ప్రముఖుల రోడ్ షోలో ప్రజలు, నాయకుల భద్రతకు పటిష్ట చర్యలు
ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా విద్యుత్ సరఫరా నిలిపివేత
సహజంగా జరిగేదానిపై రామోజీ వంకర రాత
ఈనాడు రోత రాతలపై మండిపడ్డ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు
సాక్షి, అమరావతి: ఉరుములు, మెరుపులు వస్తున్నప్పుడు, వేగంగా తుపాను గాలులు వీస్తున్నప్పుడు, అల్పపీడనం కారణంగా జోరుగా వాన కురుస్తున్నప్పుడు మాత్రమే కాదు రోడ్డు మీద భారీ లోడ్‌తో ఉన్న వాహనం వెళుతున్నప్పుడు కూడా ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తుంటారు. లక్షలాది జనం ఒకే రహదారి వెంట బారులుతీరినప్పుడు, తమ నాయకుడిని చూడాలని వేలాది మంది భవనాలపై నిలబడినప్పుడు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, కరెంటు తీగలు తగిలే అవకాశాలు చాలా ఎక్కువ. ఇలాంటి సమయాల్లో అనుకోనిది ఏదైనా జరిగి తీగలు తెగి జనం మీద పడినా, ట్రాన్స్‌ఫార్మర్ తగిలి షాక్‌కు గురైనా అమాయకుల ప్రాణాలు క్షణాల్లో పోతాయి.
అలాంటి ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ప్రముఖుల పర్యటనలు, బహిరంగ సభలు, రోడ్ షోలు జరుగుతున్న ప్రదేశాల్లో అధికారులు విద్యుత్ సరఫరాను కాసేపు నిలిపివేస్తుంటారు. ఇది అందరి భద్రతను దృష్టిలో ఉంచుకుని చేస్తున్న చర్య మాత్రమే. దీనిని కూడా రాజకీయం చేయాలని చూశారు ఈనాడు రామోజీ. ‘జగన్ వస్తే కరెంట్ వైర్లకు కత్తిరింపే’ అంటూ ఈనాడులో వంకర రాతలు రాశారు. ప్రజల ప్రాణాలు పోతే మా కెందుకు మా అజెండా మాదే అన్నట్లు రాసిన ఆ తప్పుడు కథనాన్ని విద్యుత్ సంస్థలు తీవ్రంగా ఖండించాయి.
‘మేమంతా సిద్ధం’ పేరుతో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న బస్సు యాత్రకు ప్రజల నుంచి వస్తున్న విశేష ఆదరణను చూసి మరోమారు అక్కసు వెళ్లగక్కారు. ఈ అసత్య రాతలపై ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీసీపీడీసీఎల్) సీఎండీ కె.సంతోషరావు తీవ్రంగా మండిపడ్డారు. ప్రముఖుల రోడ్ షో సందర్భంగా భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం సహజంగా జరిగేదేనని ఆయన వివరించారు. అంతేకాకుండా ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో జన సందోహం ఎక్కువై విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని, ఆ ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
ఏ రాజకీయ పార్టీ ప్రముఖుల పర్యటన జరిగినా ఇదే పద్ధతిని అవలంభిస్తున్నామని స్పష్టం చేశారు. నిజానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి వారి పర్యటనల సమయంలోనూ ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తుంటారు. అప్పుడు మాత్రం ప్రభుత్వం కావాలనే, వారి పర్యటనకు ఆటంకం కలిగించడం కోసమే విద్యుత్ సరఫరా నిలిపివేసిందంటూ ఇదే ఈనాడు కథనాలు రాస్తోంది. ఇటీవల పవన్ పర్యటనలో ఫ్లెక్సీ కడుతూ విద్యుత్ షాక్‌కు గురై ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. అలాంటి దుర్ఘటనలు జరగకూడదనే విద్యుత్ శాఖ అధికారులు కరెంటు నిలిపివేస్తుంటే దానిపైనా పడి ఏడ్వడం రామోజీకే చెల్లింది.
Comments
Please login to add a commentAdd a comment