సీసీఆర్సీల కోసం సిబ్బందిపై టీడీపీ నేతల ఒత్తిళ్లు
పెట్టుబడి సాయంతో పాటు సంక్షేమ ఫలాలపై కన్ను
రికార్డు స్థాయిలో కార్డులు జారీ.. మూడో వంతు బోగస్సే
సాక్షి, అమరావతి: గత ఐదేళ్లూ సజావుగా సాగిన పంటహక్కు సాగుదారు పత్రాల (సీసీఆర్సీ) జారీ ప్రక్రియలో ఈ ఏడాది పెద్ద ఎత్తున అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున ఇస్తామన్న పెట్టుబడి సాయంతో పాటు ఇతర సంక్షేమ పథకాల లబ్ధిని కాజేయడమే లక్ష్యంగా కౌలు కార్డులను అధికార టీడీపీ నేతలు కాజేస్తున్నారు. కనీసం సెంటు భూమి కూడా లేని వారితోపాటు సాగుకు దూరంగా ఉండే టీడీపీ కార్యకర్తలు సైతం సీసీఆర్సీ కార్డులు పొందుతున్నారు.
భూ యజమాని అంగీకారం అనే నిబంధన వల్ల మెజార్టీ కౌలు రైతులు నష్టపోతున్నారనే సాకుతో సీసీఆర్సీ చట్టం స్థానంలో కౌలురైతు చట్టం–2024 తెస్తున్నట్లు కూటమి సర్కారు ప్రకటించింది. అయితే కొత్త చట్టం ముసాయిదా ఇంకా సిద్ధం కానందున పాత చట్టం ప్రకారమే నిర్దేశించిన లక్ష్యం మేరకు సీసీఆర్సీలు జారీ చేయాలి. గత సర్కారు ఏటా సగటున 5.19 లక్షల చొప్పున ఐదేళ్లలో 25.93 లక్షల మందికి సీసీ ఆర్సీలు జారీ చేసింది.
2023–24లో రికార్డు స్థాయిలో 8.35 లక్షల మందికి సీసీఆర్సీలు జారీ అయ్యాయి. 2024–25 సీజన్‌లో కనీసం 10 లక్షల మందికి సీసీ ఆర్సీలు జారీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అందుకు అనుగుణంగా మే 15వతేదీ నుంచే సీసీఆర్సీ మేళాలు నిర్వహించేందుకు సిద్ధం కాగా ఎన్నికల కోడ్ సాకుతో విపక్షాలు అడ్డుకోవడంతో సీసీఆర్సీ కార్డుల జారీ నిలిచిపోయింది. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత జూన్ నెలాఖరులో సీసీఆర్సీల జారీ ప్రక్రియ చేపట్టింది. అయితే కేవలం 40 రోజుల్లో 8.50 లక్షల మందికి సీసీఆర్సీలు జారీ కావడం సందేహాలకు తావిస్తోంది.
టీడీపీ నేతల బెదిరింపులు
ఇది మా ప్రభుత్వం.. భూ యజమాని అంగీకారంతో పనిలేదు.. మేము చెప్పిన వారికే కౌలు కార్డులు ఇవ్వాలంటూ టీడీపీ నేతలు పలు చోట్ల క్షేత్ర స్థాయి సిబ్బందిపై ఒత్తిళ్లకు దిగుతున్నారు. వాస్తవానికి కౌలుకిచ్చిన సాగుదారుడికే కౌలు కార్డు ఇచ్చేందుకు భూ యజమాని అంగీకారపత్రం ఇవ్వాలి. అలాంటిది భూయజమాని తాను కౌలుకిచ్చిన భూమినే భాగాలుగా విభజించి తమ కుటుంబ సభ్యుల పేరిట, తమకు నచ్చిన వారి పేరిట అంగీకార పత్రాలిస్తూ బోగస్ సీసీఆర్సీలు పొందుతున్నట్టు గుర్తించారు. మరికొన్ని చోట్ల భూ యజమానితో సంబంధం లేకుండా రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి దొడ్డిదారిన కౌలుకార్డులు పొందుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇదే అదనుగా కార్డుకు రూ.500 నుంచి రూ.2వేల వరకూ వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు.
పెట్టుబడి సాయం కాజేసేందుకే..
రూ.20 వేల పెట్టుబడి సాయంతో పాటు ఇతర సంక్షేమ ఫలాలు పొందేందుకు ఈ కార్డే ప్రామాణికం కావడంతో టీడీపీ నేతలు తమ కుటుంబ సభ్యులు, కార్యకర్తల పేరిట సీసీఆర్సీలు పొందుతున్నారు. దీనివల్లే పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున కార్డులు జారీ అయినట్లు గుర్తించారు. ఇప్పటి వరకు జారీ చేసిన కార్డుల్లో మూడో వంతు బోగస్ కావచ్చని భావిస్తున్నారు.
విచారిస్తున్నాం..
సీసీఆర్సీల జారీలో అవకతవకలు చోటు చేసుకుంటున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. రెవెన్యూ శాఖ పర్యవేక్షణలో భూమి ఖాతా ఆధారంగా సీసీఆర్సీలు జారీ చేస్తారు. కొన్ని చోట్ల ఒకే కుటుంబంలో సభ్యులు ఒకే భూమిపై వేర్వేరుగా సీసీఆర్సీ కార్డులు పొందుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఆరోపణలపై సీఎంఆర్‌వో పీడీని వివరణ కోరాం. నివేదిక రాగానే తగిన చర్యలు తీసుకుంటాం.
– ఎస్.ఢిల్లీరావు, డైరెక్టర్, వ్యవసాయ శాఖ
Comments
Please login to add a commentAdd a comment