డిగ్రీ, పీజీలో ఏటా రెండుసార్లు ప్రవేశాలకు ప్రతిపాదన
రెండున్నరేళ్ల వ్యవధిలోనే బ్యాచిలర్ డిగ్రీ
స్కిల్ కోర్సులు అందించేలా మార్గదర్శకాలు
అకడమిక్ నేపథ్యం ఏదైనా.. నచ్చిన కోర్సులో చేరే అవకాశం
సాక్షి, ఎడ్యుకేషన్: ఉన్నత విద్యలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రతిపాదించిన సంస్కరణలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డిగ్రీ, పీజీలో ప్రవేశాలు మొదలు.. కోర్సుల వ్యవధి వరకు యూజీసీ సిఫార్సులు ఆచరణలోకి వస్తే ఉన్నత విద్యా రంగంలో కీలక మార్పులు చోటుచేసుకొంటాయి. అయితే ఈ సిఫార్సులపై నిపుణులు భిన్నంగా స్పందిస్తున్నారు. మన దేశ పరిస్థితులకు అనుగుణంగా ఈ మార్పులు సత్ఫలితాల నివ్వడానికి కనీసం పదేళ్ల సమయం పడుతుందని అంటు న్నారు. ఉన్నత విద్యలో సంస్కరణల కోసం ‘మినిమమ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ ఫర్ ద గ్రాంట్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ రెగ్యులేషన్స్–2024’ పేరుతో యూజీసీ ఈ నెల ఐదో తేదీన ముసాయిదాను విడుదల చేసింది. దీనిని అన్ని రాష్ట్రాలకు పంపి, ఈ నెల 23వ తేదీలోగా అభిప్రాయాలు తెలపాలని లేఖలు రాసింది. యూజీసీ సిఫార్సులపై అధ్యయనం చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్యామండలిని ఆదేశించింది.
ఏటా రెండు సార్లు ప్రవేశం..
యూజీసీ సిఫార్సుల్లో ముఖ్యమైనది.. బ్యాచిలర్, పీజీ స్థాయిలో ఏటా రెండు సార్లు (జూలై / ఆగస్ట్, జన వరి/ఫిబ్రవరి) ప్రవేశ ప్రక్రియ నిర్వహించటం. ఇది విద్యా ర్థులకు కొంత మేలు చేసే అంశమేనని విద్యావేత్తలు అంటున్నారు. వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత పొందని.. సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి ఉన్నత విద్య అభ్యసించే విషయంలో సమయం వృథా కాకుండా ఈ ప్రతిపాదన మేలు చేస్తుందని చెబుతున్నారు. అయితే..ఈ ప్రతిపాదన అమలుచేయాలంటే ఫ్యాకల్టీ, ఇతర బోధన సదుపాయా లను రెట్టింపు చేయాల్సి ఉంటుందని అంటున్నారు. ఇప్ప టికిప్పుడు అది సాధ్యం కాకపోవచ్చని పేర్కొంటున్నారు.
హెచ్‌ఈసీతో బీటెక్ చదవగలరా?
యూజీసీ మరో సిఫార్సు.. అకడమిక్ నేపథ్యం ఏదైనా.. విద్యార్థులు ఉన్నత విద్యలో తమకు నచ్చిన కోర్సులో చేరే అవకాశం కల్పించడం. ఉదాహరణకు.. ఇంటర్మీడియెట్‌లో హెచ్‌ఈసీ చదివిన విద్యార్థి.. బీటెక్ ప్రవేశాలకు నిర్వహించే ఎంట్రన్స్‌లలో (జేఈఈ, ఈఏపీసెట్ తదితర) ఉత్తీర్ణత సాధించి బీటెక్‌లో చేరొచ్చు. దీనిపై వ్యతిరేక అభిప్రాయా లు వ్యక్తమవుతున్నాయి. ఆర్ట్స్, హ్యుమానిటీస్ విద్యా ర్థులు.. గణితం, సైన్స్, ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌ల సమ్మేళనంగా ఉండే బీటెక్‌లో రాణించడం సాధ్యం కాదని అంటున్నారు.
బహుళ ప్రవేశ, నిష్క్రమణ అవకాశం
యూజీసీ ప్రతిపాదనల్లో మరో కీలకమైన అంశం బహుళ ప్రవేశ, నిష్క్రమణ (మల్టిపుల్ ఎంట్రీ, ఎగ్జిట్) విధానం. బ్యాచిలర్, పీజీ ప్రోగ్రామ్‌లలో చేరిన విద్యార్థులు తమకు నచ్చిన సమయంలో కోర్సు నుంచి వైదొలగే అవకాశం, ఆ తర్వాత మళ్లీ అదే కోర్సులో.. తదుపరి తరగతిలో ప్రవేశం పొందే అవకాశం కల్పించటం ఈ ప్రతిపాదన ముఖ్య ఉద్దేశం. కానీ.. ఇలాంటి విధానం ఫలితంగా విద్యార్థుల్లో ఉన్నత విద్య స్ఫూర్తి కొరవడే ప్రమాదం ఉందని, ఇది జాబ్ మార్కెట్‌పై ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు.
స్కిల్ కోర్సులు, అప్రెంటిస్‌షిప్స్
ఉన్నత విద్యలో స్కిల్ కోర్సులను, అప్రెంటిస్షిప్స్ను సమీకృతం చేసేలా మరో ప్రతిపాదన చేశారు. బ్యాచిలర్ డిగ్రీలో మొత్తం క్రెడిట్స్‌లో 50 శాతం పూర్తి చేసుకున్న వారు.. మరో 50 శాతం క్రెడిట్స్ కోసం స్కిల్ కోర్సులను, అప్రెంటిస్‌షిప్‌ను, మల్టీ డిసిప్లినరీ సబ్జెక్ట్‌లను ఎంచుకోవచ్చని పేర్కొన్నారు. అయితే స్కిల్ కోర్సులను అందించే క్రమంలో.. రాష్ట్రాల స్థాయిలో యూనివర్సిటీలకు మౌలిక సదుపాయాల కొరత సమస్యగా మారుతుందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు.
ఒకే సమయంలో రెండు డిగ్రీలు
అకడమిక్ ఫ్లెక్సిబిలిటీ విధానంలో ఒకే సమయంలో రెండు డిగ్రీ ప్రోగ్రామ్స్‌ను అభ్యసించే విధానాన్ని కూడా యూజీసీ ప్రతిపాదించింది. విద్యార్థులు తాము చేరిన కోర్సు/విద్యా సంస్థతోపాటు మరో ఇన్స్టిట్యూట్లో లేదా మరో అభ్యసన విధానంలో అర్హత మేరకు మరేదైనా బ్యాచిలర్ లేదా పీజీ డిగ్రీలో చేరొచ్చు. అయితే ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం మన విద్యా వ్యవస్థకు సరితూగేలా లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రెండున్నరేళ్లకే బ్యాచిలర్ డిగ్రీ
రెండున్నరేళ్లకే డిగ్రీ పూర్తి చేసుకునేలా యూజీసీ ప్రతి పాదన చేసింది. యాక్సెలెరేటెడ్ డిగ్రీ ప్రోగామ్ పేరుతో ప్రతి విద్యా సంస్థలోని మొత్తం విద్యార్థుల్లో పది శాతం మందికి ఈ అవకాశం కల్పించాలని సూచించింది. నాలుగేళ్ల డిగ్రీ ప్రోగామ్స్ విషయంలో మూడేళ్లలో వాటిని పూర్తి చేసుకునే అవకాశం కల్పించాలి. కానీ యాక్సలెరేటెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ విధానంలో.. టీచింగ్–లర్నింగ్ కోణంలో సమస్య ఉత్పన్నమవుతుందని, విద్యార్థులు ఒత్తిడికి గుర వుతారని నిపుణులు అంటున్నారు. బ్యాచిలర్ డిగ్రీని రెండున్నరేళ్లలో పూర్తి చేసుకునే అవకాశం కల్పించిన యూ జీసీ.. పీజీ విషయంలో మాత్రం మూడేళ్లు లేదా నాలుగేళ్ల డిగ్రీ పూర్తి చేసుకున్న వారినే అర్హులుగా నిర్దేశించాలని సూచించింది. దీంతో.. రెండున్నరేళ్లకు లేదా మూడేళ్లకే బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసుకున్న వారికి పీజీ ప్రవేశాల అర్హతపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
తక్షణ అమలు సాధ్యం కాదు..
యూజీసీ ప్రతిపాదనలు, సిఫార్సులను తక్షణం అమలు చేసే పరిస్థితి ప్రస్తుతం మన దేశంలో లేదు. ఇవి పూర్తి స్థాయిలో అమలు కావాలంటే అయిదు నుంచి పదేళ్ల సమయం పట్టొచ్చు. ముఖ్యంగా ప్రభు త్వ విద్యా సంస్థలు ఈ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటాయి. ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీల్లో కొంత మేర వీటిని వెంటనే అమలు చేసే వీలుంది. – ప్రొఫెసర్. డి.ఎన్. రెడ్డి, యూజీసీ మాజీ సభ్యుడు, జేఎన్‌టీయూ మాజీ వీసీ
ఆహ్వానించదగ్గ పరిణామం
యూజీసీ తాజా సిఫార్సులను ఆహ్వానించదగ్గ పరిణామంగా చెప్పొచ్చు. విద్యార్థులు ఫ్లెక్సిబుల్ లర్నింగ్ విషయంలో అదనపు కసరత్తు చేయాల్సి ఉంటుంది. కొంత మానసిక ఒత్తిడిని కూడా తట్టుకునే సామర్థ్యం ఉండాలి. ఇందుకోసం అవసరమైన వనరులను ఉన్నత విద్యా సంస్థలు కల్పించాలి. – ప్రొఫెసర్. వి.ఎస్.రావు, ప్రొ వైస్ ఛాన్స్‌లర్ అడ్వయిజర్, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ
దశల వారీగా అమలు చేయాలి
గ్లోబలైజేషన్ నేపథ్యంలో ఈ సంస్కరణలు అవస రమే.. కానీ అమలు విషయంలో ఫ్యాకల్టీ కొరత సమస్యగా మారుతోంది. ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ కోణంలో పలు చర్యలు తీసుకుంటున్నాం. ఆర్ట్స్, హ్యుమానిటీస్ విద్యార్థులు ఫ్లెక్సిబుల్ లర్నింగ్ విధానంలో బీటెక్, సైన్స్ కోర్సుల్లో రాణించడం కష్టంగానే ఉంటుంది. – ప్రొఫెసర్. వి. బాలకిష్టారెడ్డి, చైర్మన్, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి
Comments
Please login to add a commentAdd a comment