డాక్టర్ శ్రీనివాసులు
►ఉద్యోగాల కోసమే చదువులొద్దు
►మానవాళి మనుగడ మన కర్తవ్యం
►పరిశోధన పత్రాలు...ప్రగతికి బాటలు
►భావితరాలకు శాస్త్రవేత్తలను అందిద్దాం
►జాతీయ జీవశాస్త్ర సదస్సు పిలుపు
సిద్దిపేట టౌన్: ‘సృష్టిలోని పక్షులు, జంతువులు, వృక్షాలు మానవాళి మనుగడకు పునాదులు. వీటిని రక్షించుకోవాల్సింది పోయి నిర్మూలిస్తున్నాం. ఇది భావితరానికి శాపంగా మారుతోంది’ అని జాతీయ జీవశాస్త్ర సదస్సు పేర్కొంది. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం సదస్సు ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరుగుతుంది. సదస్సులో ఉస్మానియా యూనివర్సిటీ జీవశాస్త్ర విభాగం అధిపతి డాక్టర్ శ్రీనివాసులు కీలకోపన్యాసం చేశారు. ప్రకృతిలోని ప్రతి ప్రాణి ముఖ్యమేనన్నారు. విచక్షణారహితంగా ప్రకృతిని నాశనం చేయడం అవాంఛనీయమన్నారు. ధనదాహానికి అరుదైన పక్షులు, జంతువులు, వృక్షాలు కనుమరుగవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గబ్బిలాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ మూఢ నమ్మకాలతో వాటిని అపశకునంగా భావిస్తున్నామన్నారు.
ఉద్యోగాల కోసం ఉన్నత చదువులు సరికాదన్నారు. రేపటి తరాన్ని రక్షించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఇందుకోసం కలలు కనాలని వాటిని నిజం చేసుకోవడానికి అంకితభావంతో కృషిచేయాలని సూచించారు. సినిమాలు, మీడియాల వల్ల మూఢ నమ్మకాలు పెరుగుతున్నాయన్నారు. ఎమ్మెల్సీ ఫారూక్‌హుస్సేన్ మాట్లాడుతూ భావితరానికి శాస్త్రవేత్తలను అందించాలన్నారు. సంక్షోభాలను ఎదుర్కోవడానికి దీటైన పరిశోధనలు చేయాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ జీఎం రామశర్మ మాట్లాడుతూ నిరంతర అధ్యయనంతో సమాజం పురోగమిస్తుందన్నారు. కొత్త కోణాల నుంచి ఆవిష్కరణలు జరగాలన్నారు.
పరిశోధనలతోనే సంక్షోభాల నిర్మూలన
రాష్ట్ర ఉన్నత విద్యామండలి సభ్యుడు డాక్టర్ పాపయ్య మాట్లాడుతూ శాస్త్రవేత్తల పరిశోధనల వల్లే ప్రపంచాన్ని గడగడలాడించిన ప్లేగు, మశూచి మొదలగు వ్యాధులను నిర్మూలించారన్నారు. శాస్త్ర పరిశోధనలో భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీపడుతోందన్నారు. భావి శాస్త్రవేత్తలు సమర్పించే పరిశోధన పత్రాలు రేపటి సమాజాన్ని రక్షించే బాటలుగా మారుతాయన్నారు. ఎస్‌బీహెచ్ జనరల్ మేనేజర్ స్వర్ణలత రామకృష్ణన్, శ్రీకృప ఫార్మసి ప్రిన్సిపాల్ కార్తికేయన్, సదస్సు కో కన్వీనర్ డా. శ్రీనివాస్‌రెడ్డి, అకాడమిక్ కో ఆర్డినేటర్ గోపాలసుదర్శన్, సదస్సు నిర్వహణ కమిటీ ప్రతినిధులు అయోధ్యరెడ్డి, హరినాథశర్మ, రమేష్‌బాబు, రాజుకుమార్, ఏవీ శర్మ, ఎం. శ్రీనివాస్ పాల్గొన్నారు.