Election Commission of India
-
ఢిల్లీలో ఒకే విడతలో ఎన్నికలు.. ఫిబ్రవరి 5న పోలింగ్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. విజ్ఞాన్ భవన్లో జరిగిన సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. ఢిల్లీలో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి ఐదో తేదీన అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి ఎనిమిదో తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ఇలా.. జనవరి 10న ఎన్నికల నోటిఫికేషన్ ఎన్నికలకు పోలింగ్.. ఫిబ్రవరి 5ఎన్నికల ఫలితాలు.. ఫిబ్రవరి 8నామినేషన్లకు చివరి తేదీ.. జనవరి 17నామినేషన్ల విత్ డ్రా చివరి తేదీ.. జనవరి 20 #WATCH | Delhi to vote in a single phase on February 5; counting of votes on February 8 #DelhiElections2025 pic.twitter.com/QToVzxxADK— ANI (@ANI) January 7, 2025ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. దేశంలో ఓటర్ల సంఖ్య 99 కోట్లు దాటింది. గతేడాది ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాం. ఢిల్లీలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఉంటారు. ఓట్ల తొలగింపు ఆరోపణలను ఖండిస్తున్నాం. ఎన్నికలను పారదర్శంగా నిర్వహిస్తున్నాం. ఈవీఎంల పనితీరుపై పూర్తి విశ్వాసంగా ఉన్నాం. ఈవీఎంల వాడకంలో పారదర్శకత ఉంది. ఈవీఎంలు ట్యాపరింగ్ జరిగినట్టు ఆధారాలు లేవు. ఈవీఎంల విషయంలో అసత్యాలను నమ్మవద్దు. ఈ ఏడాది తొలి ఎన్నికల్లో ఢిల్లీలో జరగబోతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ(Delhi Assembly)లో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఢిల్లీ అసెంబ్లీ ఏడవది. దీని గడువు ఫిబ్రవరి 15వ తేదీతో ముగియనుంది. ఢిల్లీకి స్టేట్ స్టేటస్ వచ్చాక 1993లో జరిగిన తొలి ఎన్నికల్లో బీజేపీ నెగ్గింది. అయితే ఐదేళ్ల పాలనలో ముగ్గురు సీఎంలను మార్చింది. ఆపై జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నెగ్గింది. షీలా దీక్షిత్ సారథ్యంలో హస్తం పార్టీ హ్యాట్రిక్ పాలన సాగించింది. ఇక..2013 నుంచి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో కొనసాగుతోంది. దీంతో..ఈసారి ఎలాగైనా హస్తినను చేజిక్కించుకోవాలని బీజేపీ(BJP) భావిస్తోంది. మరోసారి అధికారం దక్కించుకోవాలని ఆప్ భావిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి అధికారంపై కన్నేసింది. హర్యానా ఎన్నికల తర్వాత ఇండియా కూటమి మిత్రపక్షాలైన ఆప్-కాంగ్రెస్‌లు మరోసారి ఢిల్లీ ఎన్నికల ముక్కోణ్ణపు పోటీలో తలపడనున్నాయి. -
ఓటర్ ఐడీ మాత్రమే సరిపోదు: ఢిల్లీ ఎన్నికల సంఘం
ఎన్నికల టైంలో పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘాలు రకరకాల క్యాంపెయిన్లు నిర్వహిస్తుంటాయి. గడప దాటొచ్చి ఓటేయమని దాదాపుగా బతిమాలినంత పని చేస్తాయి. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి చేసిన ఓ ప్రకటన వార్తల్లోకెక్కింది.ఢిల్లీ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. 2025 జనవరి 1వ తేదీనాటికి 18 ఏళ్లు దాటిన వాళ్లు ఎవరైనా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని ఢిల్లీ ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. అయితే ఇదే సమీక్షలో సీఈవో కీలక ప్రకటన చేశారు. కేవలం ఓటర్ ఐడీ(Voter ID) ఉన్నంత మాత్రన ఓటు హక్కు వర్తించబోదని ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి స్పష్టం చేశారు.కేంద్ర ఎన్నికల సంఘం ఏం చెబుతోందంటే.. కేవలం ఒక్కచోటే ఓటర్‌గా నమోదు అయ్యి ఉండి.. ఓటర్ తుది జాబితాలో పేరు ఉండి.. ఓటర్ స్లిప్ అందినప్పుడే మాత్రమే ఓటు హక్కువేయడానికి ఉంటుంది. అలాగే ఓటర్ స్లిప్(Voter Slip)తో పాటు ఓటర్ ఐడీని కూడా పోలింగ్ సెంటర్ వద్ద సిబ్బందికి చూపించాల్సి ఉంటుంది. కేవలం ఓటర్ ఐడీ అనే కాదు.. ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్, పాన్ కార్డు, పాస్‌పోర్టు.. ఇలా 11 రకాల ఐటీ కార్డు కార్డుల్లో ఏదైనా ఓటర్‌స్లిప్‌తో పాటు తీసుకెళ్లి ఓటేయొచ్చు.అలాంటి వాళ్ల ఓటు హక్కును మీరూ తొలగించొచ్చు..ఒక ఓటరు చిరునామా శాశ్వతంగా మార్చినా లేదంటే ఓటర్ చనిపోయినా వాళ్ల ఓటు హక్కుపై ఎవరైనా అభ్యంతరాలను లేవనెత్తొచ్చు. అయితే ఆ అభ్యంతరాలను లేవనెత్తేది.. ఆ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వ్యక్తే అయి ఉండాలి.ఇందుకోసం ఫారం-7ను అప్లై చేయాలి. ఆపై సదరు ఓటర్‌కు, అలాగే ఫిర్యాదు చేసినవాళ్లకు నోటీసులు వెళ్తాయి. అదే ఓటరు మరణించిన సందర్భమైతే..స్పీడ్ పోస్ట్ ద్వారా నోటీసులు పంపుతారు. నోటీసులు అందుకున్న ఓటరు సకాలంలో స్పందించకపోతే.. ఆ ఓటును తొలగించే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుంది.ఓటర్లను జల్లెడ పట్టి.. తొలుత అక్టోబర్ 1, 2024 తేదీదాకా 18 ఏళ్లు నిండినవాళ్లు ఓటర్‌గా నమోదు చేసుకోవచ్చని ఢిల్లీ ఎన్నికల సంఘం ప్రకటించింది. కిందటి ఏడాది ఆగష్టు 20 నుంచి అక్టోబర్ 18వ తేదీదాకా బూత్ లెవల్(Booth Level) ఆఫీసర్లతో ఇంటింటి సర్వే నిర్వహించారు. 18 ఏళ్లు పైబడి కూడా ఓటర్లుగా నమోదు చేసుకోనివాళ్లను గుర్తించారు. అడ్రస్‌లు మారినవాళ్లు, చనిపోయినవాళ్లు, డూప్లికేట్లు(Duplicate) కార్డులను ఏరిపారేశారు. అక్టోబర్29వ తేదీన ఓటర్ల జాబితా డ్రాఫ్ట్‌ను రిలీజ్ చేసి అభ్యంతరాలను స్వీకరించడం ప్రారంభించింది. నవంబర్ 28వ తేదీ నుంచి వెరిఫికేషన్ ప్రక్రియను మొదలుపెట్టి.. డిసెంబర్ 24 కల్లా పూర్తి చేసింది. ఇప్పుడు జనవరి 1, 2025 తేదీతో 18 ఏళ్లు పూర్తైన వాళ్లు ఓటర్‌గా నమోదు చేసుకోవచ్చని తెలిపింది. జనవరి 6వ తేదీన ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని ఢిల్లీ ఎన్నికల సంఘం పేర్కొంది.అయితే.. అప్డేషన్, మార్పులు చేర్పులు లాంటి నిరంతర ప్రక్రియ యధావిధిగా కొనసాగనుందని స్పష్టం చేసింది. అలాగే.. కొత్త ఓటర్లుగా రిజిస్టర్ కావాలనుకుంటే ఫారం 6ను నింపి సంబంధిత డాక్యుమెంట్లతో బూత్ లెవల్ ఆఫీసర్‌ను సంప్రదించాలని.. మార్పులు, తొలగింపుల కోసం ఫారం-8, ఫారం-7లను సబ్మిట్ చేయాలని సూచించారు.తప్పుడు డాక్యుమెంట్లతో ఓటు హక్కు కోసం..ఇదిలా ఉంటే.. వేర్వేరు చోట్ల ఓటర్‌గా నమోదు చేసుకుని ఉన్నా.. లేకుంటే ఎక్కువ ఓటర్ కార్డులు కలిగి ఉన్నా పీపుల్స్ రెప్రజెంట్ యాక్ట్ 1950 సెక్షన్లు 17, 18 కింద శిక్షార్హమైన నేరం. ఇలాంటి ఉల్లంఘనలకు కఠిన శిక్షలే ఉంటాయని ఎన్నికల సంఘం చెబుతోంది. అంతేకాదు.. ఓక్లా నియోజకవర్గంలో ఓటర్ నమోదు కోసం తప్పుడు డాక్యుమెంట్ల సమర్పించిన ఎనిమిది మందిపై కేసులు కూడా నమోదు అయ్యాయని ఢిల్లీ ఎన్నికల సంఘం(Delhi Election Commission) తెలిపింది.ఢిల్లీ ప్రస్తుత అసెంబ్లీ గడువు ఫిబ్రవరి 15వ తేదీతో ముగియనుంది. త్వరలో ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.చదవండి👉🏻: ఆయన ఆలయాలను కూల్చమంటున్నాడు! -
నమోదైన ఓటర్లు 97.97 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికల సమయానికి దేశంలో 97.97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) తెలిపింది. 2019 లోక్‌సభ ఎన్నికలప్పుడున్న 91.19 కోట్ల మందితో పోలిస్తే ఇది 7.43% ఎక్కువని పేర్కొంది. 2019లో 61.4 కోట్ల ఓట్లు పోలవగా 2024లో 64.64 కోట్ల ఓట్లు పోలయ్యాయని ఇందులో 64.21 కోట్లు ఈవీఎంలలో నమోదైనట్లు వివరించింది. ఇందులో 32.93 కోట్ల పురుషులు, 31.27 కోట్ల మహిళలు, 13 వేల మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా, సార్వత్రిక ఎన్నికల్లో 42.81 లక్షల పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయి. అస్సాంలోని ధుబ్రి నియోజకవర్గంలో అత్యధికంగా 92.3% ఓట్లు పోల్ కాగా... అత్యల్పంగా శ్రీనగర్‌లో 38.7% పోలింగ్ నమోదైంది. అయితే 2019లో శ్రీనగర్‌లో ఇది 14.4% మాత్రమేనని ఈసీ గుర్తు చేసింది. దేశవ్యాప్తంగా 2024లో నోటాకు 63.71 లక్షల ఓట్లు పడ్డాయని కూడా వివరించింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో జరిగిన ప్రపంచంలోని అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ విస్తృత గణాంకాలను సీఈసీ గురువారం విడుదల చేసింది. ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు 2024లో 10.52 లక్షల పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. 2019 కంటే ఇది 14,816 ఎక్కువ. 2019లో 540 చోట్ల రీపోలింగ్ జరగ్గా ఈ ఏడాది కేవలం 40 పోలింగ్ స్టేషన్లలోనే రీపోలింగ్ అయ్యింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 1.62 లక్షల పోలింగ్ స్టేషన్లు ఉండగా...2019తో పోలిస్తే 2024లో బిహార్‌లో అత్యధికంగా 4,739 పోలింగ్ స్టేషన్లు పెరిగాయి. -
బీఆర్ఎస్కు విరాళాల వెల్లువ.. అగ్రస్థానంలో బీజేపీ
ఢిల్లీ : గడిచిన ఎన్నికల్లో స్థానిక పార్టీల్లో బీఆర్ఎస్కు ఊహించని విధంగా విరాళాలు అందాయి. విరాళాలు పొందే విషయంలో జాతీయ పార్టీల్లో బీజేపీ అగ్రస్థానంలో ఉండగా..రెండో స్థానంలో కాంగ్రెస్ ఉంది. రాజకీయ పార్టీలకు అందిన విరాళాలకు సంబంధించిన సమాచారాన్ని ఎన్నికల సంఘం (Election Commission) తన వెబ్సైట్లో ఉంచింది. రాజకీయ పార్టీలకు ఏయే సంస్థలు ఎంతెంత విరాళం ఇచ్చాయి? అందులో వివరించింది. ఈసీ నివేదిక ప్రకారం.. 2023-24లో దాతలు బీజేపీకి రూ. 20,000 అంత కంటే ఎక్కువ మొత్తం దాదాపు రూ.2,244 కోట్లను విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తం 2022-23లో అందుకున్న మొత్తం కంటే మూడు రెట్లు ఎక్కువ. బీఆర్ఎస్ రూ.580 కోట్లతో రెండవ స్థానంలో, కాంగ్రెస్ రూ.289 కోట్లతో మూడో స్థానంలో ఉంది. కాంగ్రెస్‌కు అంతకుముందు సంవత్సరం రూ.20,000 అంతకంటే ఎక్కువ విరాళాల రూపంలో రూ.79.9 కోట్లు వచ్చాయి. ఈ మొత్తం కాంగ్రెస్ కంటే బీజేపీకి అందిన విరాళాలు 776.82 శాతం ఎక్కువ.ట్రస్ట్ (Satya Electoral Trust)లు బీజేపీ, కాంగ్రెస్ రెండింటికీ అత్యధిక విరాళాలు అందించాయని భారత ఎన్నికల సంఘం (eci) డేటా చెబుతోంది. అందులో బీజేపీ రూ.723 కోట్లు, కాంగ్రెస్ రూ. 156 కోట్లు ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ విరాళంగా వచ్చాయి. ఇతర పార్టీలలో, ఆమ్ ఆద్మీ 2023-24లో రూ. 11.1 కోట్ల విలువైన విరాళాలు పొందింది. అంతకు ముందు ఏడాది ఆప్ రూ.37.1 కోట్లు అందుకుంది. 2023-24లో సీపీఎం విరాళాలు రూ. 6.1 కోట్ల నుండి రూ. 7.6 కోట్లను పొందింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత వివిధ రాజకీయ పార్టీలు స్వీకరించిన విరాళాలను ఎన్నికల సంఘం ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఈసీ ఆయా రాజకీయ పార్టీలకు అందిన విరాళాల్ని వెల్లడించింది. -
ECపై ‘సుప్రీం’లో కాంగ్రెస్ పిటిషన్
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ పార్టీ(Congress Party) కోర్టుకెక్కింది. ఎన్నికల నిర్వహణ నిబంధనల్లో ఒక రూల్‌కు ఇటీవల ఈసీ సవరణ చేసింది. అయితే.. ఈ చర్యతో ఎన్నికల ప్రక్రియ సమగ్రత క్షీణిస్తోందంటూ కాంగ్రెస్ సర్వోన్నత న్యాయస్థానంలో మంగళవారం ఓ రిట్ పిటిషన్ వేసింది. ఎన్నికలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ రికార్డులను ఎవరైనా తనిఖీ చేసేందుకు గతంలో అనుమతి ఉండేది. అయితే ఈసీ ఈ మధ్యే ఈ రూల్‌కు సవరణ చేసింది. కొత్త రూల్ ప్రకారం.. ఇక నుంచి పోలింగ్‌కు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్‌ను, వెబ్‌కాస్టింగ్ రికార్డులను, అభ్యర్థులకు చెందిన వీడియో రికార్డులను తనిఖీ చేయకుండా నిషేధం విధించింది. కొత్త సవరణతో(Amendments) ఎలక్ట్రానిక్ రికార్డులు మినహా ఇతర పత్రాలు, డాక్యుమెంట్లు తనిఖీకి అందుబాటులో ఉంటాయి. పోలింగ్ బూత్‌లలోని సీసీ టీవీ కెమెరాల తనిఖీవల్ల ఓటర్ల గోప్యతకు భంగం కలుగుతోందని, అందుకే నిషేధం విధించామని ఈసీ వర్గాలు వెల్లడించాయి. పైగా ఫుటేజ్‌ను వినియోగించుకుని కృత్రిమ మేధ(Artificial Intelligence) ద్వారా నకిలీ వీడియోలను తయారు చేస్తున్నారని తెలిపాయి. రూల్ 93కి సవరణ తర్వాతా అభ్యర్థులకు ఎలక్ట్రానిక్ రికార్డులు అందుబాటులో ఉంటాయని, కానీ ఇతరులు తనిఖీ చేయడానికి అనుమతి ఉండదని స్పష్టత ఇచ్చింది.ఎన్నికల సంఘం(Election Commission) సిఫార్సు మేరకే.. ఎన్నికల నిర్వహణ నిబంధనలు-1961లోని రూల్ 93(2)(ఏ)ను కేంద్ర న్యాయశాఖ సవరించింది. ఈ సవరణకు ఓ కోర్టు కేసు కారణమని ఈసీతోపాటు న్యాయశాఖ వేర్వేరుగా గత శుక్రవారం వివరణ ఇచ్చాయి. ఇక.. అయితే ఈ పరిణామంపై కాంగ్రెస్(Congress Party) మండిపడింది. ఎన్నికల్లో పారదర్శకతకు ఇది విఘాతమని స్పష్టం చేసింది. ఎన్నికల నిబంధనను మార్చడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పారదర్శకతకు ఈసీ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించింది. ఈ సవరణను న్యాయపరంగా సవాలు చేస్తామని ఇంతకు ముందే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ స్పష్టం చేశారు. కోర్టు తీర్పును పాటించాల్సిన ఈసీ.. అందుకు విరుద్ధంగా నిబంధనలకు సవరణ చేయడం విడ్డూరమని ఆ సందర్భంలో ఆయన వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: ముంచెత్తిన మంచులో వాహనాలు -
బీజేపీ, ఈసీపై సీఎం స్టాలిన్ సంచలన ఆరోపణ!
చెన్నై: కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం కారణంగా ప్రజాస్వామ్యం తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటోందన్నారు. అలాగే, రాజ్యాంగం ప్రాథమిక లక్షణాలను కేంద్రం నాశనం చేస్తోందని కామెంట్స్ చేశారు.తమిళనాడు సీఎం స్టాలిన్ ట్విట్టర్ వేదికగా కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఈ సందర్బంగా స్టాలిన్.. కేంద్రం ఎన్నికల నియమావళికి నిర్లక్ష్యపూరిత సవరణ చేసింది. ఎన్నికల పారదర్శకతను దెబ్బతీసే నిర్ణయాలు తీసుకుంటోంది. కేంద్రం నిర్ణయాలతో ప్రజాస్వామ్యం తీవ్ర ముప్పును ఎదుర్కొంటోంది. ఎన్నికల నియమావళిలోని సెక్షన్ 93(2)(ఎ) సవరణతో ఎన్నికల్లో ఆందోళన కలుగుతోందన్నారు.అలాగే, ఎన్నికల బూత్‌లోని సీసీటీవీ ఫుటేజీని సమకూర్చాలని పంజాబ్, హర్యానా హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం సీసీటీవీ ఫుటేజీతో సహా ఎన్నికల పత్రాలను బహిరంగంగా తనిఖీ చేయకుండా ఈ సవరణను తీసుకొచ్చింది. రాజ్యాంగం ప్రాథమిక లక్షణాలలో ఒక దానిని బీజేపీ నాశనం చేసింది. ఇటీవల హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఆందోళన నెలకొంది. భారత ఎన్నికల సంఘం మోదీ ప్రభుత్వ ఒత్తిడికి లొంగిపోయింది. ఎన్నికల సంఘం తీరు దిగ్భ్రాంతికరం’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.Democracy is facing its gravest threat under the BJP-led Union Government with the reckless amendment of Section 93(2)(a) of the Conduct of Election Rules, to kill the transparency in election.Consequent on the direction of the Punjab and Haryana High Court to furnish the CCTV… https://t.co/vkAaY2ynr3— M.K.Stalin (@mkstalin) December 23, 2024 -
ఒక దేశం ఒక ఎన్నికపై... ఒక మాట!
‘భిన్నత్వంలో ఏకత్వం’ భారత లక్షణమే కాదు, విలక్షణ సంపద అని పలుమార్లు రుజువైంది. ఉద్వేగ నినాదంగా బాగున్నంత, ‘ఒక దేశం ఒక ఎన్నిక’ ఆచరణ గొప్పగా ఉంటుందనే నమ్మకం లేదు. ఇందులో పలు సమస్యలున్నాయి. దేశంలో రావాల్సిన ఎన్నికల సంస్కరణల్లో ఇదంత ప్రాధాన్యతాంశ మేమీ కాదు! అంతకన్నా ప్రాధాన్య అంశాలెన్నిటికో దిక్కూదివాణం లేక ప్రజాస్వామ్యమే వెనుకడుగులోకి జారుతోంది. ముందు ఆ సంస్కరణలు ముఖ్యం. జమిలితో... అభివృద్ధికి ఉండే ఆటంకాలు తొలగిపోతాయి. సమయం, ఆర్థికమానవ వనరుల దుబారా తగ్గుతుందనేది ఓ ఆశ! కానీ,ప్రాంతీయ అస్తిత్వాలకు అదొక గొడ్డలిపెట్టు. సమాఖ్య స్ఫూర్తికి భంగకరం. కేంద్ర ప్రభుత్వం ఆశిస్తున్నట్టుగానే... దేశ మంతటా ఒకేసారి (జమిలి) ఎన్నికలు జరిపించే విషయంలో సమగ్ర చర్చ జరగాలి. శాసనసభల స్పీకర్లతో పాటు మేధావులు, సమాజంలోని విభిన్నవర్గాల ప్రతినిధుల్ని భాగం చేసి చర్చించాలి. మాజీ రాష్ట్రపతి రావ్‌ునాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ సంప్రదింపుల్లో 32 పార్టీలు సానుకూలంగా మాట్లాడి, మద్దతు ప్రకటిస్తే 15 పార్టీలు పూర్తిగా వ్యతిరేకించాయి. వ్యతిరేకిస్తున్న పార్టీల్లో కాంగ్రెస్ ఉండటంతో... 1952 నుంచి 1967 వరకు, వరుస నాలుగు ఎన్నికల్లో కేంద్రం రాష్ట్రాల ఎన్నికల్ని కలిపి (జమిలి) నిర్వహించి నపుడు, మరిప్పుడెందుకు సాధ్యపడదు? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అనే ప్రశ్న పాలకపక్షాలు లేవనెత్తుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చాక జరిగిన తొలి సభలు కావడంతో అది సాధ్యమైంది. తర్వాత ఎన్నో మార్పులొచ్చాయి. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల విభజన జరిగింది. అవిశ్వాసాల్లో కొన్ని సభలు అర్ధంతరంగా ముగిశాయి. కొన్ని ప్రభుత్వాలు కూలిపోయో, రాష్ట్రపతి పాలన విధింపుతోనో ఎన్నికల ద్వారా కొత్త సభలు ఏర్పడ్డాయి. ఇలా వేర్వేరు పరిణామాల వల్ల లోక్‌సభకు, వివిధ శాసనసభలకు ఎన్నికల గడువు కాలాలు మారుతూ వచ్చాయి. భారత ఎన్నికల సంఘానికున్న విచక్షణాధికార పరిధి, వెసులుబాటు వల్ల... అప్పటికి రద్దయిన, రాష్ట్రపతి పాలనలో ఉన్న రాష్ట్రాల సభల ఎన్నికల కాలాలు స్వల్పంగా అటిటు అవుతూ వచ్చాయి. అందుకే, 1970ల తర్వాత జమిలి సాధ్య పడలేదు. ‘జమిలి కొత్తేం కాదు, ఇదివరకు జరిగిందే’ అని అమిత్ షా అంటున్నా, ఇవాళ్టి పరిస్థితి వేరు. అదంత సాధారణమే అయితే, ఇపుడు చట్టాలనూ, రాజ్యాంగాన్నీ మార్చడమెందుకు?ఎలా సమానం చేస్తారు?అన్ని ఎన్నికల్ని ఒక తేదీకి లాగే క్రమంలో... ఎన్నో మార్పులు చేయాల్సి ఉంటుంది. మొదట, పొట్టికాలం నిడివి సభలు, పొడుగు కాలం నిడివి సభలు అనివార్యమవుతాయి. బలవంతపు రాష్ట్రపతి పాలనలూ ఉంటాయేమో? ఇప్పుడు ప్రతిపాదిస్తున్నట్టు 2027లోనో, మరెపుడో జమిలి ఎన్నికల్ని నిర్వహించాక కూడా... ఏ కారణం చేతైనా ఒక రాష్ట్ర అసెంబ్లీ రద్దయితే, తిరిగి ఎన్నికల ద్వారా ఏర్పడే కొత్త సభను ఆ మిగిలిపోయిన కాలానికే పరిమితం చేస్తారు. సభ రద్దయిన సమయాన్ని (నాలుగేళ్లకో, మూడేళ్లకో రద్దయింది అనుకుంటే) బట్టి కొత్త సభకు ఏడాదో, రెండేళ్లో మిగలవచ్చు. సాధారణ ఎన్నికల్లో జరిగినట్టే అన్ని నియోజకవర్గాల, అందరు ఓటర్ల నిర్ణయంతో జరిగే మధ్యంతర ఎన్నికలో గెలిచిన సభ్యుల కొత్తసభ అలా ఆరు మాసాలకో, ఏడాదికో పరిమితం కావాల్సి రావడం ఏ రాజ్యాంగ ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రతీక? అది డబ్బు, మానవ వనరుల దుబారా కాదా? అనే ప్రశ్న సహజం. దీనికి రాజకీయ పార్టీలు ఎలా అంగీ కరిస్తాయో చూడాలి. చాలా దేశాల్లో దేశవ్యాప్త ఎన్నికలు, ప్రాదేశిక ఎన్నికలు వేటికవిగానే జరుగుతాయి. జమిలి జరిపే ఏడెనిమిది దేశాల్లో అధ్యక్ష తరహా పాలనకిది సానుకూలమే! జమిలి ఎన్నికల నిర్వహణా ఒక సంక్లిష్టమే! మొన్నటి హరియాణా ఎన్నికలతో, గడువు సమీపించిన మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్ని ఎందుకు కలపటం లేదని అడిగితే, ‘... శాంతి భద్రతలు, నిర్వహణ పరంగా ఇబ్బందులుంటా య’ని ఎన్నికల సంఘం పేర్కొంది. నాలుగైదు రాష్ట్రాల్లోనే ఒకేసారి ఎన్నికలు నిర్వహించలేని వారు మొత్తం దేశవ్యాప్తంగా లోక్‌సభకు దాదాపు 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్ని కలిపి, రేపెప్పుడో స్థానిక సంస్థల ఎన్నికల్నీ కలిపి ‘మహా జమిలి’ ఎలా నిర్వహిస్తారు? అనే ప్రశ్న సహజం. సంస్కరణల సవాళ్లెన్నో...భారీ ఓటర్ల భాగస్వామ్యంతో భారత ఎన్నికల నిర్వహణ ప్రపంచంలోనే ఒక అబ్బురం! బ్యాలెట్ నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రా (ఈవీఎం) లకు మారిన తర్వాత కూడా, అభివృద్ధి చెందిన దేశాలు విస్మయం చెందే స్థాయిలో మన ‘మహా ఎన్నికలు’ జరుగుతున్నాయి. విడతలుగా జరిగిన ఎన్నికల సంస్కరణలు ప్రక్రియను చాలా వరకు పారదర్శకం చేశాయి. స్వేచ్ఛగా స్వతంత్రంగా ఓటర్లు తమ నిర్ణ యాన్ని ప్రకటిస్తున్నప్పటికీ... ఎన్నికల్లో ధన ప్రవాహం, ప్రక్రియలో లోపిస్తున్న జవాబుదారీతనం ఆందోళన కలిగిస్తున్నాయి. ‘దేశ ఎన్ని కల ప్రక్రియలో ముదురుతున్న ‘క్యాష్ క్యాన్సర్’ను నియంత్రించే సంస్కరణ అత్యవసరంగా రావాలి’ అని సీనియర్ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయి ఇటీవల హైదరాబాద్‌లో చేసిన వ్యాఖ్య కీలకమైంది. ‘మునుగోడు’ అసెంబ్లీ ఉప ఎన్నికలో మనం కళ్లారా చూశాం. సరిగ్గా పోలింగ్‌కు ముందు లక్షల ఓట్లు గల్లంతయినా, నిన్న మహారాష్ట్రలో జరిగినట్టు ఒకటి, రెండు నెలల్లోనే లక్షలాది కొత్త ఓట్లు నమోదైనా... ఎన్నికల సంఘం నుంచి సరైన వివరణ, జవాబుదారీతనం లేక పోవడం దారుణం. ఈ సంస్కరణలు చేపట్టకుండా ‘జమిలి’కి పట్టుబట్టడం సరికాదనే అభిప్రాయం కొన్ని పార్టీల వారు, మేధావులు వ్యక్తంచేస్తున్నారు. విడిగా ప్రజాప్రతినిధులు గానీ, స్థూలంగా పార్టీలు గానీ, ప్రభుత్వాలు గానీ ఆశించిన/నిర్దేశించిన స్థాయిలో పనిచేయకుంటే వారిని వెనక్కి రప్పించే (కాల్ బ్యాక్) పద్ధతి ఉండాలనే డిమాండ్ పెరుగుతున్న తరుణంలో... అయిదేళ్ల కొకమారు అన్ని ఎన్నికలూ జరిపేయాలి, మధ్యలో ఏ ఎన్నికలూ ఉండొద్దనే నిర్బంధ మేమిటనే వాదన ఒకటుంది. మధ్యలో వేర్వేరు ఎన్నికలుంటేనే నాయకులైనా, పార్టీలైనా, ప్రభుత్వాలైనా కొద్దో గొప్పో భయంతో ఉంటాయనేది సాధారణ అభిప్రాయం. అందుకు, ఎన్నో సాక్ష్యాలు, తార్కాణాలు మన కళ్లముందే ఉన్నాయి. కాన్షీరావ్‌ు అన్నట్టు ‘ఏటా ఎన్నికలుండాలి’ అనే వాదనను బలపరచకపోయినా... ఎన్నికల భయం ఉన్నపుడే ప్రభుత్వాలు ప్రజానుకూలంగా నడుచుకోవడం తరచూ జరిగేదే! అలా కాకుండా, ఒకసారి ‘జమిలి’ జరిగితే, ఇక అయిదేళ్లూ ఏ ఎన్నికలుండవంటే... ప్రభుత్వాల ఏకస్వామ్యమే సాగుతుందనే భయాలున్నాయి. పైగా, భిన్నత్వ ప్రతీక అయిన దేశంలోని ప్రాంతీయ అస్తిత్వాలు, భావనలు, వాదనలు... ‘జమిలి’లో ఆధిపత్యం వహించే జాతీయ ప్రవాహంలో కొట్టుకుపోతాయనే ఆందోళన కూడా ఉంది. అందుకే, పలు ప్రాంతీయ పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి.ఒక పార్టీ ఒక నాయకుడు అంటారేమో!ఉభయ సభల్లో ఎన్డీయేకున్నది బొటాబొటీ మెజారిటీ! మూడింట రెండొంతుల మెజారిటీ ఉంటే తప్ప సాధ్యపడని రాజ్యాంగ సవ రణలకు ఎలా సాహసిస్తున్నారనేది ప్రశ్న! రాజ్యసభలో 164/243 అవసరమైనచోట 122 (42 తక్కువ) సంఖ్యాబలమే ఉంది. లోక్ సభలో 361/542 (ఒక ఖాళీ) అవసరం కాగా ఉన్నది 293 (63 కొరత) మాత్రమే! ఆ రోజు సభకు హాజరైన వారిలో మూడింట రెండొంతులు చాలు కనుక... ప్రత్యర్థి పార్టీల నుంచి క్రాస్ ఓటింగ్, గైర్హాజరీలను ప్రోత్సహిస్తారా? అని విపక్షంలో భయ సందేహాలున్నాయి. తరచూ ఎన్నికల వల్ల కోడ్ అమలు అభివృద్ధికి ఆటంకమనే భావనే తప్పని, ఓట్ల యావతో ఎన్నికలకు నెలల ముందే అభివృద్ధి పనులు చేయడం కాకుండా అయిదేళ్లపాటు జరిపితే కోడ్‌కు వెరవా ల్సిన భయమేమిటని ప్రశ్నిస్తున్నారు. ‘జమిలి’పై ఎందుకీ పంతం?’ ఇదే పంథాలో సాగి, రేపు ‘ఒక పార్టీ, ఒకే నాయకుడ’నే నినాదంతో ప్రజాస్వామ్యాన్ని అధ్యక్షతరహా పాలనవైపు నడిపే ప్రమాదాన్ని మొగ్గలోనే తుంచేయాలన్నది వ్యతిరేకవాదన వినిపించే వారి మాట!దిలీప్ రెడ్డి వ్యాసకర్త ‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్ -
ఎన్నికలు మరింత గోప్యం!
న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికల నిర్వహణలో పూర్తి పారదర్శకత తీసుకురావాలని, అనుమానాలకు తావులేని విధంగా ఎన్నికలు నిర్వహించాలని ప్రజాస్వామ్యవాదులు డిమాండ్ చేస్తుండగా, కేంద్ర ప్రభుత్వం మాత్రం గోప్యతకే ప్రాధాన్యం ఇస్తోంది. ఎన్నికల ప్రక్రియను మరింత గోప్యంగా మార్చే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నిర్వహణతోపాటు పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు(సీసీటీవీ కెమెరా ఫుటేజీ, వెబ్‌కాస్టింగ్ ఫుటేజీ లాంటివి), వీడియో రికార్డింగ్‌లను సామాన్య ప్రజలు తనిఖీ చేసేందుకు వీల్లేకుండా ఎన్నికల నిబంధనల్లో సవరణలు చేసింది.ఎన్నికల సంఘం సిఫార్సుల మేరకు ‘ఎన్నికల నిర్వహణ నిబంధనలు–1961’లోని రూల్ 93లో కేంద్ర న్యాయ శాఖ శుక్రవారం సవరణ చేసింది. దీని ప్రకారం కొన్ని రకాల ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు, వీడియోలను ప్రజలందరూ చూసేలా బహిరంగపర్చడానికి అవకాశం ఉండదు. ఆంక్షలు అమలవుతాయి. కాండక్డ్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్–1961లోని రూల్ 93(2)(ఎ) ప్రకారం.. ఎన్నికలకు సంబంధించిన అన్ని రకాల పత్రాలను బహిరంగపర్చాల్సిందే. ప్రజలంతా వాటిని చూడొచ్చు. తనిఖీ చేసుకోవచ్చు. కొత్తగా చేసిన సవరణ ప్రకారం.. ఎన్నికలకు సంబంధించి కొన్ని రకాల పత్రాలను మాత్రమే బహిరంగపర్చవచ్చు. ఎల్రక్టానిక్ డాక్యుమెంట్లు బహిర్గతం చేయడం నేరమవుతుంది. ⇒ కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్‌లో నామినేషన్ పత్రాలు, ఎలక్షన్ ఏజెంట్ల నియామకం, ఎలక్షన్ అకౌంట్ స్టేట్మెంట్లు, ఎన్నికల ఫలితాల వంటివి ఉన్నాయి. వీటిని బయటపెట్టడానికి అనుమతి ఉంటుంది. అయితే, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న సమయంలో చిత్రీకరించిన సీసీటీవీ ఫుటేజీ, వెబ్‌కాస్టింగ్ ఫుటేజీ, వీడియో రికార్డింగ్‌లు ఈ నిబంధనల పరిధిలో లేవు కాబట్టి కొత్త సవరణ ప్రకారం వాటిని ప్రజలకు ఇవ్వడం సాధ్యం కాదు. ⇒ సీసీటీవీ కవరేజీ, పోలింగ్ కేంద్రాల వెబ్‌కాస్టింగ్ కూడా నిబంధనల పరిధిలోకి రాదని, అది బయటపెట్టడం నిబంధనలను అతిక్రమించడమే అవుతుందని ఎన్నికల సంఘం అధికారి ఒకరు చెప్పారు. ⇒ పోలింగ్ కేంద్రాల్లో చిత్రీకరించిన సీసీటీవీ కెమెరా ఫుటేజీ దుర్వినియోగమవుతోందని ఎన్నికల సంఘం చెబుతోంది. దీంతో ఓటర్ల గోప్యతకు భంగం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ⇒ కృత్రిమ మేధ(ఏఐ) టెక్నాలజీని ఉపయోగించి కొందరు సీసీటీవీ కెమెరా ఫుటేజీని సృష్టిస్తున్నారని, ఇలాంటి ఫేక్ వీడియోలను అడ్డం పెట్టుకొని ఎన్నికల ప్రక్రియపై దుష్ప్రచారం చేస్తున్నారని అధికారులు అంటున్నారు. ⇒ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అన్ని రకాల పత్రాలు, ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు, వీడియోలు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. సామాన్య ప్రజలు మాత్రం కోర్టు అనుమతితోనే వీటిని పొందాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. ⇒ అభ్యర్థుల విషయంలో నిబంధనల్లో ఎలాంటి సవరణ చేయలేదని, ప్రజల విషయంలోనే సవరణ చోటుచేసుకుందని పేర్కొన్నారు. ⇒ మహమూద్ ప్రాచా వర్సెస్ ఎన్నికల సంఘం కేసులో పంజాబ్ అండ్ హరియాణా హైకోర్టు ఇటీవల తీర్పు ఇచి్చంది. హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రూల్ 93(2) కింద అనుమతించిన అన్ని రకాల డాక్యుమెంట్లు (సీసీటీవీ కెమెరా ఫుటేజీ సహా) మహమూద్ ప్రాచాకు అందజేయాలని ఆదేశించింది. ⇒ ఎలక్షన్ పత్రాలు, డాక్యుమెంట్లు అంటే ఎలక్ట్రానిక్ పత్రాలు, వీడియో రికార్డింగ్‌లు కాదని ఈసీ అధికారులు చెప్పారు. ఈ విషయంలో సందిగ్ధానికి తెరదించడానికే నిబంధనల్లో సవరణ చేసినట్లు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సీసీటీవీ కెమెరా ఫుటేజీ దుర్వినియోగం కాకుండా చేయాలన్నదే అసలు ఉద్దేశమని వివరించారు. ⇒ ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు మినహా ఇతర పత్రాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని కేంద్ర న్యాయ శాఖ అధికారులు చెప్పారు. పారదర్శకత అంటే ఎందుకు భయం?: జైరామ్ రమేశ్ ఎన్నికల నిబంధనల్లో సవరణ చేయడంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఎన్నికల సమగ్రతను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తోందని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత అంటే ఎందుకు భయమని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘‘ఎన్నికల ప్రక్రియపై పూర్తి సమాచారం ప్రజలకు అందజేస్తేనే వారిలో ఎన్నికలపై విశ్వాసం పెరుగుతుంది. ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు సహా అన్ని రకాల పత్రాలు ప్రజలకు ఇవ్వాలని పంజాబ్ అండ్ హరియాణా హైకోర్టు ఇటీవలే తేలి్చచెప్పింది. కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా నిబంధనల్లో హడావుడిగా సవరణ చేయడం దారుణం’’ అని జైరామ్ రమేశ్ మండిపడ్డారు. -
ఇది మాయ కాక మరేమిటి?
నిరూపించ లేనంత మాత్రాన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రా (ఈవీఎం)ల వినియోగ ప్రక్రియలో తప్పులే లేవనో, తప్పిదాలకు ఆస్కారమే లేదనో ధ్రువీకరించినట్టు కాదు. అభియోగాలు మోపేవారు అందుకు హేతువును, తమ సందేహాలకు కారణాలను, తగు సాక్ష్యాధారాలను సంబంధిత వ్యవస్థల దృష్టికి తీసుకు రావాలి. వాటిని స్వీకరించి బాధ్యులైన వ్యక్తులు, సంస్థలు లోతుగా పరిశీలన జర పాలి. అభియోగాలకు ఆధారాలున్నాయో లేదో, అవి తప్పో, కాదో తేల్చాలి. ఈ మొత్తం ప్రక్రియలో పారదర్శకత, జవాబు దారీతనం ముఖ్యం. అది జరగటం లేదు.అయిందానికి, కానిదానికి నిత్యం పరస్పరం విమర్శించుకునే రాజకీయ పార్టీలు ఈవీఎంల విషయంలో అనుసరించే ద్వంద్వ వైఖరి వారి ఆరోపణలకు పస లేకుండా చేస్తోంది. దాంతో వివాదం ప్రాధాన్యత లేకుండా పోతోంది. కానీ, కొన్ని రాజకీయేతర తటస్థ సంఘాలు, సంస్థలు కూడా అభ్యంతరాలు లేవనెత్తాయి. పోలింగ్ శాతాల సమాచారంలో వ్యత్యాసాలను ఎత్తిచూపుతూ, బహిరంగ ప్రజాభిప్రాయానికి విరుద్ధ ఫలితాలనూ... ఈవీఎంల దుర్వినియోగానికి గల ఆస్కారాన్నీ అవి ఎన్నికల సంఘం దృష్టికి తెచ్చినా... తగిన స్పందన లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఓట్ ఫర్ డెమాక్రసీ (వీఎఫ్‌డీ), అసోసియేషన్ ఫర్ డెమాక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్), సిటిజన్ కమిషన్ ఆన్ ఎలక్షన్ (సీసీఈ) వంటి పౌర సంఘాలు నిర్దిష్టంగా ఫిర్యాదులు చేసినా వాటిని పరిగణనలోకి తీసుకుంటున్న దాఖలాలు లేవు. రాజకీయ పక్షాల నుంచే కాక ప్రజాసంఘాలు, సంస్థల నుంచి నిర్దిష్ట ఆరోపణలు చేసినపుడు కూడా ‘నిరాధారం’, ‘దురుద్దేశ పూర్వకం’ అంటూ, కనీస విచారణైనా జరుపకుండానే ఎన్నికల సంఘం కొట్టిపారేస్తోందన్నది వారిపై ప్రధాన అభియోగం!ఓటు వ్యత్యాసాల పైనే సందేహాలుసాయంత్రం వరకు పోలింగ్ సరళి ఒక విధంగా ఉండి, ముగింపు సమయాల్లో అనూహ్య, అసాధారణ ఓటింగ్ శాతాలు నమోదు కావడం, అలా ఎన్నికల అధికారి రాత్రి ఇచ్చిన గణాంకాలకు భిన్నంగా ఓట్ల లెక్కింపు ముందరి ‘లెక్క’తేలడం పట్ల సందేహాలున్నాయి. కొన్ని నియోజక వర్గాల్లో ఈ ఓట్ల వ్యత్యాసం భారీగా ఉంటోంది. ఇది సార్వ త్రిక ఎన్నికల్లోనే కాకుండా హరియాణా, జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీల ఎన్నికల సందర్భంగానూ వెల్లడయిందనేది విమర్శ. గణాంకాలు వారి వాదనకు బలం చేకూర్చేవిగానే ఉన్నాయి. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఇలా, ఆఖరు నిమి షపు ఓట్ల వ్యత్యాసం పది శాతానికి పైగా ఉన్న పది జిల్లాల్లోని 44 అసెంబ్లీ స్థానాల్లో 37 ఎన్డీయే పక్షాలు గెలిచాయి. కానీ వ్యత్యాసం 10 శాతం కన్నా తక్కువగా ఉన్న 12 జిల్లాల్లోని 46 సీట్లలో ఎన్డీయే కూటమి 11 సీట్లు మాత్రమే గెలువగలిగింది. ఇటువంటి పరిస్థితి సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ ప్రతిబింబించిందని విమర్శకులంటారు. ఆఖరు నిమిషపు పోలింగ్ శాతపు పెరుగుదల వరుసగా ఐదు విడతల్లో 0.21%, 0.34%, 0.23%, 0.01%, 0.25% నామ మాత్రంగానే ఉండ టంతో ఎన్డీయే కూటమికి రాజకీయంగా ఇదేమీ లాభించ లేదనేది విశ్లేషణ! అందుకే, అక్కడ లోక్ సభ స్థానాల సంఖ్య 62 నుంచి ఈ సారి 36కి పడిపోయింది. జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తొలివిడతలో ‘ఆఖరు నిమిషపు ఓటింగ్ శాతం’ పెరుగుదల 1.79% నమోదుకాగా బీజేపీ 43లో 17 అసెంబ్లీ స్థానాలు నెగ్గింది. కానీ, రెండో విడత పోలింగ్ సందర్భంగా ఓటింగ్ శాతం పెరుగుదల 0.86%కి పరిమితమైనందునేమో, 38లో 7 సీట్లు మాత్రమే గెలువగలిగింది. ఇదంతా ఈవీఎంల మాయా జాలమే అని విమర్శకులంటారు.కళ్లకు కట్టినట్టు గణాంకాలుమహారాష్ట్రలోని అకోట్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాష్ట్ర ఎన్నికల ముఖ్యాధికారిచ్చిన సమాచారం ప్రకారం, పోలింగ్ ప్రక్రియ అన్ని విధాలుగా ముగిసేటప్పటికి ఈవీఎం ద్వారా 2,12,690 ఓట్లు పోలయ్యాయి. లెక్కింపు రోజున ఈవీఎం నుంచి రాబట్టిన ఓట్ల సంఖ్య 2,36,234. అంటే, వ్యత్యాసం 23.544 ఓట్లు. గెలిచిన బీజేపీ అభ్యర్థికి దక్కిన ఆధిక్యత 18,851 ఓట్లు! ఇలా రాష్ట్రవ్యాప్తంగా గమనిస్తే, పోలింగ్ రోజు రాత్రి పొద్దుపోయిన తర్వాత ఎన్నికల సంఘం వారి ‘యాప్’ ద్వారా వెల్లడైన గణాంకాల కన్నా ఓట్ల లెక్కింపు రోజున రమారమి పెరిగిన సంఖ్య ఉన్న నియోజకవర్గాలు తక్కువలో తక్కువ 95 ఉన్నాయనేది వారి వాదన. ఒకే విడత పోలింగ్ జరిగిన నవంబరు 20, సాయంత్రం 6.15 గంటలకు ఒకసారీ, రాత్రి 11.45 గంటలకు ఒకసారీ ఎన్నికల సంఘం అధికారికంగా ఓటింగ్ శాతాలను వెల్లడించింది. సాయంత్రం సమాచారం వెల్లడించే సమయానికి ఇంకా కొన్ని పోలింగ్ స్టేషన్లలో గడువు లోపల ‘క్యూ’లో చేరిన వారందరూ ఓటు వేసే వరకు, ఎంత సమయమైనా ఓటింగ్ ప్రక్రియ కొనసాగు తుందని పేర్కొన్నారు. ప్రక్రియ పూర్తయిన తర్వాత తుది గణాంకాలు రాత్రి ప్రకటించిన సమాచారంలో పేర్కొన్నారు. 288 నియోజకవర్గాల్లో సాయంత్రానికి 58.22% (5,64,88,024 ఓట్లు) పోలయినట్టు తెలిపిన అధికారులు రాత్రి అయ్యేటప్పటికి 65.02% (6,30,85,732 ఓట్లు) నమోదైనట్టు చెప్పారు. అంటే, వ్యత్యాసం 65,97,708 ఓట్లన్న మాట! నవంబరు 22న ఓట్ల లెక్కింపునకు కొన్ని గంటలు ముందు, ‘యాప్’ వెల్లడించిన సమాచారం ప్రకారం, రాష్ట్ర మంతటా నమోదైన ఓట్ల సంఖ్య 6,40,85,095. అప్పుడు పోలింగ్ శాతం 66.05%కి చేరింది. ఏమిటీ వ్యత్యాసాలన్న ప్రశ్న ఈవీఎంలపై శంకకు తావిస్తోంది. 288 నియోజక వర్గాల్లోని 1,00,186 పోలింగ్ బూత్‌లలో సగటున 76 ఓట్ల చొప్పున 76 లక్షల ఓటర్లు, ఎలా గడువు తర్వాత ‘క్యూ’ల్లో నిలుచొని ఓటు వేసి ఉంటారనే ప్రశ్న తలెత్తడం సహజం!సందేహాలను నివృత్తి చేసేవిధంగా ఎన్నికల సంఘం సమా ధానం ఇవ్వాలనే డిమాండ్ వస్తోంది. చైతన్యమే దారిదీపం మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా మాల్శిరాస్ తాలూకా మార్కడ్వాడి అనే చిన్న గ్రామంలో జనం తిరగబడ్డారు. ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని, ఓట్ల లెక్కింపు తర్వాత ఆరోపిస్తూ గ్రామస్థులు బ్యాలెట్ ద్వారా ‘మళ్లీ పోలింగ్’ జరపాలని వారికి వారే నిర్ణయించారు. కానీ పోలీస్ ఆంక్షలు విధించి సదరు రీపోల్ను అధికారులు జరుగనీయ లేదు. 13 వేల ఓట్ల ఆధిక్యతతో ఎన్సీపీ (శరద్ పవార్) అభ్యర్థి ఉత్తమ్రావ్ జన్కర్ ఎమ్మెల్యేగా ఎన్నికయి కూడా... ఆ గ్రామంలో ఈవీఎం అవకతవకలతో నష్టం జరిగిందని ఆరో పించారు. కులాల వారిగా, విధేయత పరంగా చూసినా... గ్రామంలో తనకు ఆధిక్యత ఉండగా, తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రామ్ సత్పతే (బీజేపీ)కి 160 ఓట్లు ఎక్కువ రావటం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. రీపోల్ నిర్వహణకు ప్రేరణ కల్పించారు. తమ ఫిర్యాదుకు ఎన్నికల సంఘం స్పందించనందునే రీపోల్ ఆలోచనని గ్రామ ముఖ్యులు పేర్కొన్నారు. రాజకీయ పార్టీల కార్యకర్తలు పోలింగ్ ఏజెంట్లుగా పోలింగ్ ముగిసే సమయంలో, కౌంటింగ్ ఏజెంట్లుగా ఓట్ల లెక్కింపు మొదలెట్టేప్పుడు ఆ యా కేంద్రాల్లో ఉంటారు. వారీ లెక్కలు సరి చూసుకుంటే ఏ ఇబ్బందీ ఉండదనే వాదనొకటుంది. ఈవీఎంలలో మాయ ఉందంటే... దానికి సాక్ష్యాలు, ఆధారాలు కావాలి. అనుమానాలు, గణాంకాల్లో సందేహాలు న్నాయంటే దానికి బాధ్యుల నుంచి సమాధానాలు రావాలి. ప్రజలకు కావాల్సింది... పారదర్శక పాలనా వ్యవస్థలూ, పాలకుల నుంచి జవాబుదారీతనం... దట్సాల్!దిలీప్ రెడ్డి వ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్,పీపుల్స్ పల్స్ రీసెర్చి సంస్థ డైరెక్టర్ -
ఓట్లను తొలగిస్తున్నారు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ కుట్రపూరితంగా ఓట్లను పెద్ద సంఖ్యలో తొలగిస్తోందని అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలో ఆప్ ప్రతినిధి బృందం బుధవారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దళితులు, ఎస్పీలు, పూర్వాంచల్‌కు చెందిన బలహీనవర్గాల ఓట్లను బీజేపీ పనిగట్టుకొని తొలగించేలా చేస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. ‘భారత పౌరులుగా ప్రజలకు ఉన్న ఓటు హక్కును బీజేపీ లాగేసుకుంటోంది. ఓటర్లను తొలగించడానికి బీజేపీ కార్యకర్తలకు దరఖాస్తు ఫారాలను అందించింది. చాలా నియోజకవర్గాల్లో ఇది జరుగుతోంది’ అని కేజ్రీవాల్ అన్నారు. భారత పౌరులుగా ప్రజలకున్న హక్కులను బీజేపీ లాగేస్తోందని ఆరోపించారు. ఢిల్లీలో చాలా నియోజకవర్గాల్లో ఈ విధంగా ఓట్లను తొలగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఓట్ల తొలగింపునకు సంబంధించి ఈసీకి మూడు వేల పేజీల ఆధారాలను సమర్పించామని కేజ్రీవాల్ తెలిపారు. భారీస్థాయిలో ఓట్ల తొలగింపు జరుగుతోందన్నారు. దీన్ని అడ్డుకోవాలని, ఓట్ల తొలగింపునకు దరఖాస్తు చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. షాహ్దారా నియోజకవర్గంలో ఒక బీజేపీ నాయకుడు ఏకంగా 11,008 ఓట్లను తొలగించాలని ఈసీకి ఒక జాబితాను సమర్పించారని, ఈసీ రహస్యంగా వీటిని తొలగించే పనిలో ఉందని ఆరోపించారు. పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు ఉండదని ఈసీ తమకు హామీ ఇచ్చిందని వెల్లడించారు. ఇప్పటివరకు తొలగించిన ఓట్లపై దృష్టి పెడతామని, బూత్‌స్థాయి అధికారితో విచారణ జరిపిస్తామని తెలిపిందన్నారు. ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. -
సీఈసీ, ఈసీల నియామక కేసు... విచారణ నుంచి తప్పుకున్న సీజేఐ
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానెల్ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పించడాన్ని సవాల్‌చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించబోనని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పష్టంచేశారు. ఈ కేసును మంళళవారం సీజేఐ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం విచారించింది. గతంలో జడ్జిగా ఉన్న జస్టిస్ ఖన్నా ఇటీవల ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన నేపథ్యంలో తన పదవికి సంబంధించిన కేసును తానే విచారించాల్సిన పరిస్థితి తలెత్తింది.దీంతో ఆయన ఈ కేసు విచారణ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ‘‘ ధర్మాసనంలో సభ్యునిగా నేను లేని బెంచ్‌కు ఈ కేసును బదిలీచేస్తున్నాను’’ అని సీజేఐ వెల్లడించారు. మీరు కొనసాగినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సీనియర్ అడ్వకేట్ గోపాల్ శంకరనారాయణ్, లాయర్ ప్రశాంత్ భూషణ్ చెప్పినా సరే సీజేఐ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. సీఈసీ, ఈసీల నియామకాలకు సంబంధించిన చట్టంలో గత ఏడాది మార్పులు చేస్తూ కేంద్రం తెచి్చన చట్టంలోని సెక్షన్7 చట్టబద్ధతను సవాల్‌చేస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెల్సిందే. -
కేంద్ర ఎన్నికల సంఘం కేసు.. వైదొలగిన సీజేఐ
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంలో నియామకాలకు సంబంధించిన వివాదాల ప్యానెల్ కేసు విచారణ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా వైదొలిగారు. సీజేఐ ఈ పిటిషన్ నుంచి తప్పుకోవడంతో.. ఇది మరో బెంచ్‌కు వెళ్లనుంది. అయితే వచ్చే ఏడాది జనవరి 6వ తేదీన విచారణ మొదలుకానుంది.ఈ ప్యానెల్లో ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండాలని గతంలో సర్వోన్నత న్యాయస్థాన రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించింది. ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకం అనేది పారదర్శకంగా జరగాలన్నదే తమ అభిప్రాయం అని ఆ టైంలో కోర్టు అభిప్రాయపడింది. ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకానికి సంబంధించి ప్రత్యేక చట్టాన్ని పార్లమెంటు ఆమోదించేంత వరకు.. ఈ కమిటీ అమలులో ఉంటుందని ఆ సమయంలో స్పష్టం చేసింది. కానీ..కొన్ని నెలలకే కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద రీతిలో ఓ నిర్ణయం తీసుకుంది. సీజేఐ స్థానంలో ఓ కేంద్ర మంత్రిని ప్రధాన మంత్రి ఈ ప్యానెల్‌కు కేటాయించారు. ఈ మేరకు సీఈసీ బిల్లును శీతాకాలం సమావేశాల్లో ప్రతిపక్షాలు లేకుండానే ఆమోదింపజేసుకున్నారు. ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలతో పాటు కొన్ని సంఘాలు సుప్రీం కోర్టులో సవాల్ చేశాయి. ఈ పిటిషన్‌ను నాడు ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆ బెంచ్‌లో జస్టిస్ సంజీవ్ ఖన్నా కూడా ఉండడం గమనార్హం. ఇక ఆ సమయంలో కేంద్రానికి నోటీసులు జారీ చేస్తూ.. మధ్యంతర ఆదేశాలు కూడా జారీ చేసింది ఈ ధర్మాసనం. అయితే.. సీఈసీ బిల్లు వివాదాన్ని పట్టించుకోకుండానే.. కేంద్రం ఇద్దరిని కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లుగా నియమించింది. ఇక.. ప్రస్తుత పరిస్థితుల్లో జస్టిస్ సంజీవ్ ఖన్నా సీజేఐగా ఉండడంతో ఈ కేసు నుంచి త్ప్పుకోవాల్సి వచ్చింది. -
మౌనం ప్రమాదకరం!
ఎవరు చికాకు పడినా, ఎంతగా అయిష్టత ప్రదర్శించినా ఈవీఎంలపై సందేహాలు తలెత్తుతూనే ఉన్నాయి. అడుగుతున్న వారిని తప్పుబట్టి, వారిపై ఆరోపణలు చేసి చేతులు దులుపుకుంటే ఇది సమసి పోదు. ఎందుకంటే సమస్య ఒకటే కావొచ్చుగానీ... దాని సారాంశం, స్వభావం మారుతు న్నాయి. మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) ఎస్‌వై ఖురేషీ వ్యాఖ్యలతో ఈవీఎంలపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. నాయకులు ఈ సమస్య లేవనెత్తితే ఓటమి నెపం ఈవీఎంలపై నెడు తున్నారని ఆరోపించవచ్చు. కానీ సీఈసీ బాధ్యతలు నిర్వర్తించిన ఖురేషీ వంటివారు సందేహ పడటాన్ని ఏమనుకోవాలి? చిత్రమేమంటే ఎన్నికల సంఘం (ఈసీ) ఈ సంశయాల విషయంలో మూగనోము పాటిస్తున్నది. ఇందువల్ల తన తటస్థ పాత్రకు తూట్లు పడుతున్నదని, అందరూ తనను వేలెత్తిచూపే రోజొకటి వస్తుందని ఈసీ పెద్దలకు తెలిసినట్టు లేదు. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఈవీఎంల అవకతవకలు మాత్రమే కాదు...ఈసీ చేతగానితనం కూడా బయటపడుతోంది.ఈనెల 13–20 మధ్య రెండు దశల్లో జార్ఖండ్‌లోనూ, 20న ఒకేసారి మహారాష్ట్రలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఎన్డీయే, జార్ఖండ్‌లో ఇండియా కూటమి తిరిగి అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. కానీ మహారాష్ట్రలో ఎన్నికలు జరిగిన రోజున పోలింగ్ శాతంపై ఈసీ విడుదల చేసిన ప్రకటనలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాయి. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిశాక మొత్తం 58.2 శాతం (6,30,85,732) మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారని ప్రకటన వెలువడింది. అదే రోజు రాత్రికల్లా దీన్ని సవరించి 65.02 శాతమని తెలిపారు. ఆ తర్వాత కౌంటింగ్‌కు ముందు అది కాస్తా 66.05 శాతానికి పెరిగింది. మొత్తంగా చూస్తే ఓటింగ్‌లో 7.83 శాతం పెరుగుదల కనబడింది. దీన్ని ఓటర్ల సంఖ్యలో చూస్తే ఈ పెరుగుదల స్థూలంగా 76 లక్షల మేర ఉన్నట్టు లెక్క. జార్ఖండ్‌ది మరో కథ. అక్కడ తొలి దశ పోలింVŠ కూ, మలి దశ పోలింగ్‌కూ మధ్య 1.79 శాతం పెరుగుదల కనబడింది. రెండో దశలో ఈ పెరుగుదల 0.86 శాతం మాత్రమే. మహారాష్ట్రలో చూపించిన పెరుగుదల శాతానికీ, జార్ఖండ్ పెరుగుదల శాతానికీ ఎక్కడైనా పొంతన వుందా? ఓటర్ల సంఖ్య చూస్తే జార్ఖండ్ తొలి దశలో 2,22.114మంది పెరగ్గా, రెండో దశలో ఆసంఖ్య 1,06,560. మహారాష్ట్ర పెరుగుదలతో దీనికెక్కడైనా పోలికుందా? ఓటింగ్ పూర్తయ్యాక ప్రక టించే అంకెలకూ, చివరిగా ప్రకటించే అంకెలకూ మధ్య వ్యత్యాసం ఉండటం సర్వసాధారణం. కానీ ఇదెప్పుడూ ఒక శాతం మించలేదని మేధావులు చెబుతున్నారు. దీనికి ఈసీ సంజాయిషీ మౌనమే! ఇప్పుడున్న విధానంలో పోలింగ్ కేంద్రాల్లో ఎప్పటికప్పుడు పోలైన ఓట్ల సంఖ్య ఎంతో తెలిపే డేటా తయారవుతుంటుంది. అలాంటపుడు కొన్ని గంటలకూ, కొన్ని రోజులకూ ఇది చకచకా ఎలా మారి పోతున్నది? అందులోని మర్మమేమిటో చెప్పొద్దా?మొన్న మే నెల 13న ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో సైతం ఇదే తంతు కొనసాగింది. ఆరోజు రాత్రి 8 గంటలకు 68.12 శాతం పోలింగ్ జరిగిందని ఎన్నికల సంఘం ప్రకటించింది. రాత్రి 11.45కి దీన్ని సవరించి మొత్తం 76.50 శాతమని తెలిపింది. మరో నాలుగు రోజులకల్లా తుది పోలింగ్ శాతం 80.66 అని గొంతు సవరించుకుంది. అంటే మొదట చెప్పిన శాతానికీ, మరో నాలుగు రోజుల తర్వాత ప్రకటించిన శాతానికి మధ్య 12.5 శాతం ఎక్కువన్నమాట! సాధారణ అంకెల్లో చూస్తే 49 లక్షలమంది కొత్త ఓటర్లు పుట్టుకొచ్చినట్టు లెక్క. కొన్ని నియోజక వర్గాల్లో తెల్లారుజామువరకూ పోలింగ్ సాగుతూనే వుంది. సాయంత్రం గడువు ముగిసే సమయానికి ఆవరణలో ఉన్న ఓటర్లకు స్లిప్‌లు ఇచ్చి గేట్లు మూసేయాలన్న నిబంధనవుంది. అంతేకాదు. క్యూలో చిట్టచివర గేటు దగ్గరున్న ఓటరుకు ఒకటో నంబర్ స్లిప్ ఇచ్చి అక్కడినుంచి క్రమేపీ పెంచుకుంటూపోయి బూత్ సమీపంలో ఉన్న వ్యక్తికి ఆఖరి స్లిప్ ఇవ్వాలి. ఓటేశాక ఆ స్లిప్‌లు సేకరించి భద్రపరచాలి. సీసీ కెమెరా డేటా జాగ్రత్త చేయాలి. ఇదంతా జరిగిందా? వాటి మాట దేవుడెరుగు... పరాజితులు న్యాయస్థానంలో సవాలు చేసిన సమయానికే ఈవీఎంల డేటా ఖాళీ చేశారు. వీవీ ప్యాట్ స్లిప్‌లను ధ్వంసం చేశారు. ఈవీఎంలలో నమోదైన చార్జింగ్ మరో ప్రహసనం. భద్రపరిచినప్పుడు ఈవీఎంలో వున్న చార్జింగ్‌కూ, కౌంటింగ్ రోజున తెరిచినప్పుడున్న చార్జింగ్‌కూ పోలికే లేదు. రోజులు గడిచేకొద్దీచార్జింగ్ తగ్గటమే అందరికీ తెలుసు. కొన్ని ఈవీఎంలలో పెరుగుదల కనబడటాన్ని ఏమనుకోవాలి?తిరిగి బ్యాలెట్ విధానం అమలుకు ఆదేశించాలంటూ కె.ఏ. పాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చుతూ ఓడినవారే ఈవీఎంలపై ఆరోపణలు చేస్తుంటారని ఇటీవల సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిజమే కావొచ్చు. గెలిచినవారికి ఆ అవసరం ఉండకపోవచ్చు. కానీ ఆమధ్య ఒక స్వచ్ఛంద సంస్థ, ఇప్పుడు మాజీ సీఈసీ ఆధారసహితంగా ఆరోపించటాన్ని ఏమనాలి? నిజమే... గతంలోనూ ఈ మాదిరి ఆరోపణలు వచ్చివుండొచ్చు. ఓటమి జీర్ణించుకోలేకే టీడీపీ, బీజేపీ, అకాలీ దళ్ ఆరోపించాయని భావించటంలో అర్థం ఉంది. ఎందుకంటే ఆ పార్టీలు తగిన ఆధారాలు చూప లేకపోయాయి. ఇప్పుడింత బాహాటంగా కళ్లముందు కనబడుతున్నా, డేటా వేరే కథ వినిపిస్తున్నా, ఈసీ తగిన సంజాయిషీ ఇవ్వలేకపోతున్నా మౌనంగా ఉండిపోవాలా? పరాజితులది అరణ్యరోదన కావటం ప్రజాస్వామ్యానికి ప్రమాద సంకేతం. ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు అపనమ్మకం ఏర్పడటా నికి దారితీసే వైపరీత్యం. అందుకే వ్యవస్థలన్నీ నటించటం మానుకోవాలి. ఏం జరిగివుంటుందన్న దానిపై సంతృప్తికరమైన సమాధానం ఇవ్వాలి. లేదా తప్పు జరిగిందని అంగీకరించాలి. ఇందులో మరో మాటకు తావులేదు. -
AICC: ఈవీఎంలపై ఇక దేశవ్యాప్త ఆందోళనలు
సాక్షి, ఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సీడబ్ల్యూసీ సమావేశమైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య, డీకే శివకుమార్, సుఖ్ విందర్ సింగ్ సుఖు, దీపా దాస్ మున్షి సహా సీడబ్ల్యూసీ సభ్యులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి భట్టి విక్రమార్క, గిడుగు రుద్ర రాజు, పళ్లం రాజు, రఘువీరారెడ్డి, సుబ్బిరామిరెడ్డి పాల్గొన్నారు. . వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి విజయం సాధించిన ప్రియాంక గాంధీ, నాందేడ్ ఎంపీ రవీంద్ర వసంతరావు చౌహన్‌కు సీడబ్ల్యుసీ అభినందనలు తెలిపింది. సమావేశంలో నేతలకు ఖర్గే దిశా నిర్దేశం చేస్తూ.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించినప్పటికీ ఆ తర్వాత జరిగిన మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు...నాలుగు రాష్ట్రాలలో రెండు రాష్ట్రాలలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. ఇది పార్టీకి ఒక సవాల్. ఎన్నికల ఫలితాల నుంచి తక్షణమే గుణపాఠాలు నేర్చుకోవాలి. పార్టీ బలహీనతలు, లోపాలను సరిదిద్దుకోవాలి. నేతల మధ్య పరస్పర ఐక్యత లేకపోవడం, వ్యతిరేక ప్రకటనలు పార్టీకి నష్టం చేకూరుస్తున్నాయి. పార్టీలో కఠినమైన క్రమశిక్షణ పాటించడం ముఖ్యం. ఎన్నికల్లో ఐక్యంగా ఉంటేనే పార్టీ విజయం సాధిస్తుంది. పార్టీ బలంగా ఉంటేనే వ్యక్తులు బలంగా ఉంటారు. సంస్థాగతంగా కింది స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి...ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆర్థిక అసమానతలు సమస్యలు గానే, కుల గణన కూడా ఒక ముఖ్యమైన అంశం. జాతీయ సమస్యలే కాకుండా రాష్ట్ర స్థాయి సమస్యలను ఎజెండాగా పోరాటం చేయాలి. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే సన్నాహాలు చేసుకోవాలి. విజయాలకు నూతన పద్ధతులను అవలంబించాలి. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల తీరు అనుమానాస్పదంగా ఉంది. మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి మంచి ఫలితాలు వచ్చినప్పటికీ అసెంబ్లీ ఫలితాల్లో ప్రతికూలంగా రావడం రాజకీయ పండితులకు సైతం అర్థం కావడం లేదు. రాజ్యాంగాన్ని అమలు చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుంది, సామాన్య ప్రజలకు రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే’’ అని ఖర్గే పేర్కొన్నారు.ఈవీఎంలపై దేశవ్యాప్త ఆందోళనకు కాంగ్రెస్ కార్యచరణ రూపొందించనున్నారు. ఇటీవల నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తోన్న కాంగ్రెస్.. బ్యాలెట్ ద్వారానే ఇకపై ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు ఖర్గే డిమాండ్ చేసిన తెలిసిందే. పలు రాష్ట్రాల్లో సంస్థాగతంగా ఉన్న సమస్యలపై కూడా ఈ సమావేశంలో సమీక్షించారు.ఇటీవల ముగిసిన నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రదర్శనతోపాటు రాబోయే ఢిల్లీ ఎన్నికల సన్నద్ధత, పొత్తుల అవకాశాలపై పార్టీ కీలక నేతలంతా చర్చించారు. కాగా వచ్చే ఏడాది జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలపైనా చర్చించినట్లు సమాచారం. అదే విధంగా ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపైన సమీక్షించారు. అదానీ వ్యవహారంపై ప్రశ్నలు లెవనేత్తి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం వంటి అశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.ఈసీకి లేఖ.. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటింగ్ అలాగే కౌంటింగ్‌కు సంబంధించిన డేటాలో ‘తీవ్రమైన వ్యత్యాసాలు’ ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీ.. శుక్రవారం భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ)కి లేఖ రాసింది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు వ్యక్తిగతంగా విచారణ జరపాలని పార్టీ అభ్యర్థించింది.మరోవైపు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చూస్తూ.. అధికార మహాయుతి కూటమి అక్రమాలకు పాల్పడిందంటూ ఆరోపణలు గుప్పిస్తోంది.కాంగ్రెస్ తన లేఖలోఓటర్లను ఏకపక్షంగా తొలగించిన ఈసీ.. ఆ తర్వాత ప్రతి నియోజకవర్గంలో 10,000 మందికి పైగా ఓటర్లను తుది ఓటర్ల జాబితాలో చేర్చినట్లు ఆరోపించింది. మహారాష్ట్ర ఓటర్ల జాబితాకు సంబంధించి మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లేవనెత్తిన ఆందోళనలను కూడా పార్టీ లేవనెత్తింది.నవంబరు 20న సాయంత్రం ఐదు గంటలకు 58.22 శాతం పోలింగ్ శాతం నమోదైందని ఈసీ వెల్లడించిందని, అయితే రాత్రి 11:30 గంటలకు మరో 7.83 శాతం పోలింగ్ అదనంగా నమోదైనట్లు తెలిపిందని, ఇంత భారీ వ్యత్యాసానికి కారణాలేమిటేది ఈసీ తెలుపాలని కోరింది. -
పోలింగ్ ముగిశాక 7 శాతం ఓటింగ్ ఎలా పెరిగింది?
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం ముగిసిపోయాక ఏకంగా 7 శాతం పోలింగ్ ఎలా పెరిగిందో భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) చెప్పాలని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే డిమాండ్ చేశారు. నవంబరు 20వ తేదీన వివిధ సమయాల్లో విడుదల చేసిన పోలింగ్ శాతంలో తేడాలుండటం ఈసీ పనితీరును ప్రశ్నార్థకం చేస్తోందన్నారు. పటోలే గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నవంబరు 20న సాయంత్రం ఐదు గంటలకు 58.22 శాతం పోలింగ్ శాతం నమోదైందని ఈసీ వెల్లడించిందని, అయితే రాత్రి 11:30 గంటలకు మరో 7.83 శాతం పోలింగ్ అదనంగా నమోదైనట్లు తెలిపిందని, ఇంత భారీ వ్యత్యాసానికి కారణాలేమిటేది ఈసీ తెలుపాలని డిమాండ్ చేశారు. ఈ అసాధారణ పెరుగుదల ఎన్నికల ప్రక్రియ పారదర్శకతను ప్రశ్నార్థకం చేసిందని పటోలే అన్నారు. ‘ఇది ప్రజల ఓట్లను కొల్లగొట్టడమే. దీనిపై న్యాయపోరాటం చేస్తాం. వీధుల్లోకి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తాం’ అని పటోలే పేర్కొన్నారు. రాత్రి 11:30 గంటల దాకా పోలింగ్ జరిగిన కేంద్రాల ఫోటోలను ఈసీ విడుదల చేయాలన్నారు. ఎవరు గెలిచారు, ఎవరు ఓడారనేది ఇక్కడ సమస్య కాదని, ప్రజాస్వామ్యాన్ని బతికించడమే ముఖ్యమని పేర్కొన్నారు. -
పోలింగ్‌లో అంతటి వ్యత్యాసం.. నిజంగా ఆందోళనకరం: మాజీ సీఈసీ ఖురేషి
న్యూఢిల్లీ: ఈవీఎంల పనితీరుపై దేశమంతటా నెలకొన్న అనుమానాలను, ఆందోళనలను మరింత పెంచే మరో పరిణామం చోటుచేసుకుంది. వాటి విశ్వసనీయతపై స్వయంగా భారత మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్‌వై ఖురేషీ కీలక సందేహాలు లేవనెత్తారు. తాజాగా ముగిసిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతానికి సంబంధించి నెలకొన్న వివాదంపై గురువారం ప్రముఖ న్యూస్ చానల్ ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో నవంబర్ 20న రాష్ట్రవ్యాప్తంగా ఒకే విడతలో పోలింగ్ జరగడం తెలిసిందే.‘ఆ రోజు సాయంత్రం 5 గంటలకల్లా 55 శాతం మేరకు ఓటింగ్ (ప్రొవిజనల్ ఓటర్ టర్నౌట్–పీవోటీ) న మోదైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ.. మర్నాడు ఈసీ ప్రకటించిన తుది గణాంకాల్లో అది కాస్తా ఏకంగా 66.05 శాతానికి పెరిగిపోయింది’ అని రాజ్‌దీప్ పేర్కొనగా.. ఇంతటి వ్యత్యాసం అత్యంత ఆందోళన కలిగించే అంశమని ఖురేషీ చెప్పారు. దీనిపై తన అనుమానాలు, అభ్యంతరాలు, ఆందోళనలను ఖురేషీ ఈ సందర్భంగా పంచుకున్నారు. ఓటింగ్ శాతం గణాంకాలు ఎప్పటికప్పుడు (రియల్ టైమ్) నమోదవుతూనే ఉంటాయన్నారు. అలాంటప్పుడు పోలింగ్ నాటి సాయంత్రానికి, మర్నాటికి ఇంతటి వ్యత్యాసం కచి్చతంగా అత్యంత ఆందోళన కలిగించే విషయమేనని స్పష్టం చేశారు. ‘ఓటింగ్ శాతం ఇలా నమోదవుతుంది’ పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ శాతం నమోదు ప్రక్రియ ఎలా జరుగుతుందో ఖురేషీ వివరించారు. ‘ఓటేయడానికి వచ్చే ప్రతి ఒక్కరి హాజరునూ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి విధిగా ఫారం–17సీలో నమోదు చేస్తారు. పోలింగ్ ముగిశాక ఆనాటి పరిణామాలన్నిటినీ అందులో నమోదు చేస్తారు. అలా ఫారం–17సీని పూర్తిగా నింపి, దానిపై అభ్యర్థులకు సంబంధించిన పోలింగ్ ఏజెంట్ల సంతకం తీసుకున్న తర్వాతే ప్రిసైడింగ్ అధికారి పోలింగ్ బూత్‌ను వీడతారు’ అని వివరించారు. ‘ప్రతి పోలింగ్ బూత్లోనూ పోలైన మొత్తం ఓట్ల సంఖ్యను 17సీ నమోదు చేస్తుంది. పైగా ఇది అదే రోజు, రియల్ టైమ్ (ఎప్పటికప్పుడు)లో నమోదయ్యే డేటా’ అని తెలిపారు. అలాంటప్పుడు పోలింగ్ జరిగిన మర్నాడు అది మారడం ఎలా సాధ్యమన్నది తనకే అర్థం కావడం లేదని ఆశ్చర్యం వెలిబుచ్చారు. ఇది ఎన్నో సందేహాలకు తావిచ్చే పరిణామమన్నారు. ‘దీనిపై ఎన్నికల సంఘం వివరణ ఇచ్చి తీరాల్సిందే.ఇప్పటికే ఆ పనిచేసి ఉండాల్సింది. ఎందుకు మౌనంగా ఉన్నారో తెలియడం లేదు’ అన్నారు. ‘కీలకమైన ఈ సందేహాలకు ఈసీ ఇప్పటికైనా బదులివ్వాలి. జాతీయ మీడియాను పిలిచి పోలింగ్ గణాంకాలకు ³Nర్తిస్థాయిలో వివరణ ఇవ్వాలి’ అన్నారు. ‘ఈవీఎంల పనితీరు తదితరాలపై ఇప్పటికే దేశమంతటా అనుమానాలు వ్యాప్తి చెందుతున్నాయి. వాటిని ఈసీ వెంటనే తీర్చకపోతే జనాల మెదళ్లలోకి మరింతగా చొచ్చుకుపోతాయి. అప్పుడు మొత్తం వ్యవస్థల మీదే విశ్వాసం పోతుంది’ అంటూ ఖురేషీ ఆందోళన వెలిబుచ్చారు. ఓటింగ్ శాతంలో అనూహ్య పెరుగుదల అంశం ఐదేళ్ల కింద సుప్రీంకోర్టు వరకు వెళ్లిందన్నారు. ఈసీ తుది గణాంకాల మేరకు మహారాష్ట్రలో సాయంత్రం 5 గంటల తర్వాత ఏకంగా 11 శాతం ఓటింగ్ జరిగినట్టు భావించాలని కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ అన్నారు. ఇదెలా సాధ్యమని ప్రశ్నించారు. ఈ అనుమానాలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్టు ఖురేషీ చెప్పారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాల్సి ఉందన్నా్డరు. ఆయన 2010–12 మధ్య కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా పనిచేశారు.ఏపీ పోలింగ్ శాతంలో 12.54 శాతం తేడా!ఆంధ్రప్రదేశ్‌లో మే 13న నాలుగో దశలో ఎన్నికలు నిర్వహించగా.. అదే రోజున రాత్రి 8 గంటలకు 68.12 శాతం పోలింగ్ జరిగినట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఆ తర్వాత రాత్రి 11.45 గంటలకు 76.50 శాతం పోలింగ్ జరిగినట్టు ప్రకటించింది. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన నాలుగు రోజులకు అంటే మే 17న తుది పోలింగ్ శాతం 80.66 అని ప్రకటించింది. అంటే.. తొలుత ప్రకటించిన పోలింగ్ శాతానికి తుది పోలింగ్ శాతానికి మధ్య 12.54 శాతం పెరుగుదల ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఎన్నికల సంఘం తొలుత ప్రకటించిన పోలింగ్ శాతానికి, ఆ తర్వాత వెల్లడించిన పోలింగ్ శాతానికి భారీ తేడా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా.. ఒడిశా (12.48 శాతం) రెండో స్థానంలో నిలిచాయి.పోలింగ్ శాతం పెరుగుదలకు ప్రధాన కారణం ఈవీఎంలను హ్యాకింగ్ చేయడం లేదా ఈవీఎంలు మార్చేయడం లేదా ఈవీఎంలు సక్రమంగా పనిచేయకపోవడం వంటి ఏదో ఒకటి అయి ఉండొచ్చని ఏడీఆర్ (అసోషియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫారŠమ్స్), వీఎఫ్‌డీ (వోట్ ఫర్ డెమొక్రసీ) సంస్థల ప్రతినిధులు అనుమానం వ్యక్తం చేశారు. ఇదే ఫలితాలను తారుమారు చేసిందని ఆరోపించారు. పోలింగ్ శాతంలో భారీగా తేడా ఉండటం వల్ల పోలైన ఓట్లలో 49 లక్షల ఓట్లు పెరిగాయి. రాష్ట్రంలో 25 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. పోలింగ్ శాతంలో పెరుగుదల వల్ల ఒక్కో లోక్‌సభ స్థానంలో సగటున 1.96 లక్షల ఓట్లు అదనంగా పోలయ్యాయి. ఇది లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిందని వీఎఫ్‌డీ సంస్థ వెల్లడించింది.ఎన్నికల సంఘం పోలింగ్ శాతం తొలుత వెల్లడించిన దానికీ, ఆ తర్వాత ప్రకటించిన దానికీ తేడా ఉండకపోయి ఉంటే ఎన్డీఏకు 14, వైఎస్సార్సీపీకి 11 లోక్‌సభ స్థానాలు దక్కేవని స్పష్టం చేసింది. పోలింగ్ శాతంలో తేడా వల్ల ఒంగోలు, నరసరావుపేట, ఏలూరు, హిందూపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం లోక్‌సభ స్థానాల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిందని పేర్కొంది. -
ఏపీలో 3 రాజ్యసభ సీట్ల ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్ల ఉప ఎన్నికకు మంగళవారం షెడ్యూల్ విడుదలైంది. డిసెంబర్ 3వ తేదీన ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అవుతుందని, 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, 20వ తేదీన పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం అందులో పేర్కొంది.వైఎస్సార్సీపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ ఎంపీల రాజీనామాతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఏపీతో పాటు ఒడిశా, వెస్ట్ బెంగాల్, హర్యానాలో ఒక్కో స్థానానికి కూడా(రాజీనామాలే) ఈ నోటిఫికేషన్ వర్తించనుంది. డిసెంబర్ 20వ తేదీనే పోలింగ్ అయ్యాక సాయంత్రం కౌంటింగ్, ఫలితాల వెల్లడి ఉంటుందని ఈసీ ఆ షెడ్యూల్లో పేర్కొంది. మిగతా వివరాలు ఈ కింది నోటిఫికేషన్లో చూడొచ్చు. ఇదీ చదవండి: హాయ్ చెప్తే.. అంత డ్రామా చేస్తారా? -
Jharkhand Election Result: ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాలి: జేఎంఎం
రాంచీ: జార్ఖండ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు(శనివారం) విడుదల కానున్నాయి. రాష్ట్రంలోని 81 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13,20 తేదీల్లో రెండు దశల్లో ఓటింగ్ జరిగింది. రాష్ట్రంలో ప్రధాన పోటీ హేమంత్ సోరెన్‌కు చెందిన జేఎంఎం నేతృత్వంలోని మహాకూటమి, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏల మధ్యే ఉంది. ఎన్నికల ఫలితాలకు ముందు హేమంత్ సోరెన్ పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసింది.కౌంటింగ్ కేంద్రాలకు రెండు కిలోమీటర్ల పరిధిలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని ఎన్నికల కమిషన్‌కు రాసిన లేఖలో జేఎంఎం పేర్కొంది. భారతీయ జనతా పార్టీ ఇతర రాష్ట్రాలకు చెందిన ఎలక్ట్రానిక్ నిపుణులను ఇక్కడ మోహరిస్తోందని జార్ఖండ్ ముక్తి మోర్చా ఆరోపించింది. అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రాష్ట్రంలోని 24 కౌంటింగ్ కేంద్రాలలో జరగనుంది. జేఎంఎం అధికార ప్రతినిధి సుప్రియో భట్టాచార్య ఎన్నికల కమిషన్‌కు రాసిన లేఖలో బీజేపీ కౌంటింగ్ కేంద్రాల వెలుపల ఇతర రాష్ట్రాలకు చెందిన ఎలక్ట్రానిక్ నిపుణులను నియమించినట్లు మాకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇది పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం’ అని పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: UP By Election Results: ఫలితాలకు ముందు అభ్యర్థులకు అఖిలేష్ సూచనలు -
నేడే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు
ముంబై/రాంచీ: మహారాష్ట్ర, జార్ఖండ్‌లో హో రాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమరంలో విజేతలెవరో నేడు తేలిపోనుంది. రెండు రాష్ట్రాల్లో శనివారం ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. అలాగే 13 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగిన 46 అసెంబ్లీ స్థానా ల్లోనూ ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. సాక్షి.కామ్ ఈ ప్రజా తీర్పును.. ఎప్పటికప్పటి ఫలితాలను మీకు ప్రత్యేకంగా అందించబోతోంది.నాందేడ్ లోక్‌సభ స్థానంతోపాటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన వయనాడ్‌లో లోక్‌సభ స్థానానికి సైతం ఉప ఎన్నిక నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యరి్థగా పోటీ పడిన రాహుల్ సోదరి ప్రియాంకాగాంధీ వాద్రా భవితవ్యం మరికొన్ని గంటల్లో తేటతెల్లం కానుంది. మహారాష్ట్ర, జార్ఖండ్‌తోపాటు ఉప ఎన్నికలు జరిగిన అసెంబ్లీ స్థానాలు, నాందేడ్, వయనాడ్ లోక్‌సభ స్థానాల్లో శనివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. మహారాష్ట్రలో మొత్తం 288 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 288 అసెంబ్లీ స్థానాలుండగా, 4,136 మంది అభ్యర్థులు పోటీ చేశారు. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి, కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 145 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో మరోసారి మహాయుతి ప్రభుత్వమే ఏర్పాటయ్యే అవకాశం ఉందని సర్వేలు అంచనా వేసిన సంగతి తెలిసిందే. జార్ఖండ్‌లో 1,211 మంది పోటీ మొత్తం 81 శాసనసభ స్థానాలున్న జార్ఖండ్‌లో ఈసారి 1,211 మంది పోటీ చేశారు. జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మధ్య అసలైన పోటీ నెలకొంది. జార్ఖండ్‌లో మరోసారి అధికారంలోకి వస్తామని ఇండియా కూటమి ధీమా వ్యక్తం చేస్తుండగా, విజయం తమదేనని ఎన్డీయే నేతలు తేల్చిచెబుతున్నారు. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎన్డీయేవైపే మొగ్గుచూపాయి. మహారాష్ట్రలో ఎంవీఏ ముందు జాగ్రత్త మహారాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించిన తమ అభ్యర్థులందరినీ వెంటనే ముంబైలో శిబిరానికి తరలించాలని మహా వికాస్ అఘాడీ నిర్ణయించింది. తమ ఎమ్మెల్యేలపై బీజేపీ కూటమి వల విసిరే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్తగా వారిని శిబిరానికి తరలించాలని నిర్ణయించినట్లు శివసేన(యూబీటీ) అగ్రనేత సంజయ్ రౌత్ శుక్రవారం వెల్లడించారు. ఈ ఎన్నికల్లో తమ కూటమి కనీసం 160 సీట్లు గెలుచుకుంటుందని చెప్పారు. గెలిచే అవకాశం ఉన్న స్వతంత్ర అభ్యర్థులు ఇప్పటికే తమకు మద్దతు ప్రకటించారని తెలిపారు. -
ప్రశాంతంగా మహారాష్ట్ర ఎన్నికలు
ముంబై/రాంచీ: మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 288 స్థానాల్లో బుధవారం ఒకే విడతలో పోలింగ్ నిర్వహించారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. సాయంత్రం 5 గంటలకల్లా 60 శాతం ఓటింగ్ నమోదైంది. నక్సల్స్ ప్రభావిత గడ్చిరోలీ చిల్లాలో 69.63 శాతం, ముంబైలో 51.41 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 1,00,186 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 4,100 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, రణబీర్ కపూర్, రితేశ్ దేశ్‌ముఖ్, జెనీలియా తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ నాగపూర్‌లో ఓటు వేశారు. శివసేన(యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే తన మేనల్లుడికి, మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే తన కుమారుడికి ఓటు వేయడం విశేషం. మాహిమ్‌లో రాజ్ ఠాక్రే తనయుడు అమిత్ ఠాక్రే పోటీ చేస్తున్నారు. బాంద్రా ఈస్ట్ స్థానంలో ఉద్ధవ్ ఠాక్రే మేనల్లుడు వరుణ్ సర్దేశాయ్ పోటీకి దిగారు. రాష్ట్రంలో ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. మరోవైపు ఉత్తరప్రదేశ్, పంజాబ్, కేరళ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా బుధవారం ఉప ఎన్నికలు నిర్వహించారు. స్వతంత్ర అభ్యర్థి మృతి మహారాష్ట్ర ఎన్నికల్లో బీడ్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థి గా బరిలోకి దిగిన బాలాసాహెబ్ షిండే(43) బుధవారం మృతిచెందారు. ఒకవైపు పోలింగ్ కొనసాగుతుండగానే ఆయన ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా విషాదం సృష్టించింది. బీడ్ పట్టణంలోని ఛత్రపతి సాహూ విద్యాలయ పోలింగ్ బూత్‌లో మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. జార్ఖండ్ రెండో విడతలో 67.59 శాతం ఓటింగ్ జార్ఖండ్‌లో రెండో/చివరి విడత అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. రెండో విడతలో భాగంగా బుధవారం 38 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించారు. సాయంత్రం 5 గంటలవరకు 67.59 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. మొత్తం 12 జిల్లాల్లో 14,218 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల్కు పోలింగ్ ప్రారంభమైంది. కొన్ని సమస్యాత్మక కేంద్రాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ప్రక్రియను ముగించారు. మిగిలిన కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల దాకా పోలింగ్ కొనసాగింది. సమయం ముగిసినప్పటికీ వరుసులో నిల్చున్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. జాంతారా జిల్లాలో అత్యధికంగా 76.16 శాతం ఓటింగ్ నమోదైంది. బొకారో జిల్లాలో అతి తక్కువగా 60.97 శాతం ఓటింగ్ నమోదైంది. జార్ఖండ్‌లో జరుగుతున్న ప్రజాస్వామ్య వేడుకలో ఓటర్లంతా ఉత్సాహంగా పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఉదయం పిలుపునిచ్చారు. ప్రజలు వేసే ప్రతి ఓటు రాష్ట్రాన్ని మరింత బలోపేతం చేయడానికి తోడ్పడుతుందని చెప్పారు. జార్ఖండ్‌లో ఈ నెల 13న తొలి విడత పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి. -
యూపీ ఉప ఎన్నికలు.. ఈసీ వార్నింగ్, ఏడుగురి పోలీసుల సస్పెండ్
మహారాష్ట్ర, ఝార్ఖండ్లలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. వీటితోపాటు దేశ వ్యాప్తంగా పలు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా నేడు జరుగుతున్నాయి.అయితే ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల పోలింగ్‌లో పోలీసులు బురఖా ధరించిన ఓటర్లను తనిఖీ చేయడంపై వివాదం చేలరేగింది. దీనిపై తాజాగా ఎన్నికల సంఘం స్పందించింది. నిష్పక్షపాతంగా ఉప ఎన్నికలు జరిగేలా చూడాలని భారత ఎన్నికల సంఘం బుధవారం అధికారులను కోరింది. ఓటు వేయడానికి వచ్చిన ఓటర్ల గుర్తింపు కార్డులను తనిఖీ చేయడానికి మార్గదర్శకాలను ఉల్లంఘించిన పోలీసు సిబ్బందిని కూడా ఈసీ సస్పెండ్ చేసింది.అర్హత ఉన్న ఓటరు ఓటు వేయకుండా అడ్డుకోరాదని తెలిపింది. ఓటింగ్ సమయంలో ఎలాంటి పక్షపాత వైఖరిని సహించబోమని స్పష్టం చేసింది. ఫిర్యాదు అందిన వెంటనే విచారణ జరుపుతామని, ఎవరైనా దోషులుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటనలో తెలిపింది.కాగా ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక కొనసాగుతుండగా.. బురఖా ధరించిన ఓటర్ల గుర్తింపును సరిగ్గా తనిఖీ చేయాలని బీజేపీ ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌కు బీజేపీ నేత అఖిలేష్ కుమార్ అవస్తీ లేఖ రాసింది. ముసుగులు ధరించిన మహిళలు చాలాసార్లు ఓటు వేయడానికి ప్రయత్నించిన కేసులు గతంలో ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. అంతేకగాక కొంతమంది పురుషులు కూడా బురఖా ధరించి ఓటు వేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. అయితే వీరిని ఈసీ అధికారులు అడ్డుకున్నారని చెప్పారు. బురఖా ధరించిన మహిళల గుర్తింపును తనిఖీ చేయకపోతే, నకిలీ ఓటింగ్ జరుగుతుందని తెలిపారు. సరైన తనిఖీ మాత్రమే న్యాయమైన, పారదర్శకమైన ఓటింగ్‌కు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. బురఖా ధరించిన మహిళలను తనిఖీ చేసేందుకు తగిన సంఖ్యలో మహిళా పోలీసులను పోలింగ్ కేంద్రాల వద్ద తప్పనిసరిగా మోహరించాలని ఆయన అన్నారు. ఓటరు ఐడీ కార్డులను తనిఖీ చేస్తున్న పోలీసులపై ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ ధ్వజమెత్తింది. పార్టీ చీఫ్, లోక్‌సభ ఎంపీ అఖిలేష్ యాదవ్ ఇద్దరు పోలీసులు ఓటర్ల గుర్తింపు కార్డులు అడిగే వీడియోను షేర్ చేస్తూ.. ఈ విషయంపై ఎన్నికల కమిషన్ జోక్యాన్ని కోరారు."ఎన్నికల సంఘం యాక్టివ్‌గా ఉంటే.. పోలీసులు ఓటర్ల ఐడీలను తనిఖీ చేయకుండా చూడాలని డిమాండ్ చేశారు. రోడ్లు మూసివేయకుండా, ఐడీలను స్వాధీనం చేసుకోకుండా, ఓటర్లను బెదిరించకుండా, ఓటింగ్ వేగం మందగించకుండా, సమయం వృధా కాకుండా చూసుకోవాలని అన్నారు. అధికార పార్టీకి ప్రతినిధిగా ఉండకుండా పరిపాలనను చూసుకోవాలని తెలిపారు. అయితే అఖిలేష్ యాదవ్ పోస్టుపై కాన్పూర్ పోలీసులు సైతం స్పందించారు. ఓటర్లను తనిఖీ చేసిన సంబంధిత అధికారులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.. ఎన్నికల సమయంలో రాష్ట్ర పోలీసులు ఎన్నికల సంఘం ఆధీనంలోకి వస్తారు. ఓటు వేయడానికి వచ్చిన ఓటర్ల గుర్తింపు కార్డులను తనిఖీ చేయడానికి మార్గదర్శకాలను ఉల్లంఘించిన పోలీసు సిబ్బందిని కూడా ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. -
Maharashtra Assembly elections 2024: నువ్వా.. నేనా?
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. 288 అసెంబ్లీ స్థానాలకు బుధవారం ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. బీజేపీ సారథ్యంలోని అధికార మహాయుతి, కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) భాగ్యరేఖలను 9.7 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. రాష్ట్రమంతటా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు. హోరెత్తిన ప్రచారంమహాయుతి తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మహారాష్ట్రలో కాలికి బలపం కట్టుకుని తిరిగారు. ముమ్మర ప్రచారంతో హోరెత్తించారు. వారితో పాటు కేంద్ర మంత్రులు, పలు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు తదితరులు కూడా ప్రచార పర్వంలో చురుగ్గా పాల్గొన్నారు. ఎంవీఏ కూటమి కోసం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్ర నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ వద్రా ప్రచారం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల అనంతర పరిణామాల్లో ముందుగా శివసేన, అనంతరం ఎన్సీపీల్లో చీలిక రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించడం ద్వారా తమదే అసలైన పార్టీ అని నిరూపించుకునేందుకు షిండే, ఉద్ధవ్ సేనలు; శరద్ పవార్, అజిత్ ఎన్సీపీ వర్గాలు పట్టుదలగా ఉన్నాయి. ఈ ఎన్నికలు వాటికి ఒకరకంగా జీవన్మరణ సమస్యేనని చెప్పాలి. 18–65 ఏళ్ల మధ్య వయసు మహిళలకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం అందిస్తున్న లడ్కీ బహన్ పథకంపైనే మహాయుతి ప్రధానంగా ఆశలు పెట్టుకుంది. మళ్లీ గెలిస్తే ఆ మొత్తాన్ని రూ.2,100కి పెంచుతామని పేర్కొంది. దీనికి విరుగుడుగా తాము మహిళలకు ఏకంగా నెలకు రూ.3,000 ఇస్తామని ఎంవీఏ ప్రకటించింది. మతపరమైన మనోభావాలను రేకెత్తించేందుకు కూడా బీజేపీ శాయశక్తులా ప్రయత్నించింది. అందులో భాగంగా బటేంగే తో కటేంగే, ఏక్ హై తో సేఫ్ హై వంటి నినాదాలు ప్రధానితో పాటు ఆ పార్టీ అగ్ర నేతలందరి నోటా ప్రచారం పొడవునా పదేపదే వినిపించాయి. ఇది సమాజంలో మతపరమైన చీలిక యత్నమేనంటూ రాహుల్‌తో పాటు ఎంవీఏ నేతలంతా దుయ్యబట్టారు. పార్టీల కోలాటంమహాయుతి పక్షాల్లో బీజేపీ అత్యధికంగా 149 అసెంబ్లీ స్థానాల్లో బరిలో ఉంది. శివసేన (షిండే) 81, ఎన్సీపీ (అజిత్) 59 చోట్ల పోటీ చేస్తున్నాయి. ఎంవీఏ కూటమి నుంచి కాంగ్రెస్ అత్యధికంగా 101 స్థానాల్లో, శివసేన (యూబీటీ) 95, ఎన్సీపీ (ఎస్పీ) 86 చోట్ల పోటీలో ఉన్నాయి. వీటితో పాటు బరిలో ఉన్న పలు చిన్న పార్టీలు ఈసారి పెద్ద ప్రభావమే చూపేలా కన్పిస్తుండటం విశేషం. జార్ఖండ్‌లో రెండో విడత 38 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్రాంచీ: జార్ఖండ్‌లో బుధవారం రెండో, తుది విడతలో 38 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. శనివారం మహారాష్ట్రతో పాటే ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెల్లడవనున్నాయి. రాష్ట్రంలో నవంబర్ 13న తొలి విడతలో 43 సీట్లలో పోలింగ్ ముగియడం తెలిసిందే. జేఎంఎం సారథ్యంలోని పాలక ఇండియా కూటమిని ఎలాగైనా ఓడించాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సంకీర్ణం పట్టుదలగా ఉంది. ఇరు కూటముల నేతలూ సోమవారం రాత్రి దాకా ఇంటింటి ప్రచారంతో హోరెత్తించారు. -
నడ్డా, ఖర్గేలకు ఈసీ లేఖ.. కీలక ఆదేశాలు
ఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పరస్పరం ఇటీవల ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఈసీ స్పందించింది. ఇరు పార్టీల అధ్యక్షులు జేపీ నడ్డా, మల్లికార్జున ఖర్గేలకు వేర్వేరుగా లేఖలు రాసింది.కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ ఈసీకి ఇటీవల బీజేపీ ఫిర్యాదు చేసింది. మరో వైపు.. కేంద్ర మంత్రి అమిత్ షా కూడా కోడ్ ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఫిర్యాదులపై ఈ నెల 18వ తేదీ(సోమవారం) మధ్యాహ్నం ఒంటిగంట లోపు అధికారికంగా వివరణ ఇవ్వాలంటూ ఆ పార్టీల అధ్యక్షులకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.ఇటీవల లోక్‌సభ ఎన్నికల సందర్భంగా జాతీయ పార్టీల స్టార్ క్యాంపెయినర్లకు చేసిన సూచనలను ఈసీ ప్రస్తావిస్తూ.. ఇతరులకు ఆదర్శంగా మెలగాలంటూ హితవు పలికింది. ఎన్నికల ప్రచార సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను కచ్చితంగా పాటించాల్సిందేనని ఎన్నికల సంఘం తాజాగా మరోసారి గుర్తు చేసింది.ఇదీ చదవండి: జో బైడెన్‌లాగే ప్రధాని మోదీకి మతిపోయినట్లుంది: రాహుల్ -
రాహుల్‌గాంధీ బ్యాగులు తనిఖీ చేసిన ‘ఈసీ’
ముంబయి: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం మహారాష్ట్ర వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బ్యాగులను ఈసీ అధికారులు తనిఖీ చేశారు. శనివారం(నవంబర్ 16) మధ్యాహ్నం అమరావతిలో రాహుల్ హెలికాప్టర్ ల్యాండ్ అవ్వగానే అధికారులు ఆయన బ్యాగులు చెక్ చేశారు. బ్యాగులతో పాటు రాహుల్‌గాంధీ వచ్చిన హెలికాప్టర్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీలు జరుగుతున్న సమయంలో రాహుల్ తన పార్టీ నేతలతో మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న పలువురు ప్రముఖ నేతల బ్యాగుల తనిఖీలు ఇటీవల చర్చనీయాంశమయ్యాయి. ఈ తనిఖీలు’ తాజాగా రాజకీయ దుమారానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఇటీవల మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బ్యాగులను ఎన్నికల అధికారులు పలుమార్లు తనిఖీ చేయడం వివాదానికి దారి తీసింది. విపక్ష నేతలను లక్ష్యంగా చేసుకున్నారంటూ ఎన్నికల అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు.అయితే,ఎన్నికల వేళ ఇది సాధారణ ప్రక్రియే అంటూ ఈసీ క్లారిటీ ఇచ్చింది. కాగా,మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలున్న మహారాష్ట్రలో నవంబరు 20న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి.నవంబరు 23న ఫలితాలను వెల్లడించనున్నారు.ఇదీ చదవండి: కసబ్‌కు కాంగ్రెస్ బిర్యానీ పెట్టింది: జేపీ నడ్డా -
Video: అమిత్‌షా హెలికాప్టర్‌ను తనిఖీ చేసిన ఈసీ అధికారులు
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముంగిట రాష్ట్రంలో అధికారుల తనిఖీలు ముమ్మరం చేశారు. సాధారణ పౌరులతోపాటు ప్రముఖ రాజకీయ నేతల వాహనాలను క్షణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే, శిసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే, సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ దేవేంద్ర ఫడ్నవీస్‌ల వాహనాలను సైతం తనిఖీ చేశారు. తాజాగా హింగోలి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం కోసం వచ్చిన హోంమంత్రి అమిత్ షా హెలికాప్టర్లో ఎన్నికల సంఘం అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆయన బ్యాగ్‌లను చెక్ చేశారు. ఈ విషయాన్ని అమిత్ షా నే స్వయంగా వెల్లడించారు. తనిఖీలకు సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పోస్టు చేశారు.‘ఎన్నికల ప్రచారం మహారాష్ట్రలోని హింగోలి అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చిన క్రమంలో నా హెలికాప్టర్‌ను ఈసీ అధికారులు తనిఖీ చేశారు. నిష్పక్షపాత, ఆరోగ్యకరమైన ఎన్నికల వ్యవస్థను బీజేపీ విశ్వసిస్తోంది. ఎన్నికల సంఘం రూపొందించిన అన్ని నిబంధనలను పాటిస్తుంది. ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేందుకు మనమంతా సహకరించాలి. ప్రపంచంలో శక్తిమంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థగా భారత్‌ను కొనసాగించడంలో మన బాధ్యతలను నిర్వర్తించాలి’ అని అమిత్ షా పేర్కొన్నారు.आज महाराष्ट्र की हिंगोली विधानसभा में चुनाव प्रचार के दौरान चुनाव आयोग के अधिकारियों के द्वारा मेरे हेलिकॉप्टर की जाँच की गई। भाजपा निष्पक्ष चुनाव और स्वस्थ चुनाव प्रणाली में विश्वास रखती है और माननीय चुनाव आयोग द्वारा बनाए गए सभी नियमों का पालन करती है। एक स्वस्थ चुनाव… pic.twitter.com/70gjuH2ZfT— Amit Shah (@AmitShah) November 15, 2024