
వైఎస్సార్‌సీపీ నేతలపై నమోదైన 4 కేసుల్లో వాదించినందుకు పెద్ద మొత్తంలో ఫీజు
రూ.2.86 కోట్లు చెల్లించిన చంద్రబాబు ప్రభుత్వం
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో రూ.1.25 కోట్లు
చంద్రబాబు ఇంటి వద్ద ఘర్షణ కేసులో రూ.60 లక్షలు
రఘురామకృష్ణరాజు కేసులో రూ.65 లక్షలు
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో రూ.10 లక్షలు
వీటికి అదనంగా లూథ్రా క్లర్కుకు రూ.26 లక్షలు చెల్లింపు
సాక్షి, అమరావతి : టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు తమ ఆస్థాన న్యాయవాది సిద్దార్థ లూథ్రాకు పెద్ద మొత్తంలో ఫీజుల సంతర్పణ చేశారు. వ్యక్తిగతంగా, పార్టీపరంగా కష్ట కాలంలో తనకు అండగా నిలిచినందుకు సొంత సొమ్ము కాకుండా.. ప్రజల సొమ్మును గురుదక్షిణగా చెల్లించారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై నమోదు చేసిన నాలుగు వేర్వేరు కేసుల్లో వాదనలు వినిపించినందుకు ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2.86 కోట్లను ఫీజు రూపంలో చెల్లించింది.
ఇందులో టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులోనే ఆయనకు ఏకంగా రూ.1.25 కోట్లు చెల్లించింది. ఇందులో ఒక్క రోజు హాజరై వాదనలు వినిపించినందుకు రూ.75 లక్షలు చెల్లించారు. ఇదే కేసులో పలు తేదీల్లో హాజరై వాదనలు వినిపించినందుకు మరో రూ.50 లక్షలను ఫీజుల రూపంలో లూథ్రాకు చెల్లించారు. అలాగే తాడేపల్లి, కరకట్ట వద్ద ఉన్న చంద్రబాబు నివాసం వద్ద జరిగిన ఘర్షణకు సంబంధించి నమోదైన కేసులో వాదనలు వినిపించినందుకు ఆయనకు రూ.60 లక్షలు ఇచ్చారు.
రఘురామకృష్ణంరాజు కేసులో చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో వాదించినందుకు లూథ్రాకు రూ.65 లక్షలు చెల్లించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వాదనలు వినిపించినందుకు రూ.10 లక్షలు చెల్లించారు. ఇలా మొత్తం 2.60 కోట్లు చెల్లించారు. దీనికి క్లర్కేజ్ (క్లర్కుకు చెల్లించాలంటూ) 10 శాతం అదనంగా అంటే రూ.26 లక్షలు కలిపి మొత్తం రూ.2.86 కోట్లు చెల్లించింది.
ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. నామమాత్రంగా వాదనలు వినిపించి, వాయిదాలు కోరిన కేసుల్లోనూ ఆయనకు లక్షల్లో ఫీజులు చెల్లించడం విశేషం. లూథ్రా క్లర్కు సంపాదించిన రూ.26 లక్షలను ఇంత తక్కువ సమయంలో సంపాదించడం హైకోర్టులో 90% మంది న్యాయవాదులకు దుర్లభమైన పని.
కేసు చిన్నదైనా, పెద్దదైనా.. ఆయనకే
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అయిన సిద్దార్థ లూథ్రా దాదాపు దశాబ్ద కాలంగా చంద్రబాబుకు న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు, కింది కోర్టు.. ఇలా ఎక్కడైనా చంద్రబాబుకు కష్టం వస్తే అక్కడ లూథ్రా ప్రత్యక్షమవుతారు. చిన్న కేసయినా, పెద్ద కేసయినా లూథ్రాకే ఇచ్చేవారు. ఇందుకు అనుగుణంగానే చంద్రబాబు, టీడీపీపై లూథ్రా ఈగ కూడా వాలనిచ్చేవారు కాదు. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్టయినప్పుడు లూథ్రానే రంగంలోకి దిగారు.

బాబు తరఫున రోజుల తరబడి వాదనలు వినిపించారు. స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు పాత్రపై పక్కా ఆధారాలుండటంతో ఆయన ఏమీ చేయలేకపోయారు. ఆయన వాదన ఏసీబీ కోర్టు ముందు నిలవలేదు. తర్వాత హైకోర్టులో ఆయన వాదన చెల్లలేదు. తర్వాత ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది.
అక్కడా చంద్రబాబు తరఫున లూథ్రానే కీలక పాత్ర పోషించారు. అక్కడా చంద్రబాబు విజయం సాధించలేకపోయారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు లూథ్రానే బయట ఉండి మొత్తం వ్యూహరచన చేశారు. ఇందుకు ఆయనకు కోట్ల రూపాయల మేర ఫీజులు చెల్లించారన్న విషయం అందరికీ తెలిసిందే.