పింఛన్లపై పెత్తనం.. మళ్లీ జన్మభూమి కమిటీలదే రాజ్యం | Pensions distribution was completely under control of TDP Alliance political leaders | Sakshi
Sakshi News home page

పింఛన్లపై పెత్తనం.. మళ్లీ జన్మభూమి కమిటీలదే రాజ్యం

Published Tue, Jul 2 2024 4:06 AM | Last Updated on Tue, Jul 2 2024 4:06 AM

Pensions distribution was completely under control of TDP Alliance political leaders

ఐదేళ్లు వివక్ష లేకుండా అందించిన పెన్షన్లకు రాజకీయ రంగులు

పేరుకు మాత్రమే సచివాలయాల ఉద్యోగుల ద్వారా పంపిణీ 

కూటమి పార్టీ నేతల కనుసన్నల్లోనే అంతా.. ఆధిపత్యం చాటుకునేందుకు టీడీపీ – జనసేన ఆరాటం 

ఏదైనా తమ ఆధ్వర్యంలోనే జరగాలంటూ టీడీపీ పట్టు 

తోక పార్టీ నాయకులు పంపిణీ చేయడానికి వీల్లేదని ఆదేశం

ప్రశ్నించిన జనసేన మహిళా కార్యకర్తపై విజయనగరంలో దాడి

కొన్నిచోట్ల పైచేయి కోసం టీడీపీలోనే 2 వర్గాల మధ్య ఘర్షణలు

కార్లలో, చెట్ల కింద, రచ్చబండ, ప్రైవేట్‌ స్థలాలకు రప్పించడంతో లబ్ధిదారులు పడిగాపులు

పెన్షన్‌ మొత్తంలో పలుచోట్ల రూ.500 చొప్పున వసూలు

నంద్యాలలో పింఛన్ల పంపిణీలో పాల్గొన్న సచివాలయ సెక్రటరీ అనుమానాస్పద మృతి

సాక్షి, అమరావతి/నెట్‌వర్క్‌: ఐదేళ్లు ఎలాంటి వివక్షకు తావులేకుండా ఠంచన్‌గా, పారదర్శకంగా అందించిన పింఛన్లపై జన్మభూమి కమిటీల రాజ్యం మళ్లీ మొదలైంది. టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా సోమవారం చేపట్టిన సామాజిక పింఛన్ల పంపిణీ పూర్తిగా రాజకీయ నేతల కనుసన్నల్లో సాగింది. ఇంటివద్ద అందించాల్సిన పెన్షన్లను కొన్నిచోట్ల చెట్ల కింద, రచ్చబండ వద్ద, ప్రైవేట్‌ స్థలాల్లో ఇస్తామని తిప్పడంతో పడిగాపులు కాసి అవస్థలు ఎదుర్కొన్నారు. పేరుకు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించినా పంపిణీ మొత్తం ప్రతి చోటా అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలోనే జరిగింది. 

పింఛన్ల పంపిణీలో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల స్థానిక టీడీపీ నాయకులు చేతివాటం చూపినట్లు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల సహా పలు చోట్ల కమీషన్ల కింద రూ.500 మినహాయించుకుని ఫించన్‌ ఇస్తున్నట్లు కొన్ని వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. 2014–19 మధ్య కూడా టీడీపీకి చెందిన జన్మభూమి కమిటీ సభ్యులు లంచాల వసూళ్లకు తెగబడి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అదే వాతావరణం కనిపించినట్లు వాపోతున్నారు. 

వైఎస్సార్‌ జిల్లా చాపాడు మండలంలో 94 మంది లబ్ధిదారులకు మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ఫిర్యాదుతో ఈ నెల ఫించన్లు నిలిచిపోయాయి. ఇన్నాళ్లూ ప్రతి నెలా ఒకటో తేదీన తెల్లవారుజామునే ఇంటివద్దే నిశ్చింతగా కోవిడ్‌ కష్టకాలంలోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా అందిన ఫించన్లు ఈసారి కొన్నిచోట్ల ఉదయం 8 గంటలు దాటుతున్నా చేతికి అందకపోవడంతో పలుచోట్ల లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. వైఎస్సార్‌సీపీ హయాంలో పింఛన్ల మంజూరు మొదలు పంపిణీ దాకా రాజకీయాలకు అతీతంగా, ఎవరి సిఫారసులు అవసరం లేకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో పింఛన్లను అందచేసిన విషయం తెలిసిందే. దీనికి పూర్తి భిన్నంగా తాజాగా పింఛన్ల పంపిణీ కొనసాగింది. 

గ్రామాల్లోనూ, వార్డులోనూ సచివాలయాల ఉద్యోగుల వెంట స్థానిక టీడీపీ, జనసేన నాయకులు మోహరించారు. ఇళ్లకు వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందచేస్తూ పోటాపోటీగా నేతలు ఫోటోలు దిగారు. విజయనగరం తదితర చోట్ల తమ అధిపత్యం నిరూపించుకునేందుకు జనసేన – టీడీపీ నేతలు పరస్పరం దాడులకు దిగిన ఉదంతాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. కూటమి నేతలు కొన్ని చోట్ల తమ ప్రత్యర్ధి పార్టీకి ఓటు వేశారనే అక్కసుతో పలువురు పింఛన్లను తొలగించినట్లు వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలో పెదంచలలో వైఎస్సార్‌ సీపీకి ఓటు వేసినందుకు తమ పింఛన్లు నిలిపివేశారంటూ కొందరు లబ్ధిదారులు సచివాలయానికి తాళం వేసి ఆందోళనకు దిగారు. 

కాగా నంద్యాలలో పింఛన్ల పంపిణీలో పాల్గొన్న 29వ వార్డు సచివాలయం ప్లానింగ్‌ సెక్రటరీ సుధారాణి (32) సోమవారం రాత్రి తన ఇంట్లో బాత్‌రూమ్‌లో అనుమానాస్పద రీతిలో మరణించారు. వారం క్రితం స్థానిక సచివాలయంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఫోటోలు ఏర్పాటు చేసిన టీడీపీ నాయకులు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ మాబున్నిసాతో పాటు సచివాలయ ఉద్యోగులను బెదిరించినట్లు సమాచారం. ఈ క్రమంలో మనస్థాపానికి గురైన సుధారాణి సోమవారం టీడీపీ నేతలతో కలసి పింఛన్ల పంపిణీలో పాల్గొన్న అనంతరం అనుమానాస్పద రీతిలో మరణించారు.

తొలిరోజు 95 శాతం.. 
మొత్తం 64.75 లక్షల మంది లబ్ధిదారులకుగానూ తొలి రోజు సోమవారం రాత్రి ఏడు గంటల సమయానికి 61 లక్షల మంది (దాదాపు 95 శాతం)కి పైగా పింఛన్ల పంపిణీ పూర్తైనట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. వలంటీర్లతో సంబంధం లేకుండా పూర్తిగా గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందితో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో పంపిణీ కొనసాగించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల వలంటీర్లు వారి వెంట వెళ్లి పంపిణీలో పాల్గొన్నారు. ఉదయం కొద్దిసేపు సాంకేతికపరమైన అవాంతరాలు తల్తెత్తడంతో వాటిని సరిదిద్ది ప్రక్రియ కొనసాగించారు.

జనసేన మహిళా కార్యకర్తపై టీడీపీ నేతల దాడి
పింఛన్ల పంపిణీ సందర్భంగా విజయనగరం జిల్లాలో కూటమి నేతల్లో ఆధిపత్య పోరు బహిర్గతమైంది. టీడీపీ, జనసేన నాయకులు ఆధిపత్యం రుజువు చేసుకునేందుకు యత్నించడంతో విజయనగరం కార్పొరేషన్‌ పరిధిలోని కొన్నివార్డుల్లో పింఛన్ల పంపిణీ నిలిచిపోయింది. పింఛన్లను ఇంటింటికీ వెళ్లి అందించాల్సి ఉండగా కూటమి నాయకులు ఒకచోట కూర్చొని పంపిణీ చేపట్టారు. వైఎస్సార్‌ నగర్‌లోని కొన్ని వీధుల్లో జనసేన, మరికొన్ని చోట్ల టీడీపీ నాయకులు పింఛన్లు పంపిణీ చేశారు. ఇక్కడ జనసేన నాయకులు పంపిణీ చేస్తున్న పింఛన్లను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. 

ఏదైనా తమ ఆధ్వర్యంలోనే జరగాలని, తోక పార్టీ నాయకులు పంపిణీ చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. వారిని ప్రశ్నించిన జనసేన మహిళా కార్యకర్తపై టీడీపీ నాయకులు దాడిచేశారు. ఈ ఘటనతో పింఛనుదారులు భయాందోళనలకు గురయ్యారు. కూటమి ప్రభుత్వం రావడంలో జనసేనదే ముఖ్యపాత్రని, తమను అడ్డుకోవడమేంటని కొందరు జనసేన నాయకులు ప్రశ్నించడంతో వివాదం నెలకొంది. చాలాసేపు సద్దుమణగకపోవడంతో పింఛన్ల పంపిణీ నిలిచిపోయింది. దీంతో లబ్ధిదారులు నిరాశతో వెళ్లిపోయారు. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటివి ఎన్నడూ చూడలేదని, ఉదయం ఐదు గంటలకే వలంటీర్లు ఇంటిగుమ్మం వద్దకు వచ్చి పింఛను అందించారని గుర్తు చేసుకున్నారు.

వృద్ధులు ఉసూరు..
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కొన్ని వార్డుల్లో లబ్ధిదారులను నిర్దేశిత ప్రాంతానికి రావాలని ఆదేశించడంతో వృద్ధులు, దివ్యాంగులు నానా పాట్లు పడి అక్కడకు చేరుకున్నారు. కొందరి వేలిముద్రలు పడకపోవడంతో ఐరిస్‌తో ప్రయత్నించారు. చివరకు సరిపోలడం లేదని, ఫించన్‌ ఇవ్వలేమని చెప్పడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. పలువురు వృద్ధులు ఉసూరుమంటూ వెనుదిరిగారు. మరికొన్ని వార్డుల్లో సచివాలయాలకు తాళం వేసి సిబ్బంది పింఛన్ల పంపిణీకి వెళ్లి పోవడంతో సమాచారం తెలియక పలువురు అక్కడకు చేరుకుని ఇబ్బందులు పడ్డారు.

మొదటి నెలలోనే చుక్కలు...
– సత్యనారాయణ, 5వ వార్డు, తాడేపల్లిగూడెం
అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే పింఛను లబ్ధిదారులకు చుక్కలు చూపిస్తున్నారు. మా వార్డులో పంపిణీకి ఇంటికి రాలేదు. ఎక్కడ ఇస్తున్నారో తెలియదు. సచివాలయానికి వెళితే తాళం వేసి ఉంది. ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి.

సచివాలయాలకు పరుగు 
ఉదయం 8 గంటలు దాటుతున్నా సచివాలయ సిబ్బంది జాడ లేకపోవడం, పింఛన్‌ తీసుకోకుంటే వెనక్కి వెళ్లిపోతుందనే ఆందోళనతో విజయనగరంలో లబ్ధిదారులు సచివాలయాలకు పరుగులు తీశారు. సర్వర్‌ సమస్యలతో గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. విజయనగరంలోని తోటపాలెం సచివాలయంలో ఈ పరిస్థితి కనిపించింది. 

ఫించన్లపై ఫిర్యాదులు..
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పెదంచల గ్రామంలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులంటూ కొందరికి పింఛన్లు ఇవ్వకపోవడం వాగ్వాదానికి దారి తీసింది. టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు ఇవ్వలేక పోతున్నామని చెప్పడంతో గ్రామంలో పింఛన్‌ అందని వారంతా ఒక చోటకు చేరి ఆందోళనకు దిగారు. సచివాలయానికి తాళం వేసి రైతు భరోసా కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు. సుమారు 22 మంది తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో వికలాంగ గుర్తింపు సర్టిఫికెట్‌ పొంది పింఛన్‌ పొందుతున్నారని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సాయంత్రం మూడు గంటలకు పింఛన్లు అందజేశామని సచివాలయం వెల్ఫేర్‌ అధికారి రవికుమార్‌ చెప్పారు.

ప్రకాశంలో పడిగాపులు..
ఇంటి వద్ద పంపిణీ చేయాల్సిన పింఛన్లను ప్రకాశం జిల్లాలో ఆలయాలు, స్కూళ్లు, ప్రైవేటు స్థలాల వద్దకు రప్పించడంతో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఇబ్బంది పడ్డారు. గంటల తరబడి పడిగాపులు కాశారు. చివరకు సర్వర్‌ పనిచేయడంలేదని చెప్పడంతో నిరాశగా వెనుదిరిగారు. ఎక్కువ చోట్ల గ్రామాల్లో రచ్చబండ వద్ద కూర్చొని పింఛన్లు పంపిణీ చేశారు.

కష్టాలు మొదలయ్యాయి
ఇన్నాళ్లూ జగనన్న ప్రభుత్వ హయాంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వలంటీర్ల ద్వారా ఇంటి వద్దనే ప్రతి నెలా 1వ తేదీ ఉదయం పింఛన్‌ అందుకున్నాం. ఈసారి మాకు పింఛన్‌ అందలేదు. ప్రాంతాల వారీగా పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. మరో రెండు రోజుల తరువాత గాని మాకు అందే పరిస్థితి లేదు. మాకు కష్టాలు మొదలయ్యాయి.

పుట్టా ఫిర్యాదుతో 94 మందికి ఆగిన ఫించన్లు
వైఎస్సార్‌ జిల్లా చాపాడు మండలంలో మడూరు, అన్నవరం, టీఓపల్లె గ్రామాల్లో గత నెల వరకు పింఛన్లు పొందిన 94 మంది లబ్ధిదారులకు ఈదఫా డబ్బులు అందలేదు. మైదుకూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ఫిర్యాదులే దీనికి కారణం. మడూరులో 40, అన్నవరంలో 28, టీఓపల్లెలో 26 మందికి పించన్లపై పునర్విచారణ చేయాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో 94 మందికి పింఛన్లను ఆపాలని ఎంపీడీఓ రహంతుల్లయ్య పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే తమ పింఛన్లను ఆపారని, వైఎస్సార్‌సీపీ మద్దతుదారులమనే ఇలా చేశారని, విచారణ జరిపి అర్హత ఉంటేనే తమకు పింఛన్‌ ఇవ్వాలని బాధితులు పేర్కొన్నారు.

ఒంటరి మహిళ ఇక్కట్లు..
భర్తకు పొగొట్టుకుని వితంతు పింఛన్‌ పొందుతున్నా. గత ఐదేళ్లుగా టంఛన్‌గా ఇచ్చారు. ఈసారి రాలేదు. డబ్బుల కోసం పంచాయతీ అధికారి వద్దకు వెళితే నీ పింఛన్‌ ఆపమన్నారని చెప్పారు. అర్హత పత్రాలు పరిశీలించిన తర్వాత అధికారుల సూచన మేరకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పింఛన్‌ డబ్బులే నాకు జీవనాధారం.

కారు వద్దే పింఛన్ల పంపిణీ
ఓ సచివాలయ ఉద్యోగి తన కారు వద్దకే లబ్ధిదారులను రప్పించుకుని పింఛన్‌ పంపిణీ చేపట్టిన ఘటన రాజమహేంద్రవరంలో వెలుగులోకి వచ్చింది. 16వ డివిజన్‌ పరిధిలోని 41వ వార్డు సచివాలయం ఎమినిటీ సెక్రటరీ వీవీడీ ప్రసాద్‌కు వాంబే కాలనీలో పింఛన్ల పంపిణీ బాధ్యత అప్పగించారు. బ్లాక్‌–1 వద్ద దివ్యాంగులు, వృద్ధులు, వితంతవులు తన కారు వద్దకు వచ్చి పింఛన్లు తీసుకోవాలని చెప్పడంతో చేసేది లేక లబ్ధిదారులు అక్కడ బారులు తీరారు. దివ్యాంగుల సంక్షేమ సంఘం నాయకుడు, వైఎస్సార్‌ సీపీ నేత  సబ్బెళ్ల విజయదుర్గారెడ్డి దీన్ని వీడియో తీశారు. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెండు గంటల తరువాత ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు.

సాయంత్రం వరకు ఇవ్వలేదు..
గతంలో వలంటీర్లు వేకువజామునే మా ఇంటి వద్దకు వచ్చి తలుపుతట్టి పింఛన్‌ డబ్బులు ఇచ్చేవారు. ఈసారి సాయంత్రం 6 గంటల వరకు పింఛన్‌ నగదు ఇవ్వలేదు. సచివాలయ ఉద్యోగులను అడిగితే మీకు ఇప్పుడే ఇవ్వమన్నారని చెప్పారు. ఎందుకయ్యా? అని అడిగితే.. ఏమో టీడీపీ వాళ్లు చెప్పారని అంటున్నారు. 
గత ప్రభుత్వంలో కులం, మతం, వర్గం, ప్రాంతం ఇవేమీ చూడకుండా అర్హులందరికీ పింఛన్లు ఇచ్చారు. ఎలాంటి కక్షసాధింపులు ఉండేవి కావు.  
– రాజేంద్రరెడ్డి, మల్లారెడ్డికండ్రిగ గ్రామం, విజయపురం మండలం, నగరి నియోజకవర్గం. 

వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులకు ఇవ్వొద్దు
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలం వెంగన్నపల్లె, పుప్పాల గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులకు పింఛన్లు ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. సచివాలయ సిబ్బందితో కలసి పింఛన్ల పంపిణీ చేపట్టిన పంచాయతీ కార్యదర్శి వసుంధరను అడ్డగించారు. పుప్పాల గ్రామంలో 35, వెంగన్నపల్లెలో 50 మంది వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులకు పింఛన్లు ఇవ్వకూడదంటూ టీడీపీ సర్పంచులు దేవన్న, నాగమునిరెడ్డి తమ వర్గీయులతో కలసి అడ్డుకున్నారు. దీంతో రెండు గ్రామాల్లో పింఛన్ల పంపిణీ జరగలేదు. 

టీడీపీలో ఆధిపత్య పోరు
పింఛన్ల పంపిణీ టీడీపీలో వర్గ పోరుకు వేదికగా మారింది. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్టలో సుగవాసి సుబ్రమణ్యం వర్గం పంపిణీ చేపట్టగా అదే ప్రాంతంలో పార్లమెంటరీ జిల్లా టీడీపీ అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహనరాజు వర్గీయలు కూడా దీన్ని ప్రారంభించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా  దుద్యాల గ్రామంలో టీడీపీ నాయకుడు కోటేశ్వర్‌ రెడ్డి మీ అంతు చూస్తానంటూ సచివాలయ సిబ్బందిపై బెదిరింపులకు దిగాడు. 

పంచేందుకు కుమ్ములాట..
కర్నూలు జిల్లా కోడుమూరు మండలం అమడగుంట్ల గ్రామంలో పింఛన్ల పంపిణీ సందర్భంగా టీడీపీ నాయకులు ఘర్షణకు దిగారు. పరస్పరం దాడులకు పాల్పడ్డారు. 

పచ్చ కండువాతో మెప్మా ఆర్పీ..
రాజకీయాలకు అతీతంగా విధులు నిర్వర్తించాల్సిన మహిళా సంఘాల రిసోర్స్‌ పర్సన్‌(ఆర్పీ) పచ్చ కండువా మెడలో ధరించి పింఛన్లు పంపిణీ చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రామారావు కాలనీకి చెందిన మెప్మా ఆర్పీ జాఫరున్నీసా టీడీపీ నాయకురాలిలా మెడలో పచ్చ కండువా వేసుకుని పింఛన్లు పంపిణీ చేయడంపై స్థానికులు అభ్యంతరం తెలిపారు. దీనిపై శాఖాపరమైన చర్యల కోసం ఉన్నతాధికారులకు నివేదిస్తామని టీఎంసీ రవి తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement