మనుగడ కోసం ‘మహా’ కుట్ర! | Sakshi Editorial On Chandrababu Govt Conspiracy On YS Jagan | Sakshi
Sakshi News home page

మనుగడ కోసం ‘మహా’ కుట్ర!

Jun 29 2025 3:39 AM | Updated on Jun 29 2025 12:56 PM

Sakshi Editorial On Chandrababu Govt Conspiracy On YS Jagan

జనతంత్రం

సుభద్రాదేవి గర్భంతో ఉన్న సమయంలో ఒకసారి అర్జునుడు ఆమెకు యుద్ధరంగంలో పద్మవ్యూహానికి సంబంధించిన జ్ఞానాన్ని బోధిస్తున్నాడట! ఆమె నిద్రలోకి జారుకోవడాన్ని గమనించకుండా అర్జునుడు చెప్పడం కొనసాగిస్తుండగా గర్భస్థ శిశువైన అభిమన్యుడు ఊ... కొడుతూ వింటున్నాడట! పద్మ వ్యూహంలో ఎలా ప్రవేశించాలనే ఉపదేశాన్ని పూర్తిచేసి, ఎలా నిర్గమించాలనే కథను అర్జునుడు ప్రారంభిస్తాడు. 

అదే సమయంలో కృష్ణపరమాత్ముడు ప్రత్యక్షమై సుభద్ర నిద్రపోతు న్నది... ఇక చాల్లే అని ఆపించాడట! ఆ రకంగా అభిమన్యుడు పద్మవ్యూహ ప్రవేశాన్ని గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే క్షుణ్ణంగా నేర్చుకోగలిగాడు. భారత రామాయణాది ఇతిహాసాలు, పురా ణాలు మన సంస్కృతిలో భాగం కనుక, వాటికి సంబంధించిన కథలన్నీ నమ్మాలనే కట్టుబాటు ఉన్నది కనుక ఈ కథను కూడా మనం నమ్ముతాము.

ఈ కాలంలో కూడా అంతకు మించిన వండర్‌ టెలీపతీ ఉన్నదనే సంగతి నిన్ననే తెలిసింది. ‘ఏపీ పోలీస్‌–హ్యాకథాన్‌ –25’ అనే పేరుతో నిన్న గుంటూరులో ఒక టెక్నాలజీ సదస్సు జరిగింది. సందర్భం ఏదైనా సరే, టెక్నాలజీకి ఆది మధ్యాంతాలు తానేనని చెప్పుకోవడం చంద్రబాబు ఆనవాయితీ. అదే ఒరవడిని ఇక్కడ కూడా కొనసాగించారు. దేశంలో ఆటోలు, మోటార్‌ బైక్‌ల ఊబరైజేషన్‌ కోసం రూపొందించిన ‘ర్యాపిడో’ వృత్తాంతాన్ని ఆయన సభికులకు వివరించారు. 

ఆ యాప్‌ను రూపొందించిన వ్యక్తి తండ్రి గతంలో తెలుగుదేశం పార్టీ కార్య కర్తగా ఉండేవారట! అందువల్ల బాబు దగ్గరికి వస్తూపోతూ ఆయన చెప్పే సంగతులన్నీ వినేవారట. అలా విన్న ఫలితమే ఆయన కుమారుడు ర్యాపిడో యాప్‌ను డెవలప్‌ చేయడానికి కారణమైందట! చంద్రబాబు చేసిన జ్ఞానబోధ తండ్రి తలలోంచి తరంగయానం చేసి కుమారుడి మేధను తేజోమయం చేసిందన్నమాట!

ఇటువంటి విడ్డూరాలను శషభిషలేమీ లేకుండా చెప్పు కోవడం చంద్రబాబుకు పరిపాటే! భారతదేశానికి ఐటీని పరి చయం చేసిందీ, సెల్‌ఫోన్‌ తీసుకొచ్చిందీ తానేనని చెప్పు కోవడం చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఎవరూ మరిచి పోకుండా ఉండడానికి ఆయన మళ్ళీ మళ్ళీ గుర్తుచేస్తూనే ఉంటారు. కలామ్‌ను రాష్ట్రపతిని చేసిందీ, వాజ్‌పేయికి జ్ఞానో దయం కలిగించి ‘స్వర్ణ చతుర్భుజి’ పథకానికి శ్రీకారం చుట్టించిందీ తానేనని కూడా ఆయన చెప్పుకున్నారు. 

సత్య నాదెళ్ల,పీవీ సింధు విజయాల వెనుక తన పాత్ర, కోవిడ్‌కు వ్యాక్సిన్‌ కనిపెట్టడం వెనుక తన దూరదృష్టీ వగైరాల గురించి పలు సందర్భాల్లో ఆయన నొక్కి వక్కాణించారు. ఇటువంటి వాగాడంబరాన్ని చూసి చాలామంది చాలారకాల అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. ఎటువంటి అనుమానమూ అవసరం లేదు. ఆయన పూర్తి స్వస్థతతోనే ఇలా మాట్లాడుతుంటారు. ఉద్దేశ పూర్వకంగానే ఆయన ఈ హాస్యరసాన్ని పండిస్తుంటారు.

ఒక అబద్ధాన్ని వందసార్లు చెబితే నిజమైపోతుందనే గోబెల్స్‌ సూత్రాన్ని ఆయన తన పొలిటికల్‌ ఫిలాసఫీకి పునాదిగా భావిస్తారు. తాను వందసార్లు చెబితే వెయ్యిసార్లు రీసౌండ్‌ ఇచ్చేందుకు యెల్లోమీడియా ఉండనే ఉన్నది. ఈ సూత్రాన్ని ప్రత్యర్థులను అప్రతిష్ఠ పాల్జేయడానికీ, తనను ప్రమోట్‌ చేసు కోవడానికీ రెండు వైపులా పదునున్న కత్తిలా ఆయన వాడుతుంటారు. 

ఇప్పుడీ కత్తిని దూయడం బాగా ఎక్కువైంది. తనకి ప్పుడు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డికి లభిస్తున్న అఖండ ప్రజాదరణ ఆయనకు కలవరం కలిగిస్తున్నది. ఇంచుమించు తన రాజకీయ అనుభవంతో సమానమైన వయసున్న జగన్‌ మాస్‌ ఇమేజ్‌ ఎన్ని జన్మలెత్తితే తనకు లభించాలి? లభించదు! అందుకే ఆయనపై దాడి. 

ఆయన వ్యక్తిత్వంపై కనీవినీ ఎరుగని దాడి. కోడికత్తి, తల్లీ – చెల్లీ, బాబాయ్‌–గొడ్డలి అనే పసలేని పదబంధాలతో అరిగిపోయిన రికార్డుల్నే ఆశ్రయిస్తూ చేస్తున్న అనైతిక దాడి. మద్య నియంత్రణ కోసం జగన్‌ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఒక మంచి పాలసీకి సైతం అవినీతి మరక అంటించేందుకు ఆపసోపాలు పడుతూ చేస్తున్న అసహ్య కరమైన దాడి.

ఏడాది గడిచిపోయింది. జగన్‌ వ్యక్తిత్వ హననం కోసం ఎక్కుపెట్టిన దాడులు, ఆయన పార్టీ శ్రేణుల్ని చెల్లాచెదురు చేయడానికి పెడుతున్న కేసులు, చేస్తున్న అరెస్టులు ఫలిత మిస్తున్న సూచనలేవీ కనిపించడం లేదు. పైపెచ్చు ఎదురుదాడి మొదలైంది. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేక గళం వీధివీధినా ప్రతిధ్వనిస్తున్నది. 

ఇక వ్యక్తిత్వ హనన కార్యక్రమమొక్కటే సరిపోదని, ఇంకేదో పెద్ద దాడే జరపాలని భావిస్తున్నట్టు పలు వురు అనుమానిస్తున్నారు. జగన్‌పై ఏదో దారుణమైన కుట్ర జరుగుతున్నదని రాష్ట్ర ప్రజలు బహిరంగంగానే శంకిస్తున్నారు. ఈ అనుమానాలను నిజం చేస్తూ జగన్‌ను ఉద్దేశించి ‘ఆ భూతం తిరిగి రాదు, భూస్థాపితం చేస్తాన’ని ముఖ్యమంత్రి చెబు తున్నారు. 



టీవీ ఇంటర్వ్యూల్లో చెబుతున్నారు. పెట్టుబడిదారు లతో జరిగే సమావేశాల్లో చెబుతున్నారు. పోలీసు అధికారుల సమావేశాల్లోనూ అదే రాజకీయ ఉపన్యాసం. కలెక్టర్ల మీటింగ్‌ లోనూ అదే తరహా సంస్కారహీనమైన ప్రసంగం.

‘జగన్‌ మళ్లీ వస్తే ఎలా’ అని పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఎప్పుడు ప్రశ్నించారో తెలియదు. జగన్‌ హయాంలో పారి పోయిన కంపెనీలేమిటో చెప్పరు. కూటమి వచ్చాక రూపాయికి ఎకరం ఇస్తామంటే తప్ప పరుగెత్తుకొచ్చిన ఇతర కంపెనీలేమిటో చెప్పరు. నిజానికి వాస్తవాలను పరిశీలిస్తే పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నం. 

కూటమి నేతల కప్పం డిమాండ్లకు బెదిరి‘ఇండియా సిమెంట్స్‌’ కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. చెట్టినాడు, భవ్య సిమెంట్‌లు లంచాలివ్వలేక లాకౌట్‌లు ప్రకటించాయి. నవీన్‌ జిందాల్‌పై తప్పుడు కేసు పెట్టి వేధిస్తే జెఎస్‌డబ్లు్య కంపెనీ రాష్ట్రాన్ని వదిలేసి మహారాష్ట్రలో 3 లక్షల కోట్లు పెట్టుబడి పెడుతున్నది. 

మామూళ్ళ కోసం కూటమి నేతలు యూబీ కంపెనీ లారీలను అడ్డుకున్న ఖ్యాతి ఢిల్లీ సర్కార్‌ను కూడా తాకింది. గ్రీన్‌టెక్‌ రీమిక్స్‌లో, కోకాకోలా ప్లాంట్‌లో స్థానిక ఎమ్మెల్యేలు లంచాలు డిమాండ్‌ చేసి రచ్చ కెక్కారు. రామాయపట్నం పోర్టు పనుల్లో వాటా కోసం ఎమ్మెల్యే లారీలను అడ్డుకొని గబ్బు లేపాడు. కూటమి పాలనలో ఇటువంటి ఘటనలను డజన్లకొద్దీ ఉదాహరించవచ్చు.

ఇక రూపాయికి ఎకరం కోటా పెట్టుబడిదారులను మిన హాయించి కూటమి సర్కార్‌ తెచ్చిన పెట్టుబడులు ఏమున్నాయి? ఎన్టీపీసీ వాళ్ళు గ్రీన్‌ ఎనర్జీ కోసం లక్ష కోట్ల పెట్టుబడి పెట్టేందుకు జగన్‌ హయాంలోనే ఒప్పందం కుదిరింది. దానికి సంబంధించిన పరిపాలనా అనుమతులు, భూ బదలాయింపులు కూడా పూర్తయ్యాయి. 

ఇప్పుడు దాన్ని చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారు. జగన్‌ హయాంలో ఒక్క గ్రీన్‌ ఎనర్జీ రంగంలోనే పది లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరి గాయి. ‘అవి మా ఘనతే’నని ఇప్పుడు కూటమి సర్కార్‌ ప్రక టించుకుంటున్నది. జగన్‌మోహన్‌రెడ్డి దావోస్‌లో ఆదిత్య మిట్టల్‌తో సమావేశమై స్టీల్‌ ప్లాంట్‌ స్థాపనకు ఒప్పందం చేసుకుంటే అది కూడా బాబు తన జేబులో వేసుకున్నారు. 

నిజం చెప్పాలంటే ఏపీలో అమలవుతున్న రెడ్‌బుక్‌ రాజ్యాంగం పారి శ్రామికవేత్తలను భయకంపితులను చేస్తున్నది. రాష్ట్రానికి రావడా నికి వారు నిరాకరిస్తున్నారు. కాని, జగన్‌కు భయపడి పరిశ్ర మలు వెళ్ళిపోయాయనే తప్పుడు ప్రచారాన్ని మాత్రం కూటమి నేతలు హోరెత్తిస్తున్నారు. యెల్లో మీడియా గగ్గోలు పెడు తున్నది.

జగన్‌ను భూస్థాపితం చేస్తానని చంద్రబాబు ఒకటికి రెండు సార్లు అనగానే, ఓ వృద్ధ నేత జగన్‌ తల నరుకుతానంటూ బీపీ పెంచుకుంటాడు. ఒకరి తర్వాత ఒకరు చొప్పున కూటమి నేతలు ఇటువంటి ప్రకటనలే చేస్తారు. జగన్‌మోహన్‌రెడ్డి జనంలోకి వెళ్తున్నప్పుడు ఆయనకు ఇవ్వాల్సిన జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రతను నిరాకరించడం ద్వారా కూటమి సర్కార్‌ తన ఉద్దేశాన్ని బయటపెట్టుకుంటున్నది. 

ఆయనొక విశేష ప్రజా దరణ కలిగిన మాస్‌ లీడర్‌. ఆయన బయటకు వెళ్ళినప్పుడు ప్రజలు ఏ స్థాయిలో ఆయన వెంట నడుస్తా రన్నది అనేకమార్లు రుజువైంది. పోలీసులకు ప్రత్యేకంగా చెప్ప వలసిన పని లేదు. రాప్తాడు హెలిప్యాడ్‌ను అసంఖ్యాక జన సమూహం చుట్టుముట్టిన విజువల్స్‌ను టీవీల్లో చూడలేదా? ఆయన రోడ్డు ప్రయాణాల్లో వాహనాన్ని చుట్టుముట్టి కారు బానెట్‌పైకి కూడా ఎగబాకడం కనిపించలేదా? ఆయనకు ఇవ్వాల్సిన భద్రత ఇవ్వకపోతే ఆయనంటే గిట్టని శక్తులు సమూహంలో చొరబడి ఆయన సమీపానికి చేరుకునే అవకాశం లేదా? అటువంటిదేదో జరగాలనే ఉద్దేశం లేకపోతే ఆయన భద్రతను ఎట్లా ఉపేక్షిస్తారు? ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, కుట్రపూరిత నిర్లక్ష్యం!

ఈ వ్యవహారంపై పోలీసులు చెబుతున్న కహానీ చిత్రంగా ఉన్నది. మేము వందమందికి మాత్రమే అనుమతిచ్చాము, కానీ వాళ్ళు వేలాదిమంది వెళ్లారని పోలీసుల అభియోగం. ప్రజలు వేలాదిగా తరలిరావాలని జగన్‌మోహన్‌రెడ్డి గానీ, ఆయన పార్టీ వాళ్ళు గానీ దండోరా వేయలేదే? వార్త తెలిసిన ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. 

వాళ్ళను అడ్డుకోవడానికి రెంటపాళ్ల చుట్టూ ఇరవై చెక్‌పోస్టులు పెట్టి పోలీసుల్ని మోహరించారు కదా! నియంత్రించగలిగారా? రోడ్డు మీద అడ్డుకుంటే చేలల్లోంచి, చెలకల్లోంచి, వంకల్లోంచి, డొంకల్లోంచి తండోప తండాలుగా జనం చేరుకోలేదా? చెక్‌పోస్టుల్లో మోహరించిన పోలీసు సైన్యాన్ని జగన్‌ భద్రత కోసం కేటాయిస్తే అవాంఛనీయ సంఘటనలేమీ జరగవు కదా! అవాంఛనీయ ఘటనలు జరగా లన్నదే ప్రభుత్వ ఉద్దేశమైనపుడు, అందుకోసమే కుట్ర చేస్తున్నప్పుడు ఈవిధంగా ఆలోచించడం కూడా కుదరని పని.

ఈ కార్యక్రమంలో ఒక వైసీపీ అభిమాని దురదృష్టకర మరణాన్ని కూడా కుట్రపూరిత కథకు ఉపయోగించుకోవడం రోత పుట్టించే చర్య. మరో కారు కింద పడి గాయాలైన సింగయ్య మృతి చెందాడని ప్రకటించిన ఎస్పీ, మూడు రోజుల తర్వాత ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో ప్లేటు మార్చిన వైనాన్ని రాష్ట్ర ప్రజలు గమనించారు. ఒక ఫేక్‌ వీడియోను సృష్టించి జగన్‌ ప్రయాణించే కారు కిందనే పడి సింగయ్య మర ణించాడనే కథను ప్రచారం చేశారు. 

మూడు నాలుగు రోజుల పాటు యెల్లో మీడియా దీనిపై వీరంగం వేసింది. జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమికి ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ లోకల్‌ నాయకురాలు మాత్రం కూటమి తానా అంటే తందానా అనే స్థాయికి దిగజారిపోయారు. సింగయ్య మరణంపై ఎస్పీ ముందుగా చెప్పిన ప్రకారం నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్‌కు వర్తించే సెక్షన్లపై కేసులు పెట్టారు. 

జగన్‌మోహన్‌రెడ్డి కారును రంగంలోకి దించిన తర్వాత ఉద్దేశపూర్వకంగానే ప్రమాదం చేసినట్టు సెక్షన్లు మార్చారు. తమ పార్టీ కార్యకర్తను జగన్‌మోహన్‌రెడ్డితో పాటు అందులో ఉన్న వాళ్లంతా హత్య చేసే ఉద్దేశంతో కారు ఎక్కించారట! వాహనం ప్రమాదం చేస్తే అందులో ఉన్న ప్రయాణికులు ఎట్లా బాధ్యత వహిస్తారని ఉన్నత న్యాయస్థానమే చీవాట్లు వేయవలసి వచ్చింది. సాక్ష్యాధా రాలతో మళ్ళీ వస్తామని ప్రభుత్వ లాయర్‌ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. మరి ఏ సాక్ష్యాలున్నాయని కూటమి నేతలు, యెల్లో మీడియా నిపుణులు వీరంగం వేశారో?

జగన్‌ భద్రతపై కూటమి సర్కార్‌ కపట నాటకమాడు తున్నది. ఒక ఎమ్మెల్యేకు ఇవ్వాల్సిన భద్రతను ఇస్తున్నామని హోంమంత్రి చెబుతున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమేనా? ఒంటరిగా పోటీలోకి దిగిన ఆయన పార్టీకి నలభై శాతం ఓట్లు వచ్చాయి. మూడు పార్టీల కూటమికి 55 శాతం ఓట్లు పడ్డాయి. అవన్నీ నిజంగానే పడ్డాయని వాదన కోసం ఒప్పుకుందాం. 

2024 ఎన్నికలపై పరిశోధన చేసిన వోట్‌ ఫర్‌ డెమోక్రసీ (విఎఫ్‌డీ) అనే సంస్థ అనేక అనుమానాలు వ్యక్తం చేసిన సంగతిని వదిలేద్దాం. ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్‌ ముగిసి ఎనిమిది గంటలకు తుది ప్రకటన చేసిన తర్వాత, వారం రోజుల పిదప అనూహ్యంగా పన్నెండున్నర శాతం ఓట్లు పెరిగిన మాయాజాలాన్ని కూడా వదిలేద్దాం. 

ఈవీఎమ్‌లలో ఎన్నికలు జరిగితే నూటికి నూరుపాళ్లు ట్యాంపరింగ్‌ జరిగే అవకాశం ఉన్నదని ఎలాన్‌ మస్క్‌ లాంటి వాళ్లు ఎంతోమంది చెబుతున్న విషయాన్ని పక్కనపెడదాం. ఈవీఎమ్‌లతో జరుగుతున్న ఎన్ని కల్లో అక్రమాలు జరుగుతున్నాయనీ, అందుకు సాక్ష్యాలున్నా యనీ అమెరికా ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ తులసీ గబార్డ్‌ చెబుతున్న మాటల్ని కూడా పెడచెవిన పెడదాం. 

అయినా మూడు పార్టీలకు కలిసి వచ్చిన ఓట్లు 1 కోటీ 53 లక్షలు. జగన్‌ ఒక్కడికే 1 కోటీ 33 లక్షల ఓట్లు పడ్డాయి. తేడా ఇరవై లక్షలు. వారంరోజుల తర్వాత అనూహ్యంగా పెరిగిన ఓట్లు 49 లక్షలని విఎఫ్‌డీ ప్రకటించింది. అయినా, జగన్‌ కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమేనా? ఇటు వంటి సాకులతో జగన్‌ భద్రతను ప్రమాదంలో పడేయాలని ప్రభుత్వం కుట్రలు చేస్తే, ఆయనకు పార్టీ కార్యకర్తలే రక్షణ కవచమవుతారు.

వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement