
బూతుల కోటాలోనే కావలి గ్రీష్మకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం
రెండేళ్ల క్రితం టీడీపీ మహానాడులో బూతులతో విరుచుకుపడ్డ గ్రీష్మ
వైఎస్సార్‌సీపీ నేతలను బస్సులోంచి ఈడ్చి ఈడ్చి తంతాం.. నా.. కొ.. ల్లారా అంటూ రెచ్చిపోయిన వైనం
ఆమెను ఎంపిక చేయడం ద్వారా నీతులు చెప్పడమే కానీ తాను పాటించనని నిరూపించుకున్న సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ప్రకటించిన ముగ్గురు అభ్యర్థుల్లో కావలి గ్రీష్మ బూతులకు పెట్టింది పేరు. 2022లో టీడీపీ నిర్వహించిన మహానాడులో ప్రసంగించిన ఆమె పార్టీ అధినేత చంద్రబాబు, వందల మంది పార్టీ సీనియర్ నేతలు, వేలాది మంది కార్యకర్తల సమక్షంలోనే తొడ కొడుతూ రాయలేని భాషలో బూతులు లంకించుకున్నారు. ‘ఎవడైనా సరే జగన్‌మోహన్‌రెడ్డి అంటూ ఇంటికొచ్చినా.. బస్సు యాత్రలో వచ్చినా .. బస్సులోంచి ఈడ్చి ఈడ్చి తంతాం.. నా కొ... ల్లారా.. రాష్ట్రాన్ని రావణకాష్టం చేశారు.
సిగ్గూ, శరం లేకుండా బస్సులో వెళతారా? బస్సులోంచి ఈడ్చి తన్నకపోతే (తొడ కొడుతూ).. తెలుగుదేశం గడ్డలో పుట్టినవాళ్లమే కాదు’ అంటూ చంద్రబాబు సమక్షంలోనే వైఎస్సార్‌సీపీ నేతలపై బూతుల దండకం ఎత్తుకున్నారు. అంతేకాకుండా.. ‘మీరే మాకు అండ.. మీరే మాకు ధైర్యం.. మీరే మాకు స్ఫూర్తి (చంద్రబాబును చూస్తూ).. లోకేశ్ అన్న కోసం అందరం ఉంటామని గట్టిగా చెప్పండి తమ్ముళ్లూ.. జై తెలుగుదేశం’ అంటూ కావలి గ్రీష్మ టీడీపీ మహానాడులో వ్యాఖ్యలు చేశారు.
సాక్షాత్తూ టీడీపీ అధినేత చంద్రబాబు, వందల మంది సీనియర్ పార్టీ నేతల సమక్షంలోనే గ్రీష్మ అసభ్య వ్యాఖ్యలు చేస్తూ.. తొడ కొడుతూ బూతులతో విరుచుకుపడ్డా చంద్రబాబు కనీసం ఇదేంటని ఆమెను వారించలేదు. వైఎస్సార్‌సీపీ నేతలు... ఆయన భార్యను ఏమీ అనకపోయినా.. అన్నారంటూ నానా యాగీ చేసిన చంద్రబాబు తాజాగా ఎమ్మెల్సీ స్థానానికి కావలి గ్రీష్మను ఎంపిక చేసి తన మనస్తత్వం ఎలాంటిదో చాటుకున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆమె బూతులకు మెచ్చే టీడీపీ అధికారంలోకి రాగానే రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్‌పర్సన్‌గా గ్రీష్మను నియమించారని రాజకీయ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఆమెకు ఎమ్మెల్సీగానూ అవకాశం ఇవ్వడం ద్వారా ఎదుటివారికి నీతులు చెప్పడమే కానీ తాను పాటించనని సీఎం చంద్రబాబు నిరూపించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment