coalition government
-
రాష్ట్ర ప్రజలపై యూజర్ పిడుగు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు వరుసగా షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు సంగతి దేవుడెరుగు.. రోజుకో రీతిన ప్రజలను బాదేస్తోంది. మొన్న కరెంట్ చార్జీల రూపంలో రెండుసార్లు భారీ షాక్‌లు ఇవ్వగా, నిన్న రిజిస్ట్రేషన్ చార్టీలను ఇదివరకెన్నడూ లేని రీతిలో పూరి గుడిసెలను సైతం వదలకుండా పెంచేసింది. క్లాసిఫికేషన్ల పేరుతో దండుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇవన్నీ చాలవన్నట్లు తాజాగా యూజర్ చార్జీల పేరుతో నగర, పట్టణ వాసులను భారీగా బాదేయడానికి సిద్ధమైంది. మరో వైపు ఏరు దాటేశామని ప్రజలందరినీ బోడి మల్లన్నలు చేస్తూ.. రాష్ట్రంలో వసూలు చేసే వస్తు సేవల పన్ను (జీఎస్టీ)పై ప్రత్యేకంగా వరదల సెస్ విధించడానికి అనుమతివ్వాలంటూ జీఎస్టీ కౌన్సిల్‌ను కోరింది. ప్రజలేమనుకుంటే మాకేంటని నిస్సిగ్గుగా ప్రజలను అన్ని రకాలుగా వాయించేస్తూ.. ‘బాబు అంటే బాదుడే బాదుడు’ అని నిరూపించుకుంటోంది. ఉమ్మడి రాష్ట్రంలో యూజర్ చార్జీలు అనే పదం వింటే తెలుగు రాష్ల్రాల ప్రజలందరికీ గుర్తుకు వచ్చేది నారా చంద్రబాబునాయుడే. ఇప్పుడు ఆయన విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉంటూ మరోసారి ‘యూజర్ చార్జీలు’ అంటూ ప్రజల మీద భారం వేయడానికి సిద్ధమయ్యారు. ప్రధానంగా పట్టణ ప్రజలపై యూజర్ చార్జీల మోత మోగించాలని వికసిత్ ఆంధ్రా–2029 కార్యాచరణ ప్రణాళికలో స్పష్టం చేశారు. ఈ విషయాన్ని సామాజిక, ఆర్థిక సర్వేలోనూ చంద్రబాబు ప్రభుత్వం స్పష్టం చేసింది. నీటి సరఫరాకు సంబంధించి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఆపరేషన్, మురుగునీటి శుద్ది ప్లాంట్ల ఆపరేషన్.. నిర్వహణ, నీటి సరఫరా, పంపిణీ నెట్ వర్క్, యంత్రాల నిర్వహణ, ఆపరేషన్‌కు అయ్యే వ్యయాన్ని పట్టణ ప్రజల నుంచి యూజర్ చార్జీల రూపంలో వసూలు చేయడానికి అడుగులు ముందుకు వేస్తోంది. ఇందుకోసం వినియోగదారుల చార్జీల పేరుతో పట్టణ స్థానిక సంస్థలు సంస్కరణలు చేపట్టాలని దిశా నిర్దేశం చేస్తోంది. ఎప్పటికప్పుడు యూజర్ చార్జీల నిర్వహణ, ఆపరేషన్ వ్యయానికి తగినట్లుగా రుసుము పెంచాల్సి ఉందని కూడా నొక్కి చెప్పింది. ఇలా ప్రజలను ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ బాదేస్తున్న కూటమి ప్రభుత్వం.. తమది సిటిజన్ ప్రెండ్లీ వ్యవస్థ అంటూ గొప్పలు చెప్పుకోవడం గమనార్హం.ఆస్తి పన్ను పెంచేలా అడుగులుపట్టణాల్లో ఆస్తి పన్ను సంస్కరణల ద్వారా మరింత ఆదాయం సమకూర్చుకోవాలని కూటమి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా ఇంటింటికి వెళ్లి ఇంటి నిర్మాణ వైశాల్యం, ఖాళీ స్థలం కొలతలను వేయించింది. పట్టణాల్లో ఆస్తులన్నీ రియల్ టైమ్ మదింపు చేయాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ఆస్తి పన్ను వసూలు చేయనున్నారు. అన్ని మున్సిపాలిటీల్లో సింగిల్ డిజిట్ ఉపయోగించి బిల్డింగ్ ప్లాన్ ఆమోదంతో సహా ఆస్తుల డేటా సేకరిస్తున్నారు. ఇంటిగ్రేటెట్ డిజిటలైజ్డ్ బిల్లింగ్ ద్వారా ఆస్తి పన్నుకు సంబంధించి ఆటోమెటిక్ డిజిటల్ బిల్లు జనరేట్ చేయనున్నారు. ఎస్ఎంఎస్తో పాటు వివిధ మార్గాల ద్వారా ఆస్తి పన్ను చెల్లింపును యజమానులకు గుర్తు చేయనున్నారు. బౌగోళిక సమాచార వ్యవస్థ (జీఐఎస్) ఆధారంగా ఆస్తుల వివరాలను మ్యాపింగ్ చేయనున్నారు. చాలా కాలంగా ఆస్తుల కిందకు రాని ఆస్తులన్నీ ఈ మ్యాపింగ్‌లోకి తీసుకురావడంతో పన్నుల పరిధిలో మరిన్ని ఆస్తులు రాబట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. డ్రోన్స్ ద్వారా కూడా ఇప్పటికే మ్యాపింగ్‌లో ఉన్న ఆస్తులకు అదనంగా ఉన్న ఆస్తులను జత చేస్తోంది. ఆస్తి పన్ను రిజిస్టర్‌ను రాష్ట్ర స్టాంప్ డ్యూటీతో పాటు రిజిస్ట్రేషన్ శాఖ, రెవెన్యూ విభాగాలకు అనుసంధానం చేయనున్నారు. తద్వారా ఆస్తులలో మార్పులు చేసినట్టయితే అందుకు అనుగుణంగా ఆస్తి పన్ను వసూలు చేయడానికి వీలు కలుగుతుంది.వరదలనూ వాడుకుంటాం..రాష్ట్రంలో వసూలు చేసే వస్తు సేవల పన్ను (జీఎస్టీ)పై ప్రత్యేకంగా సెస్ విధించడానికి అనుమతివ్వాలంటూ కూటమి సర్కారు జీఎస్టీ కౌన్సిల్‌ను కోరింది. శనివారం రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జరిగిన 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ ప్రతిపాదన చేశారు. 5 శాతం జీఎస్టీ దాటిన అన్ని వస్తువులపై అదనంగా ఒక శాతం ఏపీ ఫ్లడ్ సెస్ విధించడానికి అనుమతివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారమన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ సెస్ ద్వారా వచ్చే నిధులతో రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంత్రాల్లో సహాయ, పునరావాస చర్యలు చేపడతామన్నారు. 2018లో కేరళలో వరదలు వచ్చినప్పుడు ఇదే తరహాలో సెస్ విధించారని తెలిపారు. 5 శాతానికి మించిన జీఎస్టీ శ్లాబులపై ఈ సెస్ విధిస్తుండటంతో పేదలు, మధ్యతరగతి ప్రజలపై ఎలాంటి భారం ఉండదంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఇన్నోవేషన్లకు ప్రొత్సహమిచ్చేలా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు నిర్వహించే రీసెర్చ్ సర్వీసెస్‌కు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఫోర్టిఫైడ్ బియ్యంపై జీఎస్టీ సుంకాన్ని తగ్గించాలని, ఐజీఎస్టీ సెటిల్మెంట్ వ్యవస్థను మరింత పారదర్శకంగా చేపట్టాలని, ఈ డేటా రాష్ట్రాలకూ అందుబాటులో ఉంచాలన్నారు. చిన్న వ్యాపారులు, కాంపోజిషన్ జీఎస్టీ చెల్లింపుదారులకు అద్దెల విషయంలో విధించే రివర్స్ ఛార్జ్ మెకానిజం (ఆర్సీఎం) నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సూచనలను పరిశీలించేందుకు జీఎస్టీ కౌన్సిల్ మంత్రివర్గ ఉప సంఘాన్ని వేసింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, కమర్షియల్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ అహ్మద్ బాబు కూడా పాల్గొన్నారు. -
ట్యాబ్ ఏది బాబూ?
సాక్షి, అమరావతి: డిసెంబర్ 21 వచ్చిందంటే చేతుల్లో ట్యాబ్‌లతో లక్షల మంది పిల్లల మొహాల్లో సంతోషం తొణికిసలాడేది! అంతులేని సందేహాలను వాటి ద్వారా నివృత్తి చేసుకుంటూ పోటీ ప్రపంచంలో రాణించాలనే ఉత్సాహంతో ఉరకలు వేసేవారు! డిజిటల్ తరగతులు, సాంకేతిక బోధన, సకల సదుపాయాలతో సర్కారు స్కూళ్లు కళకళలాడేవి!! మరి ఈ ఏడాది ట్యాబ్‌లు ఎక్కడ? మాపై ఎందుకంత కక్ష? అని లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సీఎం చంద్రబాబును అడుగుతున్నారు. 9.52 లక్షల మందికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం బైజూస్ కంటెంట్‌తో ఉచితంగా అందించిన ట్యాబ్స్ పంపిణీని కూటమి సర్కారు ఈ ఏడాది నిలిపివేసింది. అదే జగన్ మామయ్య ప్రభుత్వం ఉంటే ఈ పాటికి ట్యాబ్‌లు వచ్చేవని 8వ తరగతి పిల్లలు గుర్తు చేసుకుంటున్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చిన జగన్ మామను ప్రతి విద్యార్థీ తలచుకుంటున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఉండి ఉంటే తమకు ఠంఛన్‌గా అమ్మ ఒడి వచ్చేదని తల్లులు గుర్తు చేసుకోని రోజు ఉండదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. పేద కుటుంబాల తలరాతలను మార్చేవి చదువులేనని గట్టిగా నమ్మి గత ఐదేళ్లూ ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం దిశగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వడివడిగా అడుగులు వేశారు. ఏటా జూన్‌లో అమ్మ ఒడితో తల్లులకు రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించి పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కాకుండా భరోసా కల్పించారు. నాడు నేడుతో కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా తీర్చిదిద్దిన సర్కారు స్కూళ్ల ప్రయాణం ఇంగ్లీష్ మీడియం చదువుల నుంచి టోఫెల్ శిక్షణ, సీబీఎస్ఈ, ఐబీ సిలబస్ స్థాయికి చేరుకుంది. మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లు, డిజిటల్ క్లాస్ రూమ్‌ల బోధన లాంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. రోజుకో రుచికరమైన మెనూతో పౌష్టిక విలువలతో గోరుముద్ద అందించి పిల్లల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. యూనిఫామ్ నుంచి పుస్తకాల దాకా అన్నీ ఉచితంగా అందిస్తూ ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్యా బోధన కోసం ఐదేళ్లలో ఏకంగా దాదాపు రూ.73 వేల కోట్లు వ్యయం చేశారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను క్రమం తప్పకుండా అమలు చేసి పిల్లల చదువులకు తోడ్పాటు అందించారు. ప్రభుత్వ విద్యా రంగానికి బలమైన పునాది వేశారు. ఇప్పుడు వాటిని సమూలంగా పెకిలించే దిశగా టీడీపీ కూటమి సర్కారు నిర్ణయాలు తీసుకుంటోంది. పేద విద్యార్థులు అధికంగా చదివే ప్రభుత్వ స్కూళ్లపై పగబట్టినట్లు వ్యవహరిస్తోంది. విద్యా రంగ పథకాలను ఇంకా అద్భుతంగా అమలు చేస్తామని నమ్మబలికి అధికారంలోకి రాగానే అన్నింటినీ నిలిపివేసింది. ఆర్నెల్ల పాలనలో ఒక్కటైనా కొత్త పథకాన్ని అందించకపోగా గత సర్కారు అమలు చేసిన వాటిని కక్షపూరితంగా ఆపేసింది. ఇందుకు నాడు నేడు నుంచి ఎన్నో నిదర్శనాలున్నాయి. ఏఐ టెక్నాలజీ యాప్‌తో ట్యాబ్స్.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చదువుల్లో మెరుగ్గా రాణించేందుకు గత ప్రభుత్వం బైజూస్ కంటెంట్‌తో ఉచితంగా ట్యాబ్‌లు అందించింది. రూ.1,305.74 కోట్లతో 9,52,925 ట్యాబ్‌లను పంపిణీ చేసింది. తద్వారా విద్యార్థులు ప్రతి పాఠ్యాంశాన్ని విశ్లేషణాత్మకంగా, ఇంటి వద్ద కూడా చదువుకునే అవకాశం దక్కింది. విద్యార్థులు విదేశీ భాషలు నేర్చుకునేందుకు వీలుగా ట్యాబ్స్‌లో ‘డ్యులింగో’ యాప్ అప్లోడ్ చేశారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు ‘ఏఐ’ టెక్నాలజీతో పనిచేసే ‘డౌట్ క్లియరెన్స్ బాట్’ యాప్‌ను రూపొందించారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్, టోఫెల్ శిక్షణలో ఎదురయ్యే క్లిష్టమైన సందేహాలను ఇది సునాయాసంగా నివృత్తి చేస్తుంది.సీబీఎస్ఈ, ఐబీ, టోఫెల్ రద్దువైఎస్ జగన్ దేశమంతా ప్రశంసించే విద్యా సంస్కరణలను ప్రవేశపెట్టారు. తల్లిదండ్రులు కోరుకున్న విధంగా ఒకటో తరగతి నుంచే ఇంగ్లీష్ మీడియం బోధనను అంచెలంచెలుగా అమలు చేశారు. అయితే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం చదవలేకపోతున్నారంటూ ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను తెలుగు మీడియంలో రాసేలా కూటమి సర్కారు నిర్ణయం తీసుకుంది. 2023–24లో ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధనను గత ప్రభుత్వం అందుబాటులోకి తెస్తే కూటమి సర్కారు ఈ ఏడాది రద్దు చేసింది. విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంపొందించి అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు 2023–24 విద్యా సంవత్సరంలో మూడో తరగతి నుంచే ప్రారంభమైన ‘టోఫెల్’ శిక్షణను కూడా ఈ ఏడాది కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. గతేడాది రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు ఈ సదుపాయం లభించగా ఈ ఏడాది ఒక్కరికీ అవకాశం లేకుండా చేసింది. గతేడాది 16 లక్షల మంది టోఫెల్ పరీక్ష రాయగా కనీసం ఆ ఫలితాలను కూడా ప్రకటించలేదు. పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా ఎదగాలన్న వైఎస్ జగన్ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశపెట్టిన ‘ఇంటర్నేషనల్ బాకలారియేట్(ఐబీ) బోధనను కూడా చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. కార్పొరేట్ స్కూళ్లలో సంపన్నుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉండే ఐబీ బోధన 2025 జూన్ నుంచి రాష్ట్రంలోని 38 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించేందుకు గత ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తే దాన్ని రద్దు చేసి కక్షపూరితంగా వ్యవహరించింది.‘వందనం’ లేదు.. వంటా లేదు..!ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ‘అమ్మకు వందనం’ కింద ఏటా రూ.15 వేల చొప్పున ఇస్తామని ఎన్నికల ముందు చెప్పిన కూటమి నేతలు చేతులెత్తేశారు. విద్యా సంవత్సరం ముగిసిపోతున్నా సీఎం చంద్రబాబు ఆ ఊసే ఎత్తకపోవడంతో 45 లక్షల మంది తల్లులు, 84 లక్షల మంది పిల్లలు తీవ్ర నిస్పృహ చెందుతున్నారు. ఇక నాడు–నేడు పనులను మధ్యలో నిలిపి వేశారు. పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనం జగనన్న గోరుముద్ద పేరును డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంగా మార్చి ఏజెన్సీలను రాజకీయ కక్షతో తొలగించారు. గతంలో దాదాపు 95 శాతం మంది పిల్లలు గోరుముద్దను తీసుకోగా ఇప్పుడు నాణ్యత కొరవడటంతో 50 శాతం మంది కూడా తినడం లేదు. ఇటీవల ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించిన మెగా పీటీఎంలో తల్లిదండ్రులకు ఇదే భోజనాన్ని పెట్టడంతో అధికారులు, నాయకులను పలుచోట్ల నిలదీశారు. టీడీపీ హయాంలో గతంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో రోజూ సాంబారు, అన్నంతో సరిపెట్టగా వైఎస్ జగన్ నాణ్యమైన పౌష్టికాహారాన్ని పిల్లలకు అందించాలనే సంకల్పంతో 2020 జనవరి 1న ‘జగనన్న గోరుముద్ద’ పథకానికి శ్రీకారం చుట్టారు. రోజుకో మెనూ చొప్పున వారానికి 16 రకాల పదార్థాలతో పాటు ఫోర్టిఫైడ్ సార్టెక్స్ బియ్యంతో మధ్యాహ్నం రుచి, శుచితో పోషకాహారాన్ని అందించారు. పిల్లల్లో రక్తహీనతను అరికట్టడానికి వారంలో మూడు రోజులు బెల్లంతో చేసిన రాగి జావ, మూడు రోజులు చిక్కీ, వారంలో ఐదు రోజులు ఉడికించిన కోడిగుడ్డును తప్పనిసరి చేశారు. పాఠశాలల్లో విద్యార్థుల అభిప్రాయాలు తీసుకుని వంటలో మార్పుచేర్పులు చేశారు. టీడీపీ హయాంలో మధ్యాహ్న భోజనం కోసం ఏటా రూ.450 కోట్లు ఖర్చు చేయగా వైఎస్ జగన్ ప్రభుత్వం ఏటా రూ.1,400 కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.7,244.6 కోట్లు ఖర్చు చేసింది. అటకెక్కిన సబ్జెక్టు టీచర్ల బోధనవిద్యార్థుల్లో బోధనా ప్రమాణాలు పెంచేందుకు 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ బోధనను వైఎస్ జగన్ అమల్లోకి తెస్తే ఈ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా రద్దు చేసింది. గత ప్రభుత్వం దాదాపు 6 వేల మంది ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించి, 3–5 తరగతులను హైస్కూళ్లకు మార్చి నాణ్యమైన బోధన అందిస్తే ఈ విద్యా సంవత్సరంలో కూటమి సర్కారు సబ్జెక్టు టీచర్లను కేవలం ఉన్నత తరగతులకే పరిమితం చేసి విద్యార్థులకు నాణ్యమైన చదువులు అందకుండా చేసింది.మండలానికి రెండు కాలేజీలు రద్దురాష్ట్రంలోని ప్రతి మండలంలో రెండు ప్రభుత్వ జూనియర్ కాలేజీల ఏర్పాటుతో పాటు వాటిలో ఒకటి బాలికల కోసం కేటాయించిన గత ప్రభుత్వం 292 ఉన్నత పాఠశాలలను బాలికల కోసం హైస్కూల్ ప్లస్‌గా అప్‌గ్రేడ్ చేసింది. 352 కేజీబీవీల్లో ఇంటర్మీడియట్ విద్యను ప్రవేశపెట్టారు. 2022–23 నుంచి 14 కో–ఎడ్ జూనియర్ కళాశాలలను బాలికల జూనియర్ కళాశాలలుగా మార్చారు. దీంతో మొత్తం 679 మండలాల్లో రెండు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఏర్పాటై బాలికల కోసం ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల అందుబాటులోకి వచ్చింది. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని 504 హైస్కూల్ ప్లస్‌లను రద్దు చేసే దిశగా చర్యలు తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం ఇవి ఉండవని ఇటీవలే ప్రకటించింది.‘ఆణిముత్యాల’ ఆశలు ఆవిరి..వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా 2022–23లో టెన్త్, ఇంటర్లో ఉత్తమ మార్కులు సాధించిన 22,768 మంది విద్యార్థులను సత్కరించి ప్రోత్సహించింది. ‘జగనన్న ఆణిముత్యాలు–స్టేట్ బ్రిలియన్స్’ అవార్డులతో వెన్నుతట్టి అభినందించింది. గత విద్యా సంవత్సరంలో రాష్ట్ర స్థాయి అవార్డులు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివిన వారికే దక్కాయి. ప్రభుత్వ మేనేజ్మెంట్ పాఠశాలల్లో చదివి ఉత్తమంగా రాణించిన 10 మంది నిరుపేద విద్యార్థులను గత ప్రభుత్వం అమెరికా పర్యటనకు పంపించింది. 2023–24లో కూడా ఇదే విధానం కొనసాగుతుందనే ఉత్సాహంతో ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో చదివిన దాదాపు 32 వేల మంది విద్యార్థులు కార్పొరేట్ విద్యా సంస్థలను మించి ఫలితాలు సాధించారు. అయితే జూన్‌లో నిర్వహించాల్సిన సత్కారాన్ని కూటమి సర్కారు నిలిపివేసి ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల పట్ల అన్యాయంగా వ్యవహరించింది. వైఎస్ జగన్ అమలు చేసిన విద్యా సంస్కరణలను రద్దు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కూటమి సర్కారు ఆరు నెలల్లో ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసింది.విద్యా సంస్కరణలువైఎస్ జగన్ చేపట్టిన చదువుల యజ్ఞంతో సర్కారు బడులు సమున్నతంగా మారాయి. 2019 నుంచి వివిధ విద్యా, సంక్షేమ పథకాలను అమలు చేశారు. స్కూళ్లు తెరిచిన మొదటి రోజే జగనన్న విద్యాకానుక ఇవ్వడంతో తల్లిదండ్రులకు పుస్తకాలు, యూనిఫారం భారం లేకుండా పోయింది. బడికి దూరమవుతున్న పిల్లలను తిరిగి స్కూళ్లలో చేర్పించడం, పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదనే లక్ష్యంతో ఏటా సగటున 44,48,865 మంది తల్లుల ఖాతాల్లో ప్రతి సంవత్సరం రూ.15 వేల చొప్పున జగనన్న అమ్మఒడి కింద నేరుగా నగదు జమ చేసింది. పేదింటి పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీ పడేందుకు 2020–21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనను ప్రవేశపెట్టారు. ‘మన బడి నాడు–నేడు’ పథకంతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు సమున్నతంగా మారాయి. కొత్త భవనాలు, డబుల్ డెస్క్ బెంచీల నుంచి కాంపౌండ్ వాల్ వరకు దాదాపు 11 రకాల సదుపాయాలు సమకూరాయి. నాడు – నేడు పనులు పూర్తయిన హైస్కూళ్లకు 62 వేల ఐఎఫ్‌పీలు, ఎలిమెంటరీ స్కూళ్లకు 45 వేల స్మార్ట్ టీవీలు అందించి డిజిటల్ బోధన ప్రవేశపెట్టారు. మధ్యాహ్న భోజనంలో జగనన్న గోరుముద్ద కింద వారానికి 16 రకాల వంటకాలతో నాణ్యమైన పోషకాల భోజనం అందించారు. దేశంలో ఈ తరహా భోజనాన్ని పిల్లలకు అందించిన రాష్ట్రం మరొకటి లేదని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ప్రశంసించింది. ఇక 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేసి బైలింగ్వుల్ పాఠ్యపుస్తకాలు ఇవ్వడం దేశంలోనే తొలిసారి. ప్రాథమిక పాఠశాలల్లో స్మార్ట్ టీవీలు, ఉన్నత పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లతో డిజిటల్ బోధన అందించడంతో విద్యార్థుల్లో సామర్థ్యాలు పెరిగాయి. ఇంగ్లిష్ మీడియం బోధనతో 2022–23 విద్యా సంవత్సరంలో 84 శాతం మంది విద్యార్థులు ఆంగ్లంలో పరీక్షలు రాసి ఉత్తీర్ణులు కాగా 2023–24లో అది ఏకంగా 93 శాతానికి పెరిగింది. 2024 మార్చి పదో తరగతి పరీక్షల్లో 4.50 లక్షల మంది ప్రభుత్వ విద్యార్థుల్లో 2.25 లక్షల మంది ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాయగా 1.96 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలకే పరిమితమైన ‘స్టేట్ టాపర్స్’ గత రెండు విద్యా సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల నుంచి రావడం గమనార్హం. టాపర్స్‌గా నిలిచిన 10 మంది విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించి ఏపీలో విద్యా సంస్కరణల గురించి ప్రపంచానికి చాటి æచెప్పారు. ఇప్పుడు ఆ పథకాలు, సదుపాయాలు, ప్రోత్సాహం లేకపోవడంతో ప్రస్తుత విద్యా సంవత్సరంలో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ విద్యా సంస్థలకు తరలిపోయారు. -
విశ్వాస పరీక్షలో షోల్జ్ ఓటమి
బెర్లిన్: జర్మనీ చాన్సెలర్ ఒలాఫ్ షోల్జ్ సోమవారం పార్లమెంట్లో విశ్వాస పరీక్షలో ఓటమి పాలయ్యారు. యూరప్‌లోనే అత్యధిక జనాభా, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన జర్మనీలో ఫిబ్రవరిలోనే ముందస్తు ఎన్నికలకు ఈ పరిణామం దారి తీయనుంది. మూడు పార్టీల సంకీర్ణ ప్రభుత్వం నవంబర్ 6న కుప్పకూలింది. రాజ్యాంగం ప్రకారం సభలో విశ్వాస పరీక్ష చేపట్టాల్సి ఉంటుంది. మొత్తం 733 మంది సభ్యులుండే దిగువ సభ బుండెస్టాగ్‌లో సోమవారం షోల్జ్‌కు అనుకూలంగా 207 మంది ఓటేశారు. దీంతో, ఆయన సభ విశ్వాసం పొందలేకపోయినట్లు ప్రకటించారు. విశ్వాసంలో గెలవాలంటే మరో 367 ఓట్ల అవసరముంది. ఫిబ్రవరి 23వ తేదీన ఎన్నికలు జరపాలని ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఉక్రెయిన్‌కు ఆయుధ, ఆర్థిక సాయమందించేందుకు సిద్ధమని ప్రకటిస్తున్న షోల్జ్ ‘సోషల్ డెమోక్రాట్’పార్టీకి వచ్చే ఎన్నికల్లో విజయావకాశాలు తక్కువని విశ్లేషకులు అంటున్నారు. ప్రధాన ప్రతిపక్షం యూనియన్ బ్లాక్ ముందంజలో ఉందంటున్నారు. -
పింఛనర్లపై పగ
సాక్షి ప్రతినిధి, బాపట్ల: నెలనెలా పింఛన్ కావాలంటే మా దగ్గరికి రండి.. మా పార్టీలో చేరండి. లేదంటే అంతే సంగతులు.. ఆశలు వదులుకోండి. ఎవరికి చెప్పుకున్నా ప్రయోజనంలేదు.. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో పరిస్థితి ఇది. మంత్రి ఆదేశాలతో ఇక్కడి పచ్చనేతలు బరితెగించి పండుటాకులను కాల్చుకు తింటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి నెలలో ఇదే గ్రామంలో ఉన్న సుమారు ఎనిమిది మందికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాలతో అధికారులు పింఛన్ ఇవ్వలేదు. రెండో నెలలో సచివాలయానికి వెళ్లి గొడవపడి అంజయ్య, శ్రీనివాసరావులతోపాటు కొందరు పింఛన్ మొత్తాన్ని తెచ్చుకున్నారు. లీలావతితోపాటు మరికొందరికి మాత్రం డబ్బులివ్వలేదు. దీంతో కొందరు పింఛనర్లు మంత్రి గొట్టిపాటి ప్రధాన అనుచరుడిని కలిసి మాట్లాడుకున్నారు. మూడోనెలలో అంజయ్య, దివ్యాంగుడు శ్రీనివాసరావు, వృద్ధ మహిళ లీలావతి పింఛన్ కోసం సచివాలయానికి వెళ్తే.. మీ పింఛన్లు లేవన్నారు. ఆరాతీస్తే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ సచివాలయ పరిధిలో ఉన్నాయని తెలిసింది. మూడు, నాలుగు, ఐదు నెలలు శ్రమకోర్చి అక్కడికే వెళ్లి పింఛన్ తెచ్చుకున్నారు. సొంత ఊరిలో ఉంటే ఎలాగూ పింఛన్ ఇవ్వరని కేతనకొండ నుంచి ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం శంకరాపురానికి బదిలీ పెట్టుకున్నారు. ఆరోనెల శంకరాపురానికి వెళ్లి పింఛన్ తెచ్చుకున్నారు. విషయం తెలిసి మంత్రి గొట్టిపాటి ముండ్లమూరు అధికారులకు చీవాట్లు పెట్టడంతోపాటు తక్షణం ముగ్గురి పింఛన్లను వేర్వేరు ఊర్లకు బదిలీ చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఇంకేముంది.. వికలాంగుడు శ్రీనివాసరావు పింఛన్ శ్రీకాకుళానికి.. బత్తుల చిన్న అంజయ్య పింఛన్ అనంతపురానికి, లీలావతి పింఛన్ చిత్తూరు జిల్లాలకు బదిలీ చేసినట్లు సమాచారం. వారు అంతదూరం వెళ్లి పింఛన్ తెచ్చుకోవాలంటే అంతకుమించిన ఖర్చవుతుంది. లేదంటే మంత్రిని కలిసి జీ హుజూర్ అనాల్సిందే అంటున్నారు.వైఎస్సార్సీపీకి మద్దతు పలికారని..గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి మద్దతు పలికారంటూ వృద్ధులని కూడా చూడకుండా ఇలాంటి వారి పింఛన్లను తొలగించారు. కొందరి పేర్లున్నా వారికి పింఛన్లు ఇవ్వడంలేదు. మరికొందరి పింఛన్లను సుదూరంలోని జిల్లాలకు పంచాయతీ సెక్రటరీ, వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్ నుంచి బదిలీచేశారు. పింఛన్‌దారులను బెదిరించి తమవైపు తిప్పుకునేందుకు పచ్చనేతలు ఈ తరహా అక్రమాలకు తెరలేపినట్లు తెలుస్తోంది. వారు మాట వినకపోతే తొలగించేందుకూ సిద్ధమైనట్లు సమాచారం. తామున్న సచివాలయ పరిధి నుంచి ఇతర జిల్లాలకు బదిలీ చేస్తుండడంతో పింఛన్లు తెచ్చుకునేందుకు వీలుకాక కొందరు ఇబ్బందులు పడుతుండగా.. అసలు తమ పింఛన్ ఏ జిల్లాలో ఉందో తెలీక చాలామంది సతమతమవుతున్నారు. ఒకవేళ ఫలానా జిల్లాలో ఉందని తెలిసినా ప్రతినెలా అంత దూరం ఖర్చులు పెట్టుకుని వెళ్లి తెచ్చుకోవడం చాలా కష్టం. వృద్ధులను ఇలా ఇబ్బందులకు గురిచేసి తమవైపుకు తిప్పుకునే ఎత్తుగడలో భాగంగా మంత్రి గొట్టిపాటి ఇదంతా చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.పట్టు నిలుపుకునేందుకే ఇలా..ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఇసుక, గ్రానైట్, రేషన్ బియ్యం దందాలతో పాటు విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజలపై కూటమి సర్కారు పెనుభారం మోపడంతో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ప్రతిష్ట నియోజకవర్గంలో పూర్తిగా మసకబారింది. పైగా.. నేతలు, కార్యకర్తలకు ఆయన అందుబాటులో లేకపోవడం, కొందరికే ప్రాధాన్యత ఇస్తుండడంతో ఆయనపై తీవ్ర అసంతృప్తి నెలకొంది. దీనిని పసిగట్టిన గొట్టిపాటి నిర్బంధాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి నియోజకవర్గంలో పట్టునిలుపుకునేందుకు ఇలా అడ్డదారులు తొక్కుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే పింఛన్లను సైతం నిలిపేసి వారి కుటుంబాలను తమవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. -
కేసులపై కుతంత్రం!
చంద్రబాబుపై కొనసాగుతున్న కేసులను ఎత్తేద్దాం..! విపక్ష ప్రజా ప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టేద్దాం!! ఇదీ కూటమి సర్కారు కుట్రల కుతంత్రం! ఒకపక్క ఎలాంటి ఆధారాలు లేకపోయినా వైఎస్సార్సీపీ నేతలపై కేసులు బనాయిస్తూ మరోవైపు స్పష్టమైన ఆధారాలతో బాబుపై కోర్టుల్లో కొనసాగుతున్న కేసుల విచారణను నీరుగార్చి అటకెక్కించేందుకు కూటమి సర్కార్ సిద్ధమైంది. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ నుంచి వచ్చిన ఓ ప్రముఖ సీనియర్ న్యాయవాది ఏకంగా పోలీసు, సీఐడీ ఉన్నతాధికారులతో సమావేశమై స్కిల్‌స్కామ్, అసైన్డ్ భూముల దోపిడీ, ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్మెంట్ అక్రమాలు, ఫైబర్ నెట్ కుంభకోణం కేసుల నుంచి చంద్రబాబు పేరును తప్పించడంపై మార్గనిర్దేశం చేయడం సంచలనం రేకెత్తిస్తోంది. ఆ కేసుల్లో సాక్షులను ఎలా వేధించాలి..? ఎలా తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేయాలి..? న్యాయపరంగా ఇబ్బందులు రాకుండా ఎలాంటి అడ్డదారులు తొక్కాలి? అనే విషయాలను ఆ సీనియర్ న్యాయవాది కూలంకషంగా ఉద్బోధించినట్లు తెలుస్తోంది.చంద్రబాబుపై ఉన్న అవినీతి కేసులను మూసివేయడమే ఏకైక అజెండాగా ఓ ప్రైవేట్ న్యాయవాది ఈ సమావేశాన్ని నిర్వహించడం.. రానున్న రెండు నెలల్లోనే ఆ కేసులను క్లోజ్ చేసేలా పోలీసు, సీఐడీ వ్యవస్థలను సిద్ధం చేయడంపై పోలీస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. నేడు కూడా ఈ సమావేశాన్ని కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఇలా ఒకవైపు తమపై ఉన్న కేసులను నీరుగారుస్తున్న ప్రభుత్వ పెద్దలు మరో వైపు విపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించే వ్యూహాన్ని రచించారు. వైఎస్సార్సీపీ ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, పీవీ మిథున్‌రెడ్డిపై మద్యం అక్రమ కేసులను బనాయించేందుకు కుతంత్రం పన్నారు. ‘ముఖ్య’ నేత ఆదేశాలతో రంగంలోకి దిగిన సీఐడీ ఉన్నతాధికారి ఒకరు బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలంటూ తీవ్రస్థాయిలో బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఆ ఇద్దరినీ అక్రమ కేసులతో వేధిస్తే డీజీపీ పోస్టు ఇస్తానని సీఐడీ ఉన్నతాధికారికి ‘ముఖ్య’ నేత ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది!! – సాక్షి, అమరావతి -
చంద్రబాబు మోసాలపై రైతుపోరు నేడే
సాక్షి, అమరావతి: రెండు సీజన్లు గడుస్తున్నా పెట్టుబడి సాయం రూ.20 వేలు అందక.. గిట్టుబాటు ధర దక్కక.. ఉచిత పంటల బీమా రద్దుతో ధీమా లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతన్నలకు వైఎస్సార్ సీపీ దన్నుగా నిలిచింది. అన్నదాతను దగా చేస్తున్న కూటమి సర్కారు నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఆ పిలుపునందుకున్న వైఎస్సార్సీపీ అన్ని జిల్లాల కేంద్రాల్లో శుక్రవారం రైతులతో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించనుంది. అన్నదాతల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు అందించనున్నారు.కుడి, ఎడమల దగా..కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే సూపర్ సిక్స్‌లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందుతుందని అన్నదాతలు ఆశించారు. అయితే రెండు వ్యవసాయ సీజన్లు గడిచిపోతున్నా కూటమి సర్కారు పైసా సాయం జమ చేసిన పాపాన పోలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెట్టుబడి సాయం కింద రూ10,718 కోట్లు చెల్లించాల్సి ఉండగా బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లే విదిలించిన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు రూపాయి కూడా ఇవ్వలేదు. మరోవైపు పంటల బీమా ప్రీమియం బకాయిలను ఎగ్గొట్టి రైతులకు దక్కాల్సిన రూ.1,385 కోట్ల పంటల బీమా పరిహారాన్ని అందకుండా చేసింది. సున్నా వడ్డీ రాయితీ కింద రూ.131.68 కోట్ల ఊసెత్తడం లేదు. రబీలో కరువు సాయం బకాయిలు రూ.319.59 కోట్లు ఎగ్గొట్టింది. ఖరీఫ్ ధాన్యాన్ని కొనే నాధుడు లేక రైతులు అల్లాడిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్నెల్లలోనే రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడింది. గత ఐదేళ్ల పాటు వెన్నుదన్నుగా నిలిచిన వైఎస్సార్ ఉచిత పంటల బీమాను కూటమి సర్కారు రాగానే అటకెక్కించడంతో ఆ భారం భరించలేక, బ్యాంకుల చుట్టూ తిరగలేక, అవస్థలు పడలేక అన్నదాతలు పంటల బీమాకు దూరమవుతున్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక ఏకంగా 70 మంది వరకు రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడగా ఏ ఒక్కరికీ ఆర్థిక సాయాన్ని అందించి ఆదుకోలేదు.రైతన్నకు బాసటగా జగన్..కూటమి ప్రభుత్వం దగా చేయడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతన్నలకు వైఎస్ జగన్ దన్నుగా నిలిచారు. ప్రభుత్వంపై పోరాటానికి పిలుపునిచ్చారు. ఈమేరకు వైఎస్సార్సీపీ శ్రేణులు అన్ని జిల్లా కేంద్రాల్లో రైతులతో కలసి శుక్రవారం భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించనున్నాయి. టీడీపీ కూటమి సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రభంజనంలా కదిలి వచ్చేందుకు రైతన్నలు సన్నద్ధమయ్యారు. అన్నదాతల సమస్యలను పరిష్కరించాలని పేర్కొంటూ కలెక్టర్లకు డిమాండ్ పత్రాలను అందించనున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో పేర్కొన్న ప్రకారం రైతులకు పెట్టుబడి సాయంగా తక్షణమే రూ.20 వేలు అందించాలని కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు సమర్పించనున్నారు. ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పించాల్సిందేనని.. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని.. ధాన్యంలో తేమ శాతం లెక్కలతో రైతులను ఇబ్బంది పెట్టడం మానుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నారు. తక్షణమే ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలని.. రైతులపై అదనపు భారం మోపే చర్యలను కూటమి ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేయనున్నారు.నాడు... చెప్పిన దాని కంటే మిన్నగారైతు భరోసా కింద ఏడాదికి రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలను పెట్టుబడి సాయంగా అందిస్తానని నాడు పాదయాత్రలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రాగానే ఎవరూ అడగకపోయినా సరే ఆ సాయాన్ని రూ.13,500కి పెంచడమే కాదు.. ఐదేళ్లలో ఒక్కో రైతుకు పెట్టుబడి సాయంగా రూ.67,500 అందజేశారు. చెప్పిన దాని కంటే మిన్నగా సాయం అందించి రైతు పక్షపాతినని నిరూపించుకున్నారు. ఇక రైతులపై పైసా భారం పడకుండా వైఎస్ జగన్ అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. నోటిఫై చేసిన పంటలకు సాగు చేసిన ప్రతీ ఎకరాకు యూనివర్శల్ కవరేజీ కల్పిస్తూ ఉచిత పంటల బీమాను అమలు చేశారు. దెబ్బతిన్న పంటలకు సంబంధించి బీమా పరిహారాన్ని మరుసటి ఏడాది అదే సీజన్ ముగిసేలోగా అందించి రైతులకు అండగా నిలిచారు. పంట నష్ట పరిహారమైతే ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి సంబంధించి అదే సీజన్ ముగిసేలోగానే రైతుల ఖాతాల్లో జమ చేశారు. సున్నా వడ్డీ రాయితీని ప్రతి ఏటా క్రమం తప్పకుండా జమ చేశారు. విత్తు నుంచి విక్రయం వరకు గ్రామస్థాయిలో రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు సచివాలయాలకు అనుబంధంగా నెలకొల్పిన ఆర్బీకేల ద్వారా సర్టిఫై చేసిన విత్తనాలు, నాన్ సబ్సిడీ విత్తనాలతో పాటు ఎరువులు, పురుగుల మందులను కూడా రైతుల ముంగిటికే అందించారు. లక్ష మందికి పైగా అభ్యుదయ రైతులతో ఏర్పాటు చేసిన వ్యవసాయ సలహా మండళ్ల ద్వారా సీజన్‌కు ముందుగానే పంటల ప్రణాళికలు రూపొందించి సాగులో రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించారు. రైతన్నలు పండించిన ధాన్యాన్ని మిల్లర్లు, దళారీల ప్రమేయం లేకుండా కళ్లాల నుంచే నేరుగా కొనుగోలు చేశారు. ప్రతీ గింజకు కనీస మద్దతు ధర కల్పించడమే కాకుండా గన్నీ బ్యాగ్స్, లోడింగ్, రవాణా (జీఎల్టీ) భారాన్ని సైతం భరిస్తూ ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసేలా వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారు. మార్కెట్లో ధరలు పతనమైన ప్రతీసారి మార్కెట్ ఇంటర్ వెన్షన్ స్కీమ్ కింద జోక్యం చేసుకొని మద్దతు ధరలకు ఆయా పంట ఉత్పత్తులను సేకరించి రైతన్నలకు ప్రతి అడుగులోనూ అండగా నిలిచారు. ఇలా వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా 2019–24 మధ్య ఐదేళ్లలో అన్నదాతలకు ఏకంగా రూ.1,88,541 కోట్ల మేర ప్రయోజనాన్ని వైఎస్ జగన్ చేకూర్చారు. -
Andhra Pradesh: చంద్రబాబు ప్రభుత్వం హై ఓల్టేజ్ షాక్
సాక్షి, అమరావతి: ‘ఓట్లేయ్యండి తమ్ముళ్లూ..! అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలను పెంచం.. పైగా తగ్గిస్తాం.. నేను గ్యారెంటీ..!’ అంటూ ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఐదు నెలలకే మాట తప్పి రాష్ట్ర ప్రజలకు వరుసగా విద్యుత్ షాక్‌లు ఇస్తోంది. సూపర్ సిక్స్ హామీలను తుంగలో తొక్కినట్లుగానే విద్యుత్ చార్జీలపై చేసిన వాగ్దానాన్ని మరచి ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారు. విద్యుత్తు చార్జీల మోత మోగిస్తూ హై వోల్టేజీ షాకులిస్తున్నారు. రూ.15,485.36 కోట్ల చార్జీల బాదుడుకు తెర తీశారు. విద్యుత్తు వాడకం తక్కువగా ఉండే శీతకాలంలోనే బిల్లులు ఇలా పేలిపోతుంటే ఇక తరువాత నెలల్లో ఏ స్థాయిలో షాక్‌లు ఉంటాయోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఓవైపు ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకూ గత ప్రభుత్వం ఇచ్చిన ఉచిత విద్యుత్‌ను దూరం చేసి బిల్లులతో బాదేస్తున్న కూటమి ప్రభుత్వం ఇతర వర్గాలపై పెనుభారం మోపింది.నివ్వెరపోతున్న వినియోగదారులు..ఈ నెల 2వ తేదీ నుంచి మీటర్ రీడింగ్ తీసి విద్యుత్తు సిబ్బంది ప్రజలకు అందిస్తున్నారు. వాడిన దానికి మించి విద్యుత్ బిల్లులతో షాక్‌లకు గురి చేస్తున్నారు. అదనంగా వసూలు చేస్తున్నారని గ్రహించి గగ్గోలు పెడుతున్నారు. ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో రూ.6,072.86 కోట్ల భారాన్ని గత నెల విద్యుత్ వినియోగం నుంచి వినియోగదారులపై ప్రభుత్వం వేస్తోంది. సర్దుబాటు చార్జీ ప్రతి యూనిట్‌కు సగటున రూ.1.27గా నిర్ణయించిన ఏపీఈఆర్సీ దీనిని 15 నెలల్లో వసూలు చేయాలని సూచించడంతో ప్రతి నెలా వినియోగదారులపై ఈ సర్దుబాటు భారం యూనిట్‌కు సగటున రూ.0.63 చొప్పున పడుతోంది.వచ్చే నెల నుంచి మరింత మోత..ప్రస్తుతం వసూలు చేస్తున్న రూ.6,072.86 కోట్లకే ప్రజలపై ఇంత భారీగా చార్జీల భారం పడుతుంటే వచ్చే నెల నుంచి కూటమి ప్రభుత్వం విద్యుత్ వినియోగదారుల మీద మరో పిడుగు వేయనుంది. రూ.9,412.50 కోట్ల చార్జీల వసూలుకు డిస్కమ్‌లు సిద్ధమవుతున్నాయి. డిసెంబర్ నెల వినియోగం నుంచి అంటే జనవరి మొదటి వారం నుంచి వచ్చే విద్యుత్ బిల్లుల్లో ఈ చార్జీలను ప్రభుత్వం వసూలు చేయనుంది. అసలే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు ఆకాశన్నంటుతుంటే దానికి తోడు విద్యుత్ చార్జీల బాదుడుతో సామాన్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మనుబోలులో నివసించే గడ్డం రమణారెడ్డికి నవంబరులో రూ.1,620 విద్యుత్ బిల్లు రాగా ఈ నెల ఏకంగా రూ.2,541 బిల్లు వచ్చింది. గత నెలతో పోలిస్తే 56 శాతం అదనంగా పెరిగి రూ.921 అధికంగా బిల్లు రావడంతో ఆయన లబోదిబోమంటున్నారు. నవంబర్,డిసెంబరు నెలల బిల్లులు చిత్తూరులోని కొంగారెడ్డిపల్లెలో అద్దె ఇంట్లో నివసించే రమేష్‌కు ప్రతి నెలా రూ.300 – రూ.400 మధ్య కరెంట్ బిల్లు వస్తుంది. అక్టోబర్‌లో రూ.363 వచ్చింది. నవంబర్లోనూ రూ.385కి మించలేదు. అలాంటిది ఈ నెల ఏకంగా రూ.679 రావడంతో షాక్ తిన్నాడు. వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్లలోని ప్రకాశ్‌నగర్ కాలనీలో అద్దె ఇంట్లో నివసించే కత్తి రామక్క నలుగురు సంతానం అనారోగ్యంతో బాధపడుతున్నారు. చిరు వ్యాపారంతో ఆమె కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఎస్సీలకు ఉచిత విద్యుత్తు పథకాన్ని వర్తింపచేయడంతో ఐదేళ్లుగా ఆమెకు కరెంటు బిల్లు ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం రాలేదు. కూటమి ప్రభుత్వం రాగానే కరెంటు బిల్లు కట్టాలంటూ విద్యుత్ శాఖ అధికారులు ఇంటి వద్దకు వచ్చారు. రూ.3,464 బిల్లు కట్టాలని, 2018 నుంచి బకాయిలు చెల్లించాలని హెచ్చరిస్తూ కరెంట్ కట్ చేయడంతో అంధకారంలో మగ్గిపోతోంది. విద్యుత్ ఛార్జీలు పెంచనన్నారుగా బాబు 16/08/2023: టీడీపీ విజన్ డాక్యుమెంట్– 2047 విడుదల సందర్భంగా విద్యుత్ చార్జీలు పెంచం.. వీలైతే తగ్గిస్తామని ప్రకటించిన చంద్రబాబు ⇒ మా ఇంటికి వైఎస్సార్ సీపీ హయాంలో ఉచిత విద్యుత్తు అందించారు. 200 యూనిట్ల లోపే వినియోగిస్తున్నాం. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నుంచి బిల్లు కట్టమని విద్యుత్ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ⇒ కన్నేపల్లి కుమారి (ఎస్సీ సామాజిక వర్గం), సిటిజన్ కాలనీ, గాంధీ గ్రామం, చోడవరం మండలం, అనకాపల్లి జిల్లా (02 వీఎస్సీ 803)కర్నూలులోని బుధవారపేటలో అద్దె ఇంట్లో నివసించే ప్రైవేట్ ఉద్యోగి అజయ్‌కి (సర్వీస్ నెంబర్ 8311102106824) గత నెలలో విద్యుత్ బిల్లు రూ.688 రాగా ఈ నెలలో ఏకంగా రూ.1,048 రావడంతో గుండె గుభిల్లుమంది. ఆ కుటుంబంపై ఒక్క నెలలోనే రూ.360 అదనపు ఆర్థిక భారం పడింది. ఈ నెల నుంచి పెరిగిన విద్యుత్ బిల్లుల బాదుడు స్పష్టంగా కనిపిస్తోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో 88 యూనిట్లకు రూ.348.97 బిల్లు రాగా ప్రస్తుతం 91 యూనిట్లకు రూ.463.91 బిల్లు వచ్చినట్లు కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన కె.సూర్యకాంత్ తెలిపారు. అదనంగా వాడిన మూడు యూనిట్లకు రూ.114.94 బిల్లు ఎక్కువగా రావడంతో ఆయన షాక్ తిన్నాడు. ఉచిత విద్యుత్తు ఇచ్చిన వైఎస్ జగన్వైఎస్సార్ సీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా అందించిన విద్యుత్‌ను కూడా పాత బకాయిలుగా చూపిస్తూ కూటమి సర్కారు బలవంతపు వసూళ్లకు దిగుతోంది. రూ.లక్షలు.. వేలల్లో బకాయిలు చెల్లించాలంటూ ఆదేశిస్తోంది. అంత డబ్బు కట్టలేని పేదల కరెంట్ కనెక్షన్లను విద్యుత్ సిబ్బంది నిర్దాక్షిణ్యంగా కట్ చేస్తూ మీటర్లను తొలగిస్తున్నారు. పాత బకాయిల పేరుతో విద్యుత్తు సిబ్బంది కరెంట్ మీటర్లు తొలగించి తీసుకుపోతున్నారు. బకాయిలు చెల్లిస్తేనే విద్యుత్‌ను పునరుద్ధరిస్తామని తేల్చి చెబుతుండటంతో పేదలు తీవ్ర షాక్‌కు గురవుతున్నారు. తాటాకు ఇళ్లు, రేకుల షెడ్లు, ప్రభుత్వ కాలనీల్లో నివసించే వారంతా చీకట్లోనే కాలం గడుపుతున్నారు. దాదాపు 250 కుటుంబాలు నివసించే అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం రాఘవరాజపురం హరిజనవాడలో బకాయిలు చెల్లించాలంటూ విద్యుత్‌శాఖ సిబ్బంది బిల్లులు జారీ చేయడంతో స్థానికులు ఇటీవల నిరసనగా దిగారు. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ఏడాది జనవరి వరకు 15,29,017 ఎస్సీ కుటుంబాలకు ఉచిత విద్యుత్తుతో రూ.2,361.95 కోట్ల మేర లబ్ధి చేకూరగా 4,57,586 ఎస్టీ కుటుంబాలకు రూ.483.95 కోట్ల మేర ప్రయోజనం కలిగింది. మొత్తం 19,86,603 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.2,845.90 కోట్ల మేర ఉచిత విద్యుత్తు ద్వారా మేలు చేశారు.‘‘ఈ చిత్రంలో కనిపిస్తున్న బి.శివాజీ. విజయవాడలోని కానూరులో ఉంటారు. ఆయన ప్రతి నెలా దాదాపు రూ.600 విద్యుత్ బిల్లు చెల్లిస్తుండగా ఈ నెల రూ.813 బిల్లు వచ్చింది. దాదాపు 35 శాతం అదనంగా చార్జీలు పడటంతో శివాజీ గగ్గోలు పెడుతున్నాడు. ఇంత భారం మోపితే కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టంగా ఉంటుందని ఆందోళన చెందుతున్నాడు. పాలకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా అడిగేవారే లేరా? అని నిస్సహాయంగా ప్రశ్నిస్తున్నాడు.విజయవాడలోని ప్రసాదంపాడుకు చెందిన ఏ.సహిల్‌కు ఈ నెల (నవంబర్ వినియోగం)రూ.1,321 బిల్లు వచ్చింది. గత నెల ఇదే సర్వీసుకు ఆయన చెల్లించిన బిల్లు రూ.861 మాత్రమే. అంటే ఈ నెల బిల్లులో ఏకంగా 53 శాతం అదనంగా భారం పడింది. -
డైలాగులకూ చేతలకూ పొంతనుండొద్దా?
‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాలో హీరో సాక్షాత్తు ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఇందులో ఆఖరులో కొన్ని డైలాగ్స్ చెబుతారు. అవి ఇప్పటి పరిస్థితులకు అతికినట్లు ఉంటాయనడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. ‘రేయి నిన్నే... వాడు నీ తల మీద ఎక్కి కూర్చుంటే... పెట్రోల్ రేటు పెరిగిపోద్ది. కంది పప్పు పెరిగిపోతుంది. పిల్లల స్కూల్ ఫీజులు పెరిగి పోతాయి. బస్సు చార్జీలు పెరిగిపోతాయి. ఇవి నీకు ఓకేనా. టైం లేదా నీకు. కొత్త సినిమా రిలీజైతే తెల్లవారు జామున ఐదు గంటలకల్లా క్యూలో నిలుచుంటావే. నీకిష్టమైన హీరో సినిమా పది, ఇరవై సార్లు చూస్తావ్. దానికి టైం ఉంటుంది. ఒక్క మ్యాట్నీ వదిలేసి రా ఒక పనైపోద్ది. నీకు హీరో కావాలా? నువ్వు హీరోవి కాదా? నీ ఇంటికి నువ్వే కదరా హీరో! మరి ఇంటి కోసం నువ్వేం చేస్తు న్నావు? మనిద్దరం కలిసి వెళ్తున్నాం. వస్తున్నావా లేదా? పోరాడితే పోయేదేమీ లేదు రా ఎదవ బానిస సంకెళ్లు తప్ప. రా... రా... వెయిట్ చేస్తున్నా రా...’ సినిమాలో గొంతు పెద్దది. ఈ డైలాగ్స్ పలి కిన పవన్ నిజ జీవితంలో అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయి. అధికార పార్టీ ప్రజా సంక్షేమం, అభివృద్ధిని మరిచిపోయి ప్రతి పక్షంపై దాడులకు పూనుకున్న విషయం తెలిసిందే. నడిరోడ్డుపై హత్యలు జరిగాయి. ఇక దౌర్జన్యాలకైతే లెక్కే లేదు. ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టానని ఎన్నోసార్లు ప్రకటించిన పవన్ వీటిని ఖండించ లేదు. తన సినిమాలో మాత్రం రా కదలి రా... ప్రశ్ని ద్దామని కన్నెర్ర చేశారు.సినిమా కోసం రైటర్ ఇచ్చిన డైలాగులను బట్టీపట్టి పవన్ సినిమాలో చెప్పారు. కానీ అవి భవిష్యత్ సంకేతాలుగా నిలిచాయి. చంద్రబాబు గద్దె నెక్కాక ప్రజల జీవనయానంపై తీవ్ర ప్రభావం పడింది. ఎన్నికల సమయంలో చెప్పినట్టుగా నిత్యా వసరాల ధరలు తగ్గకపోగా ఆకాశన్నంటుతున్నాయి. మద్యం షాపులపై పెట్టిన శ్రద్ధ బడి పిల్లలపై చూప లేదు. యథేచ్ఛగా ప్రకృతి సంపదను కొల్లగొడు తున్నారు. సంక్షేమ పథకాలకు ఫుల్స్టాప్ పడి పోయింది. భారత రాజ్యాంగం స్థానంలో నేడు ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందనేది మెజారిటీ ప్రజానీకం అభిప్రాయం.నేడు కొత్త సినిమా టికెట్ల కోసం లైన్లు తగ్గిపోయాయి. ఆన్లైన్లో బుక్ చేసుకుని ఆ టైంకి వెళ్లిపోతున్నారు. ఓటీటీ పుణ్యాన మార్పులు శర వేగంగా వచ్చాయి. ఇప్పుడు వేరే లైన్లు ఉన్నాయి. వలంటీర్లు లేకపోవడంతో పింఛన్ లబ్ధిదారులూ, రేషన్ కోసం మహిళలూ గంటల తరబడి వేచి ఉంటున్నారు. తాను స్వయంగా చెప్పిన డైలాగులను పవన్ మరిచిపోయినట్లున్నారు. పోరాడితే పోయే దేమీ లేదు... ఎదవ బానిస సంకెళ్లు తప్ప అని భావించిన చాలామంది రియల్ హీరోలు ప్రశ్నించాలంటే మ్యాట్నీలు వదలాల్సిన అవసరం లేదు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలనుకున్నారు. ఏ మాత్రం వెనకడుగు వేయకుండా సోషల్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఇంకేముంది రెడ్ బుక్ రాజ్యాంగం మేరకు శిక్షలు మొదలయ్యాయి. ఈ అన్యాయాలను ప్రశ్నించాల్సిన పవన్ మాత్రం నేను సినిమాల్లో మాత్రమే హీరోనని తల పక్కకి తిప్పేశారు. పోరాటానికి ప్రతి ఇంటి నుంచి ఒకరు రావాలని కోరుకున్న వ్యక్తి అది నిజంగా జరగడాన్ని ఊహించలేదా? లేక తట్టుకోలేకోయారా? తనకు అధికారం ముఖ్యం కాదని గతంలో ఓ సందర్భంలో చెప్పినట్లు గుర్తు. అయితే ఇప్పుడు ఆ పవర్ ముఖ్యం కావడంతో నోరు కుట్టేసుకున్నారని సమాజం భావిస్తోంది.పవన్ కాకినాడ పోర్టుకెళ్లి స్టైల్‌గా ‘సీజ్ ద షిప్’ అనడం... ఆయన అభిమానులు సోషల్ మీడియాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో పోస్టులు పెట్టి సంబర పడిపోవడం చకచకా జరిగాయి. అసలు డిప్యూటీ సీఎం అనాల్సిన మాట వేరే ఉంది. ఆరు నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై ‘కదలిరండి.. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించండి’ అనుంటే హాల్లో వినిపించిన చప్పట్ల సౌండ్ నిజ జీవితంలో మరింత గట్టిగా వచ్చేది. కానీ పవన్ సినిమాటిక్‌గానే వ్యవహరించి డిప్యూటీ సీఎం అనేది చంద్రబాబు దర్శకత్వంలో చేస్తున్న ఒక పాత్ర మాత్రమేనని చెప్పకనే చెప్పారు.– వెంకట్ -
ప్రజల వ్యక్తిగత సమాచారం జనసేన చేతికి ఎలా వెళ్లింది?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో భారీ డేటా ఉల్లంఘన జరుగుతోందని వైఎస్సార్సీపీ ఆందోళన వ్యక్తం చేసింది. బుధవారం పార్టీ ‘ఎక్స్’ ఖాతాలో ఈ మేరకు పోస్టు చేసింది. ప్రభుత్వం వద్ద ఉండాల్సిన రహస్య సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే కాకుండా.. ఆ డేటాను అడ్డంపెట్టుకొని సామాన్య పౌరులను జనసేన కార్యకర్తలు వేధిస్తున్నారని ఆరోపించింది. ఇది పాలనా పతనాన్ని బట్టబయలు చేస్తోందని పేర్కొంది. కూటమి ప్రభుత్వ ఒత్తిళ్లతో పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల రాష్ట్రంలో రాజకీయ గూండాయిజం రాజ్యమేలుతోందని, ఫలితంగా ప్రజల భద్రత ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజలకు రక్షణ కల్పిస్తామని చెబుతున్న జనసేన పార్టీ నాయకత్వం రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. ప్రజల సున్నితమైన డేటా నిమిషాల్లోనే జనసేన కార్యకర్తలకు ఎలా చేరుతోందని ప్రశ్నించింది. పోలీసులు, కూటమి కార్యకర్తలు కుమ్మక్కై పని చేస్తున్నారా లేక పోలీసులే తమ వద్ద ఉండాల్సిన పరికరాలను వారి చేతికే ఇచ్చేసి వాడుకోమని చెప్పారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయని పేర్కొంది. డేటా ఉల్లంఘన విషయంలో పరిశోధించడానికి పోలీసులను జవాబుదారీగా ఉంచడానికి, బెదిరింపులను అరికట్టడానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. -
ప్రజల గొంతుకగా ప్రశ్నిద్దాం: వైఎస్ జగన్
కేవలం ఆరు నెలల్లోనే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పనితీరుపై ప్రజలు కోపంతో రగిలిపోతున్నారు. ఓ వైపు ఎక్కడ చూసినా అక్రమాలు, కమీషన్లు, మామూళ్ల గోల. పరిశ్రమ నడుపుకోవాలన్నా, వ్యాపారాలు చేయాలన్నా కప్పం కట్టాల్సిందే. వేలం పాటలుపెట్టి ఊరూరా బెల్ట్ షాపులు కేటాయిస్తున్నారు. అన్నింటికీ నీకింత.. నాకింత అని పంచుకుంటున్నారు. ఎమ్మెల్యే మొదలు సీఎం వరకు వాటాలు. ఇంకో వైపు సంక్షేమ పథకాలన్నీ పడకేశాయి. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. ఆరోగ్యశ్రీ నిర్వీర్యమైపోతోంది. భరోసా ఇచ్చే వారు లేక అన్నదాతలు విలవిల్లాడిపోతున్నారు. విద్యుత్ చార్జీల షాక్‌లతో ప్రజలకు దిక్కుతోచడం లేదు. ఈ పరిస్థితిలో బాధిత వర్గ ప్రజల తరఫున నిలబడాల్సింది మనమే. వారి గొంతుకగా నిలిచి ఈ దుర్మార్గ ప్రభుత్వంపై పోరాడుదాం.– పార్టీ శ్రేణులతో వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: రాష్ట్రంలో సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీలను తుంగలో తొక్కి.. అన్ని వర్గాలనూ దగా చేస్తున్న చంద్రబాబునాయుడి ప్రభుత్వంపై ఆరు నెలల్లోనే ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత పెల్లుబుకుతోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. కనీస మద్దతు ధర దక్కక రైతులు.. ఫీజు రీయింబర్స్మెంట్ అందక విద్యార్థులు.. కరెంటు ఛార్జీల బాదుడుతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ మోసాలు, అక్రమాలు, వైఫల్యాలపై ప్రశ్నించే స్వరం వినిపించకూడదనే దురాలోచనలతో అక్రమ కేసులు పెడుతూ అరాచక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. సమస్యల్లో ఉన్న ప్రజలకు అండగా నిలబడి, వారి తరఫున కూటమి ప్రభుత్వంపై పోరాటం చేయాలని ఆ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించి.. ప్రజల పక్షాన కూటమి ప్రభుత్వంపై పోరాటం చేయడానికి కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేశారు. పార్టీని మరింతగా బలోపేతం చేయడంలో భాగంగా చేపట్టాల్సిన చర్యలపై నేతలకు మార్గ నిర్దేశం చేశారు. ‘చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలైంది. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఎప్పూడూ చూడని విధంగా విపరీతమైన వ్యతిరేకత కనిపిస్తోంది. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ఇంతటి వ్యతిరేకత ఎక్కడా చూడలేదు. ఎన్నికలప్పుడు చెప్పిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ వాగ్దానాలు గాలికెగిరిపోయాయి. వాటిని పక్కన పెట్టి మిగిలినవి చూస్తే.. చెప్పిన అబద్ధాలు, చేసిన మోసాలు ప్రజల్లో కోపం కింద మారి ఎక్కడికక్కడ వారు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. మరోవైపు రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నీరు గారిపోయాయి. నానాటికీ వ్యవస్థలన్నీ దిగజారిపోతున్నాయి’ అని చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ప్రజల సమస్యలపై పోరాటం చేయాలని నేతలకు దిశానిర్దేశం చేస్తున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ అందడం లేదు ⇒ ఫీజు రీయింబర్స్మెంట్ చూస్తే.. మన ప్రభుత్వ హయాంలో ప్రతి క్వార్టర్ (మూడు నెలలు) అయిపోయిన వెంటనే అంటే.. జనవరి, ఫిబ్రవరి, మార్చి ముగిసిన వెంటనే ఏప్రిల్‌లో వెరిఫికేషన్ చేసి మే నెలలో విడుదల చేసే వాళ్లం. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్‌లో ఇవ్వాల్సిన ఆ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు సరి కదా.. ఏకంగా మూడు త్రైమాసికాల సొమ్ము పెండింగ్‌లో పెట్టారు. ⇒ ఈ డిసెంబర్ గడిస్తే నాలుగు క్వార్టర్లు ఇవ్వని పరిస్థితి. జనవరి వస్తే ఏకంగా రూ.2,800 కోట్లు విద్యా దీవెన బకాయిలు పిల్లలకు ఇవ్వాల్సి ఉంటుంది. వసతి దీవెనకు సంబంధించి రూ.1,100 కోట్లు పెండింగ్ ఉంది. మొత్తంగా రూ.3,900 కోట్లు పెండింగ్ పెట్టారు. మరో వైపు ఫీజులు కడితే తప్ప కాలేజీలకు రావొద్దని పిల్లలకు యాజమాన్యాలు చెబుతున్నాయి. దీంతో పిల్లలు చదువులు మానేసి పనులకు వెళ్తున్నారు.ఆరోగ్యశ్రీకి అనారోగ్యం ఆరోగ్య శ్రీ బకాయిలు కూడా అలాగే ఉన్నాయి. మార్చి నుంచి ఇంత వరకు నెట్వర్క్ ఆస్పత్రులకు సంబంధించిన బకాయిలు ఇవ్వలేదు. మార్చి నుంచి నవంబరు వరకు దాదాపు 9 నెలలకు సుమారు రూ.2,400 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. నెట్వర్క్ ఆస్పత్రులు గొడవ చేస్తే ఏదో రూ.200 కోట్లు ఇచ్చారు. పేషంట్లు ఆస్పత్రులకు వెళ్తే ఉచితంగా వైద్యం అందే పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీ పూర్తిగా నీరుగారిపోతోంది. ఇంకా 108, 104 ఉద్యోగులకు సంబంధించి నాలుగు నెలల జీతాలు పెండింగ్. వాళ్లు సర్వీసు అందించే పరిస్థితి లేదు. ధాన్యం సేకరణ.. మద్దతు ధర లేదు ⇒ ఏ జిల్లాలో కూడా రైతులకు ధాన్యం సేకరణలో కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ) లభించడం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ–క్రాప్ చేసి, ఆర్బీకేల ఆధ్వర్యంలో కొనుగోలు చేసే వాళ్లం. ప్రతి రైతుకూ కనీస మద్దతు ధర వచ్చేది. ఇదొక్కటే కాకుండా జీఎల్టీ (గన్నీ బ్యాగ్స్, లేబర్, ట్రాన్స్పోర్ట్) ఛార్జీలు కూడా చెల్లించే వాళ్లం. జీఎల్టీ కింద ప్రతి రైతుకు, ప్రతి ఎకరాకు అదనంగా రూ.10 వేలు వచ్చే పరిస్థితి ఉండేది.⇒ ఇవాళ రైతులకు కనీస మద్దతు ధర కూడా అందడం లేదు. 75 కేజీల బస్తా కనీస మద్దతు ధర రూ.1,725 అయితే ఆ ధర ఎక్కడా ఇవ్వడం లేదు. కావాలనే ధాన్యం కొనుగోలు చేసే కార్యక్రమం నిలిపివేశారు. గత్యంతరం లేక రైతులు దళారులు, రైస్ మిల్లర్లకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్లు రైతుల నుంచి రూ.300 నుంచి రూ.400 తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. ధాన్యం సేకరణ చాలా అన్యాయమైన పరిస్థితుల్లో జరుగుతోంది. మరోవైపు వర్షాలతో రైతులు పూర్తిగా దెబ్బతిని కుదేలవుతున్నారు. ధాన్యం రంగు మారుతోంది. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.కరెంటు ఛార్జీలు బాదుడే బాదుడు ⇒ కరెంటుకు సంబంధించి ఇప్పటికే రూ.6 వేల కోట్ల బాదుడు మొదలైంది. మరో రూ.9 వేల కోట్ల బాదుడు వచ్చే నెల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ స్థాయిలో రూ.15 వేల కోట్ల బాదుడు కార్యక్రమాన్ని భారతదేశ చరిత్రలో చంద్రబాబు తప్ప మరెవ్వరూ చేసి ఉండరు. ఆరు నెలల్లోనే ఎవరూ రోడ్డు మీదకు రాకూడని, ఎవరూ నిరసన వ్యక్తం చేయకూడదని తప్పుడు కేసులు పెడుతున్నారు. సోషల్ మీడియా కార్యకర్తలు, ఎమ్మెల్యే అభ్యర్థుల మీద కూడా తప్పుడు కేసులు పెడుతున్నారు. ⇒ కేసులు మ్యానుఫ్యాక్చర్ చేసి, ఎవిడెన్సెస్ మ్యానుఫ్యాక్చర్ చేసి ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఎప్పుడూ జరగలేదు. రాష్ట్రమంతా భయాందోళన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఆయన చేస్తున్న బాదుడు కార్యక్రమాన్ని నిరసిస్తూ ఎవరూ రోడ్డు మీదకు రాకూడదని ఇలా చేస్తున్నారు. ఎవరైనా ఆందోళన చేయాలనుకుంటే కేసులు పెడతారేమోనని భయపడే పరిస్థితులు కల్పిస్తూ పోలీసులను ఉపయోగించుకున్నారు. అవినీతి విచ్చలవిడిగా సాగుతోంది. రెడ్‌బుక్ రాజ్యాంగం యథేచ్ఛగా నడుస్తోంది.ఇసుక, మద్యం మాఫియా ⇒ అధికారంలోకి వస్తే ఇసుక ఉచితంగా ఇస్తామన్నారు. కానీ, దాన్ని అమలు చేయడం లేదు. ఇప్పుడు ప్రభుత్వానికి పైసా ఆదాయం రాకపోగా, మన ప్రభుత్వం కంటే డబుల్ రేట్లకు ఇసుక అమ్ముతున్నారు. నీకింత.. నాకింత అని.. చంద్రబాబు, లోకేష్ మొదలు ఎమ్మెల్యేల వరకు పంచుకుంటున్నారు. గతంలో ప్రభుత్వం నడిపిన మద్యం షాపులను పూర్తిగా ఎత్తివేశారు. మొత్తం షాపులన్నింటినీ చంద్రబాబు, ఆయన మనుషులు చేతిలోకి తీసుకున్నారు. దాని కోసం కిడ్నాప్లతో పాటు, పోలీసుల ద్వారా బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. లాటరీలో ఎవరికైనా షాపులు వస్తే వారి దగ్గర నుంచి బలవంతంగా రాయించుకున్నారు. పైగా గ్రామంలో వీళ్లే వేలం పాటలు పెట్టి బెల్ట్‌షాప్‌లు కేటాస్తున్నారు. ⇒ ఈ రోజు బెల్ట్‌షాప్‌లు లేని వీధి, గ్రామం లేదు. ఒక్కో బెల్ట్‌షాప్‌కు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వేలం పాట పెడుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. ఏ నియోజకవర్గంలో పరిశ్రమ నడుపుకోవాలన్నా, మైనింగ్ యాక్టివిటీ జరగాలన్నా, ఏది కావాలన్నా ఎమ్మెల్యేకు ఇంత.. కడితే తప్ప జరిగే పరిస్థితి లేదు. ప్రతి దానికీ కమీషన్లు ఇచ్చుకోవాల్సిందే. మాఫియా సామ్రాజ్యాన్ని నడుపుతున్నారు. ఎమ్మెల్యేలకు ఇంత, చంద్రబాబుకు ఇంత అని చెల్లించుకోవాల్సిందే. రౌడీ మామూళ్ల కోసం కూడా గొడవలు జరుగుతున్నాయి. నెల్లూరులో ఏకంగా క్వార్ట్జ్ గనులు కొట్టేయడానికి పక్కా ప్లాన్ చేశారు. ప్రజల పక్షాన నిలబడదాం.. వారి గొంతుక వినిపిద్దాం ⇒ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో కోపం ఈరోజు తీవ్ర స్ధాయిలో కనిపిస్తోంది. మనం కూడా ప్రజల తరఫున గళం విప్పాల్సిన సమయం వచ్చింది. అనుకున్న దానికంటే ముందుగానే ఆ సమయం వచ్చింది. మామూలుగా ఏడాది వరకు వేచి చూసే పరిస్థితి నుంచి.. ఆరు నెలలకే అలాంటి పరిస్థితి తలెత్తింది.⇒ కరెంటు ఛార్జీల పెంపు, ధాన్యం సేకరణలో దళారీల రాజ్యం, మద్దతు ధర దక్కక పోవడం, ఫీజు రీయింబర్స్మెంట్ అంశాలు ప్రజలను ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నాయి. మీ మీ నియోజకవర్గాల్లో జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే అభ్యర్థులు, సమన్వయకర్తలతో కలిసి వారిని ఇన్వాల్వ్ చేస్తూ, కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకు అవసరం అయినప్పుడు మనం వారి తరఫున నిలబడాలి. వారి పక్షాన పోరాడాలి. అటువైపు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నప్పుడు మనం వారికి దగ్గరగా ఉంటూ వారి తరఫున పోరాటం చేయాలి. వారి తరఫున నిలబడాలి. ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి ఇది కచ్చితంగా చేయాలి.సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటనసంక్రాంతి తర్వాత నా జిల్లాల పర్యటన కార్యక్రమం మొదలవుతుంది. ప్రతి బుధ, గురువారాల్లో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశం అవుతాను. ‘జగనన్న.. పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం’ పేరుతో నేను పర్యటిస్తాను. నా పర్యటన వచ్చేసరికి మీరు జిల్లా, నియోజకవర్గ, మండల కమిటీల నియామకాలు పూర్తి చేయాలి. ప్రతి కార్యకర్తకు ఫేస్ బుక్, ఎక్స్ (ట్విట్టర్), యూట్యూబ్ అకౌంట్ ఉండాలి. జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి కార్యకర్త ప్రశ్నించాలి. అప్పుడే గ్రామ స్థాయిలో తెలుస్తుంది. మా ఆస్పత్రులు ఎందుకు ఇలా ఉన్నాయి? మా స్కూళ్లు ఎందుకు ఇలా ఉన్నాయి? మా ధాన్యాన్ని ఎందుకు కనీస మద్ధతు ధరకు అమ్ముకోలేకపోతున్నాం.. అని ప్రశ్నించాలి. రాబోయే రెండున్నరేళ్లు మనం, మన పార్టీని మరింత బలోపేతం చేయాలి. ఆప్పుడే మనం చేయబోయే పోరాటాలకు మద్దతు బలంగా ఉంటుంది. ఇదంతా పక్కాగా జరగాలంటే జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న పార్టీ కమిటీల నియామకాలను త్వరితగతిన పూర్తి చేయాలి.మూడు ప్రధాన అంశాలపై కార్యాచరణప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి ముఖ్యంగా మూడు ప్రధానమైన అంశాలు.. రైతుల ఇబ్బందులు, కరెంటు ఛార్జీల బాదుడే బాదుడు, ఫీజులు కట్టలేని పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యల మీద వైఎస్సార్సీపీ ఉద్యమ బాట పట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.ఈ నెల 11న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టర్ల కార్యాలయాల వద్ద రైతులకు సంబంధించి ధాన్యం సేకరణలో జరుగుతున్న అన్యాయంపై నిలదీయాలి. ధాన్యం సేకరణలో వారికి కనీస మద్ధతు ధర కల్పించాలని డిమాండ్ చేయాలి. పెట్టుబడి సాయం కింద ఇస్తామన్న రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయాలి. ఇప్పటి వరకు రైతులకు అందుతున్న ఉచిత పంటల బీమాను వర్తింప చేయాలని కూడా డిమాండ్ చేయాలి. రైతులతో కలిసి ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్లకు వినతిపత్రం ఇవ్వాలి.చంద్రబాబు ప్రభుత్వ కరెంటు ఛార్జీల బాదుడే బాదుడు కార్యక్రమానికి నిరసనగా డిసెంబర్ 27న ఆందోళన చేపట్టాలి. ఎన్నికలప్పుడు తాను కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని ఇచ్చిన హామీని విస్మరించిన నేపథ్యంలో పెంచిన కరెంటు ఛార్జీలు, జనవరిలో పెంచబోయే కరెంటు ఛార్జీలు కూడా తగ్గించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే రూ.6 వేల కోట్ల బాదుడుతో పాటు, రానున్న నెలలో మరో రూ.9 వేల కోట్ల ఛార్జీల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లాల్లో ఎస్ఈ, సీఎండీ కార్యాలయాల వద్ద ప్రజల తరపున నిరసన తెలపాలి. ప్రజలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి.. పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించమని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వినతి పత్రం అందజేయాలి.జనవరి 3న అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల వద్ద ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆందోళన చేపట్టబోతున్నాం. పిల్లలకు అందించాల్సిన పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన.. మొత్తంగా దాదాపు రూ.3,900 కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేయాలి. ఇప్పటి వరకు ఏడాదిగా అంటే నాలుగు త్రైమాసికాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఫీజులు చెల్లించాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. చదువుకుంటున్న పిల్లలకు తోడుగా నిలబడే కార్యక్రమంలో భాగంగా పిల్లలతో కలిసి కలెక్టర్ల కార్యాలయాలకు వెళ్లి, వినతిపత్రాలు సమర్పించి, డిమాండ్ చేయాలి.ఈ మూడు సమస్యలతో పాటు సూపర్ సిక్స్ హామీల అమలుకు డిమాండ్ చేద్దాం. -
ఎస్సీ, ఎస్టీలకు ‘షాక్’ ఉచిత విద్యుత్ కట్
నెల రోజులుగా చీకట్లోనే.. 200 యూనిట్లు లోపు విద్యుత్ వినియోగిస్తున్న మా ఇంటికి గత ప్రభుత్వంలో ఫ్రీగా కరెంట్ ఇచ్చారు. ఇప్పుడు సబ్సిడీ లేదని, పాత బకాయిలు రూ.22 వేలు చెల్లించాలంటూ కనెక్షన్ తొలగించారు. నెల రోజులకుపైగా చీకట్లోనే మగ్గుతున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చాకే మాకీ దుస్థితి దాపురించింది. – కొల్లి విమల, రెడ్డిగణపవరంఅన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం రాఘవరాజపురం దళితవాడలో నివసించే రోజువారీ కూలీ బంటుపల్లి మధు నివసిస్తున్న ఇంటికి రూ.35 వేలు కరెంట్ బిల్లు రావడంతో షాక్ తిన్నాడు. రోజంతా కష్టపడితే వచ్చే ఐదారొందలు ఇంటి ఖర్చులు, పిల్లల చదువులకే సరిపోవడం లేదు. ప్రభుత్వం ఇంత డబ్బు కట్టమంటే ఎక్కడి నుంచి తేవాలని మధు వాపోతున్నాడు.ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం రెడ్డి గణపవరంకి చెందిన గిరిజనులు కాక వెంకమ్మ, మారెయ్యలకు ఏ నెలలోనూ 200 యూనిట్లు దాటి కరెంట్ బిల్లు రాలేదు. రూ.40 వేలు పాత బకాయిలుగా చూపిస్తూ అక్టోబర్ నెలాఖరున అధికారులు వారి కరెంట్ కనెక్షన్ తొలగించారు. అప్పు చేసి ఆ మొత్తాన్ని చెల్లించి నాలుగు రోజులపాటు తిరిగితే ఎట్టకేలకు కనెక్షన్ ఇచ్చారు. నాలుగు రోజుల క్రితం మరోసారి వచ్చిన విద్యుత్తు సిబ్బంది మరో రూ.22 వేలు బకాయిలున్నాయని, అవి కూడా చెల్లించకుంటే కనెక్షన్ తొలగిస్తామని హెచ్చరిస్తున్నారు.సాక్షి, అమరావతి: ఉచిత విద్యుత్‌పై కూటమి సర్కారు మోసంతో రాష్ట్రవ్యాప్తంగా దళిత, గిరిజన నివాసాల్లో చీకట్లు కమ్ముకుంటున్నాయి. గత ప్రభుత్వం ఉచితంగా అందించిన విద్యుత్‌ను కూడా పాత బకాయిలుగా చూపిస్తూ ఎస్సీ, ఎస్టీల నుంచి బలవంతపు వసూళ్లకు దిగుతోంది. రూ.లక్షలు.. వేలల్లో బకాయిలు చెల్లించాలంటూ ఆదేశిస్తోంది. అంత డబ్బు కట్టలేని పేదల కరెంట్ కనెక్షన్లను విద్యుత్ సిబ్బంది నిర్దాక్షిణ్యంగా కట్ చేస్తూ మీటర్లను తొలగిస్తున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం, కొయ్యలగూడెం మండలాల్లో పలు గ్రామాల్లో గిరిజన, దళితులకు చెందిన విద్యుత్ కనెక్షన్లను అధికారులు కట్ చేశారు. పుట్లగట్లగూడెం, మైసన్నగూడెం, రెడ్డిగణపవరం, పాలకుంట, వీరభద్రపురం లాంటి గిరిజన గూడేలు, దళితపేటలు అంధకారంలో మగ్గిపోతున్నాయి. దాదాపు 250 కుటుంబాలు నివసించే అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం రాఘవరాజపురం దళితవాడలో బకాయిలు చెల్లించాలంటూ విద్యుత్‌శాఖ సిబ్బంది బిల్లులు జారీ చేయడంతో స్థానికులు నిరసనకు దిగారు. పలువురికి రూ.4,000 నుంచి రూ.10,000 వరకు బిల్లులు జారీ అయ్యాయి. ఇంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలంటూ పేదలు ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్ కడప జిల్లా సింహాద్రిపురం మండలం హిమకుంట్ల ఎస్సీ కాలనీలో గత నెలాఖరున విద్యుత్ అధికారులు కనెక్షన్లు తొలగించడంతో ఎస్సీ కాలనీ వాసులు రెండు రోజులపాటు అంధకారంలో మగ్గిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి చొరవ చూపడంతో దళితవాడలో విద్యుత్తు వెలుగులు వచ్చాయి. 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇచ్చిన జగన్ వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ఏడాది జనవరి వరకు 15,29,017 ఎస్సీ కుటుంబాలకు ఉచిత విద్యుత్తుతో రూ.2,361.95 కోట్ల మేర లబ్ధి చేకూరగా 4,57,586 ఎస్టీ కుటుంబాలకు రూ.483.95 కోట్ల మేర ప్రయోజనం కలిగింది. మొత్తం 19,86,603 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.2,845.90 కోట్ల మేర ఉచిత విద్యుత్తు ద్వారా మేలు చేశారు. మీటర్ల తొలగింపు... దళితులు, గిరిజనులు నిబంధనల ప్రకారం నెలకు 200 యూనిట్లలోపు వినియోగించుకున్నప్పటికీ ఉచిత విద్యుత్‌ను అందించకుండా కూటమి ప్రభుత్వం బిల్లులు జారీ చేస్తోంది. 150 యూనిట్లు లోపు వినియోగించుకున్న వారికి సైతం రూ.వేలల్లో పాత బకాయిలు ఉన్నారని బిల్లులు జారీ అవుతున్నాయి. పాత బకాయిల పేరుతో విద్యుత్తు సిబ్బంది కరెంట్ మీటర్లు తొలగించి తీసుకుపోతున్నారు. బకాయిలు చెల్లిస్తేనే విద్యుత్‌ను పునరుద్ధరిస్తామని తేల్చి చెబుతుండటంతో పేదలు తీవ్ర షాక్‌కు గురవుతున్నారు. తాటాకు ఇళ్లు, రేకుల షెడ్లు, ప్రభుత్వ కాలనీల్లో నివసించే వారంతా చీకట్లోనే కాలం గడుపుతున్నారు. ఉచిత విద్యుత్‌పై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, తమకు పైనుంచి ఆదేశాలు వచ్చాయని, బిల్లు కట్టాల్సిందేనంటూ సిబ్బంది పేర్కొంటున్నారు. గ్రామాల్లో ఒత్తిడి చేస్తున్నారు.. కరెంట్ బిల్లులు చెల్లించాలంటూ అధికారులు గ్రామాల్లో తిరుగుతూ ఒత్తిడి చేస్తున్నారు. ఇంట్లో తనిఖీ చేసి కట్టాల్సిందేనని దురుసుగా మాట్లాడారు. మేం ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. – డోలా కాశమ్మ, రాఘవరాజపురం దళితవాడ, అన్నమయ్య జిల్లా గత ఐదేళ్లు అడగలేదు.. గత ఐదేళ్ల పాటు మాకు ఉచిత విద్యుత్తు అందింది. ఎప్పుడూ బిల్లు కట్టమని అడగలేదు. 200 యూనిట్ల లోపే వినియోగిస్తున్నాం. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ బిల్లు కట్టాలంటూ విద్యుత్ సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారు. – కన్నేపల్లి కుమారి, గాందీగ్రామం, చోడవరం, అనకాపల్లి జిల్లా బకాయిలు కడితేనే కనెక్షన్.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాకు ఉచిత విద్యుత్ అందించింది. గతంలో వినియోగించుకున్న ఉచిత విద్యుత్‌ను కూడా ఇప్పుడు బకాయిలుగా చూపిస్తూ బిల్లులు కట్టమంటున్నారు. అక్టోబర్ నెలాఖరున విద్యుత్ కనెక్షన్ తొలగించారు. రూ.15 వేల బకాయిలు కడితేనే కనెక్షన్ ఇస్తామంటూ మీటర్ తీసుకెళ్లిపోయారు. – బల్లే రమాదేవి, రెడ్డిగణపవరం, బుట్టాయగూడెం మండలం. అంధకారంలో అవస్థలు.. పాత బకాయిల పేరుతో కరెంట్ కనెక్షన్లు తొలగించడం దారుణం. బుట్టాయగూడెం, మైసన్నగూడెం, రెడ్డి గణపవరం, వీరభద్రపురం లాంటి ఆరు గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీల ఇళ్లలో కరెంట్ కనెక్షన్లు తొలగించారు. ఒక్కొక్కరు రూ.16 వేల నుంచి రూ.25 వేల వరకు బకాయిలు ఉన్నట్లు చూపిస్తున్నారు. డబ్బులు కట్టలేక నెల రోజులకు పైగా చీకట్లో అవస్థ పడుతున్నారు. దీనిపై డీఈ, విజయవాడలోని ఉన్నతాధికారులకు మొర పెట్టుకున్నా ఆలకించే నాథుడే లేడు. – అందుగుల ఫ్రాన్సిస్, బుట్టాయగూడెం మండల దళిత నేత స్పష్టత ఇవ్వకుంటే ఉద్యమిస్తాం.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దళితులు, గిరిజనులకు నెలకు 200 యూనిట్లు చొప్పున ఉచితంగా విద్యుత్ అందించింది. కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇవ్వకపోగా పాత బకాయిలు చెల్లించాలంటూ దళితులు, గిరిజనులను బెదిరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత విద్యుత్‌ను కట్ చేసింది. దీనిపై విద్యుత్‌శాఖ మంత్రి రవికుమార్, ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌కు వినతిపత్రం అందించాం. ఉచిత విద్యుత్ విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుంటే ఉద్యమిస్తాం. – అండ్ర మాల్యాద్రి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
టీడీపీ కూటమి ప్రభుత్వం ముంచేసింది!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్నదాతలను టీడీపీ కూటమి ప్రభుత్వం ముంచేసింది. తుపాను హెచ్చరికలున్నా ముందుస్తు చర్యలు చేపట్టకుండా వారిని నడిరోడ్డుపై వదిలేసింది. కోసిన పంటను కొనుగోలు చేసే దిక్కులేకపోవడంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. వర్షాలకు కళ్లెదుటే తడిసిపోతున్న ధాన్యాన్ని కాపాడుకోలేక నిస్సహాయ స్థితిలో కుంగిపోతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన తిండి గింజలను అమ్ముకోవడానికి హీనమైన దుస్థితి అనుభవిస్తున్నారు. వాస్తవానికి.. ఈ ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోళ్ల ప్రారంభం నుంచే దళారులు, మిల్లర్ల దందాకు టీడీపీ కూటమి ప్రభుత్వం గేట్లు తెరిచింది. ఫలితంగా గ్రామాల్లో రైతుసేవా కేంద్రాలకు వెళ్లిన కర్షకులకు నిరాశ తప్ప భరోసా దక్కట్లేదు. వర్షాల సాకుతో మద్దతు ధరలో మరింత కోత పెట్టేందుకు వారు కుట్రలు చేస్తున్నా సర్కారు కళ్లుండీ కబోదిలా వ్యవహరిస్తోంది. దీంతో వారు ఆడింది ఆట.. పాడింది పాటగా పరిస్థితి తయారైంది. ఫలితంగా మిల్లర్లు, దళారులు ధాన్యం కొనడం నిలిపేశారు. రైతులు బతిమాలితే నామమాత్రపు ధర ఇచ్చి సరిపెడుతున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడచూసినా ఇలాంటి దోపిడీయే సాక్షాత్కరిస్తోంది. 75 కిలోలకు మద్దతు ధరలో కోత పెట్టడంతో పాటు అదనంగా మరో కేజీ దండుకుంటూ రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. మరోవైపు.. అకాల వర్షానికి ధాన్యాన్ని కాపాడుకోలేక.. రంగు మారుతుందన్న భయంతో.. మొలక వస్తుందన్న దిగులుతో రోడ్లపైనే ధాన్యం రాశుల వద్ద రైతులు పడిగాపులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం క్వింటా సాధారణ రకం ధాన్యానికి రూ.2,300, ఏ–గ్రేడ్‌కు రూ.2,320గా మద్దతు ధర ప్రకటించింది. ఇందులో 75 కిలోల బస్తాకు సాధారణ రకం రూ.1,725, ఏ–గ్రేడ్‌కు రూ.1,740 గిట్టుబాటు ధర ఇవ్వాలి. కానీ, కూటమి ప్రభుత్వంలో రైతు 75 కేజీల బస్తాకు రూ.300 నుంచి రూ.400కి పైగా నష్టపోతున్నాడు. ఇలా ఎకరాకు సుమారు రూ.8 వేల నుంచి రూ.9 వేలకు పైగా మద్దతు ధరను దళారులు, మిల్లర్లు దోచేస్తున్నారు.రైతుకు అన్యాయం జరుగుతోంది..‘‘నేను టీడీపీ కార్యకర్తను. శ్రీకాకుళం డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షుడి (నీటి సంఘాలు)గా పనిచేశా. కిందటేడాది మద్దతు ధరకు తేమ శాతంతో సంబంధం లేకుండా ధాన్యం అమ్ముకున్నాం. ఇప్పుడు రైతుకు అన్యాయం జరుగుతోంది. తేమ శాతం పేరుతో మిల్లర్లు దగా చేస్తున్నారు. నేను 20 ఎకరాలు సొంతంగా వ్యవసాయం చేస్తున్నాను. తొమ్మిది ఎకరాల్లో ‘1061’ రకం సాగుచేశా. ధాన్యాన్ని రూ.1,500 (76 కిలోల బస్తా) అమ్ముకున్నా. ఇక్కడే ఒక బస్తాకు రూ.23 నష్టపోతున్నాను. మరో పదెకరాల్లో ‘1262’ రకాన్ని సాగుచేశా. ఇప్పుడు కోసి ఆరబెట్టా. దీనిని కొనేవాడు లేడు. సంచులు కూడా ఇవ్వట్లేదు. కేవలం రూ.1,400 అయితే కొంటామని బేరగాళ్లు చెబుతున్నారు. అలా అమ్ముకోవడానికి ఇష్టంలేక కాపాడుకోవడానికి నానా యాతన పడుతున్నాను’’.. ..ఇదీ కృష్ణాజిల్లా శ్రీకాకుళం గ్రామానికి చెందిన రైతు దోనేపూడి గోపీకృష్ణ ఆవేదన. రైతుగా తనకు జరుగుతున్న నష్టాన్ని ఆయన వీడియో రూపంలో సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడిస్తు్తన్నారు.మాఫియాకే ‘మద్దతు’!రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం మాఫియాను తలదన్నేలా జరుగుతోంది. పేరుకే ప్రభుత్వం పంటను కొనుగోలు చేస్తున్నట్లు రికార్డుల్లో చూపిస్తోంది. నిజానికి.. ప్రభుత్వమే రైతుల నుంచి పంటను కొనుగోలు చేస్తే పూర్తిగా మేలు జరుగుతుంది. కానీ, పంట కొనుగోలు చేయాలని ప్రభుత్వం దగ్గరకు రైతు వెళ్తే.. ‘సంచుల్లేవు.. కూలీల్లేరు.. ఇప్పుడు కొనలేం’.. అంటూ నిరుత్సాహపరిచే సమాధానాలు ఎదురవుతున్నాయి. పోనీ బయట అమ్ముకుందామంటే మిల్లర్లు, దళారులు మొత్తం సిండికేట్ అయిపోయారు. వారి ఆజ్ఞలేనిదే రైతుకు సంచులు, హమాలీలు వచ్చే పరిస్థితిలేదు. సంచులు వస్తేనే పంటను బస్తాల్లో నింపుకుని తరలించేందుకు వీలుంటుంది. వీటన్నింటివల్ల రైతులు నిస్సహాయ స్థితిలో గతిలేక దళారులు, మిల్లర్లు చెప్పిన రేటుకే పంటను అమ్ముకోవాల్సిన అగత్యం ఏర్పడింది. పైగా తేమ శాతం పేరుతో కోత కూడా విధిస్తున్నారు. దళారులు మాత్రం రైతుల పేరుతోనే ప్రభుత్వానికి విక్రయించి పూర్తి మద్దతు ధరను సొమ్ము చేసుకుంటున్నారు. మరోవైపు.. రైతుసేవా కేంద్రంలో తేమ శాతం సక్రమంగా ఉన్నప్పటికీ పూర్తి మద్దతు ధర వస్తుందన్న గ్యారంటీ లేదు. పక్క జిల్లాల మిల్లులకు తీసుకెళ్లండిఇదిలా ఉంటే.. ఫెంగల్ తుపాను దెబ్బకు కోస్తాలో అకాల వర్షాలు కురిశాయి. ముఖ్యంగా కృష్ణాజిల్లాలోని రైతాంగం కుదేలైంది. కోసిన పంట వర్షానికి తడిసిపోగా.. కోతకొచ్చిన పంట నేలవాలిపోయింది. తుపాను హెచ్చరికలకు వారానికి ముందు కోసిన పంటలను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. విజయవాడ నగర శివారు నుంచి మచిలీపట్నం వరకు జాతీయ రహదారికి ఇరువైపుల సుమారు 60 కిలోమీటర్ల మేర వర్షంలో తడుస్తున్న ధాన్యపు రాశులే దర్శమిస్తున్నాయి. ఇక్కడ యుద్ధప్రాతిపదికన పంటను తరలించి రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ప్రేక్షకపాత్రకు పరిమితమైంది. మరోవైపు. కొన్న అరకొర ధాన్యం కాస్తా మిల్లుల బయట రోజుల తరబడి వాహనాల్లో నానుతోంది. దీంతో రైతులను తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమలోని మిల్లులకు ధాన్యాన్ని తరలించుకోవాలని అధికారులు ఉచిత సలహా ఇస్తున్నారు. వ్యయ ప్రయాసలు కోర్చి అలా తరలించినా అక్కడ అన్‌లోడింగ్‌కు రోజులు తరబడి సమయంపడుతోంది. సుమారు 100 నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిల్లులకు లోడును తీసుకెళ్తే రవాణ ఖర్చు తడిసిమోపుడు అవుతోందని రైతులు వాపోతున్నారు. అక్కడ వెంటనే దిగుమతి చేయకుంటే వాహనానికి వెయిటింగ్ చార్జీలు గుదిబండలా మారుతాయని భయపడుతున్నారు. ఇలా పక్క జిల్లా మిల్లులకు తరలించుకుంటే నష్టం తప్ప పైసా లాభంలేదని వారు పెదవి విరుస్తున్నారు. ఇక కృష్ణాజిల్లాలో ధాన్యం తరలింపునకు ప్రభుత్వం అసలు కాంట్రాక్టరునే నియమించలేదని తెలుస్తోంది. ఫలితంగా రైతులు సొంతంగా లోడును తరలించుకోలేక.. మిల్లరు వాహనం పంపిస్తే.. వాళ్లు చెప్పిన ధరకే పంటను విక్రయించాల్సి వస్తోంది.గతంలో ఎంతో మేలు..గతంలో ప్రభుత్వం గోనె సంచులు, హమాలీలు, రవాణా నిమిత్తం రైతుకు జీఎల్టీ చెల్లించేంది. సొంత వాహనాలున్న రైతులు హాయిగా తమకు ట్యాగ్ చేసిన మిల్లులకు లోడును తీసుకెళ్లే వారు. వాహనాల్లేని రైతుల కోసం ప్రభుత్వం రవాణా సౌకర్యం ఏర్పాటుచేసేది. ఇప్పుడు పరిస్థితి మొత్తం తల్లకిందులైంది. రైతే సొంతంగా మిల్లుకు ధాన్యాన్ని తోలుకుంటే జీఎల్టీ రాకపోగా పూర్తి మద్దతు ధర కూడా దక్కడంలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 39 లక్షల మంది రైతుల నుంచి రూ.68 వేల కోట్ల విలువైన 3.53 కోట్ల టన్నుల ధాన్యాన్ని సంపూర్ణ మద్దతు ధరకు సేకరించారు.‘హాయ్’ అన్నా పలకని ప్రభుత్వం..పౌరసరఫరాల సంస్థలో వాట్సాప్ ద్వారా రైతులు ‘హాయ్’ అని సందేశం పంపి వివరాలు నమోదుచేస్తే గంటల వ్యవధిలోనే ధాన్యం కొనుగోలు చేస్తామంటూ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇటీవల ఆర్భాటంగా ప్రకటించారు. దీనిపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కూడా చేసుకున్నారు. కానీ, రైతులు ‘హాయ్’ అంటుంటే అటు నుంచి కనీస స్పందన కరువైంది. పైగా.. తమ గోడు చెప్పుకునేందుకు టోల్ ఫ్రీ నంబర్‌కు ప్రయత్నించినా ఉలుకూ.. పలుకూ ఉండట్లేదని రైతులు వాపోతున్నారు.11,157 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలుఅత్యధికంగా 10,426 ఎకరాల్లో వరిపంటకే నష్టంఆ తర్వాత వేరుశనగ, అపరాలకు.. అంచనా వేసిన వ్యవసాయశాఖఫెంగల్ తుపాను ప్రభావంతో తిరుపతి, చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో పెద్ద ఎత్తున పంటలకు నష్టం వాటిల్లింది. వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం 11,157 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దీంట్లో 10,426 ఎకరాల్లో వరి పంట ముంపునకు గురైనట్లు గుర్తించారు. 501 ఎకరాల్లో వేరుశనగ, 180 ఎకరాల్లో మినుము, 50 ఎకరాలల్లో కంది, పెసర, మొక్కజొన్న పంటలు ముంపునకు గుర్యయాయి. అత్యధికంగా తిరుపతి జిల్లాలో 9,612 ఎకరాలు, నెల్లూరులో 643 ఎకరాలు, చిత్తూరులో 522 ఎకరాలు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 380 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు.భయమేస్తోంది..నేను కౌలుకు సాగుచేస్తున్నా. 40 ఎకరాల్లో వరి వేశా. ఇప్పుడు 20 ఎకరాల్లో కోత కోశాను. వర్షాలు పడుతుండడంతో పంటను మిల్లులకు తరలించా. ఇంకా 20 ఎకరాల్లో పంట కోతకు సిద్ధంగా ఉంది. రెండ్రోజులుగా తుపానుతో వీస్తున్న గాలులకు పంట నేలవాలింది. ఇంకా వర్షం అధికంగా వస్తుందని చెబుతున్నారు. నేలవాలిన పంటను కోత కోయడానికి ఎకరాకు పదివేల వరకు అడుగుతున్నారు. కనీసం పెట్టుబడి చేతికి రాకపోగా నష్టం వస్తుందేమోనని భయమేస్తోంది. – యనమదల వెంకటేశ్వరరావు, కౌలు రైతు, మద్దూరు, కంకిపాడు మండలం, కృష్ణాజిల్లా కొనేవారు కరువయ్యారు.. ‘1318’ రకం ధాన్యం సాగుచేశాను. ఐదెకరాలకు పైగా పంటను కోశాను. ధాన్యం కొనేందుకు ప్రభుత్వం ముందుకు రావట్లేదు. ఇంతలో వర్షం రావడంతో తడిసిపోయింది. మిల్లర్లు కూడా స్పందించట్లేదు. రైతుసేవా కేంద్రాల దగ్గరకు వెళ్తే సంచులిస్తాం.. లారీలో మండపేటకు తీసుకెళ్లమని చెబుతున్నారు. పచ్చి ధాన్యం సంచుల్లో నింపితే రంగుమారి, మొలకలు వస్తాయి. రూ.1,400కు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా ఎవ్వరూ కొనట్లేదు. – వీరంకి చెన్నకేశవులు, జుజ్జువరం, పామర్రు మండలం, కృష్ణాజిల్లాఅన్ని విధాలా నష్టపోయాం.. పంట కోతకు రావడంతో కోసేశాం. ఇంతలో తుపాను వచ్చింది. వడ్లను ఆరబెట్టుకునేలోగా తడిసిపోయాయి. పంటను తీసుకెళ్లే దారి లేకపోవడంతో రోడ్ల పక్కనే టార్పాలిన్లు కప్పి ఉంచాం. ఆవిరికి రంగుమారి చెడిపోయే ప్రమాదం ఉంది. ఏంచేయాలో దిక్కుతోచట్లేదు. కౌలుకు చేసుకుంటున్న మేం అన్ని విధాలా నష్టపోయాం. – నాంచారమ్మ, జుజ్జువరం, పామర్రు మండలం, కృష్ణాజిల్లాగతంలో ఇలా ఇబ్బంది పడలేదు పండించిన పంటను అమ్ముకోవడానికి నానా అవస్థలు పడుతున్నాం. ప్రభుత్వ అధికారులు సంచులు కూడా ఇవ్వలేదు. వర్షం వస్తోందని తెలిసి మిల్లరు దగ్గరకు వెళ్తే సంచులు ఇచ్చాడు. ఇప్పుడు సరుకు అక్కడికి తీసుకెళ్తేగాని రేటు చెప్పరు. ఇక తేమ ఎక్కువగా ఉంది.. ఆరబెట్టుకోండని రైతుసేవా కేంద్రంలో చెప్పారు. ఈ వర్షాల్లో ధాన్యాన్ని ఎక్కడ ఆరబోసుకుంటాం. ఒక్కరోజు ఆలస్యమైతే రంగుమారి పోతుంది. గతంలో మాకెప్పుడూ ఇబ్బందిలేదు. ఇప్పుడు తక్కువకు అడుగుతున్నారు. మద్దతు ధర రాకపోయినా.. అమ్ముకోక తప్పదు. మద్దతు ధర వచ్చినా రాకపోయినా కౌలు పూర్తిగా చెల్లించాలి కదా?. – పి. వెంకటేశ్వరరావు, రామరాజుపాలెం, గూడూరు మండలం, కృష్ణాజిల్లా -
సర్కారు నిర్వాకంతో తడిసిముద్దయిన ధాన్యం రాశులు.. అన్నదాత అగచాట్లు
బస్తాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది.. ఎకరం 50 సెంట్లలో వరి సాగుచేశా. ఎకరాకు 54 బస్తాల దిగుబడి వచి్చంది. తేమ శాతం ఎక్కువగా ఉందని ఆరబెట్టమన్నారు. రోడ్లపై ఆరబెట్టాను. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే అమ్ముదామని అనుకున్నా. మిల్లర్లకు చేరవేస్తే క్వింటాకు రూ.1,500 ఇస్తామంటున్నారు. ఇప్పుడు బస్తాల్లోకి ఎక్కించిన ధాన్యం కాస్తా ఇలా తడిసి ముద్దయింది. ధర ఎంతొస్తుందో తెలియని పరిస్థితి దాపురించింది. – అంగరాల రాంబాబు, చిట్టిగూడెం, గూడూరు మండలం, కృష్ణాజిల్లాసాక్షి, అమరావతి: ఫెంగల్ తుపాను వస్తుందని నాలుగైదురోజుల క్రితమే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. కోతలు ముమ్మరంగా జరుగుతున్న తరుణంలో బాధ్యతగల ఏ ప్రభుత్వమైనా ఏం చేస్తుంది.. ముందుగా కోసిన పంటను ఆఘమేఘాల మీద కొనుగోలు చేసి రైతులను ఆదుకునేలా చర్యలు చేపడుతుంది. కానీ, నిత్యం సొంత డబ్బా కొట్టుకునే టీడీపీ కూటమి ప్రభుత్వం చేతగానితనంవల్ల కళ్లెదుటే తమ కష్టార్జితం తడిసిముద్దవడంతో అన్నదాతల వేదన అంతాఇంతా కాదు. ఇప్పటికే రెక్కలు ముక్కలు చేసుకుని ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు కనీస మద్దతు ధరలేక రైతులు అల్లాడిపోతుంటే.. ఫెంగల్ తుపాను ప్రభావంతో వారి పరిస్థితి ఇప్పుడు పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది. అలాగే, ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం చేతులెత్తేయడం.. తమ కష్టార్జితాన్ని దళారీలు సొమ్ము చేసుకుంటుండడంతో వారు క్వింటాకు రూ.500కు పైగా నష్టపోతున్నారు. ఇదిలా ఉంటే.. తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు కళ్లాల మీద ఉన్న వరిచేలు నేలకొరుగుతుంటే.. కోసిన పంట తడిసి ముద్దవుతోంది. కనీసం నష్టానికి తెగనమ్ముకుందామన్నా కూడా కొనే నాథుడు కన్పిచక రైతులు అన్నిరకాలుగా దగాకు గురవుతున్నారు. ఫెంగల్ కలవరంతో రైతులు పడరాని పాట్లు.. ప్రస్తుతం పంట చేతికొచ్చే సమయంలో విరుచుకుపడుతున్న ఫెంగల్ తుపాను రైతులను మరింత కలవరపెడుతోంది. ఉభయగోదావరి జిల్లాల్లో మాత్రమే 60–70 శాతం కోతలు పూర్తయ్యాయి. కొన్ని జిల్లాల్లో 20–40 శాతం కోతలు పూర్తికాగా, మెజార్టీ జిల్లాల్లో 15–20 శాతం మాత్రమే కోతలు పూర్తయ్యాయి. కోసిన పంటను కనీసం 3–4 రోజులపాటు ఆరబెడితేగాని తేమ శాతం తగ్గే అవకాశం ఉండదు. దీనికితోడు.. కూలీల కొరత, మరోవైపు సంచుల కొరత తీవ్రంగా ఉంది. అలాగే, తూకం వేయకుండా సంచుల్లో నింపిన ధాన్యాన్ని తరలించే దారిలేక రోడ్ల మీద, పంట పొలాల మీదే ఉంచేసారు. ఈ నేపథ్యంలో.. శనివారం కురిసిన వర్షాలకు ఈ ధాన్యం కాస్తా తడిసి ముద్దవడంతో తేమశాతం పెరగడమే కాక రంగుమారి పోయే పరిస్థితి నెలకొంది. ఈ తేమ శాతం తగ్గితేగానీ కొనుగోలు కేంద్రాల్లో అమ్మే పరిస్థితిలేదు. ఇదే వంకతో గడిచిన మూడ్రోజులుగా ప్రైవేటు వ్యాపారులు సైతం ధాన్యం కొనేందుకు ముందుకు రావడంలేదు. అయినాసరే.. ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లుగా ఉంది. ముఖ్యంగా.. ఉభయ గోదావరి, కాకినాడ, కోనసీమ, కృష్ణా జిల్లాల్లో ఎక్కడికెళ్లినా కోసిన పంట రోడ్లపైన, కళ్లాల్లోనే కన్పిస్తోంది. ఆరబోత కోసం రోడ్లపై వేసిన ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకునేందుకు.. కోసిన ధాన్యంలో తేమ శాతాన్ని తగ్గించుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు.. అధిక శాతం పంట ఇంకా కళ్లాలు, పొలాల్లోనే ఉండడంతో కోసిన పంటను అక్కడే ఆదరాబాదరాగా కుప్పలు పెడుతున్నారు. ఇవి కనీసం నాలుగైదు రోజులు పనల మీదే ఎండాల్సి ఉంది. వాతావరణ మార్పులతో ధాన్యం రంగుమారే ప్రమాదం ఉందని రైతులు బెంబేలెత్తిపోతున్నారు. పీడిస్తున్న టార్పాలిన్ల కొరత.. ఇక టార్పాలిన్ల కొరత కూడా రైతులను పట్టిపీడిస్తోంది. అద్దెకు తెచ్చుకుని కప్పుకుంటున్నారు. అవి కూడా అరకొరగానే దొరుకుతున్నాయి. ఎకరం విస్తీర్ణంలో పండిన ధాన్యానికి కనీసం మూడ్రోజులపాటు ఆరబెట్టుకునేందుకు రూ.వెయ్యి నుంచి రెండువేల వరకు డిమాండ్ చేస్తున్నారు. వర్షాలు మరో నాలుగైదు రోజులు కొనసాగితే అద్దె భారం తడిసి మోపెడవక తప్పని పరిస్థితి. అమ్ముకోవాలంటే మండపేటకు వెళ్లండిఇదిలా ఉంటే.. కృష్ణాజిల్లాలో రైసుమిల్లుల వద్ద ధాన్యం లోడులతో వందలాది లారీలు బారులుతీరాయి. దీంతో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడంలేదు. పైగా.. అమ్ముకోవాలంటే మండపేట మిల్లులకు తరలించుకోవాలని రైతులకు ఉచిత సలహా ఇస్తున్నారు. కృష్ణాజిల్లా నుంచి మండపేట తరలించాలంటే రైతులకు రవాణా చార్జీలు తడిసిమోపెడవుతాయి. ఒకవేళ వ్యయప్రయాసలకోర్చి తరలించినా మండపేట మిల్లుల వద్ద కూడా 3–4 రోజుల పాటు పడిగాపులు పడాల్సిన పరిస్థితులున్నాయని చెబుతున్నారు. జీఎల్టీ చెల్లింపుల ఊసులేదు.. వైఎస్ జగన్ హయాంలో హమాలీల చార్జీలు భరించడంతో పాటు రవాణా సౌకర్యాలను ప్రభుత్వమే సమకూర్చేది. ఒకవేళ రైతే సొంతంగా తరలించుకుంటే గన్నీ, లేబర్, ట్రాన్స్‌పోర్టు (జీఎల్టీ) చార్జీలు నేరుగా రైతుల ఖాతాలో జమచేసేది. కానీ, టీడీపీ కూటమి ప్రభుత్వంలో హామీల చార్జీలు చెల్లించడంగానీ, రవాణా సౌకర్యాలు కల్పించడంగానీ ఎక్కడా జరగడంలేదు. మంత్రి నాదెండ్ల ప్రచారార్భాటం.. విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై 60 కిలోమీటర్ల పొడవునా ఇరువైపులా సర్వీవస్ రోడ్లలో ధాన్యం రాశులే కన్పిస్తున్నాయి. తుపాను హెచ్చరికలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం రాసులు శనివారం కురిసిన వర్షానికి తడిసి ముద్దయ్యాయి. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ వారం జిల్లా పర్యటనలో ప్రచారార్భాటానికి ఇచ్చిన ప్రాధాన్యత ధాన్యం కొనుగోళ్లపై పెట్టలేదని సాక్షాత్తు రైతులే ఆరోపించారు. నిజానికి.. రోడ్లపై ఆరబడిన ధాన్యాన్ని 48 గంటల్లోనే మిల్లులకు తరలిస్తామని మంత్రి ఆర్భాటంగా ప్రకటన చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో ఎక్కడా ఆ పరిస్థితిలేదు. కృష్ణా జిల్లా కంకిపాడు సమీపంలో తడిసిపోయిన వరి పనలు జిల్లాల్లో ఇదీ పరిస్థితి..⇒ ఉత్తరాంధ్రలో విశాఖ, శ్రీకాకుళం, మన్యం జిల్లాల్లో 50–60 శాతం కోతలు పూర్తికాగా, అనకాపల్లి జిల్లాలలో కేవలం 12 శాతం మాత్రమే కోతలు పూర్తయ్యాయి. ఈ జిల్లాల్లో తుపాన్ ప్రభావం పెద్దగా ఉండదని అంచనా వేస్తున్నారు. అయితే, ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిస్తే ధాన్యం రంగుమారి రైతులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందంటున్నారు. ⇒ పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల్లో 60–70 శాతం కోతలు పూర్తయ్యాయి. కళ్లాల్లో లక్ష టన్నులకు పైగా ధాన్యం రాసులు పోసి ఉన్నాయి. దాదాపు లక్ష ఎకరాల పంట పక్వానికి వచ్చి కోతకు సిద్ధంగా ఉంది. ఈ దశలో వర్షాలు కురిస్తే కళ్లాల్లో ఉన్న ధాన్యం రంగుమారడమే కాదు.. వర్షపు నీరు పొలాల్లో చేరి కనీసం 2–3 రోజులుంటే పక్వానికి వచ్చిన పంటకు కూడా తీవ్రనష్టం తప్పదంటున్నారు. ⇒ ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో 30–40 నూరి్పడి చేసిన ధాన్యాన్ని రోడ్లపై ఎక్కడపడితే అక్కడ పోసి ఆరబెట్టుకుంటున్నారు. ఈ డెల్టా పరిధిలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కోతకు వచి్చన వరి పంట నేలవాలింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు మొలకలొచ్చే పరిస్థితులు కని్పస్తున్నాయి. పొలాల్లో వర్షపు నీరుచేరితే నష్ట తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ⇒ గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో వరి పంట కోతకు సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు కేవలం 15 శాతానికి మించి కోతలు పూర్తికాలేదు. కోత కోసి ఓదె మీద ఉన్నప్పుడు వర్షం వస్తే నష్టం ఎక్కువగా ఉంటుందనే ఆలోచనతో యంత్రాలతోనే నూర్పిడికి మొగ్గు చూపుతున్నారు. ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు పడితే తాము నిండా మునిగిపోతామని రైతులు కలవరపడుతున్నారు. ఈ జిల్లాల్లో తీతకు సిద్ధంగా ఉన్న పత్తి, వాగుల వెంబడి ఉన్నా మిరప పంటలు దెబ్బతినే అవకాశం కన్పిస్తోంది. ⇒ నెల్లూరు జిల్లాలో రైతులు ముందస్తు రబీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. జలాశయాల్లో నీరు సమృద్ధిగా ఉండడంతో ఈ జిల్లాల్లో వరి సాగుకు రైతులు ఉత్సాహం చూపుతున్నారు. పెన్నా డెల్టా, కనుపూరు కాలువల కింద వరి నారుమడుల కోసం విత్తనాలు జల్లారు. మరికొన్నిచోట్ల నారుమడులు సిద్ధంచేసుకుంటున్నారు. ఈ దశలో 2–3 రోజులు వర్షాలు కురిసి, పొలాల్లో నీరుచేరితే నష్టపోతామని రైతులు చెబుతున్నారు. ⇒ తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో పంట 45–60 రోజుల దశలో ఉంది. ఈ జిల్లాల్లో కూడా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురిసి చేలల్లో చేరిన నీరు నిలిస్తే మాత్రం నష్టతీవ్రత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. -
అదిగో పులి... ఇదిగో తోక!
జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వ హననం అనే కార్యక్రమం అంటే యెల్లో మీడియాకు ఎంత మక్కువో, ఎంత మమకారమో అందరికీ తెలిసిన విషయమే! ఆయనపై బురద చల్లడానికి సమయం – సందర్భం అనే విచక్షణ కూడా ఉండదు. జగన్ మోహన్ రెడ్డిపై యెల్లో మీడియాది పూనకం పాలసీ. శరభశరభ అంటూ ఊగిపోవడమే. స్వైర కల్పనలతో పేజీల నిండా చెలరేగి పోవడమే. అదానీలు–ఆమెరికా న్యాయశాఖ వివాదంలోనూ దానిది అదే వీరంగం. మోకాలుకూ బోడిగుండుకూ ముడిపెట్టే కథనాలు వండి వార్చుతున్నారు. యెల్లో మీడియా ప్రచురిస్తున్న అబ్సర్డ్ పొయెట్రీని వదిలేసి సంఘటనల కదంబాన్ని మాత్రమే పరిశీలిస్తే కామన్‌సెన్స్‌లో అనేక సందేహాలు తలెత్తుతాయి.సోలార్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) అనేది ఒక కేంద్రప్రభుత్వ సంస్థ. ఈ సంస్థ నుంచి యూనిట్‌కు రూ. 4.50 చొప్పున సౌరవిద్యుత్‌ను కొనుగోలు చేసేటందుకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది. అదే సంస్థతో జగన్ ప్రభుత్వం రూ. 2.49కి యూనిట్ చొప్పున కొనే విధంగా ఒప్పందం చేసుకున్నది. ప్రజాధనం దుబారాను భారీగా అరి కట్టింది. మరి చంద్రబాబు దుబారా ఒప్పందం ఒప్పు ఎట్లయింది? జగన్ పొదుపు తప్పు ఎట్లయింది?సౌర విద్యుత్ ఉత్పాదక సంస్థల నుంచి ‘సెకీ’ కొనుగోలు చేసి, దాన్ని రాష్ట్ర ప్రభుత్వ పంపిణీ సంస్థలకు అమ్ముతుంది. రాష్ట్ర ప్రభుత్వం, దాని పంపిణీ సంస్థలకు, ‘సెకీ’కి నడుమనే ఒప్పందాలుంటాయి. అట్లాగే ఉత్పాదక సంస్థలకూ, ‘సెకీ’కి మధ్యనా వ్యవహారం నడుస్తుంది. ఈ సంస్థలలో అదానీ పవర్ అనేది కూడా ఒకటి. ఉత్పాదక సంస్థలతో ప్రత్యక్ష సంబంధమే లేని రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు అదానీ అనేవాడు లంచాలు ఇవ్వజూపడమేమిటి?‘సెకీ’తో పాటు ప్రైవేట్ ఉత్పత్తిదారుల దగ్గర నుంచి ప్రత్యక్షంగా యూనిట్‌కు రూ. 6.99 పెట్టి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలుగా కొనుగోలు చేసింది. ప్రజాధనాన్ని ప్రైవేట్ సంస్థలకు దోచిపెట్టినందువల్ల కుంభకోణం జరిగితే అప్పుడే జరిగి వుండాలి కదా!జగన్ ప్రభుత్వానికి కుంభకోణం మీద దృష్టి ఉంటే ‘సెకీ’ని పక్కన పెట్టి, నేరుగా అదానీతోనో ఇంకొకడితోనో ఒప్పందం చేసుకొని ప్రజాధనాన్ని ఎక్కువగా కట్టబెట్టి తద్వారా లబ్ధి పొందే అవకాశం ఉన్నది కదా! ఎందుకట్లా చేయలేదు? అటువంటి ఉద్దేశం లేదనే కదా సారాంశం!జగన్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న సమయంలోనే ఇంకో నాలుగు రాష్ట్రాలతో కూడా ‘సెకీ’ ఒప్పందం చేసుకున్నది. తమిళనాడు, ఒడిషా, ఛత్తీస్‌గఢ్, జమ్ము–కశ్మీర్ రాష్ట్రాల అధికా రులకు ఎటువంటి లంచాలు ఇవ్వకుండా ఒక ఏపీ అధికారులకు మాత్రమే ఇవ్వాల్సిన అవసరం అదానీలకు ఎందుకు వస్తుంది? ‘సెకీ’ మధ్యలో ఉండగా రాష్ట్రాల అధికారులతో అదానీల రాయ బేరాలు ఎందుకుంటాయి?ఒకవేళ అటువంటి రాయబేరాలు జరిగే పరిస్థితే ఉత్పన్న మైతే అందుకు బ్రోకరేజి ఎవరు చేసి ఉండాలి? ‘సెకీ’యే కదా! కేంద్రప్రభుత్వ సంస్థ ఇటువంటి లంచాల బ్రోకరేజులు చేస్తుంటే అందుకు వేలెత్తి చూపవలసింది కేంద్రప్రభుత్వ అధినేతనే కదా! మరి యెల్లో మీడియా వేలు అటువైపు ఎందుకు తిరగడం లేదు?ఈ వ్యవహారానికి సంబంధించి మన మీడియా ‘అశ్వత్థామ హతః’ అన్నంత ఉచ్చస్వరంతో జగన్మోహన్ రెడ్డి పేరు చెబుతూ, ‘కుంజరః’ అన్నంత నెమ్మదిగా ఇంకో నాలుగు రాష్ట్రాల పేర్లను చెబుతోంది. ఆ రాష్ట్రాలు తీవ్రంగా ఖండించిన తర్వాత మళ్లీ వాటి ప్రస్తావన కూడా తేవడం లేదు. ఎందు వలన? ఆ సమయంలో జమ్ము–కశ్మీర్ రాష్ట్రం కేంద్రం ఏలు బడిలోనే ఉన్నది. అదానీ లంచాలు ఎవరికి ముట్టినట్టు?ఏపీలో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక వర్గాలు ‘అదిగో పులి’ అనగానే ‘ఇదిగో తోక’ అంటూ పీసీసీ అధ్యక్షురాలు ముందుకు దూకుతున్నారు. ఒప్పందాలు జరిగినప్పుడు ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ముఖ్యమంత్రే అధికారంలో ఉన్నారు. ఆ పులి నిజంగానే ఉంటే ఆ తోకను తాను చూసింది నిజమే అయితే ముందుగా అప్పటి ఛత్తీస్‌గఢ్ పార్టీ నాయకత్వాన్ని సస్పెండ్ చేయాలనీ, కూటమి నుంచి డీఎమ్కేను బయ టకు పంపించాలనీ డిమాండ్ చేయగలరా?అమెరికాలోని సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ)కు ఓ రెండు ఆకాశరామన్న లేఖలు వచ్చాయట. ఆ లేఖల సారాన్ని ఎస్ఈసీ ఫిర్యాదుగా స్వీకరించి న్యాయశాఖకు అందజేసింది. అదానీ ఖాన్దాన్లోని సాగర్ అదానీ టెలిఫోన్ మెసేజీల ఆధారంగా కొనుగోలు ఒప్పందాల కోసం రాష్ట్రాల అధికారులకు లంచాలు ఇచ్చారని ఎఫ్‌బీఐ నేరారోపణ చేసింది. ఇది నేరారోపణ (Indictment) మాత్రమే! నేర నిరూపణ కాదు!! దీనిపై అమెరికా న్యాయశాఖ అదానీ పరివారానికి నోటీసులిచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడా జగన్ మోహన్ రెడ్డి పేరు గానీ, ప్రస్తావన గానీ లేదు. కానీ యెల్లో మీడియా సంస్థలు మాత్రం జగన్ ప్రతిష్ఠకు భంగం కలిగే విధంగా పతాక శీర్షికలు పెట్టాయి. సీరియల్ కథనాలను రాసేస్తున్నాయి. వ్యక్తిత్వ హననానికి ఇంతకంటే పెద్ద ఉదాహ రణ ఉంటుందా?అమెరికాలోని ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు భంగం కలిగే వ్యవహారం ఏ దేశంలో జరిగినా అమెరికా విచారణ జరుపుతుందనీ, అమెరికాలో అటువంటి చట్టాలున్నాయనీ భారత్‌లోని అమెరికా ప్రియులు తన్మయత్వంతో చెబుతున్నారు. కానీ భారత్ ఒక సార్వభౌమాధికారం కలిగిన సర్వసత్తాక గణతంత్ర దేశమనే సంగతిని వారు విస్మరిస్తున్నారు. భారత్‌లో జరిగినట్టు వారు భావిస్తున్న అదానీల అక్రమంపై భారత ప్రభుత్వానికి అమెరికా ఫిర్యాదు చేసి దర్యాప్తు కోరవలసింది. ఈ విషయంలో ఆమెరికా తన పరిధులు దాటి వ్యవహరించిందని భారత విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి కన్వల్ సిబ్బల్ తదితరులు విమర్శిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తన ప్రయోజనాల కోసం ఇలా పరిధులు దాటడం అమెరికాకు అలవాటే.ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సంస్థను ఫక్తు వ్యాపారసంస్థగా మార్చిన చరిత్ర చంద్రబాబుది. సంస్కరణల పేరుతో విద్యుత్ బోర్డును ముక్కలుగా విడగొట్టారు. విద్యుత్ ఛార్జీలను విపరీ తంగా పెంచి, జనంపై మోయలేని భారాన్ని వేశారు. నిరసన తెలియజేయడానికి రోడ్డెక్కిన వారిపై కాల్పులు జరిపి, ముగ్గురి ప్రాణాలను బలిగొన్నారు. నష్టాల్లో ఉన్నాయనే నెపంతో చక్కెర ఫ్యాక్టరీలు వగైరాలను తన మనుషులకు కట్టబెట్టిన చందంగానే జెన్కో ముక్కలను, ట్రాన్స్‌కో ముక్కలను అప్పగించాలని భావించారు. కుంభకోణం చేసే ఆలోచన అంటే ఇది. కానీ చివరకు కథ అడ్డం తిరిగి అప్పగింతల కార్యక్రమం నెరవేరలేదు.కేజీ బేసిన్లో గ్యాస్ నిల్వలు తగినంతగా లేవని నివేదికలు ఉన్నప్పటికీ, గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లతో పీపీఏలు కుదుర్చుకున్నారు. ఒకవేళ ఆ ప్లాంట్లకు తగినంత గ్యాస్‌ను సరఫరా చేయలేకపోతే వాటి ఉత్పత్తి సామర్థ్యంలో 80 శాతం వరకు ప్రభుత్వం అప్పనంగా చెల్లింపులు చేసేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అవినీతి అంటే, స్కామ్ అంటే ఇలాఉంటుంది. ప్రజా ఖజానాపై భారం తగ్గించేలా ఉండదు.వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్తును అందజేయాలన్న ఆలోచనకు ఆయన స్వతహాగా వ్యతిరేకమన్నది జగమెరిగిన సత్యం! ఉచితంగా విద్యుత్తును అందజేస్తే కరెంటు తీగలపై బట్టలారేసుకోవలసి వస్తుందని ఆయన చేసిన వ్యాఖ్యానం సూర్యచంద్రులున్నంత వరకూ మరిచిపోయేది కాదు. ఈ వైఖరి కారణంగానే వ్యవసాయ విద్యుత్‌ను ఆయన నిరుత్సాహ పరుస్తూ వచ్చారు. 2019కి పూర్వం కూడా రైతన్నల విద్యుత్ కష్టాలు చెప్పనలవిగానివి. పేరుకు 7 గంటల విద్యుత్ సరఫరా. కానీ రోజూ రెండు మూడు గంటలు కోత పడేది. రెండు మూడు దఫాలుగా ఇచ్చేవారు. రాత్రి పూట కూడా పడిగాపులు పడాల్సి వచ్చేది.ఆ కొద్దిపాటి సరఫరా కూడా నాణ్యమైనది కాదు. హెచ్‌టీ, ఎల్టీ లైన్లు ఒకే స్తంభంపై ఉండటంతో తరచూ గాలికి అవి కలిసిపోయేవి. ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు కాలిపోయేవి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫీడర్లలో సగం మాత్రమే వ్యవసాయ విద్యుత్ సరఫరాకు అనువుగా ఉండేవి. ఈ వ్యవస్థను మార్చడానికి ఆయన ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రైతాంగంపై దృష్టి పెట్టారు. 1,700 కోట్లు ఖర్చు పెట్టి ఫీడర్లను, లైన్లను ఆధునీకరించి పగటిపూటే 9 గంటల నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాకు రంగం సిద్ధం చేశారు.ఒక్క విద్యుత్రంగంలోనే ఇద్దరు నాయకుల ఆలోచనలు, వారు చేపట్టిన కార్యక్రమాలను పరిశీలిస్తే వారి వ్యక్తిత్వాలేమిటో తేటతెల్లమవుతుంది. గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు నిర్వహించారు. ప్రజల మీద భారాన్ని మోపడం ఆయన నైజం. కట్టలేమన్న వారిని కాల్చి చంపడం ఆయన చరిత్ర. వ్యవస్థల్ని ప్రైవేటీకరించడం, వీలైతే తమ మనుషులకు కట్టబెట్టడం, ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూరేలా పీపీఏలు కుదుర్చుకోవడం ఆయన గతం. జగన్మోహన్ రెడ్డి ఈ వైఖరికి పూర్తి భిన్నం. ఐదేళ్లు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్న ప్పటికీ, అందులో రెండేళ్ల కాలాన్ని కరోనా వైరస్ కాటేసినప్పటికీ ప్రజాశ్రేయస్సే తన అధికార పరమావధి అని చాటుకున్నారు. ఆయన అవలంభించిన విధానాలే ఇందుకు సాక్ష్యం. ఈ సాక్ష్యాన్ని చెరిపేయడానికీ, వారి చరిత్రలను మరిపించడానికీ కూటమి సర్కార్ యెల్లో మీడియా సహకారంతో ప్రయత్ని స్తున్నది. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన హామీల నుంచి కూడా జనం దృష్టి మరలిపోవాలి. అందుకోసం ఏదో ఒక నాటకాన్ని నడిపిస్తూనే ఉంటారు. ఇప్పుడు నడిపిస్తున్న నాటకం పేరు ‘అదిగో పులి... ఇదిగో తోక!’వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఏపీ ప్రజలపై మరో భారం (ఫోటోలు)
-
Andhra Pradesh: అభివృద్ధిపైనా అబద్ధాలే
సాక్షి, అమరావతి: వరుసగా ఏటా సొంత ఆదాయాల్లో పెరుగుదల.. జాతీయ స్థాయికి మించి పెరిగిన తలసరి ఆదాయం.. చిన్న, సూక్ష్మ పరిశ్రమలతో 32.79 లక్షల ఉద్యోగాలు.. కోవిడ్‌లోనూ ఉపాధికి ఢోకా లేకుండా భరోసా.. గాడిన పడ్డ పొదుపు సంఘాలు.. బాగుపడ్డ ప్రభుత్వ పాఠశాలలు.. పేదవాడికి ఆరోగ్య భరోసా.. రైతుల్లో నిశ్చింత.... ఇవన్నీ ఒక రాష్ట్రం అభివృద్ధి ప్రయాణానికి తిరుగులేని నిదర్శనాలు! స్ధిర ధరల ఆధారంగా వృద్ధి రేటు వైఎస్సార్ సీపీ హయాంలో ఏటా పెరిగినట్లు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు విడుదల చేసిన సామాజిక ఆర్థిక సర్వేనే స్పష్టంగా చెబుతోంది. అయినా సరే.. గత సర్కారు పాలనలో అభివృద్ధి జరగలేదని.. ఆదాయం పెరగలేదని.. తలసరి ఆదాయం తగ్గిపోయిందని.. పెట్టుబడులు రాలేదని.. స్కీములన్నీ స్కామ్‌లేనంటూ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సీఎం చంద్రబాబు కట్టుకథలు చెప్పారు!! కూటమి ప్రభుత్వం అసెంబ్లీకి సమర్పించిన 2023–24 సామాజిక ఆర్ధిక సర్వే సాక్షిగా ఈ అబద్ధాలు బట్టబయలయ్యాయి. స్థిర ధరల ఆధారంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తిని గణించడం వాస్తవ అభివృద్ధిని ప్రతిబింబిస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతారు. వైఎస్సార్ సీపీ హయాంలో రెండేళ్లు కోవిడ్ సంక్షోభం వెంటాడినప్పటికీ ప్రతి ఏడాది వృద్ధి సాధించినట్లు సర్వే స్పష్టం చేసింది. 2022–23తో పోల్చితే 2023–24లో స్థిర ధరల ఆధారంగా వృద్ధి రేటు గణనీయంగా పెరిగిందని సర్వే తెలిపింది.వృద్ధికి ఊతం..⇒ 2023–24లో రాష్ట్ర తలసరి ఆదాయం కూడా జాతీయ స్థాయిని మించి పెరిగింది. జాతీయ తలసరి ఆదాయం రూ.1,84,205 కాగా రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,42,479గా ఉంది. ⇒ 2021–22 నుంచి 2023–24 వరకు రాష్ట్ర సొంత ఆదాయంతో పాటు పన్నేతర ఆదాయం, కేంద్రం నుంచి ఆర్థిక వనరులు వరుసగా పెరిగాయి. పొదుపు మహిళకు ‘‘ఆసరా’’రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలు 99 శాతం రికవరీతో పాటు 30 శాతం వాటాతో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాయని సర్వే వెల్లడించింది. స్వయం సహాయక సంఘాలకు 2019 ఏప్రిల్ 11వతేదీ వరకు ఉన్న రుణాల భారాన్ని వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా చెల్లించి గత ప్రభుత్వం ఆదుకుంది. 7.97 లక్షల స్వయం సహాయక సంఘాల బ్యాంకు ఖాతాలకు రూ.25,557.54 కోట్లు చెల్లించింది.పారిశ్రామిక విప్లవం.. ⇒ 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.11,688.11 కోట్ల పెట్టుబడితో 20 భారీ పరిశ్రమలు ఏర్పాటు కావడమే కాకుండా ఉత్పత్తిని సైతం ప్రారంభించి 14,596 మందికి ఉద్యోగాలు కల్పించాయి. ⇒ రూ.6.07 లక్షల కోట్ల పెట్టుబడితో తలపెట్టిన మరో 156 భారీ మెగా ప్రాజెక్టులు నిర్మాణ, ప్రారంభ దశల్లో ఉన్నాయి. వీటి ద్వారా 4.86 లక్షల మందికి పైగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ⇒ 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.8,286.48 కోట్ల పెట్టుబడితో 2,71,341 ఎంఎస్ఎంఈలు ఏర్పాటు కావడమే కాకుండా వాటి ద్వారా ఏకంగా 19,86,658 మందికి ఉపాధి కల్పించాయి. ⇒ గతంలో ఐదేళ్ల టీడీపీ పాలనలో ఎంఎస్ఎంఈల ద్వారా రూ.26,000 కోట్ల పెట్టుబడులు, 8.67 లక్షల మందికి ఉపాధి కల్పించగా వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా ఎంఎస్ఎంఈలతో రూ.33,177 కోట్లు పెట్టుబడులు, 32.79 లక్షల మందికి ఉపాధి చూపినట్లు సర్వే వెల్లడించింది. 2023–24లో 2.24 లక్షల మందికి శిక్షణ ఇవ్వగా 64,307 మంది ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు పొందారు. విద్యా సంస్కరణలు.. చదువులకు సాయం⇒ మన బడి నాడు – నేడు కింద తొలి దశలో రూ.3859.12 కోట్ల వ్యయంతో 15,715 స్కూళ్లలో తొమ్మిది రకాల మౌలిక సదుపాయాలను కల్పించగా రెండో దశలో రూ.8,000 కోట్లతో అదనపు తరగతి గదులతోపాటు 11 రకాల సదుపాయాలను 22,344 స్కూళ్లలో కల్పించారు. రూ.372.77 కోట్లతో 883 స్కూళ్లలో వసతులు కల్పించారు. ⇒ పిల్లల చదువులకు పేదరికం అడ్డురాకూడదనే సంకల్పంతో 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు అమ్మ ఒడి పథకాన్ని అమలు చేశారు. పిల్లల తల్లుల ఖాతాల్లో ఏడాదికి రూ.15 వేలు చొప్పున 2022–23లో 42,61,965 మంది తల్లులకు రూ.6,392.94 కోట్లు అందచేశారు. ⇒ 2023–24 విద్యా సంవత్సరంలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు డ్రాప్ అవుట్స్ లేవు. 6 నుంచి 8వ తరగతి వరకు 0.01 శాతం మాత్రమే డ్రాప్ అవుట్స్ ఉండగా తొమ్మిది, పదో తరగతిలో 2.39 శాతం డ్రాప్ అవుట్స్ నమోదయ్యాయి.ఆర్బీకేలు.. పెట్టుబడి సాయందేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) రైతులకు విత్తనం నుంచి పంట విక్రయం వరకు సేవలందించాయని సర్వే తెలిపింది. రైతు భరోసా – పీఎం కిసాన్ కింద 2023–24లో 2.58 లక్షల మంది ఆర్వోఎఫ్ఆర్, కౌలు రైతులతో సహా 53.58 లక్షల రైతు కుటుంబాలకు రూ.7,226.08 కోట్లు పెట్టుబడి సాయంగా గత ప్రభుత్వం అందచేసింది. రాష్ట్ర పన్ను ఆదాయం, పన్నేతర ఆదాయం, కేంద్రం నుంచి ఆర్థిక వనరుల గురించి సామాజిక, ఆర్థిక సర్వేలో పేర్కొన్న భాగం -
ప్రజలకు షాక్‌లు.. సర్కారు సోకులు 'వాతలపై వాకౌట్'
సాక్షి, అమరావతి: కూటమి సర్కారు విద్యుత్తు షాకులపై శాసన మండలి దద్ధరిల్లింది. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలను పెంచబోమని... అవసరమైతే చార్జీలను ఇంకా తగ్గిస్తామన్న హామీని కూటమి నేతలు గాలికొదిలేయడంతోపాటు ఐదు నెలల్లోనే ప్రజలపై ఏకంగా రూ.17 వేల కోట్లకుపైగా కరెంట్ చార్జీల భారాన్ని మోపడాన్ని ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ మండలి సాక్షిగా నిగ్గదీసింది. గత సర్కారుపై బురద చల్లే యత్నాలను ఎండగట్టింది. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా డిస్కమ్‌లకు (విద్యుత్తు పంపిణీ సంస్థలు) సకాలంలో రాయితీలను అందించి ఆదుకుందని, ఐదేళ్లలో ఏకంగా రూ.45 వేల కోట్లకు పైగా అందచేసిందని గుర్తు చేసింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సబ్సిడీలు భరించేందుకు నిరాకరిస్తూ వినియోగదారులపై నిర్దాక్షిణ్యంగా రూ.17 వేల కోట్లకుపైగా చార్జీల భారాన్ని మోపుతోందని మండిపడింది. విద్యుత్తు చార్జీల వాతలు, సూపర్ సిక్స్ పథకాలకు కేటాయింపులు లేకపోవడం, రాష్ట్రంలో పూర్తిగా క్షీణించిన శాంతి భద్రతలకు నిరసనగా ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ సోమవారం మండలి నుంచి వాకౌట్ చేసింది. శాసన మండలిలో ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఈ అంశాలను ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వం నిర్వాకాలపై నిప్పులు చెరిగారు. సామాన్య ప్రజలపై విద్యుత్తు చార్జీల భారాన్ని ఎందుకు మోపుతున్నారని నిలదీశారు. ఎన్నికల్లో వాగ్దానాలు చేసిన తరువాత ఆ కార్యక్రమాల వ్యయాన్ని ఆయా ప్రభుత్వాలే భరించాలని హితవు పలికారు. ‘ఎన్నికల సమయంలో మీరే వాగ్దానం చేశారు కదా? హామీలను ఎందుకు అమలు చేయడం లేదు? సబ్సిడీ కింద ప్రభుత్వం నిధులు కేటాయించి వినియోగదారులకు ఊరట కల్పించవచ్చు కదా? ఇప్పటికే రూ.ఆరు వేల కోట్లకుపై భారాన్ని ప్రజలపై మోపారు. ఇంకో రూ.11 వేల కోట్లకుపైగా భారాన్ని కూడా వేసి ఏం చేద్దామనుకుంటున్నారు?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికల హామీల అమలులో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైందని, ఆలస్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టినా సూపర్ సిక్స్ పథకాలకు కేటాయింపులు జరపకపోవడం మోసపూరితమని మండిపడ్డారు. అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తూ సూపర్ సిక్స్ హామీలను ఎగ్గొట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ‘రాష్ట్ర విభజన తరువాత విద్యుత్ బకాయిలు, అప్పులు రూ.ఏడు వేల కోట్ల దాకా ఉంటాయి. 2014–19 మధ్య టీడీపీ సర్కారు వాటిని రూ.29 వేల కోట్ల వరకు తీసుకెళ్లింది. వైఎస్సార్ సీపీ హయాంలో రూ.395 కోట్లకు మించి ఐదేళ్లలో డిస్కంలపై భారం పడలేదు. అదే నాడు టీడీపీ హయాంలో రూ.22 వేల కోట్ల మేర భారం వేశారు. ఇక టీడీపీ అధికారంలో ఉండగా ఐదేళ్లలో డిస్కంలకు రూ.15 వేల కోట్లు మాత్రమే సబ్సిడీ కింద ఇవ్వగా వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.45 వేల కోట్లకుపైగా విద్యుత్ రంగానికి అందచేసి ఆదుకుంది’ అని గణాంకాలతో కూటమి సర్కారు షాకులను ఎండగట్టారు. అనంతరం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం సవరణ బిల్లును వైఎస్సార్ సీపీ వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించి నిరసనగా పార్టీ సభ్యులందరితో కలసి వాకౌట్ చేశారు. అప్పులపై తప్పుడు ప్రచారం.. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండు మూడు నెలల్లోనే పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడం ఆనవాయితీ. ఇంత ఆలస్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టినా సూపర్ సిక్స్ పథకాలకు ఎటువంటి కేటాయింపులు లేకపోగా ఎప్పటి నుంచి అమలు చేస్తారన్న విషయంపై కూడా స్పష్టత లేదంటే ఇది మోసపూరిత బడ్జెట్ కాక ఇంకేమంటారు? మాజీ ఆర్ధికమంత్రి రూ.14 లక్షల కోట్ల అప్పలు అంటారు! ముఖ్యమంత్రి రూ.పది లక్షల కోట్లు అంటారు! ఆర్థిక మంత్రి రూ.6.46 లక్షల కోట్లు అని బడ్జెట్లో అంటారు! మరి ఇందులో ఏది నిజం? ఎవరు తప్పుడు లెక్కలు చెబుతున్నారో సభకు స్పష్టత ఇవ్వాలి. గత ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం నిర్దేశించిన పరిమితికి లోబడి అందులో 86 శాతం మాత్రమే అప్పులు తీసుకుంది. సూపర్ సిక్స్ ఎక్కడ? సూపర్‌సిక్స్ పథకాలకు కేటాయింపులు ఎక్కడ? స్కూలుకు వెళ్లే పిల్లలకు తల్లికి వందనం ఎక్కడ? నీకు 15 వేలు.. నీకు 15 వేలు అనేది ఇప్పుడు తెగ ప్రచారమవుతోంది. పాఠశాల విద్యార్థులు 80 లక్షల మందికిపైగా ఉంటే బడ్జెట్లో కేటాయించిన రూ.5,000 కోట్లు ఎలా సరిపోతాయి? ఆడబిడ్డ నిధి ఎప్పుడు ఇస్తారు? 50 ఏళ్లు దాటిన వారికి ఫించను హామీని ఎప్పుడు అమలు చేస్తారు? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఆలస్యం ఎందుకు? 20 లక్షల ఉద్యోగాలు సృష్టించలేనప్పుడు కనీసం నిరుద్యోగ భృతి అయినా ఇవ్వాలి కదా? దిగజారిన శాంతి భద్రతలు.. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఉప ముఖ్యమంత్రే చెప్పారని బొత్స పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు, హత్యాచారాలపై మండలిలో చర్చ సందర్భంగా అధికార – ప్రతిపక్ష సభ్యుల వాగ్యుద్ధం చోటు చేసుకుంది. హోంమంత్రి అనిత జవాబిచ్చిన తీరును బొత్స ఖండించారు. సభ్యుల ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పకుండా మంత్రి రాజకీయ ఉపన్యాసాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. గత ఐదు నెలల కాలంలో మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు, వేధింపులు విచ్చలవిడిగా జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, కల్పలత ఆందోళన వ్యక్తం చేశారు. యథేచ్ఛగా మద్యం బెల్ట్ షాపులు ఏర్పాటవుతున్నా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తమ ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు జరిగిన నేరాల్లో 24–48 గంటల్లోనే నిందితులను అరెస్టు చేశామని హోంమంత్రి అనిత చెప్పారు. కాగా వైఎస్ జగన్ కుటుంబ సభ్యులను ప్రస్తావిస్తూ ఈ సందర్భంగా మంత్రి పలు వ్యాఖ్యలు చేశారు. కాగా శాంతి భద్రతలు విఫలమయ్యాయని డిప్యూటీ సీఎం అనలేదని టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఔను.. ఒక్క సిలిండరే ఉచిత గ్యాస్ సిలెండర్ హామీపై బొత్స గట్టిగా నిలదీయండంతో కూటమి ప్రభుత్వం దిగొచ్చి అసలు విషయాన్ని బయటపెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క సిలెండర్ మాత్రమే ఉచితంగా ఇస్తామని, ఏడాదికి మూడు ఉచిత సిలెండర్ల హామీని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సభలో స్పష్టం చేశారు. ఇమామ్, మౌజాన్లకు గౌరవ వేతనం పెంపు ప్రతిపాదన లేదు.. ఇమామ్, మౌజాన్లకు గౌరవ వేతనాల పెంపు ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని మంత్రి ఫరూక్ తెలిపారు. విజయవాడ నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారికి మాత్రమే ప్రభుత్వం రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తుందని చెప్పారు. మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా వైఎస్సార్ ఎమ్మెల్సీలు ఇసాక్ బాషా, మహ్మమద్ రుహల్లాలు ఈ అంశాలను ప్రస్తావించారు. మోటర్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రసక్తే లేదు: మంత్రి గొట్టిపాటి రవి రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రసక్తే లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. మండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ఉపప్రశ్నకు మంత్రి గొట్టిపాటి ఈ మేరకు బదులిచ్చారు. బిల్లును వ్యతిరేకిస్తున్నాం: లక్ష్మణ్‌రావు, పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం సవరణ బిలును మేం వ్యతిరేకిస్తున్నాం. ఈ ప్రభుత్వం ఇప్పటికే తొలిదశలో రూ.6 వేల కోట్ల భారాన్ని విద్యుత్తు వినియోగదారులపై మోపింది. ఇప్పుడు మరో రూ.11 వేల కోట్ల బాదుడుకు సిద్ధమైంది. మొత్తం సుమారు రూ.17 వేల కోట్ల భారాన్ని ప్రజలపై వేస్తోంది. వినియోగదారులకు ఇది మోయరాని భారం. ఇలాంటి బిల్లు ఇప్పుడు అవసరమా? దీన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. మూజువాణితో ఆమోదం... మండలిలో విద్యుత్ సుంకం సవరణ బిల్లుపై చర్చకు విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానిచ్చారు. గత ప్రభుత్వం ఎంతో మేలు చేసినట్లు బొత్స సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడారని విమర్శించారు. ఇది సవరణ మాత్రమేనని, గత ప్రభుత్వమే ప్రజలపై భారం వేసిందని చెప్పారు. గత ప్రభుత్వం తెచ్చిన చట్టంలో లోపాలను సరిదిద్దడానికే ఈ బిల్లును ప్రవేశపెడుతున్నామన్నారు. అనంతరం బిల్లుపై సభలో తీర్మానం ప్రవేశపెట్టగా మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు చైర్మన్ మోషేన్‌రాజు ప్రకటించారు. -
వాగ్దానాలు గాలికి వదిలినట్లేనా?
ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సోమవారం 2024–25 ఆర్థిక సంవత్సరానికిగాను సమర్పించిన రూ. 2.94 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్ ప్రజల్లో నిరుత్సాహాన్ని మిగిల్చింది. ఈ బడ్జెట్ లాంఛన ప్రాయంగా మాత్రమే కనిపిస్తోంది. ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం బడ్జెట్లో ‘సూపర్ సిక్స్’తో సహా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించలేదు. యువత నైపుణ్యాభివృద్ధి, గ్రీన్ ఎనర్జీ, వ్యవసాయం, మహిళా సాధికారత వంటి రంగాలపై గుర్తించదగిన శ్రద్ధను కనబరచలేదు. స్థిరమైన ఉపాధిని పెంపొందించడానికి ఎంఎస్ఎంఈ లకు అదనపు మద్దతు ఇవ్వాలి. అదెక్కడా బడ్జెట్లో కని పించడంలేదు. కొత్త కార్యక్రమాలను ప్రారంభించే బదులు, స్పష్టమైన ఫలితా లను సాధించడానికి రాష్ట్రం ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రాధాన్యతనివ్వాలి. పేద విద్యార్థుల ఉన్నత విద్యకు కూటమి సర్కారు మోకాలడ్డుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్, మెయింటెనెన్స్ ఛార్జీల కేటాయింపుల్లో భారీగా కోత విధించింది. ఫలితంగా సుమారు 12 లక్షల ఎస్సీ, ఎసీ,్ట బీసీ, మైనారిటీలకు చెందిన విద్యార్థుల కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో కీలక రంగాలకు కేటాయింపుల్లో కోత స్పష్టంగా కనిపిస్తోంది. ‘సూపర్ సిక్స్’ ఎన్నికల హామీలను పునరావృతం చేయడం మినహా ఎప్పటి నుంచి అమలు చేస్తారో స్పష్టంగా చెప్పలేదు. రూ. 43,402 కోట్లతో అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్‌దీ అదే దారి. మొత్తంగా, ఆదివాసీలు, దళితులు, మహిళలు, మైనారిటీల సంక్షేమానికి నామమాత్రంగానే ప్రభుత్వం నిధులు విదిల్చింది. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలుతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం త్వరలో ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో సరిపెట్టారు. మిగతా హామీల అమ లుపై నిర్దిష్టత లేదు. 20 లక్షల మంది యువతకు ఉపాధి అవ కాశాలు, రూ. 3,000 నిరుద్యోగ భృతిని దాటవేశారు. 16,347 పోస్టుల భర్తీకి జారీ చేసిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రస్తావించిన ఆర్థిక మంత్రి... ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక డీఎస్సీ, జీఓ నెంబరు 3 పునరుద్ధరణ గురించి నోరు మెదపలేదు. ప్రతి రైతుకూ ఏటా రూ. 20 వేల ఆర్థిక సాయం అందిస్తామన్న ‘అన్నదాత సుఖీ భవ’కు 10 వేల 716 కోట్లు అవసరం కాగా 1000 కోట్లే కేటాయించారు. దాదాపు 25 లక్షలుగా ఉన్న కౌలు రైతులను ఆదుకోవడం కనీస ధర్మం. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం ప్రభుత్వ ప్రాధా న్యత అని చెప్పినా, నిర్వాసితులను పట్టించుకున్న పాపాన పోలేదు.ఆకాశంలో సగం, అవకాశాల్లో సగంగా ఉండాల్సిన మహిళలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడంపై చూపే ఆత్రం పథకాల అమలులో కానరావడం లేదు. 19 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ. 1,500 చొప్పున అంది స్తామన్న ‘మహాశక్తి’ జాడే లేదు. ‘తల్లికి వందనం’ పథకం కింద విద్యార్థికి రూ. 15 వేలు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 84 లక్షల మంది విద్యార్థుల తల్లులకు చెల్లించేందుకు రూ. 12,600 వేల కోట్లు కేటాయించాల్సి ఉండగా, విదిల్చింది రూ. 5,387 కోట్లే! బాలబాలికలకు, బాలింతలకు సేవలందిస్తున్న అంగన్వాడీ వర్క ర్లకు, హెల్పర్లకు పెండింగ్‌లో ఉన్న వేతన పెంపు గురించి ఎక్కడా ప్రస్తావించ లేదు. కార్మికులు, స్కీమ్ వర్కర్ల వేతన పెంపు, సామా జిక భద్రత ఊసే లేదు. మాటిచ్చినట్టుగా విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోగా వేల కోట్ల రూపాయల అప్పు భారం మోపుతున్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి అంతర్జాతీయ ఫైనాన్స్ సంస్థల నుంచి కేంద్రం ఇప్పిస్తా మన్న రూ. 15 వేల కోట్లు గ్రాంటో, రుణమో తేల్చలేదు. మొత్తంగా చూసినప్పుడు బడ్జెట్ కేటాయింపులను బట్టి ఈ ప్రభుత్వం ఎన్నికల హామీలను గాలికి వదిలేసినట్లు స్పష్టమవుతోంది.– డా‘‘ ముచ్చుకోట సురేష్ బాబుమొబైల్: 99899 88912 -
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం నిరంకుశత్వం... అక్రమ కేసులతో సోషల్ మీడియా యాక్టివిస్టులకు చిత్రహింసలు
-
నయవంచనకు నకలు పత్రం!
దొంగ హామీలతో, వక్రమార్గంలో అయిదు నెలలక్రితం అధికారాన్ని చేజిక్కించుకున్న నాటినుంచీ అనామతు పద్దులతో తప్పించుకు తిరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్డీయే కూటమి సర్కారు ‘తప్పనిసరి తద్దినం’లా సోమవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఘనమైన అంకెలు చూసి జనం నవ్విపోరా అన్న వెరపు లేకుండా రూ. 2,94,427 కోట్లతో ఈ బడ్జెట్ తీసుకొచ్చారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 2.35 లక్షల కోట్లు, మూలధన వ్యయం రూ. 32,712 కోట్లు, ద్రవ్యలోటు రూ. 68,742 కోట్లు, రెవెన్యూ లోటు రూ. 34,743 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. మొన్నటి ఎన్నికల్లో భూమ్యా కాశాలను ఏకం చేస్తూ మోత మోగించిన సూపర్ సిక్స్ హామీల జాడ లేకుండా... అంచనా వేస్తున్న పన్ను రాబడి రూ. 24,000 కోట్లూ వచ్చే మార్గమేమిటో చెప్పకుండా ఆద్యంతం లొసుగులు, లోపాలతో బడ్జెట్ తీసుకురావడం బాబు సర్కారుకే చెల్లింది. ఈమాత్రం బడ్జెట్ కోసం అయిదు నెలలు ఎందుకు ఆగాల్సివచ్చిందో కూటమి నేతలే చెప్పాలి. 53.58 లక్షలమంది రైతులకు రూ. 20,000 చొప్పున రూ. 10,716.74 కోట్లు కేటాయించాల్సిన ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి కేవలం వెయ్యి కోట్లు మాత్రమే విదిల్చి రైతు సంక్షేమమే లక్ష్యమంటూ బీరాలు పోవటం... 84 లక్షల మంది విద్యార్థులకు ‘తల్లికి వందనం’ పథకం కింద రూ. 12,600 కోట్లు కావాల్సి వుండగా కేవలం రూ. 5,387.03 కోట్లు కేటాయించి ఊరుకోవటం దుస్సాహసానికి పరాకాష్ఠ.రైతులకు జగన్మోహన్ రెడ్డి హయాంలో విజయవంతంగా అమలైన ఉచిత పంటల బీమా పథకానికి ఈ ఖరీఫ్ సీజన్ తర్వాత మంగళం పాడుతున్నట్టు ప్రభుత్వమే చెప్పింది. ఇక రూ. 3 లక్షల వరకూ సున్నావడ్డీ రాయితీ, డ్రిప్ పరికరాలపై 90 శాతం సబ్సిడీ వగైరాల గురించి ప్రస్తావన లేదు. అలాగే ధరల స్థిరీకరణ నిధికీ, ప్రకృతి వైపరీత్యాల నిధికీ ఇచ్చిందేమీ లేదు! అయినా రైతు సంక్షే మానికి కట్టుబడివున్నారట! పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి మహిళకూ ప్రతి నెలా రూ. 1,500 చొప్పున ఏడాదికి రూ. 18,000 ఇస్తామని చెప్పిన ‘ఆడబిడ్డ’ నిధికి రూ. 32,400 కోట్లు కేటాయించాల్సి వుండగా ఇచ్చింది సున్నా. ఏడాదిలో ఇంటింటికీ మూడు సిలెండర్లు ఉచితమని ఊదరగొట్టిన పథకం కింద కోటీ 54 లక్షల కుటుంబాల కోసం రూ. 4,000 కోట్లు అవసరం కాగా దానికోసం కేటా యించింది కేవలం రూ. 895 కోట్లు! ఈ అరకొర మొత్తంతో ఇంటికో సిలెండరైనా ఇవ్వగలుగు తారా? లబ్ధిదారుల జాబితాకు అడ్డగోలుగా కోత పెడితే తప్ప ఇది అసాధ్యం. నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3,000 చొప్పున ఏడాదిలో కోటిమందికి మొత్తం రూ. 36,000 కోట్లు కావాల్సి వుండగా దాని ఊసే లేదు! జాబ్ క్యాలెండర్, డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు వగైరాల గురించిన ప్రస్తావన లేదు. అంకుర సంస్థలకు ప్రాజెక్టు వ్యయంలో రూ. 10 లక్షల వరకూ సబ్సిడీ ఇస్తామని చెప్పిన వాగ్దానానికి సైతం చోటులేదు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగానికి తగినన్ని నిధులు కేటాయిస్తే, చెప్పిన రీతిలో సబ్సిడీ సొమ్ము అందిస్తే ఉద్యోగ కల్పన సాధ్యమవుతుంది. కానీ వీటి గురించి మాట్లాడింది లేదు. ఆ రంగానికి బాబు హయాంలో పెట్టిపోయిన బకాయిలు కరోనా మహమ్మారి విజృంభించిన కాలంలో సైతం చెల్లించి ఆ పరిశ్రమలకు ఊపిరులూదిన జగన్ సర్కారుకూ, ఈ మాయదారి కూటమి ప్రభుత్వానికీ పోలికెక్కడ! యువతకు ఏటా లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీ మాట దేవుడెరుగు – మూడు లక్షలమంది వలంటీర్లకు మంగళం పాడినట్టు బడ్జెట్ అధికారికంగా తేల్చి చెప్పింది. కాపు వర్గానికి సైతం మొండిచెయ్యి చూపారు.‘బడ్జెట్ అంటే అంకెల సముదాయం మాత్రమే కాదు... అది మనం పాటిస్తున్న విలువలు, ఆకాంక్షల వ్యక్తీకరణ’ అని ఒకనాటి అమెరికా ఆర్థిక మంత్రి జాకబ్ ల్యూ ఉవాచ. పీఠంపై పేరాశతో మొన్నటి ఎన్నికల్లో ఎడాపెడా వాగ్దానాలిచ్చినవారి నుంచి విలువలేమి ఆశించగలం? వారికి జనం ఆకాంక్షలెలా అర్థమవుతాయి? అందుకే– వంచనాత్మక విన్యాసాలు ఆగలేదు. బడ్జెట్లో అంకెల గారడీ సరే, బయట పారిశ్రామికవేత్తలతో సైతం బాబు అదే మాదిరి స్వోత్కర్షలకు పోయారు. రానున్న రోజుల్లో ఏకంగా 15 శాతం వృద్ధి రేటు సాధిస్తారట! అవకాశాల కల్పనతో సంపద సృష్టించి, పేదల జీవన ప్రమాణాలు పెంచుతారట!! కూటమి సర్కారు గద్దెనెక్కినప్పటి నుంచీ పన్ను రాబడి మైనస్‌లోకి పోయిందని సాక్షాత్తూ కాగ్ చెప్పింది. జగన్ సర్కారు హయాంలో మొన్న ఏప్రిల్‌లో పన్ను రాబడిలో దాదాపు 11 శాతం వృద్ధి నమోదు కాగా, ఆ తర్వాత తగ్గటం సంగతలా వుంచి మైనస్‌లోకి పోయింది. మే నెలలో –2.8 శాతం, ఆ తర్వాత వరసగా –8.9, –5.3, –1.9, –4.5 శాతాలకు పడిపోయిందని కాగ్ నివేదిక బయటపెట్టింది. వాస్తవం ఇలావుంటే పన్ను రాబడి కింద అదనంగా రూ. 24,000 కోట్లు వస్తాయని బడ్జెట్ నమ్మబలుకుతోంది. అంటే రానున్న కాలంలో అదనపు పన్నుల మోత మోగుతుందన్నమాట!జగన్ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి గడచిన అయిదేళ్ళూ సాగించిన దుష్ప్రచారం అంతా ఇంతా కాదు. కూటమి నేతలు, వారి వందిమాగధ మీడియా నోటికొచ్చినట్టు రూ. 12 లక్షల కోట్లు, రూ. 14 లక్షల కోట్లు అంటూ తప్పుడు ప్రచారాలు చేశారు. తీరా మొన్న మార్చి 31 నాటికి ఆ అప్పు రూ. 6.46 లక్షల కోట్లని తాజా బడ్జెట్ వెల్లడించింది. ఇందులో గ్యారెంటీల కింద తెచ్చిన అప్పు రూ. 1,54,797 కోట్లనూ తీసేస్తే నికరంగా ఉన్నది రూ. 4.91 లక్షల కోట్లు మాత్రమే! నిజానికి ఈ బడ్జెట్ చదివిన ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ ఈ విషయంలో గతంలో తప్పుడు ప్రచారం చేశామని క్షమాపణలు చెప్పాలి. కానీ ఆపాటి నిజాయితీ ఆశించటం అత్యాశే. మొత్తానికి నయవంచనకూ, నేల విడిచిన సాముకూ ఈ బడ్జెట్ అసలు సిసలు ఉదాహరణ. -
హామీలు సూపర్ సిక్స్.. అమలులో క్లీన్ బౌల్డ్
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ హామీలను ఎప్పటి నుంచి అమలు చేస్తామనిగానీ.. నిర్దిష్ట కేటాయింపులుగానీ లేకుండానే సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం 2024–25 పూర్తి స్థాయి బడ్జెట్‌ను సోమవారం అసెంబ్లీకి సమర్పించింది. సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టి బడ్జెట్లో ఎక్కడా ప్రతిబింబించకపోగా భారీగా పన్నుల మోత, అప్పుల వాతలు మాత్రం ప్రస్ఫుటంగా కనిపించాయి. సూపర్ సిక్స్ హామీలు డకౌట్ కావడంతో కూటమి సర్కారు తొలిసారిగా ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్ ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకీ మోత సామెతను తలపిస్తోంది. గత ఆర్ధిక ఏడాది కంటే ఈదఫా పన్ను ఆదాయం ఏకంగా రూ.23,894 కోట్లు అదనంగా వస్తుందని బడ్జెట్లో అంచనా వేశారు. అంటే పన్నుల రూపేణా ప్రజలపై మరింత భారం మోపనున్నారు. ఇందులో మద్యం ద్వారా అదనంగా రూ.10 వేల కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. గత ఆర్ధిక ఏడాది మద్యం ద్వారా రూ.15,977 కోట్లు ఆదాయం రాగా ఈ ఆర్ధిక ఏడాది రూ.25,597 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. పన్నేతర ఆదాయం గత ఆర్థిక ఏడాది కన్నా రూ.3,000 కోట్లకు పైగా అదనంగా వస్తుందని బడ్జెట్లో పేర్కొన్నారు. భారీ అప్పులు చేసి ప్రజలపై రుణం భారం మోపడమే లక్ష్యంగా 2024–25 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సోమవారం అసెంబ్లీకి సమర్పించారు. ఈ ఆర్థిక ఏడాది ప్రజా రుణం ఏకంగా రూ.91,443 కోట్లుగా బడ్జెట్లో పేర్కొన్నారు. ‘సూపర్’.. బాదుడే! సూపర్ సిక్స్‌లో తొలి హామీగా నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేలు చొప్పున భృతి ఇస్తామని చెప్పినప్పటికీ బడ్జెట్లో అసలు ఆ విషయాన్నే ప్రస్తావించకుండా యువతను ఎప్పటిలాగానే చంద్రబాబు సర్కారు మోసం చేసింది. రైతులకు పెట్టుబడి సాయం కోసం అన్నదాతా సుఖీభవ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో నిర్దిష్టంగా బడ్జెట్లో చెప్పకుండా తూతూ మంత్రంగా రూ.1,000 కోట్లు విదిలించి మసిబూసి మారేడుకాయ చేశారు. సూపర్ సిక్స్‌లో భాగంగా 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఇస్తామన్న హామీ గురించి బడ్జెట్లో కనీసం ప్రస్తావించకుండా మహిళలను దగా చేశారు. స్కూల్‌కు వెళ్లే ప్రతి విద్యార్థికీ ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని సూపర్ సిక్స్‌లో చెప్పిన హామీని ఎప్పటి నుంచి అమలు చేస్తారనేది నిర్దిష్టంగా వెల్లడించకుండా వివిధ కార్పొరేషన్ల పేరుతో కొన్ని చోట్ల, జెండర్ బడ్జెట్లో కొన్ని చోట్ల కేటాయింపులు చేసినట్లు చూపించారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యానికి పైసా కేటాయింపుల చేయకపోగా త్వరలో అమలు చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో ఆర్ధిక మంత్రి కేశవ్ ముక్తాయించారు. మరోపక్క విద్యుత్ రంగానికి కేటాయింపుల్లో భారీగా కోత విధించారు. 2023–24లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.14,867.18 కోట్లు వ్యయం చేస్తే 2024–25లో సగానికిపైగా కోత విధించి కేవలం రూ.8,155.31 కోట్లను కేటాయించారు. అంటే వినియోగదారులపై విద్యుత్ చార్జీల భారం పడుతుందని చెప్పకనే కూటమి ప్రభుత్వం చెప్పింది. పేదల ఇళ్ల నిర్మాణాలకు అరకొర నిధుల కేటాయింపుతో సరిపుచ్చారు. 2023–24 లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణాలకు రూ.6,866 కోట్ల వ్యయం చేయగా 2024–25లో కూటమి ప్రభుత్వం కేవలం రూ.4,012 కోట్లు మాత్రమే కేటాయించింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా భారీ ఆదాయం వస్తుందని బడ్జెట్లో అంచనా వేశారు. అంటే భూమి విలువలను పెంచడం ద్వారా ప్రజలపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ రూపంలో ప్రజలపై అదనపు పన్నుల భారం వేయనున్నారు. 2023–24 లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖకు రూ.9,542 కోట్లు ఆదాయం రాగా 2024–25లో రూ.13,500 కోట్ల ఆదాయం వస్తుందని బడ్టెట్‌లో పేర్కొన్నారు. జగన్ ఉండి ఉంటే నేరుగా లబ్ధిదారులకు ఇవి అందేవి ఆదాయం, అప్పులు భారీగా.. సంపద సృష్టించడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటూ ఎన్నికల ముందు నమ్మబలికిన చంద్రబాబు బడ్జెట్లో ఆ మాటే గుర్తు లేన్నట్లు వ్యవహరించారు. ప్రభుత్వ రంగంలో పోర్టులు, వైద్య కళాశాలల నిర్మాణం గురించి అసలు ప్రస్తావనే చేయలేదు. మొత్తం మీద పన్నుల రూపంలో భారీ ఆదాయం, భారీ అప్పులతో 2024–25 ఆర్ధిక సంవత్సరానికి రూ.2.94 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2.35 లక్షల కోట్లు, మూలధన వ్యయం రూ.32,712 కోట్లుగా పేర్కొన్నారు. ద్రవ్యలోటు రూ.68,742 కోట్లు, రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లుగా ఉంటుందని అంచనా వేసినట్లు మంత్రి తెలిపారు.బాబు మేనిఫెస్టోలో హామీలు ఘనం... బడ్జెట్లో కేటాయింపులు శూన్యంప్రజలను మభ్యపెట్టేందుకు ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు సూపర్‌సిక్స్ హామీలతోపాటు మరికొన్ని హామీలు ఘనంగా ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్లోనే వాటి అమలుకు పైసా కేటాయించలేదు.పూర్ టు రిచ్: పేదలకు సంపన్నులను చేసే పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్, పార్టనర్షిప్ (పీ4) పథకాలు: అసలు ప్రస్తావనే లేదు.సౌభాగ్యపథం: చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, అంకుర సంస్థలకు ప్రాజెక్టు వ్యయంలో రూ.10 లక్షల వరకు సబ్సిడీ: ఈ ఊసే లేదు.యువత సంక్షేమం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్: దీని గురించి ఎలాంటి ఊసేలేదుఎంఎస్ఎంఈ సెక్టార్‌కు ప్రోత్సాహకాలు: చిల్లిగవ్వ ఇవ్వలేదుపరీక్షలకు ప్రిపేర్ కావడానికి డిజిటల్ లైబ్రరీలు: ఈ ప్రస్తావనే లేదుబీసీ డిక్లరేషన్బీసీ సబ్ ప్లాన్ ద్వారా రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తాం: ఆ మేరకు కేటాయింపులు లేదుదామాషా ప్రకారం కార్పొరేషన్లకు నిధులు: చిన్న మాట కూడా లేదుస్వయం ఉపాధికి ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు వ్యయం: స్పష్టత లేదు.రూ.5 వేల కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరణ: కేటాయింపు లేదుఆలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు రూ.25వేల వేతనం: ఊసే లేదు.వేట విరామ సమయంలో మత్స్యకారులకు రూ.20 వేల సాయం: పైసా లేదుమహిళా సంక్షేమంపీ4 మోడల్లో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం: ఊసే లేదు.అంగన్వాడీలకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ: దీని ప్రస్తావన లేదుఆశా వర్కర్లకు కనీస వేతనం పెంపు: దీని ప్రస్తావన లేదువిద్యార్థినులకు ‘కలలకు రెక్కలు’ పథకం ద్వారా రుణాలు: ఒక్క మాట లేదుఉద్యోగులు, పెన్షనర్లు, ఇతర హామీలుప్రభుత్వ ఉద్యోగులకు అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్: పట్టించుకోలేదులేదుసీపీఎస్/జీపీఎస్ విధానాన్ని సమీక్షించి అమోదయోగ్యమైన పరిష్కారం: ఆ ప్రసక్తే లేదుతక్కువ జీతాలు పొందే అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు, కన్సాలిడేటెడ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాల వర్తింపు: ఊసే లేదువలంటీర్లకు గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంపు: సున్నాకాపుల సంక్షేమానికి ఐదేళ్లలో రూ.15 వేల కోట్లు: పైసా కేటాయించలేదు నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా ఏటా రూ.100 కోట్లు: పైసా లేదు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే రూ.4 వేల పింఛన్ చొప్పున 20లక్షల మందికి ఏడాదికి రూ.9,600 కోట్లు కేటాయించాలి: ఊసే లేదుప్రతి ఆటో డ్రైవర్, ట్యాక్సీ డ్రైవర్లు, ప్రతి హైవీ లైసెన్సు లారీ, టిప్పర్ డ్రైవర్‌కు ఏటా రూ.15 వేల ఆర్థిక సాయం: ఒక రూపాయి కేటాయించలేదువ్యవసాయంధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు: పైసా కేటాయించలేదు రాయితీతో సోలార్ పంపు సెట్లు: దీని ప్రస్తావనే లేదుడ్రిప్ ఇరిగేషన్‌కు 90 శాతం సబ్సిడీ: ఆ ఊసే లేదుసబ్సిడీపై వ్యవసాయ పరికరాలు: లక్ష మంది రైతులు, కిసాన్ డ్రోన్లకు రూ.342 కోట్లు కావాలి. కానీ కేటాయించింది రూ.187.68 కోట్లు మాత్రమే పేదల గృహవసతిపేదలందరికీ గృహ నిర్మాణానికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలం మంజూరు: బడ్జెట్లో ప్రస్తావన లేదుఇప్పటివరకు మంజూరై పట్టాలు పొందిన వారికి ప్రభుత్వం ద్వారా పక్కా ఇళ్ల నిర్మాణాలు పూర్తి: స్పష్టత ఇవ్వలేదుసాగునీటి రంగంగాలేరు–నగరి, హంద్రీ–నీవా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, తోటపల్లి రిజర్వాయర్, వంశధార–నాగావళి నదుల అనుసంధానం వంటి ప్రాజెక్టుల శీఘ్రతర నిర్మాణం: ఆ మేరకు నిధుల కేటాయింపు లేదురాయలసీమ, ఉత్తరాంధ్ర పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి: బడ్జెట్లో పెద్దగా కేటాయింపులు లేవు. ఈ ప్రాంతాలకు తీవ్ర అన్యాయం -
ఆంధ్రప్రదేశ్‌లో యథేచ్ఛగా అక్రమ కేసులు, నిర్బంధాలు, చిత్రహింసలు... ప్రభుత్వ అరాచకాలపై ప్రజల ఆగ్రహం
-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలపై మరోసారి విద్యుత్ చార్జీల పిడుగు. ఏకంగా 11వేల కోట్ల రూపాయల ట్రూ అప్ చార్జీల భారం మోపే చాన్స్
-
AP: షాక్‌ల మీద షాక్!
‘‘రాష్ట్రంలో విద్యుత్ చార్జీల భారం ఎక్కువగా ఉంది.. కూటమి ప్రభుత్వం వస్తే చార్జీల భారం తగ్గిస్తాం.. ఐదేళ్ల పాటు ఒక్క రూపాయి కూడా చార్జీలు పెంచం’’ అని ఎన్నికలకు ముందు ప్రతి సభలో హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి రాగానే మాట మార్చేశారు. ‘‘అబ్బే.. చెప్పినవన్నీ చేయాలంటే ఎలా కుదురుతుంది? చార్జీలు పెంచకపోతే డిస్కంలకు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి? డబ్బులు ఊరకే రావు. ‘సర్దుబాటు’ పేరుతో ఎంత కావాలో అంత ప్రజల నుంచే పిండుకోండి. ఇదేంటని ఎవరైనా అడిగితే గత ప్రభుత్వం వల్లే చార్జీలు పెరిగాయని అబద్ధమైనా సరే గట్టిగా దబాయించి చెప్పండి. ఒకటికి పదిసార్లు మన మీడియాలో కథనాలు రాయండి. అప్పటికీ సర్దుకోకపోతే నేనే ఎలాగోలా టాపిక్ డైవర్ట్ చేస్తాను’’ అని అంతర్గతంగా దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఫలితంగా ప్రజలు కోలుకోలేని విధంగా షాక్‌ల మీద షాక్.సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు కూటమి సర్కారు వరుసగా విద్యుత్ షాక్‌లు ఇస్తోంది. ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో ఇప్పటికే రూ.6,072.86 కోట్ల భారాన్ని ఈ నెల బిల్లు నుంచే వేస్తున్న ప్రభుత్వం, వచ్చే నెల నుంచి ప్రజల మీద మరో రూ.11,826.15 కోట్ల భారం మోపనుంది. ఈ మేరకు 2023–24 సంవత్సరానికి ఇంధన, విద్యుత్ కొనుగోలు సర్దుబాటు చార్జీల (ఎఫ్‌పీపీసీఏ)కు అనుమతి ఇవ్వాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ దక్షిణ, మధ్య, తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ)కి సోమవారం ప్రతిపాదనలు సమర్పించాయి. డిస్కంల ప్రతిపాదనలపై ఎవరికైనా అభ్యంతరాలున్నా, ఏవైనా సూచనలు చేయాలనుకున్నా తమకు నేరుగా గానీ, ఈ మెయిల్ ద్వారా గానీ ఈ నెల 19వ తేదీలోగా తెలియజేయాలని మండలి కోరింది. అనంతరం ఓ వారం రోజుల్లోనే ట్రూ అప్ చార్జీలపై ఏపీఈఆర్సీ నిర్ణయం తీసుకోనుంది. ఆ వెంటనే డిసెంబర్ నెల నుంచే విద్యుత్ బిల్లుల్లో సర్దుబాటు చార్జీలను వేసే అవకాశం ఉంది.గరిష్టంగా యూనిట్‌కు రూ.3 భారం ఈ ఏడాది జూన్ నాటికే 2023–24 సంవత్సరానికి సంబంధించిన సర్దుబాటు చార్జీలు యూనిట్‌కు రూ.0.40 చొప్పున ఇప్పటి వరకు దాదాపు రూ.3,752.55 వేల కోట్లు వసూలు చేశామని డిస్కంలు వెల్లడించాయి. మిగిలిన రూ.8,073.60 కోట్ల చార్జీలను బిల్లుల్లో అదనంగా కలిపేందుకు ఏపీఈఆర్సీ ఆమోదం కోసం డిస్కంలు పంపించాయని తెలిపాయి. అయితే ఈసారి వాస్తవ విద్యుత్ కొనుగోలు ఖర్చు, అనుమతించిన ఖర్చుకు మధ్య వ్యత్యాసాన్ని డిస్కంలు భారీగా చూపించాయి. అది మూడు డిస్కంలలోనూ కనిష్టంగా రూ.1.02 నుంచి గరిష్టంగా రూ.2.50 వరకు ఉంది. దీన్ని బట్టి యూనిట్‌కు ఎంత వసూలు చేసుకోవడానికి ఏపీఈఆర్సీ అనుమతిస్తుందనేది ఈ నెలాఖరులోగా తేలుతుంది. ఈ నెల నుంచి యూనిట్‌పై సగటున పడుతున్న రూ.1.27కి వచ్చే నెల నుంచి పడే చార్జీలను కలుపుకుంటే మొత్తంగా యూనిట్‌కు రూ.3 చొప్పున అదనంగా వినియోగదారులపై భారం పడనుంది. ఈ లెక్కన విద్యుత్ చార్జీలు డబుల్ కానున్నాయని, ఎక్కువ విద్యుత్ వాడే వాళ్లకు అంతకంటే ఎక్కువ భారం కానున్నాయని స్పష్టమవుతోంది. (నవంబర్ నెలలో వాడిన కరెంట్‌కు డిసెంబర్ మొదటి వారంలో బిల్లు వస్తుంది. అప్పుడు రూ.6,072.86 కోట్ల భారం పడుతుంది. డిసెంబర్లో వాడిన కరెంట్‌కు జనవరి మొదటి వారంలో బిల్లు వస్తుంది. అప్పుడు రూ.11,826.15 కోట్ల భారం అదనంగా కలుస్తుంది.) -
ఒక నెలతో సరి.. ఒకటో తేదీ జీతాల్లేవ్
సాక్షి, అమరావతి: తమది ఉద్యోగుల ప్రభుత్వమని, అందరికీ ప్రతినెల ఒకటో తేదీనే జీతాలు ఇస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన విధంగా కూటమి ప్రభుత్వం వేతనాలివ్వడంలేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. అధికారంలోకి వచ్చాక జూలై నెలలో మాత్రమే ఒకటో తేదీన జీతాలిచ్చారని, తర్వాత నెలల్లో ఐదు, ఆరు తేదీల్లోనే వేస్తున్నారని తెలిపారు. ప్రతినెలా మంగళవారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు రెండులక్షల మంది ఉపాధ్యాయులకు అక్టోబర్ నెల వేతనాలను నవంబర్ ఒకటో తేదీన ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటివరకు జమ చేయలేదు. పెన్షన్లు కూడా అందరికీ అందలేదు. కూటమి ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని, మొదటి నెలలో మాత్రం ఒకటో తేదీ జీతాలు చెల్లించి, తర్వాత ప్రతినెలా 4, 5, 6 తేదీల్లో జీతాలు ఇస్తున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చులు, ఈఎంఐ వంటి అవసరాలతో ఇబ్బందిపడుతున్నామని పేర్కొంటున్నారు. ఒకటో తేదీన వేతనాలు ఇవ్వకపోవడంతో ఈఎంఐలు సకాలంలో చెల్లించలేక డిఫాల్టర్లుగా మారుతున్నామని ఆవేదన చెందుతున్నారు. పెన్షన్ సొమ్ముతో జీవనం సాగిస్తున్నవారి పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది. అప్పు తెచ్చి ఎంతకాలం వడ్డీలు చెల్లించాలి? ఉపాధ్యాయులకు ఇప్పటివరకు పీఎఫ్ లోన్లు, ఏపీజేఎల్‌ఐ లోన్లు, మెడికల్ బిల్లులు, సరెండర్ లీవులు జమచేయలేదని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.అశోక్‌కుమార్‌రెడ్డి, గెడ్డం సుదీర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాము దాచుకున్న డబ్బును ఇవ్వకపోతే తమ పిల్లల చదువులు ఏం కావాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. డబ్బులు అప్పు తెచ్చి ఎంతకాలం వడ్డీలు చెల్లించాలని ప్రశ్నించారు. తమకు రావాల్సిన పీఎఫ్ లోను బకాయిలు, పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలని, ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు అండగా ఉంటామని ఎన్నికల్లో హామీ ఇచ్చి, ఇప్పుడు ఉద్యోగస్తులపై కేసులు పెట్టిన వారికి అండగా ఉంటామని మాట్లాడడం బాధాకరమని పేర్కొన్నారు. ఇలాంటి ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక చర్యలు మానుకుని, వారి సంక్షేమం కోసం పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.