సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మిరప సాగు ఊపందుకుంటోంది. సీజన్ ప్రారంభంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోయినప్పటికీ.. గడచిన రెండు వారాలుగా కురుస్తున్న వర్షాలు మిరప రైతులకు ఊరట ఇస్తున్నాయి. ఫలితంగా లక్ష్యం దిశగా మిరప సాగు పయనిస్తోంది. మార్కెట్‌లో మంచి ధర పలుకుతుండటం.. పెరిగిన ప్రభుత్వ ప్రోత్సాహంతో రైతులు మిరప పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేసేందుకు సమాయత్తమయ్యారు.
రాష్ట్రంలో మిరప సాధారణ విస్తీర్ణం 4.87 లక్షల ఎకరాలు కాగా.. 50 శాతం వర్షాధారం కింద, మరో 50 శాతం బోర్ల కింద సాగవుతోంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత విత్తు నుంచి మార్కెటింగ్ వరకు తీసుకున్న చర్యల ఫలితంగా నాణ్యమైన దిగుబడులు పెరగడంతో మార్కెట్‌లో మంచి ధరలు లభిస్తున్నాయి. నాలుగేళ్లలో కనిష్ట ధర 3 రెట్లు పెరిగితే.. గరిష్ట ధర రెట్టింపు దాటింది. ఫలితంగా మిరప సాగు ఏటా విస్తరిస్తోంది.
2022–23లో 5.77 లక్షల ఎకరాల్లో మిర్చి సాగవగా.. 11.50 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. 2023–24 ఖరీఫ్ సీజన్‌లో 5.67 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్ధేశించగా.. ప్రస్తుతం రికార్డు స్థాయిలో పలుకుతున్న ధరల ఫలితంగా 6.50 లక్షల ఎకరాల్లో మిర్చి సాగవుతుందని అంచనా. దిగుబడులు సైతం 12 లక్షల టన్నులు దాటుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఆర్బీకేల ద్వారా అన్ని సేవలు
ఆర్బీకేల ద్వారా సర్టీఫై చేసిన నాణ్యమైన డిమాండ్ ఉన్న మిరప సీడ్ రైతులకు అందుబాటులో ఉంది. ఎరువులు, పురుగుల మందుల కొరత లేకుండా సీజన్ ముందు నుంచే ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. నల్లతామరతో పాటు ఇతర చీడపీడలు, తెగుళ్ల బారిన పడకుండా పంటను కాపాడటం, ఉత్తమ యాజమాన్య పద్ధతుల ద్వారా నాణ్యమైన దిగుబడులు సాధించడమే లక్ష్యంగా ఆర్బీకేల ద్వారా తోట బడులు నిర్వహిస్తూ రైతులకు శిక్షణ కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
రైతుకు ఊరటనిస్తోన్న వర్షాలు
మిరప రైతులు సాధారణంగా జూన్, జూలైలో నారు పోస్తారు. అక్టోబర్ వరకు నాట్లు వేస్తారు. సీజన్ ఆరంభంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు మిరప రైతులను ఒకింత కలవరపాటుకు గురి చేశాయి. బోర్ల కింద ఇబ్బంది లేనప్పటికీ వర్షాధారం కింద పండించే చోట్ల ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు. ఆగస్టు నెలాఖరు నుంచి కురుస్తున్న వర్షాలు మిరప రైతులకు ఊరటనిచ్చాయి.
కనీసం సాధారణ విస్తీర్ణంలోనైనా సాగవుతుందో లేదో అనే ఆందోళన చెందిన అధికారులు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఇదే రీతిలో కొనసాగితే నిర్ధేశించిన సాగు విస్తీర్ణం అధిగమించడం పెద్ద కష్టం కాదని చెబుతున్నారు. ప్రస్తుతం 3.50 లక్షల ఎకరాల్లో మిరప నాట్లు పడగా.. ఇదేరీతిలో వర్షాలు కురిస్తే సీజన్ ముగిసే నాటికి 5.50 లక్షల నుంచి 6 లక్షల ఎకరాలు దాటుతుందని చెబుతున్నారు. వర్షాలు కురవకపోతే 5 లక్షల నుంచి 5.50లక్షల ఎకరాలకు పరిమితమవుతుందని, దిగుబడులు మాత్రం 11 నుంచి 12 లక్షల టన్నుల మధ్య ఉంటుందని ఉద్యాన శాఖ అంచనా వేస్తోంది.
ప్రతికూల పరిస్థితుల్ని ఎదురొడ్డి..
ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో ప్రతికూల పరిస్థితులను ఎదురొడ్డి మరీ మిరప రైతులు సాగు చేస్తున్నారు. ఆగస్టులో వర్షాభావ పరిస్థితులను చూస్తే ఈసారి సాధారణ విస్తీర్ణం కూడా దాటలేం అనుకున్నాం. కానీ.. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు మిరప సాగు విస్తీర్ణం పెరిగేందుకు దోహదపడేటట్టు ఉన్నాయి. అక్టోబర్ నెలాఖరు వరకు ఇదే రీతిలో వర్షాలు కురిస్తే విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉంది. – ఎస్‌ఎస్.శ్రీధర్, కమిషనర్, ఉద్యాన శాఖ
Comments
Please login to add a commentAdd a comment