కూడ్లేరు ఆటవిక ప్రాంతంలో చెట్లు దట్టంగా వుండేవి. పక్కన త్రివేణి సంగమంలాగా మూడు వాగుల కలయిక వల్ల చుట్టూ పచ్చని ప్రకృతితో పంటలతో అలలారుతుండేది. చెట్ల ఫలాలు, దుంపలు తింటూ కోతులు, కుందేళ్ళు, నెమళ్ళు, పక్షులు మొదలైనవి కలిసిమెలిసి నివసిస్తున్నాయి. ఒక్కరికి ఆపద కలిగినా పసిగట్టి స్నేహితులను రక్షించుకునేవి. రోజులు అన్ని అనుకూలంగా వుండవు అన్నట్లు ఒక రోజు అడవిలోకి సిద్దయ్య అనే వేటగాడు వచ్చాడు. వాడు జంతువులను కనికట్టు మాయతో పట్టుకోవడంలో సిద్ధహస్తుడు. శరీరానికి ఏవేవో రంగులతో అలంకరించుకొని చప్పుడు కాకుండా ఒక చెట్టు ఎక్కి కొమ్మపై పడుకున్నాడు. పూసుకున్న రంగులు కొమ్మలోనే కలిసిపోయాయి. వేటగాడు వచ్చాడన్న అలికిడి జంతువులకు తెలియకుండా వుంది. కుందేళ్ళు గుంపుగా పొదల్లోంచి వచ్చి చెట్ల కింద పడిన పండ్లను తినసాగాయి. మెల్లగా మెల్లగా వేటగాడు వున్న చెట్టు కిందికి వచ్చాయి. సిద్దయ్య ఏమాత్రం ఆలస్యం చేయకుండా, దబ్బున చేతిలోంచి వలను విసిరాడు. కుందేళ్ళ గుంపు వలలో చిక్కుకుని, అసలేం జరిగిందో తెలుసుకునే లోపుగా వలలో చిక్కి దుఃఖించసాగాయి. వల నుంచి ఎంత గింజుకున్నా బయటకి వెళ్ళలేక పోతున్నాయి, భయపడసాగాయి.
వేటగాడు ఆనందంతో కిందికి దిగసాగాడు. కాలు కింద పెడదామని బుస్సుమన్న శబ్దం విని కిందికి చూశాడు. పెద్ద నాగు బుసలు కొడుతూ వేటగాడి వైపు కోపంతో కోరలు చూపసాగింది. వేటగాడు దబ్బున చెట్టు ఎక్కి కిందికి చూశాడు. ఇంకో నాలుగు పాములు వచ్చి కుందేళ్ళ వలల చుట్టూ చేరాయి. కుందేళ్ళు వలలో చిక్కడం చూసి పక్షులు అరవసాగాయి. పక్షుల అరుపులో తేడాను గమనించిన జంతువులు పరుగున వచ్చాయి. వలలో చిక్కుకున్న జంతువులను చూసి దుఃఖిస్తూ, వేటగాడి వైపు కోపంగా చూడసాగాయి. వేటగాడు గుంపులుగా వున్న జంతువులని చూసి వణకసాగాడు. కోతుల గుంపు వేటగాడి చెట్టు నిండా చేరాయి. వల చుట్టూ చేరిన జంతువులు, పక్షులు కలిసి వలను సగము కొరికి వదిలిన చోట్ల ఎలుకలు పదునైన పళ్ళతో వలను పటపట తెంపసాగాయి. వేటగాడి గుండె గడబిడ కొట్టుకోగా కళ్ళు మూసుకున్నాడు. వలలోంచి బయటకు వచ్చిన కుందేళ్ళతో జంతువులు అడవిలోకి వెళ్ళాయి. వేటగాడు కళ్ళు తెరిచేసరికి అంతా నిశ్శబ్దంగా, నిర్మానుష్యంగా వుంది. నెమళ్లు పాములను తింటాయి. పాములు ఎలుకలను తింటాయి. అలాంటిది అన్నీ కలిసి కుందేళ్లను రక్షించడం తలచుకుని వేటగాడు తలదించుకున్నాడు. ఇంతటి ఐకమత్యంతో జీవిస్తున్న కూడ్లేరు జంతుజాలముకు నమస్కరించి.. సిద్దయ్య జంతువులను వేటాడటం మాని, వ్యవసాయ పనులు చేస్తూ జంతువులతో స్నేహంగా ఉండసాగాడు.
ఐకమత్యం ∙ ఉండ్రాళ్ళ రాజేశం
Published Sun, Nov 4 2018 2:23 AM | Last Updated on Sun, Nov 4 2018 2:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment