
పిఠాపురం సీటు త్యాగం చేసిన వర్మకూ షాక్
ఎమ్మెల్సీ సీటు రాకుండా చివరి నిమిషంలో అడ్డుకున్న పవన్
ఇంతగా మోసం చేయడం తగదని రగిలిపోతున్న టీడీపీ నేతలు
యనమల రామకృష్ణుడికి సీటు నిరాకరణ
దేవినేని ఉమా, బుద్ధా వెంకన్న, జవహర్‌లకు మొండి చేయి
పార్టీ ఫిరాయించిన జంగా కృష్ణమూర్తికి గట్టి దెబ్బ
ఐదు ఎమ్మెల్సీల్లో మూడు టీడీపీ.. జనసేన, బీజేపీకి ఒక్కోటి
ముందుగానే నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన పవన్
టీడీపీ అభ్యర్థులుగా బీద రవిచంద్ర, బీటీ నాయుడు, కావలి గ్రీష్మకు అవకాశం.. ఇంకా అభ్యర్థిని ప్రకటించని బీజేపీ
సాక్షి, అమరావతి: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో టీడీపీ సీనియర్ నేతలు, గత ఎన్నికల్లో సీటు దక్కని ముఖ్య నేతలు, సిట్టింగ్‌లకు మొండిచేయే మిగిలింది. చివరి వరకు నమ్మించి, మరోమారు దగాకు గురిచేశారనే చర్చ ఆ పార్టీలో మొదలైంది. యనమల రామకృష్ణుడి స్థానాన్ని ఆయనకివ్వకుండా పూర్తిగా పక్కన పెట్టేశారు. పార్టీ కార్యాలయంలోనే ఉండి చంద్రబాబు చెప్పిన పనులన్నీ చేసిన మరో సిట్టింగ్ ఎమ్మెల్సీ అశోక్‌బాబుకు సైతం అవకాశం ఇవ్వలేదు.
టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్రియాశీలకంగా పని చేసిన మరో సిట్టింగ్ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావుదీ అదే పరిస్థితి. మరోసారి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామంటూ ఆశ చూపించి, రాజీనామా చేయించి టీడీపీలో చేర్చుకున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి చంద్రబాబు దెబ్బ కొట్టారు. మరో వైపు ఈసారి శాసన మండలిలో అడుగు పెట్టడం ఖాయమనుకున్న ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ, దేవినేని ఉమామహేశ్వరరావుకు అవకాశం దక్కలేదు.
దళిత నేత కేఎస్ జవహర్, బీసీ నేత బుద్ధా వెంకన్నతో పాటు ఈ సీట్లపై ఆశలు పెట్టుకున్న చాలా మంది నేతలను చంద్రబాబు పక్కన పెట్టారు. ఎమ్మెల్సీ స్థానాలపై ఆశలు పెట్టుకున్న నేతలకు ఆదివారం సాయంత్రం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో ఫోన్ చేయించి ఈసారి అవకాశం ఇవ్వలేకపోతున్నామని చెప్పించారు. ఎంపిక చేసిన అభ్యర్థులకు చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి చెప్పినట్లు తెలిసింది. వారు సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
పవన్ అడ్డుకోవడం వల్లే...
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మకు ఎమ్మెల్సీ స్థానం దక్కకపోవడంపై టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. చంద్రబాబు ఆయనకు అవకాశం ఇవ్వకుండా ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ అడ్డుకున్నారనే ప్రచారం జరుగుతోంది. వర్మను ఎమ్మెల్సీ చేస్తే పిఠాపురం నియోజకవర్గంలో రెండో అధికార కేంద్రం తయారు చేసినట్లవుతుందని పవన్ భావించారని, అందుకే వర్మకు సీటు ససేమిరా అన్నారని చెబుతున్నారు.
