చంద్రబాబు మోసాలపై రైతుపోరు నేడే | Farmers protest against TDP Chandrababu Govt frauds | Sakshi
Sakshi News home page

చంద్రబాబు మోసాలపై రైతుపోరు నేడే

Published Fri, Dec 13 2024 5:06 AM | Last Updated on Fri, Dec 13 2024 10:59 AM

Farmers protest against TDP Chandrababu Govt frauds

చంద్రబాబు సర్కార్‌ మోసాలపై అన్నదాతల నిరసనకు వైఎస్సార్‌సీపీ బాసట 

అన్ని జిల్లాల్లో కలెక్టర్‌ కార్యాలయాల వరకు ర్యాలీలు

సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్లకు డిమాండ్‌ పత్రాలు 

సూపర్‌ సిక్స్‌ హామీలో చెప్పినట్టుగా పెట్టుబడి సాయంగా రైతులకు రూ.20వేలు చొప్పున వెంటనే అందించాలి 

ధాన్యానికి కనీస మద్దతు ధర ఇవ్వాల్సిందే 

దళారీ వ్యవస్థను నిర్మూలించి రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి 

ఉచిత పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ 

గ్రామస్థాయిలో రైతులకు తోడుగా నిలిచిన ఆర్బీకేలు ఇప్పుడు నిర్వీర్యం 

‘మద్దతు’ కరువై అన్నదాత విలవిల.. జాడలేని వ్యవసాయ సలహా మండళ్లు 

ఐదేళ్లలో రైతన్నలకు రూ.1,88,541 కోట్ల మేర లబ్ధి చేకూర్చిన వైఎస్‌ జగన్‌ 

రైతు భరోసా కింద ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలను సాయంగా అందిస్తానని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో జగన్‌ హామీ 

అధికారంలోకి రాగానే ఒక్కో రైతుకు ఏడాదికి రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500 పెట్టుబడి సాయంగా అందించిన వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రెండు సీజన్లు గడుస్తున్నా పెట్టుబడి సాయం రూ.20 వేలు అందక.. గిట్టుబాటు ధర దక్కక.. ఉచిత పంటల బీమా రద్దుతో ధీమా లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతన్నలకు వైఎస్సార్‌ సీపీ దన్నుగా నిలిచింది. అన్నదాతను దగా చేస్తున్న కూటమి సర్కారు నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఆ పిలుపునందుకున్న వైఎస్సార్‌సీపీ అన్ని జిల్లాల కేంద్రాల్లో శుక్రవారం రైతులతో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించనుంది. అన్నదాతల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లకు డిమాండ్‌ పత్రాలు అందించనున్నారు.

కుడి, ఎడమల దగా..
కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే సూపర్‌ సిక్స్‌లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందుతుందని అన్నదాతలు ఆశించారు. అయితే రెండు వ్యవసాయ సీజన్లు గడిచిపోతున్నా కూటమి సర్కారు పైసా సాయం జమ చేసిన పాపాన పోలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెట్టుబడి సాయం కింద రూ10,718 కోట్లు చెల్లించాల్సి ఉండగా బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లే విదిలించిన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు రూపాయి కూడా ఇవ్వలేదు. 

మరోవైపు పంటల బీమా ప్రీమియం బకాయిలను ఎగ్గొట్టి రైతులకు దక్కాల్సిన రూ.1,385 కోట్ల పంటల బీమా పరిహారాన్ని అందకుండా చేసింది. సున్నా వడ్డీ రాయితీ కింద రూ.131.68 కోట్ల  ఊసెత్తడం లేదు. రబీలో కరువు సాయం బకాయిలు రూ.319.59 కోట్లు ఎగ్గొట్టింది. ఖరీఫ్‌ ధాన్యాన్ని కొనే నాధుడు లేక రైతులు అల్లాడిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్నెల్లలోనే రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడింది. 

గత ఐదేళ్ల పాటు వెన్నుదన్నుగా నిలిచిన వైఎస్సార్‌ ఉచిత పంటల బీమాను కూటమి సర్కారు రాగానే అటకెక్కించడంతో ఆ భారం భరించలేక, బ్యాంకుల చుట్టూ తిరగలేక, అవస్థలు పడలేక అన్నదాతలు పంటల బీమాకు దూరమవుతున్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక ఏకంగా 70 మంది వరకు రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడగా ఏ ఒక్కరికీ ఆర్థిక సాయాన్ని అందించి ఆదుకోలేదు.

రైతన్నకు బాసటగా జగన్‌..
కూటమి ప్రభుత్వం దగా చేయడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతన్నలకు వైఎస్‌ జగన్‌ దన్నుగా నిలిచారు. ప్రభుత్వంపై పోరాటానికి పిలుపునిచ్చారు. ఈమేరకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు అన్ని జిల్లా కేంద్రాల్లో రైతులతో కలసి శుక్రవారం భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించనున్నాయి. టీడీపీ కూటమి సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్‌ జగన్‌ ఇచ్చిన పిలుపు మేరకు ప్రభంజనంలా కదిలి వచ్చేందుకు రైతన్నలు సన్నద్ధమయ్యారు. 

అన్నదాతల సమస్యలను పరిష్కరించాలని పేర్కొంటూ కలెక్టర్లకు డిమాండ్‌ పత్రాలను అందించనున్నారు. సూపర్‌ సిక్స్‌ హామీల్లో పేర్కొన్న ప్రకారం రైతులకు పెట్టుబడి సాయంగా తక్షణమే రూ.20 వేలు అందించాలని కలెక్టర్లకు డిమాండ్‌ పత్రాలు సమర్పించనున్నారు. 

ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పించాల్సిందేనని.. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని.. ధాన్యంలో తేమ శాతం లెక్కలతో రైతులను ఇబ్బంది పెట్టడం మానుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయనున్నారు. తక్షణమే ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలని.. రైతులపై అదనపు భారం మోపే చర్యలను కూటమి ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్‌ చేయనున్నారు.

నాడు... చెప్పిన దాని కంటే మిన్నగా
రైతు భరోసా కింద ఏడాదికి రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలను పెట్టుబడి సాయంగా అందిస్తానని నాడు పాదయాత్రలో ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రాగానే ఎవరూ అడగకపోయినా సరే ఆ సాయాన్ని రూ.13,500కి పెంచడమే కాదు.. ఐదేళ్లలో ఒక్కో రైతుకు పెట్టుబడి సాయంగా రూ.67,500 అందజేశారు. 

చెప్పిన దాని కంటే మిన్నగా సాయం అందించి రైతు పక్షపాతినని నిరూపించుకున్నారు. ఇక రైతులపై పైసా భారం పడకుండా వైఎస్‌ జగన్‌ అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. నోటిఫై చేసిన పంటలకు సాగు చేసిన ప్రతీ ఎకరాకు యూనివర్శల్‌ కవరేజీ కల్పిస్తూ ఉచిత పంటల బీమాను అమలు చేశారు. దెబ్బతిన్న పంటలకు సంబంధించి బీమా పరిహారాన్ని మరుసటి ఏడాది అదే సీజన్‌ ముగిసేలోగా అందించి రైతులకు అండగా నిలిచారు. 



పంట నష్ట పరిహారమైతే ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి సంబంధించి అదే సీజన్‌ ముగిసేలోగానే రైతుల ఖాతాల్లో జమ చేశారు. సున్నా వడ్డీ రాయితీని ప్రతి ఏటా క్రమం తప్పకుండా జమ చేశారు. విత్తు నుంచి విక్రయం వరకు గ్రామస్థాయిలో రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు సచివాల­యాలకు అనుబంధంగా నెలకొల్పిన ఆర్బీకేల ద్వారా సర్టిఫై చేసిన విత్తనాలు, నాన్‌ సబ్సిడీ విత్తనాలతో పాటు ఎరువులు, పురుగుల మందులను కూడా రైతుల ముంగిటికే అందించారు. 

లక్ష మందికి పైగా అభ్యుదయ రైతులతో ఏర్పాటు చేసిన వ్యవసాయ సలహా మండళ్ల ద్వారా సీజన్‌కు ముందుగానే పంటల ప్రణాళికలు రూపొందించి సాగులో రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించారు. రైతన్నలు పండించిన ధాన్యాన్ని మిల్లర్లు, దళారీల ప్రమేయం లేకుండా కళ్లాల నుంచే నేరుగా కొనుగోలు చేశారు. ప్రతీ గింజకు కనీస మద్దతు ధర కల్పించడమే కాకుండా గన్నీ బ్యాగ్స్, లోడింగ్, రవాణా (జీఎల్‌టీ) భారాన్ని సైతం భరిస్తూ ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసేలా వైఎస్‌ జగన్‌ చర్యలు తీసుకున్నారు. 

మార్కెట్‌లో ధరలు పతనమైన ప్రతీసారి మార్కెట్‌ ఇంటర్‌ వెన్షన్‌ స్కీమ్‌ కింద జోక్యం చేసుకొని మద్దతు ధరలకు ఆయా పంట ఉత్పత్తులను సేకరించి రైతన్నలకు ప్రతి అడుగులోనూ అండగా నిలిచారు. ఇలా వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా 2019–24 మధ్య ఐదేళ్లలో అన్నదాతలకు ఏకంగా రూ.1,88,541 కోట్ల మేర ప్రయోజనాన్ని వైఎస్‌ జగన్‌ చేకూర్చారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement