
సాక్షి, హైదరాబాద్: జీవవైవిధ్యానికి ప్రతీకగా తెలంగాణ నిలుస్తోంది. అరుదైన పక్షి జాతులు, విభిన్నమైన చేపల రకాలు, సీతాకోకచిలుకల, ఇతర జంతు జాతులు.. ఇలా అనేక ప్రత్యేకతలను రాష్ట్రం సొంతం చేసుకుంది. రాష్ట్రంలోని పోచారం, మంజీరా, అనంతగిరి, జన్నారం, ఏటీఆర్, ఖ మ్మం, వరంగల్, పాకాల తదితర ప్రాంతాల్లో అద్భుతమైన జీవ వైవిధ్యం అలరారుతోంది. అడవులు, జలవనరులు, ప్రకృతి సేద్యం మధ్య ఒక సమన్వయ బంధం ఏర్పడితే అన్ని జీవరాశులు సుహృద్భావ వాతావరణంలో మెలుగుతాయని ప ర్యావరణ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణకే ప్రత్యేకమైన కొన్ని రకాల చేపలు, గుడ్లగూబలు, పావురాలు, 400 వరకు రకాల వివిధ పక్షులున్నాయి. జీవవైవిధ్యం పెంపుదలకు పులులు, చిరుత పులుల వంటివి కీలకమైనవే అయినా అవే సర్వస్వం కాదని మొక్కలు, పక్షులు, ఇతర జంతువుల మనుగడ, పురోభివృద్ధి కూడా ముఖ్యమేనని పర్యావరణవేత్తలు అంటున్నారు. ఇటు తెలంగాణలోని 500 నుంచి 600 రకాల ఔషధ మొక్కలూ కీలక భూమికను నిర్వహిస్తున్నాయి. శుక్రవారం అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ప్రత్యేక కథనం..
రాష్ట్రంలోని పక్షులు, వృక్షాలు, జంతుజాతులు..
రాష్ట్రంలో 1,900 రకాల వృక్షాలు, మొక్కల జాతులు, 166 రకాల చేపలు, 376 రకాల పక్షులు, 155 సీతాకోకచిలుకలు, 13 రకాల రొయ్యలు, 4 రకాల ఎండ్రకాయలు (పీతలు), 28 రకాల తూనీగలు, 53 రకాల మోథ్స్, 46 రకాల సాలెపురుగులు, 12 రకాల తేళ్లు, 107 రకాల ఇన్వర్టెబ్రేట్స్, 41 రకాల నత్తలు, 17 రకాల కప్ప లు, 60 రకాల పాములున్నాయి. ఇక 376 రకాల పక్షి జాతుల్లో భాగంగా గుడ్లగూబలు, బాతులు, పావురాలు, కొంగలు, రామచిలుకలు, పిట్టలు, రాబందులు.. 70 రకాల జంతువుల్లో భాగంగా పులులు, చిరుతపులులు, వివిధ జాతుల కోతులు, జింకలు, ఎలుకలు, ముంగిసలు, నీల్గాయిలు, నక్కలు వంటివి ఉన్నాయి.
రాష్ట్రంలో జీవవైవిధ్యానికి నెలవులు...
►రాష్ట్రంలో 8 వన్యప్రాణి అభయారణ్యాలున్నాయి. ప్రాణహిత, శివరం, ఏటూరునాగారం, నాగార్జున సాగర్–శ్రీశైలం, పాకాల, కిన్నెరసాని, మంజీరా, పోచారం.. వీటిల్లో చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు, పులులు, నక్కలు, మొసళ్లు, కొండచిలువలు ఇతర జంతువులున్నాయి.
►ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్–2,166 చదరపు కి.మీ., కవ్వాల్ టైగర్ రిజర్వ్–892 చదరపు కి.మీ. మేర పులుల అభయారణ్యాలు విస్తరించి ఉన్నాయి.
► జాతీయపార్కులు.. (కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్కు, మృగవాణి నేషనల్ పార్కు, మహావీర్ హరిత వనస్థలి జాతీయపార్కు)
►హైదరాబాద్‌లో జవహర్‌లాల్ నెహ్రూ జూలాజికల్ పార్కు, వరంగల్‌లో వన విజ్ఞానకేంద్రం (మినీ జూ) ఉన్నాయి.
►సంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న అమీన్‌పూర్‌చెరువు బయో డైవర్సిటీ హెరిటేజ్‌సైట్‌గా ఉంది.
పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి..
‘తెలంగాణకు ఘనమైన జీవవైవిధ్య వారసత్వ సంపద ఉంది. రకరకాల మొక్కలు, వృక్షాలు, జంతువుల జాతులతో వైవిధ్యమైన ప్రత్యేకతను సొంతం చేసుకుంది. వీటిని పరిరక్షించుకునే విషయంలో సాధారణ ప్రజల్లో అవగాహనను పెంచాలి. పర్యావరణం, ప్రకృతి, జీవవైవిధ్యం నుంచి మనం ఏమి పొందుతున్నాం.. వాటి వల్ల ప్రయోజనాలు కొనసాగాలంటే ఏవిధంగా వాటిని సురక్షితంగా ఉంచుకోవాలన్నది వారు తెలుసుకోగలగాలి. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. స్థానికంగా పండించే వివిధ వ్యవసాయ ఉత్పత్తులు, పండ్లు వంటి వాటిని ప్రోత్సహించాలి. ఔషధ మొక్కల వల్ల ఆరోగ్య పరిరక్షణకు అవకాశం ఏర్పడుతోంది. వాటి ప్రాముఖ్యతను గుర్తించాలి..’ – ఫరీదా తంపల్,
వరల్డ్ వైడ్ ఫండ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) స్టేట్ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment