న్యూఢిల్లీ: కొత్త ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లంతా సంబంధిత జిల్లా ఎన్నికల కార్యాలయాల్లో వచ్చే నెల 4 వరకు ఓటరుకార్డులు పొందవచ్చు. ఢిల్లీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి విజయ్‌దేవ్ మంగళవారం విలేకరుల సమావేశంలో ఈ మేరకు ప్రకటించారు. ఈ ఏడాది జనవరి 31 తరువాత రాష్ట్రవ్యాప్తంగా 6.45 లక్షల మంది ఓటరుకార్డుల కోసం దరఖాస్తులు సమర్పించారని తెలిపారు. ఢిల్లీ ఓటర్ల సంఖ్య 1.27 కోట్లు కాగా, వీరిలో కొత్తగా ఓటు హక్కు పొందిన వారి సంఖ్య లక్ష దాకా ఉంటుందని విజయ్ అన్నారు.
ఢిల్లీలోని మొత్తం 11,763 పోలింగ్ స్టేషన్లలో 407 కేంద్రాలను సమస్యాత్మకమైనవాటిగా గుర్తించామని వెల్లడించారు. 90 పోలింగ్ స్టేషన్లను అత్యంత సమస్యాత్మకమైనవాటిగా గుర్తించినట్టు ప్రకటించారు. వీటిలో భారీగా భద్రతా బలగాలను మోహరిస్తామని తెలిపారు. నామినేషన్ల పరిశీలన తరువాత మొత్తం 156 మంది ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేస్తున్నట్టు తేలిందని సీఈఓ వివరించారు. ఈ నెల 26 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చన్నారు.
తగిన పత్రాలు సమర్పించకపోవడంతో 51 మంది నామినేషన్లను తిరస్కరించినట్టు ప్రకటించారు. న్యూఢిల్లీ స్థానానికి అత్యధికంగా 29 మంది, వాయవ్యఢిల్లీ సీటుకు అత్యల్పంగా 15 నామినేషన్లు దాఖలయ్యాయని విజయ్‌దేవ్ ఈ సందర్భంగా విశదీకరించారు.