పవన్ అడ్డు చెప్పడం వల్లే వర్మకు చంద్రబాబు సీటు ఇవ్వలేదని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పిఠాపురం పూర్తిగా తన చేతిలో ఉండాలంటే.. అక్కడ తాను తప్ప మరో నాయకుడు ఉండకూడదని పవన్ భావించడం వల్లే వర్మను పక్కన పెట్టారని నియోజకవర్గంలో చర్చ మొదలైంది. ఇదివరకు రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ కోసం ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన వర్మకు ఇది తీరని అన్యాయమని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
హామీ ఇచ్చి.. చివరకు మోసం
గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా తన సీటును పవన్ కళ్యాణ్‌కు కేటాయించినప్పుడు వర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక దశలో టీడీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో చంద్రబాబు తన వద్దకు పిలిపించుకుని బుజ్జగించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి దఫాలోనే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని, మంచి రాజకీయ భవిష్యత్ ఉంటుందని హామీ ఇచ్చారు. వర్మ రాజకీయ భవితవ్యానికి ఢోకా లేకుండా చేస్తానని నియోజకవర్గ నేతలకు సైతం మధ్యవర్తుల ద్వారా చెప్పించారు.

పవన్ గెలుపు కోసం పని చేయాలని ఒత్తిడి చేశారు. దీంతో పార్టీ కోసం వర్మ తన సీటును త్యాగం చేయడంతోపాటు పవన్ పక్కనే నిలబడి ఆయన్ను గెలిపించేందుకు నియోజకవర్గం అంతా తిరిగారు. టీడీపీ శ్రేణులు పలుచోట్ల ఆందోళనలు చేసినా, ఎవరి కోసమో పని చేయడం ఏమిటని తిట్టినా పట్టించుకోకుండా పవన్ కోసం పని చేశారు. ఆయన ఎటువంటి ఇబ్బందులు సృష్టించకుండా పని చేయడం వల్లే శాసనసభలో అడుగుపెట్టాలనే పవన్ కల నెరవేరింది.
తన కలను నెరవేర్చడానికి పని చేసిన వర్మను పవన్ రాజకీయంగా పూర్తిగా తొక్కేయాలనుకోవడం, ఇందుకు చంద్రబాబు సహకరించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. పార్టీ కోసం పని చేసిన వారిని పట్టించుకోకుండా పక్క పార్టీ కోసం పని చేయడం తమ వల్ల కాదని టీడీపీ నేతలు ఆవేదన చెందుతున్నారు. పవన్‌కళ్యాణ్ తన రాజకీయ భవితవ్యం కోసం వర్మ అవకాశాలను దెబ్బ తీయడం, ఇదే సమయంలో తన సోదరుడు నాగబాబుకు మాత్రం పదవి ఇప్పించుకోవడం దారుణమని వాపోతున్నారు.
టీడీపీ అభ్యర్థులు వీళ్లే..
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఒకరైన బీద రవిచంద్ర మంత్రి లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయన పేరు ఖరారు చేశారు. లోకేశ్ పాదయాత్రతో పాటు గత ఎన్నికల్లో ఆయన వ్యవహారాల్లో రవిచంద్ర కీలకంగా వ్యవహరించారు. రాయలసీమ ప్రాంతం నుంచి ఒక్కరికైనా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో సిట్టింగ్ ఎమ్మెల్సీ బీటీ నాయుడుకు అవకాశం ఇచ్చారు. మూడో స్థానాన్ని టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మను ఎంపిక చేశారు.
ఇద్దరు బీసీలు, ఒక ఎస్సీకి అవకాశం ఇచ్చినట్లు టీడీపీ నేతలు తెలిపారు. జనసేన తరఫున నాగబాబుకు ఒక స్థానం, బీజేపీకి ఇంకో స్థానం కేటాయించారు. కాగా, బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, పార్టీ నేతలు పాకా వెంకటసత్యనారాయణ, గారపాటి సీతారామాంజనేయచౌదరి, మాలతీరాణి పేర్లు అధిష్టానం పరిశీలనలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment