నీళ్లున్నా కన్నీరే
తలాపున కృష్ణమ్మ బిరబిరా పరుగులిడుతున్నప్పటికీ ఇక గ్రేటర్ రాయలసీమకు కన్నీళ్లు తప్పవా? కళ్లెదుటే శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు నిండిపోయి ప్రకాశం బ్యారేజీ మీదుగా కృష్ణా వరద జలాలు కడలిలో కలుస్తున్నా సరే గ్రేటర్ రాయలసీమకు చుక్క నీటిని విడుదల చేయరా? విభజన చట్టంలోని 11వ షెడ్యూలులో పదో పేరా ద్వారా కేంద్రం అనుమతి ఇచ్చిన హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ, తెలుగుగంగ ప్రాజెక్టులు ఉత్సవ విగ్రహాల్లా మారిపోతాయా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నారు. నీటి పారుదల రంగ నిపుణులు. సాక్షి, అమరావతి : దేశంలో తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సాగు నీటి మాట దేవుడెరుగు.. గుక్కెడు తాగు నీటికీ ఇబ్బందులు తప్పవని నీటి పారుదల రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్(కేడబ్ల్యూడీటీ)–2లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్ నిర్వహణ(ఆపరేషన్ రూల్స్)పై రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాక్షి ఏకే గోయల్ అక్టోబర్ 18న దాఖలు చేసిన అఫిడవిట్ ద్వారా గ్రేటర్ రాయలసీమకు వెన్నుపోటు పొడిచారని నిపుణులు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లకు కేడబ్ల్యూడీటీ–2 కృష్ణా జలాలను పంపిణీ చేస్తూ కేంద్రానికి 2010 డిసెంబర్ 30న ప్రాథమిక నివేదిక.. 2013 నవంబర్ 29న తుది నివేదిక ఇచ్చాయి. వాటిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో కేడబ్ల్యూడీటీ–2 తుది నివేదికను కేంద్రం అమలు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేయలేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు నీటి కేటాయింపు చేసే బాధ్యతను విభజన చట్టం ద్వారా కేంద్రం కేడబ్ల్యూడీటీ–2కే అప్పగించింది. విభజన చట్టంలోని మార్గదర్శకాలు, కేంద్రం గతేడాది అక్టోబర్ 6న జారీ చేసిన అదనపు నియమ, నిబంధనల మేరకు రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాల పంపిణీపై కేడబ్ల్యూడీటీ–2 విచారణ చేస్తున్న విషయం తెలిసిందే.దేశంలో అత్యంత దుర్భిక్ష ప్రాంతమైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను సుభిక్షం చేయడానికి తెలుగు గంగ (29 టీఎంసీలు కృష్ణా జలాలు + 30 టీఎంసీలు పెన్నా జలాలు), గాలేరు–నగరి (38 టీఎంసీలు), హంద్రీ–నీవా (40 టీఎంసీలు), వెలిగొండ ప్రాజెక్టు (43.5 టీఎంసీలు)ను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. మిగులు జలాల ఆధారంగా ఈ ప్రాజెక్టులను చేపట్టింది. శ్రీశైలం ప్రాజెక్టులో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తెలుగుగంగ, ఎస్సార్బీసీ(శ్రీశైలం కుడి గట్టు కాలువ)కు మూడు దశాబ్దాలుగా, 11 ఏళ్లుగా గాలేరు–నగరి, .. 12 ఏళ్లుగా హంద్రీ–నీవాకు నీరు విడుదల చేస్తున్నారు.వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ఇప్పటికే దాదాపుగా పూర్తయింది. నిర్వాసితులకు పునరావాసం కలి్పంచడమే తరువాయి. శ్రీశైలం నుంచి వెలిగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్‌కు కృష్ణా జలాలను తరలించవచ్చు. కానీ.. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్ల నిర్వహణపై కేడబ్ల్యూడీటీ–2లో రాష్ట్ర ప్రభుత్వం తన తరఫు సాక్షి అయిన ఏకే గోయల్ ద్వారా దాఖలు చేయించిన అఫిడవిట్‌ను పరిశీలిస్తే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలుగుగంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరిలతోపాటు వెలిగొండ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయడం ప్రశ్నార్థకంగా మారిందని నీటి పారుదల రంగ నిపుణులు తేల్చి చెబుతున్నారు. సముద్రంలో కలిసినా సరే.. ⇒ గత ఆరేళ్ల తరహాలోనే కృష్ణాకు ముందుగా అంటే జూలై, ఆగస్టులో వరదలు ప్రారంభమై శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు నిండి.. ప్రకాశం బ్యారేజ్ ద్వారా వరద జలాలు సముద్రంలో కలుస్తున్నా సరే తెలుగుగంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేసే అవకాశం ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేడబ్ల్యూడీటీ–1 కేటాయించిన ప్రాజెక్టుల కింద 811 టీఎంసీల నికర జలాలు (75 శాతం లభ్యత) వాడుకుని, శ్రీశైలం, సాగర్‌లలో 150 టీఎంసీలను క్యారీ ఓవర్ కింద నిల్వ చేశాకే ఆ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ⇒ పోలవరం కుడి కాలువ నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలకుగానూ.. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి అదనంగా దక్కే 45 టీఎంసీలను కూడా కృష్ణా బేసిన్‌లోని మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు కేడబ్ల్యూడీటీ–1 కేటాయించిన 2130 టీఎంసీలను వినియోగించుకున్న తర్వాతే తెలుగంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టులకు విడుదల చేస్తామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో.. తెలుగుగంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టులకు నీళ్లు దక్కే అవకాశాలు కనిష్టంగా ఉంటాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు ఆ ప్రాజెక్టులు ఉత్సవ విగ్రహాలే ⇒ కృష్ణా నదిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 2,060 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన కేడబ్ల్యూడీటీ–1.. పునరుత్పత్తి జలాలు 70 టీఎంసీలు కలుపుకుంటే 2,130 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసి.. మహారాష్ట్రకు 585, కర్ణాటకకు 734, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు కేటాయించింది. అంతకంటే అదనంగా ఉన్న జలాలు అంటే.. మిగులు నీటిని వినియోగించుకునే స్వేచ్ఛను దిగువ రాష్ట్రమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఇచి్చంది. ⇒ కేడబ్ల్యూడీటీ–1 కేటాయించిన 2,130 టీఎంసీల నికర జలాలను యథాతథంగా కొనసాగిస్తూనే.. 65 శాతం లభ్యత, సగటు ప్రవాహాలు ఆధారంగా 448 టీఎంసీలను కేడబ్ల్యూడీటీ–2 మూడు రాష్ట్రాలకు అదనంగా పంపిణీ చేసింది. దాంతో మహారాష్ట్రకు 666, కర్ణాటకకు 907, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1,005 టీఎంసీలు దక్కాయి. తద్వారా కేడబ్ల్యూడీటీ–2 మొత్తం 2,578 టీఎంసీలను కేటాయించింది. అంతకంటే ఎక్కువ లభ్యత ఉన్న నీటిని అంటే మిగులు జలాలను వాడుకునే స్వేచ్ఛను దిగువ రాష్ట్రమైన ఉమ్మడి ఏపీకి కేటాయించింది. ఈ నీటి కేటాయింపులు రాష్ట్రాలకు దక్కేలా చేయడం కోసం బేసిన్ పరిధిలోని అన్ని రాష్ట్రాలను కృష్ణా బోర్డు పరిధిలోకి తేవాలని సూచించింది. ⇒ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేడబ్ల్యూడీటీ–2 అదనంగా కేటాయించిన 194 టీఎంసీల్లో.. 76–65 శాతం మధ్య లభ్యతగా ఉన్న 49 టీఎంసీలు (జూరాలకు 9, ఆర్డీఎస్ కుడి కాలువకు 4, క్యారీ ఓవర్ కింద 30, పర్యావరణ ప్రవాహాలు 6 టీఎంసీలు), 65 శాతం సగటు ప్రవాహాల మధ్య లభ్యతగా ఉన్న 145 టీఎంసీలు (తెలుగు గంగకు 25, క్యారీ ఓవర్ కింద 120 టీఎంసీలు) కేటాయించింది. ⇒ కేడబ్ల్యూడీటీ–2 తీర్పును అమలు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తే.. కృష్ణా బేసిన్ పరిధిలోని రాష్ట్రాలన్నీ 2,578 టీఎంసీలను వాడుకున్న తర్వాతే హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేస్తామని ట్రిబ్యునల్‌లో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. కేడబ్ల్యూడీటీ–1 కూడా బేసిన్ పరిధిలోని రాష్ట్రాలతో కలిపి కృష్ణా బోర్డును ఏర్పాటు చేసి.. అన్ని రాష్ట్రాలకు వాటా జలాలు అందేలా చూడాలని చేసిన సూచనను కేంద్రం అమలు చేయలేదు. ఇప్పుడు కూడా కృష్ణా బోర్డును అన్ని రాష్ట్రాలకు వర్తింపజేయకపోతే.. 2,578 టీఎంసీలను వినియోగించుకున్నట్లు తేల్చేదెవరని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ⇒ పోలవరం కుడి కాలువ నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలకుగానూ.. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి అదనంగా దక్కే 45 టీఎంసీలను కూడా కృష్ణా బేసిన్‌లోని మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు కేడబ్ల్యూడీటీ–2 కేటాయించిన 2,578 టీఎంసీలను వినియోగించుకున్న తర్వాతే తెలుగంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టులకు విడుదల చేస్తామని స్పష్టం చేసింది. ⇒ ఇక కేడబ్ల్యూడీటీ–2 కేటాయించిన నీటిని గంపగుత్తగా వినియోగించుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ ముందు ప్రతిపాదించలేదు. దాంతో కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను మళ్లించినా సరే.. శ్రీశైలం నుంచి హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేసే అవకాశం ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంటే ఆ ప్రాజెక్టులు ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోతాయని తేల్చి చెబుతున్నారు.తుంగభద్రలో పూడికతో ‘సీమ’కు నష్టం తుంగభద్ర డ్యాంను 133.5 టీఎంసీల సామర్థ్యంతో నిరి్మంచారు. ఆ డ్యాం ఒకటిన్నరసార్లు నిండుతుందని.. దాని వల్ల ప్రాజెక్టులో 230 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన కేడబ్ల్యూడీటీ–1.. రాయలసీమకు 66.5 టీఎంసీలు (హెచ్చెల్సీ 32.5, ఎల్లెల్సీ 24, కేసీ కెనాల్ 10), తెలంగాణ(ఆర్డీఎస్)కు 6.51 టీఎంసీలు కేటాయించింది. కానీ.. తుంగభద్ర డ్యాంలో పూడిక పేరుకు పోవడంతో నీటి నిల్వ 105 టీఎంసీలకు తగ్గింది. అంటే.. 25 టీఎంసీల నిల్వ తగ్గినట్లు స్పష్టమవుతోంది. డ్యాం ఒకటిన్నర సార్లు నిండుతుందని బచావత్ ట్రిబ్యునల్ అంచనా వేసిన నేపథ్యంలో పూడిక వల్లే.. 37 టీఎంసీలు, నీటి ఆవిరి రూపంలో 5.. వెరసి 42 టీఎంసీలను రాయలసీమ కోల్పోవాల్సి వచి్చంది.ఆ నీళ్లన్నీ తుంగభద్ర నది ద్వారా శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతున్నాయి. తుంగభద్ర డ్యాంలో పూడిక వల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిన నేపథ్యంలో.. నీటి లభ్యత తక్కువగా ఉందని చూపుతూ దామాషా పద్ధతిలో తుంగభద్ర నీటి కేటాయింపులు చేస్తోంది. దాంతో తుంగభద్ర డ్యాం నుంచి రాయలసీమకు గరిష్టంగా 40 టీఎంసీలు కూడా దక్కడం లేదు. దాంతో రాయలసీమ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తుంగభద్ర డ్యాంలో పూడిక వల్ల రాయలసీమ కోల్పోతున్న వాటా జలాలను వినియోగించుకునే ప్రాజెక్టులు నిరి్మంచడంపైనా రాష్ట్ర ప్రభుత్వం శీతకన్ను వేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.