ఇది కుట్రపూరిత నిర్లక్ష్యం! | Sakshi Editorial On Chandrababu Govt Andhra Pradesh By Vardhelli Murali | Sakshi
Sakshi News home page

ఇది కుట్రపూరిత నిర్లక్ష్యం!

Published Sun, Feb 23 2025 12:59 AM | Last Updated on Sun, Feb 23 2025 12:59 AM

Sakshi Editorial On Chandrababu Govt Andhra Pradesh By Vardhelli Murali

జనతంత్రం

కాలం కలిసొస్తే కొందరికి అధికారం సంప్రాప్తించవచ్చు. అదృష్టం ఈడ్చితంతే కొందరు సరాసరి సింహాసనం మీదనే కూలబడవచ్చు. నక్కజిత్తులతో, తోడేలు వంచనతో, వెన్నుపోటుతో, మోసపు మాటలతో మరికొందరు ‘పవర్‌’ఫుల్‌గా మారిపోవచ్చు. కానీ వారందరూ ప్రజానాయకులు కాలేరు. అసలు నాయకుడంటే ఎవరు? అతనెట్లా ఉండాలి?... నమ్మకానికి నిలువెత్తు ప్రతిరూపంలా ఉండాలి. ఆడిన మాట మీద నిలబడే వాడై ఉండాలి. మడమ తిప్పని వాడై ఉండాలి. 

నిరంతరం జనం గుండె చప్పుళ్లను వినగలిగే విద్యాపారంగతుడై ఉండాలి. సకల జనుల శ్రేయస్సు కోసం పరితపించే తాపసిగా ఉండాలి. అటువంటి ప్రజా నాయకుడికి అధికార హోదాలను మించిన గౌరవం ఉంటుంది. జనం గుండెల్లో కొలువుండే అత్యున్నత హోదా ఉంటుంది. ఆ నాయకుడు వీధుల్లోకి వస్తే జనవాహిని అతని వెంట ప్రవహిస్తుంది. ఆబాలగోపాలం ఆనందోద్వేగాలతో హోరెత్తుతుంది. అది గిరిజన ప్రాంతమా... నగరం నడిబొడ్డా అనే తేడా ఉండదు. అన్ని చోట్లా ఒకటే స్పందన. 

ఆ నాయకుడు కనిపించగానే జనశ్రేణుల పాదాలు జజ్జెనకరె గజ్జల సడి చేయడానికి సిద్ధమవుతాయి. అతడే ప్రజానాయకుడు! ద మాస్‌ లీడర్‌! ఇటువంటి మాస్‌ లీడర్లు ఎందరుంటారు? ఆంధ్రరాష్ట్రం విషయానికి వస్తే అప్పుడెప్పుడో స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో ప్రకాశం పంతులు గారిలో ఈ మ్యాజిక్‌ ఉండేదట. ఆ తర్వాత ఒక ఎన్టీ రామారావు... ఒక వైఎస్‌ రాజశేఖర రెడ్డి... ఇదిగో ఇప్పుడు ఒక జగన్‌మోహన్‌రెడ్డి. దట్సాల్‌!

సింహం ఇంకా వేటకు బయల్దేరనే లేదు. అది వెళ్లేదారిలో గోతులు తవ్వడానికీ, మందుపాతర్లు పెట్టే వ్యూహం పన్నడానికీ తోడేలు మందలు, నక్కల గుంపులు సమావేశమవుతున్నాయట. అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఇంకా విస్తృత జనయాత్రలకు శ్రీకారం చుట్టనేలేదు. 

గద్దెనెక్కిన వారు ఏడాది పండుగ జరుపుకొనేదాకా ఊపిరిపీల్చుకునే అవకాశం ఇవ్వడానికి  ఈ తాత్సారం కావచ్చు. ఇప్పుడు అడపాదడపా పర్యటనలు మాత్రమే జరుగుతున్నాయి. కష్టాల్లో ఉన్న ప్రజాశ్రేణులను కలవడానికీ, నిర్బంధాలకు గురవుతున్న కార్యకర్తలకూ, నేతలకూ అండగా నిలవడానికీ మాత్రమే ఈ పర్యటనలు పరిమితం. గడిచిన వారం ఇటువంటి మూడు యాత్రలు జరిగాయి. 

రెడ్‌బుక్‌ స్కీము కింద అరెస్టయిన సహచరుడు వంశీని కలవడానికి జగన్‌ విజయవాడ జైలుకు వెళ్లారు. దగా పడుతున్న రైతన్నకు దన్నుగా గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లారు. కన్నుమూసిన పార్టీ నాయకుని కుటుంబాన్ని పలకరించడానికి పాలకొండకు వెళ్లారు. ప్రదేశం ఏదైనా, సందర్భం ఏదైనా ప్రజాస్పందన సుస్పష్టం. జనప్రభంజనపు అడుగుల చప్పుడు విస్పష్టం. 

ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఓడిపోయిందని నమ్మడానికి పేదవర్గాల ప్రజలు సిద్ధంగా లేరు. ఏదో ‘మాయ’ జరిగిందని వారు బలంగా నమ్ముతున్నారు. పేదల అభ్యున్నతి కోసం పని చేసినందుకే బడా బాబులంతా కలిసి కుట్ర చేశారన్న అభిప్రాయం వారి మనసుల్లో బలంగా నాటుకొని పోయింది. ఫలితంగా జగన్‌పై వారికున్న అభిమానం మరింత బలపడుతున్నది.

ప్రజలే ఇవ్వని ప్రతిపక్ష హోదాను తామెట్లా ఇస్తామని ఇటీవలనే ప్రవచించిన ముఖ్యనాయకుడికి ప్రజలు మూడ్‌ బాగానే తెలుసు. జగన్‌మోహన్‌రెడ్డి జనంలోకి వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు. జనంలో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డితో తాము తలపడలేమని కూడా తెలుసు. అందుకే ఆయన జనంలోకి రాకూడదని ముఖ్యమంత్రీ, ఆయన శిబిరం భావిస్తుండవచ్చు. 

ఒక వేళ జనంలోకి వస్తే ఏం చేయాలన్న పథకంపై మొన్నటి పర్యటనల్లో రిహార్సళ్లు, రెక్కీలు జరిగి ఉండవచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి. జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రతా కవచాలలో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డికి ఆ స్థాయి భద్రతను కల్పించవలసి ఉన్నది. కానీ, అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు ఆ సిబ్బందిని భారీగా కుదించినప్పుడే అనుమానాలకు బీజం పడింది.

తాడేపల్లిలోని జగన్‌మోహన్‌రెడ్డి నివాసం దగ్గర ఉన్న సెక్యూరిటీ టెంట్లనూ, బారికేడ్లనూ, సిబ్బందినీ తొలగించినప్పుడే ప్రభుత్వ పెద్దల దురుద్దేశం బట్టబయలైంది. వినుకొండ పట్టణ నడివీధిలో జరి గిన రెడ్‌బుక్‌ ఘాతుకానికి బలైన రషీద్‌ కుటుంబ పరామర్శకు బయ ల్దేరినప్పుడు కూడా డొక్కు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని కేటాయించి జగన్‌ భద్రతను ప్రమాదంలోకి నెట్టారు. 

ఆయన నివాసానికి సమీపంలోనే మంటలు చెలరేగడం భద్రతా వైఫల్యం కాక మరేమంటారు? ప్రొటోకాల్‌ ప్రకారం జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రతలో ఉండే నాయకుడు పర్యటనలో ఉన్నప్పుడు రోడ్డు క్లియర్‌ చేసే టీమ్, కాన్వాయ్, రోప్‌ పార్టీ, ఎస్కార్ట్‌ విధిగా ఉండి తీరాలి. కానీ జగన్‌ పర్యటనల్లో వేళ్ల మీద లెక్కించగలిగేంత మంది కానిస్టేబుళ్లు తప్ప ఇవేమీ కనిపించడం లేదు.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు భద్రతకు ఎటువంటి లోటూ జరగలేదు. రూల్‌బుక్‌ స్థానాన్ని రెడ్‌బుక్‌ ఆక్రమించలేదు. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు చంద్రబాబు తెలంగాణ రాష్ట్రంలోనే స్థిరనివాసం ఉండేవారు. జడ్‌ ప్లస్‌ కేటగిరీ కనుక ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రొటోకాల్‌ ప్రకారం తీసుకోవలసిన భద్రతా చర్యల్ని తీసుకున్నది. 

అది ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. జగన్‌ విషయంలో ఈ బాధ్యతను రాష్ట్రప్రభుత్వం విస్మరించడం వెనుక భయంకరమైన కుట్ర ఉండవచ్చనే అనుమానాలు విస్మయాన్ని కలిగిస్తున్నాయి. అవి కేవలం అనుమానాలు మాత్రమే కావని జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఇది మరింత ఆందోళన కలిగించే విషయం.

జగన్‌ భద్రత విషయంలో కుట్రపూరితమైన ఆలోచనలు చేయవలసిన అవసరం ప్రభుత్వ పెద్దలకు తప్ప ఇంకెవరికీ లేదు. చంద్రబాబు కూటమి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది. తాము అమలు చేయలేమని తెలిసినప్పటికీ అనేక హామీలను గుప్పించి ఓటర్లను వంచించింది. ఇప్పుడా హామీలన్నింటినీ చాప చుట్టేసి అటకెక్కించింది. అంతకు ముందు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన ‘నవరత్న’ పథకాలు కూడా ఆగిపోయాయి.

విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో జగన్‌ ప్రభుత్వం ప్రారంభించిన ప్రజాస్వామికీకరణ కార్యక్రమాన్ని నిలిపి వేసి ప్రైవేట్‌ దోపిడీకి బాటలు వేస్తున్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిన గృహనిర్మాణ విప్లవానికి కళ్లెం వేశారు. ‘అమ్మ ఒడి’ని ఆపేశారు. ‘చేయూత’ను వదిలేశారు. ‘కాపు నేస్తం’ కనిపించడం లేదు. ఈ బీసీ నేస్తం పత్తా లేదు. జాతీయ స్థాయిలో బహుళ ప్రశంసలు అందుకున్న వలంటీర్‌ వ్యవస్థను పూర్తిగా ఎత్తేశారు. 

తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల గౌరవ వేతనాన్ని రెట్టింపు చేస్తానని ప్రతి ఎన్నికల సభలోనూ బాబు ఘంటాపథంగా చెప్పుకొచ్చారు. అధికారంలోకి రాగానే ఆ వ్యవస్థనే గిరాటేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు ఇటువంటి పచ్చి మోసాన్ని అనుమతించవచ్చునా? ఇటువంటి మోసగాళ్లు పాలకులు కావడం వాంఛనీయమేనా? ఇదొక్క అంశమే కాదు. అన్ని హామీలకూ ఇదే గతి పట్టింది. వీటిపై ప్రజల్లోనూ, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వారిలోనూ విస్తృతమైన చర్చ జరగవలసిన అవసరం ఉన్నది. 

ప్రజానాయకుడైన జగన్‌మోహన్‌రెడ్డి ఒకసారి రాష్ట్రవ్యాప్త పర్యటనలకు శ్రీకారం చుడితే కూటమి మోసాల గుట్టురట్టవుతుంది. విస్తృత స్థాయిలో చర్చ మొదలవుతుంది. ఈ పరిణామం కూటమి మనుగడకే ్రపమాదం. కనుక జగన్‌మోహన్‌రెడ్డి జనంలోకి రాకూడదు. గతంలోనే ఆయనపై రెండు మార్లు హత్యాప్రయత్నాలు జరిగి ఉన్నాయి గనుక భద్రతా చర్యలను నిలిపివేస్తే ఆయన యాత్రలు ఆగిపోతాయన్న వెర్రి ఆలోచన ఏమైనా ఉండవచ్చు. 

భద్రతా సిబ్బందిని తొలగించినా, కార్యకర్తలే రోప్‌ పార్టీగా మారి నడుస్తున్న పరిణామాన్ని చూసిన తర్వాత మరింత తీవ్రమైన వ్యూహాలకు కూటమి సర్కార్‌ పదును పెట్టే అవకాశం ఉన్నది. ఎందుకంటే జగన్‌ వంటి ప్రజానాయకుడు రంగంలో ఉండగా తన వారసుడు రాజకీయంగా నిలదొక్కుకోవడం కష్టమనే సంగతి చంద్రబాబుకు స్పష్టంగా తెలుసు. ఆదిలో బాబు నిల దొక్కుకోవడానికి కూడా ఎన్టీఆర్‌ను వెన్నుపోటు ద్వారా రంగం నుంచి తప్పించడానికి ఎటువంటి వ్యూహాలు అమలు చేశారనేది తెలిసిన సంగతే!

రాజశేఖర్‌రెడ్డిని గద్దెదించడానికి కూడా బాబుకూటమి చేయని ప్రయత్నం లేదు. తెలంగాణ రాష్ట్రం కోసమే పుట్టిన ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌నూ, సమైక్య రాష్ట్రానికి కట్టుబడివున్న సీపీఎంనూ ఒక్కచోటకు చేర్చి ‘మహాకూటమి’ని కట్టిన సంగతి కూడా తాజా జ్ఞాపకమే! ఆయన మీద ఎంత దుష్ప్రచారం చేసినా, ‘మహాకూటమి’ని నిర్మించినా, సంప్రదాయ కాంగ్రెస్‌ ఓటును చిరంజీవి పార్టీ బలంగా చీల్చినా బాబు ముఠా ప్రయత్నాలు ఫలించలేదు. కాకపోతే దురదృష్టవశాత్తు ఆ మహానేత మరో విధంగా రంగం నుంచి నిష్క్రమించారు.

జగన్‌మోహన్‌రెడ్డి మరో బలమైన మాస్‌ లీడర్‌గా ఆవిర్భవిస్తారని చంద్రబాబు – యెల్లో మీడియా వారు ఆదిలోనే గుర్తించారు. ఆయన్ను మొగ్గలోనే తుంచేయడానికి చేసిన ప్రయత్నాలను తెలుగు ప్రజలందరూ గమనించారు. గడిచిన పదిహేనేళ్లుగా జగన్‌మోహన్‌ రెడ్డి మీద జరుగుతున్న వ్యక్తిత్వ హనన కార్యక్రమం న భూతో న భవిష్యతి. ప్రపంచ చరిత్రలోనే ఈ స్థాయిలో వ్యక్తిత్వ హనన గోబెల్స్‌ ప్రచారం ఎవరి మీదా జరిగి ఉండదు. 

ప్రజా నాయకులను దూరం చేసి చంద్రబాబుకు మార్గం సుగమం చేసే కార్య క్రమంలో యెల్లో మీడియా, దాని రింగ్‌ లీడర్‌ రామోజీరావు పోషించినది దుర్మార్గమైన పాత్ర. చట్టాన్ని ధిక్కరించి ఫైనాన్సియర్స్‌ పేరుతో నిధులు పోగేసిన వ్యక్తి రామోజీ. చిట్‌ఫండ్స్‌ పేరుతో జనం సొమ్మును సొంత వ్యాపారాలకు వాడుకున్న వ్యక్తి రామోజీ. ఒకరి కొకరు తోడు నీడగా బాబు–రామోజీలు ముప్ఫయ్యేళ్ల ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ చరిత్రను భ్రష్టు పట్టించారు. 

అయినా సరే, జనం మాత్రం జగన్‌ వెంట నిలబడుతున్నారు. ఈ పరిణామం కూటమి నేతలకు మింగుడు పడటం లేదు. ఈ నేపథ్యంలోంచి చూసినప్పుడు జగన్‌కు భద్రత కల్పించడంలో విఫలం కావడమనేది కేవలం పొరపాటు కాదు. వట్టి నిర్లక్ష్యం కాదు. ఉద్దేశపూర్వక∙నిర్లక్ష్యం, కుట్రపూరిత నిర్లక్ష్యం! ఇటువంటి ధోరణిని ఎండగట్టకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థలు మరింత బలహీనపడతాయి.


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement