ఎన్నికల టైంలో పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘాలు రకరకాల క్యాంపెయిన్‌లు నిర్వహిస్తుంటాయి. గడప దాటొచ్చి ఓటేయమని దాదాపుగా బతిమాలినంత పని చేస్తాయి. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి చేసిన ఓ ప్రకటన వార్తల్లోకెక్కింది.
ఢిల్లీ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. 2025 జనవరి 1వ తేదీనాటికి 18 ఏళ్లు దాటిన వాళ్లు ఎవరైనా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని ఢిల్లీ ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. అయితే ఇదే సమీక్షలో సీఈవో కీలక ప్రకటన చేశారు. కేవలం ఓటర్ ఐడీ(Voter ID) ఉన్నంత మాత్రన ఓటు హక్కు వర్తించబోదని ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి స్పష్టం చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఏం చెబుతోందంటే.. కేవలం ఒక్కచోటే ఓటర్‌గా నమోదు అయ్యి ఉండి.. ఓటర్ తుది జాబితాలో పేరు ఉండి.. ఓటర్ స్లిప్ అందినప్పుడే మాత్రమే ఓటు హక్కువేయడానికి ఉంటుంది. అలాగే ఓటర్ స్లిప్(Voter Slip)తో పాటు ఓటర్ ఐడీని కూడా పోలింగ్ సెంటర్ వద్ద సిబ్బందికి చూపించాల్సి ఉంటుంది. కేవలం ఓటర్ ఐడీ అనే కాదు.. ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్, పాన్ కార్డు, పాస్‌పోర్టు.. ఇలా 11 రకాల ఐటీ కార్డు కార్డుల్లో ఏదైనా ఓటర్‌స్లిప్‌తో పాటు తీసుకెళ్లి ఓటేయొచ్చు.
అలాంటి వాళ్ల ఓటు హక్కును మీరూ తొలగించొచ్చు..
ఒక ఓటరు చిరునామా శాశ్వతంగా మార్చినా లేదంటే ఓటర్ చనిపోయినా వాళ్ల ఓటు హక్కుపై ఎవరైనా అభ్యంతరాలను లేవనెత్తొచ్చు. అయితే ఆ అభ్యంతరాలను లేవనెత్తేది.. ఆ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వ్యక్తే అయి ఉండాలి.
ఇందుకోసం ఫారం-7ను అప్లై చేయాలి. ఆపై సదరు ఓటర్‌కు, అలాగే ఫిర్యాదు చేసినవాళ్లకు నోటీసులు వెళ్తాయి. అదే ఓటరు మరణించిన సందర్భమైతే..స్పీడ్ పోస్ట్ ద్వారా నోటీసులు పంపుతారు. నోటీసులు అందుకున్న ఓటరు సకాలంలో స్పందించకపోతే.. ఆ ఓటును తొలగించే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుంది.
ఓటర్లను జల్లెడ పట్టి..
తొలుత అక్టోబర్ 1, 2024 తేదీదాకా 18 ఏళ్లు నిండినవాళ్లు ఓటర్‌గా నమోదు చేసుకోవచ్చని ఢిల్లీ ఎన్నికల సంఘం ప్రకటించింది. కిందటి ఏడాది ఆగష్టు 20 నుంచి అక్టోబర్ 18వ తేదీదాకా బూత్ లెవల్(Booth Level) ఆఫీసర్లతో ఇంటింటి సర్వే నిర్వహించారు. 18 ఏళ్లు పైబడి కూడా ఓటర్లుగా నమోదు చేసుకోనివాళ్లను గుర్తించారు. అడ్రస్‌లు మారినవాళ్లు, చనిపోయినవాళ్లు, డూప్లికేట్లు(Duplicate) కార్డులను ఏరిపారేశారు. అక్టోబర్29వ తేదీన ఓటర్ల జాబితా డ్రాఫ్ట్‌ను రిలీజ్ చేసి అభ్యంతరాలను స్వీకరించడం ప్రారంభించింది. నవంబర్ 28వ తేదీ నుంచి వెరిఫికేషన్ ప్రక్రియను మొదలుపెట్టి.. డిసెంబర్ 24 కల్లా పూర్తి చేసింది. ఇప్పుడు జనవరి 1, 2025 తేదీతో 18 ఏళ్లు పూర్తైన వాళ్లు ఓటర్‌గా నమోదు చేసుకోవచ్చని తెలిపింది. జనవరి 6వ తేదీన ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని ఢిల్లీ ఎన్నికల సంఘం పేర్కొంది.
అయితే.. అప్‌డేషన్, మార్పులు చేర్పులు లాంటి నిరంతర ప్రక్రియ యధావిధిగా కొనసాగనుందని స్పష్టం చేసింది. అలాగే.. కొత్త ఓటర్లుగా రిజిస్టర్ కావాలనుకుంటే ఫారం 6ను నింపి సంబంధిత డాక్యుమెంట్లతో బూత్ లెవల్ ఆఫీసర్‌ను సంప్రదించాలని.. మార్పులు, తొలగింపుల కోసం ఫారం-8, ఫారం-7లను సబ్‌మిట్ చేయాలని సూచించారు.
తప్పుడు డాక్యుమెంట్లతో ఓటు హక్కు కోసం..
ఇదిలా ఉంటే.. వేర్వేరు చోట్ల ఓటర్‌గా నమోదు చేసుకుని ఉన్నా.. లేకుంటే ఎక్కువ ఓటర్ కార్డులు కలిగి ఉన్నా పీపుల్స్ రెప్రజెంట్ యాక్ట్ 1950 సెక్షన్లు 17, 18 కింద శిక్షార్హమైన నేరం. ఇలాంటి ఉల్లంఘనలకు కఠిన శిక్షలే ఉంటాయని ఎన్నికల సంఘం చెబుతోంది. అంతేకాదు.. ఓక్లా నియోజకవర్గంలో ఓటర్ నమోదు కోసం తప్పుడు డాక్యుమెంట్ల సమర్పించిన ఎనిమిది మందిపై కేసులు కూడా నమోదు అయ్యాయని ఢిల్లీ ఎన్నికల సంఘం(Delhi Election Commission) తెలిపింది.
ఢిల్లీ ప్రస్తుత అసెంబ్లీ గడువు ఫిబ్రవరి 15వ తేదీతో ముగియనుంది. త్వరలో ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.
చదవండి👉🏻: ఆయన ఆలయాలను కూల్చమంటున్నాడు!
Comments
Please login to add a commentAdd a comment