Delhi Election Commission
-
ఓటర్ ఐడీ మాత్రమే సరిపోదు: ఢిల్లీ ఎన్నికల సంఘం
ఎన్నికల టైంలో పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘాలు రకరకాల క్యాంపెయిన్లు నిర్వహిస్తుంటాయి. గడప దాటొచ్చి ఓటేయమని దాదాపుగా బతిమాలినంత పని చేస్తాయి. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి చేసిన ఓ ప్రకటన వార్తల్లోకెక్కింది.ఢిల్లీ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. 2025 జనవరి 1వ తేదీనాటికి 18 ఏళ్లు దాటిన వాళ్లు ఎవరైనా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని ఢిల్లీ ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. అయితే ఇదే సమీక్షలో సీఈవో కీలక ప్రకటన చేశారు. కేవలం ఓటర్ ఐడీ(Voter ID) ఉన్నంత మాత్రన ఓటు హక్కు వర్తించబోదని ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి స్పష్టం చేశారు.కేంద్ర ఎన్నికల సంఘం ఏం చెబుతోందంటే.. కేవలం ఒక్కచోటే ఓటర్‌గా నమోదు అయ్యి ఉండి.. ఓటర్ తుది జాబితాలో పేరు ఉండి.. ఓటర్ స్లిప్ అందినప్పుడే మాత్రమే ఓటు హక్కువేయడానికి ఉంటుంది. అలాగే ఓటర్ స్లిప్(Voter Slip)తో పాటు ఓటర్ ఐడీని కూడా పోలింగ్ సెంటర్ వద్ద సిబ్బందికి చూపించాల్సి ఉంటుంది. కేవలం ఓటర్ ఐడీ అనే కాదు.. ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్, పాన్ కార్డు, పాస్‌పోర్టు.. ఇలా 11 రకాల ఐటీ కార్డు కార్డుల్లో ఏదైనా ఓటర్‌స్లిప్‌తో పాటు తీసుకెళ్లి ఓటేయొచ్చు.అలాంటి వాళ్ల ఓటు హక్కును మీరూ తొలగించొచ్చు..ఒక ఓటరు చిరునామా శాశ్వతంగా మార్చినా లేదంటే ఓటర్ చనిపోయినా వాళ్ల ఓటు హక్కుపై ఎవరైనా అభ్యంతరాలను లేవనెత్తొచ్చు. అయితే ఆ అభ్యంతరాలను లేవనెత్తేది.. ఆ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వ్యక్తే అయి ఉండాలి.ఇందుకోసం ఫారం-7ను అప్లై చేయాలి. ఆపై సదరు ఓటర్‌కు, అలాగే ఫిర్యాదు చేసినవాళ్లకు నోటీసులు వెళ్తాయి. అదే ఓటరు మరణించిన సందర్భమైతే..స్పీడ్ పోస్ట్ ద్వారా నోటీసులు పంపుతారు. నోటీసులు అందుకున్న ఓటరు సకాలంలో స్పందించకపోతే.. ఆ ఓటును తొలగించే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుంది.ఓటర్లను జల్లెడ పట్టి.. తొలుత అక్టోబర్ 1, 2024 తేదీదాకా 18 ఏళ్లు నిండినవాళ్లు ఓటర్‌గా నమోదు చేసుకోవచ్చని ఢిల్లీ ఎన్నికల సంఘం ప్రకటించింది. కిందటి ఏడాది ఆగష్టు 20 నుంచి అక్టోబర్ 18వ తేదీదాకా బూత్ లెవల్(Booth Level) ఆఫీసర్లతో ఇంటింటి సర్వే నిర్వహించారు. 18 ఏళ్లు పైబడి కూడా ఓటర్లుగా నమోదు చేసుకోనివాళ్లను గుర్తించారు. అడ్రస్‌లు మారినవాళ్లు, చనిపోయినవాళ్లు, డూప్లికేట్లు(Duplicate) కార్డులను ఏరిపారేశారు. అక్టోబర్29వ తేదీన ఓటర్ల జాబితా డ్రాఫ్ట్‌ను రిలీజ్ చేసి అభ్యంతరాలను స్వీకరించడం ప్రారంభించింది. నవంబర్ 28వ తేదీ నుంచి వెరిఫికేషన్ ప్రక్రియను మొదలుపెట్టి.. డిసెంబర్ 24 కల్లా పూర్తి చేసింది. ఇప్పుడు జనవరి 1, 2025 తేదీతో 18 ఏళ్లు పూర్తైన వాళ్లు ఓటర్‌గా నమోదు చేసుకోవచ్చని తెలిపింది. జనవరి 6వ తేదీన ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని ఢిల్లీ ఎన్నికల సంఘం పేర్కొంది.అయితే.. అప్డేషన్, మార్పులు చేర్పులు లాంటి నిరంతర ప్రక్రియ యధావిధిగా కొనసాగనుందని స్పష్టం చేసింది. అలాగే.. కొత్త ఓటర్లుగా రిజిస్టర్ కావాలనుకుంటే ఫారం 6ను నింపి సంబంధిత డాక్యుమెంట్లతో బూత్ లెవల్ ఆఫీసర్‌ను సంప్రదించాలని.. మార్పులు, తొలగింపుల కోసం ఫారం-8, ఫారం-7లను సబ్మిట్ చేయాలని సూచించారు.తప్పుడు డాక్యుమెంట్లతో ఓటు హక్కు కోసం..ఇదిలా ఉంటే.. వేర్వేరు చోట్ల ఓటర్‌గా నమోదు చేసుకుని ఉన్నా.. లేకుంటే ఎక్కువ ఓటర్ కార్డులు కలిగి ఉన్నా పీపుల్స్ రెప్రజెంట్ యాక్ట్ 1950 సెక్షన్లు 17, 18 కింద శిక్షార్హమైన నేరం. ఇలాంటి ఉల్లంఘనలకు కఠిన శిక్షలే ఉంటాయని ఎన్నికల సంఘం చెబుతోంది. అంతేకాదు.. ఓక్లా నియోజకవర్గంలో ఓటర్ నమోదు కోసం తప్పుడు డాక్యుమెంట్ల సమర్పించిన ఎనిమిది మందిపై కేసులు కూడా నమోదు అయ్యాయని ఢిల్లీ ఎన్నికల సంఘం(Delhi Election Commission) తెలిపింది.ఢిల్లీ ప్రస్తుత అసెంబ్లీ గడువు ఫిబ్రవరి 15వ తేదీతో ముగియనుంది. త్వరలో ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.చదవండి👉🏻: ఆయన ఆలయాలను కూల్చమంటున్నాడు! -
ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం ఢిల్లీ ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాల ఓట్ల లెక్కింపు శుక్రవారం జరుగనుంది. ఏడు లోక్‌సభ నియోజకవర్గాల్లోని ఏడు కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ఉదయం ఎనిమిది గంటలకు మొదలవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల పర్యవేక్షణలో పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తరువాత అరగంట వ్యవధి ఇచ్చి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఈవీఎంలు) తెరుస్తారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపునకు 10 మంది మైక్రోఅబ్జర్వర్లను, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారిని నియమిస్తారు. ఓట్ల లెక్కింపు కేంద్రం పరిసరాల్లోకి మొబైల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్లడంపై నిషేధం విధించారు. అయితే ఎన్నికల అధికారులు మాత్రం ఫలితాలను ప్రసారం చేయడానికి ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించవచ్చు. కౌంటింగ్ సూపర్వైజర్లు, మైక్రోఅబ్జర్వర్లు, ఎన్నికల కమిషన్ అనుమతి పొందిన వ్యక్తులు మినహా ఇతరులెవరినీ ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి అనుమతించరు. మీడియా కూడా ఓట్ల లెక్కింపు కేంద్రంలో ప్రవేశించకూడదనే అధికారులు స్పష్టం చేశారు. మొత్తం ఓట్ల లెక్కింపు ప్రక్రియను వీడియో తీస్తారు. నగరవ్యాప్తంగా ఏప్రిల్ పదిన లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందుకు ఉపయోగించిన 20 వేల ఈవీఎంలను ఏడు కేంద్రాల్లోని స్ట్రాంగ్‌రూముల్లో ఉంచారు. వీటికి రెండంచెల భద్రత కల్పించారు. పోటీలో ఉన్న 150 మంది అభ్యర్థుల భవితను తేల్చనున్న ఈవీఎంలకు మొదటి వరుసలో పారామిలిటరీ బలగాలు భద్రత కల్పిస్తుండగా, బయట నుంచి ఢిల్లీ పోలీసులు కాపలా కాస్తున్నారు. ఇదిలా ఉంటే ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి విజయ్ దేవ్ సోమవారమే ఏర్పాట్లను పరిశీలించారు. రెండు పార్లమెంటరీ స్థానాల కౌంటింగ్ కేంద్రాలను సందర్శించారు. న్యూఢిల్లీ పార్లమెంట్ స్థానంలోని గోల్‌మార్కెట్ ఎస్పీ బెంగాలీ గాళ్స్ సీనియర్ సెకండరీ స్కూల్‌తో పాటు ద్వారకా సెక్టార్-9లోని ఇంటిగ్రేటెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని స్ట్రాంగ్‌రూమ్‌లోకి వెళ్లి అక్కడ కౌంటింగ్ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం...ప్రతి పార్లమెంట్ స్థానంలో 10 సూక్ష్మ పరిశీలకులు ఉంటారని, ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ విధులు నిర్వహిస్తారని విజయ్‌దేవ్ అన్నారు. ఏప్రిల్ పదిన జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 65.09 శాతం ఓటింగ్ నమోదయింది. -
గూడు లేకున్నాఓటు
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన ఎన్నికల ప్రక్రియలో అనాథలనూ భాగస్తులను చేసేందుకు ఢిల్లీ ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది. నగరంలోని రాత్రి వసతి కేంద్రాలు, ఫ్లై ఓవర్లు, పేవ్మెంట్ల వద్ద ఉండే ఎనిమిది వేల మందికి ఓటరుకార్డులు మంజూరు చేసింది. సార్వత్రిక ఎన్నికల కోసం ఈ నెల 10న నిర్వహించే పోలింగ్‌లో వీరం తా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇలాం టి వారికి శాశ్వత చిరునామాలు ఉండవు కాబట్టి ఎన్నికల సంఘం కొత్త ఆలోచన చేసింది. సదరు నిరాశ్రయుడు ఒకే ప్రదేశంలో మూడుసార్లు వరుసగా నిద్రించినట్టు తనిఖీల్లో తేలితేనే కార్డు మం జూరు చేయాల్సిందిగా బూత్‌స్థాయి అధికారులు (బీఎల్ఓ), నమోదు అధికారులను (ఆర్ఓ) ఆదేశించామని ఢిల్లీ ఎన్నికల సంఘం అధికారి విజయ్‌దేవ్ చెప్పారు. ఫ్లై ఓవర్లు, పేవ్మెంట్లు, రాత్రిపూట వసతిగృహాల్లో ఉండే వాళ్లందరికీ తనిఖీల అనంతరం కార్డులు మంజూరు చేశామని వెల్లడించారు. ‘అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేవలం 82 మంది అనాథలకు ఓటరుకార్డులు ఉండేవి. వాటి సంఖ్య ఇప్పుడు ఎనిమిది వేలకు చేరింది. బస్టాపుల్లో కాలం గడిపే మాదకద్రవ్యాల వ్యసనపరులకూ కార్డులు ఇచ్చాం’ అని ఆయన వివరించారు. అయితే నిరాశ్రయులు, అనాథలు వేరే ప్రాంతాలకు తరలివెళ్లినట్టు తెలిస్తే ఓటర్లు జాబితాల నుంచి వాళ్ల పేర్లు తొలగి స్తామని ప్రకటించారు. ఓటరుకార్డు పొందిన నియోజకవర్గంలో మా త్రమే ఓటు వేయాలని స్పష్టం చేశారు. ఇక సెంట్రల్ఢిల్లీలో అత్యధికంగా 2,863 మంది నిరాశ్రయులు ఓటు హక్కు పొందగా, పశ్చిమఢిల్లీలో అత్యల్పంగా 80 మంది మాత్రమే ఈ సదుపాయాన్ని ఉపయోగించుకున్నారు. ఇదిలా ఉండే ఓటు హక్కు ప్రాధాన్యం గురించి కూడా వీరందరికీ అవగాహన కల్పిం చేందుకు ఎన్నికల సంఘం ప్రయత్నిస్తోంది. అంతేగాక అధికారులే స్వయంగా వీళ్లు ఉన్న చోటికి వెళ్లి కార్డులు అందజేస్తున్నారు. అయితే మాకేంటి? ఓటరుకార్డు వచ్చిన మాత్రానా తన జీవితంలో ఏం మార్పు వస్తుందని రాము అనే నిరాశ్రయుడు ప్రశ్నించారు. దక్షిణఢిల్లీలోని ఓ ఫ్లై ఓవర్ కింద నివసించే ఇతడు కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. రెక్కాడితేనే డొక్కాడుతుందని, పోలింగ్‌బూత్‌కు వెళ్లి ఓటేసినంత మాత్రాన ఒరిగేదీ లేదంటూ నిట్టూ ర్పు విడిచాడు. అయితే మరికొందరు మాత్రం ఆశావహ దృక్పథంతో ఉన్నారు. మొదటిసారి ఓటు వేస్తున్నందుకు సంతోషంగాఉందని చెబుతున్నారు. 8 నాటికి పోలింగ్ కేంద్రాలు సిద్ధం ఎన్నికల తేదీ సమీపిస్తుండడంతో ఢిల్లీలో పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. నగరంలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లు లోక్‌సభ ఎన్నికల కోసం తమ తమ ప్రాంతాల్లో పోలింగ్ బూత్‌లను సిద్ధం చేస్తున్నాయి. ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 4,550 పోలింగ్ బూత్ లు, తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరి ధిలో 2,662 పోలింగ్‌బూత్‌లు, దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 4,770 పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. స్కూళ్లు, ఇతర భవనాల్లోనూ పోలింగ్ బూత్‌లను ఏర్పాటుచేస్తున్నారు. భవనాలు లేని చోట్ల తాత్కాలికంగా గుడారాలు వేసి పోలింగ్ కేంద్రాలను నిర్మిస్తుంటారు. ఈసారి టెంట్లకు బదు లు పోర్టాకేబిన్లు ఏర్పాటు చేస్తున్నారు. కరోల్‌బాగ్‌లో పోర్టాకేబిన్లతో 31 పోలింగ్‌బూత్‌లను ఏర్పా టు చేస్తున్నారు ఏప్రిల్ 8 నాటికి పోలింగ్ బూత్‌లన్నీ సిద్ధం కానున్నాయి. తొమ్మిదిన ఎన్నికల కమిషన్ అధికారులు పోలింగ్ కేంద్రాలను సందర్శించి అన్ని ఏర్పాట్లను సమీక్షిస్తారు. ఏవైనా లోటుపాట్లుం టే అదే రోజున వాటిని సరిచేస్తారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో తాగునీటి సదుపాయం, ఎండ బారినపడకుండా నీడ, లైట్ల వంటి సదుపాయాలు ఉండేలా చూస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పోలింగ్ కేంద్రాన్ని మోడల్ పోలింగ్ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. మోడల్ పోలింగ్ కేంద్రంలో ఓటర్ల కోసం అన్ని సదుపాయాలు ఉంటాయి. వీటి ఏర్పాటు కోసం 60 వేల రూపాయలు కేటాయించారు. -
వికలాంగ ఓటర్లకు ప్రత్యేక సదుపాయాలు
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో వికలాంగ ఓటర్లంతా చురుగ్గా పాల్గొనే చేయడానికి పలు చర్యలు తీసుకుంటున్నామని ఢిల్లీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈఓ) విజయ్‌దేవ్ శనివారం ప్రకటించారు. వికలాంగులు ఓటింగ్ రోజు ఎన్నికల అధికారులను సంప్రదించడానికి వీలుగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నామని వెల్లడించారు. పోలింగ్‌బూత్‌ల వద్ద వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ఢిల్లీ ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఈ సాఫ్ట్‌వేర్‌ను వారంలోపు అందుబాటులోకి తెస్తారు. దీనిని వినియోగించుకోవాలనుకునేవాళ్లు అందులో తమ పేరు, చిరునామాతోపాటు ఏవైనా అవసరాలు ఉంటే తెలియజేయాలి. ‘వికలాంగులు సులువుగా ఓటు వేయడానికి వీలుగా వారికి అన్ని సదుపాయాలూ కల్పిస్తాం. అందుకే ఈ సాఫ్ట్‌వేర్‌ను తయారు చేస్తున్నాం’ అని విజయ్‌దేవ్ వివరించారు. ఉదాహరణకు ఒక వికలాంగుడికి వీల్‌చెయిర్ లేదా సహాయకుడి అవసరం ఉంటే అతడు/ఆమె వెబ్‌సైట్‌లోని సాఫ్ట్వేర్ ద్వారా ఎన్నికల సంఘానికి ఆ విషయం తెలియజేయవచ్చు. ముందస్తుగా సమాచారం అందితే అధికారులు సదరు ఓటరుకు ఆ సదుపాయాలు కల్పిస్తారు. అంతేకాదు ఢిల్లీ వ్యాప్తంగా ఎంతమంది వికలాంగ ఓటర్లు ఉన్నారో ఈ సాఫ్ట్వేర్ వల్ల తెలుసుకోవచ్చని ఎన్నికల సంఘం భావిస్తోంది. ప్రస్తుతం నగరవ్యాప్తంగా ఎంతమంది వికలాంగ ఓటర్లు ఉన్నారో తెలియకపోవడం వల్ల వారికి తగిన ఏర్పాట్లు చేయలేకపోతున్నామని విజయ్‌దేవ్ అన్నారు. జాతీయ వికలాంగుల ఉపాధి ప్రోత్సాహక కేంద్రం (ఎన్సీపీఈడీపీ) గణాంకాల ప్రకారం రాజధానిలో 2.5 లక్షల మంది వికలాంగులు ఉన్నారు. అంధుల కోసం బ్రెయిలీ లిపి బ్యాలెట్ పత్రాలు/ర్యాంప్‌లను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని కూడా ఆదేశించామని విజయ్‌దేవ్ ఈ సందర్భంగా తెలిపారు. ‘వికలాంగుల అభిప్రాయాలు తీసుకొని వారికి అనుగుణంగా ఏర్పాట్లు చేసే పని ఇంత వరకూ జరగలేదు. అందుకే మేం కొన్ని స్వచ్ఛందసంస్థలను సంప్రదించి సాఫ్ట్వేర్ తయారు చేస్తున్నారు. కేంద్ర న్యాయ, సాంఘిక సంక్షేమ మంత్రిత్వశాఖ కూడా ఇందుకు సహకరించింది. ప్రతి పోలింగ్‌బూత్ వద్ద వికలాంగ ఓటర్ల కోసం కొందరు స్వచ్ఛంద సేవకులు, ఒక వీల్‌చెయిర్ అందుబాటులో ఉంచుతున్నాం. వాళ్లు సులువుగా లోపలికి ప్రవేశించి నిష్ర్కమించేలా చూడాలని పోలింగ్ సిబ్బందిని ఆదేశించాం. వైకల్యమున్న ఓటర్లతో మర్యాదగా వ్యవహరించాలని కూడా సూచించాం. ఈ నిబంధనలను ఉల్లంఘించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం’ అని విజయ్‌దేవ్ అన్నారు. అయితే వికలాంగుల హక్కుల కోసం పోరాడేవాళ్లు మాత్రం ఈ చర్యలు సరిపోవని అంటున్నారు. ఢిల్లీ ఎన్నికల సంఘం మాత్రమే ఇటువంటి చర్యలను ప్రకటించిందని, మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఏమంటని వికలాంగుల హక్కుల సంస్థ సమన్వయకర్త జావెద్ అబీదీ ప్రశ్నించారు. వికలాంగ ఓటర్లకు తగిన సదుపాయాలు కల్పించేలా ఆదేశించాలంటూ ఆయన 2004లోనే సుప్రీంకోర్టును ఆదేశించారు. వైకల్యమున్న వాళ్లు పోలింగ్‌బూత్‌లోకి ప్రవేశించేందుకు తగిన ర్యాంప్‌లు (మెట్లకు బదులుగా) లేవని ఆక్షేపించారు. -
4 వరకు ఓటరుకార్డుల జారీ
న్యూఢిల్లీ: కొత్త ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లంతా సంబంధిత జిల్లా ఎన్నికల కార్యాలయాల్లో వచ్చే నెల 4 వరకు ఓటరుకార్డులు పొందవచ్చు. ఢిల్లీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి విజయ్‌దేవ్ మంగళవారం విలేకరుల సమావేశంలో ఈ మేరకు ప్రకటించారు. ఈ ఏడాది జనవరి 31 తరువాత రాష్ట్రవ్యాప్తంగా 6.45 లక్షల మంది ఓటరుకార్డుల కోసం దరఖాస్తులు సమర్పించారని తెలిపారు. ఢిల్లీ ఓటర్ల సంఖ్య 1.27 కోట్లు కాగా, వీరిలో కొత్తగా ఓటు హక్కు పొందిన వారి సంఖ్య లక్ష దాకా ఉంటుందని విజయ్ అన్నారు. ఢిల్లీలోని మొత్తం 11,763 పోలింగ్ స్టేషన్లలో 407 కేంద్రాలను సమస్యాత్మకమైనవాటిగా గుర్తించామని వెల్లడించారు. 90 పోలింగ్ స్టేషన్లను అత్యంత సమస్యాత్మకమైనవాటిగా గుర్తించినట్టు ప్రకటించారు. వీటిలో భారీగా భద్రతా బలగాలను మోహరిస్తామని తెలిపారు. నామినేషన్ల పరిశీలన తరువాత మొత్తం 156 మంది ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేస్తున్నట్టు తేలిందని సీఈఓ వివరించారు. ఈ నెల 26 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చన్నారు. తగిన పత్రాలు సమర్పించకపోవడంతో 51 మంది నామినేషన్లను తిరస్కరించినట్టు ప్రకటించారు. న్యూఢిల్లీ స్థానానికి అత్యధికంగా 29 మంది, వాయవ్యఢిల్లీ సీటుకు అత్యల్పంగా 15 నామినేషన్లు దాఖలయ్యాయని విజయ్‌దేవ్ ఈ సందర్భంగా విశదీకరించారు. -
కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత
న్యూఢిల్లీ: గత నాలుగోతేదీన జరిగిన ఢిల్లీ విధాన సభ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ఆది వారం జరగనున్న నేపథ్యంలో ఆయా కేంద్రాల వద్ద ఎన్నికల కమిషన్ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేసింది. నగరవ్యాప్తంగా ఉన్న 14 కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర పారామిలటరీ దళానికి చెందిన 2000 మంది సాయుధులతోపాటు ఢిల్లీ పోలీస్ సిబ్బందిని భారీగా మోహరించారు. ఆయా కేంద్రా ల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేయడంతోపాటు వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని చేయనున్నారు. సదరు ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అంతర్గత భద్రతా వ్యవహారాలను పారామిలటరీ దళాలు, బయట భద్రతా చర్యలను ఢిల్లీ పోలీసులు చూసుకుంటారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ల ను లెక్కిస్తారు. ఈసారి మొత్తం 43 వేల పోస్టల్ బ్యా లెట్లు వచ్చాయని, గత ఎన్నికల్లో ఈ సంఖ్య 1,600 మాత్రమేనని ఎన్నికల కమిషన్ అధికారి దేవ్ తెలి పారు. కౌంటింగ్ ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు జరుగకుండా మొత్తం ప్రక్రియను కంట్రోల్ రూం నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా సీనియర్ ఎన్నికల అధికారులు పర్యవేక్షిస్తారని ఆయన వివరించారు.