సమస్య పాతదే. ఎన్నికల రుతువు సమీపించినప్పుడల్లా ఉపాధ్యాయులు ఓటర్ల జాబితా సవరణ మొదలుకొని పోలింగ్ నిర్వహణ విధుల వరకూ ఎన్నెన్నో నిర్వహించక తప్పదు. వారినుంచి ప్రతిసారీ అభ్యంతరాలు, నిరసనలు కూడా రివాజే. ఈసారి సమస్యాత్మకమైన బెంగాల్ వంతు వచ్చింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నందున బిహార్ మాదిరిగా అక్కడ కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట ఓటర్ల జాబితా ప్రక్షాళనకు ఎన్నికల సంఘం(ఈసీ) సన్నాహాలు చేస్తోంది. అందులో పాలుపంచుకొనేది లేదని రెండు నెలలుగా టీచర్లు చెబుతున్నారు. ఈసీ ఆదేశాలను పాటించి తీరాలని గత నెలలో కలకత్తా హైకోర్టు వారిని హెచ్చరించింది. అయినా దానివల్ల పెద్దగా ఫలితం కనబడలేదు.
పైకి ఏం చెప్పినా సర్వసాధారణంగా ఉపాధ్యాయుల నిరాకరణకు రెండు కారణాలుంటాయి. అందులో ఒకటి– పార్టీల నుంచి వచ్చే ఒత్తిళ్లు. రెండోది విద్యా సంబంధమైనది. పార్టీలు తెచ్చే ఒత్తిళ్లు అన్నీ ఇన్నీ కాదు. ఫలానా పేర్లు తీసేయాలని కోరటం, లేదా ఫలానా డోర్ నంబర్ కింద పేర్లు చేర్చాలని ఒత్తిడి చేయటం మామూలే! ‘మా ఓటు గల్లంతైంద’ని పోలింగ్ రోజున పలువురు లబోదిబోమంటారు. నకిలీ ఓటర్లు జాబితాలోకెక్కిన సందర్భాల్లో ఫిర్యాదులుండవు. ఎందుకంటే తమ అడ్రస్‌తో నకిలీలు రిజిస్టరయ్యారన్న సంగతి ఇళ్ల యజమానులకు తెలియదు. పార్టీలు గమనించి ఫిర్యాదు చేసేసరికి సమయం మించిపోతుంది.
ఈసారి వివాదాస్పదమైన ‘సర్’ అడుగుపెడుతున్నది గనుక సమస్య మరింత జటిలం కాబోతోంది. ఇన్నాళ్లూ పార్టీల నుంచి ఎదురైన ఒత్తిళ్లు వేరు. ఇది వేరు. కొత్త విధానం ప్రకారం నిర్దిష్టమైన పత్రాలుంటేనే ఓటర్లుగా గుర్తిస్తారు. ఆ పత్రాలు లేకుంటే అంతే సంగతులు. అందువల్లే ఈసారి జాబితా విడుదలైన వెంటనే ఓటు ఉందో ఊడిందో చూసుకునే ఓటర్లు ఎక్కువే ఉంటారు. తమవారి పేర్లున్నాయో లేదో వెంటవెంటనే నిశితంగా గమనించే పార్టీలూ ఉంటాయి.
పేరు గల్లంతైతే రాజకీయ పక్షాల నేతలైనా, జనమైనా విరుచుకుపడేది బీఎల్‌ఓలపైనే! బిహార్‌లో ఎంతో పకడ్బందీగా ఓటర్ల జాబితాను సవరిస్తున్నామని ఈసీ చెబుతుండగానే అనేక లొసుగులు బయటపడ్డాయి. పెంపుడు కుక్కల పేర్లతో, సినీతారల పేర్లతో నమోదైన ‘ఓటర్లు’ కొందరుంటే... ఏకంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేరు కూడా జాబితాలో చేరి అందరినీ నిర్ఘాంత పరిచింది.
బెంగాల్ తీరు వేరు. అధికారంలో ఉన్న తృణమూల్ అయినా, ఈసారి గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ అయినా ‘సర్’ ప్రక్రియ మొదలైనప్పటినుంచీ తమ సర్వశక్తులూ కేంద్రీకరిస్తాయి. నమోదు సమయంలోనే బీఎల్‌ఓలు ‘ఫలానా పత్రం ఇస్తే తప్ప కుదరద’ంటే ఒత్తిళ్లూ, బెదిరింపులూ తప్పవు. కొన్ని సందర్బాల్లో దాడులకు దిగేవారూ ఉంటారు. వాటికి జడిసి చూసీచూడనట్టు వెళ్తే ప్రత్యర్థి పార్టీలు రచ్చచేస్తాయి.
తప్పని తేలితే బీఎల్‌ఓలపై క్రమశిక్షణ చర్యలుంటాయి. వారి సర్వీస్‌పై మచ్చ పడుతుంది. ఉపాధ్యాయులు మీవల్లే బీఎల్‌ఓ విధులు నిర్వర్తించేందుకు భయపడుతున్నారంటూ తృణమూల్, బీజేపీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇక ఈసీ పక్షపాత వైఖరి గురించి వచ్చే ఆరోపణల సంగతి సరేసరి. ఈ బెడదంతా ఎందుకున్న ఉద్దేశంతోనే టీచర్లు ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని చూస్తున్నారు.
టీచర్లకు ఎన్నికల సంబంధ విధులే కాదు... విద్యేతరమైనవి అనేకం చుట్టుకుంటున్నాయి. చదువు చెప్పటంతోపాటు పాఠశాలల్లో పర్యవేక్షించాల్సినవే అనేకం ఉంటున్నాయి. ఇన్నింటివల్ల సకాలంలో సిలబస్ పూర్తిచేయటం కష్టమవుతోందనీ, పిల్లల ప్రమాణాలు పడిపోతున్నాయనీ ఉపాధ్యాయులంటారు. ఈ రెండింటికీ తమనే బాధ్యుల్ని చేస్తున్నారన్నది వారి ఆవేదన. ఒకరో ఇద్దరో టీచర్లతో నడిచేచోట ఈ కష్టాలు అనేక రెట్లు ఎక్కువుంటాయి.
ఈసీకి ఇదంతా అనవసరం. కేటాయించిన విధుల్ని పరిపూర్తి చేయాల్సిందేనంటుంది. ఎన్నికల విధుల్లో పాల్గొని తీరాలన్న ఈసీ ఆదేశాలపై 2014లో మహారాష్ట్ర ఎయిడెడ్ స్కూళ్ల టీచర్లు బొంబాయి హైకోర్టులో సవాలు చేసినప్పుడు విధులకు గైర్హాజరైనవారిపై కఠిన చర్యలు తీసుకోబోమని ఈసీ హామీ ఇచ్చింది. ఇప్పుడు బెంగాల్ టీచర్లకు ఉపశమనం దొరుకుతుందా లేదా అన్నది వేచిచూడాలి.


