సాక్షి, అమరావతి: ప్రకృతి వైపరీత్యాల వేళ పంట నష్టపరిహారంతో సీఎం వైఎస్ జగన్ సర్కారు రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుంటే ఈనాడు పత్రిక మాత్రం బురద జల్లడమే పనిగా పెట్టుకుంది. కరువుతోపాటు మిచాంగ్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు సీజన్ ముగియకుండానే ఇన్‌పుట్ సబ్సిడీ(పంట నష్టపరిహారం) జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒకపక్క ఏర్పాట్లు చేస్తుంటే.. ఈనాడు మాత్రం ‘సంక్రాంతి పోయింది..సెట్టింగులూ తీసేశారు..!’అంటూ వ్యంగ్యంగా రైతులను తప్పుదోవ పట్టించేలా తన ఆక్రోశాన్ని వెళ్లగక్కుతూ విషం కక్కింది.
ఆరోపణ: ఖరీఫ్‌లో 31 లక్షల ఎకరాల్లో తగ్గిన సాగు
వాస్తవం: దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులు ఖరీఫ్‌తో పాటు ప్రస్తుత రబీ సీజన్‌లోను కొనసాగుతున్నాయి. ఖరీఫ్‌లో సాధారణ సాగు విస్తీర్ణం 84.94 లక్షల ఎకరాలు కాగా 63.46లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. వర్షాభావ పరిస్థితుల వలన 21.48 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. పూర్తి స్థాయి గణాంకాలతో ఎన్నిసార్లు అధికారులు వివరణ ఇచ్చినా... ఈనాడు మాత్రం పదేపదే 31 లక్షల ఎకరాల్లో పంటలు సాగవలేదంటూ అబద్ధాలు అచ్చేస్తూనే ఉంది. 6 ప్రామాణికాలు (వర్షపాతం, పంట విత్తిన విస్తీర్ణం, ఉపగ్రహ ఆధారిత పంటల పరిస్థితి, జలప్రవాహం, భూగర్భజలాలు, జలాశయాల స్థాయిలు) ఆధారంగా ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 7 జిల్లాల్లో 103 కరువు మండలాలుగా గుర్తించారు.
బెట్ట పరిస్థితుల వల్ల 14.07 లక్షల ఎకరాలలో 33 శాతం కన్నా ఎక్కువ శాతం పంట నష్టపోయిన 6.96 లక్షల మంది రైతులకు రూ.847.27 కోట్ల పెట్టుబడి రాయితీ చెల్లించాలని లెక్కతేల్చారు. రబీ సీజన్‌కు సంబంధించి రాష్ట్రంలో సాధారణ విస్తీర్ణం 55.28 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటికే 39.15 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. వరి సాధారణ విస్తీర్ణం 19.53 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటికే 12.62 లక్షల ఎకరాల్లో సాగైంది. రబీలో 35 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయని, వరి 11.40 లక్షల ఎకరాలలో మాత్రమే
సాగైందంటూ ఈనాడు అబద్ధాలు అచ్చేసింది.
ఆరోపణ: మిచాంగ్ వల్ల 20 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం
వాస్తవం: రబీ సీజన్ ప్రారంభంలో విరుచుకుపడిన మిచాంగ్ తుఫాన్ వల్ల 22 జిల్లాల్లో 6.56 లక్షల ఎకరాల్లో 33 శాతం కన్నా ఎక్కువ శాతం పంట నష్టపోయిన 4.61 లక్షల రైతులకు రూ.442.35 కోట్లు పెట్టుబడి రాయితీ చెల్లించాలని లెక్క తేల్చారు. ఈ విషయం ఎన్నిసార్లు చెప్పినా ఈనాడు పట్టించుకోకుండా తుఫాన్ వల్ల 20 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు అడ్డగోలుగా అబద్ధాలు అచ్చేస్తూనే ఉంది. గత 57 నెలలుగా వైపరీత్యాలు సంభవించిన ప్రతీసారి ఆ సీజన్ చివరలో పరిహారం ఇస్తున్నారు. ఇలా ఇంతవరకు 22.85 లక్షల మంది రైతులకు రూ.1,976.44 కోట్ల పెట్టుబడి రాయితీని అందించింది.
ఆరోపణ: ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపు గాలికొదిలేశారు
వాస్తవం: ఖరీఫ్‌లో కరువు, రబీలో మిచాంగ్ తుఫాన్ వల్ల 20.63 లక్షల ఎకరాలలో పంటలు నష్టపోయిన 11.57 లక్షల మంది రైతులకు అంచనా వేసిన రూ.1,289.38 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని సీజన్ చివర్లో నేరుగా రైతుల ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల్లో కూడా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈ నెలాఖరులోనే ఇన్‌పుట్ సబ్సిడీ పరిహారం చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. అయినా సరే ఇవేమీ ఈనాడుకు పట్టదు. ఎందుకంటే ఎన్నికల సమయంలో ప్రభుత్వంపై బురద జల్లుతూ రైతులను గందరగోళ పరిచేలా విషంకక్కడమే పనిగా పెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment