క్షీణిస్తున్న అడవులు..తగ్గుతున్న చెట్ల విస్తీర్ణం, పచ్చదనం
అంతరించేదశలో ఇండియన్ పంగోలిన్, మౌస్‌డీర్స్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్
పక్షులు, జంతువుల సహజ ఆవాసాల తగ్గుదల... క్షీణిస్తున్న అడవులు, తగ్గుతున్న చెట్ల విస్తీర్ణం, పచ్చదనం... ఇంకా లోతుగా విశ్లేíÙస్తే ప్రపంచవ్యాప్తంగా వేగంగా సంభవిస్తున్న వాతావరణ మార్పుల ప్రభావంతో జీవవైవిధ్యం దెబ్బతింటోంది. దీంతో వన్యప్రాణులు, పక్షి, జంతు, వృక్ష... ఇలా విభిన్న రకాల జాతులు క్రమంగా తగ్గిపోతున్నాయి.
భారీ ప్రాజెక్టులు, అధిక విస్తీర్ణంలో వివిధరూపాల్లో పర్యావరణంపై, ఇతర రూపాల్లో ప్రభావం చూపేలా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అవసరానికి మించి సహజ వనరుల వినియోగం, గాలి, నీరు కాలుష్య బారినపడడం వంటి వాటి వల్ల జీవవైవిధ్యంపై ప్రభావం చూపడంతో పర్యావరణ వ్యవస్థలు దెబ్బతింటున్నాయని పలు జాతీయ, అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
‘వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) లివింగ్ ప్లానెట్ రిపోర్ట్– 2024’నివేదిక ప్రకారం చూస్తే... ప్రపంచవ్యాప్తంగా 50 ఏళ్లలో వన్యప్రాణుల జనాభా సగటు సైజ్ అనేది 73 శాతం మేర తగ్గిపోయింది. జూలాజిక్ సొసైటీ ఆఫ్ లండన్ (జెడ్‌ఎస్‌ఎల్) రూపొందించిన ‘ద లివింగ్ ప్లానెట్ ఇండక్స్’ నివేదికను గమనిస్తే...1970–2020 మధ్యలో వివిధ జంతు, పక్షు జాతుల్లో 85 శాతం ఫ్రెష్ వాటర్ పాపులేషన్, టెర్రస్టియల్ పాపులేషన్ 69 శాతం, మెరైన్ పాపులేషన్ 56 శాతం తగ్గినట్టుగా తేలింది. జీవవైవిధ్యమనేది భూమి, విభిన్న రకాల మొక్కలు, వృక్షజాతులు, జంతు, పక్షి జాతులు, వివిధ రకాల సూక్ష్మజీవులు (మైక్రో ఆర్గనిజమ్స్) తదితరాలతో కూడుకుని ఉంటుంది. – సాక్షి, హైదరాబాద్
తెలంగాణలో చూస్తే..
వివిధ రూపాల్లో వెల్లడైన వివరాలు, సమాచారం మేరకు చూస్తే తెలంగాణలో జీవవైవిధ్యా నికి వాటిల్లిన నష్టానికి ప్రధానంగా అడవులకు వాటిల్లుతున్న నష్టం, తగ్గిపోతున్న అటవీ విస్తీర్ణం, అంతర్ గ్రహ మొక్కలు (ఇన్వెసివ్ ఎలియన్ స్పీషీస్) విపరీతంగా పెరుగుదల, మత్స్య రంగ అతి వినియోగం, కాలుష్య స్థాయిల పెరుగుదల, వాతావరణ మార్పులతో చోటుచేసుకుంటున్న పరిణామాలు వంటివి కారణమవుతున్నాయి.
⇒ 2023 జూన్ గణాంకాల ప్రకారం తెలంగాణలో 2 వేల మొక్కలు, వృక్షాల రకాలు, 5,757 జంతురకాలు ఉన్నట్టుగా తేలింది. సాధారణంగా జెనిటిక్ డైవర్సిటీ, స్పీషీస్ డైవర్సిటీ, ఎకోసిస్టమ్ డైవర్సిటీల ద్వారా జీవవైవిధ్యాన్ని
పరిశీలిస్తారు.
⇒ 2023లో తెలంగాణలో 646 హెక్టార్ల సహజ అటవీ ప్రాంతం కోల్పోవాల్సి వచ్చింది. ఇండియన్ పంగోలిన్, మౌస్‌డీర్స్, మలబార్ పైడ్ హార్న్‌బిల్, బ్లాక్‌నెక్డ్ స్టోర్క్, రుడ్డి మంగ్యూస్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, సంద్‌కోల్ కార్ప్ వంటి జంతు, పక్షి రకాలు అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. స్లోత్‌బేర్, ఇండియన్ బైసన్, ఇండియన్ స్కిమ్మర్ బర్డ్ జాతులు క్రమంగా తగ్గిపోతున్నాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జీవవైవిధ్యం
ఏ స్థాయిలో ఉంది, ఎదురవుతున్న సమస్యలు, అందుకు కారణాలు ఏమిటి? తదితర అంశాలపై పర్యావరణ విశ్లేషకులు, పబ్లిక్ పాలసీ అనలిస్ట్ డాక్టర్ దొంతి నర్సింహారెడ్డి, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా స్టేట్ డైరెక్టర్ ఫరీదా తంపాల్ తమ అభిప్రాయాలు, విశ్లేషణలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ముఖ్యాంశాలు వారి మాటల్లోనే...
గ్రీన్‌కవర్ పెంచడమే బయో డైవర్సిటీ కాదు
జీవవైవిధ్యం అంటే ఏమిటనేది అందరూ అర్థం చేసుకోవాలి. కేవలం గ్రీన్‌కవర్ పెంచడమే బయో డైవర్సిటీ కాదు అని గుర్తించాలి. విధాన నిర్ణేతలు, ప్రజాప్రతినిధులు కూడా గడ్డిభూములు, బీడుభూములు వంటివి కూడా పర్యావరణవ్యవస్థల పరిధిలోకి వస్తాయని గుర్తించాలి. చెట్లు అనేవి జీవవైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయని మనమంతా గుర్తించాలి. భారీ ప్రాజెక్టులు, అధిక విస్తీర్ణంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల వల్ల పెద్దసంఖ్యలో చెట్ల తొలగింపు, గ్రీన్‌కవర్ తగ్గినప్పుడు జీవవైవిధ్యానికి నష్టం జరుగుతుంది.
నగరాల్లోనూ రోడ్ల విస్తరణ, నిర్మాణపరమైన ప్రాజెక్టులు మొదలుపెట్టినప్పుడు వెంటనే ట్రీకవర్ తగ్గిపోయిన ప్రభావం తప్పకుండా జీవవైవిధ్యంపై పడుతుంది. పచ్చదనం పెంచేందుకు చేపట్టే కార్యక్రమాల సందర్భంగా గడ్డి మైదానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఈ విషయంపై తెలంగాణలో పెద్దగా దృష్టి సారిస్తున్న పరిస్థితులు అంతగా కనిపించడం లేదు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో తగినంత స్థాయిలో గడ్డిమైదాన ప్రాంతాలున్నాయి.
వాటిని యుద్ధప్రాతిపదికన సంరక్షించాలి. అమ్రాబాద్, కవ్వాల్ పులుల అభయారణ్యాల్లో మంచిస్థాయిలో జీవవైవిధ్యమనేది అలరారుతోంది. ఇదే పద్ధతిలో రాష్ట్రంలోని జాతీయపార్కులు, శాంక్చురీలలోనూ జీవవైవిధ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్‌లో దాదాపు పది, పన్నెండేళ్ల క్రితం నిర్వహించిన కాప్ సదస్సు తర్వాత జీవవైవిధ్యం కొంతమేర మెరుగైంది. రాష్ట్రంలో ఎంత మేర జీవవైవిధ్యాన్ని నష్టం జరిగింది, ఏ ఏ పక్షి, చెట్లు, జంతువుల రకాలు తగ్గిపోయాయనే దానిపై పూర్తిస్థాయిలో శాస్త్రీయ పరిశీలన, అధ్యయనమేదీ జరగలేదు. అందువల్ల ఎంతమేర నష్టం జరిగింది, ఏఏ జాతులు కనుమరుగు అవుతున్నాయనే దానిపై సాధికారికంగా వ్యాఖ్యానించేందుకు అవకాశం లేదు. –ఫరీదా తంపాల్, స్టేట్ డైరెక్టర్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఫర్ నేచర్–ఇండియా
రాష్ట్రంలో దిగజారుతున్న జీవ వైవిధ్యం
కొంతకాలంగా రాష్ట్రంలో జీవవైవిధ్యం అనేది దిగజారుతోంది. అడవుల విస్తీర్ణం క్రమంగా తగ్గుతోంది. కొన్ని చెట్లు, మొక్కల రకాలు కూడా అంతరిస్తున్నాయి. ఊర పిచ్చుకలు, బోరుగ పిచ్చుకలు దాదాపుగా కనబడకుండాపోగా, కాకులు, ఇతర పక్షుల సంఖ్య కూడా క్షీణిస్తోంది. కప్పలు, కొన్నిరకాల చేపలు కూడా తగ్గిపోతున్నాయి. అడవుల తగ్గుదల ప్రభావం, చెట్లు, పచ్చదనం తగ్గిపోవడం వంటి కారణాల వల్ల జంతువులు, పక్షుల ఆవాసాలు, నివసించే ప్రదేశాలు కుచించుకుపోతున్నాయి. వాటికి సరైన ఆహారం దొరకడం లేదు. పక్షులు, ఇతర జంతువులు తాగేనీరే తక్కువ కాగా, అది అంతగా లభించడం లేదు.
నగరం, పట్టణాల చుట్టుపక్కల పైపులైన్లతోనే ఇళ్లకు నీటి సరఫరా, ఉపరితలంపై ఉన్న నీరు కలుషితం కావడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. పక్షులు, జంతువులు వంటి వాటికి నీరు, ఆహారం దొరక్క ఆవాస ప్రాంతాలు, గుడ్లు, సంతానం పెంపొందించుకునే అవకాశం లేకపోవడంతో పక్షి, జంతుజాతులు తగ్గిపోతున్నాయి. ప్రధానంగా అభివృద్ధి పేరిట విచ్చలవిడిగా ప్రాజెక్టులు, ఇతర రూపాల్లో నిర్మాణాలు పెరిగిపోవడం, అవసరానికి మించి సహజవనరుల అతి వినియోగం, గణనీయంగా పెరిగిన రోడ్ల విస్తరణ, వాహనాల రాకపోకలు పెరగడం, ఆన్‌రోడ్డు వెహికిల్సే కాకుండా ఇసుక, మైనింగ్, ఇతర అవసరాల కోసం నీరు, ఇతర ప్రదేశాల్లోకి వాహనాల ప్రవేశం నష్టం చేస్తోంది.
2012లో హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ కాప్ సదస్సు తర్వాత జీవవైవిధ్య పరిరక్షణ, అటవీ సంరక్షణ చట్టాలను నీరుగార్చారు. పిచ్చుకలు, ఇతర తగ్గిపోతున్న పక్షి, జంతుజాతులను ఎలా సంరక్షించాలనే దానిపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. – డాక్టర్ దొంతి నర్సింహారెడ్డి, పర్యావరణరంగ విశ్లేషకులు, పబ్లిక్ పాలసీ అనలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment