biodiversity
-
అంతరిక్షంలో జీవం ‘పురుడు’ పోసుకుంది!
న్యూఢిల్లీ: కొన్నేళ్లుగా అంతరిక్షంలో అద్భుతాలతో ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్న ఇస్రో మరో ఘనత సాధించింది. అంతరిక్షంలో జీవసృష్టి చేసి చూపించింది. స్పేడెక్స్ మిషన్‌లో భాగంగా పీఎస్ఎల్వీ–సి60 ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ (పోయెమ్–4) ద్వారా డిసెంబర్ 30న అంతరిక్షంలోకి పంపిన అలసంద విత్తనాలు కేవలం 4 రోజుల్లోనే మొలకెత్తాయి! కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటాల్ ప్లాంట్ స్టడీస్ (సీఆర్‌ఓపీఎస్) టెక్నాలజీ ద్వారా ఈ ప్రయోగాన్ని ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. సూక్ష్మ గురుత్వాకర్షణ పరిస్థితుల్లో విత్తనాల అంకుర, మనుగడ ప్రక్రియను అధ్యయనానికి ఉద్దేశించిన ఆటోమేటెడ్ వ్యవస్థ అయిన సీఆర్‌ఓపీఎస్ పేలోడ్‌ను విక్రం సారాబాయ్ అంతరిక్ష కేంద్రం అభివృద్ధి చేసింది. ఇందులో భాగంగా ఎనిమిది అలసంద విత్తనాలను నియంత్రిత వాతావరణంతో కూడిన బాక్సులో ఉంచారు. వాటికి నిరంతరం కచ్చితత్వంతో కూడిన వెలుతురు అందేలా జాగ్రత్త తీసుకున్నారు. విత్తనాల్లో జరుగుతున్న మార్పుచేర్పులను అత్యంత హై రిజల్యూషన్‌తో కూడిన కెమెరా ఇమేజింగ్, ఉష్ణోగ్రత, సీఓటూ సాంద్రత, ఆర్ద్రత వంటివాటి తనిఖీ తదితరాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వచ్చారు. నాలుగు రోజుల్లోనే విత్తనాలు మొలకెత్తడంతో సైంటిస్టులు ఆనందోత్సాహాల్లో తేలిపోతున్నారు. ‘‘అంతరిక్షంలో జీవం పురుడు పోసుకుంది. ప్రయోగం విజయవంతమైంది. విత్తనాలు విజయవంతంగా మొలకెత్తాయి’’ అంటూ ఇస్రో హర్షం వెలిబుచి్చంది. ‘‘త్వరలో వాటికి ఆకులు కూడా రానున్నాయి. అంతరిక్ష అన్వేషణ యాత్రలో అదో కీలక మైలురాయిగా నిలవనుంది’’అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.స్పేడెక్స్ నుంచి పుడమి ఫొటోలు స్పేడెక్స్ జంట ఉపగ్రహాల్లో ఒకటైన చేజర్ భూమిని తొలిసారి ఫొటోలు, వీడియోలు తీసింది. దాన్ని ఇస్రో శనివారం విడుదల చేసింది. చేజర్ 470 కి.మీ. ఎత్తున దిగువ కక్ష్యలో పరిభ్రమిస్తూ తీసిన ఈ వీడియోలో భూమి అత్యంత అందంగా కని్పస్తోంది. ఉపగ్రహం తాలూకు అత్యంత అధునాతనమైన ఇమేజింగ్ సామర్థ్యంతో పాటు అత్యంత కీలకమైన తదుపరి దశ పరీక్షలకు దాని సన్నద్ధతకు ఈ వీడియో నిదర్శనమని ఇస్రో ఒక ప్రకటనలో పేర్కొంది. త్వరలో కీలక డాకింగ్ (ఉపగ్రహాల అనుసంధాన) పరీక్షకు చేజర్, టార్గెట్ శాటిలైట్లు సన్నద్ధమవుతున్నాయి. వీలైతే దాన్ని జనవరి 7న నిర్వహిస్తామని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ ప్రకటించడం తెలిసిందే. ఈ పరీక్ష విజయవంతమైతే డాకింగ్ పరిజ్ఞానమున్న అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్ సగర్వంగా చేరుతుంది. గగన్‌యాన్ మొదలుకుని పలు భావి అంతరిక్ష పరీక్షలకు డాకింగ్ పరిజ్ఞానం కీలకం కానుంది. -
లంకమల.. జీవ వైవిధ్యంతో కళకళ
లంకమల అభయారణ్యం జీవ వైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఏపుగా పెరిగిన ఎర్రచందనం చెట్లు ప్రత్యేకత చాటుకోగా.. వివిధ రకాల పక్షులు, జంతువులు.. పలు రకాలైన వృక్షాలు, మొక్కలు, రంగురంగుల పుష్పాలు.. ముఖ్యంగా ఔషధ గుణాలు కలిగిన వన మూలికలు ఈ అభయారణ్యంలో ఉన్నాయి. ఇక వానాకాలంలో లంకమల్లేశ్వరుని కోనలో జలపాత హొయలు పర్యాటకులను పరవశింపజేస్తుంది. సిద్దవటం : అన్నమయ్య జిల్లాలోని లంకమల అభయారణ్యం ఎంతో ప్రత్యేకమైనది.. సుమారు 46,442 .8 హెక్టార్లలో విస్తరించి జీవ వైవిధ్యాన్ని చాటుతోంది. సుమారు 300 పైగా పక్షుజాతులు, వన్య మృగాలకు ఆవాసంగా ఉంది. ఇక పక్షుల జాతుల్లో చాలా అరుదైన పక్షి జాతి నీలి నల్లంచి ఇక్కడి ప్రత్యేకతగా చెప్పక తప్పదు. 1986వ సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన కలివి కోడి కూడా లంకమల అభయారణ్యంలో అప్పట్లో కనిపించడం కూడా విశేషంగా చెప్పు కోవచ్చు. కలివి కోడిని పోలిన పక్షిగా రాతికాలేడు, ఎర్రచిలుక కూడా ఈ అరణ్యంలో ఉన్నాయి. లంకమల అభయారణ్యంలో అరుదైన పక్షుల్లో బంగారు రొమ్ము ఆకుపిట్ట, ఎర్రగొంతు ఈకపట్ల పిట్ట, నీల ఈక పట్ల పిట్ట, తోక నల్లంచి, పెద్ద ఆకురాయి, గిజిగాడు పిట్ట, చారల గొంతు వడ్రంగి పిట్ట, వర్ణడేగా, అడవి రామదాసు, బుడమాలి గద్ద, జాలిడేగా, నీటి కాకి, తెరభిముక్కు కొంగ, నల్ల గద్ద, తోకపిగిలి పిట్ట, నల్ల తల వంగ పండు, ఎర్రగువ్వ, కుందేలు సాలువ, పచ్చగువ్వ తదితర పక్షి జాతులు లంకమల అభయారణ్యంలో కిలకిలా రావాలతో సందడి చేస్తున్నాయి. లంకమలలో పెరిగిన వన్యప్రాణులు లంకమల అభయారణ్యంలో వన్యప్రాణుల సంతతి క్రమంగా పెరుగుతోందని అధికారులు అంటున్నారు. సహజసిద్దంగా ఉండే పచ్చిక మైదానాల్లో తిరుగుతూ అవి ఆకలిని తీర్చుకుంటున్నాయి. అడవుల్లో ఎక్కువ గా వన్యప్రాణులు తిరిగే ప్రదేశాల్లో అటవీ అధికారులు కెమెరాలను కూడా అమర్చారు. పలు కెమెరాల్లో అడవి జంతువులు కణితిలు, అడవి కుక్కలు, ఎలుగుబంట్లు, పొడదుప్పిల చిత్రాలు నిక్షిప్తంగా ఉన్నాయి. ఒకప్పుడు తక్కువగా ఉండే చిరుత పులుల సంఖ్య ఇప్పుడు పెరిగినట్లు అధికారులు గుర్తించారు. అటవీ ప్రాంతాల్లో నీరు లభించక జింకలు, దుప్పులు, ఎలుగు బంట్లు, చిరుత పులులు సమీప గ్రామాల్లోకి వచ్చి దాహం తీర్చుకునేందుకు వచ్చేవి. అడవి జంతువుల సంచారంలో గ్రామీణ ప్రజలు భయబ్రాంతులకు గురయ్యేవారు. వన్య ప్రాణుల దాహార్తిని తీర్చేందుకు అటవీ అధికారులు అడవిలోనే పలు ప్రాంతాలలో సాసర్ ఫీట్లు, నీటి ట్యాంకులను ఏర్పాటు చేశారు.అరుదైన వన మూలికలు లంకమల అభయారణ్యంలో పక్షులు, వన్య మృగాలతో పాటు, వన మూలికలకు ప్రసిద్ధి గాంచింది. నన్నారి షరబత్కు ఉపయోగించే సుగంది వేర్లు, సార పప్పు, ఉసిరి, నేరేడు, ఏనుగు కుందేలు చెట్టు, అతిపత్తి చెట్టు, మగలింగచెట్టు, ఇప్ప చెట్టు ఇలా ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఇక్కడి అడవిలో ఎన్నో రకాలు ఉన్నాయి. అంతే గాకుండా పాలగడ్డలు, మగసిరి గడ్డలు, పాము కాటు విరుగుడుకు వాడే తెల్లీశ్వరి, నల్లీశ్వరి, నాగముష్టి, విషనాభి చెట్టు, ప్రపంచంలో అత్యంత విలువైన ఎర్రచందనం , భూచక్రగడ్డ తోపాటు జిగురు వంటివి లంకమల అభయారణ్యంలో లభించడం విశేషంగా చెప్పుకోవచ్చు. కపర్థీశ్వరుని కోన, శ్రీ నిత్యపూజ స్వామి కోన, శ్రీ లంకమలేశ్వర స్వామి ఆలయం, కొండ గోపాలస్వామి ఆలయాలతోపాటు నీటి గుండాలు, గలగలా పారే సెలయేర్లు వంటివి కూడా ఈ అరణ్యంలో ఉన్నాయి. -
తేలియాడే రెస్టారెంట్లు.. రూఫ్‌టాప్ గార్డెన్లు
(సియోల్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) ఒకప్పుడు మురికికూపంగా ఉన్న హాన్ నదిని మూడు దశల్లో అభివృద్ధి చేయాలని 2008లో నిర్ణయించిన దక్షిణ కొరియా ప్రభుత్వం తొలిదశలో నీటిశుద్ధితోపాటు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దింది. స్థానికులతోపాటు విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు నదిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసింది. నదికి ఇరువైపులా తేలియాడే రెస్టారెంట్లు, రూఫ్‌టాప్ గార్డెన్లు, కేఫటేరియాలు, 40కిపైగా షాపింగ్ కాంప్లెక్స్‌లు, యాంఫీ థియేటర్లను నిర్మించింది.పిల్లలంతా ఆహ్లాదంగా గడిపేందుకు వీలుగా 15 పార్క్‌లను అభివృద్ధి చేసింది. 78 కి.మీ. మేర సైకిల్ ట్రాక్‌లు, బైక్ పాత్లను ఏర్పాటు చేసింది. నదిలో జీవవైవిధ్యం దెబ్బతినకుండానే ఈ చర్యలన్నీ చేపట్టింది. దీంతో స్థానిక ప్రజలతోపాటు విదేశీ పర్యాటకులను ఆకర్షించే హాట్‌స్పాట్‌గా హాన్ నది మారింది. నదిలో బోటింగ్, నదీ తీరం వెంబడి సైక్లింగ్, వాకింగ్ ట్రాక్స్, పార్క్‌లతో నిత్యం సందర్శకులతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడుతోంది. ప్రస్తుతం ఏటా సగటున 6.69 కోట్ల మంది పర్యాటకులు హాన్ నదిని సందర్శిస్తున్నారు.తాగునీటి అవసరాలు సైతం తీరుస్తూ..దక్షిణ కొరియాలోని సియోల్ నగరవాసుల తాగునీటి అవసరాలను హాన్ నదే తీరుస్తోంది. హైదరాబాద్ జంటనగరవాసుల దాహార్తిని గతంలో ఎలాగైతే మూసీ తీర్చిందో.. అచ్చం అలాగే హాన్ నది సియోల్ ప్రజలకు జీవనదిగా మారింది. స్వచ్ఛమైన మంచినీటిని సియోల్వాసులకు అందించేందుకు హాన్ నది పరీవాహక ప్రాంత పరిధిలో నాలుగు చోట్ల నీటి ఫిల్టరేషన్ కేంద్రాలను అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నదిలోని నీటి నాణ్యత మెరుగ్గా ఉందని ఐరాస సైతం గుర్తించింది. -
Climate change 2024: గతి తప్పుతున్న రుతుపవనాలు
వాతావరణ మార్పులు. భూమిపై జీవుల మనుగడకే సవాలు విసురుతున్న విపరిణామం. ప్రధానంగా వర్షపాతం, ఉష్ణోగ్రతలపై వాతావరణ మార్పులు తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. భారత్‌లో ఈ ఏడాది రుతుపవనాల సీజన్‌పై వీటి ప్రభావం ఎలా ఉందన్న దానిపై క్లైమేట్ ట్రెండ్స్ సంస్థ సమగ్ర అధ్యయనం చేసింది. రుతపవనాల సీజన్లో స్పష్టమైన మార్పులు కనిపించినట్లు తేల్చింది. వాతావరణ మార్పులు వర్షాల గతినే పూర్తిగా మార్చేస్తున్నట్లు వెల్లడైంది. సాధారణ వర్షాలు పడాల్సిన సమయంలో అతి భారీ వర్షాలు, కొన్నిచోట్ల అసలు వర్షాలే లేకపోవడం వంటి విపరీత పరిణామాలకు వాతావరణ మార్పుల ప్రభావమే కారణమని పరిశోధకులు చెబుతున్నారు. → దేశవ్యాప్తంగా 729 జిల్లాల్లో క్లైమేట్ ట్రెండ్స్ సంస్థ అధ్యయనం నిర్వహించింది. 2024 రుతుపవనాల సీజన్లో ఆయా జిల్లాల్లో నమోదైన వర్షపాతంలో వైవిధ్యం కనిపించింది. → 340 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. → 158 జిల్లాల్లో భారీ వర్షాలు, 48 జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిశాయి. మరోవైపు 178 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. వీటిలో 11 జిల్లాల్లో అత్యంత లోటు వర్షపాతం నమోదైంది. → గత ఐదేళ్లలో చూస్తే ఈ ఏడాది తక్కువ సమయంలో అత్యధిక వర్షం కురిసిన సందర్భాలు అధికంగా ఉన్నాయి. వర్షపాతంలో మార్పులతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇది ఇందోళనకర పరిణామం అని చెబుతున్నారు. దీనివల్ల వరదలు, తద్వారా ఆస్తినష్టం, ప్రాణనష్టం వాటిల్లుతుందని అంటున్నారు. → ఈ ఏడాది ఆగస్టులో దేశవ్యాప్తంగా 753 వాతావరణ కేంద్రాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. 2020 తర్వాత ఇదే అత్యధికం. → భూమి ఉపరితలం, సముద్రాల ఉష్ణోగ్రతల్లో మధ్య వ్యత్యాసాలు రుతుపవనాలను ప్రభావితం చేస్తుంటాయి. సముద్రాలతో పోలిస్తే భూమిపై ఉష్ణోగ్రతలు వేగంగా మారుతుంటాయి. వాతావరణ మార్పులు, భూతాపం కారణంగా భూమి క్రమంగా వేడెక్కుతుండడంతో రుతుపవనాలు సైతం గతి తప్పుతున్నాయి. గత పదేళ్లలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. → 2023లో దేశంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. 2024లో మాత్రం సాధారణం కంటే అధిక వర్షాలు కురిశాయి. భూమిపై సగటు ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల రుతుపవనాల్లో ప్రతికూల మార్పు మొదలైందని క్లైమేట్ ట్రెండ్స్ వ్యవస్థాపకురాలు, డైరెక్టర్ ఆర్తి ఖోస్లా చెప్పారు. → వ్యవసాయం, నీటి సరఫరా, పర్యావరణ సమతుల్యతకు రుతుపవనాలే అత్యంత కీలకం. కోట్లాది మంది ప్రజల జీవితాలు రుతుపవనాలపై ఆధారపడి ఉన్నాయి. రుతుపవనాలు పూర్తిగా గతి తప్పితే ఊహించని పరిణామాలు ఎదురవుతాయని పరిశోధకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అందుకే వాతవరణ మార్పులను అరికట్టాలని, పర్యావరణ పరిరక్షణపై తక్షణమే దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మన జీవ వైవిధ్యం భేష్
సాక్షి, హైదరాబాద్: పెరిగిన జంతుజాలం, వృక్షజాలంతో రాష్ట్రంలో జీవ వైవిధ్యత అలరారుతోంది. అటవీ ప్రాంతాల్లో వివిధ రకాల జంతువుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్టుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 12 రక్షిత అటవీ ప్రాంతాలు (7 శాంక్చురీలు, 2 టైగర్ రిజర్వ్‌లు, 3 జాతీయ పార్కులు) ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 26,903 చ.కి.మీ పరిధిలో అటవీ ప్రాంతం విస్తరించి ఉండగా, 5,693 చ.కి.మీ.లో (21.16 శాతం) రక్షిత ప్రాంతాలున్నాయి. ప్రతీ రెండేళ్లకోసారి ఆయా రక్షిత ప్రాంతాలు, శాంక్చురీలు, టైగర్ రిజర్వ్‌లు, నేషనల్ పార్కుల్లో జంతు, వృక్ష జాతులపై అధ్యయనం నిర్వహిస్తున్నారు.అటవీ ప్రాంతాల పరిధిలో చిరుతలు, అడవి దున్నలు, అడవి కుక్కలు, నక్కలు, జింకలు, దుప్పులు తదితర రకాల వన్యప్రాణులు సందడి చేస్తున్నాయి. కెమెరాట్రాపుల్లో వీటి కదలికలు తాజాగా రికార్డ్ కావడం, వీటి సంఖ్య పెరిగిన ఆనవాళ్లు కనిపించడం పట్ల అటవీశాఖ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్నిరకాల అనుకూల పరిస్థితులు, మెరుగైన సౌకర్యాలతో క వ్వాల్ టైగర్ రిజర్వ్ వన్యప్రాణుల వైవిధ్య కేంద్రంగా నిలుస్తోంది. పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి పులుల సంచారం పెరిగినా, ఇక్కడ అనుకూల పరిస్థితులున్నా అవి ఇంకా స్థిరనివాసం ఏర్పరచుకోకపోవడం మాత్రం సవాల్‌గానే మారింది. మహారాష్ట్ర తడోబా నుంచి నేరుగా పులులు వచ్చేందుకు జాతీయ రహదారితోపాటు రైల్వేకారిడార్ ఉండడం, కొన్నిచోట్ల ఆక్రమణలతో కొంత అంతరాయం ఏర్పడుతోందని చెబుతున్నారు. టైగర్ కన్జర్వేషన్ సొసైటీ పరిశీలనలో... ఇటీవల హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ ఆధ్వర్యంలో కవ్వాల్‌లోని ప్రధాన (కోర్), పొరు గు ప్రాంతాల నుంచి జంతువులు రాకపోకలు సాగించే (బఫర్) ఏరియాల్లో జంతువుల సంఖ్య పై అధ్యయనం నిర్వహించారు. కవ్వాల్‌లో పులుల అభయారణ్యం ఏ మేరకు సరిపోయేటట్టు ఉంది, ఏయే రకాల మాంసాహార, శాఖాహార జంతువులు ఉన్నాయనే దానిపై దృష్టి కేంద్రీకరించారు. బఫర్ ఏరియాలోని కాగజ్‌నగర్, చెన్నూరు, ఆదిలాబాద్ డివిజన్లలో అనేక పులి పాదముద్రలను గుర్తించారు. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ వైల్డ్‌లైఫ్ శాంక్చురీ నుంచి ప్రాణహిత, పెన్‌గంగ నదు లను దాటి తడోబా అంథారి టైగర్ రిజర్వ్ నుంచి పులుల సంచారం ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించా రు. కవ్వాల్ ప్రధాన అటవీ ప్రాంతంలో చిరుత లు, అడవికుక్కలు, ఎలుగుబంట్లు ఇతర జంతువు లు కనిపించాయి. తాళ్లపేట, ఇంథన్ పల్లిలో కృష్ణజింకలను అధికసంఖ్యలో గుర్తించారు. అడవి దున్న, అడవి పంది, నీల్గాయ్, సాంబారు, మచ్చలజింక, చౌసింగ వంటి శాఖాహార జంతువులను కూడా గుర్తించారు. నీల్గాయ్లు, అడవి పందుల జనాభా అటవీ ప్రాంతమంతా విస్తరించి ఉండగా, సాంబార్ జింకలు కొండ ప్రాంతాల్లో ఉన్న ట్టు గుర్తించారు. అయితే, ఈ అధ్యయనానికి సంబంధించి ఇంకా తుది నివేదిక రూపొందించలేదు. ఇది తయారయ్యాకే ఆయా రకాల జంతువుల సంఖ్యపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశముంది. 2,254 చ.కి.మీ. సర్వే చేశాం అధ్యయనంలో భాగంగా ఆదిలాబాద్, కాగజ్‌నగర్, నిర్మల్, జన్నారం, చెన్నూ రు, మంచిర్యాలను కవర్ చేశాం. మొత్తం 2,254.35 చ.కి.మీ మేర కవర్ అయ్యింది. ఆదిలాబాద్, కాగజ్‌నగర్–చెన్నూరు సరిహద్దు లో పులుల ఉనికి గుర్తించాం. ఆదిలాబాద్, కాగజ్‌నగర్, జన్నారంలలో ఎలుగుబంట్లు, చిరుతలు, థోల్ తదితర జంతువులు కనిపించాయి. జన్నారంలో అడవి గొర్రెలు, సాంబార్ జింకలు, చెన్నూ రు, కాగజ్‌నగర్, ఆదిలాబాద్‌లో నీల్గాయ్లు పెద్దసంఖ్యలో కనిపించాయి. వర్షాకాలం తర్వాత ఆసిఫాబాద్‌లో మళ్లీ సర్వే చేయాలని భావిస్తున్నాం. –ఇమ్రాన్ సిద్ది్దఖీ, డైరెక్టర్, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ -
ప్రకృతి హితం.. మన అభిమతం
సాక్షి, అమరావతి: భావితరాలకు స్వచ్ఛమైన భూమి, గాలి, నీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక విప్లవాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం, అంతర్జాతీయ సంస్థలు చేపట్టే పర్యావరణ హిత కార్యక్రమాల్లోను భాగమవుతోంది. పర్యావరణ హితం.. తమ అభిమతం.. అని చాటుతోంది. ‘పుడమి సేవలో పరిశ్రమిస్తూ.. కాలుష్యాన్ని ప్రతిఘటిస్తూ.. పచ్చదనం పెంచుకుంటే.. ప్రకృతిని కాపాడుకుంటే.. మనిషికి అదే మనుగడ.. జీవకోటికదే తోడూ.. నీడ’ అంటూ ఈ ప్రయత్నంలో ‘భాగస్వామ్యం కండి’ అనే నినాదాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ మే 22న అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం నిర్వహిస్తున్నారు. సకల జీవులకు నిలయమైన ఈ భూమిని రక్షించే ఉమ్మడి కార్యాచరణలో మన దేశంతోపాటు మన రాష్ట్రం సైతం పాలుపంచుకుంటోంది. ఈ పవిత్రయజ్ఞంలో భాగంగా 2028నాటికి పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం వ్యక్తిగత, సామూహిక చర్యలు తీసుకోవడానికి కనీసం ఒక బిలియన్ మంది భారతీయులు, ఇతర ప్రపంచ పౌరులను సమీకరించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘మిషన్ లైఫ్’ ప్రాజెక్టులో ఏపీ భాగమవుతోంది. దీనిద్వారా రానున్న నాలుగేళ్లలో 80శాతం గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలను పర్యావరణ అనుకూలమైనవిగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బృహత్తర యజ్ఞానికి విశాఖపట్నం నుంచి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. జీవుల మనుగడకు అనుకూల చర్యలు ప్రకృతిలో ప్రతి ప్రాణి స్వేచ్ఛగా జీవించేందుకు అనువైన వాతావరణం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూమి, పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా క్లైమేట్ చేంజ్ సెల్(ఈఈఈ)ను రూపొందించింది. ఈ సెల్ వాతావరణ మార్పులపై జాతీయ కార్యాచరణ ప్రణాళికతో సమానంగా పర్యావరణ వ్యవస్థ ఆధారిత అప్రోచ్(ఈబీఏ) ద్వారా రాష్ట్రంలో వాతావరణ మార్పుల సమస్యలను పరిష్కరిస్తుంది.ఇందులో ఆయా రంగాల నిపుణులు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు, అర్బన్ డెవలప్మెంట్, రవాణా శాఖలతోపాటు పలు ప్రభుత్వ రంగ సంస్థలకు భాగస్వామ్యం కల్పించింది. భూమి, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడం కోసం మిషన్ లైఫ్ ఎనర్జీ కన్జర్వేషన్, వాటర్ కన్జర్వేషన్, సే నో టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్, అడాప్షన్ ఆఫ్ సస్టెయినబుల్ ఫుడ్ సిస్టమ్స్, వేస్ట్ రిడక్షన్, హెల్తీ లైఫ్ స్టైల్స్, ఈ–వేస్ట్ తగ్గింపు అనే ఏడు విభాగాల్లో 75 కార్యక్రమాలను మన రాష్ట్రంలో అమలుచేస్తున్నారు. అదేవిధంగా కాలుష్యాన్ని తగ్గించడం కోసం స్థానికంగా లైఫ్ గ్రూపులను ఏర్పాటుచేశారు. సైకిల్ ర్యాలీలు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌లపై స్పెషల్ డ్రైవ్‌లు, సోషల్ మీడియాలో ప్రచారం, కమ్యూనిటీ వర్క్‌షాపులు, సెమినార్లు, క్విజ్ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తున్నారు. కాలుష్య కారక వాహనాలను అరికట్టడం కోసం ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్‌లను చేపడుతున్నారు. పాఠశాలల్లో ఎనర్జీ క్లబ్‌ల ఏర్పాటు ద్వారా భూమి పరిరక్షణ ఆవశ్యకతపై చైతన్యం తీసుకువస్తున్నారు. విశాఖలో లైఫ్ మిషన్ అమలుపర్యావరణ హిత జీవనశైలిని అనుసరించేలా ప్రజలను ప్రోత్సహించడమే లక్ష్యంగా మొదలైన లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ పథకం అమలుకు రాష్ట్రంలోని సముద్ర తీరప్రాంతంలో ఉన్న విశాఖ నగరం అనుకూలమని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ(బీఈఈ) గుర్తించింది. దేశవ్యాప్తంగా 2028 నాటికి 5.15 లక్షల గ్రామాలు, 3,700 పట్టణ స్థానిక సంస్థల్లోని కోటి మంది ప్రజలను ‘ప్రో ప్లానెట్ పీపుల్’గా మార్చాలనేది లైఫ్ మిషన్ లక్ష్యం. పుడమి, జీవ పరిరక్షణ కోసం చేపట్టిన ఈ పథకాన్ని విశాఖలో అమలు చేయనున్నట్లు బీఈఈ ఇటీవల ప్రకటించింది. విశాఖతోపాటు విజయవాడ, కాకినాడ, కర్నూలు, తిరుపతి నగరాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు బీఈఈ వెల్లడించింది. లైఫ్ మిషన్ అమలుకు బీఈఈ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దశలవారీ కార్యాచరణ రూపొందిస్తోంది. -
Living Planet Index: ఐదో వంతు జీవ జాతులు... అంతరించే ముప్పు
ప్రపంచవ్యాప్తంగా పలు కారణాలతో ఏటా వలస బాట పట్టే అసంఖ్యాక జీవ జాతులపై తొలిసారిగా సమగ్ర అధ్యయనానికి ఐక్యరాజ్యసమితి తెర తీసింది. ఇందులో భాగంగా 1997 ఐరాస ఒప్పందం ప్రకారం రక్షిత జాబితాలో చేర్చిన 1,189 జీవ జాతులను లోతుగా పరిశీలించారు. పరిశోధనలో తేలిన అంశాలను 5,000 పై చిలుకు జీవ జాతుల తీరుతెన్నులను 50 ఏళ్లుగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్), లివింగ్ ప్లానెట్ ఇండెక్స్ సంస్థల గణాంకాల సాయంతో విశ్లేíÙంచారు. విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 22 శాతం జీవ జాతులు అతి త్వరలో పూర్తిగా అంతరించనున్నట్టు తేలింది. మొత్తమ్మీద 44 శాతం జీవ జాతుల సంఖ్య నిలకడగా తగ్గుముఖం పడుతూ వస్తున్నట్టు వెల్లడైంది. ఈ వివరాలతో కూడిన తాజా నివేదికను ఐరాస ఇటీవలే విడుదల చేసింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఏకంగా ఐదో వంతు వలస జీవజాతులు అంతరించే ప్రమాదంలో పడ్డాయి. జీవజాతుల వలసలు కొత్తగా మొదలైనవి కావు. అనాదిగా భూమ్మీదా, సముద్రంలోనూ అత్యంత కఠినతరమైన, భిన్న వాతావరణ పరిస్థితుల గుండా ఏటా వందల కోట్ల సంఖ్యలో సాగుతుంటాయి. ఇన్నేళ్లలో ఏనాడూ లేని ముప్పు ఇప్పుడే వచ్చి పడటానికి ప్రధాన కారణం మానవ జోక్యం, తత్ఫలితంగా జరుగుతున్న వాతావరణ మార్పులు, సాగుతున్న పర్యావరణ విధ్వంసమే’’ అని తేలి్చంది. ఇప్పటికైనా కళ్లు తెరిచి నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరముందని ఐరాస వలస జాతుల సంరక్షణ సదస్సు కార్యదర్శి అమీ ఫ్రాంకెల్ అన్నారు. గత వారం ఉబ్జెకిస్తాన్‌లోని సమర్ఖండ్లో జరిగిన సదస్సు భేటీలో ఈ అంశాన్నే ఆయన నొక్కిచెప్పారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా 30 శాతం భూ, సముద్ర భాగాల సమగ్ర పరిరక్షణకు కృషి చేస్తామంటూ 2022 గ్లోబల్ బయో డైవర్సిటీ సమిట్‌లో పాల్గొన్న దేశాలు ప్రతిజ్ఞ చేశాయి. దాన్ని నెరవేర్చాల్సిన సమయం వచ్చింది’’ అన్నారు. ప్రమాదపుటంచుల్లో... 1979 ఐరాస రక్షిత జాబితాలోని 1,189 జీవ జాతులను నివేదిక లోతుగా పరిశీలించింది. అనంతరం ఏం చెప్పిందంటే... ► ప్రపంచవ్యాప్తంగా 44 శాతం వలస జీవ జాతుల సంఖ్య నానాటికీ భారీగా తగ్గుముఖం పడుతోంది. ► 22 శాతం అతి త్వరలో అంతరించేలా ఉన్నాయి. మొత్తమ్మీద ఐదో వంతు అంతరించే ముప్పు జాబితాలో ఉన్నాయి. ► ఇది జీవవైవిధ్యానికి తీవ్ర విఘాతం. మన జీవనాధారాలపైనా, మొత్తంగా ఆహార భద్రతపైనా పెను ప్రభావం చూపగల పరిణామం. ► ఆవాస ప్రాంతాలు శరవేగంగా అంతరిస్తుండటం మూడొంతుల జీవుల మనుగడకు మరణశాసనం రాస్తోంది. ► జంతువులు, చేపల వంటివాటిని విచ్చలవిడిగా వేటాడటం కూడా ఆయా జాతుల మనుగడను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ► కార్చిచ్చులు, గ్లోబల్ వారి్మంగ్ వంటివి ఇందుకు తోడవుతున్నాయి. ► భారీ డ్యాములు, గాలి మరలకు తోడు ఆకస్మిక వరదలు, అకాల క్షామాలు తదితరాల వల్ల వలస దారులు మూసుకుపోవడం, మారిపోవడం జరుగుతోంది. ఇది పలు జీవ జాతులను అయోమయపరుస్తోంది. ఏం చేయాలి? తక్షణం వలస జీవ జాతుల సంరక్షణ చర్యలకు పూనుకోవాల్సిన ఆవశ్యకతను నివేదిక నొక్కిచెప్పింది. అందుకు పలు సిఫార్సులు చేసింది... ► జీవావరణాల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలి. ► భారీ డ్యాములు తదితరాల పర్యావరణ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని తగు నష్ట నివారణ చర్యలు తీసుకోవాలి. ► ఈ అన్ని సమస్యలకూ తల్లి వేరు పర్యావరణ విధ్వంసం. కార్చిచ్చులకైనా, అకాల వరదలు, క్షామాలకైనా, గ్లోబల్ వార్మింగ్కైనా అదే ప్రధాన కారణం. కనుక దానికి వీలైనంత త్వరలో చెక్ పెట్టేందుకు దేశాలన్నీ కృషి చేయాలి. ఆహారం, పునరుత్పాదన వంటి అవసరాల నిమిత్తం వేలాది జీవ జాతులు వలస బాట పట్టడం ప్రపంచవ్యాప్తంగా అనాదిగా జరుగుతూ వస్తున్న ప్రక్రియ. పలు జంతు, పక్షి జాతులైతే కోట్ల సంఖ్యలో వలస వెళ్తుంటాయి. ఈ క్రమంలో కొన్ని పక్షి జాతులు ఏటా 10 వేల కిలోమీటర్లకు పైగా సుదీర్ఘ ప్రయాణాలు చేస్తుంటాయి! పర్యావరణ సంతులన పరిరక్షణకు కూడా ఎంతగానో దోహదపడే ప్రక్రియ ఇది. కానీ గ్లోబల్ వారి్మంగ్, వాతావరణ మార్పుల ప్రభావం జంతువులు, పక్షుల వలసపై కూడా విపరీతంగా పడుతోంది. ఈ ప్రమాదకర పరిణామంపై ఐరాస తీవ్ర ఆందోళన వెలిబుచి్చంది. దీనికి తక్షణం అడ్డుకట్ట వేయకపోతే కనీసం ఐదో వంతు వలస జీవులు అతి త్వరలో అంతరించిపోయే ప్రమాదం పొంచి ఉందని తాజా నివేదికలో హెచ్చరించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇడ్లీ లవర్స్‌కు షాకింగ్ న్యూస్, జీవవైవిధ్యానికి అత్యంత ప్రమాదకారిగా
మనకెంతో ఇష్టమైన వంటకాల వల్ల జీవవైవిధ్యం దెబ్బతింటుందంటే నమ్ముతారా? లేటెస్ట్ స్టడీ ఈ భయాల్నే రేకెత్తిస్తోంది. భారతీయులు తినే పలు ఆహార పదార్థాలు జీవ వైవిధ్యానికి ముప్పు కలిగిస్తున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 151 వంటకాలపై జరిపిన పరిశోధనల్లో కొన్ని భారతీయ వంటకాల వల్ల జీవ వైవిధ్యానికి ఎక్కువ ముప్పు ఉన్నట్టు తేలిందట. ముఖ్యంగా ఇడ్లీ, వడ, చనా మసాలా, రాజ్మా, చపాతి సహా పలు ఆహార పదార్థాలుంటం గమనార్హం. అలాగే శాకాహారం , శాకాహార వంటకాలతో పోలిస్తే మాంసాహార వంటకాలు జీవవైవిధ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతాయని అధ్యయనం చెబుతోంది. శుభవార్త ఏమిటంటే, బియ్యం , పప్పుధాన్యాల వంటకాలు అధిక స్కోర్లు ఉన్నప్పటికీ, భారత జనాభాలో ఎక్కువ భాగం శాకాహారుల కారణంగా, జీవవైవిధ్య ముప్పుకు పెద్ద ప్రమాదం లేదని పరిశోధకులు వివరించారు. బ్రెజిల్లో వాడే గొడ్డు మాంసం ,స్పెయిన్‌కు చెందిన రోస్ట్ లాంబ్ డిష్ , బ్రెజిల్ నుండి లెచాజో,జీవవైవిధ్యానికి అత్యధిక నష్టం కలిగించిన ఆహార పదార్థాలుగా నిలిచాయి. ఈ జాబితాలో ఇడ్లీ ఆరో స్థానంలో ఉంది. అంతేకాదు అధ్యయనం ప్రకారం ఫ్రెంచ్ ఫ్రైస్ ప్రభావం చాలా తక్కువ. ఈ లిస్ట్‌లో ఆలూ పరాటా 96వ స్థానంలో, దోస 103వ స్థానంలో, బోండా 109వ స్థానంలో ఉన్నాయి. భారతదేశంలో జీవవైవిధ్యంపై అపారమైన ఒత్తిడిని ఈ అధ్యయనం నొక్కి చెబుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 151 ప్రసిద్ధ వంటకాలపై నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ పరిశోధన నిర్వహించారు. పర్యావరణంపై ప్రభావం చూపించే దాదాపు 25 ప్రమాదకర ఆహారాల పదార్థాలను గుర్తించారు .యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్‌లోని బయోలాజికల్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ లూయిస్ రోమన్ కరాస్కో మాట్లాడుతూ, ప్రతి వంటకం దాని పదార్థాల ఆధారంగా జాతులు, అడవి క్షీరదాలు, పక్షులు ఉభయచరాలపై ప్రభావం చూపుతుందని చెప్పారు. -
శిలాజ ఇంధనాలకు బైబై
దుబాయ్: హరిత గృహ వాయువుల ఉద్గారానికి, తద్వారా భూతాపానికి, భూగోళంపై ప్రకృతి విపత్తులకు, జీవకోటి మనుగడకు పెనుముప్పుగా పరిణమించిన శిలాజ ఇంధనాల వాడకానికి వీడ్కోలు చెప్పే దిశగా అడుగులు వేసేందుకు దాదాపు 200 దేశాలు అంగీకారానికి వచ్చాయి. ఈ మేరకు దుబాయ్‌లో జరుగుతున్న ‘కాప్–28’ సదస్సులో చరిత్రాత్మక ఒప్పందానికి అన్ని దేశాలు మద్దతు పలికాయి. ‘శిలాజ ఇంధనాల వాడకం మానేద్దాం.. మార్పు సాధిద్దాం’ అంటూ ప్రతిన బూనాయి. కాప్–28 సదస్సులో బుధవారం చివరి సెషన్ జరిగింది. శిలాజ ఇంధనాలకు వ్యతిరేకంగా కీలక ఒప్పందాన్ని సభ్యదేశాల ప్రతినిధులంతా ముక్తకంఠంలో ఆమోదించారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణం కరతాళ ధ్వనులతో మార్మోగింది. 2050 నాటికి నెట్‌జీరో(సున్నా) ఉద్గారాలే లక్ష్యంగా ఒప్పందంలో 8 సూత్రాల ప్రణాళికను జోడించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ ఏడాది కాప్ సదస్సులో చెప్పుకోదగ్గ తీర్మానాలేవీ ఉండబోవన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. భూగోళాన్ని కాపాడుకుంటేనే భవిష్యత్తు తరాలకు మనుగడ ఉంటుందని కాప్–28 అధ్యక్షుడు సుల్తాన్ అల్–జబేర్ తేలి్చచెప్పారు. పారిస్ ఒప్పందాన్ని పరిగణనలోకి తీసుకుంటూ, ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలని, ఇందుకోసం ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పని చేయాలని, పటిష్టమైన, నిర్మాణాత్మక చర్యలకు శ్రీకారం చుట్టాలని కాప్–28 సదస్సు పిలుపునిచ్చింది. ప్రమాదకరమైన గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాన్ని గణనీయంగా తగ్గించాల్సిన బాధ్యత అన్ని దేశాలపైనా ఉందని స్పష్టం చేసింది. చేతలు కావాలి: బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని తగ్గించుకోవాలని గతంలో జరిగిన కాప్ సదస్సుల్లో ప్రత్యేకంగా సూచించారు. ఈసారి మాత్రం ఈ ప్రస్తావన లేకపోవడం గమనార్హం. బొగ్గుతో విద్యు త్ను ఉత్పత్తి చేయడంలో ప్రపంచంలో చైనా, భారత్ ముందంజలో ఉన్నాయి. తమ విద్యుత్ అవసరాలు తీర్చుకోవడానికి బొగ్గుపై ఆధారపడుతున్నాయి. ఉష్ణోగ్రతల పెరుగుదలను నియంత్రించడానికి బుధవారం ఆమోదించిన ఒప్పందమే అతిపెద్ద కార్యాచరణ ప్రణాళిక అని సుల్తాన్ అల్–జబేర్ అన్నారు. కాప్–28 టాప్ 10 చరిత్రాత్మక శిలాజ ఇంధన ఒప్పందంతో కాప్–28 సదస్సు ముగిసింది. ఇలాంటి కాలుష్య ఇంధనాల వాడకాన్ని క్రమంగా నిలిపివేయడానికి ప్రపంచ దేశాలు అంగీకరించాయి. పెట్రోల్, డీజిల్, బొగ్గు వినియోగం అంతమయ్యే దిశగా అడుగులు పడ్డాయని చెప్పొచ్చు. 1. చరిత్రాత్మక శిలాజ ఇంధన ఒప్పందంతో కాప్–28 సదస్సు ముగిసింది. ఇలాంటి కాలుష్య ఇంధనాల వాడకాన్ని క్రమంగా నిలిపివేయడానికి ప్రపంచ దేశాలు అంగీకరించాయి. పెట్రోల్, డీజిల్, బొగ్గు వినియోగం అంతమయ్యే దిశగా అడుగులు పడ్డాయని చెప్పొచ్చు. 2. సంపన్న దేశాల నిర్వాకం వల్లే వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. వాటి వల్ల పేద దేశాలు నష్టపోతున్నాయి. పేద దేశాలకు వాటిల్లుతున్న నష్టానికి గాను బడా దేశాలు పరిహారం ఇవ్వాలన్న ప్రతిపాదన చాలాఏళ్లుగా ఉంది. ఈ సదస్సులో దానికి కార్యరూపం వచి్చంది. వాతావరణ మార్పుల వల్ల నష్టపోయే పేద దేశాలకు ఆర్థిక సాయం అందించడం కోసం ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడానికి ఆమోదం లభించింది. 3. నిర్దేశిత గడువు కంటే నెట్జిరో కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని సాధిస్తామని కెనడా, బెల్జియం వంటి దేశాలు ప్రకటించాయి. 2030 నాటికి ఉద్గారాలను 50 శాతం తగ్గించుకుంటామని దుబాయ్ వెల్లడించింది. 4. 2030 కంటే ముందే గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారాన్ని అరికట్టడానికి శుద్ధ ఇంధనాల వనరుల వాడకాన్ని గణనీయంగా పెంచుకోవాలని నిర్దేశించారు. 5. క్లైమేట్ యాక్షన్ కోసం సంపన్న దేశాల నుంచి నిధులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు బదిలీ చేయాలన్న ప్రతిపాదనపై చర్చలు జరిగాయి. 6. జీవ వైవిధ్యానికి, మానవళికి ఎలాంటి హాని కలగకుండా వాతావరణ మార్పుల నియంత్రణకు కార్యాచరణ ప్రణాళిక చేపట్టాలని నిర్దేశించారు. 7. ప్రస్తుతం అమల్లో ఉన్న పారిస్ ఒప్పందం లక్ష్యాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా శిలాజ ఇంధనాల వినియోగం, ఉత్పత్తిని తగ్గించుకోవాలని ఆదేశించారు. 8. పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ క్లైమేట్ ఫండ్ తరహాలో క్లైమేట్ ఫైనాన్స్, సపోరి్టంగ్ ఫండ్స్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు కొన్నిదేశాలు, సంస్థలు మద్దతు ప్రకటించాయి. 9. కాప్–26 సదస్సు ఫలితాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కర్బన్ ఉద్గారాల సమాచారాన్ని నమోదు చేసే విషయంలో నిబంధనలు సవరించారు. 10. అన్ని దేశాల, అన్ని వర్గాల అవసరా లను దృష్టిలో పెట్టుకొని శిలాజ ఇంధనాల నుంచి ఇతర ప్రమాద రహిత ఇంధనాల వైపు క్రమానుగతంగా మారాలని సూచించారు. -
బయోడైవర్సిటీని రక్షించడంలో సోషల్‌మీడియాది కీలక పాత్ర
ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయింది. గంటగంటకూ అప్డేట్స్ చూసుకునేవారు చాలామందే ఉన్నారు. స్మార్ట్‌ఫోన్‌లో ఫేస్బుక్, వాట్సప్, లింక్డిన్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్ అంటూ పలు ప్లాట్ఫార్మ్స్ ద్వారా మనిషి జీవితం పెనవేసుకొని పోయిందంటే ఆశ్చర్యం లేదు. అయితే జీవవైవిధ్యం(బయోడైవర్సిటీ)ని రక్షించడంలో సోషల్ మీడియాది ప్రముఖ పాత్ర ఉందని తాజా అధ్యయనంలో తేలింది. పకృతిలో జీవుల మధ్య సహజంగా కనిపించే భిన్నత్వాన్ని / ఓ భౌగోళిక ప్రాంతంలోని భిన్నజాతుల సముదాయాన్ని జీవవైవిధ్యం (Biodiversity) అంటారు. పెరుగుతున్న జనాభా, వనరులను మితిమీరంగా వాడటం వల్ల జీవవైవిద్య పరిరక్షణ సంక్లిష్టం మారుతోంది. చెట్లు నరికివేయడం,ఇష్టారాజ్యంగా పరిశ్రమల ఏర్పాటు వంటివి జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా భూమిపై ఉన్న కోట్లాది జీవరాశులు అంతరించే ప్రమాదం ఉంది. అయితే బయోడైవర్సిటినీ రక్షించడంలో సోషల్ మీడియా పాత్ర కీలకమని యూనివర్శిటీ ఆఫ్ క్వీన్స్లాండ్ స్కూల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ జరిపిన అధ్యయనంలో తేలింది. డాక్టర్ చౌదరి ఆధ్వర్యంలో జరిపిన అధ్యయనం ప్రకారం.. సోషల్ మీడియా అన్నది శాస్త్రీయ పరిశోధన, పరిరక్షణ ప్రయత్నాలకు శక్తివంతమైన సాధనంగా మారింది. ఉదాహరణకు బంగ్లాదేశ్‌లో గొప్ప వన్యప్రాణుల వారసత్వం ఉన్నప్పటికీ, కేవలం 4.6 శాతం మాత్రమే అధికారికంగా రక్షిత ప్రాంతంగా గుర్తించబడిందని తేలింది. బంగ్లాదేశ్‌లో పనిచేస్తున్న ఫేస్బుక్ నేచర్ ఫోటోగ్రఫీ గ్రూపులను పరిశీలించగా అక్కడ అనేక పక్షులు, కీటకాలు సహా మొత్తం 44,000 జీవరాశులు ఉన్నట్లు వారు కనుగొన్నారు. వీటిలో 288 జీవరాశులు అంతరించే ప్రమాదం ఉన్నట్లు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ అందించిన డేటా ప్రకారం తెలిసిందని డా. చౌదరి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్ననేచర్ ఫోటోగ్రాఫర్లు దక్షిణాసియాలో జీవవైవిధ్య పరిరక్షణ మ్యాపింగ్‌ను మెరుగుపరచడంలో సహాయపడుతున్నారు. బంగ్లాదేశ్‌లో అంతరించిపోతున్న వందలాది జాతుల పంపిణీ డేటాను మేము కోల్పోతున్నాము. ఈ క్రమంలో సోషల్ మీడియా అందించిన డేటా మాకు సహాయపడింది. బయోడైవర్సిటీ పరిరక్షణలో కీలకమైన సమాచార అంతరాలను తగ్గించడానికి సోషల్ మీడియా కీలకంగా మారింది. ప్రత్యేకించి పర్యవేక్షణ లేని ప్రాంతాలలో ఫేస్బుక్ వంటి మీడియా ప్లాట్‌ఫామ్‌లు శాస్త్రీయ ప్రయత్నాలకు అర్థవంతంగా సహకరించేలా చేస్తాయి. ఆస్ట్రేలియాలో, తెగులు జాతుల కదలికలను ట్రాక్ చేయడంలో సోషల్ మీడియా కూడా కీలక పాత్ర పోషించింది అని డాక్టర్ చౌదరి వెల్లడించారు.బయోడైవర్సిటీ పరిశోధనపై సోషల్ మీడియా ప్రభావం దక్షిణాసియాకు మించి విస్తరించింది. టానీకోస్టర్ అని పిలవబడే దక్షిణాసియాకు చెందిన సీతాకోకచిలుక 2012లో ఆస్ట్రేలియాలో ప్రవేశించింది. దీని వలస విధానాన్ని అర్థం చేసుకోవడానికి పరిశోధన బృందం ఫేస్‌బుక్‌ని ఆశ్రయించడం విశేషం. సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్‌లు తప్పుడు సమాచారాన్ని, వ్యవసాన్ని పెంపొందిస్తాయని చెడు ప్రచారం ఉంది. కానీ జీవవైవిధ్యాన్ని రక్షించడంలో సోషల్‌మీడియా పాత్ర కీలకమని తాజా అధ్యయనంలో తేలింది. -
ఆకులపై జంతువుల డీఎన్ఏ
సాక్షి, అమరావతి: జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు ఏ ప్రాణి.. ఎక్కడ.. ఎలా జీవిస్తోందనే సమాచారం సేకరించేందుకు శాస్త్రవేత్తలు కొత్త పద్ధతులను అన్వేషిస్తున్నారు. ఇప్పటివరకు కెమెరా ట్రాపింగ్, లైన్ ట్రాన్‌సెక్టు్టలను ఉపయోగించి జంతువుల కదలికలను ట్రాక్ చేయడం ద్వారా వన్యప్రాణుల ఉనికిని పర్యవేక్షిస్తున్నారు. ఈ ట్రాకింగ్ నిర్ధిష్ట ప్రాంతం, ప్రత్యేకించి డిజైన్ చేసిన ట్రయల్స్‌గా మాత్రమే ఉంటోంది. ఇందులో ఖరీదైన పరికరాల వాడకం, శ్రమతో కూడుకోవడంతో పాటు ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి వస్తోంది. ఒక ప్రాంతంలోని అన్ని జాతులను గుర్తించడం సాధ్యపడటం లేదు. దట్టమైన వర్షారణ్యాల్లో ఈ రకమైన ట్రాకింగ్ కష్టతరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ జీవ వైవిధ్య శాస్త్రవేత్తల బృందం అడవుల్లో జంతువుల డీఎన్ఏ నమూనాల సేకరణ ద్వారా జీవ వైవిధ్యాన్ని సులభంగా, తక్కువ ఖర్చుతో గుర్తించవచ్చని ఓ అధ్యయనంలో పేర్కొంది. గాలిలోకి కణాలుగా జంతు డీఎన్ఏ ఉగాండాలోని కిబలే జాతీయ పార్కులోని వర్షారణ్యంలో అంతర్జాతీయ పరిశోధన బృందం మొక్కలు, చెట్ల ఆకులపై జంతువులు డీఎన్ఏలను కనుగొంది. జంతువులు తమ డీఎన్ఏను గాలిలోకి కణాలుగా విడుదల చేస్తున్నట్టు.. అది కాస్తా అడవిలోని వృక్ష సంపదపై సన్నని మైనం పొర మాదిరిగా అల్లుకుంటున్నట్టు పరిశోధనలో తేలింది. ఆకులపైన స్వాబ్ నమూనాలను కాటన్ బడ్స్ ద్వారా సేకరించి డీఎన్ఏ సీక్వెన్సింగ్ పరీక్ష ద్వారా జాతుల వివరాలను తెలుసుకోవడంతోపాటు జీవ వైవిధ్యాన్ని మ్యాప్ చేయవచ్చని పరిశోధన బృందం చెబుతోంది. పర్యావరణంలోని మార్పులను అర్థం చేసుకుంటూ జీవ వైవిధ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి, అటవీ జనాభాను పర్యవేక్షించడానికి డీఎన్ఏ పరీక్షా విధానం ఎంతగానో ఊతమిస్తోంది. కోవిడ్ తర్వాత డీఎన్ఏ సీక్వెన్సింగ్ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందడం కూడా కలిసి వస్తోంది. ఆకులను శుభ్రపరచడానికి టెక్నాలజీ, ఖరీదైన పరికరాలు, ఎక్కువ శిక్షణ అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వైల్డ్‌లైఫ్ అథారిటీలో పని చేసే సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇతర జీవ శాస్త్రవేత్తలు దీనిని సులభంగా నిర్వహించవచ్చు. వాస్తవంగా పర్యావరణంలో సేకరించే డీఎన్ఏ చాలా పెద్దస్థాయిలో జీవ వైవిధ్య పర్యవేక్షణకు దోహదపడుతుంది. వర్షాధార పరిస్థితుల్లో, అత్యంత వేడి పరిస్థితుల్లో మాత్రమే ఆకులపై డీఎన్ఏ త్వరగా క్షీణిస్తుంది తప్ప మిగిలిన సందర్భాల్లో పరిశోధనలకు అనుకూలంగా ఉండటంతో ఈ పద్ధతిపై అంచనాలు పెరుగుతున్నాయి. గంటలో 50కి పైగా జాతుల గుర్తింపు కిబలే జాతీయ పార్కు గొప్ప జీవ వైవిధ్యానికి ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోని ‘ప్రైమేట్ క్యాపిటల్’ (కోతి జాతులు) నిలయంగా ఉంది. ఇందులో అంతరించిపోతున్న రెడ్ కోలోబస్ కోతి, చింపాజీలతో సహా 13 జాతులు ఇందులో ఉన్నాయి. ఇక్కడ పరిశోధకులు కేవలం ఒక గంటలో 24 కాటన్ బడ్స్ ద్వారా ఆకులపై స్వాబ్ నమూనాలను సేకరించారు. వాటి విశ్లేషణ కోసం ల్యాబ్‌కు పంపగా.. ఏకంగా 50 రకాల క్షీరదాలు, పక్షులు, ఒక కప్ప జాతులను గుర్తించడం గమనార్హం. ప్రతి మొక్క ఆకులపై దాదాపు 8 జంతు జాతులను కనుగొన్నారు. వీటిల్లో పెద్దవైన అంతరించిపోతున్న ఆఫ్రికన్ ఏనుగు నుంచి చిన్న జాతులైన సన్‌బర్డ్ వరకు భారీ జీవ వైవిధ్యాన్ని ప్రతిబింబించాయి. డీఎన్ఏల ద్వారా ఒక మీటరు పొడవాటి రెక్కలుండే గబ్బిలాలు, బయటకు కనిపించని పర్వత కోతులు, బూడిద, ఎరుపు వర్ణాల కోతులు, సుంచు ఎలుకలు, అనేక రకాల చిలుకలు ఉన్నట్టు గుర్తించారు. -
విలేజ్ పంచాయతీ ప్రెసిడెంట్: వీరమ్మాళ్ @ 89
‘సేవకు వయసుతో పని ఏమిటి?’ అంటోంది 89 సంవత్సరాల వీరమ్మాళ్. ఈ బామ్మ తమిళనాడులోని అరిట్టపట్టి గ్రామ పంచాయితీ ప్రెసిడెంట్. రకరకాల కార్యక్రమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే వీరమ్మాళ్ తన ఆరోగ్య రహస్యం ‘నిరంతర కష్టం’ అంటోంది... మామూలుగానైతే బామ్మల మాటల్లో ‘మా రోజుల్లో’ అనేది ఎక్కువగా వినబడుతుంది. అది ఆ వయసుకు సహజమే కావచ్చుగానీ 89 సంవత్సరాల వీరమ్మాళ్ ఎప్పుడూ వర్తమానంలోనే ఉంటుంది. నలుగురితో కలిసి నడుస్తుంది. వారి కష్టసుఖాల్లో భాగం అవుతుంది. వీరమ్మాళ్ విలేజ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మధురైలోని అరిట్టపట్టి గ్రామాన్ని తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర తొలి బయో డైవర్శిటీ సైట్‌గా ఎంపిక చేసింది. అరిట్టపట్టిలో పుట్టి పెరిగి అక్కడే వివాహం అయిన వీరమ్మాళ్‌కు ఆ గ్రామమే ప్రపంచం. అలా అని ‘ఊరి సరిహద్దులు దాటి బయటకు రాదు’ అనే ముద్ర ఆమెపై లేదు. ఎందుకంటే గ్రామ సంక్షేమం, అభివృద్ధి కోసం ఉన్నతాధికారులతో మాట్లాడడానికి పట్టణాలకు వెళుతూనే ఉంటుంది. ‘ఫలానా ఊళ్లో మంచిపనులు జరుగుతున్నాయి’ లాంటి మాటలు చెవిన పడినప్పుడు పనిగట్టుకొని ఆ ఊళ్లకు వెళ్లి అక్కడ అమలు చేస్తున్న కార్యక్రమాలను అధ్యయనం చేస్తుంటుంది. తన గ్రామంలో అలాంటి కార్యక్రమాలు అమలయ్యేలా కృషి చేస్తుంటుంది. ‘స్త్రీలకు ఆర్థిక స్వాతంత్య్రం’ అనే మాట గట్టిగా వినిపించని రోజుల్లోనే స్వయం–సహాయక బృందాలను ఏర్పాటు చేసి గ్రామంలోని మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసేది. రైతులకు వ్యవసాయ రుణాలు అందేలా ఆఫీసుల చుట్టూ తిరిగేది. మహిళలు గడప దాటి వీధుల్లోకి వస్తే... ‘ఇదేం చోద్యమమ్మా’ అని గుసగుసలాడుకునే కాలం అది. వీరమ్మాళ్ మాత్రం గ్రామంలోని రకరకాల సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఎన్నో ఊళ్లు తిరిగేది. ఎవరు ఎలా మాట్లాడుకున్నా పట్టించుకునేది కాదు. ఆమె దృష్టి మొత్తం సమస్యల పరిష్కారంపైనే ఉండేది. విలేజ్ ప్రెసిడెంట్‌గా వాటర్ ట్యాంకులు, వాగులు దాటడానికి వంతెనలు నిర్మించింది. జల్ జీవన్ మిషన్ కింద ఎన్నో ఇండ్లకు తాగునీరు అందేలా చేసింది. వీధిలైట్ల నుంచి వీధుల పరిశుభ్రత వరకు అన్నీ దగ్గరి నుంచి చూసుకుంటుంది. అలా అని ఊళ్లో అందరూ వీరమ్మాళ్‌కు సహకరిస్తున్నారని కాదు. ఎవరో ఒకరు ఏదో రకంగా ఆమె దారికి అడ్డుపడుతుంటారు. వారి నిరసన వెనక రాజకీయ కారణాలు ఉన్నాయనే విషయం స్పష్టంగా అర్థమవుతూనే ఉంటుంది. అలాంటి వారికి వీరమ్మాళ్ తరపున గ్రామస్థులే సమాధానం చెబుతుంటారు. గ్రామంలో వృథాగా పడి ఉన్న భూములను వినియోగంలోకి తీసుకువచ్చే విషయంపై దృష్టి పెట్టింది వీరమ్మాళ్. ‘పనికిరాని భూమి అంటూ ఏదీ ఉండదు. మనం దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటున్నామా, వృథాగా వదిలేస్తున్నామా అనే దానిపైనే ఆ భూమి విలువ ఆధారపడి ఉంటుంది’ అంటుంది వీరమ్మాళ్. ‘వీరమ్మాళ్ అంకితభావం గురించి ఆ తరం వాళ్లే కాదు ఈ తరం వాళ్లు కూడా గొప్పగా చెబుతుంటారు. గ్రామ అభివృధ్ధికి సంబంధించి ఎంతోమందికి ఆమె స్ఫూర్తి ఇస్తుంది’ అంటున్నాడు అరిట్టపట్టి విలేజ్ ఫారెస్ట్ కమిటీ హెడ్ ఆర్’ ఉదయన్. రోజూ ఉదయం అయిదు గంటలకు నిద్ర లేచే వీరమ్మాళ్ వంటపని నుంచి ఇంటి పనుల వరకు అన్నీ తానే స్వయంగా చేసుకుంటుంది. పొలం పనులకు కూడా వెళుతుంటుంది. ‘బామ్మా... ఈ వయసులో ఇంత ఓపిక ఎక్కడిది?’ అని అడిగితే– ‘నా గ్రామం బాగు కోసం నా వంతుగా కష్టపడతాను... అని అనుకుంటే చాలు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. అదే శక్తిగా మారి ఆరోగ్యాన్ని ఇస్తుంది. దేవుడు నన్ను ఈ భూమి మీది నుంచి తీసుకుపోయే లోపు గ్రామ అభివృద్ధి కోసం నేను కన్న కలలు సాకారం కావాలని కోరుకుంటున్నాను’ అంటుంది వీరమ్మాళ్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ సుప్రియ సాహు అరిట్టపట్టి గ్రామానికి వచ్చి బామ్మను కలుసుకుంది. ‘వీరమ్మాళ్ బామ్మతో మాట్లాడడం, ఆమె నోటి నుంచి గ్రామ అభివృద్ధి ప్రణాళికల గురించి వినడం అద్భుతమైన అనుభవం’ అంటుంది సుప్రియ. -
ప్రమాదంలో జీవ వైవిధ్యం
ఆకాశాన్నంటే హిమాలయాల నుంచి, మూడు వైపులా ఆవరించిన అనంత సాగర జలరాశి దాకా; సహారా ఇసుక ఎడారి మొదలుకుని, అపార జీవరాశికి ఆలవాలమైన సుందర్బన్ వంటి అడవుల దాకా... అంతులేని జీవ వైవిధ్యానికి పుట్టిల్లు మన దేశం. అలాంటి జీవవైవిధ్యం ఇప్పుడు మనిషి నిర్వాకం వల్ల అక్షరాలా అతలాకుతలమవుతోంది. అస్తిత్వం కోసం పెనుగులాడుతోంది. అతి త్వరలో పూర్తిగా అంతరించిపోయే పెను ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. కారణమేమిటి? ♦ విచ్చలవిడిగా అడవుల నరికివేత, అడ్డూ అదుపూ లేని పట్టణీకరణ, ఫలితంగా విపరీతమైన కాలుష్యం, వాతావరణ మార్పులు తదితరాలు. ♦ భారత్‌లో 1990–2020 మధ్య 30 ఏళ్లలోనే ఏకంగా ఏడు లక్షల హెక్టార్ల మేరకు అడవి నరికివేతకు గురైనట్లు యుటిలిటీ బిడ్డర్ నివేదిక చెబుతోంది. ఇదిఇలాగే కొనసాగితే వన్యప్రాణులకు కనీసం నిలువ నీడ కరువవుతుంది. ♦ విచ్చలవిడిగా విస్తరిస్తున్న నగరాలు క్రమంగా చిత్తడి, గడ్డి నేలల వంటి సహజ జీవ వ్యవస్థలను కబళిస్తున్నాయి. ♦ ప్రణాళికలేని విస్తరణతో పలు నగరాలు వరదల వంటి సమస్యలతో సతమతమవుతున్నాయి. ♦దీని తాలూకు విపరిణామాలకు బెంగళూరే అతి పెద్ద ఉదాహరణ. కేవలం గత 50 ఏళ్లలోనే నగరంలో పచ్చదనం 88 శాతం, నీటి వనరులు 79 శాతం మటుమాయమయ్యాయి! ♦ పెరిగిపోతున్న ధ్వని, కాంతి కాలుష్యం వణ్యప్రాణుల జీవితాలను, ప్రవర్తనను, పునరుత్పత్తి సామర్థ్యాన్ని... మొత్తంగా వాటి మనుగడనే దెబ్బ తీస్తోంది. ముప్పేట ముప్పు! ♦ జీవవైవిధ్యం అంతరిస్తే తలెత్తే విపరిణామాలను ఊహించడం కూడా కష్టమే. ♦ వాతావరణ ధోరణులు పూర్తిగా మారిపోతాయి. వాటితో పాటే రుతువులూ క్రమం తప్పిపోతాయి. అంతా అల్లకల్లోలమవుతుంది. ♦ సముద్ర మట్టాలు మరింత పెరిగి తీర ప్రాంతాలను క్రమంగా కనుమరుగవుతాయి. ♦ సముద్ర జలాల్లో ఆమ్లత్వం పెరిగి వాటిలోని జీవజాలానికి ముప్పు ఏర్పడుతుంది. ♦ హిమానీ నదాలు శరవేగంగా కరిగిపోతాయి. ♦ ప్రజలు భారీగా నిర్వాసితులవుతారు. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ♦ పలు అరుదైన జీవ జాతులు శాశ్వతంగా అంతరించిపోతాయి. రాయల్ బెంగాల్ టైగర్, గోల్డెన్ లంగూర్, సిరోయ్ లిలీ వంటివి ఇప్పటికే ఈ జాబితాలోకి చేరాయి. ఏం చేయాలి? ♦ జీవవైవిధ్యపరంగా ప్రస్తుత తిరోగమన ధోరణికి అడ్డుకట్ట వేయాలంటే ప్రభుత్వాలు తక్షణం సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో రంగంలోకి దిగాలి. ♦ శాస్త్రీయ, సమాజ, విధానపరంగా కలసికట్టుగా కృషి జరగాలి. ♦ పర్యావరణ, సహజ వనరుల పరిరక్షణకు నగదు ప్రోత్సాహకాల వంటివి ఇవ్వాలి. ఉత్తరాఖండ్ ఇప్పటికే ఈ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ♦ తీవ్ర వాతావరణ పరిస్థితులను నిరోధించి పర్యావరణ సమతుల్యతను కాపాడే మడఅడవుల వంటి సహజ వనరులను పూర్తిస్థాయిలో పరిరక్షించుకోవాలి. ♦ పర్యావరణ విద్యను బోధన ప్రణాళికలో తప్పనిసరి చేయాలి. ♦ జీవ వైవిధ్య పరిరక్షణ ప్రాధాన్యత ప్రజలందరికీ అర్థమయ్యేలా ముమ్మర ప్రచారం చేపట్టాలి. హాట్‌స్పాట్స్.. విశేషాల పుట్టిళ్లు! ♦ అంతర్జాతీయ గుర్తింపున్న 36 జీవవైవిధ్య హాట్స్పాట్లలో నాలుగింటికి భారత్ నెలవు. అవి హిమాలయ ప్రాంతం, పశ్చిమ కనుమలు, ఇండో–బర్మా జోన్, సుందర్బన్ అడవులు. ♦ ఇవి మనుషులతో పాటు పలు జీవజాలాలకు నిలయాలు. ♦ తాగునీటి, ఆహార అవసరాలను సమర్థంగా తీరుస్తున్నాయి. ♦ వాతావరణాన్ని నియంత్రిస్తూ జీవజాలానికి ఎంతో మేలు చేస్తున్నాయి. ♦ ప్రాణికోటి మనుగడకు అత్యవసరమైన ఆక్సిజన్ ఉత్పత్తికి ఇవి ప్రధాన వనరులు. ♦ ఈ హాట్స్పాట్లు అతి పెద్ద పర్యాటక ఆకర్షణలు. తద్వారా స్థానికులకు ఆర్థికంగా పెద్ద ఆలంబనగా నిలుస్తున్నాయి. ♦ ఇక ఈ హాట్ స్పాట్స్‌కు మూలమైన అడవుల మీద దేశ జనాభాలో 22 శాతం మంది తమ జీవికకు, సామాజిక, సాంస్కృతిక అవసరాలకు పూర్తిగా ఆధారపడ్డారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రతిభకు మారు పేరు ఆ ఊరు
అది ఆదివాసీ గ్రామం. ఆ ఊరికి సర్పంచ్ ఓ మహిళ. అక్కడ రాజకీయాల్లేవు. ఉన్నదంతా జనంలో ఐకమత్యమే. ఊరిలో అవినీతికి తావు లేదు. అభివృద్ధికి చిరునామాగా మారింది. ఊరంతా సస్యశ్యామలంగా ఉంది. జీవవైవిధ్యతకు ప్రతీకగా నిలిచింది. సర్పంచ్ ప్రతిభకు మారుపేరయింది. తెలంగాణ, కుమ్రుం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, మార్లవాయి గ్రామం. ఆ గ్రామ సర్పంచ్ ప్రతిభ మంగళవారం నాడు (మే, 23వ తేదీ) ఇంటర్నేషనల్ బయో డైవర్సిటీ డే సందర్భంగా ‘తెలంగాణ స్టేట్ బయోడైవర్సిటీ’ అవార్డు అందుకున్నారు కనక ప్రతిభ. తన ప్రతిభతో గ్రామాన్ని నందనవనంగా మార్చిన ఆమె సాక్షితో పంచుకున్న విశేషాలివి. ‘‘మహిళా రిజర్వేషన్లో భాగంగా మా పంచాయితీని మహిళలకు కేటాయించారు. చదువుకున్న వాళ్లయితే బాగుంటుందని మా ఊరి వాళ్లందరూ 2019లో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగని నేను ఎక్కువేమీ చదువుకోలేదు. డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉండగా పెళ్లయింది. ఊరిని బాగు చేయాలనే సంకల్పం ఉంటే ఈ చదువైనా చాలు. మా ఊరి జనాభా 708, మొత్తం కుటుంబాలు 130. ప్రాథమిక పాఠశాల, ఆశ్రమ పాఠశాల కూడా ఉంది. ఇక అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ భవనం ఉన్నాయి. నేను వచ్చిన తర్వాత 26 మంది మహిళలకు చేతన ఫౌండేషన్ ద్వారా టైలరింగ్‌లో శిక్షణ ఇప్పించి, ఎస్బీఐ– ఆర్‌ఎస్‌ఈటీ సహకారంతో కుట్టు మిషన్లు ఇప్పించాను. వాళ్లకు చేతిలో పని ఉండడానికి ఆశ్రమ పాఠశాల విద్యార్థుల యూనిఫామ్ కుట్టే ఏర్పాటు చేశాం. డ్వాక్రా గ్రూపులు పదకొండున్నాయి. డ్వాక్రా డబ్బుతో కొంతమంది కిరాణా దుకాణాలు పెట్టుకున్నారు. వీథి వీథీ తెలుసు! మా ఊరిలో ప్రతి వీథీ, ప్రతి కుటుంబమూ తెలుసు. బడి వయసు పిల్లలందరినీ బడికి పంపించాలని ఇంటింటికీ వెళ్లి చెబుతుంటాను. అలాగే పదేళ్లలోపు ఆడపిల్లలందరికీ ‘సుకన్య సమృద్ధి యోజన’ పథకం కింద బ్యాంకు ఖాతాలు తెరిపించాను. పంచాయితీలకు కేంద్ర ప్రభుత్వ సహకారం బాగుంది. వీథులన్నీ సిమెంట్ రోడ్లు వచ్చాయి. అన్ని ఇళ్లకూ టాయిలెట్లున్నాయి. కిరోసిన్ దీపం వెలిగించాల్సిన అవసరం లేదు, అన్ని ఇళ్లకూ కరెంట్ ఉంది. వందకు పైగా ఇళ్లలో దీపం పథకం గ్యాస్ సిలిండర్లున్నాయి. చదువుకున్న వాళ్ల కోసం చిన్నపాటి వీథి గ్రంథాలయం కూడా పెట్టాం. అలాగే హరితహారంలో భాగంగా మొక్కలు నాటాం. గ్రామంలో ఏ మూలకెళ్లినా పచ్చదనం పరిఢవిల్లుతోంది. మంచినీటి సౌకర్యం, పరిశుభ్రతలో భాగంగా ఎప్పటికప్పుడు డ్రైనేజీ శుభ్రం చేయించడం, ప్లాస్టిక్ వాడకంలో విచక్షణ, తడిచెత్త– పొడి చెత్త పట్ల అవగాహన వంటివన్నీ జీవవైవిధ్య పురస్కారం ఎంపికకు ప్రమాణాలయ్యాయి. అందరూ ఇంటిపన్ను కడతారు మా ఊరిలో అంతా క్రమశిక్షణతో నడుచుకుంటారు. అందరూ ఇంటి పన్ను కడతారు. అంతకుముందెప్పుడో ఇందిరమ్మ ఇళ్లు వచ్చాయి. ఎక్కువమందికి మంచి ఇళ్లున్నాయి. కొంతమంది పెంకుటిళ్లలో ఉంటే, ఇప్పటికీ కొంతమంది మట్టికప్పు ఇళ్లలోనే ఉన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మాత్రం రాలేదు. మా ఊరి వాళ్ల గొప్పమనసు ఏమిటంటే... ఊరి బాగు కోసం ఏ పని చేపట్టినా అంతా కలసి వస్తారు. అందరూ ఇంకుడు గుంతలు తవ్వుకున్నారు. జీవవైవిధ్యత నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ వంటి కార్యక్రమాల్లో మొక్కలు నాటడం, వాటిని పరిరక్షించడంలో సంతోషంగా ముందుకు వస్తారు. వీథులకు రెండువైపులా రకరకాల మొక్కలు నాటాం. గిరి వికాస్ పథకం ద్వారా వ్యవసాయానికి 30 బావులు తవ్వించాం. అంతకు ముందు ఇరవై బావులుండేవి. ఊరిలో ఎక్కువమంది వ్యవసాయం చేస్తారు. ఒక్కొక్కరికి పదెకరాలకు తక్కువ లేకుండా భూమి ఉంది. అసలే భూమి లేని వాళ్లు కూడా ఉన్నారు. వాళ్లకు ఉపాధి హామీ పనుల కార్డు ఉంది. పొలాలకు గట్లు, చెరువు పూడిక తీయడం, పొలాల్లోకి వెళ్లడానికి మట్టిరోడ్లు వేయడం వంటి పనులు ఉపాధి హామీలో చేయిస్తాం. ఆకలి, పేదరికం మా ఊరి పొలిమేరలకు కూడా రావు. వ్యవసాయంతోపాటు ఆవులు, గేదెలు, మేకలు, కోళ్లు పెంచుకుంటారు. ప్రతి ఒక్కరూ పని చేస్తారు. సంతోషంగా జీవిస్తారు. ► ఉత్తమ గ్రామ పంచాయితీ 2021 అక్టోబర్ ► ఉత్తమ మహిళా సర్పంచ్ 2021 మార్చి 8 ► జాతీయ స్థాయిలో సంసద్ ఆదర్శ గ్రామీణ యోజనలో ఉత్తమ గ్రామ పంచాయితీ ► పేదరికరహిత, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనలో మొదటి స్థానం ► బెస్ట్ బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ అవార్డు 2023 మా ఊరికి సర్పంచ్‌గా నేను తొలి మహిళను. మహిళ అయిన కారణంగా నన్ను తక్కువ చేసి చూడడం మా దగ్గర ఉండదు. అంతా అభిమానంగా ఉంటారు. ఊరందరూ ఒక మాట మీద ఉంటారు కాబట్టి నేను ఇన్ని పనులు చేయగలుగుతున్నాను’’ అని గ్రామ తొలి మహిళగా తన అనుభవాలను వివరించారు ప్రతిభ. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ప్రతి మూడో ముద్ద తేనెటీగలు పెడుతున్నదే!
ప్రకృతిలో తేనెటీగల వంటి చిరుప్రాణులు లేక పోతే మన మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. మొక్కల్లో పూలు కాయలుగా మారడానికి పరాగ సంపర్కమే కారణం. ఈ ప్రక్రియకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపకరిస్తూ పంటల ఉత్పాదనలో ఈ చిరుప్రాణులు తోడ్పడటం వల్లనే మనం మూడు పూటలా తినగలుగుతున్నాం. మనం తింటున్న ప్రతి మూడో ముద్ద ముఖ్యంగా తేనెటీగల పుణ్యమే. తేనెటీగలు లేకపోతే ఎన్నో రకాల పంటలు పండవు. అందుకే, తేనెటీగలు అంతరిస్తే నాలుగేళ్లలోనే మానవ జాతి అంతరిస్తుంది అన్నాడో మహనీయుడు. తేనెటీగల ఉసురు తీస్తున్న పురుగుమందులు, కలుపుమందులు, పచ్చదనం కొరత, వ్యాధికారక క్రిముల విజృంభణ వంటి సమస్యలకు ఇప్పుడు అదనంగా ‘వాతావరణ మార్పులు’తోడయ్యాయి. అందువల్ల కరువు, కుంభవృష్టి వంటి వాతా వరణ మార్పు ప్రభావాల నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ తేనెటీగలను సైతం కనిపెట్టుకుని ఉండాలి. – సాక్షి సాగుబడి డెస్క్ మనం ఏం చేయగలం? ♦ అటవీ ప్రాంతాలను నాశనం చేయకుండా ఉండటం.. ♦ గ్రామీణ ప్రాంతాల్లో పొలాల గట్ల మీద రకరకాల స్థానిక రకాల పూల మొక్కల్ని పెంచటం.. ♦నగరాలు, పట్టణాల్లోని ఖాళీ స్థలాల్లో, మిద్దె తోటల్లో, పెరటి తోటల్లో, ముఖ్యంగా రోడ్ల పక్కన ఖాళీ జాగాల్లో కూడా మొక్కలతోపాటు స్థానిక జాతుల పూల మొక్కల్ని విస్తృతంగా పెంచటం.. ♦ రసాయనిక పురుగు మందులు, కలుపు మందులు చల్లకుండా ఉండటం.. ♦తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించటం వంటి పనులను మనం చేస్తుంటే జీవవైవిధ్యం పరిఢవిల్లుతుంది. తేనెటీగల వంటి చిరు జీవులు మనుగడ సాగిస్తాయి. మనల్ని రక్షిస్తాయి.. తేనెటీగలు.. కొన్ని వాస్తవాలు ♦ తేనెటీగ సగటు జీవితకాలం పనిచేసే కాలంలో సుమారు 1.5 నెలలు; పని లేని సీజన్లో సుమారు 2.5 నెలలు. ∙అర కిలో తేనె ఉత్పత్తికి 556 తేనెటీగలు పని చేయాల్సి ఉంటుంది. ♦ తేనెటీగల సంతతి వసంత రుతువులో 15,000 ఉంటుంది. వేసవిలో 80,000 వరకు ఉంటుంది. ♦ 2021లో ప్రపంచవ్యాప్తంగా సహజంగా ఉత్పత్తయిన తేనె: 1.77 మిలియన్ మెట్రిక్ టన్నులు 20,000 ప్రకృతిలో ఉన్న తేనెటీగల జాతులు.. పరాగ సంపర్కానికి దోహదపడే.. అంతరించిపోయే ముప్పుఎదుర్కొంటున్న సకశేరుక (వెన్నెముక ఉన్న) జాతులు 16.9 అంతరించిపోతున్న తేనెటీగలు, సీతాకోక చిలుకలు వంటి అకశేరుక (వెన్నెముక లేని) జాతులు 40% తేనెటీగలు తదితర కీటకాల పరాగసంపర్కమే ఆధారం. పుష్పించే అడవి మొక్కలు/చెట్లలో తేనెటీగలు/జంతువుల పరాగసంపర్కంపై ఆధారపడుతున్నవి. 90% ప్రపంచవ్యాప్తంగా పరాగసంపర్కంపై ఆధారపడి ఉన్న ఆహార పంటలు. 75% -
బయోడైవర్సిటీ సంరక్షణలో ఏపీ టాప్
-
జీవ వైవిధ్య సంరక్షణలో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా జీవ వైవిధ్య పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ నడుం కట్టింది. గ్రామ స్థాయిలో జీవ వైవిధ్య యాజమాన్య కమిటీలు, అక్కడి ప్రత్యేకతలతో జీవ వైవిధ్య రిజిస్టర్లు రూపొందించి జీవ వైవిధ్య సంరక్షణకు పటిష్టమైన పునాదులు వేసింది. 2002లో జీవ వైవిధ్య చట్టం అమల్లోకి వచ్చినా.. రాష్ట్రంలో దాని అమలుకు సంబంధించిన నియమ నిబంధనలకు మాత్రం 2009లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ఆమోదం లభించింది. ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వంలో జీవ వైవిధ్య సంరక్షణకు ప్రాధాన్యత పెరిగి ఆ అంశంలో దేశంలోనే అగ్రగామిగా ఎదిగింది. అన్ని గ్రామాల్లో యాజమాన్య కమిటీలు జీవ వైవిధ్య చట్టం ప్రకారం రాష్ట్రంలోని అన్ని స్థానిక సంస్థల్లో జీవ వైవిధ్య యాజమాన్య కమిటీలను ఏర్పాటు చేసి.. తద్వారా ప్రజా జీవ వైవిధ్య రిజిస్టర్లను రూపొందించాల్సి ఉంది. కానీ.. జీవ వైవిధ్య మండలి ఏర్పాటైన 13 సంవత్సరాల వరకు దాని గురించి ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. మిగిలిన రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో జాతీయ హరిత ట్రిబ్యునల్ 2020 డిసెంబర్‌లోపు అన్ని స్థానిక సంస్థల్లోను వాటిని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో 2020 జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం జీవ వైవిధ్య మండలికి పీసీసీఎఫ్ (ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్) స్థాయి అధికారిని సభ్య కార్యదర్శిగా నియమించడంతో మండలి కార్యకలాపాలు ఊపందుకున్నాయి. సిబ్బంది కొరతను అధిగమించడానికి ప్రతి మండలానికి ఒక స్వచ్ఛంద సేవా సంస్థను కో–ఆర్డినేటర్‌గా మండలి నియమించింది. రాష్ట్రంలో మొత్తం 14,157 స్థానిక సంస్థల్లో ఈ కమిటీలు ఏర్పాటు చేయగా.. వాటిలో 13,363 గ్రామ పంచాయతీ స్థాయివి కాగా 661 మండల పరిషత్, 13 జిల్లా పరిషత్ స్థాయి కమిటీలు ఉండటం విశేషం. ఆ తర్వాత రాష్ట్రంలోని ప్రధాన యూనివర్సిటీల్లో జీవ శాస్త్ర శాఖాధిపతులను సంప్రదించి జీవ వైవిధ్య రిజిస్టర్లను తయారు చేసే పనిలో పాల్గొనేలా చేసింది. సమగ్ర కార్యాచరణ అమలు జీవ వైవిధ్య కమిటీలు పని చేసేందుకు 15 అంశాలతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను తయారు చేశారు. గ్రామ వనాలు, మండల, జిల్లా స్థాయిలో జీవ వైవిధ్య ఉద్యాన వనాలు ఏర్పాటు, అంతరించే జాతుల నర్సరీలను పెంచడం, మొక్కలు నాటడం, చెరువులు, కుంటలను శుభ్రం చేయడం, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడం, సేంద్రియ, ప్రకృతి వ్యవసాయాన్ని పెంపొందించడం, స్కూళ్లు, కాలేజీలలో మొక్కలు నాటడం, మహిళా సంఘాలు, యువతకు అవగాహన కార్యక్రమాలు, స్థానిక వైద్యులు, నాటు వైద్యులను గుర్తించి వారి వద్ద ఉన్న జ్ఞానాన్ని గ్రంథస్తం చేయడం వంటి పనులను ఈ కమిటీలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా అన్ని స్థానిక సంస్థల సర్పంచ్‌లు, గ్రామ సచివాలయ కార్యదర్శులు, క్రియాశీలక సభ్యులతో జాయింట్ బ్యాంక్ ఖాతాలను తెరిపించి వారికి మంజూరు చేసిన నిధులను బదిలీ చేశారు. ఇప్పటివరకు 10 వేల గ్రామ పంచాయతీలకు రూ.75 వేల చొప్పున మొదటి విడతగా రూ.12 కోట్లను బదిలీ చేశారు. జీవ వైవిధ్య సంరక్షణలో ఓ మైలురాయి అన్ని స్థానిక సంస్థల్లోనూ 15 సంవత్సరాల నుంచి అసంపూర్తిగా ఉన్న జీవ వైవిధ్య యాజమాన్యాల కమిటీలను అతి తక్కువ కాలంలో పూర్తి చేయడం జీవ వైవిధ్య సంరక్షణలో ఒక మైలు రాయి. ఇది దేశం మొత్తంలో మన రాష్ట్రానికి ఒక ప్రత్యేకతను, ఒక విశిష్టమైన గుర్తింపును తీసుకువచ్చింది. ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఏపీలో జీవవైవిధ్య సంరక్షణకు సంస్థాగత నిర్మాణం జరిగింది. – దెందులూరి నళినీమోహన్, అటవీ శాఖ పూర్వ పీసీసీఎఫ్, జీవ వైవిధ్య మండలి రిటైర్డ్ సభ్య కార్యదర్శి -
శ్రీశైలం బయో డైవర్సిటీ రీసెర్చ్ సెంటర్.. ఎన్నో ప్రత్యేకతలు
సాక్షి, అమరావతి: ప్రకృతి ప్రసాదించిన వరం నల్లమల అటవీ ప్రాంతం. ఎత్తయిన కొండలు.. జలపాతాలు.. అరుదైన వృక్షాలు.. వన్యప్రాణులు.. అన్నిటికీ మించి పులులు జీవించేందుకు నల్లమల అత్యంత అనుకూలమైంది. విస్తీర్ణంలో దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వు. ఎన్నో విశేషాలు, వింతలు, అద్భుతాలతో అలరారుతున్న నల్లమలను చుట్టి రావాలంటే.. మామూలుగా అయితే సాధ్యం కాదు. కానీ.. అక్కడి జీవవైవిధ్యం అంతటినీ శ్రీశైలం బయో డైవర్సిటీ రీసెర్చ్ సెంటర్లో చూడవచ్చు. నల్లమల ప్రత్యేకతలు, జీవజాలం, జంతుజాలం, పులులు, ఇతర వన్యప్రాణులు వంటి సమస్త సమాచారం అక్కడ ఉంటుంది. నాగార్జున సాగర్ టైగర్ రిజర్వు ప్రాంతంలో జీవవైవిధ్య కార్యకలాపాల కోసం 2001లో స్వతంత్ర జీవవైవిధ్య పరిశోధన కేంద్రాన్ని శ్రీశైలంలో ప్రారంభించారు. దశాబ్ద కాలంలో వన్యప్రాణుల సంరక్షణ, జీవవైవిధ్యం, వివిధ జాతుల జాబితాకు సంబంధించి అత్యుత్తమ పరిశోధనలు ఇక్కడ జరిగాయి. ఈ అటవీ ప్రాంతంలోని వెన్నెముక లేని, వెన్నెముక ఉన్న జీవుల నమూనాలను సేకరించి బయోడైవర్సిటీ రీసెర్చ్ సెంటర్ ల్యాబోరేటరీలో భద్రపరిచారు. ఇదీ నల్లమల జీవవైవిధ్యం పులులు, ఎలుగుబంట్లు వంటి 80 రకాల పాలిచ్చే జంతువులు, 303 జాతుల పక్షులు, 80 రకాల పాకే ప్రాణులు, కప్పల వంటి 20 ఉభయ చరాలు, 55 రకాల చేపలు, 102 రకాల సీతాకోక చిలుకలు, 57 రకాల తూనీగలు, 47 జాతుల కీటకాలు ఇంకా అనేక రకాల కీటక జాతులను ఈ అటవీ ప్రాంతంలో గుర్తించిన పరిశోధనా కేంద్రం చెక్లిస్ట్ను తయారు చేసింది. నాగార్జున సాగర్–శ్రీశైలం పులుల అభయారణ్యం, గుండ్ల బ్రహ్మేశ్వరం, రోళ్లపాడు వన్యప్రాణుల అభయారణ్యాలలో అన్ని రకాల జీవవైవిధ్య సర్వేలు నిర్వహించింది. నల్లమలలోని జంతు, పుష్ప సంపదపై డిజిటల్ ఫొటో డాక్యుమెంటేషన్ చేసింది. అక్కడి జంతుజాలం, వృక్షజాలం యొక్క జాతుల స్థాయిపై సమగ్ర తనిఖీ జాబితాను రూపొందించింది. మాంసాహార ప్రాణుల ఆహారపు అలవాట్లను అధ్యయనం నిర్వహిస్తోంది. శాకాహార ప్రాణుల వెంట్రుకల ద్వారా వాటి లక్షణాలను గుర్తిస్తోంది. ఇక్కడి గడ్డి జాతుల వైవిధ్యం, వృక్ష జాతులతో వాటిపై సంబంధాలపై అధ్యయనం చేసింది. పులుల గణన ఇక్కడే.. నల్లమల అటవీ ప్రాంతంలోని పులుల గణన చేపట్టేది ఈ పరిశోధనా కేంద్రంలోనే. అటవీ ప్రాంతంలో పులులు తిరిగే ప్రాంతంలో ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్‌ల నుంచి సేకరించిన లక్షలాది ఫొటోలను విశ్లేషించి ప్రతి సంవత్సరం పులులను ఇక్కడ లెక్కిస్తారు. పులుల సంఖ్య, వాటి తీరు, ఆడవా, మగవా, వాటి మధ్య తేడాలు వంటి అన్ని అంశాలను గుర్తిస్తారు. పులులపై ఉండే చారల ద్వారా ప్రతి పులి ఆనవాలును ఇక్కడ సేకరించి దాని కదలికలను గమనిస్తారు. చదవండి: పెళ్లయిన ఆ జంటలు.. ఇక ప్రత్యేక కుటుంబాలు చిరుతలు, ఎలుగుబంట్లు వంటి ఇతర జంతువులను కూడా ఈ ఫొటోల ద్వారా గుర్తించి లెక్కిస్తారు. అటవీ సిబ్బందికి శిక్షణ తరగతులు, ప్రజలకు జీవవైవిధ్య పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 8.6 హెక్టార్ల విస్తీర్ణంలో శ్రీశైలం ప్రాజెక్ట్ కాలనీ పక్కన పరిశోధనా కేంద్రం ఆధ్వర్యంలో ఎకోలాజికల్ నాలెడ్జ్ పార్కును అభివృద్ధి చేశారు. ఇందులోని 4.96 హెక్టార్ల విస్తీర్ణంలో భూమి ఆవిర్భావం నుండి ఆధునిక మనిషి జీవ పరిణామ క్రమాన్ని వివరించే థీమ్‌తో ఏర్పాటు చేసిన పార్కు ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. -
జీవ వైవిధ్యం రక్షణ లక్ష్యాలు నెరవేరేనా?
కెనాడా నగరం మాంట్రియల్లో 2022 డిసెంబర్లో జరిగిన 15వ జీవవైవిధ్య సదస్సులో కుదిరిన ఒప్పందంలో పేర్కొన్న లక్ష్యాలను ఆహ్వానించవలసిందే. అయితే వాస్తవ పరిస్థితులను చూస్తే లక్ష్యాలు నెరవేరతాయా అనిపిస్తోంది. భారత్ సహా 190 దేశాల ప్రతినిధులు పాల్గొని చర్చించి ఒక ఒప్పందం చేసుకున్నారు. 2030 నాటికి ఈ ధరిత్రిపై 30 శాతం జీవవైవిధ్యం కాపా డాలన్నది ఒప్పందంలో ప్రధాన అంశం. ఈ విశ్వంలోగల జీవరాశులన్నిటినీ కలిపి జీవావరణం అంటున్నాం. జీవరాశులన్నీ సురక్షితంగా ఉంటేనే జీవవైవిధ్యం చక్కగా ఉంటుంది. అయితే ఇప్పటికే జీవవైవిధ్యం గణనీయంగా ధ్వంసమైపోయింది. ఇందుకు ప్రధానకారణం మానవ కార్యకలాపాలే. 1972లో స్టాక్‌హోమ్‌లో జరిగిన ధరిత్రి పరిరక్షణ సదస్సు తర్వాత ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఆధ్వర్యంలో ఇంతవరకు 27 కాప్ సదస్సులు జరిగాయి. మొత్తం సదస్సుల్లో క్యోటో ఒప్పందం, గతంలో జరిగిన మాంట్రి యల్ ఒప్పందం, పారిస్ సదస్సు, 2021లో జరిగిన గ్లాస్గో, 2022లో ఈజిప్టు షర్మెల్ షేక్ నగరంలో జరిగిన సదస్సుల్లో జరిగిన ఒప్పందాలను ఇప్పటివరకు అమలు చేయలేదు. చేసినా అరకొర నిర్ణయాలే తీసుకొని అమలు చేశారు. గ్లాస్గో ఒప్పందంలోనే 2030 నాటికి సాధించవలసిన లక్ష్యా లను నిర్ణయించారు. వీటిలో చాలా తక్కువగానే సాధించారనీ, రానున్న ఐదేళ్ల కాలంలో సైతం సాధించే అవకాశం కనిపించడంలేదనీ, ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెర్రస్ ఆయా ప్రభుత్వాలు సమర్పించిన ఐదేళ్ల ప్రణాళికలను బట్టి గ్లాస్గో సదస్సుకు ముందు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన జీవ వైవిధ్య సదస్సు చేసిన నిర్ణయాలను, లక్ష్యాలను సాధించడం సాధ్యమేనా? ఇప్పటికే 14 లక్షల జీవజాతులు అంతరించాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. పరిశోధకుల అంచనా మేరకు గడచిన నాలుగు వందల కోట్ల సంవత్సరాల జీవపరిణామ క్రమంలో జీవవైవిధ్యం ఏర్పడింది. దీని పరిరక్షణకు ముందు వ్యవసాయంలో సమూల మార్పులు తీసుకురావలసి ఉంది. ఇందులో భాగంగా కృత్రిమ ఎరువులు, పురుగు మందులను నిలిపి వేసి సంప్రదాయ సేద్యాన్ని చేపట్టాలి. ఇది చాలా నెమ్మదిగా, దీర్ఘకాలం అమలు చేయవలసిన ప్రక్రియ. 2030 నాటికి ఈ మార్పును సాధించగలమా? జీవ వైవిధ్య రక్షణ ఒప్పందం అమలు చేయాలంటే ధనిక దేశాలు... పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు నిధులు సమకూర్చాలనీ, లేకపోతే ఒప్పందం నుండి వైదొలగుతామనీ కాంగో చివరిలో హెచ్చరించింది. అనేక దేశాలు ఈ బాటను ఎంచుకొనే అవకాశం ఉంది. వ్యవ సాయానికిచ్చే సబ్సిడీలను కొనసాగించాలని భారత్, ఇతర అభివృద్ధి చెందిన దేశాలు డిమాండ్ చేశాయి. అమెరికా తదితర కొన్నిదేశాలు 60 శాతానికి పైగా సబ్సిడీలు ఇస్తున్నాయి. సబ్సిడీల విషయాన్ని తుది ఒప్పందం పత్రంలో చేర్చారా లేదా అన్న సందేహాలు వ్యక్తమ య్యాయి. సబ్సిడీలు లేకపోతే వ్యవసాయం సంక్షోభంలో పడి ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. అయితే ఆర్థిక రంగానికి హాని కలిగించే సబ్సిడీలను తగ్గించాలని ఒప్పందంలో చేరుస్తామని ఒప్పందం రూపొందించిన దేశాలు చెప్పాయి. ఈ లక్ష్యాలను 2030 నాటికి సాధించాలంటే కేవలం ఆసియా – పసిఫిక్ ప్రాంత దేశాలకే 300 బిలియన్ డాలర్లు అవసరం అవుతాయని ఆ ప్రాంత ఐరాస ఆర్థిక, సామాజిక కమిషన్ (యుఎన్ఈపీ) అంచనా వేసింది. 2025 నాటికి 20 బిలియన్ డాలర్లు మాత్రమే ఆర్థిక సహాయం చేస్తామని సంపన్న దేశాలు అంగీకరించాయి. మరి లక్ష్యాలు సాధిం చడం సాధ్యమవుతుందా? వాతావరణ విపత్తులు.. పర్యావరణ కాలుష్యం, భూతాపం పెరుగుదల మూలంగా అధికమయ్యాయి. 200 ఏళ్లకు పైగా పారిశ్రామికీకరణ, పెట్రో ఉత్పత్తులు, వ్యవసాయానికి వినియోగిస్తున్న రసాయన ఎరువులు, పురుగుమందులు, విచ్చలవిడిగా అడవుల నరికివేత పెరిగాయి. మన దేశంలో 75 జిల్లాల్లో వాతావరణ వైపరీత్యాలు సంభవిస్తున్నాయని వివిధ అధ్యయనాలతో పాటూ, వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి జాతీయ బ్యాంకు ప్రకటించింది. ఇక అభివృద్ధి పేరుతో విధ్వంసం జరుగుతుందనేది వాస్తవం. ఇందుకు తాజా ఉదాహరణలు లక్ష దీవులు, నికోబార్ దీవుల్లో జరుగుతున్న విధ్వంసం. ఈ ప్రాంతాల్లో వందలు, వేల ఎకరాల భూభాగంలో పచ్చదనం నాశనం అవుతోంది. ఫలితంగా వేలాదిమంది ఆదివాసీ తెగల జన జీవనం మళ్లీ కోలుకోలేనంతగా దెబ్బ తింటోంది. వందలాది పక్షులు, జంతువుల రకాలు, ఇతర లెక్కలేనన్ని జీవరాసులు అంతరించిపోతాయి. సుదీర్ఘ కాలంగా ఈ ప్రాంతాల్లో నెలకొని ఉన్న జీవ వైవిధ్యం మళ్లీ కనిపించదు. ప్రపంచ వ్యాప్తంగా అడవుల్లో నివసించే జంతువులు, పక్షులు, క్షీరదాలు, సరీసృపాలు తదితర అనేక రకాల జీవులలో 1970 నుంచి ఇప్పటి వరకు 69 శాతం నశించాయని లివింగ్ ప్లానెట్ రిపోర్టు (ఎల్పీఆర్)– 2022 నివేదిక తెలిపింది. ప్రపంచ జంతుజాల నిధి సంస్థ పరిధిలో ఎల్పీఆర్ పనిచేస్తోంది. భారత ప్రభుత్వం వాతావరణంపై 2023లో అనేక సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. గతేడాది పారిస్ ఒప్పందంలో భాగంగా జాతీయ నిర్ణయ కార్యాచరణలు (ఎన్డీసీలు) రూపొందించింది. తక్కువ కాలుష్యం వెలు వరించే దీర్ఘకాలిక కార్యాచరణను మన ప్రభుత్వం ప్రకటించింది. అలాగే 2070 నాటికి కాలుష్య రహిత వాతావరణం సాధిస్తామని పారిస్ సదస్సులో ప్రకటించింది. మరి ఈ లక్ష్యాలను సాధించి మన దేశమన్నా మాట నిలుపుకొంటుందేమో చూడాలి. (క్లిక్ చేయండి: లోహియా లోకదర్శన సులోచనాలు!) – టీవీ సుబ్బయ్య, సీనియర్ జర్నలిస్ట్ -
ఆలోచనలు భేష్... ఆచరణ?
అవును. నాలుగేళ్ళ చర్చోపచర్చల తర్వాత ప్రపంచ జీవవైవిధ్య పరిరక్షణ ఒప్పందం (సీబీడీ)పై ఆలోచన ముందుకు కదిలింది. ఏకంగా 190కి పైగా దేశాలు ఈ ఒప్పందం చేసుకోవడం, ఘనంగా 23 భారీ లక్ష్యాలు అందులో ప్రస్తావించడం కచ్చితంగా చరిత్రాత్మకం. ఈ భారీ ఆలోచనకు కీలక మైన ఆచరణే ఇక మిగిలింది. కెనడాలోని మాంట్రియల్లో ఐక్యరాజ్య సమితి సారథ్యంలో జరిగిన జీవవైవిధ్యంపై భాగస్వామ్యపక్షాల 15వ సదస్సు (కాప్15) అక్షరాలా ఒక మైలురాయి. అయితే, ఐరాస పెద్దలే అన్నట్టు అన్నీ సత్వరం అమలుచేసి, పురోగతి సాధిస్తేనే విజయం సాధ్యం. అందుకే, ఈ చరిత్రాత్మక పరిణామంపై ఏకకాలంలో ఇటు ఆశలూ, అటు అనుమానాలూ తలెత్తుతున్నాయి. డిసెంబర్ 7 నుంచి 19 వరకు జరిగిన ‘కాప్15’లో 196 దేశాల అధికారిక ప్రతినిధులు, 10 వేల మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. మొన్న నవంబర్ 20న ఈజిప్ట్‌లో 27వ ఐరాస పర్యావరణ సదస్సు (కాప్ 27) ముగిసిందో లేదో, ఈ జీవవైవిధ్య సదస్సు జరిగింది. ప్రకృతిని కాపాడకుండా, పునరుద్ధరించకుండా భూతాపోన్నతిని 1.5 డిగ్రీలకే పరిమితం చేయడం కుదిరేపని కాదు. అలా జీవవైవిధ్య సదస్సులు కీలకం. అయితే తుపానులు, కరిగిపోతున్న హిమానీనదాలతో పర్యావరణ సంక్షోభం కళ్ళకు కట్టినట్టు, జీవవైవిధ్య నష్టం తెలియదు. అందుకే, తీవ్రంగా పరిగణించక తప్పు చేస్తుంటారు. ఈ సదస్సులకు దేశాధినేతలెవరూ హాజరు కారు. సీబీడీ నిబంధనలు, లక్ష్యాలపై పర్యవేక్షణా తక్కువే. వెరసి పర్యావరణ సదస్సులంత ప్రచారం, రాజకీయ పటాటోపం కనిపించవు. నిజానికి, మూడు దశాబ్దాల క్రితమే 1992లో రియో డిజెనీరోలో జరిగిన ధరిత్రి సదస్సులోనే 150 మంది ప్రభుత్వ నేతలు సీబీడీపై తొలిసారి సంతకాలు చేశారు. జీవవైవిధ్య పరిరక్షణ దాని ప్రధాన ఉద్దేశం. ఆపైన ఆ ఒప్పందానికి మొత్తం 196 దేశాలు ఆమోదముద్ర వేశాయి. అమెరికా మాత్రం ఆమోదించలేదు. అలాగని సంక్షోభం లేదని కాదు. రానున్న రోజుల్లో 34 వేల వృక్ష జాతులు, 5200 జంతు జాతులు అంతరించిపోతాయని ఐరాస అంచనా. ప్రపంచంలోని పక్షిజాతుల్లో ప్రతి ఎనిమిదింటిలో ఒకటి కనుమరుగవుతుందట. అలాగే, భౌగోళిక జీవవైవిధ్యానికి ఆలవాలమైన సహజ అరణ్యాల్లో దాదాపు 45 శాతం ఇప్పుడు లేవు. ఇందులో అధికభాగం గత శతాబ్దిలో సాగిన విధ్వంసమే. తలసరి కర్బన ఉద్గారాల పెరుగుదల, ఉష్ణోగ్రతల్లో మార్పులకు ఇది కారణమని గుర్తించట్లేదు. అదే సమస్య. ఈ నేపథ్యంలో జీవవైవిధ్య నష్టాన్ని నివారించి, 2030 నాటి కల్లా ప్రకృతిని మళ్ళీ దోవలో పెట్టడమే లక్ష్యంగా తాజా ‘కాప్15’ జరిగింది. పర్యావరణ మార్పులపై 2015లో జరిగిన ప్యారిస్ ఒప్పందం ఎలాంటిదో, జీవవైవిధ్య పరిరక్షణకు ఈ ‘కాప్15’ మాంట్రియల్ ఒప్పందం అలాంటిదని విశ్లేషకుల మాట. పారిశ్రామికీక రణకు ముందు నాటి ఉష్ణోగ్రతలతో పోలిస్తే భూతాపోన్నతి 2 డిగ్రీల సెల్సియస్ మించరాదనీ, అసలు 1.5 డిగ్రీల లోపలే ఉండేలా ప్రయత్నించాలనీ దేశాలన్నీ అప్పట్లో ప్యారిస్ ఒప్పందంలో ఏకగ్రీవంగా అంగీకరించాయి. ఇప్పుడీ మాంట్రియల్ ఒప్పందంలో భాగంగా ‘30కి 30’ అంటూ, 2030 నాటికి 30 శాతం భూ, సముద్ర ప్రాంతాలను పరిరక్షించాలని నిర్దేశించుకున్నాయి. జీవ వైవిధ్య పరిరక్షణకు 2030కల్లా 20 వేల కోట్ల డాలర్లు సమీకరించాలని తీర్మానించాయి. పేదదేశాలకు చేరే మొత్తాన్ని 2025 కల్లా ఏటా కనీసం 2 వేల కోట్ల డాలర్లకు పెంచాలని యోచిస్తున్నాయి. విఫలమైన 2010 నాటి జీవవైవిధ్య లక్ష్యాల స్థానంలో మొత్తం 23 లక్ష్యాలను ఈ సదస్సు నిర్ణయించింది. అయితే, వివిధ దేశాలు తమ పరిస్థితులు, ప్రాధాన్యాలు, సామర్థ్యాలకు తగ్గట్టుగా వాటిని మలుచుకొనే స్వేచ్ఛనిచ్చారు. ఇది భారత్ చేసిన సూచనే. ఇక, వర్ధమాన దేశాల్లో వ్యవ సాయ, మత్స్యసబ్సిడీలు, పురుగుమందుల వినియోగంపై వేటు పడకుండా భారత్, జపాన్ తది తర దేశాలు కాచుకున్నాయి. అయితే, లోటుపాట్లూ లేకపోలేదు. ప్రపంచంలోనే పెద్ద వర్షారణ్యా లున్న కాంగో లాంటి ఆఫ్రికన్ దేశాలు చమురు, సహజవాయు అన్వేషణ ప్రమాదంలో పడ్డాయి. అవి కొన్ని అంశాల్లో అసమ్మతి స్వరం వినిపించినా ఈ కొత్త ఒప్పందాన్ని ఖరారు చేశారు. వచ్చే 2030కి సహజ జీవ్యావరణ వ్యవస్థలు 5 శాతం వృద్ధి చెందేలా చూడాలన్న లక్ష్యాన్ని చివరలో తీసేయడమూ నష్టమే. నిర్దిష్ట లక్ష్యాలు లేకుంటే ఆశయాలు మంచివైనా ఆచరణలో విఫలమవుతాం. ‘కాప్–15’ జీవవైవిధ్య ఒప్పందపు సంకల్పంతోనే సరిపోదు. ఒప్పందానికి ఊ కొట్టిన దేశాలు తీరా దాన్ని పాటించకున్నా చర్యలు తీసుకొనే అవకాశం లేదు. అందుకే, 23 లక్ష్యాల సాధనపై అను మానం, ఆందోళన. గతంలో జీవవైవిధ్య ప్రణాళికల అమలులో ప్రపంచ దేశాలు ఘోరంగా విఫల మయ్యాయి. 2010లో జపాన్‌లోని ఐచీలోనూ ఇలాగే 20 లక్ష్యాలను 2020 నాటికల్లా అందుకోవా లని పెట్టుకున్నాం. కానీ, వాటిలో ఒక్కటీ సాధించలేదు. మరోసారి అలాంటి అప్రతిష్ఠ రాకూడదు. తక్షణం కార్యరంగంలోకి దూకాలి. పరిమితవనరుల్ని యథేచ్ఛగా వాడుతూ, కర్బన ఉద్గారా లకు కారణమవుతున్న ధనిక పాశ్చాత్య ప్రపంచానికి ముకుతాడు వేయాలి. జంతుజాలాన్నీ, పశు పోషణతో అడవుల నరికివేత సాగుతున్న అమెజాన్ వర్షారణ్యాల్నీ కాపాడుకోవాలంటే ఆ దేశాల ఆహారపుటలవాట్లు మారాలి. మూలవాసుల హక్కుల్ని గౌరవించాలన్న మాటా ఆహ్వానించదగ్గదే. దశాబ్దాల క్రితమే చేయాల్సిన పనికి ఇప్పటికైనా నడుం కట్టడం మంచిదే. ప్రపంచం కలసికట్టుగా నడవాల్సిన వేళ కెనడా, చైనాల సహ ఆతిథ్యంలో ఈ సదస్సు, ఒప్పందం శుభపరిణామాలే! -
111 జీవో ఎత్తివేతతో జరిగేది ఇదే?
సాక్షి, హైదరాబాద్: సుదూర ప్రాంతాల నుంచి జంట జలాశయాలకు ఏటా వలస వచ్చే రాజహంసలు.. బాతులు.. కొంగలు.. గోరింకలు.. డేగలు తదితర పక్షుల జాడ క్రమంగా కనుమరుగు కానుందా? జీవో 111 ఎత్తివేతతో సుందర జలాశయాల చుట్టూ గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు, కాంక్రీట్ మహారణ్యం పెరిగి.. శబ్ద, వాయు కాలుష్యం, పక్షుల సహజ ఆవాసాలైన జలాశయాలను కాలుష్య కాసారంగా మార్చేయనుందా? ఈ ప్రశ్నలకు పర్యావరణ వేత్తలు, పక్షి ప్రేమికులు అవుననే సమాధానమిస్తున్నారు. ► సైబీరియా.. యూరప్.. ఆఫ్రికా.. మయన్మార్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ తదితర దేశాల నుంచి జంట జలాశయాలకు ఏటా అక్టోబరు నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో వేలాదిగా విభిన్న రకాల పక్షి ప్రజాతులు తరలివస్తాయి. హిమాయత్‌సాగర్‌కు సుమారు 200 వరకు గుజరాత్ నుంచి రాజహంసలు వలస రావడం పరిపాటే. మొత్తంగా ఈ జలాశయానికి 52 రకాలు, ఉస్మాన్‌సాగర్‌కు 92 రకాల పక్షి జాతులు వలస వస్తాయి. ► జలాశయాల చుట్టూ గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు ఏర్పడిన పక్షంలో వలస పక్షులకు సమీప భవిష్యత్‌లో గడ్డు పరిస్థితులు తప్పవని పక్షి ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. విభిన్న రకాల గోరింక ప్రజాతులకూ ఇక్కట్లేనని చెబుతున్నారు. సుమారు పదివేల కిలోమీటర్ల దూరం నుంచి వలసవచ్చే బార్‌హెడ్‌గూస్ (బాతు) జాడ కూడా కనిపించదని స్పష్టం చేస్తున్నారు. ఆఫ్రికా ఖండం నుంచి వలస వచ్చే పైడ్ క్రస్టెడ్ కకూ అనే పక్షి రాక ఉండదని చెబుతున్నారు. వలస వచ్చే ప్రధాన పక్షి జాతులివే: గుజరాత్ రాజహంసలు (గ్రేటర్ ఫ్లెమింగోలు), పిన్‌టెయిల్డ్ డక్(బాతు), షౌలర్,గార్గినే టేల్, హ్యారియర్స్ డేగలు, ఫ్లైక్యాచెస్, గోరింక ప్రజాతికి చెందిన రోజీపాస్టర్స్, స్టార్‌లింక్స్, భార్మెడోగూస్ బాతు, పైడ్ క్రస్టడ్ కకూ వీటిలో ప్రధానంగా కొంగలు, బాతులు, డేగలు, గుడ్లగూబలు, నీటికోళ్లు తదితర జాతులున్నాయి. (క్లిక్: ఈ పిల్లిని ఎలా రక్షిస్తారు? పోలీసు ఫేస్బుక్లో పోస్టు చేస్తూ..) నగరీకరణ, కాలుష్యం పెరిగితే కష్టమే జంటజలాశయాల చుట్టూ సమీప భవిష్యత్‌లో పట్టణీకరణ ప్రభావం, శబ్ద, వాయు కాలుష్యాలకు అవకాశం ఉంది. దీంతో సుదూర ప్రాంతాల నుంచి నగరానికి వలస వచ్చే పక్షిజాతుల జాడ కనిపించదు. జీవవైవిధ్యం ప్రమాదంలో పడుతుంది. – డాక్టర్ శ్రీనివాసులు, ప్రొఫెసర్, జంతుశాస్త్ర విభాగం ఉస్మానియా విశ్వవిద్యాలయం -
కొబ్బరి చెట్లకు క్లోనింగ్
తిరువనంతపురం: చాలా నెమ్మదిగా పెరిగే కొబ్బరి చెట్లను కూడా తాము క్లోనింగ్ చేయగలిగినట్లు బెల్జియం యూనివర్సిటీ పరిశోధకులు ప్రకటించారు. బెల్జియంలోని కె.యు.ల్యువెన్ అండ్ అలయెన్స్ ఆఫ్ బయో డైవర్సిటీ ఇంటర్నేషనల్‌కు చెందిన పరిశోధకులు వేగంగా కొబ్బరి మొక్కలను ఎక్కువ సంఖ్యలో పెంచడంతోపాటు, కొబ్బరి జన్యు మూలాలను దీర్ఘకాలం పరిరక్షించే వీలుంది. వీరు సాధించిన విజయం భారత్ వంటి దేశాల్లోని కొబ్బరి రైతులు ఎదుర్కొనే వ్యాధులు, వాతావరణ మార్పులు, సముద్ర మట్టాల్లో పెరుగుదల వంటి సమస్యల నుంచి విముక్తి కలగనుంది. ‘అసాధ్యమని భావిస్తున్న కొబ్బరి క్లోనింగ్‌ను మేం సాధించాం. మా పరిశోధన కొబ్బరి జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు, కొబ్బరికి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు సాయపడుతుంది’ ఈ పరిశోధకులు ఒక ప్రకటనలో తెలిపారు. అరటి పండుపై సాగించిన పరిశోధనల ఫలితాల స్ఫూర్తితోనే ఈ విజయం సాధించినట్లు చెప్పారు. తమ విధానంపై పేటెంట్ కోసం త్వరలో దరఖాస్తు చేసుకోనున్నట్లు చెప్పారు. ఈ ఫలితాలు సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్ సెప్టెంబర్ ఎడిషన్‌లో ప్రచురితమయ్యాయి. -
పెద్దపులి నుంచి పునుగు పిల్లి వరకు..
సాక్షి, ఆత్మకూరురూరల్: తూర్పు కనుమల్లో విస్తరించిన నల్లమల అడవులు జీవ వైవిధ్యానికి ఆసియా ఖండంలోనే ప్రఖ్యాతిగా నిలిచాయి. సింహం, ఏనుగు మినహా అన్ని రకాల జంతువులు ఇక్కడ జీవిస్తున్నాయి. మాంసాహార, గడ్డి తినే జంతువులతో పాటు పలు సరీసృపాలు, ఉభయచరాలు, కీటకాలు, పక్షులు ఉన్నాయి. అటవీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయడం, వన్యప్రాణి వేటగాళ్లను కట్టడి చేయడంతో అడవిలో జంతుజాలం అలరారుతోంది. ఏటా జంతువులసంఖ్య క్రమేణా పెరుగుతున్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. మాంసాహార జంతువులలో ప్రముఖమైన పెద్దపులి నుంచి పునుగు పిల్లి వరకు మొత్తం 17 రకాలు, తొమ్మిది రకాల గడ్డి తినే జంతువులు ఉన్నాయి. అంతరించి పోయే దశలో ఉన్న పెద్దపులులతో పాటు అరుదైన జీవజాలానికి నెలవుగా ఉన్న కొండగొర్రెలు (చౌసింగా) తన ఉనికిని చాటుతూ నల్లమల అటవీ సాంద్రతను నిరూపిస్తున్నాయి. అలాగే నిశాచరి అయిన హనీబాడ్జర్ కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది. అటవీ పరిధిలోని కృష్ణానది, పలు కొండవాగుల్లో, నీటిదొరువుల్లో సరీ సృపాలకు చెందిన మొసళ్లు జీవిస్తున్నాయి. అలాగే భారీ తాబేళ్లు (టోలిలు) కూడా ఉన్నాయి. నెమలి, కొండ కోడి (గ్రే జంగిల్ పౌల్), హార్న్‌బిల్ వంటి 200 రకాల అరుదైన పక్షుల కిలకిలరావాలతో నల్లమల పులకిస్తోంది. ఇవే గాక 13 రకాల గబ్బిలాలు, బెట్టుడత లాంటి ఉడుత జాతి జంతువులు, ఎలుక జాతులు, సాలెపురుగు, చెదపురుగులు వంటి లెక్కలేని కీటకాలు ఉన్నాయి. అయితే వెదురు తోపులు పచ్చిక బయళ్లను ఆక్రమించడంతో జింకలు ఇక్కడి నుంచి మైదాన ప్రాంతాలకు తరులుతున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు నల్లమలలో తరచూ కనిపించే జింకలు ఇప్పుడు సమీపంలోని రోళ్లపాడు అటవీ ప్రాంతంలో అధికంగా సంచరించడమే ఇందుకు నిదర్శనమని చెప్పవచ్చు. విఫలమైన గడ్డి పెంపకం.. నల్లమలతో పాటు చుట్టూ ఉన్న మైదాన ప్రాంతాల్లో కూడా పశువుల సంఖ్య గణనీయంగానే ఉంది. 2001 లెక్కల ప్రకారం అడవిలో 5.81 లక్షల వన్యప్రాణులు ఉండగా సమీప గ్రామాల్లో (3 కిమీ లోపు) 6.24 లక్షల పెంపుడు జంతువులు ఉన్నాయి. వీటిల్లో గడ్డితినే జంతువులన్నింటికీ నల్లమలనే ఆధారం. నల్లమలలో 1,33,122 హెక్టార్ల గడ్డి లభించే ప్రాంతం ఉండగా.. ఏటా సుమారు 3,86,053 టన్నుల గడ్డి లభ్యమవుతోంది. ఇప్పుడున్న జంతువులకు 6.934 లక్షల టన్నుల గడ్డి అవసరం కాగా 3.073 టన్నుల కొరత ఉంది. వేసవిలో గడ్డి సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. దీంతో సమస్య పరిష్కారానికి అధికారులు అడవిలో ఏర్పాటు చేసిన సోలార్ పంప్సెట్ల వద్ద గడ్డి పెంచే చర్యలు చేపట్టారు. అయితే నాటిన గడ్డి మొక్కలను జంతువులు వేర్లతో సహా పెకిలించడంతో వారి ప్రయత్నం ఫలించలేదు. దేశంలోని కొన్ని అభయారణ్యాలలో గడ్డి మైదానాలను పెంచేందుకు వెదురు పొదలను తొలగించిన సందర్భాలున్నాయి. గడ్డి తినే, మాంసాహార జంతువుల మధ్య సమతుల్యం లోపిస్తే పర్యావరణ సమస్య తలెత్తే అవకాశం ఉంది. మాంసాహార జంతువులు.. పెద్దపులి, చిరుతపులి, జంగం పిల్లి, ఆకుచిరుత, చేపలుపట్టే పిల్లి, రస్టీస్పాటెడ్ క్యాట్, పునుగు పిల్లి, కామన్ పామ్సివిట్, ముంగీస, నీటికుక్క(ఆటర్), హానీబాడ్జర్, ఎలుగు బంటి, నక్క, గుంటనక్క, చారల హైనా (దొమ్ములగొండి), తోడేలు, రేచుకుక్క (వైల్డ్‌డాగ్). గడ్డి తినే జంతువులు: దుప్పి (స్పాటెడ్ డీర్), కణితి (సాంబర్ డీర్), మనిమేగం (నీల్గాయ్), కృష్ణజింక (బ్లాక్‌బక్), బుర్ర జింక (మౌస్‌డీర్), కొండగొర్రె(చౌసింగా), చింకారా, అడవి పంది (వైల్డ్బోర్), ముళ్ల పంది (మిశ్రమ ఆహార జంతువు. చెద పురుగులు తిని జీవిస్తుంది.) కొండ గొర్రె కొండ గొర్రెలు మైదాన ప్రాంతాల్లో కాక దట్టమైన అడవుల్లో పర్వత ప్రాంతాల్లో ఉంటాయి. ఇవి జింక జాతికి చెందినవైనప్పటికీ మూషిక జింకకు, కృష్ణజింకకు మధ్యరకం పరిమాణంతో ఉంటాయి. రెండు కొమ్ములు నిటారుగా మరో రెండు చిన్న కొమ్ములు ముందుకు ఉంటాయి. మొత్తం నాలుగు కొమ్ములు ఉండటంతో దీనికి చౌసింగా అన్న పేరు వచ్చింది. దీని మాంసం రుచికరంగా ఉంటుందన్న అపోహతో వేట గాళ్ల దృష్టి వీటిపై ఎక్కువగా ఉండేది. అధికారులు నిఘా పెంచడంతో వీటి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. హనీబాడ్జర్ వన్యప్రాణుల టీవీ చానల్స్‌లో తరుచూ కనిపించే హనీబాడ్జర్ను ఆఫ్రికా జంతువుగా చాలా మంది భావిస్తారు. ఇది రాత్రి పూట మాత్రమే సంచరించడంతో నల్లమల ప్రాంత ప్రజలకు దీని గురించి పెద్దగా తెలియలేదు. అందుకే దీనికి తెలుగు పేరు కూడా లేకుండా పోయింది. బిలకారి జీవనం చేసే హనీబాడ్జర్లు మానవ సామాజిక వ్యవహారానికి దగ్గరగా తమ జీవన విధానాన్ని కలిగి ఉంటాయి. భూమి లోపల నివాసం ఏర్పరుచుకుని పెద్దవి, పిల్లలు వేర్వేరు గదుల్లో నిద్రిస్తాయి. అలాగే తమ నివాసం వెలుపల మల విసర్జనకు ప్రత్యేక ఏర్పాటు చేసుకుంటాయి. ఇవి అవసరమై సమయంలో పెద్దపులికి కూడా ఎదురుతిరిగే సాహసం చేస్తాయి. -
తోవ చూపేది జీవవైవిధ్యం
మనిషి–ప్రకృతి మధ్య సంబంధాలను పునరుద్ధరించే కీలకమైన ప్రక్రియ జీవవైవిధ్య పరిరక్షణ. ఈ విషయంలో మనం వెనుకబడుతున్నాం. యుగాల తరబడి మనిషి ప్రకృతితో మమేకమైన సహజీవన సౌందర్యానికి మన పౌరాణిక, చారిత్రక నేపథ్యం సాక్ష్యంగా నిలిస్తే, ఇప్పుడు మనం వెనుకంజలో ఉన్నాం. ఐక్యరాజ్యసమితి (యూఎన్) నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యా(ఎస్డీజీ)ల సాధనలో జీవవైవిధ్య రక్షణా ఉంది! నీటి లోపల, నేల మీది జీవరాశులుగా ప్రాధాన్యతనిచ్చింది. ఎస్డీజీల సాధన దిశలో భారత్ స్థానానికి ఇటీవల వెల్లడించిన యూఎన్ తాజా నివేదిక అద్దం పట్టింది. పలు అంశాల్లో వెంటనే అప్రమత్తం కావాలి. జీవవైవిధ్య రక్షణలో శీఘ్ర ప్రగతికి 2018 లో దేశంలో ఒక మిషన్ ఏర్పడింది. ‘జీవవైవిధ్యం–మానవ సుభిక్ష జాతీయ మిషన్’ (ఎన్ఎమ్బీహెచ్డబ్లుబీ)ని ప్రత్యేక లక్ష్యంతో ఏర్పాటు చేశారు. కరోనా మహమ్మారి వల్ల ముంచుకు వచ్చిన కోవిడ్–19 ఒకటి, రెండు అలలు.. తిరుగులేని ప్రకృతి ఆధిపత్యాన్ని చెప్పకనే చెప్పాయి. జీవులన్నిట బుద్ధిజీవినని జబ్బలు చరుచుకునే మనిషి ప్రకృతి ముందు ఎంత అల్పజీవో కరోనా తేల్చింది. దీన్ని ఒక గుణపాఠంగా గ్రహిస్తే.. ప్రఖ్యాత ఫ్రెంచ్ తత్వవేత్త రూసో చెప్పినట్టు మనిషి మళ్లీ ప్రకృతిలోకి నడవాలి. ప్రకృతి ఔన్నత్యాన్ని గ్రహించి, గుర్తించి, గౌరవించాలి. పర్యావరణం కాపాడుకోవాలి. సౌర కుటుంబంలో ఏకైక జీవగ్రహంగా పరిగణిస్తున్న పృథ్విని పరిరక్షించాలి. మానవ జోక్యంతో పాడుచేసుకున్న భూమ్యావరణ వ్యవస్థల్ని పునరుద్ధరించాలి. మొన్న ప్రపంచ పర్యావరణ దినోత్సవం, నిన్న సముద్ర దినోత్సవం... ఇలా పండుగలు జరుపుకోవడంలో మనం దిట్టలమే! కానీ, కార్యాచరణలోనే మందగమనం. ఈ యేడు పర్యావరణ దినానికి యూఎన్ ఒక ఆశయాన్నిచ్చింది. ఆవరణ వ్యవస్థల్ని కాపాడ్డం, నాశనం చేసుకున్నవి పునర్వవస్థీకరించుకోవడం, తద్వారా భూగ్రహాన్ని పునరుద్ధరించడం. ఈ పని సజావుగా జరగాలంటే, భాగస్వామ్య దేశాలతో కలిసి అదే యూఎన్ రూపొందించిన ఎస్డీజీలను కాలపరిమితిలోగా సాధించాలి. 2015లో యుఎన్ సభ్యదేశాలు చేసుకున్న ఈ అంగీకారానికి గడువు కాలం 2030. మూడో వంతు కాలం ఇప్పటికే కరిగిపోయింది. నికరంగా దశాబ్దకాలం కూడా లేదు. ఏయే అంశాల్లో ఎంతెంత ప్రగతి సాధించాం? ఎవరెక్కడ ఉన్నారు? ఏటా ఒక నివేదిక తయారవుతోంది. తాజా నివేదిక దేశ పరిస్థితినే కాక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రగతినీ నివేదించింది. ఎస్డీజీల సాధన దిశలో కిందటేడుతో పోలిస్తే భారత్ కొన్ని పాయింట్లు (60 నుంచి 66) పెంచుకున్నప్పటికీ, స్థానం రెండు ర్యాంకులు (115 నుంచి 117) దిగువకు పోయింది. దక్షిణాసియాలోని భూటాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ మనకన్నా మెరుగైన స్థితిలో ఉండటం మన దుస్థితిని ఎత్తిచూపేదే! స్వచ్ఛ పునర్వినియోగ ఇంధనాలు, నగర–పట్టణాభివృద్ధి వంటి రంగాల్లో మనం ప్రగతి సాధించాం. ఆకలి రూపుమాపడం, ఆహార భద్రత, సమానత్వ సాధన, సమ్మిళిత మౌలికరంగ వసతులు–పారిశ్రామిక వృద్ధి వంటి అంశాల్లో వెనుకబడ్డాం. ఈ తడబాటు భారత్ స్థానాన్ని రెండు ర్యాంకులు దిగజార్చింది. ఇదే స్థితి రాష్ట్రాల ప్రగతి సూచీల్లోనూ ప్రతిబింబించింది. మానవ సర్వతోముఖ వికాసం ప్రాతిపదికగా 17 అంశాలతో సుస్థిరాభివృద్ది లక్ష్యాలు రూపొందాయి. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు కలిసి, విశ్వ భాగస్వామ్య పద్ధతిలో పరస్పరం సహకరించుకోవడం ద్వారా ప్రపంచ ప్రజల శాంతి, సమున్నతి సాధించడం, ప్రస్తుత భవిష్యత్ అవసరాలు తీరేలా భూగ్రహాన్ని కాపాడుకోవడం ఈ ఉమ్మడి కృషి వెనుక సంకల్పం. చరిత్రాత్మకమైన పారిస్ భాగస్వామ్య ఒప్పందం కుదర్చడంలో కీలకపాత్ర పోషించిన భారత్ చాలా ఎస్డీజీ అంశాల్లో ఇంకా ప్రగతి సాధించాలి. విధాన నిర్ణయాల్లో విప్లవాత్మక మార్పులు వస్తే తప్ప అది సాధ్యపడదు. ఇప్పుడిప్పుడే రాష్ట్రాలు నిర్దిష్ట అంశాల్లో ప్రగతివైపు అడుగులు వేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు వడివడిగా ముందుకు సాగుతుంటే, మరికొన్ని ఇంకా బుడిబుడి అడుగులేస్తున్నాయి. కేరళ (75 పాయింట్లు), హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు (74) అగ్రభాగాన ఉన్నాయి. బిహార్ (52), జార్ఖండ్ (56), అస్సోమ్ (57) రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయి. నిర్దేశించిన గడువు (2030) నాటికైనా ఆశించిన లక్ష్యాలు సాధిస్తాయా? అన్న సందేహం రేకెత్తిస్తుస్నాయి. కిందటేడుతో పోల్చి చూస్తే మిజోరాం, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు తమ పరిస్థితిని బాగా మెరుగుపరచుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏపీ (72) తొలి అయిదు రాష్ట్రాల్లో ఉంటే, తెలంగాణ (69) మధ్యరకం ప్రగతి రాష్ట్రాల్లో ఉంది. ఏ అంశంలో అయినా రాష్ట్రాలు–కేంద్ర పాలిత ప్రాంతాలు సాధించే ఉమ్మడి ప్రగతే దేశ పరిస్థితిని అంతర్జాతీయ స్థాయిలో ప్రతిబింబిస్తుంది. అందులో కొన్ని జీవవైవిధ్య రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తే మరికొన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయి. సామాజికార్థికాంశాలతో పాటు విధాన నిర్ణయాలు, పాలనా సామర్థ్యం, ప్రాధాన్యతలే ఆయా రాష్ట్రాల్లో ఎస్డీజీల ప్రగతిని–వ్యత్యాసాల్ని ప్రభావితం చేశాయని నివేదిక పేర్కొంది. పర్యావరణ ప్రగతి సూచీ (ఈపీఐ)లో మనం మరింత వెనుకబడి 180 దేశాలకు గాను 168 వ స్థానంలో ఉన్నాం. యాలె విశ్వవిద్యాలయం ఇచ్చిన 2020 ఈపీఐ నివేదిక ప్రకారం జీవవైవిధ్యాంశంలో మన స్థానం (148) పొరుగు దేశమైన పాకిస్తాన్ (127) కంటే 21 స్థానాలు అడుగునుంది. పరిస్థితి మెరుగుపరచి చరిత్రను తిరగరాయాలి. -
International Day for Biological Diversity: జీవవైవిధ్య దినోత్సవం
సిరికొండ: సూక్ష్మజీవుల నంచి క్రిమికీటకాల వరకు వృక్షాల నుంచి జంతు జలచరాల వరకు ప్రకృతిలోని ప్రాణులన్ని పరస్పర జీవనం గడపడమే జీవవైవిధ్యం. ప్రకృతి వనరులను కొల్లగొడుతూ మానవుడు తన ఉనికిని ప్రశ్నార్థకం చేసుకుంటున్నాడు. సంరక్షణ మాట మరిచి ఇష్టానుసారంగా చెట్లను నరికి వేయడం, విరివిగా రసాయనాల వాడకం, ప్లాస్టిక్ వ్యర్థాలు ఇతరత్రా కాలుష్యాలకు కారణమవుతు జీవవైవిధ్య సమతుల్యతను దెబ్బతీస్తున్నాడు. నేడు ప్రపంచ జీవవైవిధ్య దినోత్సవం సందర్బంగా ప్రత్యేక కథనం. పర్యావరణ పరిరక్షణలో ఆహార గొలుసు చెడిపోకుండా 2002లో జీవవైవిధ్య చట్టం అమలులోకి వచ్చింది. దశాబ్దం తర్వాత 2014లో రాష్ట్ర జీవవైవిధ్య బోర్డును తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ ఆ బోర్డు ఆరంభశూరత్వంలా మారింది. గ్రామ, మండల జీవవైవిధ్య కమిటీల ఏర్పాటు సాగుతూనే ఉండటం, జిల్లాల్లో తగినంత సిబ్బందిని నియమించకపోవడం, కమిటీలు ఏర్పాటైన సభ్యులకు సరైన శిక్షణ లేకపోవడం, నిధుల ఖర్చుపై ఆడిట్ లేకపోవడం సమస్యలుగా మారాయి. పేరుకు కమిటీలు.. ఉమ్మడి జిల్లాలో జీవవైవిధ్య అమలు కోసం ఇద్దరు సమన్వయకర్తలు ఉండాలి. ఒక్కరే ఉన్నారు. ఉమ్మ డి జిల్లాలో 51 మండలాలకు నాలుగు మండలాల్లో 1056 గ్రామ పంచాయతీలకు 219 గ్రామాలలో మాత్రమే కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలకు పథకం అమలు, జీవవైవిధ్య సంరక్షణపై తగిన శిక్షణ ఇవ్వాలి. వారసత్వ సంపదలైన వృక్షా లు, జంతువులు, పవిత్రవనాలు, జలాశయాలు, వారసత్వ కట్టడాలు, ఔషధ మొక్కలు మొదలైన వాటిపై అవగాహన కలి్పంచాలి. కానీ గడిచిన ఏడెండ్లలో జిల్లా స్థాయి, మండల, గ్రామ స్థాయిలో తగిన శిక్షణ లేక కమిటీల పనితీరు నామమాత్రంగా మారింది. ప్రతి జిల్లాలో జీవవైవిధ్య కమిటీలకు రెండు దశల్లో నిధులు ఇవ్వాలని రాష్ట్ర జీవవైవిధ్య బోర్డు నిర్ణయించింది. అందులో భాగంగా గ్రామ జీవవైవిధ్య కమిటీకి రూ.1.50 లక్షలు, మండల కమిటీకి రూ.1.50 లక్షలు, జిల్లా కమిటీకి రూ.2.30 లక్షలు ఇవ్వాలి. 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో 24 గ్రామ పంచాయతీలకు రూ. 8.80 లక్షలు విడుదల అయ్యాయి. వీటిలో కార్యాలయ ఏర్పాటు అవసరమైన రికార్డులు ఫరీ్నచర్ కొనుగోలు క్షేత్ర స్థాయి పరిశోధనలకు కేటాయించాలి. కానీ చాలా గ్రామ పంచాయతీల్లో వీటి ఏర్పాటు లేకుండానే నిధులు స్వాహ అయ్యాయి. సరైన ఆడిట్ లేనందువల్ల గత సర్పంచుల హయాంలో నిధులకు లెక్కలేకుండా పోయాయి. మిగతా నిధులు విడుదల చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చేయలేదు. దెబ్బతింటున్న జీవవైవిధ్యం ప్రకృతిలో జీవవైవిధ్యం దెబ్బతింటోంది. దీంతో హనికరమైన వైరస్లు విజృంభిస్తున్నాయి. గడిచిన వందేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 20 వేల జాతుల జీవులు వైరస్‌లతో అంతరించిపోయాయి. మానవుల తప్పిదాలతో 75 శాతం మేర జన్యుజీవవైవిధ్య పంటలు కనుమరుగయ్యాయి. 24 శాతం క్షీరదాలు, 12 శాతం పక్షి జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి.