Seeds
-
సీడ్ ల్యాబ్‌పై శీతకన్ను
సాక్షి, మచిలీపట్నం: రైతులకు దిగుబడి బాగా రావాలంటే.. విత్తనం బాగుండాలి. కల్తీలేని విత్తనాలు అందిస్తేనే.. మొక్క బాగా పెరుగుతుంది. చీడపీడలు, వాతావరణ మార్పులను తట్టుకొని నిలుస్తుంది. అప్పుడే పంట దిగుబడి అధికంగా వస్తుంది. ఈ ఆలోచనతోనే రైతులకు మేలు చేసేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి విత్తన పరిశోధన కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. కృష్ణా జిల్లా గన్నవరంలో రూ.45.80 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టి.. 70 శాతం పనులు కూడా పూర్తి చేసింది. ఆ తర్వాత ఎన్నికల కోడ్ రావడం.. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఇది అందుబాటులోకి వస్తే.. నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేసే అవకాశమున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. వారణాసి తరహాలో.. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న జాతీయ విత్తన పరిశోధన, శిక్షణ కేంద్రం తరహాలో రాష్ట్ర స్థాయి విత్తన పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసేందుకు గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ సంకల్పించారు. రాష్ట్రంలో విత్తన పరిశోధన, శిక్షణ మరింత శాస్త్రీయంగా, పటిష్టంగా చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలో డాక్టర్ వైఎస్సార్ విత్తన పరిశోధన, శిక్షణ కేంద్రం పేరుతో నిర్మించేందుకు 2023 మార్చి 24న శంకుస్థాపన చేశారు. రూ.45.80 కోట్లతో 8 ఎకరాల్లో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా పరిపాలన, శిక్షణ కేంద్రంతో పాటు వసతి, సిబ్బంది నివాసాలు, టెస్ట్ ఫామ్, విత్తన పరీక్ష ప్రయోగశాల, గ్రీన్ హౌస్, సీడ్ ప్రాసెసింగ్ యూనిట్, గోడౌన్, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు తదితరాలు నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. 70 శాతం పనులు కూడా పూర్తయ్యాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో పనులు నిలిచిపోయాయని అధికారులు చెబుతున్నారు. పూర్తయితే ప్రయోజనాలెన్నో.. » రాష్ట్ర స్థాయిలో సంబంధించిన అన్ని విత్తన ఏజెన్సీలు, సంస్థలకు ఉమ్మడి వేదిక అవుతుంది. » విత్తన ప్రయోగశాలలు, అగ్రి ల్యాబ్‌లలో పనిచేస్తున్న సిబ్బందికి అధునాతన శిక్షణ లభిస్తుంది. » వ్యవసాయ పట్టభద్రులు, డిప్లొమా చేసిన వారికి మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభించేలా శిక్షణ ఇస్తారు. » సీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రపంచంలోని అత్యున్నత సంస్థలతో సమన్వయం చేసుకోవచ్చు. » జీన్ బ్యాంకు ఏర్పాటు వల్ల అన్ని పంటల సంరక్షణకు కృషి చేయొచ్చు. కొత్త, అధిక దిగుబడినిచ్చే, వాతావరణ మార్పులను తట్టుకోగల విత్తన రకాల అభివృద్ధి సాధ్యపడుతుంది.అలా వదిలేయడం సరికాదు.. వ్యవసాయ ఆధారిత రాష్ట్రం మనది. రైతులకు అన్ని విధాలా మేలు చేకూర్చే విత్తన పరిశోధన, శిక్షణ కేంద్రం ఏర్పాటు చాలా అవసరం. నకిలీ విత్తనాలను నివారించొచ్చు. కొత్తరకం వంగడాలు, వాతావరణ మార్పులను తట్టుకునే విత్తనాలు సమకూరుతాయి. గత ప్రభుత్వం మొదలుపెట్టిందని.. ఈ ప్రభుత్వం వదిలేయడం సరికాదు. రాజకీయ పార్టీలకు అతీతంగా తగిన నిధులు సమకూర్చి రాష్ట్ర స్థాయి విత్తన పరిశోధన కేంద్రం నిర్మాణ పనులు పూర్తి చేయాలి. – కె.ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం -
రబీ సాగు లక్ష్యం 57.65 లక్షల ఎకరాలు
సాక్షి, అమరావతి: ఖరీఫ్ కలిసి రాలేదు. వరుస వైపరీత్యాలకు తోడు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఖరీఫ్‌లో రైతులు దెబ్బ తిన్నారు. అతి కష్టం మీద లక్ష్యానికంటే తక్కువగా 69.70 లక్షల ఎకరాల్లో సాగు చేసినా, పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు ముందస్తుగా రబీ సాగుకు సన్నద్ధమయ్యారు. ఆ మేరకు రబీ 2024–25 ప్రణాళికను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. రబీ సాధారణ విస్తీర్ణం 56.58 లక్షల ఎకరాలు. ఈ ఏడాది సాగు లక్ష్యం 57.65 లక్షల ఎకరాలుగా నిర్దేశించారు. 19.87 లక్షల ఎకరాల్లో వరి, 11.17 లక్షల ఎకరాల్లో శనగ, 8.44 లక్షల ఎకరాల్లో మినుము, 5.23 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 2.74 లక్షల ఎకరాల్లో జొన్న, 2.51 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 2.46లక్షల ఎకరాల్లో పెసలు, 1.77లక్షల ఎకరాల్లో పొగాకు పంటలు సాగు చేయనున్నారు. కాగా ఈ ఏడాది 94.69 లక్షల టన్నుల దిగుబడులు లక్ష్యంగా వ్యవసాయ శాఖ నిర్దేశించింది. రబీకి 3.85 లక్షల క్వింటాళ్ల విత్తనం రబీ కోసం 8.88 లక్షల క్వింటాళ్ల విత్తనం అవసరం. రూ.94.96 కోట్ల సబ్సిడీతో 3.85 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. సీజన్లో 2.64 లక్షల క్వింటాళ్ల శనగ విత్తనం అవసరం కాగా, ఇప్పటివరకు 26 వేల క్వింటాళ్లను సిద్ధం చేశారు. వరి, ఇతర విత్తనాలను ఈ నెల 25వ తేదీ నుంచి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 50,076 క్వింటాళ్ల వరి, 45,647 క్వింటాళ్ల వేరుశనగ, 16,249 క్వింటాళ్ల మినుము విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. ఎరువుల సరఫరాలో ఆర్బీకేలకు కోత ఈ ఏడాది 20.05లక్షల టన్నుల ఎరువులు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే 6.95 లక్షల టన్నుల ఎరువులు ఉండగా, కేంద్రం నుంచి ఈ నెలలో 1.47 లక్షల టన్నులు వచ్చాయి. ప్రస్తుతం 8.42 లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. గత నాలుగేళ్లుగా సబ్సిడీ విత్తనం, ఎరువుల పంపిణీలో రైతు భరోసా కేంద్రాలకు (ఆర్బీకేలకు) అధిక ప్రాధాన్యతనిచ్చారు. కానీ చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఆర్బీకేలకు ప్రాధాన్యత లేకుండా చేసింది. గడిచిన ఖరీఫ్‌లో అతికష్టమ్మీద 1.50 లక్షల టన్నుల ఎరువులను మాత్రమే ఆర్బీకేల ద్వారా సరఫరా చేశారు. రబీలో కూడా ఆర్బీకేలకు సరఫరాలో భారీగా కోత పెడుతున్నారు. రబీలో రూ.68వేల కోట్లు పంట రుణాలు ప్రస్తుత రబీలో రైతులకు లక్ష కోట్ల రుణ పరపతి కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించారు. దాంట్లో రూ.68,060 కోట్లు పంట రుణాలు, 32,390 కోట్లు టర్మ్ రుణాలు ఇవ్వనున్నారు. గతేడాది 3.60 లక్షల మంది కౌలుదారులకు రూ.4,100 కోట్లు ఇవ్వగా, ఈ ఏడాది కనీసం 5 లక్షల మందికి రూ.5 వేల కోట్లు రుణాలివ్వాలని నిర్ణయించారు. -
శనగ విత్తనం కోసం రైతుల ఎదురుచూపులు
సాక్షి, అమరావతి : వర్షాభావంతో పంటలు దెబ్బతిన్న రాయలసీమ జిల్లాల్లో రైతులు ముందస్తు రబీకి సిద్ధమైనా, ప్రభుత్వం నుంచి సహకారం లభించడంలేదు. ముందస్తు రబీలో అవసరమైన విత్తనాలు, ముఖ్యంగా శనగ విత్తనం కోసం రైతులు కళ్లల్లో వత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. గతేడాది ఈపాటికే విత్తనం సరఫరా అవగా రైతులు పంటలు వేసుకున్నారు. ఈ ఏడాది అవసరమైన విత్తనంలో పదో వంతు మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో రైతులు రైతు సేవా కేంద్రాల్లో రిజి్రస్టేషన్ చేయించుకొని, విత్తనం కోసం ప్రదక్షిణాలు చేస్తున్నారు.ఖరీఫ్‌లో రాయలసీమ జిల్లాల్లో 7 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 4 లక్షల ఎకరాల్లో పత్తి పంటలు సాగవలేదు. సాగైన ప్రాంతాల్లోనూ వర్షాల్లేక సగానికిపైగా ఎండిపోయాయి. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అమలులో ప్రభుత్వం విఫలమైంది. ఈ రబీ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 57.67 లక్షల ఎకరాల్లో పంటల సాగు లక్ష్యంగా నిర్దేశించారు. ప్రధానంగా 19.87 లక్షల ఎకరాల్లో వరి, 11.17 లక్షల ఎకరాల్లో శనగ, 8.45 లక్షల ఎకరాల్లో మినుము, 5.27 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 2.75 లక్షల ఎకరాల్లో జొన్నలు, 2.47 లక్షల ఎకరాల్లో పెసలు, 2.52 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంటలు సాగు చేయనున్నారు.ఇందు కోసం రూ.94.96 కోట్ల సబ్సిడీతో 3.85 లక్షల టన్నుల విత్తనం అవసరమని అంచనా వేశారు. గతేడాది మాదిరిగానే విత్తన రాయితీలు ఇవ్వాలని కోరుతూ అధికారులు పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ముందస్తు రబీకి 17 జిల్లాల్లో 2.64 లక్షల క్వింటాళ్ల శనగ విత్తనం అవసరం కాగా, ఇప్పటివరకు 6 జిల్లాలకు 26 వేల క్వింటాళ్లే చేరాయి. గతేడాది ఈపాటికే పంపిణీ.. వాస్తవానికి అక్టోబర్ 1వ తేదీ నుంచి శనగ విత్తనం, 15వ తేదీ నుంచి మిగిలిన విత్తనాల పంపిణీ చేయాలి. గత ఏడాది ప్రణాళిక ప్రకారం పంటల సాగు సాఫీగా సాగిపోయింది. గతేడాది సెపె్టంబర్ మూడో వారం నుంచే రిజి్రస్టేషన్స్ చేపట్టగా, అక్టోబర్ 1 నుంచి తొలుత శనగ విత్తనం, 12వ తేదీ నుంచే మిగిలిన విత్తనాల పంపిణీ మొదలెట్టారు. ఈ ఏడాది ఆ పరిస్థితి కన్పించడం లేదు. సోమవారం నుంచి పంపిణీ మొదలు పెడతామని చెబుతున్నప్పటికీ, గ్రామాలకు విత్తనాలే చేరలేదు. గతేడాది వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు వేసుకోలేని ప్రాంతాల్లో 80 శాతం సబ్సిడీపై విత్తనం పంపిణీ చేశారు. కానీ ఈసారి ఆరి్థక భారం సాకుతో సబ్సిడీకి భారీగా కోత పెట్టే అవకాశాలున్నాయని చెబుతుండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. -
ఆరెంజ్ గింజలతో లాభాల గురించి తెలిస్తే, అస్సలు వదలరు!
ఆరోగ్యం కోసం నారింజ పండ్లను తింటాం. తొందరగా శక్తి రావాలంటే ఆరెంజ్ జ్యూస్ తాగుతాం. ఎందుకంటే ఇందులో సీ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఏ విటమిన్, మినరల్, ఫైబర్ కూడా లభిస్తాయి. అలాగే నారింజ్ తొక్కలను ఎండబెట్టి పొడి చేసుకొని సున్నిపిండిలో వాడతాం. హెర్బల్ టీలో కూడా వాడతామని మనకు తెలుసు. కానీ నారింజ గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు న్నాయని మీకు తెలుసా? తెలుసుకుందాం రండి!ఆరెంజ్ పండ్ల మాదిరిగానే, దాని గింజలు కూడా శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలం. ఇవి మన శరీరాన్ని హైడ్రేటెడ్, తాజాగా ఉంచుతాయి. మొత్తం ఆరోగ్యాన్ని ఇవి మేలు చేస్తాయి. ఆరెంజ్ గింజల్లో విటమిన్ సీ అధికంగా ఉంటుంది. రోజుకు మనకు కావాల్సిన దాంట్లో 116.2శాతం వీటిల్లో లభిస్తాయట. విటమిన్ సీ ఎక్కువగా తీసుకోవడం వల్ల పెద్దప్రేగు కేన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గ్యాస్,అసిడిటీ, ఉబ్బరం వంటి సమస్యల నివారణలో ఉపయోగపడతాయి.ఎనర్జీ బూస్టర్ నారింజ గింజలలో పాల్మిటిక్, ఒలీక్, లినోలిక్ ఆమ్లాలు ఉండటం వల్ల మానవ కణాలలో ఎక్కువ కాలం శక్తిని నిల్వ ఉంచుతుంది. శరీరంలో శక్తి స్థాయిని వేగవంతం చేస్తాయి.గుండె ఆరోగ్యానికి మంచిది: ఆరెంజ్ గింజల్లో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి.జుట్టు: ఆరెంజ్ గింజల నూనెను ఉపయోగించడం వల్ల జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ నూనెను జుట్టుకు కండీషనర్గాపనిచేస్తుంది. నారింజ గింజలలో విటమిన్ సి, బయో-ఫ్లేవనాయిడ్స్‌కు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఫలితంగా జుట్టు ఆరోగ్యంగా దృఢంగా ఉంటుంది. నారింజ గింజలలో ఉండే ఫోలిక్ యాసిడ్ జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది. (నా బిడ్డ నూరేళ్ల కలల్ని చిదిమేశారు: టాప్ కంపెనీకి తల్లి కన్నీటి లేఖ)చర్మానికి మెరుపు: వీటిల్లో పుష్కలంగా లభించే విటమిన్ సీ చర్మానికి మేలు చేస్తుంది. సహజమైన మెరుపునిస్తుంది. అంతేకాదు ముడతలు, మచ్చలు తగ్గుతాయి. కంటి ఆరోగ్యం: వీటిల్లో కెరోటినాయిడ్స్, విటమిన్ ఎ కళ్లలోని శ్లేష్మ పొరలను ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వయస్సు-సంబంధిత కండరాల క్షీణతను నివారిస్తుంది. బీపీ నియంత్రణ: ఆరెంజ్ గింజల్లో విటమిన్ బి6 అధికంగా లభిస్తుంది. ఇది హిమోగ్లోబిన్‌ను పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా రక్తపోటును అదుపు చేయడంలో కీలక ప్రాత పోషిస్తుంది. (పని ఒత్తిడితో మహిళా ఉద్యోగి షాకింగ్ డెత్, స్పందించిన కేంద్రం)కేన్సర్: ఆరెంజ్ గింజలు ప్రతిరోజు తినడం వల్ల చర్మ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్‌తో పోరాడడంలో సహాయ పడతాయి. ఇంట్లో చెడువాసన పోవాలంటేనారింజ గింజల నీటిని, కేక్ ఐసింగ్కు వాడతారు. అంతేకాదు సిట్రస్ సువాసన కోసం బాత్‌టబ్‌కు దీని ఆయిల్ వాడవచ్చు. ఇంట్లో అసహ్యకరమైన వాసనను పోగొట్టేందుకు డిఫ్యూజర్ నూనెగా కూడా దీన్ని వినియోగించుకోవచ్చు.ఆరెంజ్ విత్తనాలను ఎలావాడాలి?చిరు చేదుగా ఉండే ఆరింజ గింజల నూనె, పొడి రూపంలో వాడుకోవచ్చు. ఇవి మార్కెట్లో లభిస్తాయి. -
రైతులకు త్వరగా చేరినప్పుడే కొత్త వంగడాల ప్రయోజనం!
వాతావరణ మార్పుల్ని ధీటుగా తట్టుకునే అధిక పోషకాలతో కూడిన 109 కొత్త వంగడాలను ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల విడుదల చేశారు. వీటిల్లోని 5 వంగడాలతో అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధనా సంస్థ (ఇక్రిశాట్)కు సంబంధం ఉంది. ఇక్రిశాట్లో పెరిగిన తల్లి మొక్కల (పేరెంట్ లైన్స్)ను తీసుకొని వివిధ యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థలు కొత్త వంగడాలను రూపొందించాయి. ఈ ఐదింటిలో మూడు కంది, జొన్న, సజ్జ వంగడాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు అనువైనవి. ఈ వంగడాల రూపకల్పనలో ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు డా. ప్రకాశ్, డా.గుప్తా, డా. ఇఫ్రీన్ ప్రధానపాత్ర పోషించారని ఇక్రిశాట్ ప్రధాన శాస్త్రవేత్త డా.పసుపులేటి జనీల ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. ఇంతకీ.. ఇప్పుడు విడుదలైన కొత్త విత్తనాలు రైతులకు ఎప్పటికి అందుతాయి? అని ప్రశ్నిస్తే.. ఆశ్చర్యకరమైన సమాధానం వచ్చింది. కొన్ని పంటల్లో 5 నుంచి 15 ఏళ్లు పడుతోందన్నారు. విత్తన వ్యవస్థలపై శ్రద్ధ కొరవడినందున కొత్త వంగడాలు గ్రామీణ రైతులకు సత్వరమే చేరటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 5 తెగుళ్లను తట్టుకునే సజ్జ హైబ్రిడ్సజ్జ పూసా 1801: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు అనువైన హైబ్రిడ్ ఇది. ఇక్రిశాట్‌తో కలసి న్యూఢిల్లీలోని ఐఎఆర్ఐ రూపొందించింది. సజ్జల కోసమే కాకుండా, పశుగ్రాసం కోసం కూడా సాగు చేయతగినది. 5 తెగుళ్లను తట్టుకోగలుగుతుంది. అగ్గి తెగులును, వెర్రి తెగులును పూర్తిగా.. తుప్పు తెగులు, స్మట్, ఆర్గాట్ తెగుళ్లను కొంతమేరకు తట్టుకుంటుంది. ఈ రకం సజ్జల్లో ఇనుము (70 పిపిఎం), జింక్ (57 పిపిఎం) ఎక్కువ. హెక్టారుకు 33 క్వింటాళ్ల సజ్జలు, ఎండు చొప్ప హెక్టారుకు 175 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ఇది ప్రకృతి సేద్యానికీ అనువుగా ఉంటుందని డా. జనీల తెలిపారు.కోతకొచ్చినా పచ్చగా ఉండే జొన్నజొన్న ఎస్పిహెచ్ 1943: తెలంగాణకు అనువైన(ఏపీకి కాదు) హైబ్రిడ్ ఇది. యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ ధర్వాడ్(కర్ణాటక) ఇక్రిశాట్‌తో కలసి అభివృద్ధి చేసింది. హెక్టారుకు 39 క్వింటాళ్ల జొన్నల దిగుబడినిచ్చే ఈ రకం ఖరీఫ్‌లో వర్షాధార సాగుకు అనుకూలం. గడ్డి దిగుబడి హెక్టారుకు 116 క్వింటాళ్లు. కోత దశలోనూ గడ్డి ఆకుపచ్చగానే ఉండటం (స్టే గ్రీన్) దీని ప్రత్యేకత. గింజ బూజును కొంత వరకు తట్టుకుంటుంది. తక్కువ నత్రజని ఎరువుతోనే 9% అధిక దిగుబడినిస్తుంది. ప్రకృతి సేద్యానికీ అనువైనదని డా. జనీల తెలిపారు. 5 నెలల కంది సూటి రకంకంది ఎన్ఎఎఎం–88: ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వర్షాధారం/నీటిపారుదల కింద ఖరీఫ్‌కు అనువైన సూటి రకం. ఇక్రిశాట్‌తో కలసి కర్ణాటక రాయచూర్‌లోని యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ ఈ రకాన్ని అభివృద్ధి చేసింది. 142 రోజుల (స్వల్పకాలిక) పంట. హెక్టారుకు 15 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ఎండు తెగులును కొంతమేరకు తట్టుకుంటుంది.పాలకులు శ్రద్ధ చూపాలిశాస్త్రవేత్తలు దీర్ఘకాలం పరిశోధనలు చేసి ఓ కొత్త వంగడాన్ని రూపొందిస్తారు. కానీ, విడుదలైన తర్వాత కూడా కొత్త విత్తనం రైతులకు సత్వరం అందటం లేదు. వేరుశనగ, శనగ వంటి పంటల్లో 15–18 ఏళ్లు పడుతోంది. వెరైటీల రిలీజ్‌తో పని అయి పోయినట్లు కాదు. ఫార్మల్, ఇన్ఫార్మల్ సీడ్ సిస్టమ్స్‌ను ప్రోత్సహించటంపైపాలకులు దృష్టిని కేంద్రీకరించటం అవసరం. అప్పుడే రైతులు, వినియోగదారులకు కొత్త వంగడాల ప్రయోజనాలందుతాయి. – డా. పసుపులేటి జనీల, క్లస్టర్ లీడర్ – క్రాప్ బ్రీడింగ్, ప్రధాన శాస్త్రవేత్త (వేరుశనగ), ఇక్రిశాట్ -
మేలు చేసే కొత్త వంగడాలు
సాక్షి, అమరావతి: ఆధునిక బయో టెక్నాలజీ ద్వారా ఆహార పంటల పోషక నాణ్యతను మెరుగుపర్చే బయో ఫోర్టీఫైడ్ పంటలకు ప్రాముఖ్యత, ప్రాబల్యం పెరుగుతోంది. మొక్కల పెరుగుదల సమయంలోనే పంటలలో పోషక స్థాయిలను పెంచడం లక్ష్యంగా శాస్త్రవేత్తలు కొత్త వంగడాలను అభివృద్ధి చేస్తున్నారు. దేశంలోని అగ్రో ఎకలాజికల్ జోన్స్‌కు అవసరమైన బయో ఫోర్టీఫైడ్ పంట రకాలను ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విడుదల చేసారు.వ్యాధులు, తెగుళ్లను తట్టుకుంటూ అధిక దిగుబడినిచ్చే ఈ రకాలు అన్నదాతల పాలిట వరంగా మారనున్నాయి. వీటిలో వ్యవసాయ పంటల్లో 69 రకాలు, ఉద్యాన పంటల్లో 40 రకాలు ఉన్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్)తోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ విశ్వ విద్యాలయాలు అభివృద్ధి చేసిన రకాలు ఉన్నాయి. వీటిలో 34 రకాల వంగడాలు తెలుగు రాష్ట్రాల్లో సాగుకు అనువైనవి ఉన్నాయి. ఈ వంగడాల్లో 3 ఆంధ్రప్రదేశ్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసినవి కాగా, 5 రకాలు తెలంగాణ రాష్ట్రానికి చెందినవి.జన్యుపరమైన లోపాలకు దూరంగా.. నూతన వంగడాలకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రస్తుతం వినియోగంలో ఉన్న వంగడాలతో పోలిస్తే ఈ కొత్త రకాలలో జన్యు పరమైన లోపాలు లేవని నిర్ధారించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులను సైతం తట్టుకోగలవు. ఎరువులకు మెరుగైన రీతిలో స్పందిస్తాయి. తెగుళ్లు, వ్యాధులను సమర్ధంగా ఎదుర్కొంటాయి. పంట నాణ్యతతో పాటు ముందుగానే పరిపక్వం చెందుతాయి. అధిక పోషక విలువలతో అధిక ఆహార ఉత్పత్తిని, ఉత్పాదకతను కలిగి ఉండాయి.ఫలితంగా వీటి సాగు ద్వారా పర్యావరణ పరిరక్షణతో కూడిన వ్యవసాయం చేసేందుకు దోహద పడతాయని, వ్యవసాయ యోగ్యం కాని భూములు సైతం సాగులోకి తెచ్చేందుకు ఊతమిస్తాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ వంగడాలు పూర్తి స్థాయిలో రైతులకు అందుబాటులోకి రావాలంటే కనీసం మూడేళ్లు పడుతుందని చెబుతున్నారు. జాతీయ స్థాయిలో విడుదలైన వంగడాల్లో 34 రకాలు తెలుగు రాష్ట్రాలలో సాగుకు అనువైనవి. వీటిలో తెలుగు రాష్ట్రాల నుంచి విడుదలైన 8 రకాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన మరో 26 రకాలు ఉన్నాయి. -
మార్కెట్లోకి మూడు కొత్త వంగడాలు
సాక్షి, అమరావతి: మారుతున్న వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ, అధిక దిగుబడులను సాధించే మూడు కొత్త వంగడాలను ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మార్కెట్లోకి తీసుకొచి్చంది. ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ స్థాయిలో విడుదల చేసిన 109 వంగడాల్లో ఎన్జీ రంగా వర్శిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ వంగడాలూ ఉన్నాయి. దేశీ శనగలో నంద్యాల గ్రామ్, పెసరలో లాం పెసర, వేరుశనగలో ఐసీఏఆర్ కోణార్క్ (టీసీజీఎస్ 1707) రకాలను వర్శిటీ అభివృద్ధి చేసింది. వీటి ప్రత్యేకతలను వర్శిటీ వైస్‌ఛాన్సలర్ డాక్టర్ ఆర్. శారదా జయలక్ష్మీదేవి సోమవారం మీడియాకు వివరించారు. ఈ వంగడాలను ప్రధాని మోదీ విడుదల చేయడం గర్వకారణంగా ఉందని చెప్పారు. ఆ వంగడాల విశిష్టతలివీ.. నంద్యాల గ్రామ్ (ఎన్‌బీఈజీ 1267): రబీ సీజన్‌కు అనుకూలమైన ఈ శనగ రకం పంట కాలం 90 నుంచి 95 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 20.95 క్వింటాళ్లు. ఎండు తెగులును తట్టుకోగలదు. దేశీ శనగ రకం యంత్రంతో కోతకు అనుకూలం. 1, 2 రక్షిత నీటి పారుదలతో పండించుకోవచ్చు. 15.96 శాతం సీడ్ ప్రొటీన్ ఉంటుంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో రబీ సీజన్‌కు అనుకూలం. ఐసీఏఆర్ కోణార్క్ (టీసీజీఎస్–1707): ఖరీఫ్ సీజన్‌కు అనుకూలమైన ఈ వేరుశనగ రకం పంట కాలం 110 నుంచి 115 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 24.75 క్వింటాళ్లు వస్తుంది. రసం పీల్చే పురుగులను తట్టుకుంటుంది. ఆకుమచ్చ తెగులు, వేరుకుళ్లు, కాండంకుళ్లు, వేరు ఎండు తెగుళ్లను మధ్యస్థంగా తట్టుకుంటుంది. కాయ నుంచి పప్పు దిగుబడి 70 నుంచి 75 శాతం ఉంటుంది. నూనె 49 శాతం వస్తుంది. 100 గింజల బరువు 40 నుంచి 45 గ్రాములుంటుంది. ప్రొటీన్స్ 29 శాతం. అధిక నీటి వినియోగ సామర్థ్యం ఉంటుంది. గింజలు లేత గులాబీ రంగులో ఉంటాయి. కాయలన్నీ ఒకేసారి పక్వానికి వస్తాయి. లాం పెసర (ఎల్జీజీ 610): రబీ సీజన్‌కు అనుకూలమైన ఈ పెసర రకం పంట కాలం 74 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 11.17 క్వింటాళ్లు వస్తుంది. ఎల్లో మొజాయిక్ వైరస్‌ను తట్టుకుంటుంది. యంత్రంతో కోతకు అనుకూలం. రబీ సీజన్లో వరి మాగాణులకే కాదు.. మెట్ట ప్రాంతాల్లో సైతం సాగుకు అనుకూలం. వీటిలో ప్రొటీన్స్ 23.16 శాతం ఉంటాయి. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిశాలలో రబీ సీజన్లో సాగుకు అనువైన రకమిది. -
పనస గింజలు ఇలా తినండి
వేసవి రాగానే పనస కాయలు, పనస పండ్లు విరివిగా లభిస్తాయి. చాలామంది పనస తొనలను తిసేసి, వాటి గింజలను పారవేస్తుంటారు. అయితే ఈ గింజలలోని ప్రయోజనాలు తెలిస్తే వాటిని అస్సలు పారవేయరు.పనస గింజలు మనకు యాపిల్‌కు మించిన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అలాగే వీటిలో బాదంపప్పుతో సమానమైన పోషకాలు లభిస్తాయి. పనసపండు బాగా పండినప్పుడు దాని తొనలు తియ్యగా, మరింత మెత్తగా తయారవుతాయి. దీంతో దానిలోని గింజలను తొలగించడం మరింత సులభమవుతుంది. ఈ గింజలను ఆహారంలో ఉపయోగించడం వలన అనేక ప్రయోజనాలు అందుతాయి. అయితే పనసపండులోని గింజలను ఎలా తినాలో, ఫలితంగా ఒనగూరే ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.పనస గింజలను ఉడకబెట్టి, పైనున్న తొక్క తీసిన తర్వాత తినవచ్చు. ఈ గింజలతో కూర తయారుచేసి కూడా తినవచ్చు. జాక్‌ప్రూట్ గింజలు తినేందుకు ఎంతో రుచికరంగా ఉంటాయి. ఇవి మనకు పలు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.హిమోగ్లోబిన్ పెరుగుదల జాక్‌ఫ్రూట్ గింజల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఈ గింజలను తినడం వలన శరీరంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. శరీరంలో ఎర్ర రక్త కణాలు పెరిగినప్పుడు, సహజంగా రక్తం పరిమాణం కూడా పెరుగుతుంది.శరీరానికి శక్తి లభిస్తుంది పనస గింజలు తినడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. వీటిని తీసుకోవడం ద్వారా శరీరంలో విటమిన్ బి లోపాన్ని నివారించుకోవచ్చు. జాక్‌ఫ్రూట్ గింజలు మన శరీరంలోని కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో, మెదడు పనితీరును మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడతాయి.జీర్ణక్రియ మెరుగుదల జాక్‌ఫ్రూట్ గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వలన జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. జాక్‌ఫ్రూట్ గింజలు చర్మానికి, జుట్టుకు కూడా మేలు చేస్తాయి.స్థూలకాయాన్ని తగ్గిస్తాయి జాక్‌ఫ్రూట్ గింజల్లో అధిక మొత్తంలో ప్రొటీన్లు ఉంటాయి. వీటిని తినడం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయదు. చాలా సేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి.రోగనిరోధక శక్తి పెరుగుదల ఈ గింజలు తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఇది కొత్త వైరస్‌లతో పోరాడేందుకు శరీరానికి శక్తిని అందిస్తుంది. జాక్‌ఫ్రూట్ గింజల్లో ఉండే పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. -
నూతన వంగడాలను ఆవిష్కరించిన మోదీ
న్యూఢిల్లీ: కరువు కాటకాలను, నీటి ఎద్దడి పరిస్థితులను తట్టుకుంటూనే అధిక దిగుబడినిచ్చే నూతన వంగడాలను ప్రధాని మోదీ ఆదివారం ఆవిష్కరించారు. వీటిలో 61 పంటలకు సంబంధించిన 109 రకాల విత్తనాలున్నాయి. వీటిలో 34 ఆహార, వాణిజ్య పంటల వంగడాలు కాగా 27 ఉద్యాన పంటలకు చెందినవి. పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు, నూనె గింజలు, చెరకు, పత్తి, మొక్కజొన్న, పూలు, పండ్లు, కూరగాయలు, దినుసులు, ఔషధ గుణాల మొక్కల విత్తనాలు ఇలా పలురకాల నూతన వంగడాలను ఢిల్లీలోని పూసా క్యాంపస్‌లోని మూడు వ్యవసాయ పరిశోధనా కేంద్రాల్లో ప్రధాని వీటిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కడి రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో మోదీ ముచ్చటించారు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసీఏఆర్) ఈ నూతన వంగడాలను అభివృద్ధిచేసింది. ఏటా పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా వ్యవసాయానికి అదనపు విలువ జోడింపు ప్రస్తుతం తక్షణ అవసరమని ప్రధాని వ్యాఖ్యానించారు. కొత్త వంగడాల విశిష్టతపై అక్కడి రైతులతో కలిసి చర్చించారు. తక్కువ నిర్వహణ వ్యయం కారణంగా నూతన వంగడాలతో తమకు మరింత లబ్ధి చేకూరనుందని అక్కడి రైతులు చెప్పారు. ‘‘ తృణధాన్యాల గొప్పదనం, వాటిలోని పోషకవిలువ గురించి తెలిశాక ప్రజలు వాటి వినియోగానికి మొగ్గుచూపుతున్నారు. సేంద్రియ వ్యవసాయం ఎంతో మేలు. ప్రకృతి వ్యవసాయం పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగింది. సేంద్రీయ ఆహారం కావాలని జనం అడిగి మరీ కొనుగోలుచేస్తున్నారు. ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న నూతన వంగడాలపై దేశవ్యాప్తంగా కృషి విజ్ఞాన్ కేంద్రాలు రైతులకు అవగాహన పెంచాలి. కొత్త రకాలను సృష్టిస్తున్న శాస్త్రవేత్తలకు నా అభినందనలు’’ అని మోదీ అన్నారు. సహజసిద్ధ సాగును ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం పట్ల తమలో సానుకూలత పెరిగిందని, కృషి విజ్ఞాన్ కేంద్రాల పాత్ర ఇందులో కీలకమని రైతులు చెప్పారని ప్రభుత్వం తర్వాత ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ వంగడాల్లో పోషక విలువలు మెండుగా ఉంటాయని తర్వాత ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ వ్యాఖ్యానించారు. -
అచ్చెన్నా.. ఇదేంటన్నా!?
పెదకాకాని: వారు వ్యాపారులు కారు.. డీలర్లూ కాదు.. సొంత పొలంలో వరి పంట విత్తుకోవడానికి కొందరు కలిసి విత్తనం తెచ్చుకున్న అన్నదాతలు. అదే వారి పాలిట శాపమైంది. వారేదో మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్నట్లు అధికారుల తనిఖీలు.. పోలీసుల రంగ ప్రవేశం.. కేసుల నమోదు.. అసలు రాష్ట్రంలో నెల రోజులకు పైగా ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. పొలం వాళ్లది.. డబ్బులు వాళ్లవి.. శ్రమ వాళ్లది.. చేతనైతే సహకరించాల్సింది పోయి రైతులపై కేసులు పెట్టడం ఏమిటి? మునుపటికొకడు ఎద్దు ఈనిందంటే గాటికి కట్టేయండి.. అన్న చందంగా ఎవరో ఫిర్యాదు చేస్తే సరిగా విచారించకుండానే ఈ దుందుడుకు చర్యలు ఏమిటి? గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెంకటకృష్ణాపురం గ్రామానికి చెందిన అమ్మిశెట్టి రోజేశ్వరరావు, మరికొందరు రైతులు కలిసి ఈ నెల 2వ తేదీన 30 కిలోల బరువుగల 58 సంచుల వరి విత్తనాలను తెలంగాణ నుంచి తెప్పించారు. వాటిని రోజేశ్వరరావు తన గోడౌన్లో దించుకున్నారు. అదేరోజు గుంటూరు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు అందిన సమాచారం మేరకు మండల వ్యవసాయాధికారి (ఏవో) పి.సంధ్యారాణి గ్రామానికి వచ్చారు. వరి విత్తనాలు ఎక్కడ కొనుగోలు చేశారు.. అనుమతులున్నాయా అంటూ విచారించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం పెదపాపయ గ్రామం నుంచి నందీశ్వర సీడ్స్ పేరుతో ఉన్న వరి విత్తనాలను తామంతా కలిసి కొనుగోలు చేసినట్లు రైతులు తెలిపారు. అందుకు సంబంధించిన బిల్లు కూడా చూపించారు. ఒక్కరి పేరుతో ఇన్ని విత్తనాలు కొనుగోలు చేయకూడదని, షెడ్డులో ఉన్న 58 బస్తాలు సీజ్ చేస్తామని ఏవో చెప్పారు. తాము ఏటా వంద ఎకరాలకు పైగా వరి సాగు చేస్తామని రైతులు రోజేశ్వరరావు, మల్లికార్జునరావు, సాంబశివరావు తదితరులు విత్తనాలు సీజ్ చేయకుండా అడ్డుకున్నారు. దీంతో రైతులు తమ విధులకు ఆటంకం కలిగించారని ఏవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు శనివారం సీఐ కె.వీరాస్వామి తెలిపారు. రైతులపై కేసు నమోదు చేయడం పట్ల చుట్టుపక్కల గ్రామాల్లోని రైతుల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ ప్రభుత్వం రైతులకు ఇస్తున్న గౌరవం ఇదేనా అంటూ ప్రశి్నస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని, రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. -
బరువు తగ్గడంలో పుచ్చకాయ గింజలు ఎలా ఉపయోగపడతాయో తెలుసా..!
పుచ్చకాయ గింజలతో బరువుకి చెక్ పెట్టొచ్చట. సమ్మర్లో దాహార్తిని తీర్చే ఈ పుచ్చకాయతో బరువు తగ్గించడంలో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది అద్భుతమైన హైడ్రేటింగ్ పండు మాత్రమే గాక దీనిలో ఉండే చిన్న విత్తనాలు బరువుని తగ్గించడంలో ఎంతో పవర్‌ఫుల్‌గా పనిచేస్తాయని చెబుతున్నారు. ఇందులో దాదాపు 92% నీరు ఉంటుంది. ఇందులో ఖనిజాలు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. వేసవిలో మంచి రిఫ్రెష్‌ని ఇచ్చే జ్యూసీ పండు ఇది.అయితే దీనిలో ఉండే విత్తనాలను పారేస్తామే గానీ వినియోగించం. వీటిలో కూడా అవసరమైన పోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయట. అవి బరువు తగ్గించడంలో ప్రభావవంతగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్ని అని చెబుతున్నారు. ఈ పుచ్చకాయ గింజల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో సవివరంగా చూద్ధామా..!అధిక ప్రోటీన్: పుచ్చకాయ గింజల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది, ఇది కండరాలను బలోపేతం చేయడానికి అవసరం. ఇందులో ఉండే ప్రొటీన్ ఎక్కువసేపు నిండుగా ఉన్న అనుభూతిని పొందడంలో సహాయపడుతుంది. అల్పాహారం చేయాలనే కోరికను తగ్గించి, బరువు నిర్వహణలో సహాయపడుతుంది. ఈ విత్తనాలలో కొన్ని మాత్రమే రోజువారీ ప్రోటీన్‌లో గణనీయమైన మొత్తాన్ని అందించగలవు.ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి: ఈ గింజల్లో ఒమేగా-6 తో సహా ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటాయి. ఇవి శరీర కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. ఈ కొవ్వులు తక్షణ శక్తిని అందిస్తాయి. చురుకుగా ఉండటానికి, రోజంతా ఎక్కువ కేలరీలు బర్న్ చేయడంలో సహాయపడతాయి.ఫైబర్ కంటెంట్: పుచ్చకాయ గింజలు ఫైబర్ మూలం. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. సంపూర్ణత్వ భావనను ప్రోత్సహిస్తుంది. ఇది అతిగా తినడాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. పైగా మొత్తం కేలరీల తీసుకోవడం తగ్గిస్తుంది. అలాగే బరువు తగ్గించే ప్రయత్నాలకు మద్దతు ఇస్తుంది.జీవక్రియను పెంచుతుంది: పుచ్చకాయ గింజలలో లభించే మెగ్నీషియం జీవక్రియకు సంబంధించిన శక్తి ఉత్పత్తిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సమర్థవంతమైన బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన జీవక్రియ అవసరం. ఎందుకంటే ఇది శరీరంలో కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. అలాగే శరీరంలో అదనపు కిలోలను తగ్గించడంలో సహాయపడుతుంది.కేలరీలు తక్కువ: అనేక ఇతర చిరుతిండి ఎంపికలతో పోలిస్తే పుచ్చకాయ గింజలు చాలా తక్కువ కేలరీలను కలిగి ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి పోషకమైన సంతృప్తికరమైన ఎంపికగా మారుస్తుంది.ఎలా చేర్చుకోవాలంటే..వేయించిన పుచ్చకాయ గింజలు భోజనానంతరం స్నాక్‌గా తీసుకోవడం సరైనది. ఆరోగ్యకరమైన స్నాకింగ్ తినాలనుకుంటే చిటికెడు ఉప్పు, కొంచెం ఆలివ్ నూనెతో వేయించండి. అలాగే ప్రోటీన్లు, అవసరమైన పోషకాల కోసం స్మూతీస్‌లో కూడా జోడించండి. ముఖ్యంగా సలాడ్ల పైన వేయించిన పచ్చి పుచ్చకాయ గింజలను చిలకరించడం వల్ల క్రంచి క్రంచి వగరు రుచిని ఆస్వాదించవచ్చు. (చదవండి: కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసి సెంచరీ కొట్టిన తాత! ఎలాగంటే..) -
గోద్రెజ్ ఆగ్రోవెట్ నుంచి మూడు హైబ్రీడ్ విత్తనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గోద్రెజ్ ఆగ్రోవెట్ సీడ్స్ వ్యాపార విభాగం కొత్తగా మూడు హైబ్రిడ్ విత్తనాలను ఆవిష్కరించింది. మొక్కజొన్నకు సంబంధించి జీఎంహెచ్ 6034, జీఎంహెచ్ 4110 రకాలు, వరికి సంబంధించి నవ్య రకం విత్తనాలు వీటిలో ఉన్నాయి. ముందుగా వీటిని ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర మార్కెట్లలో ప్రవేశపెట్టగా రాబోయే నెలల్లో తెలంగాణ, బీహార్ మొదలైన రాష్ట్రాల్లోను క్రమంగా అందుబాటులోకి తెస్తామని కంపెనీ సీఈవో ఎన్కే రాజవేలు తెలిపారు. తమకు పంట సంరక్షణ ఉత్పత్తులు కూడా ఉన్నందున నాట్ల దగ్గర్నుంచి కోతల వరకు అన్ని దశల్లో రైతులకు తాము వెన్నంటి ఉంటామని ఆయన పేర్కొన్నారు. విత్తన రంగంలో సొంత ఆర్అండ్డీ విభాగం ఉన్న అతి కొద్ది కంపెనీల్లో తమది ఒకటని, అధిక దిగుబడులనిచ్చే విత్తనాలను రైతులకు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని రాజవేలు చెప్పారు. -
Sagubadi: విదేశీ విత్తనాలను, మొక్కల్ని ఆన్లైన్లో కొంటున్నారా? జాగ్రత్త..!
విదేశాల నుంచి మొక్కలు, విత్తనాలు, చెక్క వస్తువులు, అలంకరణ చేపలను ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారా? విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడ కంటికి నచ్చిన పూల మొక్కలనో, పంట మొక్కలనో, వాటి విత్తనాలనో అధికారుల కన్నుగప్పి వెంట తెస్తున్నారా?మిరపతో పాటు కొన్ని కూరగాయ పంటలు, మామిడి తోటలను ఇటీవల అల్లాడిస్తున్న నల్ల తామర ఇలాగే విదేశాల నుంచి వచ్చిపడిందేనని మీకు తెలుసా? కొబ్బరి, ఆయిల్‌పామ్ వంటి తోటలను పీడిస్తున్న రుగోస్ రింగ్‌స్పాట్ తెల్లదోమ కూడా విదేశాల నుంచి మన నెత్తిన పడినదే. వీటి వల్ల జీవవైవిధ్యానికి, రైతులకు అపారమైన నష్టం కలుగుతోంది.ఒక దేశంలో ఉన్నప్పుడు పెద్దగా నష్టం కలిగించని పురుగులు, తెగుళ్లు వేరే దేశపు పర్యావరణంలోకి ప్రవేశించినప్పుడు అక్కడి జీవవైవిధ్యానికి పెను సమస్య్ఠగా మారే ప్రమాదం ఉంటుంది.ఒక్కసారి ఆ పర్యావరణంలో అది సమస్యగా మారిన తర్వాత దాన్ని నిర్మూలించటం చాలా సందర్భాల్లో అసాధ్యం. ఉదాహరణ.. మన రైతులను వేధిస్తున్న నల్లతామర, రుగోస్ రింగ్‌స్పాట్ తెల్లదోమ. అందుచేత.. విదేశాల నుంచి సకారణంగా ఏవైనా మొక్కల్ని, విత్తనాలను, అలంకరణ చేపలను తెప్పించుకోవాలనుకుంటే.. అంతకు ముందే ఫైటోశానిటరీ సర్టిఫికెట్తో పాటు ఇతర అనుమతుల్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త..!తెలిసో తెలియకో పోస్టు, కొరియర్ల ద్వారా మన వంటి వారు కొనుగోలు చేస్తున్న విదేశీ మొక్కలు, విత్తనాలతో పాటు మనకు తెలియకుండా దిగుమతయ్యే సరికొత్త విదేశీ జాతుల పురుగులు, తెగుళ్లు మన దేశంలో పంటలకు, జీవవైవిధ్యానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. ఆహార భద్రతకు ఎసరు పెట్టే పరిస్థితులూ తలెత్తవచ్చు. అందుకే అంతర్జాతీయంగా జన్యువనరుల వ్యాపారాన్ని నియంత్రించేందుకు ఎయిర్‌పోర్టుల్లో, సీపోర్టుల్లో, సరిహద్దుల్లో ప్రత్యేక అధికార వ్యవస్థలను ఏర్పాటు చేశారు.మొక్కలు, విత్తనాలే కాదు.. మట్టి ద్వారా కూడా ఒక దేశం నుంచి మరో దేశానికి చీడపీడలు తెలియకుండా రవాణా కావొచ్చు. ఆ మధ్య ఒక క్రికెటర్ తనతో పాటు తీసుకెళ్తున్న బూట్లకు అడుగున అంటుకొని ఉన్న మట్టిని సైతం ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు గుర్తించి, నివారించడానికి ఇదే కారణం.అధికారికంగా వ్యవసాయ పరిశోధనల కోసం దిగుమతయ్యే పార్శిళ్లను ఈ క్వారంటైన్ అధికారులు వాటిని నిబంధనల మేరకు పరీక్షించి, ప్రమాదం లేదనుకుంటేనే దిగుమతిదారులకు అందిస్తారు. జాతీయ మొక్కల జన్యువనరుల పరిశోధనా సంస్థ (ఎన్‌బిపిజిఆర్) ద్వారా ఇది జరుగుతుంది.ఒక వ్యాపార సంస్థ నుంచి నేరుగా వినియోగదారుల మధ్య (బి2సి) జరిగే ఆన్లైన్ వ్యాపారం వల్లనే సమస్య. విదేశాల్లోని వినియోగదారులకు ఓ వ్యాపార సంస్థ నేరుగా అమ్మకాలు జరుపుతున్నందున దిగుమతులకు సంబంధించిన ఫైటోశానిటరీ నిబంధనల అమలు కష్టతరంగా మారింది.అంతర్జాతీయంగా ఈ వ్యవహారాల పర్యవేక్షణ కోసం ప్రపంచ దేశాల మధ్య ఇంటర్నేషనల్ ΄్లాంట్ ్ర΄÷టెక్షన్ ఒడంబడిక (ఐపిపిసి) గతంలోనే కుదిరింది. ఇటీవల కాలంలో పెద్ద తలనొప్పిగా మారిన ఈ–కామర్స్ పార్శిళ్లను కట్టడి చేయడం కోసం జాతీయ స్థాయిలో నియంత్రణ వ్యవస్థలకు ఐపిపిసి సరికొత్త మార్గదర్శకాలను సూచించింది.- గోల్డెన్ ఆపిల్ స్నెయిల్, - వరి మొక్కపై నత్త గుడ్లుఎవరేమి చెయ్యాలి?దేశ సరిహద్దులు దాటి సరికొత్త చీడపీడలు మన దేశంలోకి ప్రవేశించకుండా ఉండాలంటే, ప్రమాదవశాత్తూ వచ్చినా వాటిని తొలి దశలోనే గుర్తించి మట్టుబెట్టేందుకు సమాజంలోని అనేక వర్గాల వారు చైతన్యంతో వ్యవహరించాల్సి ఉంది.రైతులు: చీడపీడలను చురుగ్గా గమనిస్తూ ఏదైనా కొత్త తెగులు లేదా పురుగు కనిపిస్తే వెంటనే అధికారులకు చె΄్పాలి. పర్యావరణ హితమైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.స్వచ్ఛంద సంస్థలు, సహకార సంఘాలు: చీడపీడల నివారణ, నియంత్రణకు మేలైన పద్ధతులను రైతులకు సూచించాలి. వీటి అమలుకు మద్దతు ఇస్తూ.. మొక్కల ఆరోగ్య పరిరక్షణకు సంబంధీకులందరినీ సమన్వయం చేయాలి.ప్రభుత్వాలు, విధాన నిర్ణేతలు, పాలకులు: మొక్కల ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రత్యేక విధానాలు రూపొందించాలి. పర్యావరణహితమైన సస్యరక్షణ చర్యలను ్రపోత్సహించాలి. ప్రమాదరహితమైన వ్యాపార పద్ధతులను ప్రవేశ పెట్టాలి. జాతీయ, రాష్ట్రాల స్థాయిలో మొక్కల ఆరోగ్య రక్షణ ప్రభుత్వ సంస్థలను అన్ని విధాలా బలోపేతం చేయాలి.దాతలు–సిఎస్ఆర్: మొక్కల ఆరోగ్య రక్షణ వ్యవస్థలను, సాంకేతికతలను బలోపేతం చేయాలి. ప్రైవేటు కంపెనీలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్ఆర్) నిధులు సమకూర్చాలి. రవాణా, వ్యాపార రంగాలు: ప్రస్తుతం అంతర్జాతీయంగా అమల్లో ఉన్న ఫైటోశానిటరీ చట్టాలను, ఐపిపిసి ప్రమాణాలను తు.చ. తప్పక పాటించాలి.ప్రజలు: విదేశాల నుంచి మన దేశంలోకి మొక్కల్ని, మొక్కల ఉత్పత్తుల్ని తీసుకురావటం ఎంతటి ప్రమాదమో గుర్తించాలి. అధికార వ్యవస్థల కన్నుగప్పే విధంగా ఈ–కామర్స్ వెబ్సైట్లు, యాప్‌ల ద్వారా విదేశాల నుంచి మొక్కలను, విత్తనాలను ఆర్డర్ చేయకుండా చైతన్యంతో మెలగాలి.విదేశీ నత్తలతో ముప్పు!ఓ కోస్తా జిల్లాకు చెందిన ఒక వ్యక్తి మంచినీటి నత్త జాతికి చెందిన గోల్డెన్ ఆపిల్ స్నెయిల్ను విదేశాల నుంచి తెప్పించి సిమెంటు తొట్లలో పెంచుతూ పట్టుబడ్డాడు. దక్షిణ అమెరికా దీని స్వస్థలం. అయితే, తైవాన్, జపాన్, ఫిలిప్పీన్స్ దేశాలకు పాకిన ఈ నత్త ఆయా దేశాల్లో తామరతంపరగా పెరిగిపోతూ స్థానిక జలచరాలను పెరగనీయకుండా జీవవైవిధ్యాన్ని, వరి పంటను దెబ్బతీయటంప్రారంభించింది.లేత వరి మొక్కలను కొరికెయ్యటం ద్వారా పంటకు 50% వరకు నష్టం చేకూర్చగలదు. ఫిలిప్పీన్స్‌లో ఏకంగా 200 కోట్ల డాలర్ల మేరకు పంట నష్టం కలిగించింది. వేగంగా పెరిగే లక్షణం గల ఈ నత్త మంచినీటి చెరువులు, కాలువలు, వరి ΄÷లాల్లో జీవవైవిధ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఈ వ్యక్తి ఈ నత్తలను పెంచుతూ మాంసాన్ని విక్రయించటంప్రారంభించిన విషయం తెలుసుకున్న అధికారులు అతని వద్ద ఉన్న విదేశీ నత్తలను, వాటి గుడ్లను పూర్తిగా నాశనం చేశారు.దీని వల్ల జీవవైవిధ్యానికి ఉన్న ప్రమాదాన్ని గుర్తించలేని స్థితిలో ఈ నత్తల్ని పెంచటంప్రారంభించినట్లు చెబుతున్నారు. కొరియర్ ద్వారా గాని, కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి నత్తలను తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. అయితే, సకాలంలో అధికారులు స్పందించటం వల్ల మన వరి ΄÷లాలకు ఈ నత్తల ముప్పు తప్పింది.ఇండియన్ స్టిక్ ఇన్సెక్ట్..ఎండిన, ముక్కలు చేసిన లేదా పాలిష్ చేసిన ధాన్యాలు, విత్తనాలు, పండ్లు, కూరగాయలు, ఔషధ మొక్కలు కూడా చీడపీడలను మోసుకొచ్చే ప్రమాదం ఉంది. అయితే, ఉడికించటం, స్టెరిలైజ్ చేయటం, వేపటం వంటిప్రాసెసింగ్ చేసిన ఆహారోత్పత్తుల ద్వారా మాత్రం చీడపీడలు రవాణా అయ్యే అవకాశం ఉండదు కాబట్టి వీటికి ఫైటోశానిటరీ నిబంధనలు వర్తించవు.తేనెటీగలు, సీతాకోకచిలుకలు, మాంటిడ్స్, పెంకు పురుగులు, పుల్లలతో చేసిన బొమ్మ మాదిరిగా కనిపించే పురుగులు (స్టిక్ ఇన్సెక్ట్స్), నత్తలు వంటి వాటిని కొందరు సరదాగా పెంచుకోవటానికి కూడా ఒక దేశం నుంచి మరో దేశానికి పంపటం లేదా ఆన్లైన్లో కొనుగోలు చేయటం వంటి పనులు చేస్తుంటారు. వీటి ద్వారా కూడా పురుగులు, తెగుళ్లు, వైరస్లు ఇతర దేశాలకు వ్యాపించే అకాశం ఉంటుంది. న్యూజిలాండ్‌లో మూడేళ్ల క్రితం ఒక స్కూలు విద్యార్థిని ఇంట్లో పెద్దలకు తెలియకుండా అనేక రకాల స్టిక్ ఇన్సెక్ట్ గుడ్లను పోర్చుగల్ దేశం నుంచి ఆన్లైన్లో కొనుగోలు చేసి తెప్పించుకుంది. పార్శిల్ వచ్చిన తర్వాత గమనించిన ఆమె తల్లి ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. వారు ఆ పార్శిల్‌ను జాగ్రత్తగా తీసుకెళ్లి పరీక్షించి చూశారు.ఆ దేశంలో అప్పటికే ఉన్న అనేక రకాల స్టిక్ ఇన్సెక్ట్స్ గుడ్లతో పాటు కొత్త రకం ఇండియన్ స్టిక్ ఇన్సెక్ట్ గుడ్లు కూడా ఆ పార్శిల్లో ఉన్నాయని గుర్తించి నాశనం చేశారు. ఈ విద్యార్థిని తల్లి చైతన్యం మెచ్చదగినది.సెకనుకు 5,102 ఈ–కామర్స్ లావాదేవీలు!ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ద్వారా వస్తువుల వ్యాపారం (ఈ–కామర్స్) గతమెన్నడూ లేనంత జోరుగా సాగుతున్న రోజులివి. సెకనుకు 5,102 ఈ–కామర్స్ లావాదేవీలు జరుగుతున్నాయి. 2022లో ఏకంగా 16,100 కోట్ల పార్శిళ్ల కొనుగోళ్లు ఆన్లైన్లో జరిగాయి. కరోనా కాలంలో 20% పెరిగాయి. ఇప్పుడు వార్షిక పెరుగుదల 8.5%. 2027 నాటికి ఏటా 25,600 కోట్ల పార్శిళ్లు ఈ కామర్స్ ద్వారా బట్వాడా అయ్యే అవకాశం ఉందని అంచనా.- అమెరికాలోని ఓ తనిఖీ కేంద్రంలో ఈ–కామర్స్ పార్శిళ్లుముఖ్యంగా అసక్తిగా ఇంటిపంటలు, పూల మొక్కలు పెంచుకునే గృహస్తులు చిన్న చిన్న కవర్లలో విత్తనాలను విదేశాల్లోని పరిచయస్తులకు పోస్ట్/ కొరియర్ ద్వారా పంపుతుంటారు. విదేశీ కంపెనీల నుంచి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటూ ఉంటారు. విదేశాల నుంచి విత్తనాలు, ఉద్యాన తోటల మొక్కలు, అలంకరణ మొక్కలు, వాటితో పాటు వచ్చే మట్టి, అలంకరణ చేపలు, చెక్కతో చేసిన వస్తువులు, యంత్రాల ప్యాకింగ్‌లో వాడే వుడ్ ఫ్రేమ్‌ల ద్వారా పురుగులు, తెగుళ్లు ఒక దేశం నుంచి మరో దేశానికి రవాణా అవుతూ అధికారులకు చెమటలు పట్టిస్తున్నాయి.కరోనా కాలం నుంచి ప్రపంచ దేశాల మధ్య పార్శిళ్ల వ్యాపారం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవటంతో నియంత్రణ వ్యవస్థలు ఉక్కిరి బిక్కిరవుతున్నాయి. మన దేశంలో నియంత్రణ వ్యవస్థలను నేటి అవసరాలకు అనుగుణంగా పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది.– నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
నాన్ సబ్సిడీ సీడ్ పంపిణీ ఎప్పుడో?
సాక్షి, అమరావతి: నాన్ సబ్సిడీ విత్తన పంపిణీ ఈసారి మరింత ఆలశ్యమయ్యేట్టు కన్పిస్తోంది. ప్రతీ ఏటా సబ్సిడీ విత్తనంతో పాటు నాన్ సబ్సిడీ విత్తనాలను కూడా ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేవారు. కానీ ఈసారి ఆ దిశగా ప్రయత్నాలు జరగడంలేదు. ఎన్నికల వేళ.. ఖరీఫ్ సీజన్లో రైతులు ఇబ్బంది పడకూడదన్న ముందుచూపుతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలను సిద్ధం చేసింది.ఎన్నికల కోడ్ కారణంగా ఈసారి కాస్త ఆలశ్యంగా ప్రారంభమైనప్పటికీ, సబ్సిడీ విత్తన పంపిణీ జోరుగా సాగుతోంది. అగ్రి ల్యాబ్‌్సలో సర్టిఫై చేసిన సీడ్‌ను ఆర్బీకేల్లో నిల్వ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ పూర్తి కాగా, వేరుశనగ విత్తన పంపిణీ 90 శాతం పూర్తయింది. వరితో సహా ఇతర విత్తనాల పంపిణీ ఊపందుకుంటోంది.ఇప్పటికే 3.11లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాల పంపిణీఖరీఫ్ సీజన్ కోసం 6.32 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనం అవసరం కాగా, 6.28 లక్షల క్వింటాళ్ల విత్తనం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వమే అందుబాటులో ఉంచింది. 4.38 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని ఆర్బీకేల్లో ఉంచింది. ఇప్పటి వరకు 34,500 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలతో పాటు 2,55,899 క్వింటాళ్ల వేరుశనగ, 20,340 క్వింటాళ్ల వరి, 95 క్వింటాళ్ల అపరాలు చొప్పున 3.11 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని పంపిణీ చేశారు.రెండేళ్లలో 305 క్వింటాళ్ల నాన్ సబ్సిడీ విత్తనంసీజన్లో నాణ్యమైన విత్తనం దొరక్క మిరప, పత్తి రైతులు నకిలీల బారిన పడి, కోట్ల విలువైన పెట్టుబడి, ఉత్పత్తి నష్టాల బారిన పడకుండా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లు సర్టిఫై చేసిన నాణ్యమైన నాన్ సబ్సిడీ సీడ్‌నే మార్కెట్లో అందుబాటులో ఉంచింది. రైతుల నుంచి వచ్చే డిమాండ్ మేరకు నాన్ సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేసేది. ఇందుకోసం ప్రైవేటు కంపెనీలతో ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఏటా సీజన్‌కు ముందే ఒప్పందాలు చేసుకునేది.ఇలా గత రెండేళ్లలో 305.43 క్వింటాళ్ల నాన్ సబ్సిడీ విత్తనాన్ని పంపిణీ చేసింది. ఖరీఫ్–2022లో 108.44 క్వింటాళ్ల పత్తి, 2.52 క్వింటాళ్ల మిరప, 2.25 క్వింటాళ్ల సజ్జలు, 37.20 క్వింటాళ్ల సోయాబీన్ విత్తనాల పంపిణీ జరిగింది. గడిచిన ఖరీఫ్–2023లో సైతం 17.38 క్వింటాళ్ల పత్తి, 0.64 క్వింటాళ్ల మిరప, 137 క్వింటాళ్ల సోయాబీన్ విత్తనాలను పంపిణీ చేసింది.నకిలీల బారిన పడకుండా చర్యలుఈసారి కూడా ఖరీఫ్ సీజన్‌కు 3 నెలల ముందుగానే పత్తి, మిరప ఇతర పంటల విస్తీర్ణానికి తగినట్టుగా విత్తనాలు సరఫరా చేసేలా కంపెనీలను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సిద్ధం చేసింది. ముఖ్యంగా 29 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరం కాగా, ప్రస్తుతం మార్కెట్లో 30 లక్షల ప్యాకెట్లు అందుబాటులోకి తెచ్చింది. నకిలీల నివారణకు విస్తృతంగా తనిఖీలు చేసి, ముగ్గురు విత్తన డీలర్లపై 6 ఏ కేసులు నమోదు చేసింది. 7.77 లక్షల విలువైన పత్తి, మిరప విత్తనాలను జప్తు చేసింది. 2.13 కోట్ల విలువైన 435 క్వింటాళ్ల పత్తి, మిరప, ఇతర విత్తనాల అమ్మకాలను నిలిపివేసింది.ఫలితంగా ఎక్కడా నాసిరకం అనే మాటే విన్పించలేదు. సీజన్‌కు ముందే ప్రైవేటు కంపెనీలతో ఒప్పందానికి ఏర్పాట్లు చేసినా ఎన్నికల కోడ్ కారణంగా ముందుకు సాగలేదు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు. దీంతో ఈ ఏడాది ఆర్బీకేల ద్వారా నాన్ సబ్సిడీ విత్తన పంపిణీపై ఈసారి నీలినీడలు కమ్ముకుంటున్నాయి. విత్తనాలు ఎప్పుడు వస్తాయో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. -
విత్తనాలకు.. సుస్థిర విధానం అవసరం!
మన దేశంలో వరిలో దాదాపు 3 లక్షల దేశీ రకం విత్తనాలు ఉండేవని వ్యవసాయ చరిత్ర చెబుతున్నది. అనేక పంటలకు వివిధ రకాల విత్తనాలను వృద్ధి చేసుకున్న ఘనత భారత సాంప్రదాయ వ్యవసాయానిది. హరిత విప్లవం ఒక విధానంగా వచ్చిన గత 60 ఏళ్లలో అనేక రకాల హైబ్రిడ్ విత్తనాలను ప్రవేశపెట్టారు. ఏకపంట పద్ధతికి ప్రోత్సాహం రావడంతో, పంటల వైవిధ్యం తగ్గింది. రసాయనాలు వాడి తయారు చేసిన విత్తనాలు రసాయన వ్యవసాయంలోనే పని చేస్తాయి. కొన్ని కంపెనీల ఆధిపత్యంలో మార్కెట్లు ఉండటం వ్యవసాయ సుస్థిరతకు శ్రేయస్కరం కాదు. రైతులకు విత్తనాల మీద స్వావలంబన కొనసాగించే వ్యవస్థ అవసరం. ప్రభుత్వాలు సుస్థిర, గుత్తాధిపత్య రహిత విత్తన వ్యవస్థకు ప్రోత్సాహం అందించే విధానాలు రూపొందించాలి.ఆహార ఉత్పత్తి మొదలయ్యేది విత్తనాల నుంచే. దాదాపు ప్రతి పంటకు అనేక రకాల విత్తనాలు ఉన్నాయి. స్థానికంగా లభ్యమయ్యే ప్రత్యేక పర్యావరణ, వాతావరణ, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ప్రతి పంటలో రైతులు వందల ఏండ్లుగా విత్తనాలను రూపొందిస్తున్నారు. మన దేశంలో వరిలో దాదాపు 3 లక్షల దేశీ రకం విత్తనాలు ఉండేవని వ్యవసాయ చరిత్ర చెబుతున్నది. వంకాయలో 3 వేలతో సహా అనేక పంటలకు వివిధ రకాల విత్తనాలను వందల యేండ్ల నుంచి వృద్ధి చేసుకున్న ఘనత భారత సాంప్రదాయ వ్యవసాయానిది. దేశవ్యాప్తంగా విత్తనాల చుట్టూ అనేక సంప్రదాయాలు, పండుగలు, గ్రామీణ కార్యక్రమాలు ఉండేవి. గ్రామీణులు, రైతులు, ప్రత్యేకంగా మహిళలు విత్తనాలను గుర్తించటంలో, దాచటంలో, శుద్ధి చేయడంలో గణనీయ జ్ఞానం, కౌశల్యం సంపాదించారు. 35,000 సంవత్సరాలకు పైగా, తరతరాలుగా రైతాంగం పరిశోధనల ఫలితంగా అనేక రకాల విత్తనాలు వృద్ధి అయినాయి. ఈ జానపద విత్తన రకాలు మానవాళికి సుమారు 2,500 పంటలు, 14 పశువుల రకాలకు సంబంధించి ఆశ్చర్యపరిచే స్థాయిలో 11.4 లక్షల రకాల పంటలు, 8,800 పశువుల జాతులను అందించాయి.హరిత విప్లవం ఒక విధానంగా వచ్చిన గత 60 ఏళ్లలో అనేక రకాల హైబ్రిడ్ విత్తనాలు, ప్రధానంగా వరి, గోధుమలు, మక్కల(మొక్కజొన్న)లో ప్రవేశపెట్టారు. 1968–2019 మధ్య వివిధ సంస్థల ద్వారా 1200 వరి హైబ్రిడ్లు ప్రవేశ పెట్టింది ప్రభుత్వం. ఏకపంట పద్ధతికి ప్రోత్సాహం రావడంతో, పంటల వైవిధ్యం క్రమంగా తగ్గుతూ వచ్చి, ప్రమాదకర స్థాయికి చేరింది. హైబ్రిడ్ విత్తనాలను ప్రతి 3, 4 ఏళ్లకు మార్చాల్సి వస్తుంది. ఆధునిక వ్యవసాయం ల్యాబ్ విత్తనాలను ప్రవేశపెట్టి, సంప్రదాయ విత్తనాలను కనుమరుగు చేస్తున్నది. విత్తనాలు కంపెనీల గుప్పిట్లోకి పోయాయి. విత్తనాలు పోయినాయి అంటే మొత్తం ఆహార వ్యవస్థ ఈ కంపెనీల చేతులలోకి వెళ్లిపోవచ్చు. అట్లని కంపెనీల అధీనంలో, ఒక గొప్ప విత్తన వ్యవస్థ వచ్చిందా అంటే అదీ లేదు. రసాయనాలు వాడి తయారు చేసిన విత్తనాలు రసాయన వ్యవసాయంలోనే పని చేస్తాయి. సహజంగా విత్తనాలలో సహజీవన సూక్ష్మజీవులు ఉంటాయి. రసాయన చర్యకు లోనైన ఆధునిక విత్తనాలలో ఈ సూక్ష్మ జీవులు ఉండవు. జీవ ప్రక్రియలో ముఖ్య ఘట్టం విత్తనాలు. ఆ విత్తనాలు విషానికి, విష వ్యాపార సంస్కృతికి బలవుతున్నాయి. ప్రైవేటు కంపెనీల విత్తన వ్యాపారం మన దేశంలో 2002 నుంచి పుంజుకుని, ప్రతి యేడు పెరుగుతున్నది. దాదాపు రూ.25 వేల కోట్ల వార్షిక టర్నోవర్‌కు చేరింది. ప్రపంచ వ్యాప్తంగా 75 శాతం విత్తన వ్యాపారం కేవలం మూడు బహుళజాతి కంపెనీల గుత్తాధిపత్యంలో ఉన్నది. అమెరికాలోనే పారిశ్రామిక వ్యవసాయానికి అనుగుణమైన విత్తన వ్యవస్థ పుట్టుకొచ్చింది.అమెరికా ప్రభుత్వం ఎల్లప్పుడూ ఈ కంపెనీలకు మద్దతుగా తన వాణిజ్య, విదేశాంగ విధానం అమలు చేస్తుంది. మార్కెట్లో పోటీ తగ్గి కొన్ని కంపెనీల ఆధిపత్యంలో మార్కెట్లు ఉండడం వ్యవసాయ సుస్థిరతకు శ్రేయస్కరం కాదు. బీటీ పత్తి మినహా వేరే రకం పత్తి మార్కెట్లో లేకుండా ఈ ప్రైవేటు కంపెనీలు సిండికేట్ అయినాయి. ప్రభుత్వ సంస్థలలో విత్తన పరిశోధనలు జరగకుండా ప్రైవేటు విత్తన వ్యాపారం అడ్డు పడుతున్నది.అధిక దిగుబడి వంగడాలు, హైబ్రిడ్ విత్తనాలు ప్రవేశపెట్టిన నేపథ్యంలో 1968లో కేంద్ర ప్రభుత్వం విత్తన చట్టం తెచ్చింది. ఈ చట్టం ప్రాథమిక లక్ష్యం అప్పట్లో ప్రభుత్వ పరిశోధన సంస్థలు విత్తనాలను విడుదల చేసే పద్ధతిని నిర్దేశించిడం. తరువాత 2002లో ప్రైవేట్ కంపెనీలకు విత్తనాలను ప్రవేశపెట్టే అవకాశం ఇచ్చినాక విత్తన చట్టం సవరించాలని భావించారు. 2003 నుంచి కొత్త విత్తన చట్టాన్ని రైతాంగం కోరుతున్నా కూడా కేంద్ర ప్రభుత్వం చేయలేదు. కంపెనీలకు అనుకూల ముసాయిదాలతో 20 యేండ్ల కాలం దాటింది. కొన్ని రాష్ట్రాలు తమ పరిధిలో చట్టం తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తే కేంద్ర ప్రభుత్వం అడ్డుకున్నది. వ్యవసాయానికి విత్తన ఆవశ్యకత ఉన్నందున విత్తనాలను నిత్యావసర చట్టంలో చేర్చిన ప్రభుత్వం ప్రైవేటు విత్తన కంపెనీలకు ఆదాయ పన్ను చట్టం నుంచి మినహాయింపు ఇచ్చింది. విత్తన ధరల మీద నియంత్రణ లేదు. ఉత్తుత్తగా ప్రతి సంవత్సరం పత్తి విత్తనాల ధర నిర్ణయిస్తారు. కొరత ఉందని రైతులను భయపెట్టి బ్లాకు మార్కెట్లో ధరను పదింతలు పెంచుతారు. రైతు మీద భారం మోపుతారు. ఎవరైనా రైతు సొంతంగా విత్తనాలు చేసి అమ్మితే వారి మీద 420 కేసులు పెట్టే శాసన వ్యవస్థ, నాణ్యత లేని విత్తనాల వల్ల వేల ఎకరాల పంట నష్టపోయినా ఆయా కంపెనీలకు తాఖీదులు కూడా ఇచ్చే ధైర్యం చేయలేదు.జన్యుమార్పిడి విత్తనాల వల్ల శ్రేష్ఠమైన సంప్రదాయ విత్తనాలు కనుమరుగు అవుతుంటే, కలుషితం అవుతుంటే పట్టించుకుని సంరక్షించే విత్తన సంస్థ లేకపోవడం దురదృష్టకరం. ప్రత్తి విత్తనాలలో శ్రేష్ఠమైన, దేశీ విత్తనాలు ఇప్పుడు దొరికే పరిస్థితి లేదు. అనేక పంటలలోనూ ఇదే పరిస్థితి. పసుపు, చెరుకు, గోధుమలు, జొన్నలు, కూరగాయలు, మక్కలలో దేశీ రకాలు కనుమరుగు అవుతున్నాయి. ప్రైవేటు కంపెనీలు అమ్ముతున్న కంకర లాంటి మక్క గింజల పంటను ఫ్యాక్టరీకి పంపించి, ప్రాసెస్ చేసి, పశువుల, కోళ్ళ దాణాగా మాత్రమే ఉపయోగించేందుకు వృద్ధి చేశారు. ఇప్పటి మక్క కంకులు నేరుగా ఇళ్లల్లో కాల్చుకుని, ఉడకపెట్టుకుని, ఒలుచుకుని తినే విధంగా లేవు. అటువంటి మక్క గింజలనే పక్కాగా వాడమనీ, తమ కంపెనీల దగ్గర కొనుక్కోమనీ వివిధ దేశాల మీద ఒత్తిడి తేవడం అమెరికా పని. ఇటీవల అటువంటి జన్యుమార్పిడి మక్కలు మాకు వద్దని మెక్సికో ప్రభుత్వం అమెరికా నుంచి మక్కల దిగుమతిని ఆపేసింది. ముక్కలకు మక్కాగా ప్రసిద్ధి చెందిన మెక్సికో తమ గింజలను, తమ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి అమెరికాను ధిక్కరించింది. వరి గింజలకు, వైవిధ్యానికి ప్రసిద్ధి చెందిన మన దేశం మాత్రం విత్తన వైవిధ్యాన్ని కాపాడుకునేందుకు ఒక్కడుగు కూడా వేయడం లేదు. రైతులే కేంద్రంగా విత్తన వ్యవస్థను పునరుద్ధరించే పనిని అనేక స్వచ్చంద సంస్థలు దేశ వ్యాప్తంగా చేస్తున్నాయి. సహకార విత్తన బ్యాంకులను (కమ్యూనిటీ సీడ్ బ్యాంక్స్) ఏర్పాటు చేసి రైతులు, ప్రత్యేకంగా మహిళలను ప్రోత్సహిస్తున్నాయి. గత పదేళ్ళలో వరిలో, గోధుమలలో, చిరు ధాన్యాలలో, వివిధ కూరగాయలు, పండ్లలో తిరిగి దేశీ విత్తనాలను ఉపయోగించే వాతావరణం కల్పించటంలో అనేక సంస్థలు, వ్యక్తుల కృషి ఉన్నది. మన దేశంలో ఈ రెండు వ్యవస్థల (రైతు కేంద్రీకృత విత్తన వ్యవస్థ, లాభాపేక్షతో కొన్ని జన్యుమార్పిడి విత్తనాలను గుప్పిట్లో పెట్టుకున్న ప్రైవేటు వ్యవస్థ) మధ్య కనపడని సంఘర్షణ ఏర్పడింది. కానీ ప్రభుత్వాలు మాత్రం ప్రైవేటు విత్తన వ్యవస్థ వైపు మొగ్గు చూపుతూ, సబ్సిడీలు అందిస్తూ గుత్తాధిపత్యానికి ఊతం అందిస్తున్నాయి. రైతులకు విత్తనాల మీద స్వావలంబన కొనసాగించే వ్యవస్థ అవసరం. వ్యవసాయం లాభసాటిగా ఉండాలన్నా, రసాయన రహిత పౌష్టిక ఆహారం అందాలన్నా, అందరికి కూడు, బట్ట అందాలన్నా విత్తన వ్యవస్థ లాభాపేక్ష లేని వ్యవస్థగా రూపుదిద్దాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుస్థిర, గుత్తాధిపత్య రహిత విత్తన వ్యవస్థకు ప్రోత్సాహం అందించే విధానాలు రూపొందించాలి. గాలి, నేల, నీరు వంటివి సహజ పర్యావరణ వనరులు. విత్తనాలు కూడా సహజ వనరు. ఏ ఒక్కరి సొంతమో కారాదు. డా‘‘ దొంతి నరసింహా రెడ్డి వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు -
ఇకపై ఈ దుకాణాలకి.. ధ్రువీకరణ ఉండాల్సిందే..
కరీంనగర్: దుకాణాల్లో విరామం లేకుండా గడిపే డీలర్లు తరగతి గదిలో కూర్చోవాల్సిందే. ఇక విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు లెక్కలతో కుస్తీ పట్టేవారంతా నిపుణుల బోధనలు వినాల్సిందే. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఆదేశాల ప్రకారం ప్రతీ డీలర్ వ్యవసాయ శాఖ నుంచి డీఏఈఎస్ఐ డిప్లమా కోర్సు ధ్రువీకరణ పత్రం పొందాల్సిందేనని స్పష్టం చేసింది. లేదంటే వారిక విక్రయాలు చేసే అవకాశం ఉండదు.కట్టుదిట్టమైన శిక్షణ.. తదుపరి డిప్లమా కోర్సు ధ్రువీకరణ పత్రం, ఆపై రైతులకు విక్రయిస్తున్న వాటిపై నిఘా వంటి ప్రత్యేక కార్యాచరణ ఉండనుంది. వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఆత్మ) నేతృత్వంలో డిప్లొమా కోర్సు నిర్వహించనున్నారు. గతంలో జమ్మికుంట కేవీకేలో పలువురు డీలర్లకు డిప్లమా కోర్సు శిక్షణ జరగగా ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను సవరించింది. రైతు శిక్షణ కేంద్రంలో తర్ఫీదు ఇచ్చి ధ్రువీకరణ పత్రం ఇవ్వనున్నారు. డీలర్లు ఈ నెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలని రైతు శిక్షణ కేంద్రం డీడీ ఛత్రునాయక్ పేర్కొన్నారు.48 వారాలు.. నిపుణులతో బోధన..డీలర్లకు ఏడాది పాటు శిక్షణనివ్వనున్నారు. వారంలో ఒక రోజు ప్రతీ ఆదివారం తప్పనిసరిగా హాజరుకావాల్సిందే. కృషి భవన్‌ను శిక్షణకు వేదికగా నిర్ణయించారు. జిల్లా కేంద్రంలోనే డిప్లమా కోర్సు శిక్షణ ఉండాలని కేంద్రం నిర్దేశించగా తదనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రైతు శిక్షణ కేంద్రం ఏడీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. శిక్షణలో 48 ఆదివారాలు తరగతి గదిలో దుక్కుల నుంచి విత్తనాలు, సస్యరక్షణ చర్యలు తదితర సమగ్ర అంశాలను వివరించనున్నారు. మిగతా 8 వారాలు క్షేత్రస్థాయి శిక్షణ ఉండనుంది. వివరాలకు 81796 49595 నంబర్‌ను సంప్రదించాలని ఏడీ సూచించారు.ఒక్కో బ్యాచ్‌కు 40మంది డీలర్లు..విత్తన క్రిమిసంహారక, ఎరువు విక్రయ డీలర్లకు డిప్లమా ఇన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీస్ టు ఇన్పుట్ డీలర్స్ (డీఏఈఎస్ఐ) డిప్లమా కోర్సుకు ఒక్కో బ్యాచ్‌కు 40 మందిని ఎంపిక చేయనున్నారు. లైసెన్స్ పొందిన డీలర్ల నుంచి మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కలెక్టరేట్ వ్యవసాయ శాఖలోని రైతు శిక్షణ కేంద్రం కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలి. డీలర్ల లైసెన్స్ ప్రతిని సంబంధిత ఏడీఏ ధ్రువీకరణతో సమర్పించాలి. దరఖాస్తుదారు తప్పకుండా పదో తరగతి ఉత్తీర్ణుడై ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు రూ.10వేలు డీడీ చెల్లించి, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు అందజేయాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యతనివ్వనున్నారు.పరీక్ష పాసైతేనే ధ్రువీకరణ..ఏదో మొక్కుబడిగా కాకుండా సమగ్ర అవగాహన కలిగేలా కోర్సును ఏర్పాటు చేశారు. కాలక్షేపం చేస్తే సదరు డీలరుకు ఇబ్బందులు తప్పవు. 48 వారాలు జరిగిన కోర్సుపై పరీక్షలు నిర్వహించనున్నారు. ప్ర తీ అంశంపై పట్టు సాధించాల్సిందే. పరీక్షలో ఉత్తీర్ణుడైతేనే ధ్రువీకరణ పత్రం ఇవ్వనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు శిక్షణ తరగతులు జరుగనుండగా భోజన వసతి కల్పించనున్నారు.ఫెసిలిటేటర్ నియామకానికి గడువు 15ఇందుకు ఫెసిలెటేటర్ను నియమించేందుకు ఆత్మ ప్రకటన విడుదల చేసింది. బీఎస్సీ(అగ్రికల్చర్) లేదా ఎంఎస్సీ అగ్రికల్చర్ చదివి వ్యవసాయశాఖ లేదా వ్యవసాయ విశ్వవిద్యాలయం లేదా కేవీకేలో 20 ఏళ్ల అనుభవం ఉన్నవారిని ఫెసిలిటేటర్‌గా నియమించాలని ప్రభుత్వం నిర్దేశించింది. వీరికి దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 15 గడువు. ప్రతి ఆదివారం జరిగే శిక్షణలో శాస్త్రవేత్తలు, నిపుణులతో తరగతులు నిర్వహించడం వీరి విధి. త్వరలో శిక్షణ ప్రారంభిస్తామని, డీలర్ల నుంచి దరఖాస్తులు వస్తున్నాయని రైతు శిక్షణ కేంద్రం డీడీ ఛత్రునాయక్ వివరించారు.ఇవి చదవండి: బ్యాంకు ఖాతాలో డబ్బు లేకపోయినా యూపీఐ చెల్లింపులు..! -
తెలంగాణలో రైతులకు గడ్డు పరిస్థితి
-
సాగు సీజన్ షురూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్నారు. దుక్కులు దున్నడం మొదలుపెట్టారు. మరికాస్త వర్షం పడితే చాలు వెంటనే విత్తనాలు చల్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించడం, వచ్చే మూడు నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో.. వానాకాలం వ్యవసాయ సీజన్ గతం కంటే ముందుగా ప్రారంభమైనట్లేనని వ్యవసాయశాఖ వెల్లడించింది. ఈ వానాకాలం సీజన్లో 1.34 కోట్ల ఎకరాల్లో పంటల సాగు జరుగుతుందని అంచనా వేసింది. గతేడాది వానాకాలం సీజన్లో 1.26 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవగా.. ఈసారి 8 లక్షల ఎకరాల్లో అధికంగా పంటల సాగు జరుగుతుందని పేర్కొంది. ఈ మేరకు ఇటీవలే పంటల సాగు ప్రణాళికను విడుదల చేసింది. అత్యధికంగా 66 లక్షల ఎకరాల్లో వరి, ఆ తర్వాత 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని తెలిపింది. గతేడాది వరి 65 లక్షల ఎకరాల్లో, పత్తి 44.77 లక్షల ఎకరాల్లో సాగు అయ్యింది. ఈసారి పత్తి మరో 15.23 లక్షల ఎకరాల్లో సాగయ్యేలా రైతులను ప్రోత్సహించనున్నారు. వరి కంటే ఎక్కువగా పత్తిని ప్రోత్సహించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఆ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. విత్తన ప్రణాళిక ఖరారు సాగుకనుగుణంగా విత్తన ప్రణాళికను కూడా వ్యవసాయ శాఖ ఖరారు చేసింది. ఈ వానాకాలం సీజన్‌కు 19.39 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని నిర్ణయించారు. అందులో అత్యధికంగా 16.50 లక్షల క్వింటాళ్లు వరి విత్తనాలే కావడం గమనార్హం. పత్తి విత్తనాలు 54 వేల క్వింటాళ్లు, సోయాబీన్ విత్తనాలు 1.49 లక్షల క్వింటాళ్లు అందుబాటులోకి తెస్తారు. మొక్కజొన్న విత్తనాలు 48 వేల క్వింటాళ్లు, కంది విత్తనాలు 16,950 క్వింటాళ్లు, వేరుశనగ విత్తనాలు 13,800 క్వింటాళ్లు, పెసర విత్తనాలు 4,480 క్వింటాళ్లు సిద్ధం చేశారు. అలాగే జొన్న, సజ్జ, రాగి, మినుములు, ఆముదం, పొద్దు తిరుగుడు విత్తనాలను కూడా సిద్ధం చేయాలని నిర్ణయించారు. కొందరు రైతులు ఇప్పటికే విత్తనాలు కొనుగోలు చేయగా, మరికొందరు విత్తనాలు, ఎరువుల కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు రైతులకు అవసరమైన అన్ని రకాల ఎరువులు సిద్ధంగా ఉన్నాయని మార్క్‌ఫెడ్ వెల్లడించింది. వ్యవ‘సాయానికి’సన్నాహాలు ఈ వానాకాలం సీజన్ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతుబంధు స్థానంలో రైతుభరోసా ద్వారా పెంచిన పెట్టుబడి సాయం అందజేయనుంది. ఎకరాకు రూ.7,500 చొప్పున ఇవ్వనుంది. అయితే సాగయ్యే భూములకే ఇవ్వాలని, సీలింగ్ విధించాలని నిర్ణయించారు. అందుకు సంబంధించిన మార్గదర్శకాలు ఖరారు చేసే పనిలో వ్యవసాయశాఖ నిమగ్నమైంది. కౌలుదారులకు కూడా రైతు భరోసా ఇవ్వనున్నారు. ఇక రైతులకు రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీని ఆగస్టు 15వ తేదీ నాటికి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అందుకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా ఖరారు దశలో ఉన్నాయి. మరోవైపు ఈ వానాకాలం సీజన్ నుంచే రైతులకు పంటల బీమాను కూడా పునరుద్ధరించనున్నారు. 33 మందిపై కేసులు: మంత్రి తుమ్మల అనుమతి లేకుండా పత్తి విత్తనాల ప్యాకెట్లు విక్రయిస్తున్న 33 మందిపై కేసులు పెట్టి రూ. 2 కోట్ల విలువగల 118.29 క్వింటాళ్ళ విత్తనాలను స్వా«దీనం చేసుకున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విత్తనాలు బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారని తెలిసి ఇద్దరు డీలర్లపై కేసులు పెట్టామని వెల్లడించారు. పత్తి విత్తనాలు మార్కెట్లలో అవసరం మేరకు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. రైతులందరూ అ«దీకృత డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలని, ప్రైవేట్ వ్యక్తులు, మోసగాళ్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేయవద్దని సూచించారు. ఇప్పటివరకు 84.43 లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లను సరఫరా చేశామని, అందులో రైతులు ఇప్పటికే 25.10 లక్షల ప్యాకెట్లు రైతులు కొనుగోలు చేశారని వివరించారు. -
జోరుగా విత్తన పంపిణీ
సాక్షి, అమరావతి: నైరుతి వచ్చేసింది. తొలకరి మొదలైంది. ఖరీఫ్ సాగు ఊపందుకుంటోంది. ఎన్నికల కోడ్ కారణంగా ఈసారి కాస్త ఆలశ్యంగా ప్రారంభమైన విత్తనాల పంపిణీ ఇప్పుడు జోరందుకుంటోంది. ఇప్పటికే పచ్చిరొట్ట విత్తనాలతో పాటు వేరుశనగ విత్తనాల పంపిణీ జోరుగా సాగుతోంది. గిరిజన జిల్లాల్లో వరి విత్తన పంపిణీ ప్రారంభమైంది. ఈ నెల 15 వ తేదీ నుంచి మిగిలిన జిల్లాల్లో వరి, ఇతర విత్తనాల పంపిణీకి ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ, వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తున్నాయి. సీజన్ ఏదైనా స్థానిక లభ్యతనుబట్టి సాగు విస్తీర్ణంలో 30 శాతం విత్తనాన్ని సబ్సిడీపై రైతులకు అందిస్తుంటారు.సబ్సిడీ విత్తనం కోసం చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పడరాని పాట్లు పడేవారు. రోజుల తరబడి బారులు తీరి ఎదురు చూసేవారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. గడిచిన ఐదేళ్లుగా సీజన్‌కు ముందుగానే నాణ్యమైన, సర్టిఫై చేసిన విత్తనాన్ని ఆర్బీకేల ద్వారా గ్రామాల్లోనే అందించడంతో రైతుల కష్టాలకు తెరపడింది. ఈ ఏడాది ఖరీఫ్‌లో 85.65 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్దేశించారు. ప్రధానంగా 39.07 లక్షల ఎకరాల్లో వరి, 14.80 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 14.67 లక్షల ఎకరాల్లో పత్తి, 8.35 లక్షల ఎకరాల్లో అపరాలు సాగు చేయనున్నారు. ఖరీఫ్ సీజన్ కోసం 6,31,742 క్వింటాళ్ల విత్తనం అవసరం కాగా, 6,50,160 క్వింటాళ్లు అందుబాటులో ఉంది.2.99 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాన్ని 40 శాతం సబ్సిడీతో అందిస్తున్నారు. పెసర, మినుము, కంది విత్తనాలను 30 శాతం సబ్సిడీపై ఇస్తున్నారు. చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు కొర్ర, రాగి, అండుకొర్రలు వంటి విత్తనాలను 50 శాతం రాయితీపై సరఫరా చేస్తున్నారు. జాతీయ ఆహార ధాన్యాల భద్రత పథకం అమలవుతున్న జిల్లాల్లో కిలోకి రూ.10 చొప్పున, ఇతర జిల్లాల్లో కిలోకి రూ.5 చొప్పున రాయితీతో వరి విత్తనాలు సరఫరా చేస్తున్నారు. ఏజెన్సీ జిల్లాల్లో మాత్రం 90 శాతం సబ్సిడీపై వరితో సహా అన్ని రకాల విత్తనాలను పంపిణీ చేస్తున్నారు. వీటిలో ఇప్పటికే 3,15,928 క్వింటాళ్ల విత్తనాన్ని ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచారు. 48,177 క్వింటాళ్ల పచ్చిరొట్ట, 2 లక్షల క్వింటాళ్ల వేరుశనగ, 67,617 క్వింటాళ్ల వరి, 84 క్వింటాళ్ల చిరుధాన్యాలు, కందులు, మినుములు, 50 క్వింటాళ్ల పెసర, రాజ్మా, నువ్వులు విత్తనాలను సిద్ధం చేశారు.విత్తనం కోసం 3.76 లక్షల మంది రైతులు నమోదుఆర్బీకేల ద్వారా విత్తనాలు కావాల్సిన రైతుల వివరాలను అన్ని జిల్లాల్లో నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకు 2,46,997 క్వింటాళ్ల విత్తనాల కోసం 3,75,583 మంది రైతులు ఆర్బీకేల్లో వివరాలు నమోదు చేసుకున్నారు. ఇప్పటివరకు 40 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు, 1,04,200 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాల పంపిణీ పూర్తయింది.సరిపడా విత్తన నిల్వలుగతేడాది మాదిరిగానే సర్టిఫై చేసిన నాణ్యమైన, ధ్రువీకరించిన విత్తనాన్ని ఆర్బీకేల ద్వారా పంపిణీ చేస్తున్నాం. ఇప్పటికే పచ్చిరొట్టతో పాటు వేరుశనగ విత్తనం పంపిణీ జోరుగా సాగుతోంది. మిగిలిన విత్తనాలను జూన్ 15వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నాం.– ఎం.శివప్రసాద్, ఎండీ, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థఏజెన్సీలో 7వేల క్వింటాళ్ల పంపిణీగిరిజన ప్రాంతాల్లో గతంలో ఏటా 2, 3 వేల క్వింటాళ్లకు మించి విత్తనాలను పంపిణీ చేయలేదు. ఈసారి రికార్డు స్థాయిలో 90 శాతం సబ్సిడీ విత్తనాల పంపిణీ జరుగుతోంది. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఈ ఏడాది 7 వేల క్వింటాళ్ల విత్తనాన్ని సిద్ధం చేశారు. డిమాండ్‌ను బట్టి మరింత పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
కొత్త విత్తనాలు వేద్దాం
వరి సాగులో విత్తన మార్పిడిని ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. దశాబ్దాలుగా అన్నదాతలు సాగు చేస్తున్న పాత రకాల వరి వంగడాలకు బదులుగా శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకు నవీకరించిన రకాల సాగును ప్రోత్సహించాలని భావిస్తోంది. దశలవారీగా వీటి సాగును విస్తరించేలా చర్యలు చేపట్టింది. ఆ దిశగా రైతులను కార్యోన్ముఖులను చేసేందుకు వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించారు. సాక్షి, అమరావతి: వరి సాగులో విత్తన మారి్పడిని ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకు నూతన విత్తనాల సాగును ప్రోత్సహించాలని భావిస్తోంది. ఈ మేరకు వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో వరి ఖరీఫ్ సీజన్లో 37 లక్షల ఎకరాల్లో, రబీలో 20 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. ఖరీఫ్‌లో 20 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో మూడు దశాబ్దాల క్రితం అభివృద్ధి చేసిన వంగడాలనే నేటికీ సాగు చేస్తున్నారు. వీటిలో ప్రధానంగా బీపీటీ 5204తో పాటు ఎంటీయూ 7029, ఎంటీయూ 1061, ఎంటీయూ 1064 రకాలు ఎక్కువగా పండిస్తున్నారు. దశాబ్దాలుగా సాగవుతుండడంతో చీడపీడలను తట్టుకోలేకపోతున్నాయి. తుఫాన్లతోపాటు కొద్దిపాటి వర్షాలను సైతం తట్టుకోలేక పంటచేలు నేలచూపులు చూస్తున్నాయి.భారీ వర్షాలొస్తే ముంపు బారిన పడుతున్నాయి. వీటికి సరైన ప్రత్యామ్నాయం లేక, కొత్తగా అభివృద్ధి చేసిన వంగడాలపై అవగాహన లేక రైతన్నలు వీటిపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. అందుబాటులో ప్రత్యామ్నాయ రకాలు శాస్త్రవేత్తల సుదీర్ఘ పరిశోధనల అనంతరం ఎంటీయూ 7029, ఎంటీయూ 1061, ఎంటీయూ 1064 రకాలకు ప్రత్యామ్నాయంగా ఎంటీయూ 1318 రకం వరి విత్తనాన్ని అందుబాటులోకి తెచ్చారు. గింజ రాలకపోవడంతోపాటు తెగుళ్లను సమర్థంగా తట్టుకుని మిల్లర్లకు నూక శాతం లేని రకంగా ఈ కొత్త వరి వంగడం ప్రాచుర్యం పొందింది. ఇక బీపీటీ 5204 రకానికి ప్రత్యామ్నాయంగా ఎంటీయూ 1271, ఎన్‌డీఎల్‌ఆర్ 7 రకాలు అందుబాటులోకి వచ్చాయి. తెగుళ్లు, పురుగులను తట్టుకునే సామర్థ్యంతో అభివృద్ధి చేసిన ఈ వంగడాలు గింజ రాలకుండా అధిక దిగుబడులు ఇస్తున్నట్లు శాస్త్రవేత్తలు ధృవీకరించారు. ఆర్జీఎల్ 2537 రకం వరికి ప్రత్యామ్నాయంగా ఎంటీయూ 1232 రకాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇది సన్న గింజ రకం కావడంతోపాటు అధిక దిగుబడినిస్తుంది. వేరుశనగలో కే–6కు ప్రత్యామ్నాయం ఖరీఫ్‌లో సాగు చేసే నూనె గింజల్లో అత్యధిక విస్తీర్ణం (15 లక్షల ఎకరాలు)లో సాగయ్యే వేరుశనగలో కే–6 రకాన్నే దాదాపు మూడు దశాబ్దాలుగా పండిస్తున్నారు. తెగుళ్లు, చీడపీడలతో పాటు బెట్ట పరిస్థితులను తట్టుకోలేక, ఆశించిన దిగుబడులు రాకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను చవి చూస్తున్నారు. కే–6కు ప్రత్యామ్నాయంగా టీసీజీఎస్ 1694, కదిరి లేపాక్షి రకాలను అందుబాటులోకి తెచ్చారు. బెట్టనే కాకుండా తెగుళ్లను కూడాసమర్థంగా తట్టుకునే ఈ రకాలు అధిక దిగుబడినిస్తున్నాయని శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. దశలవారీగా విస్తరణ.. వ్యవసాయ శాఖాధికారులు, డీఏఏటీఐ, కేవీకే శాస్త్రవేత్తలు, విత్తనాభివృద్ధి సంస్థ అధికారులతో జిల్లా స్థాయిలో నిర్వహించిన సదస్సులతో కొత్త విత్తనాల సాగుపై వ్యవసాయ శాఖ పక్కాగా కార్యాచరణ సిద్ధం చేసింది. దశలవారీగా కొత్త రకాల సాగును విస్తరించేలా ప్రణాళిక రూపొందించారు. 2024–25 సీజన్లో 10 శాతం, 2025–26 సీజన్లో 15 శాతం, 2026–27లో 25 శాతం విస్తీర్ణంలో విత్తన మార్పిడి చేయనున్నారు. తరువాత సంవత్సరాల్లో ఇదే విధానం కొనసాగుతుంది. బ్రీడర్ విత్తనాన్ని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉత్పత్తి చేసింది. ప్రభుత్వ క్షేత్రాలు/ఏపీ సీడ్స్ ఎంపిక చేసిన రైతుల క్షేత్రాల్లో బ్రీడర్ సీడ్ నుంచి మూల విత్తనాన్ని పండిస్తారు. ఏపీ సీడ్స్ ఎంపిక చేసిన రైతుల క్షేత్రాల్లో మూల విత్తనాన్ని నాటి సర్టిఫైడ్ సీడ్‌ను పండిస్తారు. వీటిని ఏపీ విత్తన ధ్రువీకరణ అథారిటీ ధ్రువీకరిస్తుంది. బ్రీడర్, ఫౌండేషన్ సీడ్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ముందుగా వీటి సాగుకు ప్రాధాన్యతనిస్తారు. పూర్తిస్థాయిలో విత్తనం అందుబాటులోకి తెచి్చన తర్వాత సబ్సిడీపై రైతులకు సరఫరా చేసి దశల వారీగా సాగు విస్తీర్ణం పెరిగేలా ప్రోత్సహిస్తారు. ఆర్బీకేల ద్వారా అవగాహన రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎంపిక చేసిన ప్రాంతాల్లో రైతుల వారీగా సమావేశాలు నిర్వహించి తొలుత అవగాహన కల్పించనున్నారు. కొత్త రకాల ప్రత్యేకతను అందరికీ అర్థమయ్యే రీతిలో వాల్ పోస్టర్లు, కరపత్రాల ద్వారా విç్తత ప్రచారం కల్పిస్తారు. ఆర్బీకే ఛానల్ ద్వారా శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతుల సందేశాలతో కూడిన వీడియోల ద్వారా వీటి సాగును ప్రోత్సహిస్తారు.చిన్న చిన్న వీడియో, ఆడియో సందేశాలను రూపొందించి పంటల వారీగా ఏర్పాటు చేసిన వాట్సప్ గ్రూపుల ద్వారా రైతులకు చేరవేసి వాటిపై అవగాహన కల్పిస్తారు. ప్రత్యామ్నాయ రకాల విస్తరణే లక్ష్యంరాష్ట్రంలో కొన్ని రకాల వంగడాలు దాదాపు 20–30 ఏళ్లకుపైగా సాగులో ఉన్నాయి. కనీసం 10–15 ఏళ్ల పాటు సాగు చేసిన వంగడాలను క్రమేపీ తగ్గించాలి. వాటి స్థానంలో ఇటీవల కొత్తగా అభివృద్ధి చేసిన వంగడాలను సాగులోకి తేవాల్సిన అవసరం ఉంది. వచ్చే మూడేళ్లలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో కనీసం 50 శాతం విస్తీర్ణంలో పాత వంగడాల స్థానంలో శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన కొత్త రకాల సాగును ప్రోత్సహించేలా కార్యాచరణ సిద్ధం చేశాం. –చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
వచ్చిందే సగం ‘బ్లాక్’తో ఆగం!
సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్వర్క్ : వానాకాలం ముంచుకొస్తోంది. ఈసారి మంచి వర్షాలు పడతాయన్న వాతావరణశాఖ ప్రకటనతో.. రైతులు పెద్ద ఎత్తున సాగుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా పత్తి విత్తనాల కోసం భారీగా డిమాండ్ నెలకొంది. కానీ బ్రాండెడ్ పత్తి విత్తనాలు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోయాయి. రైతులు కోరుకునే విత్తనాలను వ్యాపారులు ‘బ్లాక్’ చేస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కాలం చెల్లిన, సాధారణ విత్తనాలను మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో మంచి విత్తనాల కోసం రైతులు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. మరోవైపు అనుమతి లేని విత్తనాలను ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చి అమ్ముతున్నట్టూ ఆరోపణలు ఉన్నాయి. అధిక దిగుబడి వస్తుందనే ప్రచారంతో.. శాస్త్రీయంగా అన్నిరకాల విత్తనాలు దాదాపు ఒకే రకమైన పంట, దిగుబడిని ఇస్తాయని నిపుణులు చెప్తున్నారు. కానీ వ్యాపారులు వ్యూహాత్మకంగా కొన్ని రకాలే మంచి దిగుబడులు ఇస్తాయని అపోహలు సృష్టిస్తూ దండుకుంటున్నారు. ప్రస్తుతం కంపెనీ ఏదైనా సరే.. బీటీ–2 పత్తి విత్తన ప్యాకెట్ (475 గ్రాములు) ధర రూ.864గా నిర్ణయించారు. 30కిపైగా కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న 200 రకాల విత్తనాలను ఇదే ధరపై విక్రయించాలి.కానీ మార్కెట్లో ఒక నాలుగైదు రకాలు అధిక దిగుబడులు ఇస్తాయనే ప్రచారం ఉంది. వ్యాపారులు అలాంటి వాటిని బ్లాక్ చేస్తూ రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. కొన్నిచోట్ల ఒక్కో ప్యాకెట్ విత్తనాలకు రూ.2 వేల నుంచి రూ. 2,500 వరకు వసూలు చేస్తున్నట్టు రైతులు చెబుతున్నారు. నిషేధిత విత్తనాలు అంటగడుతూ.. కొందరు వ్యాపారులు, దళారులు నిషేధిత బీటీ–3 విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. బీటీ–2 కంటే తెగుళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటాయని.. కలుపును తట్టుకుంటాయని చెప్తున్నారు. పత్తి చేన్లలో కలుపు నివారణ కోసం కూలీలు సకాలంలో దొరక్క ఇబ్బందిపడుతున్న రైతులు ఈ ప్రచారానికి ఆకర్షితులవుతున్నారు. ఇలా డిమాండ్ సృష్టిస్తున్న వ్యాపారులు బీటీ–2 విత్తనాల కంటే బీటీ–3 విత్తనాలను రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారు.మహారాష్ట్రలోని ఔరంగాబాద్, జాల్నా ప్రాంతాలతోపాటు గుజరాత్‌లోని వివిధ పట్టణాల నుంచి ఈ బీటీ–3 విత్తనాలు రాష్ట్రంలోకి వస్తున్నాయి. నకిలీలు, నిషేధిత విత్తనాలను నియంత్రించడం, బ్లాక్ మార్కెటింగ్‌ను అడ్డుకోవడం వంటి చర్యలు చేపట్టాల్సిన అధికారులు.. కొందరు దళారులు, వ్యాపారులతో కుమ్మక్కై చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. తూతూమంత్రంగా దాడులు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటివరకు సగం వరకు సరఫరా.. నైరుతి రుతుపవనాలతో కురిసే తొలకరి వానలతోనే రైతులు పత్తి విత్తనాలు చల్లుతారు. ఈసారి రాష్ట్రంలో 55 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేశారు. అందుకోసం 1.26 కోట్ల విత్తన ప్యాకెట్లు సిద్ధం చేయాలని నిర్ణయించారు. కానీ ఇప్పటివరకు 68.16 లక్షల ప్యాకెట్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. వ్యవసాయశాఖ వెల్లడించిన వివరాలే ఇవి. దీనిపై రైతులు, వ్యవసాయ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.‘‘ఇప్పటివరకు మొత్తం విత్తనాలను ఎందుకు జిల్లాలకు సరఫరా చేయలేదు? కొరతే లేదని చెప్తున్నప్పుడు రైతులు ఎందుకు క్యూలైన్లలో ఎందుకు ఉండాల్సి వస్తోంది? ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారో అధికారులే చెప్పాలి. రైతులు కోరుకునే కంపెనీల విత్తనాలను అందుబాటులో ఉంచకపోవడమే ఇందుకు ప్రధాన కారణం..’’ అని వారు పేర్కొంటున్నారు. మరోవైపు ఇతర కంపెనీల విత్తనాలు కూడా కొనుగోలు చేసుకోవాలని అధికారులు చెప్తున్నారని.. మరి వారు దిగుబడికి గ్యారంటీ ఇవ్వగలరా అని రైతులు ప్రశి్నస్తున్నారు. ఇంకా సేకరణలోనే యంత్రాంగం.. రాష్ట్రంలో నిర్ణయించుకున్న లక్ష్యంలో సగం వరకే పత్తి విత్తనాలు సరఫరా అయ్యాయి. సీజన్ కూడా మొదలైపోతోంది. కానీ అధికారులు ఇంకా విత్తనాలను సేకరించే పనిలోనే ఉన్నారు. కంపెనీలతో ఇప్పటికీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒక రకం బ్రాండ్ విత్తనాలకు డిమాండ్ ఉందని తెలిసి.. ఇప్పుడు తమిళనాడు నుంచి ఆ రకం విత్తనాలు తెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు. ఉన్నతాధికారుల సమన్వయ లోపంతో.. వ్యవసాయ శాఖలోని ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారుల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోందని.. దిగువ స్థాయికి ఆదేశాలివ్వడంలో సరిగా వ్యవహరించలేక పోతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఎరువుల దుకాణాలను రోజూ పరిశీలించాలని వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో)ను ఒక ఉన్నతాధికారి ఆదేశిస్తుంటే.. మరో ఉన్నతాధికారి మాత్రం అలా చేయొద్దని, తాను చెప్పినట్టుగా రైతుల వద్దకు వెళ్లి వారికి సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్తున్నట్టు తెలిసింది. ఇలాగైతే ఏఈవోలు ఎవరి మాట వినాలి, ఏం చేయాలన్న ప్రశ్నలు వస్తున్నాయి. పత్తి విత్తనాల సరఫరా విషయంలోనూ ఈ ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య సమన్వయం లేకపోవడం సమస్యగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇదీ పరిస్థితి.. ⇒ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏటా వానాకాలంలో 14 లక్షల ఎకరాల వరకు వివిధ పంటలు సాగు చేస్తారు. అందులో వరి తర్వాత పత్తిసాగు రెండో స్థానంలో ఉంటుంది. దీంతో వ్యాపారులు ఇక్కడ రైతులకు కాలం చెల్లిన విత్తనాలను అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీటీ–3 విత్తనాలను కూడా విక్రయిస్తున్నారు. ⇒ సంగారెడ్డి జిల్లాలో ఆద్య రకం పత్తి విత్తనాలకు అధిక డిమాండ్ ఉంది. రైతుల డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని విత్తన డీలర్లు అందిన కాడికి దండుకుంటున్నారు. ఈ విత్తన ప్యాకెట్‌ను రూ.1,800 వరకు విక్రయిస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుత వానాకాలం సీజన్లో సంగారెడ్డి జిల్లాలో 3.60 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని.. ఇందుకోసం 7.20 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమని అంచనా వేశారు. ఈ నెల 29వ తేదీ వరకు అందుబాటులోకి వచి్చన విత్తన ప్యాకెట్లు 3.76 లక్షలు మాత్రమే. తమకు అవసరమైన రకం లేకపోవడంతో రైతులు ఇతర విత్తనాలు కొనడం లేదు. ⇒ యాదాద్రి భువనగిరి జిల్లాలో చాలా చోట్ల బ్రాండెడ్ పత్తి విత్తనాలు బ్లాక్ మార్కెట్‌కు తరలాయి. వ్యాపారులు లైసెన్స్ లేకుండా లూజ్ విత్తనాలు అమ్ముతున్నారు. ఈ జిల్లాలో 1.35 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని.. 2.70 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు 1.45 లక్షల ప్యాకెట్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. అందులోనూ తమకు అవసరమైన రకాలు, కంపెనీల విత్తనాలను అందుబాటులోకి తేవాలని రైతులు కోరుతున్నారు. ⇒ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1.10లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని, 2.20 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమని అంచనా. కానీ ఇప్పటివరకు 1.20 లక్షల ప్యాకెట్లు మాత్రమే జిల్లాకు వచ్చాయి. ⇒ నల్లగొండ జిల్లాలో 5.40 లక్షల ఎకరాలకుపైగా పత్తి సాగవుతుందని అంచనా వేశారు. 15 లక్షలకుపైగా విత్తన ప్యాకెట్లు అవసరమంటూ వ్యాపారులు ఇండెంట్లు పెట్టారు. అందులో ఇప్పటివరకు 4 లక్షల ప్యాకెట్లు విత్తన దుకాణాల్లో అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. అందులో రైతులు కోరుకునే రకాలు, బ్రాండ్లు మాత్రం కనిపించడం లేదు. ⇒ ఖమ్మం జిల్లాలో 2 లక్షలకుపైగా ఎకరాల్లో పత్తి సాగుకు వ్యవసాయశాఖ ప్రణాళిక రూపొందించింది. 4.50 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమని అంచనా వేసింది. అయితే రైతులు కోరుకుంటున్న విత్తనాలు మాత్రం కనిపించడం లేదు. ఇక్కడి రైతులు యూఎస్ 7067 రకం విత్తనాలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ రకం విత్తనాలు గత ఏడాది మంచి దిగుబడులు ఇచ్చాయని అంటున్నారు. కానీ దుకాణాల్లో ఆ రకం విత్తనాలు దొరకడం లేదు. ⇒ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈసారి 5.67 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని వ్యవసాయాధికారుల అంచనా. ఇందుకోసం 11.34 లక్షలకుపైగా విత్తన ప్యాకెట్లు కావాలి. ఇప్పటివరకు డీలర్లు, వ్యాపారులకు చేరినది 8 లక్షల ప్యాకెట్లు మాత్రమే. చాలా చోట్ల రైతులకు అవసరమున్న రకాల విత్తనాలు అందుబాటులో ఉండటం లేదు. ఉన్నా ఒక్కో ప్యాకెట్‌ను రూ.864కు బదులుగా రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు విక్రయిస్తున్నారని రైతులు వాపోతున్నారు. యూఎస్ 7067 రకం లేవంటున్నారు యూఎస్ 7067 రకం పత్తి విత్తనాలు వేస్తే దిగుబడి బాగా వస్తుంది. ఈ కాయల నుంచి పత్తి తీయడం సులువు. గులాబీ రంగు పురుగు ఉధృతి ఉండదు. ఎకరాకు కనీసం 10 క్వింటాళ్లపైన దిగుబడి వస్తుంది. తక్కువ సమయంలో దిగుబడి వస్తుంది. దీన్ని తీసేశాక రెండో పంటగా మొక్కజొన్న వేసుకోవచ్చు. కానీ మార్కెట్లో ఈ రకం విత్తనాలు లేవంటున్నారు. – నునావత్ కిషోర్, రైతు, పీజీ తండా, దుగ్గొండి మండలం, వరంగల్ జిల్లా పోయినేడు దిగుబడి బాగా వచి్చంది.. మళ్లీ అదే వేస్తం నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. గత ఏడాది రాశి 659 రకం పత్తి విత్తనాలు సాగు చేస్తే.. ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి వచి్చంది. అందుకే ఆ రకం విత్తనాలు వచ్చే వరకు వేచి చూసిన. స్టేషన్‌ఘన్‌పూర్ ఎరువుల దుకాణంలో ఒక్కో ప్యాకెట్ రూ.864 చొప్పున 4 ప్యాకెట్లు కొన్నా. దిగుబడి ఎక్కువ రావడంతో పాటు చీడపీడల నుంచి తట్టుకునే శక్తి ఈ విత్తనాలకు ఉంది. – కత్తుల కొమురయ్య, రైతు, ఇప్పగూడెం, స్టేషన్‌ఘన్‌పూర్ మండలం, జనగాం జిల్లా -
ఆదిలాబాద్ జిల్లాలోని విత్తన గౌడౌన్లలో తనిఖీలు
-
అన్నదాత అడిగేదొకటి..మార్కెట్లో ఉన్నదొకటి..
సాక్షి, హైదరాబాద్: అధిక దిగుబడులు వచ్చే పత్తి విత్తనాల కోసం రైతులు కోరుతుంటే.. ఆ విత్తనాలు అందుబాటులో లేకుండా ఇతర కంపెనీల విత్తనాలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. తమకు కావాల్సిన విత్తనాల కోసం రైతులు రాష్ట్రంలో పలుచోట్ల భారీ క్యూలలో నిలబడాల్సి వస్తోంది. కొన్నిచోట్ల రాస్తారోకోలు సైతం చేస్తున్నారు. డిమాండ్ ఉన్న విత్తనాలను సరఫరాలో చేయడంలో వ్యవసాయ శాఖ అధికారులు చేతులెత్తేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు కోరుకునే పత్తి విత్తనాలకు కొరత ఏర్పడింది. డిమాండ్ ఉన్న విత్తనాలను కొందరు వ్యాపారులు బ్లాక్ చేస్తున్నారన్న విమర్శలున్నాయి. విత్తనాల కొరత లేదని చెబుతున్న అధికారులు... డిమాండ్ ఉన్న విత్తనాల కొరత విషయంలో పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. రైతులు పెద్దగా కొనుగోలు చేయని విత్తనాలకు సంబంధించి ఆయా కంపెనీల నుంచి కొందరు అధికారులు వాటిని మార్కెట్లో ప్రోత్సహిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. వాస్తవానికి ఏ రకం విత్తనాలకు డిమాండ్ ఉంటుందో వ్యవసాయశాఖకు తెలుసు.. కానీ వాటిని మార్కెట్లో ఎందుకు అందుబాటులో ఉంచలేదో అధికారులు చెప్పాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సీజన్ ముంచుకొస్తున్నా...రుతుపవనాలు త్వరలోనే రాష్ట్రాన్ని తాకనున్నాయి. చినుకు పడితే చాలు రైతులు తక్షణమే పత్తి విత్తనాలు చల్లేస్తారు. ఇప్పుడు రైతులకు అత్యంత కీలకమైనవి పత్తి విత్తనాలే. ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లనే ఈ ఇబ్బందులు వస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీజన్ ప్రారంభానికి ముందుగా అధికారులు ప్రణాళిక రచించలేదు. రాష్ట్రంలో ఈసారి 55 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేయగా, అందుకోసం 1.26 కోట్ల విత్తన ప్యాకెట్లు సిద్ధం చేయాలని భావించారు. గురువారం నాటికి 68.16 లక్షల ప్యాకెట్లు మాత్రమే అందుబాటులో ఉంచారు. అయితే, మిగతా ప్యాకెట్లు కూడా వచ్చే నెల 5 నాటికి జిల్లాలకు చేరతాయని, అందువల్ల కొరతే లేదని వ్యవసాయశాఖ చెబుతోంది. ఇతర కంపెనీల విత్తనాలనూ కొనుగోలు చేసుకోవాలని పిలుపునిస్తున్న అధికారులు.. దిగుబడికి గ్యారంటీ ఇవ్వగలరా అని రైతులు నిలదీస్తున్నారు. దిగుబడి తక్కువ వస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. నకిలీ విత్తనాల ప్రవాహం...ప్రభుత్వం అవసరమైన పత్తి విత్తనాలను అందుబాటులో ఉంచకపోవడంతో ఇదే అదనుగా భావించిన విత్తన దళారులు మూకుమ్మడిగా నకిలీ విత్తనాలను అన్నదాతకు అంటగడుతున్నారు. నిషేధిత హెటీ కాటన్ (బీజీ–3) విత్తనాలను గుజరాత్, మహారాష్ట్ర నుంచి తెలంగాణ జిల్లాలకు తరలించారు. ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినా నకిలీ విత్తనాల బెడద వేధిస్తూనే ఉంది. ఇదిలావుంటే, పచ్చిరొట్ట విత్తనాలను కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచలేదు. 1.38 లక్షల ఎకరాల విస్తీర్ణానికి సరిపోయే మొత్తం 1.41 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలైన డయాంచ, సన్‌హెంప్, పిల్లి పెసర విత్తనాలను అందుబాటులో ఉంచాలి. కానీ ఇప్పటివరకు కేవలం 79 వేల క్వింటాళ్లు మాత్రమే జిల్లాలకు చేరాయి. వ్యవసాయశాఖ లోని ఉన్నతాధికారుల మధ్య సమన్వయ లేమి ఈ సమస్యకు కారణమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఒక ఉన్నతాధికారి ఎరువుల దుకాణాలను రోజూ పరిశీలించాల ని వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో)ను ఆదేశిస్తుంటే... మరో ఉన్నతాధికారి మాత్రం అలా చేయొద్దని, తాను చెప్పినట్లుగా రైతుల వద్దకు వెళ్లి వారికి సలహాలు ఇవ్వాలని చెబుతున్నారు. ఒక ఏఈవోను ఇద్దరు ఉన్నతాధికారులు వేర్వేరుగా ఆదేశిస్తూ మరింత గందరగోళపరుస్తున్నారని వ్యవసాయ ఉద్యోగుల సంఘం నేత ఆరోపించారు. ఐదో తేదీ నాటికి మిగతా పత్తి విత్తనాలుమంత్రి తుమ్మల నాగేశ్వర్రావు రాష్ట్రంలో విత్తనాల కొరత లేదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చెప్పారు. ఈ మేరకు ఆయన విత్తన కంపెనీలతో సమీక్ష నిర్వహించారు. ఎక్కడైనా రైతులు ఎక్కువ సంఖ్యలో వచ్చినట్లైతే, కౌంటర్లు ఎక్కువ ఏర్పాటు చేయాలని, కలెక్టర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. రాష్ట్రంలో గతవారంలో కురిసిన వర్షాలకు రైతులు దుక్కులు చేసుకొని సిద్ధంగా ఉన్నారని, అందువల్ల విత్తన కంపెనీలన్నీ ప్రణాళిక ప్రకారం మిగతా పత్తి విత్తన ప్యాకెట్లను జూన్ 5 కల్లా జిల్లాలకు చేరవేయాలని చెప్పారు. కొన్ని జిల్లాల్లో.. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఒక కంపెనీ విత్తనాలనే రైతులందరూ కోరుతున్నారని, అన్ని విత్తనాల దిగుబడి ఒక్కటేనని ఆయన వివరించారు. రాష్ట్రంలో విత్తనాల కొరత లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి కూడా అన్నారు. -
విత్తనాలను బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తే పీడీయాక్ట్
సాక్షి, హైదరాబాద్: విత్తనాలను బ్లాక్ మార్కెట్‌కు తరలించి, కృత్రిమ కొరతను సృష్టించే వ్యాపారులపై పీడీ చట్టం కింద కేసులను నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో వానాకాలం పంటలకు విత్తనాల సరఫరా, జూన్ 2వ తేదీన జరిపే రాష్ట్ర అవతరణ ఉత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో ఆమె గురువారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జీఏడీ, వ్యవసాయ శాఖల కార్యదర్శి రఘునందన్‌రావు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సీఎస్ మాట్లాడుతూ వానాకాలానికి సంబంధించి గత సంవత్సరం కన్నా అధిక మొత్తంలో వివిధ రకాల పంట విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. విత్తనాల విషయంలో ఆందోళన చెందవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో అధిక డిమాండ్ ఉన్న పత్తి, సోయా, మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాలు సరిపడా ఉన్నాయని వివరించారు. వీటితోపాటు జీలుగ విత్తనాలు కూడా కావాల్సినంతగా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. విత్తన వ్యాపారుల గోదాములు, దుకాణాలను తనికీ చేయించాలని కలెక్టర్లను ఆదేశించారు. దీనితోపాటు, గోదాములు, విత్తన విక్రయ కేంద్రాలవద్ద పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలను నియమించాలని సూచించారు. రైతులతో సమావేశమై, సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వారిలో విశ్వాసం కల్పించాలన్నారు. ఇతర రాష్ట్రాలనుంచి రైతులు వచ్చి ఇక్కడి విత్తనాలు కొనుగోలు చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్లతో పతాకావిష్కరణతెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ రెండవ తేదీన జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో కలెక్టర్లు జాతీయ జెండాను ఆవిష్కరించాలని సీఎస్ శాంతికుమారి స్పష్టం చేశారు. రాష్ట్ర అవతరణ కోసం అమరులైన వారికి నివాళులు అర్పించిన అనంతరం కలెక్టర్లు జాతీయ పతాకావిష్కరణ చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులను, ఇతర ప్రముఖులను, జిల్లా అధికారులను ఆహ్వానించాలన్నారు. రాష్ట్ర స్థాయిలో పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమంలో అమర వీరులైన వారి కుటుంబ సభ్యులకు, ఉద్యమ కారులకు జిల్లా కలెక్టర్ల ద్వారా ఆహ్వానం పంపుతున్నట్లు తెలిపారు. -
బోరు చుట్టూ.. ఇంకుడుగుంత నిర్మించడం ఎలా?
చిరుధాన్యాలను రోజువారీ ఆహారంలో ఎంతో కొంతైనా భాగం చేసుకోవాలని భారతీయ వైద్యపరిశోధనా మండలికి అనుబంధంగా ఉన్న జాతీయ పోషకాహార సంస్థ ఇటీవల విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలలో భారతీయులకు స్పష్టమైన సూచన చేసింది. గత ఏడాది అంతర్జాతీయ చిరుధాన్యాల దినోతవ్సం జరుపుకున్న నేపథ్యంలో ఇప్పటికే చిరుధాన్యాలను అన్నంగానో, అంబలిగానో స్నాక్స్‌గానో తీసుకునే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. చిరుధాన్యాలకు గిట్టుబాటు ధర లభిస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లో చిరుధాన్యాల సాగుపై రైతులు మక్కువ చూపుతున్న ఈ నేపథ్యంలో చిరుధాన్యాల విత్తనాల సమాచారం పొందుపరుస్తున్నాం..హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో...జొన్న, సజ్జ, కొర్ర, అండుకొర్ర, సామ, ఊద విత్తనాలు హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్‌లోని భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్)లో రైతులకు అందుబాటులో ఉన్నాయి. రకాన్ని బట్టి కిలో విత్తనాల ధర రూ. 100 నుంచి 200 వరకు ఉంటుంది. రైతులు స్వయంగా వెళ్లి ఐఐఎంఆర్ కార్యాలయంలో కొనుక్కోవాలి. వివరాలకు.. 040–24599305 నంబరులో సంప్రదించవచ్చు.పాలెంలో...నాగర్‌కర్నూల్ జిల్లాపాలెంలోని ్ర΄ాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో అనేక ఇతర పంటల విత్తనాలతోపాటు చిరుధాన్యాల విత్తనాలు కూడా రైతులకు విక్రయిస్తున్నారు.పాలెం పచ్చజొన్న–1 (3 కేజీలు–రూ.450), తెలంగాణ తెల్ల జొన్న (3 కేజీలు–రూ.270), రాగి (3కేజీలు– రూ.150), సజ్జ (2 కేజీలు–రూ.200), కొర్ర (2 కేజీలు–రూ.130) విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. వివరాలకు మురళిని 94904 09163 నంబరులో సంప్రదించవచ్చు.ఆంధ్రప్రదేశ్‌లో...నంద్యాలలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో జొన్న, రాగి విత్తనాలు ఉన్నాయి. డాక్టర్ నర్సింహులును 79810 85507 నంబరులో సంప్రదించవచ్చు. అనంతపురంలోని వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో సజ్జ విత్తనాలు ఉన్నాయి. డాక్టర్ మాధవీలతను 79819 29538 నంబరులో సంప్రదించవచ్చు. పెరుమాళ్లపల్లె వ్యవసాయ పరిశోధనా స్థానంలో రాగి విత్తనాలు ఉన్నాయి. ఎం. శ్రీవల్లిని 93987 95089 నంబరులో సంప్రదించవచ్చు. విజయనగరం వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో రాగి విత్తనాలు ఉన్నాయి. డా. ఎన్. అనూరాధను 85002 04565 నంబరులో సంప్రదించవచ్చు. ఇదిలా ఉండగా, ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఈ ఖరీఫ్‌కు ఇతరత్రా పంట విత్తనాతోపాటు 721 క్వింటాళ్ల రాగి, 146 క్వింటాళ్ల కొర్ర, 6 క్వింటాళ్ల సామ, ఒక క్వింటా ఊద విత్తనాలను 26 జిల్లాల్లో రైతులకు సబ్సిడీపై పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.బోరు చుట్టూ ఇంకుడుగుంత నిర్మించడం ఎలా?ఈ ఏడాది అధిక వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో వాననీటి సంరక్షణకు ఉపక్రమిద్దాం. పొలాల్లో, గేటెడ్ కమ్యూనిటీల్లో, అపార్ట్మెంట్లు / ఇళ్ల దగ్గర ఉన్న బోర్ల చుట్టూతా ఇంకుడు గుంతలు తీయించుకుందాం.బోరు రీచార్జ్ గుంతను నిర్మించుకుంటే.. వర్షపు నీటిలో 40–50% వరకు భూమి లోపలికి ఇంకింపజేసుకోవచ్చని భూగర్భ జల నిపుణులు, సికింద్రాబాద్‌లోని వాటర్ అండ్ లైవ్వీహుడ్స్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.వి. రామమోహన్ (94401 94866) సూచిస్తున్నారు. మరింత సమాచారం కోసం, సంబంధిత వీడియో కోసం ఈ క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయండి.ఇవి చదవండి: Sagubadi: ఈ అతిపొడవైన సజ్జ పేరు.. 'సుల్కానియా బజ్రా'!