
టీడీపీ అభ్యర్థులుకావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు నామినేషన్లు
బీజేపీ అభ్యర్థిగా సోము వీర్రాజు నామినేషన్
సాక్షి, అమరావతి: ఎమ్మెల్యేల కోటాలోని నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు కూటమి అభ్యర్థులు సోమవారం నామినేషన్లు వేశారు. ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక దానికి ఇంతకుముందే జనసేన అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. నామినేషన్ల దాఖలుకు సోమవారం ఆఖరి రోజు కావడంతో మిగిలిన నాలుగు స్థానాలకు టీడీపీ తరఫున ముగ్గురు, బీజేపీ తరఫున ఒకరు నామినేషన్లు వేశారు. తొలుత టీడీపీకి చెందిన బీద రవిచంద్ర, బీటీ నాయుడు, కావలి గ్రీష్మ నామినేషన్లు దాఖలు చేయగా, ఆ తర్వాత బీజేపీకి చెందిన సోము వీర్రాజు నామినేషన్ వేశారు.
టీడీపీ అభ్యర్థుల వెంట మంత్రులు లోకేశ్, అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్, ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు తదితరులు వచ్చారు. బీజెపీ అభ్యర్థి వీర్రాజు వెంట మంత్రులు సత్యకుమార్, టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. వీరంతా నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి, శాసన మండలి ఉప కార్యదర్శి వనితారాణికి సమర్పించారు. సహాయ రిటర్నింగ్ అధికారులుగా ఉన్న అసెంబ్లీ సహాయ కార్యదర్శులు ఆర్.శ్రీనివాసరావు, ఈశ్వరరావు ఆ పత్రాలను పరిశీలించారు.
నామినేషన్ అనంతరం బీజేపీ అభ్యర్థి సోము వీర్రాజు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి, మంత్రి సత్యకుమార్ తదితరులతో కలిసి సీఎం చంద్రబాబును సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు పేరును ఆ పార్టీ జాతీయ నాయకత్వం సోమవారం ఉదయం ప్రకటించింది.
సోము వీర్రాజు 2015–21 మధ్య బీజేపీ తరఫున ఎమ్మెల్సీగా కొనసాగారు. 2020–23 మధ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఎమ్మెల్సీగా తనను ఎంపిక చేసినందుకు జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాకు సోము వీర్రాజు ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు ఆధ్వర్యంలో కలిసి పనిచేస్తామని చెప్పారు.
ఏకగ్రీవమే..
ఎమ్మెల్యే కోటాలో ఐదు స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉండటంతో ఏకగ్రీవ ఎన్నిక లాంఛనమే కానుంది. టీడీపీ నుంచి ముగ్గురు అభ్యర్థులు జనసేన నుంచి ఒకరు, బీజేపీ నుంచి ఒకరు నామినేషన్ దాఖలు చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. 11న నామినేషన్ల పరిశీలన తర్వాత 13 వరకు నామినేషన్ ఉపసంహరణకు గడువు ఉంది. నామినేషన్ ఉపసంహరణ తేదీ తర్వాత ఐదుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలిచినట్టు అధికారికంగా ప్రకటిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment