
మాపై దాడులు చేసిన టీడీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలి
అంతవరకు మండల కేంద్రంలోనే విధులు నిర్వర్తిస్తాం
అధికారులకు కర్నూలు జిల్లా బొమ్మిరెడ్డిపల్లె సచివాలయ ఉద్యోగుల స్పష్టీకరణ
వెల్దుర్తి: కర్నూలు జిల్లా బొమ్మిరెడ్డిపల్లెలో తాము ఉద్యోగం చేయలేమని సచివాలయ ఉద్యోగులు మంగళవారం సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. గ్రామంలో హత్యోదంతం అనంతరం తమపై టీడీపీ కార్యకర్తలు కక్షగట్టి వ్యవహరిస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గ్రామ పంచాయతీ సెక్రటరీ మల్లికార్జున, వెల్ఫేర్ అసిస్టెంట్ సురేంద్ర రెడ్డి, వీఏఏ సుదీర్ రెడ్డి, జీఎమ్‌ఎస్‌కె (మహిళా పోలీసు) రేణుక, డిజిటల్ అసిస్టెంట్ బి.సునీత, ఏహెచ్‌ఏ ఇంద్రజ, వీఆర్‌వో బోయ వాణి, వీఎస్ రమేశ్‌లు తమ వినతి పత్రాన్ని, ఫిర్యాదును ఎంపీడీవో సుహాసిని, తహశీల్దార్ చంద్రశేఖర్ వర్మ, సీఐ మధుసూదన్ రావు, ఎస్‌ఐ అశోక్, ఏవో అక్బర్‌బాషాలకు అందజేశారు.
సోమవారం ఉదయం గ్రామ సచివాలయంలో తాము విధి నిర్వహణలో ఉండగా 15–20 మంది గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు మద్యం మత్తులో మూకుమ్మడిగా నాటుకట్టెలతో వచ్చి సచివాలయం నుంచి బయటకు వెళ్లకుంటే కొట్టి చంపుతామని బెదిరించి, తమను దుర్భాషలాడారని వాపోయారు. తాము భయపడి సచివాలయం నుంచి బయటకు వెళ్తుండగా కర్రలతో కొట్టే ప్రయత్నం చేశారన్నారు. తాము తప్పించుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోవాల్సి వచ్చిందన్నారు.
ఇకపై ఆ గ్రామంలో ఉద్యోగం చేయలేమని, తమపై దాడికి దిగిన వారిలో ప్రధానమైన ఎంజీ నాగరాజు, కె.శ్రీనాథ్‌లపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. తమకు రక్షణ కల్పించకపోతే బొమ్మిరెడ్డిపల్లె సచివాలయానికి హాజరు కాబోమని, అంతవరకు ఎంపీడీవో కార్యాలయంలో విధులకు హాజరవుతామన్నారు. వినతిపత్రం, ఫిర్యాదు అందుకున్న సంబంధిత అధికారులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు. దీంతో బొమ్మిరెడ్డిపల్లె గ్రామంలో రెండ్రోజులుగా సచివాలయ, ఆర్బీకే సేవలు నిలిచిపోయాయి. ఆర్బీకే భవనానికి తాళం వేసి ఉండగా, సచివాలయ భవనంలో పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు.