‘బయోడైవర్సిటీ’గా అమీన్‌పూర్‌ చెరువు | " Bayodaivarsitiga aminpur pond | Sakshi
Sakshi News home page

‘బయోడైవర్సిటీ’గా అమీన్‌పూర్‌ చెరువు

Published Mon, Jul 25 2016 8:17 PM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM

" Bayodaivarsitiga aminpur pond

  1. గుర్తింపు కోసం గ్రామ సభ
  2. సైట్‌గా గుర్తించడం దేశంలోనే ప్రథమం: బోర్డు మెంబర్‌ సువర్ణ
  3. పర్యావరణ సమతుల్యత కాపాడాల్సిందే: తేజ్‌దీప్‌కౌర్‌
  4. పటాన్‌చెరు: మండలం పరిధిలోని అమీన్‌పూర్‌ పెద్ద చెరువును బయోడైవర్సిటీ సైట్‌గా గుర్తింపు ప్రక్రియ తుది అంకానికి చేరుకుందని తెలంగాణా రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు మెంబర్‌ సెక్రటరీ డాక్టర్‌ సి.సువర్ణ తెలిపారు. సోమవారం పంచాయతీ పరిధిలో గ్రామ సభ నిర్వహించారు. ఇందులో స్థానిక సర్పంచ్‌ కాట శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ ప్రత్యేక పోలీసు బలగాల డైరెక్టర్‌ జనరల్, ఐపీఎస్‌ అధికారి తేజ్‌దీప్‌కౌర్, అటవీ, మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు.

    ప్రజల నుంచి సైట్‌ గుర్తింపు పట్ల అభిప్రాయాలను సేకరించారు. చెరువుపై ఆధారపడిన మొత్తం 28 వర్గాల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మెంబర్‌ సెక్రటరీ డా.సి.సువర్ణ మాట్లాడుతూ దేశంలోనే ఓ చెరువును బయోడైవర్సిటీ సైట్‌గా గుర్తించడం ప్రపథమమన్నారు. ఈ చెరువు ప్రత్యేకమైందని వివరించారు. మొత్తం 171 రకాల పక్షులు ఇక్కడ ఉన్నాయన్నారు. విదేశాల నుంచి వచ్చే పక్షులు ఉన్నాయన్నారు.

    మహానగర శివారులో ఉన్న పెద్ద చెరువును బయోడైవర్సిటీ సైట్‌గా గుర్తించడం భవిష్యత్‌ తరాలకు మేలు చేసినట్లవుతుందన్నారు. టీఎస్‌పీఎస్‌ డీజీ తేజ్‌దీప్‌కౌర్ మాట్లాడుతూ పెద్ద చెరువును తాము కొన్ని నెలల క్రితమే దత్తత  తీసుకున్నామని గుర్తు చేశారు. తాము చేసిన కృషి ఫలించడంతో చెరువు వద్ద ఉన్న జీవవైవిధ్యం సంరక్షణకు ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. అమీన్‌పూర్‌ చెరువు పరిసరాల్లో స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్సు సిబ్బంది, శిక్షణ కేంద్రంలోని సిబ్బంది చెరువులో ఉన్న చెత్తను ఎత్తి పోస్తున్నారని వివరించారు. స్థానికులు అనేక వ్యర్థాలను చెరువులో వేస్తున్నారని దీని వల్ల పక్షి జాతులకు ఇబ్బంది ఏర్పడుతుందని అన్నారు.

    బయోడైవర్సిటీ సైట్‌గా గుర్తించాలని హైదరాబాద్‌ బర్డ్‌ వాచర్స్‌ అసోసియేషన్, ఫ్రెండ్స్‌ ఆఫ్‌ ఫ్లోరా సంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేశారని ఆమె తెలిపారు. బయోడైవర్సిటీకి స్థానికులు మరింతగా సహకరించాలని కోరారు. తాను రిటైర్డ్‌ తర్వాత అమీన్‌పూర్‌లోనే నివసిస్తానని చెప్పారు. చెరువు వద్ద కొందరు డ్రోన్‌లతో ఫొటోలు తీస్తున్నారని దీన్ని అడ్డుకోవాలని ఆమె కోరారు. ఇదిలా ఉంటే స్థానిక రైతులు, మత్సకారులు ఈ సభలో తమ సందేహాలను వ్యక్తం చేశారు. చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో తమ భూములను కోల్పోతామనే ఆవేదన వ్యక్తం చేశారు.

    మొత్తం చెరువు కింద 350 ఎకరాల ఎప్‌టీఎల్‌ పట్టాలున్నాయని అవి ఎంతో విలువైనవని తెలిపారు. స్థానిక సర్పంచ్‌ కాట శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ చెరువులో కాలుష్య వ్యర్థాలు పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయన్నారు. పీసీబీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే సమస్యలు వస్తున్నాయన్నారు. వివిధ పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్య వర్థాలు పెద్ద చెరువులో చేరుతున్నాయన్నారు. దీనిని అరికట్టాలన్నారు. కార్యక్రమంలో ఆర్‌డీఓ శ్రీనివాస్‌రెడ్డి, పీసీబి అధికారి భిక్షపతి, మత్స్యశాఖ ఏడీ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.




     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement