సాక్షి, చెన్నై(తమిళనాడు): వండలూరు జంతు ప్రదర్శనశాలలో వైరస్ కలకలం రేపుతోంది. రెండురోజుల వ్యవధిలో తొమ్మిది నిప్పు కోళ్లు, ఒక ఆడ సింహం మరణించినట్టు గురువారం వెలుగులోకి వచ్చింది. దీంతో వైద్యబృందాలు పరిశీలన ప్రారంభించాయి. కరోనా లాక్‌డౌన్ సమయంలో వండలూరులోని అన్నా జంతు ప్రదర్శనశాలలో వన్యప్రాణులపై కరోనా ప్రభావం పడిన విషయం తెలిసిందే.
రెండు సింహాలు మరణించడం, మరికొన్ని కరోనా బారిన పడడం వెలుగు చూశాయి. దీంతో ఆ ప్రదర్శనశాల కొంతకాలం మూత పడింది. మళ్లీ ప్రస్తుతం సందర్శకులకు అనుమతి ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సోమవారం హఠాత్తుగా రెండు నిప్పు కోళ్ల మరణించాయి. వీటికి పోస్టుమార్టం నిర్వహించి..సేకరించిన నమూనాల్ని పరిశోధనకు పంపించారు.
నివేదిక వచ్చేలోపు బుధవారం సాయంత్రం మరో ఏడు నిప్పు కోళ్లు మరణించడంతో వైరస్ కలవరం ఏర్పడింది. అలాగే, గతంలో కరోనా బారిన పడికోలుకున్న కవిత(22) అనే ఆడ సింహం అనారోగ్యంతో మరణించడంతో ఈ భయం మరింత పెరిగింది. అధికారులు ఇతర వన్య ప్రాణులు అనారోగ్యం బారిన పడకుండాముందు జాగ్రత్తలు చేపట్టారు.
పరిశీలనలో టీకా ఉత్పత్తి
కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిని రాష్ట్రంలోని చెంగల్పట్టు, కున్నూరు కేంద్రాల్లో చేపట్టేందుకు కేంద్ర చర్యలు చేపడుతోందని ఆరోగ్యమంత్రి సుబ్రమణియన్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 18 ఏళ్లు లోపువారికి టీకా డ్రైవ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిసిందన్నారు. కాగా చెన్నైలో మాస్క్‌లు ధరించని 47 వేల మందిని గుర్తించి, వారి నుంచి రూ. 94 లక్షల మేరకు జరిమానాను రెండు రోజుల్లో వసూలు చేసినట్టు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment