
జనతంత్రం
పీసీ సర్కార్ ఇంద్రజాలం గొప్పదా... ఏపీ సర్కార్ ఇంద్ర జాలం గొప్పదా? పీసీ సర్కార్ మ్యాజిక్ ట్రిక్స్ ఈ దేశ ప్రజలను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తేవని విన్నాము. ఏపీ సర్కార్ ట్రిక్స్ మాత్రం ప్రజలను షాక్ మీద షాక్‌కు గురిచేస్తున్నాయి. అది... స్టేజ్ షో. అంతా మ్యాజిక్ అనే సంగతి ముందుగానే తెలుసు! కానీ, ఇది... జనజీవితంతో ఆటాడుకోవడం! మోసపోతున్నా మని ముందుగా ప్రజలకు తెలియదు. క్రమంగా అనుభవంలోకి వస్తుంది. ఎన్నికలకు ముందు ఇంటింటికీ ఓ వైకుంఠాన్ని వాగ్దానం చేసిన మ్యానిఫెస్టో కూడా మ్యాజిక్ షోలో భాగమని అప్పుడు అర్థం కాలేదు. మెజీషియన్ దాన్ని తన టోపీలో పడే శారు. ఇప్పుడా టోపీలోంచి కుందేళ్లు, కుక్కపిల్లలు వగైరాలే వస్తున్నాయి. మ్యానిఫెస్టో మాయమైంది.
ఇంద్రజాల విద్యలతో జనాన్ని ఆహ్లాదపరచాలని, హామీల సంగతిని మరిపింపజేయాలని చంద్రబాబు సర్కార్ ప్రయాస పడుతున్నది. అందులో భాగంగా ఆయన నాలుగు రోజులకో కొత్త ట్రిక్కును నేర్చుకొస్తున్నారు. వేదికల మీద వాటిని ప్రదర్శి స్తున్నారు. కీలకమైన మూడు అంశాల్లో వాస్తవాలకు గంతలు కట్టడానికి, ప్రజలను భ్రమల్లో ముంచెత్తడానికి శతవిధాలైన విన్యాసాలను ఆయన ప్రదర్శిస్తున్నారు. ఇందులో మొదటి అంశం – అభివృద్ధి అనే పదానికి తననే నిర్వచనంగా చెప్పు కోవడం, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్‌గా తనను తాను ప్రమోట్ చేసుకోవడం!
కానీ, వాస్తవ పరిస్థితి? ఈ పది మాసాల కాలంలోనే అప్పుల్లో రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రికార్డులను బద్దలు కొట్టింది. ప్రజల కొనుగోలుశక్తి దారుణంగా పడిపోయింది. పన్నుల వసూళ్లు మందగించాయి. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు తిరోగమన పథంలోకి వెళ్లాయి. రైతు కుటుంబాలు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నాయి. ప్రభుత్వ నిర్వాకం కారణంగానే ధాన్యం రైతుల దగ్గర్నుంచి ఆక్వా రైతుల వరకు అందరూ దయనీయ స్థితిలోకి జారిపోతున్నారు. విద్యుత్ బిల్లుల భారంతో వేలాది ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ పరిశ్రమలు మూతపడ్డాయి. ఇరవై వేలమంది ఉపాధి కోల్పోయారు.
బాబు సర్కార్ మ్యాజిక్ చేయదలచుకున్న రెండో అంశం – సంక్షేమ రంగం. సంక్షేమం అంటేనే తెలుగుదేశం పార్టీ గుర్తు కొస్తుందని బహిరంగ సభల్లో చంద్రబాబు చెప్పుకొస్తున్నారు. ఎన్నికలకు ముందు కూటమి తరఫున ఆయన చేసిన వాగ్దానాల సంగతిని కాసేపు మరిచిపోదాం. అంతకుముందు జగన్ ప్రభుత్వం అమలుచేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలను చాప చుట్టేసి అటకెక్కించారు. ‘అమ్మ ఒడి’ ఆగిపోయింది. మహిళలకు ‘చేయూత’ అందడం లేదు. ‘వైఎస్సార్ బీమా’ కనుమరుగైంది. ‘మత్స్యకార భరోసా’ మాయమైంది. ‘కల్యాణమస్తు’ కనిపించడం లేదు. ఆటో డ్రైవర్లకు ‘చేదోడు’ లేదు. చిల్లర వర్తకులకు తోడుగా నిలిచిన రుణ సదుపాయం నిలిచిపోయింది. ఇవి కొన్ని మాత్రమే! చెప్పుకుంటూ పోతే సంక్షేమం కథ చాలా పెద్దది.
ఇక మూడో ఇంద్రజాల ఇతివృత్తం – తనను తాను గొప్ప ప్రజాస్వామికవాదిగా ప్రచారం చేసుకోవడం. తన రాజకీయ జీవితంలో ఎన్నడూ హింసా రాజకీయాలు చేయలేదు. కక్షలూ కార్పణ్యాలకు పూనుకోలేదు. వ్యక్తిత్వ హననాలకు పాల్పడలేదని బాబు చాలా సందర్భాల్లో చెప్పుకుంటున్నారు. అనుబంధ మీడియా ఇంకో నాలుగడుగులు ముందుకెళ్లి ఆయన్ను ప్రమోట్ చేస్తున్నది. ఈ ప్రమోషన్‌కూ, వాస్తవ పరిస్థితికీ మధ్యన 180 డిగ్రీల దూరం ఉన్నదని పది నెలల కాలంలో జరిగిన అనేక ఘటనలు రుజువు చేశాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరావడంతోనే ప్రత్యర్థుల వేట మొదలుపెట్టింది.
వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లను బహిరంగంగా నరికి చంపుతున్న భయానక దృశ్యాలను చూడవలసి వచ్చింది. పల్నాడు వంటి ప్రాంతాల్లో వేలాదిమంది ప్రజలు దాడులకు భయపడి ప్రవాస జీవితాలు గడపవలసి వచ్చింది. సోషల్ మీడియాలో విమర్శలు చేసేవారి మీద దారుణమైన సెక్షన్లతో కేసులు పెట్టారు. 50 పైచిలుకు మందిని అరెస్టు చేశారు. వందలాది మందిపై కేసులు నమోదయ్యాయి. బీఎన్‌ఎస్ 111 సెక్షన్‌ను దుర్వినియోగం చేస్తు న్నారని పోలీసులను పలుమార్లు ఉన్నత న్యాయస్థానం మంద లించవలసి వచ్చింది. ‘రెడ్‌బుక్’ గైడ్‌లైన్స్ ప్రకారం పనిచేయా లని పోలీసులను వారి ఉన్నతాధికారులే ఒత్తిడి చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో ఎన్నడూ ఎరుగని పరిణామాలివి.
తనకు లేని ఘనతల్ని ఆపాదిస్తూ యెల్లో మీడియా తగిలించిన భుజకీర్తులను కాపాడుకోవడానికి చంద్రబాబు ఇప్పుడు మ్యాజిక్ షోలను ఆశ్రయించక తప్పడం లేదు. అమరావతి ప్రాంతంలో కొన్ని కృత్రిమ మెరుపుల్ని మెరిపించి, ‘అదిగో అభి వృద్ధి’ అని చెప్పుకోవాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అమరావతి పేరుతో 30 వేల కోట్ల అప్పులు ఇప్పటికే తీసు కొచ్చారు. రైల్వే స్టేషన్ ఎక్కడొస్తుందో ప్రకటించారు. బస్టాండ్ స్థలాన్ని గుర్తించడం జరిగింది.
అద్భుతమైన స్టేడియం వస్తుందని ప్రచారం చేశారు. ఆకాశ హర్మ్యాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఐటీ పరిశ్రమను వేలు పట్టుకొని హైదరాబాద్‌కు తీసుకొచ్చిన తాను, అదే చందంగా ‘క్వాంటమ్ వ్యాలీ’ని అమ రావతికి పిలుచుకొస్తానని కూడా చంద్రబాబు పదేపదే ప్రక టిస్తున్నారు. ‘క్వాంటమ్ వ్యాలీ’ ఏర్పాటుకు అవసరమయ్యే భౌతిక, మే«ధాపరమైన పరిస్థితులు అమరావతిలోనే కాదు,ఆంధ్రప్రదేశ్‌లోనే లేవనేది నిపుణుల అభిప్రాయం. సమీప భవి ష్యత్తులో అటువంటి ఎకో సిస్టమ్ ఏర్పడే అవకాశాలు కూడా లేవని వారు చెబుతున్నారు.
అయినా సరే, అమరావతి టైర్లలో గాలి నింపడానికి ఆయన ఇటువంటి అసంగతమైన సంగతులు ఇంకా ఎన్నయినా చెప్ప వచ్చు. అయినప్పటికీ అక్కడ రియల్ ఎస్టేట్ రంగంలో కదలిక కనిపించడం లేదు. అక్కడ ప్లాట్లు కొనేందుకు జనం ఎగబడడం లేదు. చివరికి మొన్న అమరావతి కోర్ క్యాపిటల్ ప్రాంతంలో ఐదెకరాల పైచిలుకు విస్తీర్ణం (25 వేల చదరపు గజాలు)లో ఉన్న ప్లాట్‌లో స్వగృహ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు.
వెలగ పూడి గ్రామానికి చెందిన కంచర్ల కుటుంబం వారు తమ 29 ఎకరాల 51 సెంట్ల వ్యవసాయ భూమిని ల్యాండ్ పూలింగ్‌కు అప్పగించగా వారికి 25 వేల చదరపు గజాల ప్లాటు కోర్ క్యాపి టల్ ఏరియాలో లభించింది. 18 కోట్ల 75 లక్షల రూపాయలు వెచ్చించి ఈ భూమిని నారా బ్రాహ్మణి పేరుతో ఉన్న ట్రస్టు ద్వారా కొనుగోలు చేశారు. అంటే గజానికి 7,500 పడిందన్న మాట. కోర్ క్యాపిటల్ ప్రాంతంలో మరీ ఇంత తక్కువ రేటేమిటో?
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సీనియర్ మోస్ట్ రాజకీయవేత్త మిగిలిన సొమ్మును బ్లాక్‌లో చెల్లించి ఉంటారని అనుకోలేము కదా! అమరావతిలోని చాలా ప్రాంతాల్లో రిజిస్ట్రే షన్ విలువ గజానికి ఐదు వేలు మాత్రమే ఉందట! చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఇంత తక్కువ విలువ ఎక్కడా లేదు. ప్రపంచంలోని ఐదు పెద్ద నగరాల్లో ఒకటిగా నిలబెట్టాలని తలపోస్తున్న అమరావతిలో ఈ విలువేమిటో అర్థం కాదు.
ప్రస్తుతం అమరావతి పట్నం ‘బ్లాక్’ ఈజ్ బ్యూటీ అని కలవరిస్తున్నది. పిలు స్తున్నది. కానీ ఆ బ్యూటీ మాత్రం అమరావతిని ఇంకా కరుణించడం లేదు. ఎప్పుడు కరుణిస్తుందో, రియల్ ఎస్టేట్ ఎప్పుడు పుంజుకుంటుందో, ఆకాశహర్మ్యాలకు పునాదులు ఎప్పుడు పడతాయో! అప్పటికీ తన మీద అభివృద్ధి ప్రదాత అనే స్టాంపు వేయించుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం చేయగలిగినంత మ్యాజిక్‌ను చేస్తూనే ఉన్నది.
అభివృద్ధి ముద్ర కోసం అమరావతి ముసుగును వేసు కున్నట్టే... సంక్షేమం సర్టిఫికెట్ కోసం ఆయన ‘పీ–ఫోర్’ అనే దౌర్భాగ్య సిద్ధాంతాన్ని ముందుకు తెస్తున్నారు. పేదరిక నిర్మూలనకు కృషి చేయవలసిన ప్రభుత్వ బాధ్యత నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేల మీద పుట్టిన ప్రతి జీవి ఈ దేశ సంపదలో హక్కుదారేనన్నది సహజ న్యాయం.
ఆ సహజ న్యాయం రాజ్యాంగ హక్కుగా పౌరులందరికీ భరోసా నిచ్చింది. కానీ, దేశ సంపదను ప్రైవేటీకరించడంలో ఉత్సాహాన్ని ప్రదర్శించే చంద్రబాబు పేద ప్రజలను కూడా ప్రైవేటీకరించడానికి పూనుకున్నారు. తమ హక్కుల సాధన కోసం, తమ న్యాయమైన వాటా కోసం పిడికిళ్లు బిగించ వలసిన ప్రజలను మభ్యపెట్టి, తక్షణావసరాల కోసం సంప న్నుల ముందు సాగిలపడేట్టు ప్రోత్సహిస్తున్నారు. తన సంక్షేమ బాధ్యతల నుంచి తప్పుకొని తన అనుచరులకు సంపద సృష్టించే పథకాల గురించి ఆయన ఆలోచిస్తున్నారు. ‘పీ–ఫోర్’ మంత్రంతో పేదరికం పోదు. ఈ మ్యాజిక్ ఎక్కువ కాలం చెల్లదు.
అనగనగా ఒక చిత్తకార్తె చతుష్పాద జీవి లాంటి వెధవొకడు టీడీపీకి అనుబంధ సోషల్ మీడియాలో కిరాయి సైనికుడు. వైసీపీ అగ్రనేత మీద సొల్లు వాగాడు. ఈ రకమైన వాగుడు, అటువంటి పోస్టింగులు అతడికి చిరకాలంగా అలవాటే! కానీ, మొన్నటి ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి ఖండించారు. అతడిని పార్టీ నుంచి తప్పిస్తున్నట్టు ప్రక టించారు. అరెస్ట్ చేశారు. స్వాగతించవలసిన విషయమే! కానీ, ఈ వ్యవహారంలో చిత్తశుద్ధి ఉండాలనేది సహజమైన ఆకాంక్ష. ఈ ఖండన వెలువడిన వెంటనే సిద్ధంగా ఉన్నట్టుగా యెల్లో మీడియా స్పందించింది.
చంద్రబాబును ప్రశంసలతో ముంచె త్తింది. ఇమేజ్ మేకోవర్ ఎక్సర్‌సైజని అర్థమవుతూనే ఉన్నది. అదే బాధాకరం. రెడ్‌బుక్ రాజ్యాంగ పాలన జరుగుతున్నదని ఈ పది నెలల పాలనపై ఆరోపణలు వస్తున్నాయి. చిత్తశుద్ధి వుంటే దీన్ని సరిదిద్దుకోవాలి. కానీ హైకోర్టు హెచ్చరిస్తున్నా ఈ పాలనలో మార్పు రావడం లేదు. టీడీపీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఐటీడీపీలో వందలాదిమంది సైకోల్లాంటి కిరాయి సైనికులు పనిచేస్తున్నారు.
వారి జుగుప్సాకరమైన రాతలతో, వాగుడుతో ఎంతోమంది కలతచెందిన ఘటనలున్నాయి. ఎన్ని కలకు ముందు గుంటూరు జిల్లాలో గీతాంజలి అనే గృహిణి ఈ వేట కుక్కల దాడి తట్టుకోలేక, ఆత్మహత్య చేసుకున్నది. అప్పుడే ఖండించి ఉంటే, చర్యలు తీసుకొని ఉంటే పరిస్థితులు ఇలా దిగజారి ఉండేవా? విజయవాడలో జగన్ మామ గురించి ఆప్యాయంగా మాట్లాడిన ఓ పసిబిడ్డ మీద అవాకులు చవాకులు పేలినప్పుడైనా ఈ ఖండన రావాల్సింది.
ఇటువంటి అను భవాలు కోకొల్లలు. ఎప్పుడూ స్పందించలేదు. పైపెచ్చు ప్రోత్సహించారని మొన్నటి సొల్లు వెధవే ఒక వెబ్ చానల్‌లో చెప్పుకొచ్చాడు. ఈ కారణాల రీత్యా, దిగజారి పోతున్న ప్రతిష్ఠను కాపాడుకోవడానికే ఇలా స్పందించారని భావించవలసి వస్తున్నది. మ్యాజిక్ షోలెప్పుడూ మ్యానిఫెస్టో అమలుకు ప్రత్యామ్నాయం కాబోవు. అలా భావిస్తే భంగపాటు తప్పదు!
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com