికృష్ణ, హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ -
అందాల అడవి రైతు.. హార్న్‌బిల్
పెద్దదోర్నాల: నల్లమల అభయారణ్యం విభిన్న వన్యప్రాణులకు నెలవు. ఇక్కడి అరుదైన పక్షులు, జంతు జాతులు పర్యావరణ ప్రేమికుల్ని అబ్బురపరుస్తాయి. పక్షిజాతుల్లో అత్యంత అరుదైన జీవనశైలి హార్న్‌బిల్ (ఫారెస్ట్ ఫార్మర్) పక్షుల సొంతం. వీటి స్వభావం అచ్చంగా మనుషుల్ని పోలి ఉంటుంది. మగ పక్షులు కుటుంబ బాధ్యతను మోస్తూ.. ఆడ పక్షులకు అవసరమైన తిండిని సంపాదిస్తూ.. వాటిని గూడు దాటకుండా బాధ్యతగా చూసుకుంటాయి. వీటిని అడవి రైతులుగా పిలుస్తుంటారు. పొడవైన ముక్కు, తోకలతో ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనపడతాయి. స్వచ్ఛమైన ప్రేమకు ప్రతిరూపం హార్న్‌బిల్ పక్షులు ఎత్తైన చెట్లలో సహజ సిద్ధంగా ఏర్పడ్డ గూళ్లలో నివసిస్తాయి. మగ పక్షులు పితృస్వామ్యాన్ని బాధ్యతగా నిర్వర్తిస్తూ కుటుంబ పోషణను చూసుకుంటాయి. తల్లి పక్షి గూడులో గుడ్లు పెట్టి పిల్లలను పొదుగుతుంది. పిల్లలతో కలిసి మూడు నెలలపాటు ఎటూ కదలకుండా గూట్లోనే ఉండిపోతుంది. మగ హార్న్‌బిల్ ఆ మూడు నెలలు ఆహారాన్ని సేకరించి.. గూట్లో ఉన్న తల్లి, పిల్ల పక్షులకు నోటిద్వారా అందిస్తుంది. ఆహారం కోసం తిరిగే సమయంలో మగ హార్న్‌బిల్ వేటగాళ్ల బారినపడినా.. ప్రమాదవశాత్తు మరణించినా గూటిలో ఉన్న తల్లి పక్షితోపాటు పిల్ల పక్షులు కూడా ఆకలితో చనిపోతాయే తప్ప ఇంకే ఆహారాన్ని ముట్టవు. దీంతోపాటు హార్న్ బిల్ పక్షుల దాంపత్య జీవనం ఎంతో పవిత్రంగా ఉంటుంది. ఇవి జీవితాంతం ఒకే పక్షితో జత కడతాయే తప్ప మరే పక్షిని దరిచేరనివ్వవు. నాగాలాండ్‌లో ఏటా ఉత్సవం హార్న్‌బిల్ పక్షుల జీవన విధానానికి ముగ్ధులైన నాగాలాండ్ వాసులు వాటి పేరిట ఏటా 10 రోజుల పాటు ఉత్సవాన్ని జరుపుకుంటారు. నాగాలాండ్ రాష్ట్ర రాజధాని కోహిమాకు 12 కిలోమీటర్లు దూరంలో గల కిసామాలోని గిరిజనులు హార్న్‌బిల్ ఉత్సవాన్ని సంప్రదాయంగా నిర్వహిస్తారు. డిసెంబర్ 1నుంచి 10వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవంలో చిన్నా పెద్డా తేడా లేకుండా అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకుంటారు.రెండు రాష్ట్రాల పక్షి అరుణాచల్ ప్రదేశ్, కేరళ రాష్ట్రాలు రాష్ట్ర పక్షిగా హార్న్‌బిల్‌ను గుర్తించాయి. ఈ పక్షుల జీవన కాలం 40 నుంచి 50 సంత్సరాలని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. వీటి పొడవు 95 నుంచి 120 సెంటీమీటర్లు కాగా.. రెక్కలు విప్పినప్పుడు వీటి వెడల్పు 151 సెంటీమీటర్ల నుంచి 178 సెంటీమీటర్లు ఉంటుందని పేర్కొంటున్నారు. ఇవి సుమారు 4 కేజీల బరువు ఉంటాయి.ఫారెస్ట్ ఫార్మర్ హార్న్‌బిల్ మగ పక్షి పండ్లను సేకరించి తల్లి, పిల్లలకు ఆహారంగా అందిస్తుంది. గూడుకు చేరుకున్న పక్షి పండ్ల గింజలను తొలగించి మరీ పిల్లలు, తల్లి నోటికి అందిస్తుంది. అలా అందిస్తున్నప్పుడు.. అది వదిలేసిన గింజలు నేలపై పడి.. అడవిలో మొలకెత్తి చెట్లుగా ఎదుగుతాయి. అందుకే.. ఈ పక్షిని అడవి రైతుగా పేర్కొంటారు. -
కనువిందు చేస్తున్న విదేశీ వలస పక్షులు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని ప్రకృతి సౌందర్యం ప్రపంచం నలుమూలల పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. విదేశీ వలస పక్షులకు శీతాకాలపు ఆవాసాలుగా మారే ప్రదేశాలు ఉత్తరాఖండ్‌లో అనేకం ఉన్నాయి. వాటిలో ఒకటి అసన్ కన్జర్వేషన్ రిజర్వ్. ఇది ప్రతియేటా అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు వలస పక్షులకు సురక్షితమైన గమ్యస్థానంగా ఉంది.అక్టోబర్ వచ్చేసరికి సెంట్రల్ ఆసియా, సైబీరియా, కజకిస్తాన్, నేపాల్, భూటాన్, చైనా తదితర శీతల ప్రాంతాల నుండి వేలాది విదేశీ పక్షులు అసన్ కన్జర్వేషన్ రిజర్వ్‌కు తరలివస్తాయి. కఠినమైన శీతాకాలం నుండి తప్పించుకునేందుకు ఈ పక్షులు డెహ్రాడూన్‌లోని ఈ అందమైన ప్రదేశానికి వచ్చి నివసిస్తాయి. ఫిబ్రవరి చివరి నాటికి ఆరు వేలకుపైగా విదేశీ పక్షులు ఇక్కడికి తరలివస్తాయి. మార్చిలో అవి మళ్లీ తమ స్వస్థలాలకు తిరుగుముఖం పడతాయి. ఈసారి అక్టోబరులోనే 300లకు పైగా పక్షులు ఇక్కడికి చేరుకున్నాయి.రడ్డీ షెల్డక్, రెడ్ క్రెస్టెడ్ పోచార్డ్, కామన్ పోచార్డ్, యురేషియన్ విజియన్ వంటి పక్షులు ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ అందమైన నీటి పక్షులను చూడటానికి పక్షి ప్రేమికులు ప్రపంచం నలుమూలల నుండి ఇక్కడికి తరలివస్తుంటారు. అసన్ కన్జర్వేషన్ రిజర్వ్‌లో పక్షుల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. డెహ్రాడూన్ నుండి చక్రతా జాతీయ రహదారి మీదుగా హెర్బర్ట్‌పూర్ చేరుకోవచ్చు. అసన్ కన్జర్వేషన్ ఇక్కడికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది.ఇది కూడా చదవండి: ప్రపంచంలోనే గూగుల్ మొదటి ఒప్పందం -
నార్కోండం - మాయమైన మేకలు ఆసక్తికర కథనం
దట్టమైన అడవులు, కొండలు, బోలెడన్ని పక్షులు , మంచి నీటి సరస్సులు, అద్భుతమైన పగడపు దీవులతో నాగరికతకు దూరంగా ఒక దీవి ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి.ఆ దీవిలో ఒక విషపూరితం కాని పాము కూడా ఉందనుకోండి. అలాంటి ఒక దీవిని చూడాలని నేను ఎన్నో ఏళ్లగా అనుకుంటున్నాను. అయితే అనుకోకుండా ఒక రోజు నా కల నిజమైంది.అండమాన్ సముద్రములో 48 అడుగుల పడవపై నేను, మరో తొమ్మిది స్నేహితులు కలిసి నార్కోండం అనే ఒక నిద్రాణ అగ్నిపర్వతపు దీవిని పరిశీలించడం కోసం వెళ్ళాము.ఈ దీవిపై అతి కొద్దిమంది మాత్రమే కాలుమోపారు. ఆలా వెళ్లిన వారిలో నార్కోండం హార్నబిల్ అనే అరుదైన పక్షిని చూడటానికి వెళ్లిన పక్షి ప్రేమికులే ఎక్కువ. నార్కోండం హార్నబిల్ పక్షులు కేవలం 7 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణము కలిగిన ఈ నార్కోండం దీవిపై తప్ప ప్రపంచంలో మరెక్కడా కనిపించవు. కాకపోతే ఈ మధ్య కాలంలో సింగపూర్‌లోని పక్షులని అధ్యయనం చేసి ఒక సంస్థ ఈ జాతి ఆడ పక్షిని అక్కడ చూసినట్టు చెప్పారు. బహుశా ఎవరో కొన్నింటిని అక్రమంగా రవాణా చేసినట్టున్నారు.మా పడవ దీవి దక్షిణ అంచుని దాటి ఈశాన్య అంచున ఉన్న పోలీస్ పోస్ట్ అనే లంగరు వేసే చోటుకి చేరుకుంటూండగానే మాకు నార్కోండం హార్నబిల్ పక్షులు ఎగురుతూ కనిపించాయి. మా పడవ నుంచి చూస్తే 710 మీటర్ల ఎతైన ఆ అగ్నిపర్వతము ఆంతా దట్టమైన అడవితో నిండి ఉంది.ఈ దీవి భారత భూభాగ పరిధిలోకి వస్తుంది, అందుకే ఇక్కడ ఇండియన్ రిజర్వు బటాలిన్ వారి పారా మిలిటరీ పోలిసుల పోస్టు ఉంటుంది. ఒకప్పుడు ఏపుగా ఉండే బర్మా జీలుగ చెట్ల స్థానంలో ఇప్పుడు అక్కడ కొబ్బరి , అరటి , వక్క వంటి మనుషులకు ఉపయోగ పడే చెట్లు కనిపిస్తున్నాయి. ఆ దట్టమైన అడవిలో అనేక మేకలు మొక్కలను తింటూ హార్నబిల్ పక్షుల మనుగడకు ముప్పుగా తయారయ్యాయని ఒక కధనం విన్నాను.ఈ మేకలు ఆ దీవిపై సహజంగా కనిపించే ప్రాణులు కావు. ఈ మేకల వెనుక ఒక ఆసక్తికరమైన కధ ఉంది. 15 నుంచి 17వ శతాబ్దం మధ్యలో ఐరోపా నుండి అన్వేషక నావికులు ప్రపంచమంతా నౌకలలో ప్రయాణించే వారు. ఆ ప్రయాణంలో సుదూర ప్రాంతాల్లో ఉండే చిన్న దీవులు కనిపించినప్పుడు ఆ దీవుల్లో కొన్ని మేకలు, పందులు, కోళ్లు, కుందేళ్లు మరియు తాబేళ్లను వదిలి వెళ్లేవారు. ఆ దారిన వెళ్లే ఇతర నౌకలకు లేక దురదృష్టవశాత్తు పడవ మునిగిపోతే బ్రతికి బయటపడి దీవికి చేరుకున్నవారికి ఆహారముగా ఇవి ఉపయోగపడతాయని వారి ఉద్దేశం. 1899 లో ఏ. ఓ. హ్యూమ్ ఒక కధనంలో ఈ దీవిపై పందులు, మేకలు, కోళ్లను వదిలిపెట్టారు అని వ్రాసారు. కానీ మొదటిసారిగా ఎప్పుడు వాటిని అక్కడ వదిలారో ఎవరికీ కచ్చితంగా తెలియదు. ఆ కాలంలో వదిలిన వాటిని సముద్రపు దొంగలు లేక నావికులు ఆహారంగా తినేశారో లేక ఆ జంతువులే చనిపోయావో తెలియదు.అయితే ప్రపంచ వ్యాప్తంగా ఇలా యాదృచ్ఛికంగా దీవులలో వదిలిన జంతువుల ఆ దీవులలోని జీవ సమతుల్యతను దెబ్బతీస్తున్నాయని ప్రభుత్వ అధికారులు నిర్మూలిస్తుండంగా, 1976 లో మన దేశ పోలీసులు రెండు జతల మేకలను ఈ దీవిపై పనిచేసే పోలీసుల ఆహారంకోసం ఉపయోగపడతాయని తీసుకువచ్చారు. ప్రతీరోజు మేక మాంసం తిని విసుగెత్తిపోయారో లేక తోటలను పెంచినట్టు ఆ దీవిలో మేకల పెంపకం పెద్ద వ్యాపారమే అయ్యిందో లేక మేకలు మిగతా దీవులలో వలె మేకలు నియంత్రణ లేకుండా చేయదాటిపోయాయో తెలియదు కానీ 1998 నాటికి ఆ దీవిపై దాదాపు 400 మేకలు చక్కగా భయంలేకుండా బ్రతుకుతూ కనిపించాయట!1990 దశాబ్దం మొదట్లో పక్షులను అధ్యయనం చేసే శాస్త్రవేత్తలు ఈ దీవిపై నుండి ఈ మేకలను నిర్మూలించాలని అడగడం మొదలుపెట్టారు. సాధారణంగా అగ్నిపర్వతం పరిసరాలు చిన్న రాళ్లతో నిండి ఉంటుంది. ఈ పర్వతంపై పెరుగుతున్న చెట్ల వేళ్ళు ఆ రాళ్లను ఒడిసి పట్టి ఉంచడం వలనే ఆ దీవిని ఒక్కటిగా ఉంచడం సాధ్యపడిందని కొందరు వాదిస్తారు. ముఖ్యంగా అత్తి జాతి చెట్లు ఈ రకంగా తమ వేళ్ళతో రాళ్ళని ఒడిసిపడతాయి. హార్నబిల్ పక్షుల ఆ చెట్ల పళ్ళను తమ పిల్లలకు ఆహారంగా ఉపయోగిస్తాయి. అయితే ఈ దీవిపై అపరిమితంగా పెరిగిపోయిన మేకలు, మొలకెత్తుతున్న అత్తి జాతి మొక్కలను తినడం మూలంగా, కొత్త చెట్లు పెరగడానికి అవకాశం లేక ఆ హార్నబిల్ పక్షుల ఆహారానికి ఇబ్బంది కలిగి తద్వారా వాటి మనుగడ ప్రమాదంలో పడింది. చివరికి మేకలు ఆ దీవికి ప్రమాదకారులుగా మారాయి. మేము ఈ దీవి చేరుకున్నాక, మూడు రోజులపాటు మేకల అడుగుల గుర్తుల కోసం, అవి తిని విసర్జించిన గుర్తుల కోసం, వాటి ఉనికిని తెలిపే ఏదైనా ఆధారాల కోసం దాదాపు ఆ దీవి మూడు వంతులు నడిచి పరిశీలించాము. ఆశ్చర్యంగా మాకు ఒక్క ఆధారం కూడా దొరకలేదు. బహుశా అధికారులు పక్షి శాస్త్రవేత్తలు అడిగినట్లే ఎంతో కష్టపడి వారి కోరిక తీర్చినట్టు ఉన్నారు. అయితే ఇక్కడ నివసిస్తున్న పోలీస్ మాత్రం, అంతకు ముందరి వారమే రెండు మేకలు కొండపైకి పరిగెడుతూ పారిపోవడం చూశామని చెప్పారు. ఏదేమైనప్పటికీ ఈ దీవిపైనా ఆ మేకల ప్రభావం తెలియాలంటే కాలమే సమాధానం చెప్పాలి.రచయిత్రి: జానకి లెనిన్ఫోటోలు- రోహిత్ నానీవాడేకర్ -
నల్లమలలో పక్షుల కిలకిల
నల్లమల అంటేనే ఎన్నో వింతలు, విశేషాలకు పుట్టినిల్లు. జాతీయ జంతువైన పెద్దపులి నుంచి అరుదైన వన్యప్రాణులు, ఆయుర్వేద ఔషధ గుణాలు కలిగిన మొక్కలు, ఆధ్యాతి్మక కేంద్రాలైన ప్రముఖ పుణ్యక్షేత్రాలు, అద్భుత జలపాతాలు, పచ్చటి పర్వత సానువులు, దట్టమైన అడవుల అందాలు...ఇలా నల్లమల ఎన్నో అద్భుతాలకు ఆలవాలం. జీవ వైవిధ్యానికి పెట్టింది పేరైన నల్లమల తాజాగా దేశ, విదేశీ పక్షులకు స్థావరంగా మారింది. వేల కిలోమీటర్లు దాటుకుంటూ వలస పక్షులు నల్లమలకు చేరుకుని ఆవాసాలు ఏర్పరచుకుంటున్నాయి. నల్లమలలో పచ్చని చెట్లు, గలగల పారే సెలయేటి సవ్వడులు వలస పక్షులను మరింత ఆకర్షిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. – మహానందిబార్ హెడెడ్ గూస్ప్రపంచంలోనే అత్యంత ఎత్తుకు ఎగిరే పక్షి బార్ హెడెడ్ గూస్ అని చెబుతారు. ఇవి సంతానోత్పత్తి కోసం మ«ధ్య ఆసియాలోని పర్వత ప్రాంతాల నుంచి దక్షిణాసియాలోని ద్వీపకల్ప ప్రాంతానికి వస్తాయి. ఈ పక్షులు ఒకేసారి మూడు నుంచి పది గుడ్లు పెడతాయి. ఇవి అత్యంత ఎత్తయిన హిమాలయాల మీదుగా ఎగురుకుంటూ వలస వస్తాయి. ఎల్లో థ్రోటెడ్ బుల్బుల్ ఎంతో అందంగా కనిపించే అరుదైన పక్షిజాతుల్లో ఎల్లో థ్రోటెడ్ బుల్బుల్ ఒకటి. అంతరించిపోతున్న పక్షి జాతుల్లో ఇది ఒకటని ఆరి్నథాలజిస్టులు చెబుతున్నారు. ఇవి తాము సంచరించే ప్రాంతాలను చిన్న చిన్న సర్కిల్స్‌గా ఏర్పాటు చేసుకుంటాయి. కీటకాలను తింటాయి. భారత ద్వీపకల్పానికి చెందిన పక్షిజాతుల్లో ఇది ఒకటి. నిటారుగా ఉండే కొండ ప్రాంతాల్లో ఇవి నివసిస్తాయి. పక్షులనే ఆహారం తీసుకునే ‘‘హారియర్స్’’: విదేశీ పక్షిజాతుల్లో రకరకాల పక్షులు ఉంటాయి. వాటిలో పక్షులనే ఆహారంగా తీసుకునే హ్యారియర్స్ జాతి ఒకటి. ఇది ఆక్సిపిట్రిడి అనే వేటాడే పక్షి కుటుంబానికి చెందిన సర్కస్ జాతి. ఇవి మైదాన ప్రాంతాల్లో తిరుగుతూ పక్షులు, చిన్నచిన్న క్షీరదాలను ఆహారంగా తీసుకుంటాయి. యూరప్, పశ్చిమాసియా నుంచి నల్లమలకు వలస వస్తాయి. గ్రేటర్ ఫ్లెమింగోలుఫ్లెమింగో కుటుంబానికి చెందిన అతి పెద్ద జాతి గ్రేటర్ ఫ్లెమింగో. ఇవి ఉత్తర తీర ప్రాంతాలు, దక్షిణ ఐరోపా, హిమాలయ ప్రాంతాల్లో ఉంటాయి. తల, మెడ, రంగుల ఆధారంగా గ్రేటర్ ఫ్లెమింగో, అమెరికన్ ఫ్లెమింగోలుగా వర్గీకరిస్తారు. వీటి ఈకలు గులాబీ రంగులో ఉంటాయి.ఇండియన్ పిట్టచిన్న మొండితోకను కలిగి ఎంతో అందంగా కనిపించే పక్షి ఇండియన్ పిట్ట. ఇది దట్టమైన అడవుల్లోని నేలలపై, పొదల్లో ఉంటుంది. ఆకులు, చెత్తలో ఉండే క్రిమికీటకాలను ఆహారంగా తీసుకుంటుంది. గతంలో ఓ ఆంగ్లేయుడు ఈ పిట్ట(పక్షి)ని చూసి దీని పేరేంటి అని అడిగితే మన భారతీయులు ఇండియన్ పిట్ట అన్నారని, అందుకే ఇండియన్ పిట్టగా పేరు పడిపోయిందని పలువురు శాస్త్రవేత్తల అభిప్రాయం. ఊలి నెక్డ్ స్టార్క్(ఉన్ని మెడ కొంగ)కొంగల్లో ఊలి నెక్డ్ స్టార్క్ ఒకటి. దీని మెడ వద్ద ఉన్నిలాగా ఉండటంతో దీన్ని ఉన్ని మెడ కొంగ అని పిలుస్తారు. వీటిలో ఆసియా, ఆఫ్రికన్ జాతులు అని రెండు రకాలు ఉంటాయి. నల్లమల ప్రాంతంలో ఆసియా జాతికి చెందినవి ఎక్కువగా సంచరిస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది. నంద్యాల జిల్లాలో అరుదైన పక్షులు పెద్దపులి, చిరుతపులులతో పాటు ఎన్నో అరుదైన వన్యప్రాణులు, వింతలు, విశేషాలకు నల్లమల నిలయం. నంద్యాల జిల్లాలోని నల్లమల, అహోబిలం ప్రాంతాల్లోని అడవుల్లో అరుదైన దేశీయ, విదేశీ వలస పక్షులు ఉన్నాయి. మేము చేసిన పరిశోధనల్లో 230 రకాల పక్షులను గుర్తించాము. ఒకే జిల్లాలో ఇన్ని రకాల పక్షులు ఉండటం ఎంతో విశేషమనే చెప్పాలి. – తరుణ్‌కుమార్ సింగ్, జూనియర్ సైంటిస్ట్, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ వలసపక్షులకు కేంద్రంనల్లమలలో పెద్దపులులే కాదు. అరుదైన వన్యప్రాణులు, క్రిమికీటకాలు ఎన్నో ఉన్నాయి. పక్షుల్లో అనేక రకాల జాతులకు నంద్యాల జిల్లా పరిధిలోని నేలలు ఎంతో అనువైనవి. కొన్ని రకాల పక్షులు చిత్తడి నేలలంటే ఇష్టపడతాయి. ఎక్కడ తడినేలలు కనిపిస్తే అక్కడికి అన్నీ చేరి ఆహారాన్వేషణ చేస్తూ రైతులకు తెలియకుండా రైతు నేస్తాలుగా మారిపోతున్నాయి. – దూపాడు శ్రీధర్, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ నంద్యాల జిల్లాలో 230 రకాల పక్షులు నంద్యాల జిల్లాలో 230 రకాల పక్షిజాతులు ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. మనం నిత్యం చూసే చిలుకలు, కింగ్ ఫిషర్, కొంగలు, బాతులు, వడ్రంగిపిట్టలు, పిచ్చుకలు, పావురాలతో పాటు దేశ, విదేశాల నుంచి వచ్చే వలస పక్షులు సైతం ఈ ప్రాంత వాతావరణాన్ని ఇష్టపడుతున్నాయి. గడ్డిభూములు, కొండలు, చిత్తడి నేలలు ఇలా అన్ని రకాల నేలలు ఉండటంతో వివిధ రకాల పక్షులకు ఆహారం కూడా తేలికగా లభిస్తోంది. మనం నిత్యం చూసే పక్షి జాతులతో పాటు బార్ హెడెడ్ గూస్, హ్యారియర్స్, టరŠన్స్, ఎల్లో త్రోటెడ్ బుల్బుల్, ఇండియన్ పిట్ట, స్వాంపెన్, గ్రేటర్ ఫ్లెమింగోస్, డార్టర్ కార్మోరెంట్, స్పాట్ బిల్డ్ పెలికాన్, పాండ్ హెరాన్, రెడ్ నాప్డ్ హైబిస్, పర్పుల్ సన్ బర్డ్స్, వెయిట్ త్రోటెడ్ కింగ్ ఫిషర్, మార్స్ హారియర్, శాండ్ పైపర్, స్పాటెడ్ ఓలెట్, కాంబ్ డక్, బ్లూ టెయిల్డ్ బీ ఈటర్ లాంటి వాటితో పాటు రాత్రుళ్లు మాత్రమే కనిపించే నైట్‌జార్స్ వంటి అనేక రకాల పక్షులు నల్లమల పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. -
నల్లగబ్బిలం పువ్వును ఎప్పుడైనా చూశారా!
అరుదైన ఈ పువ్వు నల్లగా గబ్బిలంలా కనిపిస్తుంది. ఈ పూలు పూసే మొక్కలను దూరం నుంచి చూస్తే, మొక్కల మీద గబ్బిలాలు వాలి ఉన్నాయేమోననిపిస్తుంది. గబ్బిలం వంటి ఆకారం వల్లనే ఈ పువ్వుకు ‘బ్లాక్ బ్యాట్ ఫ్లవర్’ అనే పేరు వచ్చింది. కంద జాతికి చెందిన ఒక మొక్కకు ఈ పూలు పూస్తాయి. ఫ్రెంచ్ వర్తకుడు, కళాసేకర్త ఎడ్వర్డ్ ఆండ్రూ తొలిసారిగా ఈ పూల గురించి 1901లో రాసిన తన పుస్తకంలో వర్ణించాడు.ఈ పూల మొక్కలు బంగ్లాదేశ్, కంబోడియా, దక్షిణ చైనా, లావోస్, మలేసియా, మయాన్మార్, థాయ్‌లండ్ అడవుల్లో కనిపిస్తాయి. ఈ పూల కేసరాలు పిల్లి మీసాల్లా ఉంటాయి. రేకులు గబ్బిలం రెక్కల్లా ఉంటాయి. పన్నెండు అంగుళాల వెడల్పు, పది అంగుళాల పొడవుతో గబ్బిలం ఆకారంలో కొంత భయం గొలిపేలా ఉండటంతో ఈ పువ్వులను దక్షిణాసియా స్థానిక భాషల్లో ‘దెయ్యం పువ్వులు’ అని కూడా పిలుస్తారు. చైనీస్ సంప్రదాయ వైద్యంలో ఈ పువ్వులను కొన్ని ప్రత్యేక ఔషధాల తయారీ కోసం ఉపయోగిస్తారు.అతి పురాతన రైల్వేస్టేషన్..ఇది ప్రపంచంలోనే అతి పురాతన రైల్వేస్టేషన్. ఇక్కడి నుంచే తొలి పాసింజర్ రైలుబండి నడిచింది. ఇంగ్లండ్‌లో ఉన్న ఈ రైల్వేస్టేషన్ పురాతన భవంతిని ఇప్పుడు మ్యూజియంగా మార్చారు. ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌లో లివర్‌పూల్ రోడ్ స్టేషన్‌ను 1830లో నిర్మించారు. లివర్‌పూల్ రోడ్ నుంచి మాంచెస్టర్ వరకు తొలి పాసింజర్ రైలు నడిచేది. లివర్‌పూల్ అండ్ మాంచెస్టర్ రైల్వే కంపెనీ తరఫున ఈ రైల్వేస్టేషన్‌ను జార్జ్ స్టీఫెన్సన్ అనే ఇంజినీరు నిర్మించాడు.ప్రస్తుతం మ్యూజియంగా మార్చిన ఈ పురాతన రైల్వేస్టేషన్ భవంతిలో రైల్వే మ్యూజియంతో పాటు సైన్స్ ప్లస్ ఇండస్ట్రీ మ్యూజియం, పిల్లల ఆట స్థలం వంటివి కూడా ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే తొలి పారిశ్రామిక నగరంలో మాంచెస్టర్ గత వైభవాన్ని తెలిపే వస్తువులను ఇక్కడ కొలువు దీర్చారు. పారిశ్రామిక విప్లవం నాటి పురాతన యంత్రపరికరాలను ఇందులో భద్రపరచారు. రైల్వే మ్యూజియంలో బొగ్గుతో నడిచే తొలినాటి ఆవిరి ఇంజిన్లను, ఆనాటి రైలు బోగీలను, వివిధ కాలాల్లో వచ్చిన మార్పులను ప్రతిబింబించే రైలు ఇంజిన్లను, బోగీలను భద్రపరచారు. ఈ మ్యూజియంను చూడటానికి పద్నాలుగేళ్ల లోపు పిల్లలకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నారు.అతిచిన్న లకుముకి పిట్ట..ఇది ప్రపంచంలోనే అతిచిన్న లకుముకి పిట్ట. అత్యంత అరుదైన పక్షుల్లో ఇది కూడా ఒకటి. పొడవాటి ఎర్రని ముక్కుతో రంగురంగుల శరీరంతో ఉండే ఈ పక్షి, చూడటానికి పిచుక పరిమాణంలో ఉంటుంది. ఫిలిప్పీన్స్ అడవుల్లో ఈ జాతి పక్షులు కనిపించేవి. ఫ్రెంచ్ ప్రకృతి శాస్త్రవేత్త బెర్నార్డ్ జర్మెయిన్ డి లేస్పెడె 1799లో వీటిని తొలిసారిగా చూసినప్పుడు, ఇవి చిన్నసైజు కింగ్‌ఫిషర్ పక్షుల్లా కనిపించడంతో వీటికి ‘ఫిలిప్పీన్ డ్వార్ఫ్ కింగ్‌ఫిషర్’ అని పేరుపెట్టాడు.ఈ పక్షులు క్రమంగా తగ్గిపోయి, కనిపించడం మానేశాయి. ఈ పక్షులను స్థానికులు చివరిసారిగా 130 ఏళ్ల కిందట చూశారు. ఆ తర్వాత ఈ పక్షులు ఎవరికీ కనిపించకపోవడంతో ఇవి అంతరించిపోయాయని శాస్త్రవేత్తలు కూడా భావించారు. ఫిలిప్పీన్స్ విహంగ శాస్త్రవేత్త మీగెల్ డేవిడ్ డి లియాన్ ఇటీవల దక్షిణ ఫిలిప్పీన్స్ అడవుల్లో ఈ పక్షులను గుర్తించి ఫొటోలు తీశాడు. -
నేచర్స్ లవింగ్లీ!
పొద్దుపొద్దున్నే లేవడం.. ఫోన్లు పట్టడం.. రీల్స్ చూడటం.. గేమ్స్ ఆడటం.. చాలా మంది పిల్లలు చేస్తున్న పనులు. ఫోన్ మోజులో పడి బయటి ప్రపంచాన్ని పట్టించుకోవడం మానేస్తున్నారు. ఎప్పుడూ ఫోన్లో బిజీగా ఉంటున్నారు. అయితే వీళ్లు మాత్రం చాలా ప్రత్యేకం. ప్రకృతిని ప్రేమిస్తూ.. ప్రకృతి ఒడిలో సేదతీరుతూ.. ప్రకృతిని పది మందికీ పరిచయం చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. చిన్న వయసులోనే జీవ వైవిధ్యానికి ఉన్న ప్రాముఖ్యాన్ని లోకానికి చాటి చెబుతున్నారు. వారే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థులైన అజ్మా ఖాన్, ఇబ్రహీం, నియో వెంకట్, అన్నవరపు సాతి్వక్. రెండేళ్లుగా ఎంతో శ్రమించి హెచ్‌పీఎస్‌లో ఉన్న జీవ వైవిధ్యాన్ని కళ్లకు కట్టేలా అద్భుతమైన ఫొటోలతో పుస్తకాన్ని ప్రచురించారు. ఈ పుస్తకం వెనుక ఉన్న వారి శ్రమ గురించి తెలుసుకుందాం.. కాంక్రీట్ అరణ్యంలో చాలావరకూ పక్షులు, కీటకాలు దాదాపు కనుమరుగవుతున్నాయి. దాదాపు 150 ఎకరాల్లో విస్తరించి ఉన్న హెచ్‌పీఎస్ బేగంపేట క్యాంపస్‌లో మాత్రం జీవవైవిధ్యం పరిఢవిల్లుతోంది. ఎన్నో రకాల జాతులు ఇక్కడ మనుగడ సాగిస్తున్నాయి. ఇటీవలే 12వ తరగతి పూర్తి చేసుకున్న వీరంతా రెండేళ్లుగా స్కూల్లోని జంతు జాతులపై తీవ్ర పరిశోధన చేశారు. పక్షులు, కీటకాలు, సీతాకోకచిలుకలు ఇలా ఎన్నో రకాల జీవులను తమ కెమెరాల్లో అద్భుతంగా బంధించారు. వాటన్నింటినీ విభాగాల వారీగా విభజించి, ఒక్కో జీవం గురించి వివరించారు. 71 జాతుల పక్షులు, 128 జాతుల కీటకాలు, 16 జాతుల సరీసృపాలు, మూడు జాతుల ఉభయచరాలను పుస్తకంలో పొందుపరిచారు.అనేక విషయాలు నేర్చుకున్నాం.. తమ ప్రాజెక్టులో భాగంగా ఎన్నో విషయాలు నేర్చుకున్నామని వాళ్లు చెబుతున్నారు. సమా చారం సేకరణ సమయంలో చాలా మందితో మాట్లాడామని, వారంతా సహకరించారని పేర్కొన్నారు. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకున్నామని తెలిపారు. పక్షులు, కీటకాల సమూహంలో ఎలా ప్రవర్తిస్తున్నాయో తమకు అర్థమైందని వివరించారు. వాటిని చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నారు. భవన నిర్మాణాల్లో మార్పు రావాలి.. పర్యావరణంలో ప్రతి జీవీ ముఖ్యమేనని, ప్రస్తుతం నిర్మిస్తున్న భవనాల్లో జీవ జాతుల కోసం ఎలాంటి ఏర్పాట్లూ చేయట్లేదని, దీంతో అనేక పక్షి జాతులు అంతరించిపోతున్నాయని చెబుతున్నారు. జీవ వైవిధ్యం ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కలి్పంచడమే తమ పుస్తకం ముఖ్య ఉద్దేశమని వారు పేర్కొంటున్నారు. తమ తోటి విద్యార్థులు కూడా తమను చూసి ప్రకృతిపై ప్రేమను పెంచుకున్నారని గుర్తుచేసుకున్నారు.చిన్నప్పటి నుంచి ఆసక్తితో.. ప్రకృతి అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. మా స్కూల్లో ఎన్నో జీవులు తారసపడుతుండేవి. వాటన్నింటినీ ప్రపంచానికి పరిచయం చేయాలని ఆలోచన ఉండేది. నాతో పాటు నాలాంటి ఆలోచన ఉన్న స్నేహితులతో కలిసి ఈ ప్రాజెక్టును పూర్తి చేశాం. స్కూల్లోని టీచర్లు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు. – అజ్మా ఖాన్నెట్లో సరైన సమాచారం లేదు.. చాలా జీవుల గురించి ఇంటర్నెట్లో వెతికితే సరైన సమాచారం లభించట్లేదు. చాలాసార్లు తప్పుడు సమాచారం లభిస్తోంది. ఎలాగైనా వాటి గురించి సరైన సమాచారం అందించాలని అనుకున్నాం. అందుకే ఈ పుస్తకాన్ని తీసుకొచ్చాం. సమాచారం సేకరణకు ఎంతో కష్టపడ్డాం. – నియో వెంకట్ పర్యావరణం అంటే ఇష్టం.. పర్యావరణం అంటే ఇష్టం. పక్షులు, జంతువులు, వాటి సమూహంతో, మనుషులతో ఎలా ప్రవర్తిస్తాయో గమనిస్తుంటా. చేపలను పెంచడం అంటే ఇష్టం. ఇంట్లోనే సొంతంగా అక్వేరియం రూపొందించి, పలు రకాల చేపలను పెంచుకుంటున్నాను. రెడ్ టెయిల్ క్యాట్‌ఫిష్, టైగర్ ఆస్కార్, ఇరిడిసెంట్ ఆస్కార్, చెర్రీ బార్బ్ వంటి ఎన్నో చేపలను జాగ్రత్తగా చూసుకుంటున్నాను. – ఇబ్రహీం వదూద్ అహ్మద్ దస్తగిర్కెమెరా ముఖ్యమైనది.. ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. ఫోన్లు విస్తృతంగా వినయోగంలోకి వచి్చన తర్వాత ఫొటోలు, కెమెరాల గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. కెమెరాల్లో తీసిన ఫొటోలకు ప్రాముఖ్యత ఉంటుంది. వాటి విలువ తెలుస్తుంది. మంచి ఫొటో కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సి ఉంటుంది. అప్పుడే అందమైన ఫొటోలు తీయడానికి అవకాశం ఉంటుంది. – సాతి్వక్ అన్నవరపు -
పక్షులను స్వేచ్ఛగా ఎగరనిద్దాం..
మనలో చాలా మంది పక్షులను పెంచుకుంటూ ఉంటారు. కానీ ఎక్కువశాతం తమ ఆహ్లాదం కోసమే. నిజానికి పక్షులను ఆదరించాల్సింది మన ఆహ్లాదం కోసం కాదు, వాటి ఆనందం కోసం దగ్గరకు తీయాలి. వాటి రెక్కలు విరిచి పంజరంలో పెట్టి మనం చూస్తూ ఆనందించడం హేయమైన చర్య. స్వేచ్ఛగా ఎగరడం వాటి సహజ లక్షణం. అది వాటికి ప్రకృతి ఇచ్చిన హక్కు. ఆ హక్కును కాలరాసే అధికారం మనకు లేదు... అంటున్నారు మహారాష్ట్ర, పుణేలో నివసిస్తున్న రాధికా సోనావానే. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్న రాధిక పక్షి సంరక్షకురాలిగా మారిన క్రమాన్ని ఆమె చాలా ఇష్టంగా వివరిస్తారు.‘‘ప్రస్తుతం నా ఉద్యోగరీత్యా పూనాలో ఉన్నాం. మా స్వస్థలం ఔరంగాబాద్. బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ సలీం అలీ బర్డ్ సాంక్చురీకి ఎన్నిసార్లు వెళ్లానో లెక్కచెప్పలేను. పక్షుల మీద మమకారం ఏర్పడింది. నేను బర్డ్ లవర్ని బర్డ్ వాచర్‌ని మాత్రమే అనుకున్నాను. కానీ ఏ మాత్రం ముందస్తు ప్రణాళికలు లేకుండా అనుకోకుండా పక్షి సంరక్షకురాలినయ్యాను. పెళ్లి తర్వాత నా నివాసం ఔరంగాబాద్‌లోనే ఒక ఫ్లాట్‌లోకి మారింది.మా పొరుగింట్లో ఓ పెద్దాయన బాల్కనీలో బర్డ్ ఫీడర్, ఒక గిన్నెలో నీరు పెట్టడం చూసిన తర్వాత నాకూ ఆలాగే చేయాలనిపించింది. పుణేకి బదిలీ అయిన తర్వాత కూడా కొనసాగింది. ఇప్పుడు మా ఇంటి గార్డెన్ పక్షుల విహార కేంద్రమైంది. నాకు తోచిన గింజలు పెట్టి సరిపెట్టకుండా ఏ పక్షికి ఏమిఇష్టమో తెలుసుకోవడానికి పక్షుల జీవనశైలిని అధ్యయనం చేశాను. రామ చిలుకలకు వేరుశనగ పప్పులు ఇష్టం. గోరువంకలు అరటి పండు తింటాయి. రామ చిలుక ముక్కు పెద్దది.గోరువంక, పిచ్చుకల ముక్కులు చిన్నవి. ఆ సంగతి దృష్టిలో పెట్టుకుని ఫీడర్ బాక్సులు డిజైన్ చేయించాను. నేను పెట్టిన ఆహారాన్ని అవి ఇష్టంగా తింటున్నాయా లేదా, నేను చదివింది నిజమేనా కాదా అని తెలుసుకోవడానికి బాల్కనీలో కూర్చుని శ్రద్ధగా గమనించేదాన్ని. అరటి పండు ముక్కలను చూడగానే గోరువంకలు సంతోషంగా పాటలు పాడడం మొదలుపెడతాయి. పాట పూర్తయిన తర్వాత తింటాయి. టైయిలర్ బర్డ్ అయితే పత్తి దూదిని చూడగానే రాగాలు మొదలుపెడుతుంది.గూడు కట్టుకోవడానికి పత్తి కనిపిస్తే దాని ఆనందానికి అవధులు ఉండవు. మనం సాధారణంగా కాకులను ఇష్టపడం. కానీ అవి చాలా హుందాగా వ్యవహరిస్తాయి. కాకులు, పిచుకలు, చిలుకలు, గోరువంకలు ఇతరులకు హాని కలిగించవు. పావురాలు అలా కాదు. వాటి ఆహారపు అలవాట్లు కూడా అంత సున్నితంగా ఏమీ ఉండవు. తమ ఆహారంలో ఇతరులను ముక్కు పెట్టనివ్వవు, ఇతరుల ఆహారాన్ని కూడా తామే తినేయాలన్నంత అత్యాశ వాటిది. పక్షి స్వేచ్ఛాజీవి..పెట్ డాగ్‌లాగా యజమానితో అనుబంధం పెంచుకోవడం పక్షుల్లో ఉండదు. స్వేచ్ఛగా విహరిస్తూ అనేక ప్రదేశాలకు వెళ్తుంటాయి. ఒక ప్రదేశంతో కానీ వ్యక్తితో కానీ అనుబంధం పెంచుకోవు. మా ఇంటికి వచ్చే నా అతిథుల్లో చిలుకలే ఎక్కువ. అలెగ్జాండ్రియన్ ΄్యారట్, ఇండియన్ రింగ్నెక్ ΄్యారట్లు తరచూ కనిపిస్తుంటాయి. సన్‌బర్డ్, వీవర్ బర్డ్ కూడా వస్తుంటాయి. కాలం మారేకొద్దీ అవి అప్పటి వరకు ఉన్న ప్రదేశాలను వదిలి తమకు అనువైన ప్రదేశాలకు వెళ్లిపోతుంటాయి.వాయు కాలుష్యం, వాతావరణంలో వస్తున్న మార్పులు కూడా పక్షుల వలసలకు కారణమే. సెల్ ఫోన్ టవర్ల నుంచి వెలువడే రేడియేషన్ కారణంగా పక్షులు కంటి చూపును కోల్పోతున్నాయి. దాంతో అవి తమకు సురక్షితమైన ప్రదేశాలను వెతుక్కుంటూ ఎటుపోతున్నాయో తెలియడం లేదు. కరవు, అధిక వర్షాలు, యాసిడ్ వర్షాలు, అడవులలో చెట్లు నరకడం, మంటలు వ్యాప్తించడం... వాటికి ఎదురయ్యే ప్రమాదాలు. పక్షులు అడవిలో జీవించినంత ధైర్యంగా మనుషుల మధ్య జీవించలేవు.వాటికి మనుషులంటే భయం. ఆ భయాన్ని వదిలించి మచ్చిక చేసుకోవాలంటే వాటికి ఆహారాన్ని అందుబాటులో ఉంచడం ఒక్కటే మార్గం. ఆహారం కోసం ధైర్యం చేస్తాయి, క్రమంగా మన మీద నమ్మకం కలిగిన తర్వాత మన ఇంటిని తమ ఇంటిలాగా భావిస్తాయి. మా గార్డెన్‌కి రోజూ నలభై నుంచి యాభై పక్షుల వరకు వస్తుంటాయి. వాటి కోసం ఇంట్లో వంటగది, హాలు, బాల్కనీల్లో పక్షుల కోసం నీటి పాత్రలు పెట్టాను. దాహం వేసినప్పుడు నేరుగా దగ్గరలో ఉన్న నీటి పాత్ర దగ్గరకు వెళ్లిపోతాయి. పక్షులు మనతో మాట్లాడతాయి.రోజూ మా ఇంటి ఆవరణలో వినిపించే కిచకిచలన్నీ అవి నాకు చెప్పే కబుర్లే. కరోనా సమయంలో నా టైమ్ అంతా వీటి కోసమే కేటాయించాను. నన్ను నిత్య చైతన్యంగా ఉంచాయవి. నిజానికి పక్షి ప్రేమికులెవ్వరూ పక్షులను పంజరంలో బంధించరు. తమ సంతోషం కోసం పక్షులను పెంచే స్వార్థజీవులే ఆ పని చేస్తారు. దయచేసి పక్షులను బంధించవద్దు. వాటిని స్వేచ్ఛగా ఎగరనివ్వండి. చేతనైతే రోజుకు గుప్పెడు గింజలు, ఒక పండు పెట్టండి’’ అంటూ పక్షుల గురించి ఆసక్తికరమైన విషయాలెన్నో చెబుతారు రాధిక.ఇవి చదవండి: ఉర్దూ మీడియంలో చదివి.. 'నీట్' టాపర్‌గా..! -
తీర్పే బలం, బలగం
⇒ పొద్దు పొడవక ముందే భుజాన వెదురు గెడకు మావులు, సల్దికూడు (సద్దన్నం) క్యారేజీ తగిలించుకుని గోచీ పెట్టుకుని నడిచి వెళ్లి కొల్లేరులో తాటి దోనెలపై తిరిగి సహజసిద్ధంగా చేపలను వేటాడి మార్కెట్‌కు పోయి అయినకాడికి అమ్ముకుని బతుకు నెట్టుకొచ్చిన మట్టి మనుషులు ఒకనాడు. ⇒ సమాజంలో మిగిలిన వారిలాగానే కాలానికి అనుగుణంగా ఆధునికతను అందిపుచ్చుకుని చేపల చెరువులతో ఆదాయం ఆర్జించి అభివృద్ధివైపు అడుగులు వేసిన గట్టి మనుషులు నేడు.⇒ రాష్ట్రంలోని ఏలూరు–పశ్చిమ గోదావరి జిల్లాల నడుమ విస్తరించిన కొల్లేరు ప్రాంతంలో నివసించే ప్రజల జీవన గమనాన్ని పరిశీలిస్తే గొప్ప సందేశాన్ని బాహ్య ప్రపంచానికి పంచుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా కొల్లేరులో ఎదిరీదే బతుకుచిత్రమిదీ. జీవన విధానంలో మార్పులు వచ్చినా కొల్లేరులో మనిషి మారలేదు. వారి మనసూ మారలేదు. కార్పొరేట్ కల్చర్, కుట్రలు, కుతంత్రాలు వారిని ఏమాత్రం ప్రభావితం చేయలేదు.ఎన్ని కష్టాలొచ్చినా ఐక్యమత్యమే మహాబలం అనేదానికి కొల్లేరువాసులు నిలువెత్తు సాక్ష్యం. ఇది ఒకటి రెండేళ్లు కాదు. ఏకంగా 150 ఏళ్ల క్రితం నుంచి వారంతా ఒకే మాట, ఒకే బాట అనే తీరుతో ముందుకు సాగుతున్నారు. పరస్పర సహకారం, గ్రామాభివృద్ధికి తోడ్పాటు, వ్యక్తిగత తగాదాలు, కుటుంబంలోని పేచీలు ఇలా విషయం ఏదైనా సరే వారంతా గ్రామంలోనే నిర్ణయం తీసుకునే కట్టుబాటు ఇప్పటికీ కొనసాగుతోంది. – సాక్షి, అమరావతిఆకాశంలో విహరించే పక్షుల సమూహాలు...నీటిలో జలపుష్పాల పరుగులు ..చుట్టూ నీటి మధ్యలో దీవుల్లాంటి భువిపై వెలిసిన గ్రామాల్లో జీవనం సాగించే అ‘సామాన్యులు’. ఇది మంచినీటి సరస్సుగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ‘కొల్లేరు’తో పెనవేసుకున్న జీవరాశులతో సహజీవనం.కాంటూరు కుదింపునకు వైఎస్ సర్కారు తీర్మానంకొల్లేరు ఐదో కాంటూరు వరకు 77,138 ఎకరాల విస్తీర్ణాన్ని అభయారణ్యంగా ప్రకటించారు. దీన్ని మూడో కాంటూరుకు కుదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ 2008లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. కాంటూరు పరిధి తగ్గించడం వల్ల 43,072 ఎకరాలు అభయారణ్యం పరిధి నుంచి బయటపడతాయి. వాటిలో పట్టా భూములు 14,932 ఎకరాలు, జిరాయితీ భూములు 5,510 ఎకరాలను వాటి హక్కుదారులకు అప్పగించగా మిగిలిన భూమిని పేదలకు పంచాలన్నది అప్పటి వైఎస్ ప్రభుత్వ సంకల్పం. కానీ పర్యావరణ, న్యాయపరమైన అంశాలు ముడిపడి ఉండటంతో కాంటూరు కుదింపు జరగలేదు.వైఎస్ హయాంలో రూ.1300 కోట్లతో కొల్లేరులో ప్రత్యేక పునరావాస ప్యాకేజీని అమలు చేశారు. వైఎస్సార్ హయాంలో ప్రతిపాదించిన రెగ్యులేటర్ నిర్మాణ ప్రతిపాదనకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో కదలిక వచ్చింది. కొల్లేరులోని సర్కారు కాలువపై కీలకమైన వంతెన నిర్మాణానికి వైఎస్సార్ హయాంలో నిధులు మంజూరు చేసినప్పటికీ ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం దాన్ని చేపట్టలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఆ వంతెన నిర్మాణం పూర్తి చేయడం గమనార్హం.పెద్దొడ్డి మాటేశిరోధార్యం..కొల్లేరులో భిన్నమైన మనస్తత్వాలు కలిగిన వారు జీవించొచ్చు కానీ వారిలో భిన్నమైన మాటలు మాత్రం ఉండవు. వ్యక్తిగత, సామాజిక, రాజకీయ అంశాలైనా అక్కడ ఊరి పెద్దగా చెలామణి అయ్యే పెద్దొడ్డి (పెద వడ్డి) మాటే శిరోధార్యం. రెండు జిల్లాల్లోని 122 గ్రామాల్లోను ప్రజలందరూ కలిసి కొందరికి పెద్దరికం కట్టబెడతారు. తొలినాళ్లలో బయట వారి నుంచి రక్షణ కల్పించుకునేందుకు, వ్యక్తిగత ఇబ్బందుల నుంచి బయట పడేందుకు తమకు తాముగా సంఘాలు పెట్టుకుని నాయకులను (పెద్దొడ్డి) పెట్టుకునే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది.గ్రామ పంచాయతీల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు అతీతంగా ఒక్కో గ్రామంలో నలుగురి నుంచి 12 మంది వరకు పెద్దొడ్డిలుంటారు. ఏ సమస్య వచ్చినా గ్రామం నడిబొడ్డున ఉండే చావిడి, ఆలయంలో పెద్దొడ్డిలను ఆశ్రయిస్తారు. సాధారణంగా అందరూ పనులు పూర్తి చేసుకుని ఇళ్లకు వచ్చాక సాయంత్రం సమయంలో ఈ పంచాయతీలు నడుస్తుంటాయి. రెండు వైపులా వాదనలు విని స్థానిక న్యాయస్థానాలు మాదిరిగా వారిచ్చే తీర్పును ప్రజలు ఆచరిస్తారు. చిత్రం ఏమిటంటే పేచీలు పెట్టుకుని వారు పోలీస్ ఠాణాలు, బయటి వారి గడప తొక్కరు. దశాబ్దాలు గడిచినా అదే కట్టుబాటు ఇప్పటికీ కొనసాగుతుండటం విశేషం.ఒడిశా నుంచి వలసొచ్చి...విస్తరించిపొట్ట చేతపట్టుకుని రాష్ట్ర సరిహద్దులు దాటి ఒడిశా నుంచి వలసొచ్చిన 50 కుటుంబాలు శాఖోపశాఖలుగా విస్తరించి కొల్లేరులో గ్రామాలను నిర్మించాయి. దాదాపు 150 ఏళ్ల కిందట వచ్చిన వడ్డెర (వడ్డీలు) కులానికి చెందిన వలస జనం ప్రధానంగా చేపల వేటపైనే ఆధారపడి బతికేవారు. ఎటుచూసినా నీరు, మధ్య దిబ్బలాంటి ప్రాంతాల్లో దట్టమైన పొదలతో అడవికంటే భయంకరంగా ఉండే ఆ ప్రాంతంలో మానవమాత్రుడు ఉండటం కష్టంగా ఉండే రోజుల్లోనూ నాగరికతకు దూరంగా బతకడం మొదలైంది. పొదలు, తుప్పలను బాగుచేసి కొల్లేరులో దొరికే కిక్కిసకర్రలతో చిన్నపాటి గుడిసె (పాకలు) వేసుకుని జీవించేవారు.కొల్లేరు నీటి అడుగు దొరికే అలిపిరి కాయలు, కాలువ దుంపలను ఆహారంగా తినేవారు. కొల్లేరులో సహజసిద్ధంగా పెరిగే నల్లజాతి చేపలు పుష్కలంగా ఉండటంతో వాటిని వేటాడి బయట ప్రాంతాల్లో విక్రయించి కుటుంబాలను పొషించుకునే వారు. వడ్డీలతోపాటు సమీప ప్రాంతాల్లోని ఎస్సీలు కూడా కొల్లేరులో స్థిరపడి చేపల వేటపై జీవనం సాగిస్తున్నారు.జీవన చిత్రాన్ని మార్చేసిన చెరువులుకొల్లేరులో చేపల చెరువులు ఆ ప్రాంత వాసుల జీవన చిత్రాన్ని మార్చేశాయి. చిత్రం ఏమిటంటే కొల్లేరు వాసులు బతకడం కోసం గతంలో కొల్లేరులో చేపల చెరువులు తవ్వకపోతే ప్రభుత్వం కేసులు పెడితే...జనజీవనానికి ప్రమాదంగా పరిణమించిన కాలుష్యకారక చేపల చెరువులను తొలగించకపోతే కేసులు పెట్టాల్సిన పరిస్థితి వరకూ వచ్చింది. కొల్లేరులో చేపల వేటపైనే ఆధారపడిన వారికి మేలు చేసేలా సొసైటీలుగా ఏర్పడి ప్రభుత్వ భూముల్లో చెరువులు తవ్వుకునేలా 1976లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు నిర్ణయం తీసుకున్నారు.కొల్లేరు వాసులకు దానిపై అవగాహన కల్పిస్తూ శృంగవరప్పాడు గ్రామంలో తొలి సొసైటీ చెరువు తవ్వకానికి శంఖుస్థాపన చేశారు. సహజసిద్ధంగా చేపల వేటపై ఆధారపడి బతికే తమ పొట్ట కొట్టేందుకు ప్రభుత్వం సొసైటీ చెరువులు తవ్విస్తోందంటూ కొల్లేరు వాసులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టారు. వారిని కట్టడి చేసేలా కేసులు పెట్టి, నిర్బంధంగా చెరువులు తవ్వేలా అప్పట్లో ప్రభుత్వం వ్యహరించింది. క్రమంగా సొసైటీల పేరుతో కొల్లేరులో ప్రాంతాలు విభజించుకుని కొల్లేరు వాసులు చేపలను వేటాడుకుని మెరుగైన జీవనానికి అలవాటు పడ్డారు.కొల్లేరుపై కన్నేసిన పొరుగు ప్రాంతాల వాళ్లు రంగంలోకి సొసైటీలకు డబ్బులు (లీజు)ఇచ్చి చెరువులు తవ్వి పెద్ద ఎత్తున చేపలసాగు చేపట్టడంతో పర్యావరణ సమస్య ఉత్పన్నమైంది. దీంతో పర్యావరణ సంస్థలు పోరాటంతో న్యాయస్థానాల ఆదేశాలతో ప్రభుత్వం కొల్లేరు పరిరక్షణకు 120 జీవో జారీచేయడం, చేపల చెరువుల తొలగింపునకు(కొల్లేరు ఆపరేషన్) నిర్వహించడం చకచకా జరిగిపోయింది.మగ బిడ్డకూ వాటా..రెండు జిల్లాల్లో తొమ్మిది మండలాల్లో విస్తరించిన కొల్లేరు ప్రాంతంలో ఇప్పుడు 80 వేల కుటుంబాల్లో మూడు లక్షల 30 వేల మంది జీవిస్తున్నారు. రెండు లక్షల పది వేల మంది ఓటర్లున్న కొల్లేరులో ఉన్న సొసైటీలు, గ్రామాలు వారీగా ఉన్న చెరువుల ఆదాయం (లీజు)లో ప్రతీ కుటుంబంలోను పెద్దకు వాటాలు ఇస్తారు. పుట్టిన మగ బిడ్డకు కూడా వాటాలు వేస్తారు. కొల్లేరుకు అక్కడివారు వలసరాక ముందే కొల్లేటి కోటలో వెలసిన పెద్దింట్లమ్మ అమ్మవారే ఆయా ప్రాంత వాసులకు పెద్దదిక్కు. ప్రతీఏటా అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. పెద్దయ్యాక వాటా ఇస్తారు. -
పిచ్చుకను కాపాడిన బుడతలు..! ఇంతకీ ఏం జరిగిందంటే?
మారుతున్న కాలక్రమేనా పిచ్చుకల జాతే కాదు.. మిగతా మూగ ప్రాణులన్నీ కూడా జాడ లేకుండా పోతున్నాయి. ఈ ఎండలో దాహానికి అలమటిస్తున్నాయి. అలాంటి ఘటనే ఓ పిచ్చుకకి జరగడంతో.. ఈ చిన్నారులు చేసిన గొప్పపనేంటో చూద్దామా!రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లికి చెందిన ముగ్గురు చిన్నారులు బుధవారం ఓ పిచ్చుకను కాపాడి శభాష్ అనిపించుకున్నారు. వేసవి సెలవులు కావడంతో ఆడుకునేందుకు మండెపల్లికి చెందిన గదగోని నిహాంత్, హర్షిత్, త్రినయ్ సిరిసిల్లలోని బతుకమ్మఘాట్ వద్దకు బుధవారం వెళ్లారు.ఆ సమయంలో నీరు దొరక్క ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పిచ్చుకను గమనించి.. వెంటనే దాన్ని తమ చేతుల్లోకి తీసుకొని వెంట తెచ్చుకున్న వాటర్‌బాటిల్ మూతలో నీరు పోసి తాగించారు. కొద్దిసేపు సపర్యాలు చేయడంతో తేరుకుంది. వెంటనే తుర్రన ఎగిరిపోయింది. పిచ్చుక ప్రాణాన్ని కాపాడిన చిన్నారుల సంతోషానికి అవధులు లేవు.ఇవి చదవండి: World Turtle Day: నారి.. తాబేలు మేలు కోరి! -
మిమిక్రీ చేసే పక్షులు!
అండమాన్ దీవుల్లో నేను, నా భర్త రోమ్ ఒక రోజు తెల్లవారుజామున రెండు పిల్లులు అరుస్తూ కొట్టుకుంటున్నట్టు వినిపించిన శబ్దాలకు నిద్ర లేచాము. నిద్ర కళ్ళతో బాల్కనీకి వెళ్లి అడవిలో ఆ శబ్దాలు వస్తున్న వైపు చూసాము. ఆశ్చర్యంగా ఆ రెండు శబ్దాలు చేస్తున్నది పొడుగు తోకల ఏట్రింత (రాకెట్ టైల్డ్ డ్రోంగో) అనే పక్షి అని తెలుసుకుని ఆశ్చర్యపోయాము. ఒకసారి సముద్రపు గ్రద్ద వలె, మరోసారి దర్జీ పిట్టలా, మధ్యలో లారీ హార్న్ శబ్దాలను నమ్మశక్యం కానీ రీతిలో అనుకరిస్తున్న ఆ పక్షి అనుకరణలు గమనించాము. ఒక పక్షికి ఇంత అద్భుతమైన అనుకరణ (మిమిక్రీ) చేయవలసిన అవసరం ఏముంది?ఏట్రింతలు ఇతర జాతుల పక్షులతో కలిసి వేటాడుతూ ఉంటాయి. ఇతర పక్షుల జాతులతో కలిసి ఒక జట్టుగా ఏర్పడుట కోసమే ఇవి వాటి అరుపులను అనుకరిస్తాయని శ్రీలంక పక్షి శాస్త్రవేత్తలు భావిస్తారు. ఈ అనుకరణ యాదృచ్చికమో లేక కావాలని చేసే అనుకరణో కచ్చితంగా చెప్పడం కష్టం.ఇతర పక్షులు తమ ఆహారాన్ని తినే సమయంలో ఏట్రింతలు ఘాతుక పక్షుల ముప్పు లేకుండా కాపలా కాస్తుంటాయి . ఏదైనా ఘాతుక పక్షి దగ్గరగా వచ్చినట్లైతే ఆ ఘాతుక పక్షిపై మూకుమ్ముడిగా దాడి చేయడానికి ఇతర పక్షుల హెచ్చరిక అరుపులను అనుకరిస్తూ వాటిని ప్రోత్సాహిస్తాయిని భావిస్తారు.కొద్దిసేపటి క్రితం మేము ఒక జాలె డేగ, వంగ పండు పక్షిపిల్లని పట్టుకుని తింటూండటం చూసాము. దాని సమీపంలోనే నల్ల ఏట్రింత, జాలె డేగ అరుపులను అనుకరించినా, ఆ డేగ పట్టించుకోలేదు. దీనినినిబట్టి ఏట్రింతలు ప్రతీసారి మూకుమ్మడి దాడి కోసమే అనుకరిస్తాయని భావించలేము. కొన్ని సందర్భాలలో పక్షులు తమ చుట్టుపక్కల విన్న శబ్దాలను అనుకరించవచ్చు, ముఖ్యంగా అవి ఒత్తిడికి గురైనప్పుడు లేక మొదటి సారి ఆ శబ్దం విన్నప్పుడు ఆ విధంగా అనుకరించవచ్చు.చిలుకలు మరియు మైనా జాతి పక్షులు మనుషులను అనుకరించగలవు. ఇలా అనుకరించడం కోసం వాటికి చిన్నప్పటినుంచే తర్ఫీదు ఇస్తారు. అవి మనుషుల మాటలను సరిగ్గా అనుకరించగానే వాటికి ఆహారాన్ని బహుమానంగా ఇస్తూ ఈ విధంగా నేర్పిస్తుంటారు. చిలుకలు వాక్క్యూమ్ క్లీనర్ చేసే శబ్దాన్ని, టెలిఫోన్ రింగు, కుక్క అరుపులను కూడా అనుకరించగలవు. ఐన్స్టీన్అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ఆఫ్రికా దేశపు చిలుక, అమెరికాలోని నాక్స్విల్లె జూలోని తోడేళ్లు , చింపాంజీలు, కోళ్లు, పులులు మరియు ఇతర జంతువుల అరుపులను అనుకరించేది. ఈ అనుకరణ విద్య అవి సహజసిద్ధంగా బ్రతికే అడవుల్లో జీవించేందుకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆలోచించవలసిన విషయము. అడవిలో సమూహంగా జీవించే చిలుకలు సామూహిక బంధాన్ని బలపర్చుకోవడానికి ఒకటినొకటి అనుకరించుకుంటూ ఉంటాయని ఆస్ట్రేలియాలోని డీకిన్ విశ్వవిద్యాలయలోని లారా కెల్లీ అన్నారు. అవే చిలుకలు పంజరంలో బంధించినట్లైతే వాటి సమీపంలోని మనుషులను అనుకరిస్తాయి. ప్రపంచంలో ఈ అనుకరణ విద్యలో ఆస్ట్రేలియాకి చెందిన "లైర్ బర్డ్" చాలా ప్రముఖమైన పక్షి . యూట్యూబ్‌లో ఒక వీడియోలో ఈ పక్షి, కార్ రివర్స్ చేసే శబ్దాన్ని, కెమెరా క్లిక్ శబ్దాన్ని, చైన్ సా , చెట్లు పడిపోయే శబ్దాన్ని, తుపాకి, వాద్య పరికరాలు, ఫైర్ అలారం, పసి పాపాల ఏడుపు, రైళ్లు, మనుషులు, ఈ విధంగా అనేక రకాలైన శబ్దాలను అనుకరించడం చూడవచ్చు. మగ పక్షులు ఆడ పక్షులను ఆకర్షించడానికి ఎంతో కష్టపడి అనేక రకాల శబ్దాలను అనుకరిస్తూంటాయి కనుక ఆడ పక్షులు ఏ మగ పక్షైతే ఎక్కువ శబ్దాలను అనుకరిస్తుందో దాన్ని భాగస్వామిగా ఎంచుకోవచ్చు అని కొందరు భావిస్తూంటారు. కానీ ఐరోపా జీవశాస్త్రవేత్తలు ఈ సిద్ధాంతాన్ని నిరూపించానికి ఎటువంటి ఆధారం దొరకలేదు అంటున్నారు. మరొక శూన్యవాద సిద్ధాంతం ప్రకారం ఈ అనుకరణ వలన ఎటువంటి ఉపయోగం ఉండదు, అది కేవలం సాధన మాత్రమే అని భావిస్తుంటారు. ఆఫ్రికాలోని కలహారి ఎడారిలో కనిపించే ఏట్రింతలు ఈ అనుకరణ విద్యని ఉపయోగించి తెలివిగా ఆహారాన్ని సంపాదించుకుంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పక్షులు తమ పరిసరాల్లోని ఇతర పక్షులు లేక జంతువులు ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు, ఘాతుక పక్షులు లేక వాటిపై దాడి చేసే ఇతర జంతువులు అరుపులను అనుకరిస్తాయి. ఆ శబ్దాలను విన్న ఆ జంతువులు లేక పక్షులు భయంతో ఆహారాన్ని వదిలి వెళ్ళగానే ఏట్రింతలు ఆ ఆహారాన్ని దొంగిలిస్తాయి. ఇప్పటి వరకు “పక్షుల అనుకరణ” వలన అవి పొందే ప్రయోజనాలలో ఇది ఒక్కటే నిరూపితమైనది.ఈ అండమాన్ దీవుల్లో మేము చూసిన ఏట్రింత కూడా ఇదే విధంగా ఆహారంగా కోసం అనుకరిస్తుందా? ఇది తెలియాలంటే కొంత సమయం మరియు పరిశీలన అవసరం. ఈ అనుకరణ విద్యను ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లోని పక్షులు ప్రదర్శిస్తాయి కనుక ఈ చర్యని వివరించడానికి ఓకే వివరణ అన్నింటికీ వర్తింపచేయలేమని కెల్లీ అభిప్రాయపడతారు.ఈ ఆలోచనల మధ్యలో, డిష్ వాషర్లు, అంబులెన్సు శబ్దాలను కూడా అనుకరించే వాటి సామర్ధ్యానికి, ప్రకృతినే ఒక సంగీత వర్ణమాలగా ఉపయోగించే అద్భుతమైన నైపూణ్యానికి నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. రచయిత - జానకి లెనిన్ ఫోటో క్రెడిట్: సుభద్రాదేవితెలుగులో ప్రకృతి గురించి రాయాలనుకునే వారు ఈ ఫారమ్‌ను నింపండి- bit.ly/naturewritersపుడమి సాక్షిగా అనే కార్యక్రమం సాక్షి మీడియా గ్రూప్ చేపట్టిన పర్యావరణ హిత క్యాంపెయిన్. దీని గురించి మరింత 'సమాచారం తెలుసుకోవడానికి విజిట్ చేయండి. www.pudamisakshiga.com -
జార్ఖండ్‌లో బర్డ్ ఫ్లూ.. ఆరోగ్యశాఖ అప్రమత్తం!
జార్ఖండ్‌లో బర్డ్ ఫ్లూ విస్తరిస్తోంది. రాంచీలోని పౌల్ట్రీ ఫామ్‌లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. హోత్వార్‌లోని ప్రాంతీయ పౌల్ట్రీ ఫామ్‌లో కేసులు నిర్ధారణ అయిన దరిమిలా పలు కోళ్లతో సహా నాలుగు వేల వివిధ రకాల పక్షులను అంతమొందించారు. వందలాది గుడ్లను ధ్వంసం చేశారు. ఏవియన్ ఫ్లూ(బర్డ్ ఫ్లూ) కనిపించిన ప్రాంతం నుంచి ఒక కిలోమీటరు పరిధిలో చికెన్, కోళ్లు, గుడ్లు అమ్మకాలను నిషేధించారు. రానున్న రోజుల్లో ప్రాంతీయ పౌల్ట్రీ ఫామ్‌లోని కోళ్లను శాస్త్రీయ పద్ధతుల ద్వారా తొలగించనున్నారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కోళ్లు, ఇతర పక్షులు, గుడ్లు కొనుగోళ్లు, అమ్మకాలపై పూర్తి నిషేధం ఉంటుందని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. జిల్లా వైద్యశాఖ అధికారులు బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతంలోని ఇంటింటికీ తిరుగుతూ అక్కడివారిని అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కూడా చనిపోయిన పక్షులు కనిపిస్తే తమకు తెలియజేయాలని ప్రజలను కోరింది. బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. -
పక్షుల నియంత్రణకు స్ప్రేడ్రోన్
విమానాల రాకపోకలకు పక్షులు తీవ్ర అంతరాయాన్ని కలిగిస్తున్నాయి. దీంతో తూర్పు నౌకాదళంలోని వైమానిక బృందం వినూత్న విధానాల్ని అమల్లోకి తీసుకొచ్చింది. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం, నేవల్ ఎయిర్ స్టేషన్ ఐఎన్‌ఎస్‌డేగా పక్కపక్కనే ఉన్నాయి. వీటి పక్కనే మడ అడవులు విస్తరించి ఉన్నాయి. అక్కడ నుంచి పక్షులు రాకపోకలు పెరుగుతుండటంతో.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. నేవల్ ఫ్లైట్స్ కూడా ఎగిరేందుకు అంతరాయం కలుగుతున్న తరుణంలో ఈ సమస్యని పరిష్కరించేందుకు నేవల్ ఏవియేషన్ అధికారులు వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. స్ప్రే డ్రోన్స్‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఐఎన్ఎస్ డేగా నుంచి వీటి ఆపరేషన్స్ నిర్వహించి.. పక్షులు ఎగరనీయకుండా నియంత్రించనున్నారు. ఎయిర్‌పోర్టు సమీపంలో ఉన్న చెట్లపై నీటిని స్ప్రే చేస్తే.. రన్‌వే సమీపంలోకి పక్షులు రాకుండా నిలువరించగలమనీ.. తద్వారా విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడదని తూర్పు నౌకాదళ వర్గాలు వెల్లడించాయి. – సాక్షి, విశాఖపట్నం -
Pudami Sakshiga : పైకి కనపడవు గానీ, ఈ బుజ్జి పిట్టల అల్లరి అంతా ఇంతాకాదు
వసంత రుతువు రాగానే చెట్లన్నీ పల్లవిస్తే, ఆ హరిత పల్లవాల లోంచి వినిపించే కోకిల గానం గురించి కవులు చెబుతారు. కాని, కాస్తంత ఆకుపచ్చదనం కనిపిస్తే చాలు, అనేక రకాల పక్షులు వచ్చి సంబరాలు చేసుకుంటాయి. జనావాసాల మధ్య పక్షులు ఏషియన్ గ్రీన్ బీ ఈటర్స్ పై సునీత పొత్తూరి ప్రత్యేక కథనం.. పచ్చని ప్రకృతికి బహుమతిగా మళ్లీ కొన్ని చెట్లనిద్దాం...చిన్ని పక్షిని పాడనిద్దాం -ఫైజ్ అహ్మద్ ఫైజ్ మేం టెర్రెస్ గార్డెన్ మొదలు పెట్టాక, మాకు ఈ చిన్ని అతిథుల సందడి పెరిగిందని చెప్పాలి. ఏషియన్ గ్రీన్ బీ ఈటర్స్(Asian green bee eaters)అన్ని రకాల పిట్టల లోనూ ఇదొక ఆకుపచ్చని ఆకర్షణ! ఈ మధ్య వీటి హాడావుడి ఎక్కువే అయింది. సాధారణ పిచుకల పరిమాణంలో ఉండే ఈ పక్షులు ఆకుపచ్చ రంగులో, కంఠం దగ్గర నీలంగాను, తలపైన పింగళవర్ణం(మిశ్రమ రాగి వర్ణం)తోను, తోక సన్నగా పుల్లలా సాగి, ఉంటుంది. తోక తో కలిపి 9 అంగుళాలు (పూర్వపుభాషలో అయితే జానా బెత్తెడు) ఉంటుంది. ఎంత తేలిక అంటే వెదురు కొమ్మ మీద అర డజను పిట్డలు దర్జాగావాలిపోతాయి! ఇందుకు అనుగుణం గా వాటి కాలి గోళ్లు కలసి ఉండటం వల్ల కొమ్మలపైన పట్డు నిలుస్తుందిట. కొమ్మ కదలకుండా ఒకదానికొకటి ఒరుసుకుని కూర్చున్న తీరు నులి వెచ్చని ఎండ లో చలి కాగుతున్నట్డుఉంటుంది.వెదురు మొక్క కొమ్మలకి అటు ఇటూ.. వాలి, పచ్చని తోరణంలా కనువిందు చేస్తుంటాయి. ఫ్లై కాచర్ అన్న పేరుకు తగ్గట్టు చిన్న చిన్న పురుగులను, తేనెటీగలనూ పట్టి తింటాయి. అయితే వేటాడే విధానం..అదొక కళ లా, ప్రత్యేకం గా ఉంటుంది. గాలిలో ఉండగానే తమ ఆహారాన్ని నోటికి అంకించుకుంటాయి. అలా అనిచటుక్కున మింగవు. నింపాదిగా ఇలా ఓ చెట్టుకొమ్మ మీద వాలి, తన ఆహారాన్ని పొడిచి వేరుచేసి తింటాయి. వీటి గూళ్లను మానవ సమూహాలకు దూరంగా లోతట్డు గా ఉండే పొదలు, గడ్డి భూములలో ఏర్పాటుచేసుకుంటాయిట. ఇవి వలస పక్షులు కావు. అంతరించి పోతున్న జాతుల లెక్కలోనూ లేవు. కాని,మాకు వానాకాలం లో కంటే, ఇలా శీతా కాలం లో మా ప్రాంతంలో ఎక్కువగా చూస్తాను. ఉదయం, సాయంత్రంవేళల్లో కోలహాలంగా గుంపులుగా వచ్చే వాటి అరుపు అనునాసికంగా, తంత్రీ వాద్యంలా ట్రిం...ట్రిం.. అంటూ ఉంటుంది. కొమ్మల మీదనుండి ఒక్కసారిగా ఎగిరి పోయేటప్పుడు చేసే శబ్దం మాత్రం అధికంగా ఉంటుంది. ఇది కాక, క్రిమి కీటకాలను వేటాడే పక్షుల నిత్య సందడి సూర్యోదయానికి ముందే మొదలౌతుంది. తేనె పిట్డలు, జిట్టంగి పిట్టలు, బుల్ బుల్(పిగిలి పిట్ట), తేనిటీగల్ని, పురుగుల్ని పట్టితినే పాసరైన్స్, వేటి కవే నిత్యంతమ కలకూజితాలతో- మధురారవాలతో ఉదయస్తమయాలు రాగరంజితం చేస్తుంటాయి. చలికాలం లో మా ముంగిట్లో ఉన్న కోవిదార చెట్టు (Bauhinia) సుందరంగా పూస్తుంది. వీటి మీద ఎగురుతూ తేనెపిట్టలు, passerines చేసే సందడి అంతా ఇంతా కాదు. కనిపించవు గాని, కొమ్మకొమ్మ కో సన్నాయీ...! ఆపిలుపులన్నీ పూలవేనేమో అనిపిస్తాయిసన్ బర్డ్స్ మందార పూలమీద అలా వాలి, ఇలా చటుక్కున తేనె సంగ్రహించి పోతుంటాయి. కెమెరాకి ‘యాక్షన్’ చెప్పేఅవకాశమే ఇవ్వవు. ఈ బుల్లి పిట్టలు గొంతు విప్పితే చెవులు చిల్లుపడాల్సిందే. పిట్ట కొంచెం కూత ఘనం అంటారుకదా.. అలా! పిగిలి పిట్టలు(Bulbul)- గుబురు తలల తో తోక కింద ఎర్రగా ఉండే ఈ పక్షులు మా టెర్రస్ పైన చేసే సందడి తక్కువేంకాదు. మీకు అలారం క్లాక్ అవసరం లేదు. తెల్లవారు జామునే మొదలు .. కిసకిసలు!బ్లాక్ రాబిన్– ఓ సారి నా నడక దారిలో ఓచిత్రం చూసాను. బ్లాక్ రాబిన్ తన ప్లమేజ్ లో ఆకుపచ్చని గడ్డిపరకలుటక్ చేసుకుని లాన్ లో తిరుగుతూ కనబడింది. ఫోటో తీద్దామనే ప్రయత్నం ఫలించలేదు. కింగ్ ఫిషర్ ఒకటి ఒకే సమయానికి దర్శనం ఇస్తూంటుంది. రివ్వున వాలి, కావలసినదేదో దొరకపుచ్చుకుని దూరంగా లైట్ స్తంభం మీదకి గెంతి .. కాస్త తాళి, ఎగిరెళ్లిపోతుంది. కన్నుమూసి తెరచేంతలోనే ఈ విన్యాసాలన్నీ..! ఒక నీలి ఈకను మాత్రం ఓసారి బహుమతి చేసింది. జిట్టంగి పక్షులు.– ఇళ్ల కప్పులెక్కి, ఈల వేస్తూ హెచ్చరిస్తూ సందడి చేస్తూంటాయి ఉదయాస్తమయాల వేళల్లో. సిల్వర్ బిల్ మునియాలు. గుంపుగా వచ్చి, తమ చిన్ని ముక్కులను నీటి లో తడుపుకొని, జలకాలాడుతూ తెగ సందడి చేస్తాయి. వెదురు ఆకులను ఒడుపుగా చీల్చి గూటికోసం తీసుకుని పోతూంటాయి. అరగదీసినట్లు నునుపు దేలిన ముక్కు(bill), పొట్ట భాగం లో స్కేలింగ్ వుండి కాస్త బ్రౌన్‌గా ఉండే ఈ పిచుకల్లాటి మునియాలు గార్డెన్ లో చెట్ల కొమ్మల్లో జంటలుగా వచ్చి వాలుతాయి. మన ఇళ్ల దగ్గర ప్రమాదస్థాయిలో బ్రీడింగ్ అవుతున్న మరో పక్షి పావురం. పావురాళ్లు గూడు పెట్టని చోటు లేదు. వాటి సంతతి పెరిగిపోతూనే ఉండటంతో, కొన్ని వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నదని హెచ్చరిస్తున్నారు. పావురాలకు ధాన్యపు గింజలను వేయడం వల్ల సహజమైన ఆహారవేటను ఆపేసాయంటారు. ఏదేమైనా చిన్న చిన్నపావురాల కువకువలు మాత్రం బాగుంటాయి. ఇక పోతే కాకులూ, పిచికలూ ఒకప్పుడు మనకి సర్వసాధారణంగా కనిపించే పక్షులు. మన సంస్కృతి లో భాగం.పిచికలకు ముంగిట్లో ధాన్యపు కంకులను వేలాడదీసేవారు. కాకులు సరేసరి. మన పితృదేవతలు కాకిరూపం లోవచ్చి పిండం ముట్టి పోతాయని నమ్మకం.కాని ఇవీ ఇపుడు అరుదైపోయాయిఎక్కడపడితే అక్కడ విచక్షణారహితంగా సెల్ టవర్స్ నిర్మింవడం వల్ల, ఎలక్ట్రో మాగ్నటిక్ రేడియేషన్ కి, దాదాపు ఊర పిచుకలు తుడిచి పెట్డుకుని పోయాయి. అలాగే కాకులు కూడా, పట్టణీకరణ పేరుతో వాటి ఆవాసాలనుంచి,వాటికి అనుకూలమైన చోట గూళ్లు ఏర్పరుచుకుని, సంతానోత్పత్తి చేయడానికి వీలు లేకుండా తరిమి వేయబడ్డాయి. పక్షులు పర్యావరణానికి ఎంత మేలు చేస్తాయి అన్నది ప్రత్యేకించి ఎవరికీ చెప్పనక్కరలేదు. క్రిమి కీటకాల బెడదనుంచి పంటలను కాపాడ్డం తో బాటు, పాలినేషన్కు విత్తనాల విస్తరణకు పక్షుల ఉనికిఅవసరమన్నది అందరికీ తెలిసిన సంగతే. ప్రకృతిమీద జరిపిన తిరుగుబాటు వల్ల కలిగిన దుష్పరిణామం ఏమిటో చైనా ఉదంతం ఒకటి చెబుతారు. ఆహారధాన్యాలను పిచుకలు తింటున్నాయని, పిచుకలను పట్డి చంపిస్తారు చైర్మన్ మావో సమయంలో. తర్వాత వాటి పొట్ట కోసి చూసి తెల్లబోయారట శాస్త్రజ్ణులు. ఆహారధాన్యాల కంటే ఎక్కువ క్రిమి కీటకాలను పట్టి తింటాయనితెలిసి. ఆ తరవాత క్రిమికీటకాల అదుపు లేక పంట నష్టం తీవ్రమై కరవు సంభవించిందిట. మిడతలను చంపడానికి క్రిమి కీటకాల నాశకాలను వాడగా, ఫలితంగా భూమిలోని సారం తగ్గిపోయిందిట. ఇదొక గుణపాఠం. అయినా...మనిషి మారలేదు; ఆతని కాంక్ష తీరలేదు–అని సినీకవి తీర్పు ఇచ్చినట్టు జరిగేవి జరుగుతూనే ఉన్నాయి.ప్రకృతిలో సమతౌల్యతకు పక్షుల ఉనికి ఎంత అవసరమన్నది మానవాళికి అర్థం అయేసరికి, ఆధునీకరణ పేరుతో చాలా నష్టమే జరిగిందని చెప్పుకోవాలి. అందుచేత నేడు ఆవాసాల వద్ద ఎంతో కొంత గ్రీనరీ వుండేలా చూసుకోవడంసామాజిక బాధ్యత అయింది. రచయిత : సునీత పోతూరి ఫోటో : శ్యాం సుందర్ తెలుగులో ప్రకృతి గురించి రాయాలనుకునే వారు ఈ ఫారమ్‌ను నింపండి- bit.ly/naturewriters పుడమి సాక్షిగా అనే కార్యక్రమం సాక్షి మీడియా గ్రూప్ చేపట్టిన పర్యావరణ హిత క్యాంపెయిన్. దీని గురించి మరింత 'సమాచారం తెలుసుకోవడానికి విజిట్ చేయండి. www.pudamisakshiga.com -
సైబీరియన్ కొంగలు ఎక్కడ ?
-
పక్షులు డైనోసార్ల వంశమా?
డైనోసార్లకు సంబంధించిన విషయాలను మనం వింటూనే ఉంటాం. డైనోసార్లు భూమిపై మనుగడసాగించిన అతిపెద్ద జంతువులనే విషయం మనకు తెలిసిందే. సుమారు ఆరున్నర బిలియన్ సంవత్సరాల క్రితం ఒక భారీ ఉల్క భూమిని తాకింది. ఫలితంగా డైనోసార్ల ఉనికి తుడిచిపెట్టుకుపోయింది. అయితే డైనోసార్ల వంశం ఇప్పటికీ భూమిపై ఇంకా సజీవంగా ఉందని తెలిస్తే ఎవరైనా ఆశ్యర్యపోతారు. ఇది వినడానికి వింతగా అనిపించినా ఇదే నిజం. పక్షులు డైనోసార్ల వంశం అని చెబుతారు. దీని వెనుకగల కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న పక్షులు డైనోసార్ల వంశానికి చెందినవని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీనిని అనుసరించి చూస్తే డైనోసార్లు ప్రపంచం నుంచి పూర్తిగా అంతరించిపోలేదు. డైనోసార్లు, పక్షులు కలిసి జీవించడమే దీనికి కారణం. కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం డైనోసార్లు అంతం అయ్యాయి. అయితే పక్షులు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాయి. అయితే శాస్త్రవేత్తలు దీనికి సంబంధించి ఎటువంటి ప్రామాణిక రుజువును ఇంకా అందించలేదు. దీనిని నిరూపించడానికి భిన్నమైన సిద్ధాంతాలను వెలిబుచ్చారు. డైనోసార్ల శరీర నిర్మాణం.. పక్షుల శరీర నిర్మాణాన్ని పోలివుంటుందని తెలిపారు. నాడు జరిగిన మహా విపత్తు నుంచి పక్షులు ఎలా బతికాయనేదానికి శాస్త్రవేత్తలు ఇంకా ఖచ్చితమైన కారణం కనుగొనలేదు. అయితే గ్రహశకలం భూమిని ఢీకొన్న తర్వాత దంతాలు లేని పక్షులు మాత్రమే జీవించాయని వారు చెబుతున్నారు. దీనికి సరైన సిద్ధాంతం ఇంకా వెలువడలేదు. ఈ సిద్ధాంతాలను శాస్త్రవేత్తలు తమ పరిశోధనల నేపధ్యంలో వెల్లడించారు. -
చక్రవాకాలు: ఆ స్త్రీల కోసం మొసళ్లు కూడా తోడుగా
'పాస్‌పోర్ట్ లేని అతిథులు పక్షులు. అవి మనల్ని ఫుడ్ అడగవు. వెచ్చటి బెడ్‌రూమ్‌లూ అడగవు. తొణికిసలాడే నీటి తావూ, వాలడానికి విస్తారంగా చెట్లు ఉంటే చాలు. కాని అవి వచ్చినప్పుడు వాటిని నమిలి మింగుదామనుకుంటే?.. కుదరదు అంటున్నారు స్త్రీలు. కేవలం డజన్ మందే. ఒడిశాలోని అరాచండిలో ప్రతి శీతాకాలం వచ్చే అరుదైన పక్షులను కాపాడి తిరిగి ఇళ్లకు పంపుతారు.' అంతా కలిపి ఒకటిన్నర చదరపు కిలోమీటర్లు. తేమ మైదానాలు. భువనేశ్వర్ నుంచి గంటన్నర దూరంలో ఉన్న ‘బంకి’ అనే ఊళ్లో ఉంటాయి. వాటిని ‘అరాచండి మైదానాలు’ అని పిలుస్తారు. అక్కడకు ప్రతి సంవత్సరం చలికాలంలో చలి దేశాల నుంచి వలస పక్షులు వస్తాయి. బూడిద కొంగలు, వల్లంకి పిట్టలు, పెయింటెడ్ స్టార్క్స్, చక్రవాకాలు (రడీ షెల్డక్)... ఇంకా డజను రకాల పక్షులు వస్తాయి. సెప్టెంబర్ – అక్టోబర్ నెలల్లో ఇవి వలస వచ్చి ఫిబ్రవరి–మార్చి నాటికి తిరిగి సొంత ప్రాంతాలకు మూట ముల్లె సర్దుకుని వెళ్లిపోతాయి. దేశం కాని దేశం ఎందుకు వస్తాయవి? మనుషుల్ని నమ్మి. ఆ నమ్మకం అందరూ నిలబెట్టుకోరు. కొందరు నిలబెట్టేందుకు నడుం కడతారు. ఆ పన్నెండు మంది ఈ మైదానాల పక్కనే ఉండే నిస్తిపూర్ అనే గ్రామంలో నివసించే సూర్యకాంతి మొహంతి అనే గృహిణి ఒకరోజు ఈ తేమ మైదానాల వైపు వచ్చింది. అక్కడ కొంతమంది వేటగాళ్లు ఈ అందమైన పక్షులు, వలస వచ్చిన అతిథులను వేటాడుతూ కనిపించారు. ఆమె మనసు వికలమైపోయింది. తమ ఊరిని ఈ పక్షులు క్షమిస్తాయా అనిపించింది. వెంటనే ఊళ్లో ఉన్న ఇతర గృహిణులకు ఈ విషయం చెప్పడం మొదలుపెట్టింది. ‘అందరం కలిసి పక్షులను కాపాడదాం’ అంది. చాలామంది పట్టించుకోలేదు. ‘లగాన్’ సినిమాలో ఒక్కొక్కరూ దొరికినట్టు కేవలం 12 మంది గృహిణులు అంగీకరించారు. వీరంతా తమ భర్తలకు విషయాన్ని చెప్పి ఒప్పించారు. భర్తలు అంగీకరించాక 12 మంది కలిసి ‘అరాచండి పక్షి సురక్షా సమితి’ గా ఏర్పడ్డారు. ఆ తర్వాత ఆ పక్షులకు వారే తల్లిదండ్రులు, కాపలాదారులు, సైనికులుగా మారారు. పక్షుల కోసమని.. ‘ఈ పక్షులు ఎంతో సున్నితమైనవి. కాలుష్యం బారిన పడితే చచ్చిపోతాయి. అందుకే పక్షులను చూడటానికి వచ్చే వారిని ఇక్కడ చెత్త వేయకుండా అడ్డుపడ్డారు. అలాగే పిక్నిక్ల పేరుతో వచ్చి హారన్లు కొట్టడం, పాటలు పెట్టి సౌండ్లు చేయడం కూడా నిరోధించాం. ఈ పక్షులు చుట్టుపక్కల పొలాల నుంచే ఆహారాన్ని పొందుతాయి. అందుకే రైతుల దగ్గరకు వెళ్లి క్రిమిసంహారక మందులు ఉపయోగించని సేంద్రియ పంటలే పండించమన్నాం. రైతులు మా వేడుకోలును మన్నించారు. పక్షులు ఉన్నంత కాలం ప్రతి రోజూ మేము ఈ ప్రాంతానికి వచ్చి కాపలా కాస్తాం. ప్లకార్డులు ప్రదర్శిస్తాం. చెత్త లేకుండా చూస్తాం’ అంటారు ఈ పన్నెండు మంది గృహిణులు. మొసళ్లు తోడయ్యాయి.. అయితే ఈ స్త్రీలకు మొసళ్లు కూడా తోడయ్యాయి. ఇక్కడి నీటిమడుగుల్లో మొసళ్లు ఉంటాయి. వేటగాళ్లు నీటి లోపలికి చొచ్చుకొచ్చి పక్షులను వేటాడకుండా ఈ మొసళ్ల భయం అడ్డుకుంటోంది. ‘మొసళ్లు పక్షులకు కాపలా ఉన్నప్పుడు మనుషులు ఉండటానికేమి?’ అంటారు ఈ స్త్రీలు. వీరి కృషి మెల్లగా పత్రికల ద్వారా ప్రభుత్వానికి తెలిసింది. అయినా సరే ప్రభుత్వం చేసే పని కన్నా ప్రజలు చేసే పనే ఎక్కువ ఫలితాన్ని ఇస్తోంది. ‘ఈ పక్షులను గమనిస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి. చక్రవాకాలు గొప్ప ప్రేమతో ఉంటాయి. ఒంటరి చక్రవాకాలను చూద్దామన్నా కనిపించవు. జంటగా ఉండాల్సిందే’ అంటారు ఈ స్త్రీలు. వీరి సేవకు ప్రభుత్వ మెచ్చుకోలుకన్నా ప్రకృతి ఆశీస్సులు తప్పక దొరుకుతాయి. ఇవి కూడా చదవండి: పక్షులు మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయా? అధ్యయనంలో షాకింగ్ విషయాలు -
పక్షులు మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయా?
మనుషుల మానసిక ఆరోగ్యంపై పక్షుల ప్రభావం కూడా ఉంటుందని విన్నారా?. అసలు మన మానసిక పరిస్థితికి పక్షులకు లింక్ ఏంటీ. అవి ఎలా మన మనఃస్థితిని ప్రభావితం చేయగలవు అనే కదా సందేహం!. అయితే పరిశోధకులు మాత్రం వాటి వల్లనే మన మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని నమ్మకంగా చెబుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారికి పక్షులను చూసే అవకాశం ఉండదు కదా! అని అడగొచ్చు దానికి శాస్త్రవేత్తలు ఏం అంటున్నారంటే.. పక్షులను చూడటం లేదా వీక్షించటం, వాటి కిలకిలరావాలను వినడం వంటివి చేస్తే తెలియకుండా మానసిక ప్రశాంతత చేకూరి సంతోషంగా ఉంటామని పరిశోధకులు చెబుతున్నారు. దీని వల్ల నిరాశ, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు ఉత్ఫన్నం కావని అన్నారు. ఈ మేరకు సుమారు 13 వందల మందిని క్షుణ్ణంగా అధ్యయనం చేయగా...పక్షులను చూడటం, వాటి శబ్దాలను విన్న వారి మానసిక ఆరోగ్యం బాగున్నట్లు గమనించారు. పక్షులతో పనిగట్టుకుని గడపడం మొదలుపెట్టాక నెమ్మదిగా మెరుగుదల కనిపించింది. ముఖ్యంగా ఈ మెరుగుదలను డిప్రెషన్‌తో బాధపడుతున్న వారిలోనూ, ఆరోగ్యవంతమైన వ్యక్తులలోనూ కనిపించాయన్నారు. అలాగే మరో అధ్యయనంలో పాల్గొన్న దాదాపు 295 మందిని పక్షులతో గడిపి తమ భావోద్వేగ స్థితిని స్వయంగా అంచనా వేసి చెప్పాలని కోరారు. వారంతా పక్షి పాటలను విన్నప్పటి నుంచి డిప్రెషన్ లక్షణాలు తగ్గుముఖం పట్టినట్లు తెలిపారు. అంతేగాదు మతిస్థిమితం, మరచిపోవడం వంటి రుగ్మతలు కూడా తగ్గినట్లు వెల్లడించారని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ, ప్రకృతితో గడపలేకపోయినా కనీసం పక్షుల కిలకిల రావాలను మనసును ఆహ్లాదపరిచి స్థిమ్మితంగా ఉండేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. మానసిక ఆరోగ్యంపై ప్రకృతి ప్రభావం చూపుతోందా? మానసిక ఆరోగ్యంపై ప్రకృతి చూపించే ప్రభావాన్ని సాఫ్ట్ ఫాసినేషన్గా చెప్పొచ్చు. మన దృష్టి ప్రకృతి వద్దకు వచ్చేటప్పటికీ విస్తృతంగా చూసేలా చేసి మెదడు తనను తాను రిఫ్రెష్ చేసుకునేలా చేస్తుంది. తద్వారా మానసిక ప్రశాంత పొంది, మతిమరుపు, మతిభ్రమించడం వంటి సమస్యలను దూరం చేస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే తనకు తానుగా బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. అంతేగాదు ప్రకృతి దృశ్యాలు, శబ్దాలు మనలను రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని దూరం చేసి ప్రతికూల ఆలోచనలను దరిచేరనివ్వదు. ఈ పరిశోధన జర్నల్ ఆక్యుపేషనల్ అండ్ ఇన్విరాన్‌మెంటల్ మెడిసన్‌లో ప్రచురితమయ్యింది. సామాజిక ఆర్థిక పరిస్థితి సంబంధం లేకుండా పచ్చని ప్రదేశాలను సందర్శిస్తే..వారి మానసిక స్థితి మాత్రమేగాక, యాంటీహైపెర్టెన్సివ్, ఆస్తమా వంటి సమస్యలు తగ్గుతాయని అధ్యయనంలో తేలిందన్నారు. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకైనా పక్షుల అభయారణ్యాలు, పర్వతాలు, బీచ్‌లు, సరస్సులు, నదులు వద్ద గడపండి అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. (చదవండి: సోనియా గాంధీ మెచ్చిన 'పప్పు అన్నం'! బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!) -
అత్యంత అరుదైన పక్షి! సగం ఆడ సగం మగ..!
గత వందేళ్లలో రెండోసారి అత్యంత అరుదైన పక్షి కనిపించిందని పరిశోధకుల బృందం పేర్కొంది. ఈ మేరకు యూనివర్సిటీ ఆఫ్ ఒటాగా జంతు శాస్త్రజ్ఞుడు ప్రొఫెసర్ హమీష్ స్పెన్సర్ కొలంబియాలో ఈ పక్షి జాతులను కనుగొన్నారు. ఆ పక్షికి సగం ఆకుపచ్చ అంటే ఒకవైపు ఆడ, మరొకవైపు సగం నీలం అంటే మరోవైపు మగ పక్షిలా ఈకలు ఉన్నాయి. దీన్ని శాస్త్రీయంగా ద్వైపాక్షిక గైనండ్రోమోర్ఫిక్ పక్షి అని పిలుస్తారు. ఇది ఆడ, మగ లక్షణాను ప్రదర్శిస్తుంది. అటువంటి పక్షుల్లో ఒకవైపు మగ ఈకలు ఉండి అందుకు అనుగుణంగా పురుష పునరుత్పత్తి అవయవాలు ఉంటాయి. అలాగే మరొక వైపు స్త్రీ ఈకలు ఉండి స్త్రీలో ఉండే ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి. అంతేగాదు ఈ పక్షిలో కణాలు ఆడ, మగ కణాలుగా విభజింపబడ్డాయట కూడా. ఇలా దాని జీవితాంతం కణాలు అలానే కొనసాగే అవకాశం ఉందన్నారు. అయితే ఇలా ఏ జాతి పక్షిలో ద్వైపాక్షిక గైనండ్రోమోర్ఫ్(ఆడ, మగ లక్షణాలు)ను చూడలేరన్నారు. ఈవిధంగా పక్షుల్లో అత్యంత అరుదుగా కనిపిస్తుంది. న్యూజిలాండ్‌లో ఇలాంటి పక్షిని తానింత వరకు చూడలేదని ఇది చాలా అద్భుతమైన విషయమని ప్రొఫెసర్ స్పెన్సర్ అన్నారు. ఈ పరిశోధన వివరాలు జర్నల్ ఆప్ ఫీల్డ్ ఆర్నిథాలజీలో ప్రచురితమయ్యాయి. వందేళ్లలో కనిపించిన వివిధ పక్షి జాతుల్లో ఇలా గైనండ్రోమోర్ఫిజం లక్షణాలను నమోదు చేసిన రెండో పక్షి ఇదే అని అన్నారు. ఈ పరిస్థితి స్త్రీ కణ విభజన సమయంలో ఏర్పడే లోపం కారణంగా ఇలాంటి పక్షులు పుట్టుకొస్తాయని అన్నారు. ఇక్కడ ఒక గుడ్డు, రెండు స్పెర్మ్‌ల ద్వారా రెండుసార్లు ఫలదీకరణం చెందితే ఇలా జరుగుతుందని ప్రొఫెసర్ స్పెన్సర్ వివరించారు. (చదవండి: రాత్రికి రాత్రే చెరువు మాయం చేసిన దుండగులు! తెల్లారేసరికి అక్కడ..!) -
నీలివర్ణంతో తళుక్కునే మెరిసే పాలపిట్ట.. అందుకే అంత స్పెషల్
పాల పిట్ట చుట్టూ ఎన్ని కథలో.. పసిడి పంటల్లే పచ్చని రంగునలుముకుంది, ఆకాశమళ్లే నీలి రంగు పులుముకుంది,అశ్వినీ మాసంలో అడుగులెడుతుంది,శుక్ల పక్షంలోశోభనిస్తుంది..పంటచేనుల్లో పరుగులెడుతుందివిజయ దశమికి విజయాలనిస్తుంది! ప్రపంచానితో పోటీ పడనంటుంది,నాగరికతతో నగరాలకు దూరమవుతుంది. అందాల హరివిల్లై విశ్వమంతా విస్తరించింది.పసిడి పరువాల విహంగం అద్భుతాల పాల పిట్ట !! దసరా రోజు.. పాలపిట్టను చూడకుంటే ఆ పండగకు అర్థమే లేదని చిన్న వెలతి ఉంటుంది. దాని ప్రత్యేకత అలాంటిది మరి! ఓటమి మీద గెలుపుకు నిదర్శనంగా చేసుకునే దసరా పండగ రోజు పాల పిట్టను చూస్తే ఎన్నో విజయాలతో పాటు సుఖ సంతోషాలు వరిస్తాయని అంటారు. అంటే పక్షులు కేవలం ప్రకృతిలో ఉండే ఒక జీవ రాశి మాత్రమే కాదు అవి మనుషుల జీవన విధానాలతో సంప్రదాయాలతో మమేకమై ఉంటాయి అన్నదానికి పాల పిట్ట ఒక ఉదాహరణ.అలాగని ఇది ఒక్క భారత దేశంలోనే కనిపించే పక్షి కాదు. కెనడా, అమెరికా ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కూడా అద్భుతమైన పసిడి, నీలం లాంటి రంగుల కలయికతో కనిపిస్తుంది. భారత దేశంలో పాల పిట్టకు ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనిచుట్టూ ఎన్నో వింతలు, విశేషాలు కూడా ముడిపడి ఉన్నాయి. పాలపిట్టతో మనిషికి యుగయుగాల సంబంధం ఉందంటే విడ్డూరమే కదా? కానీ ప్రతి యుగంలోనూ, పురాణ, ఇతిహాసాల్లో పాల పిట్ట ప్రస్తావన ఎదో ఒక విధంగా వస్తూనే ఉంటుంది.దక్షిణ భారత దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పాల పిట్టను నీల కంఠ పక్షి అని పిలుస్తారు(నీల కంఠ అంటే శివుడికి ఉన్న మరో పేరు) దాని గొంతు విషం తాగిన తర్వాత మారిన శివుడి గొంతు (నీలం) రంగులో ఉండటమే కారణం. అలాగే త్రేతా యుగంలో రాముడు రావణాసురుని మీద యుద్దానికి వెళ్లే ముందు పాల పిట్ట ఎదురు వచ్చిందట. అందుకే రాముడు రావణాసురుడిని చంపిన రోజు చెడు మీద మంచి విజయం సాధించిన రోజుకి ఆదర్శంగా దసరాగా జరుపుకోవడం అనేది ఒక సంప్రదాయం అయ్యింది. అదే రోజు పాల పిట్టలు ఎక్కడ ఉన్నా గ్రామాల్లోని పంట చేన్లలో, ఊరి పొలిమేరల్లో తిరగడం జరుగుతుంది. అశ్విని మాసంలో (అక్టోబర్ నెల) లో పంటలు చేతికి వచ్చే కాలం, అదే సమయంలో నవరాత్రులు, దసరా పండగలు జరుపుకోవడం జరుగుతుంది. అందుకే ఈ పాల పిట్టలు ఆహారం కోసం ఆ సమయాల్లో ఊర్లలో పంట పొలాల్లో కనిపిస్తాయి. పండగలు వాటి ప్రత్యేకతలు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉండటం మనం ఆశ్చర్యపడాల్సిన విషయమే.ద్వాపర యుగంలో పాండవులు వనవాసం చేసినప్పుడు వారి ఆయుధాలన్నీ జమ్మీ చెట్టు మీద దాచి ఉంచుతారు. అప్పుడు ఇంద్రుడు పాల పిట్టలా మారి ఆ చెట్టు మీద పాండవుల ఆయుధాలకు రక్షణగా ఉన్నాడు అని కూడా చెప్పుకుంటారు. అందుకే దసరా రోజు ఆయుధ పూజ అంటే అన్ని కుల వృత్తుల వారు వారి వారి జీవన ఆధారాలకు సంబందించిన వాటికి పూజలు చెయ్యడం కూడా జరుగుతుంది. ఇలా ఒక్కో యుగంలో ఒక్కో ప్రాంతానికి చెందిన సంప్రదాయాలతో ఒకే నెలలో జరిగే పండుగలకు పాల పిట్టకు అవినాభావ సంబంధం ఉంది. అందుకే పాల పిట్ట అనేది కేవలం ఒక పక్షి మాత్రమే కాదు అది మనుషుల సాంఘిక సమైక్యతను ప్రతిబింబిస్తుంది. ఒక భావోద్వేగం. పాల పిట్ట జీవన విధానం మనకు ఒక చిన్నపాటి పాఠం లాంటింది దాన్ని నిశితంగా పరీక్షిస్తే అది ఉదయం లేవగానే దాని చుట్టూ ఉన్న పరిస్థితులపైన నిఘా వేస్తుంది. ఎలాంటి అపాయాలు పొంచి ఉన్నాయి, అది నివసించే ప్రాంతం సురక్షితంగా ఉంటుందా? ఉండదా? అని విశ్లేషించుకుంటుంది. దాని పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది కానీ అవసరానికి అది దాని పరిమాణం రెండింతలు రెట్టింపు చేస్తుంది. పాల పిట్టలు ఎప్పుడు కూడా ఒక సమూహంలో ప్రయాణం చేస్తాయి అందువల్ల మిగతా బలవంతమైన పక్షులు దాడి చేసినప్పుడు కలిసి కట్టుగా పోరాడుతాయి. మనుషులు కూడా సామాజిక సాంఘిక జీవితంలో సంఘటితమై జీవించాలని అప్పుడే ఎలాంటి కష్టాలు వచ్చినా ఒకరికొకరు తోడుగా నిబడొచ్చు అని మనకు చూపిస్తాయి. పాల పిట్టల గొంతు దూకుడుగా ఉన్నా ఒకదానితో ఒకటి ఎంతో మృదు స్వభావంతో పలకరించుకుంటాయి. అందుకే పాల పిట్టలు నమ్మకానికి ఐక్యమత్యానికి ప్రతీకలు. ఎంతో ఎత్తులో ఎగురుతున్నా కూడా నెల మీద వాటి ఆహారం మీద దృష్టిని మాత్రం పోగొట్టుకోవు. వాటి కంటి చూపు చాలా సూక్షమైన క్రిమి కీటకాలను కూడా గుర్తిస్తాయి. ముఖ్యంగా పంట పొలాల్లో ఉండే చిన్న చిన్న వాన పాములు వీటి ఆహారం. చెట్లు వీటి ప్రాథమిక నివాస స్థలాలు అందుకే ఇవి ఎక్కువగా అడవుల్లో ఉద్యానవనాల్లో నివసిస్తాయి ఆహారం కోసం నీటి పరివాహక ప్రదేశాల్లో ఎక్కువగా తిరుగుతున్నాయి. పక్షులు మన చుట్టూ కనిపించకపోవడం వల్ల మనకు గ్లోబల్ వార్మింగ్ ఒక్కటే గుర్తొస్తుంది. కానీ అవి అంతరించిపోతున్నప్పుడు పర్యావరణ సమతుల్యం దెబ్బతిని మనుషుల జీవన ప్రమాణాలు కూడా మెల్లి మెల్లిగా అంతరించి పోతున్నాయనే విషయం చాలా ఆలస్యంగా అర్థమవుతుంది. ఒకప్పుడు గ్రామాల్లో విరివిగా విచ్చల విడిగా, చిన్న చిన్న నగరాలలోని ఉద్యానవనాల్లో చెట్ల మీద కనిపించిన పాల పిట్ట ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సమయంలో కనిపిస్తే మనం ఆశ్చర్యానికి గురవుతున్నాం. మరికొంత మంది వీటిని పంజరాల్లొ పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. అంటే దానికున్న ప్రత్యేకతలు అలాంటివి. అలాగే మనం నాగరిత ముసుగులో అడవులను, చెట్లను దూరం చేస్తూ వాటి మీద ఆధారపడుతున్న పక్షులను జంతువులను కూడా దూరం చేసుకుంటున్నాము. రచయిత : ప్రదీప్ మాడురి ఫోటో : అల్బిన్ జాకబ్ తెలుగులో ప్రకృతి గురించి రాయాలనుకునే వారు ఈ ఫారమ్‌ను నింపండి- bit.ly/naturewriters పుడమి సాక్షిగా అనే కార్యక్రమం సాక్షి మీడియా గ్రూప్ చేపట్టిన పర్యావరణ హిత క్యాంపెయిన్. దీని గురించి మరింత 'సమాచారం తెలుసుకోవడానికి విజిట్ చేయండి. www.pudamisakshiga.com -
చిట్టి బాతు... బుజ్జి కొంగ..!
‘ఇంత ఉదయమే ఎక్కడికి బయలుదేరావు?’ అని చిట్టిబాతును అడిగింది బుజ్జి కొంగ. ‘మా అమ్మమ్మగారి ఇంటికి వెళ్తున్నాను’ చెప్పింది చిట్టి బాతు. ‘నేను కూడా వస్తాను. నన్నూ మీ అమ్మమ్మగారి ఇంటికి తీసుకువెళ్ళవా?’ అడిగింది బుజ్జి కొంగ. ‘నిన్ను మా అమ్మమ్మగారింటికి తీసుకెళ్లడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ మీ అమ్మను అడుగు. అమ్మ వెళ్ళమంటే నాతో రా!’ అంది చిట్టి బాతు. ‘మా అమ్మ ఏమీ అనదు’ చెప్పింది బుజ్జి కొంగ. అయినా చిట్టి బాతు ‘అమ్మ ఒప్పుకుంటేనే’ అని పట్టుబట్టింది. ‘అయితే ఉండు.. క్షణంలో వెళ్లి అమ్మను అడిగొస్తాను’ అంటూ కొలను పక్కనే ఉన్న చెట్టు పైకి ఎగిరింది. కాసేపటి తర్వాత వచ్చి ‘అమ్మ వెళ్ళమంది’ అంది బుజ్జి కొంగ. ‘అయితే పదా’ అంటూ బుజ్జి కొంగను తన అమ్మమ్మ గారింటికి తీసుకువెళ్లింది చిట్టి బాతు. అమ్మమ్మ ఇద్దరినీ ఆప్యాయంగా ఆహ్వానించి చక్కటి విందును ఏర్పాటు చేసింది. చిట్టి బాతు, బుజ్జి కొంగ హాయిగా భోంచేసి.. చాలాసేపు ఆడుకున్నాయి. కబుర్లతో కాలక్షేపం చేశాయి. సమయమే తెలియలేదు. ఇక్కడ.. బుజ్జి కొంగ తల్లి ఆహారం సేకరించి కొంచెం వేగంగానే గూటికి చేరింది. వచ్చేటప్పటికి బుజ్జి కొంగ కనపడలేదు. చెట్టు పైనున్న మిగిలిన కొంగలను అడిగింది తన బిడ్డ గురించి. ‘ఉదయం నుండి బుజ్జి కొంగను చూడలేద’ని చెప్పాయి అవి. తన బిడ్డ కోసం అంతటా వెదికింది. ఎక్కడా కనబడలేదు. చివరకు చిట్టి బాతు తల్లినీ వాకబు చేసింది తన బిడ్డ గురించి. అది కూడా తనకు తెలియదనే చెప్పింది. దాంతో బుజ్జి కొంగ తల్లి ఏడుస్తూ తన గూటి కొమ్మపై కూర్చుంది. అంతలోకే చీకటి పడిపోయింది. చిట్టి బాతు అమ్మమ్మ ఇంట్లో ఉన్న బుజ్జి కొంగ గాభరా పడింది. ‘అమ్మో.. చీకటి పడిపోయింది.. త్వరగా మనిళ్లకు పోదాం పదా’అని చిట్టి బాతును తొందరపెట్టింది. ‘ఎందుకంత కంగారు? అమ్మకు చెప్పావ్ కదా.. నిదానంగా వెళ్దాంలే!’ అంది చిట్టి బాతు. ‘ఆ.. ఆ.. చెప్పానులే’ అనైతే అంది కానీ బయలుదేరే వరకు చిట్టి బాతును స్థిమితపడనివ్వలేదు. ఎట్టకేలకు రెండూ కలసి తిరుగుప్రయాణమయ్యాయి. ఇక్కడ.. చెట్టు కొమ్మ పై ఏడుస్తూ కూర్చున్న బుజ్జి కొంగ తల్లి చుట్టూ ఇతర పక్షులన్నీ చేరి ఓదార్చసాగాయి. అంతలోకే దూరం నుంచి చిట్టి బాతు, బుజ్జి కొంగ రావడం కనిపించింది. ఆత్రంగా చెట్టు మీద నుంచి కిందకు వాలింది కొంగ. అక్కడే కొలను దగ్గర చిట్టి బాతు తల్లి కూడా పిల్లల కోసం ఎదురుచూస్తూ ఉంది. దాన్ని చూడగానే ‘చూడు.. నీ బిడ్డ మాటమాత్రమైనా చెప్పకుండా నా బిడ్డను ఎలా తీసుకెళ్లిపోయిందో? తప్పు కదా! నేనెంత కంగారుపడ్డాను?’ అంది కాస్త కోపంగా.. బుజ్జి కొంగ తల్లి. ఆ మాటకు చిట్టి బాతు తల్లి చిన్నబుచ్చుకుంది. గబగబా పిల్లలకు ఎదురెళ్లి ‘బుజ్జి కొంగ వాళ్లమ్మకు చెప్పకుండా బుజ్జిని నీతో తీసుకెళ్లడం తప్పు కదూ? తనెంత గాభరా పడిందని.. బిడ్డ కనిపించక?’ అంటూ చిట్టి బాతును చీవాట్లేసింది వాళ్లమ్మ. ఆ మాటకు తెల్లబోయింది చిట్టి బాతు. ‘అదేంటీ వాళ్లమ్మకు చెప్పే వచ్చానందే నాతో! అమ్మమ్మ గారి దగ్గరికి నా కూడా వస్తానంటే మీ అమ్మకు చెప్పందే రావద్దు.. వెళ్లి చెప్పిరా అంటే నా ముందే చెట్టెక్కింది వాళ్లమ్మను అడగడానికి’ అని వాళ్లమ్మకు చెబుతూ వెంటనే బుజ్జి కొంగ వైపు తిరిగి ‘వెళ్లావ్ కదా.. అమ్మను అడగడానికి?’ అంది చిట్టి బాతు. తల దించుకుంది బుజ్జి కొంగ అబద్ధం చెప్పినందుకు. అప్పటికే అక్కడకు వచ్చిన బుజ్జి కొంగ తల్లి.. ఆ మాటలన్నీ విన్నది. ‘అలా అబద్ధం ఎందుకు చెప్పావ్?’ అంటూ కోప్పడింది. తన తప్పు గ్రహించిన బుజ్జి కొంగ.. అమ్మను చుట్టేసుకుని ‘నీకు చెప్పే వెళదామని మన గూటి దగ్గరకు వచ్చాను. కానీ నువ్వు లేకపోవడంతో వెంటనే కిందకు దిగి.. అమ్మను అడిగే వచ్చాను అని అబద్ధం చెప్పి చిట్టి బాతుతో వెళ్లిపోయాను. తప్పయిపోయింది అమ్మా.. ఇంకెప్పుడూ అబద్ధం చెప్పను’ అంటూ ఏడ్చేసింది. ‘చూడు.. నీ అబద్ధం వల్ల నేను కంగారుపడ్డమే కాదు.. చిట్టి బాతునూ ఎంత తప్పుగా అర్థం చేసుకున్నానో! ఇక నుంచి అనుమతి కోసమే కాదు.. ఏం జరిగినా నిజమే చెప్పాలి.. సరేనా!’ అంటూ బిడ్డను సముదాయించింది బుజ్జి కొంగ తల్లి. ‘బిడ్డ కనపడకపోయేసరికి గాభరా పడ్డాను. ఆ గాభరాతోనే నిన్నూ రెండు మాటలన్నాను. తప్పు పట్టుకోకు’ అంటూ చిట్టి బాతునూ దగ్గరకు తీసుకుంది బుజ్జి కొంగ తల్లి. ‘హమ్మయ్య.. ఏమైతేనేం పిల్లలు జాగ్రత్తగా ఇంటికి చేరారు’ అనుకుంటూ వాళ్ల పిల్లలను తీసుకుని ఆ తల్లులు వాళ్ల వాళ్ల నివాసాలకు వెళ్లిపోయాయి. -
జంతువులను, పక్షులను ఫోటోలను తీయడం అంత ఈజీ కాదు (ఫోటోలు)