సామాజిక మాధ్యమాలతో యుక్తవయసు వారికి పెనుముప్పు
సాధారణంగా సోషల్ మీడియా అకౌంట్‌కు అర్హత వయసు 13 ఏళ్లు
కానీ 8 ఏళ్ల వారికీ తప్పుడు సమాచారంతో ఖాతాలు
యుక్త వయసు వచ్చేసరికి మానసిక, శారీరక రుగ్మతలు
పిల్లల ఖాతాలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోతే అనర్థాలు
భద్రత ప్రమాణాలపై సోషల్ మీడియా సంస్థల కసరత్తు
నిర్దేశిత వయసులోపు వారి ఖాతాలకు ఎవరి ప్రమేయం లేకుండానే తాళాలు
మరిన్ని భద్రత చర్యలను ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తున్న సంస్థలు
సామాజిక మాధ్యమంలో అకౌంట్ లేదని ఎవరైనా చెబితే వెంటనే.. ‘ఇంకా ఏ కాలంలో ఉన్నారండీ.. నాకైతే రెండు మూడు ఖాతాలున్నాయి. ఒక్కో దాంట్లో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు’ అంటూ గొప్పలు చెప్పుకునే వారు కోకొల్లలు. సోషల్ మీడియాను కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్త పరిచయాల వరకూ పరిమితమైతేనో, వ్యాపార అవసరాలకు వినియోగించుకుంటేనో పర్లేదు. కానీ.. అదుపు తప్పి అనర్థాలు తెచ్చుకుంటున్న ఘటనలు ఇటీవల అనేకం వెలుగు చూస్తున్నాయి. ఎంతోమంది జీవితాలు కేవలం సోషల్ మీడియా ప్రభావం వల్ల నాశనమవుతున్నాయి.
పిల్లలు, యుక్తవయసు వారు (టీనేజర్లు) సోషల్ మీడియాకు బానిసలుగా మారుతుండటం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. దీంతో పలు దేశాలు కొన్ని వయసుల వారు సామాజిక మాధ్యమాన్ని వినియోగించడంపై ఆంక్షలు పెడుతున్నాయి. మరోవైపు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అయిన ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సప్, యూట్యూబ్ వంటి సంస్థలు తమ ఖాతాదారుల వ్యక్తిగత సమాచార భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయి. – సాక్షి, అమరావతి
ఖాతా కోసం వయసు ఎక్కువని అబద్ధాలు
పిల్లలు, టీనేజర్స్, పెద్దలు అనే తేడా లేకుండా రోజుకి సగటున మూడు గంటల కంటే ఎక్కువ సమయం సోషల్ మీడియాలోనే గడుపుతున్నారని, దీనివల్ల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని అనేక పరిశోధనలు తేల్చాయి. సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఆ యూజర్‌కు 13 ఏళ్ల వయసు ఉండాలి. తప్పుడు సమాచారంతో ఈ–మెయిల్ ఐడీలు తయారు చేసుకుని, 8 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు కూడా ఖాతాలు తెరుస్తున్నారు.
8 నుంచి 17 సంవత్సరాల వయసు వారిలో 22% మంది సోషల్ మీడియా యాప్‌లలో తమకు 18 లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నట్టు అబద్ధం చెబుతున్నారని అమెరికా సంస్థ ‘ఆఫ్‌కామ్’ అధ్యయనంలో తేలింది. 15 నుంచి 18 ఏళ్ల వయసులో శారీరక, మానసిక మార్పులు జరుగుతాయి. అటువంటి సమయంలో సోషల్ మీడియాకు అలవాటు పడితే వారి ఆలోచనల్లోనూ మార్పులు వస్తాయని, రకరకాల వింత, వికృత ప్రవర్తనలను నేర్చుకుంటారని వైద్యులు చెబుతున్నారు. రానున్న 2025 సంవత్సరంలో ‘ఆన్‌లైన్ భద్రతలో నిజమైన మార్పు’ రావాలని టెక్ నిపుణులు సోషల్ మీడియా సంస్థలను కోరుతున్నారు.
వారి ఖాతాలకు ఆటోమేటిక్ ప్రైవసీ
సోషల్ మీడియా వేదికల్ని నిర్వహిస్తున్న సంస్థలు ఇటీవల ఖాతాదారుల భద్రతపై దృష్టి సారించాయి. అనేక సాంకేతికతలను అభివృద్ధి చేశాయి. యువతకు సోషల్ మీడియాను సురక్షితమైనదిగా ఉంచడానికి ఇన్‌స్ర్ట్రాగామ్ ‘టీన్ అకౌంట్’లను తీసుకువచి్చంది. అలాగే రోజూ వేల సంఖ్యలో వయసు తప్పుగా నమోదు చేసిన వారి ఖాతాలను కొన్ని సంస్థలు తొలగిస్తున్నాయి. అలాగే టీనేజర్ల ఖాతాలకు ఆటోమేటిక్‌గా లాక్ (ప్రైవసీ) వేసేస్తున్నాయి.
అంటే వారి ఖాతాను వారు అనుమతించిన స్నేహితులు మాత్రమే చూడగలరు. ఇతరులకు వారి వివరాలు కనిపించవు. మెషిన్ లెరి్నంగ్ టెక్నాలజీ ఇందుకు సహకరిస్తోంది. ఆన్‌లైన్ సేఫ్టీ యాక్ట్‌ను పటిష్టం చేయాలని ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో ఆస్ట్రేలియా ఓ అడుగు ముందుకు వేసి, 16 ఏళ్లలోపు వారు సామాజిక మాధ్యమాలను వినియోగించడాన్ని నిషేధించింది.
మార్చాల్సింది తల్లిదండ్రులే
సోషల్ మీడియాలో సన్నిహితులతో, అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటారు. అది సైబర్ కేటుగాళ్లు దొంగిలించి, వాటిద్వారా బెదిరిస్తూ.. డబ్బులు గుంజుతారు. వారి వేధింపులు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నట్టు నివేదికలు వెల్లడించాయి. అందుకే పదేళ్లు నుంచి 20 ఏళ్లలోపు వయసు పిల్లలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపేలా చేయాలి. ఇంటి పనుల్లోనూ భాగం చేయాలి. తల్లిందండ్రులు పిల్లలతో ముచ్చటిస్తుండాలి. ప్రతి చిన్న ఘటనను ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మాన్పించాలి. చదువుపై దృష్టి కేంద్రీకరించేలా అలవాటు చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment