అలసందలకు మొలకలు
4 రోజుల్లోనే అద్భుతం
ఇస్రో మరో ఘనత
న్యూఢిల్లీ: కొన్నేళ్లుగా అంతరిక్షంలో అద్భుతాలతో ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్న ఇస్రో మరో ఘనత సాధించింది. అంతరిక్షంలో జీవసృష్టి చేసి చూపించింది. స్పేడెక్స్ మిషన్‌లో భాగంగా పీఎస్‌ఎల్‌వీ–సి60 ఆర్బిటాల్ ఎక్స్‌పెరిమెంట్ మాడ్యూల్ (పోయెమ్–4) ద్వారా డిసెంబర్ 30న అంతరిక్షంలోకి పంపిన అలసంద విత్తనాలు కేవలం 4 రోజుల్లోనే మొలకెత్తాయి! కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటాల్ ప్లాంట్ స్టడీస్ (సీఆర్‌ఓపీఎస్) టెక్నాలజీ ద్వారా ఈ ప్రయోగాన్ని ఇస్రో విజయవంతంగా నిర్వహించింది.
సూక్ష్మ గురుత్వాకర్షణ పరిస్థితుల్లో విత్తనాల అంకుర, మనుగడ ప్రక్రియను అధ్యయనానికి ఉద్దేశించిన ఆటోమేటెడ్ వ్యవస్థ అయిన సీఆర్‌ఓపీఎస్ పేలోడ్‌ను విక్రం సారాబాయ్ అంతరిక్ష కేంద్రం అభివృద్ధి చేసింది. ఇందులో భాగంగా ఎనిమిది అలసంద విత్తనాలను నియంత్రిత వాతావరణంతో కూడిన బాక్సులో ఉంచారు. వాటికి నిరంతరం కచ్చితత్వంతో కూడిన వెలుతురు అందేలా జాగ్రత్త తీసుకున్నారు.
విత్తనాల్లో జరుగుతున్న మార్పుచేర్పులను అత్యంత హై రిజల్యూషన్తో కూడిన కెమెరా ఇమేజింగ్, ఉష్ణోగ్రత, సీఓటూ సాంద్రత, ఆర్ద్రత వంటివాటి తనిఖీ తదితరాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వచ్చారు. నాలుగు రోజుల్లోనే విత్తనాలు మొలకెత్తడంతో సైంటిస్టులు ఆనందోత్సాహాల్లో తేలిపోతున్నారు. ‘‘అంతరిక్షంలో జీవం పురుడు పోసుకుంది. ప్రయోగం విజయవంతమైంది. విత్తనాలు విజయవంతంగా మొలకెత్తాయి’’ అంటూ ఇస్రో హర్షం వెలిబుచి్చంది. ‘‘త్వరలో వాటికి ఆకులు కూడా రానున్నాయి. అంతరిక్ష అన్వేషణ యాత్రలో అదో కీలక మైలురాయిగా నిలవనుంది’’అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
స్పేడెక్స్ నుంచి పుడమి ఫొటోలు
స్పేడెక్స్ జంట ఉపగ్రహాల్లో ఒకటైన చేజర్ భూమిని తొలిసారి ఫొటోలు, వీడియోలు తీసింది. దాన్ని ఇస్రో శనివారం విడుదల చేసింది. చేజర్ 470 కి.మీ. ఎత్తున దిగువ కక్ష్యలో పరిభ్రమిస్తూ తీసిన ఈ వీడియోలో భూమి అత్యంత అందంగా కని్పస్తోంది. ఉపగ్రహం తాలూకు అత్యంత అధునాతనమైన ఇమేజింగ్ సామర్థ్యంతో పాటు అత్యంత కీలకమైన తదుపరి దశ పరీక్షలకు దాని సన్నద్ధతకు ఈ వీడియో నిదర్శనమని ఇస్రో ఒక ప్రకటనలో పేర్కొంది. త్వరలో కీలక డాకింగ్ (ఉపగ్రహాల అనుసంధాన) పరీక్షకు చేజర్, టార్గెట్ శాటిలైట్లు సన్నద్ధమవుతున్నాయి. వీలైతే దాన్ని జనవరి 7న నిర్వహిస్తామని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ ప్రకటించడం తెలిసిందే. ఈ పరీక్ష విజయవంతమైతే డాకింగ్ పరిజ్ఞానమున్న అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్ సగర్వంగా చేరుతుంది. గగన్‌యాన్ మొదలుకుని పలు భావి అంతరిక్ష పరీక్షలకు డాకింగ్ పరిజ్ఞానం కీలకం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment