Greeshma
-
ఎవరికి చెక్ పెట్టేందుకు.. గ్రీష్మకు ఎమ్మెల్సీ పదవి..
రాజాం : టీడీపీని నమ్ముకుని 2019 సార్వత్రిక ఎన్నికల్లో తల్లి భంగపడింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూతురుకు నిరాశే మిగిలింది. తల్లీకూతుల్లిద్దరు ఇంటిముఖం పట్టేశారని అందరూ అనుకున్నారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో ఇంతలోనే కుమార్తెకు నామినేటెడ్ పదవి ఇచ్చి కొంతమేర ఉపశమనం. ఆ పదవి కూడా రాకుండా అడ్డుకున్న మరో వర్గానికి మరో షాక్ తగిలేలా ఎమ్మెల్సీ పదవి ఆమెకు లభించింది. ఆమె రాజాం నియోజకవర్గంలో సంతకవిటి మండలం కావలి గ్రామానికి చెందిన కావలి గ్రీష్మ. ఈమె తల్లి కావలి ప్రతిభా భారతి సీనియర్ టీడీపీ నాయకురాలు. ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి 1983, 1985, 1989, 1994, 1999లో ఐదు దఫాలు ఎమ్మెల్యేగా గెలుపొంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా స్పీకర్‌గా పని చేశారు. 27 ఏళ్లకే ఎన్టీఆర్ మంత్రివర్గంలో క్యాబినెట్ ర్యాంకు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నియోజకవర్గాల విభజన తరువాత వరుసగా రాజాం నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి కోండ్రు మురళీమోహన్ టీడీపీలోకి వచ్చి ప్రతిభా భారతికి 2019లో టిక్కెట్ దక్కకుండా చేశారు. 2024లో ప్రతిభాభారతి కుమార్తె గ్రీష్మ టిక్కెట్ కోసం ప్రయత్నించగా, ఆమెకు కూడా టిక్కెట్ రాకుండా అడ్డుకట్టు వేసి టిక్కెట్ తాను దక్కించుకోవడమే కాకుండా ఎమ్మెల్యేగా గెలిచిన కోండ్రు సిట్టింగ్ అభ్యర్థి, సీనియర్ నాయకురాలైన కావలి ప్రతిభాభారతి కుటుంబానికి ప్రాధాన్యత లేకుండా చేశారు. దీంతో అటు ప్రతిభాభారతితో పాటు ఆమె కుమార్తె గ్రీష్మ విశాఖపట్నంకు పరిమితమయ్యారు. టీడీపీ అధికారంలో లేని సమయంలో పార్టీ తరఫున కార్యక్రమాలకు సొంత ఆస్తులు తగలబెట్టడమే కాకుండా అధికార పార్టీపై ఇష్టానుసారం మాటలిసిరిన కావలి గ్రీష్మకు నిరాశే మిగిలింది. అనంతరం జరిగిన పరిణామాల్లో గ్రీష్మకు టీడీపీ ఉమెన్ ఎన్ఫోర్స్మెంట్ చైర్పర్సన్ పదవిని కట్టబెట్టింది. దీంతో మళ్లీ తెరమీదకు వచ్చిన గ్రీష్మకు ఇంతలోనే ఎమ్మెల్సీగా టిక్కెట్ లభించింది. ఆశావహులకు చెక్ రాష్ట్ర వ్యాప్తంగా ఆశావహులు, సీనియర్ నేతలు పదుల సంఖ్యలో నామినేటెడ్ పదవుల నిమిత్తం ఎదురు చూస్తున్నారు. ఇందులో విజయనగరం జిల్లా నుంచి కిమిడి నాగార్జున, కర్రోతు బంగార్రాజు, గొంప కృష్ణ, బొబ్బిలి చిరంజీవులు, కేఏ నాయుడు, కొల్ల అప్పలనాయుడు, తెంటు లక్షున్నాయుడు తదితరులు ఉన్నారు. కావలి గ్రీష్మకు మూడు నెలలు క్రితమే ఉమెన్ ఎన్ఫోర్స్మెంట్ చైర్పర్సన్ పదవి ఇవ్వడంతో ఆమె పేరు ఎవరూ ఊహించలేదు. కిమిడి నాగార్జున, గొంప కృష్ణ, కొల్ల అప్పలనాయుడు, కేఏ నాయుడులాంటి నేతల పేర్లు తప్పించి, గ్రీష్మకు ఎమ్మెల్సీ పదవి రావడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ పదవి వెనుక రాజాం నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత హస్తం ఉందనేది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఎవరికి చెక్ పెట్టేందుకు.. రాజాం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యేగా కోండ్రు గెలిచిన తరువాత మంత్రి పదవి ఆశించారు. కనీసం విప్‌గా అవకాశం వస్తుందని చూశారు. ఈ రెండు లేకపోయేసరికి ఆయన వర్గంలో అలజడి ప్రారంభం అయ్యింది. కోండ్రు కూడా పెద్దగా నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ సమస్యలపై దృష్టి పెట్టడం లేదని, ఇక్కడ ఉండడం లేదనే గుసగుసలు ఉన్నాయి. అతని సోదరుడు జగదీష్ కనుసన్నల్లోనే మొత్తం తంతు జరుగుతోంది. దీంతో కావలి ప్రతిభాభారతి వర్గీయులతో పాటు కిమిడి కళావెంకటరావు వర్గీయులు, ఆది నుంచి టీడీపీని నమ్ముకున్న టీడీపీ కార్యకర్తలు ఈ విషయాన్ని అధిష్టానానికి చేరవేశారని తెలుస్తుంది. ఫలితంగా కావలి గ్రీష్మకు ఎన్ఫోర్స్మెంట్ చైర్మన్ పదవి ఇచ్చి తెరమీదకు తెచ్చినా ఆమెకు ఎమ్మెల్యే వర్గం ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి నియోజకవర్గంలో టీడీపీ పాత వర్గానికి లోకేష్ టీం జీవం పోసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు రాజాం నియోజకవర్గంలో కోండ్రు మురళీమోహన్‌తో సమానంగా కావలి గ్రీష్మకు ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో, కార్యక్రమంలో కుర్చీ వేయాల్సి ఉంటుందని, కోండ్రుకు చెక్‌పెట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారనే వార్తలు ఊపందుకున్నాయి. ఇంకో వైపు సంతకవిటి మండలానికి చెందిన టీడీపీ సీనియర్ నేత కొల్ల అప్పలనాయుడు కూడా ఈ ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్నప్పటికీ ఆయనకు ఈ పదవి ఇవ్వకపోవడంతో సంతకవిటి మండలంలో కొల్ల వర్గీయులు టీడీపీ తీరును తప్పుపడుతున్నారు. అడ్రస్ లేని ఆ నేతలు టీడీపీ కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీ పార్లమెంట్ అధ్యక్షులుగా, జిల్లాకు పెద్ద దిక్కు గా కిమిడి నాగార్జున వ్యవహరించారు. 2024లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఆయనకు దక్కకుండా పార్టీ వ్యవహరించింది. కనీసం ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆశపడ్డ ఆయనకు నిరాశే మిగిలింది. ఆయన పేరు ఈ నామినేటెడ్ పదవుల్లో అడ్రస్ లేకుండా పోయింది. గొంప కృష్ణ, కేఏ నాయుడు, కొల్ల అప్పలనాయుడు తదితర నేతల పరిస్థితి కూడా ఇదే మా దిరిగా మారింది. వీరిప్పుడు అధిష్టానం నిర్ణయాన్ని కక్కలేని, మింగలేని పరిస్థితిలో ఉన్నారు. -
మహానాడులో తొడకొట్టిన గ్రీష్మకు జాక్‌పాట్
సాక్షి, అమరావతి: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ప్రకటించిన ముగ్గురు అభ్యర్థుల్లో కావలి గ్రీష్మ (kavali greeshma) బూతులకు పెట్టింది పేరు. 2022లో టీడీపీ నిర్వహించిన మహానాడులో ప్రసంగించిన ఆమె పార్టీ అధినేత చంద్రబాబు, వందల మంది పార్టీ సీనియర్ నేతలు, వేలాది మంది కార్యకర్తల సమక్షంలోనే తొడ కొడుతూ రాయలేని భాషలో బూతులు లంకించుకున్నారు. ‘ఎవడైనా సరే జగన్మోహన్రెడ్డి అంటూ ఇంటికొచ్చినా.. బస్సు యాత్రలో వచ్చినా.. బస్సులోంచి ఈడ్చి ఈడ్చి తంతాం.. నా కొ... ల్లారా.. రాష్ట్రాన్ని రావణకాష్టం చేశారు. సిగ్గూ, శరం లేకుండా బస్సులో వెళతారా? బస్సులోంచి ఈడ్చి తన్నకపోతే (తొడ కొడుతూ).. తెలుగుదేశం గడ్డలో పుట్టినవాళ్లమే కాదు’ అంటూ చంద్రబాబు (Chandrababu) సమక్షంలోనే వైఎస్సార్సీపీ నేతలపై బూతుల దండకం ఎత్తుకున్నారు. అంతేకాకుండా.. ‘మీరే మాకు అండ.. మీరే మాకు ధైర్యం.. మీరే మాకు స్ఫూర్తి (చంద్రబాబును చూస్తూ).. లోకేశ్ అన్న కోసం అందరం ఉంటామని గట్టిగా చెప్పండి తమ్ముళ్లూ.. జై తెలుగుదేశం’ అంటూ కావలి గ్రీష్మ టీడీపీ మహానాడులో వ్యాఖ్యలు చేశారు. సాక్షాత్తూ టీడీపీ అధినేత చంద్రబాబు, వందల మంది సీనియర్ పార్టీ నేతల సమక్షంలోనే గ్రీష్మ అసభ్య వ్యాఖ్యలు చేస్తూ.. తొడ కొడుతూ బూతులతో విరుచుకుపడ్డా చంద్రబాబు కనీసం ఇదేంటని ఆమెను వారించలేదు. వైఎస్సార్సీపీ నేతలు... ఆయన భార్యను ఏమీ అనకపోయినా.. అన్నారంటూ నానా యాగీ చేసిన చంద్రబాబు తాజాగా ఎమ్మెల్సీ స్థానానికి కావలి గ్రీష్మను ఎంపిక చేసి తన మనస్తత్వం ఎలాంటిదో చాటుకున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: పోలీసుల కట్టుకథకు ఇవిగో ఆధారాలు.. విడదల రజనిఆమె బూతులకు మెచ్చే టీడీపీ అధికారంలోకి రాగానే రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్‌పర్సన్‌గా గ్రీష్మను నియమించారని రాజకీయ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఆమెకు ఎమ్మెల్సీగానూ అవకాశం ఇవ్వడం ద్వారా ఎదుటివారికి నీతులు చెప్పడమే కానీ తాను పాటించనని సీఎం చంద్రబాబు నిరూపించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
గ్రీష్మపై కనికరమా?.. కఠినశిక్షా?
‘‘సర్.. నా వయసు 24 ఏళ్లు. నేనింకా చిన్నదాన్నే. నాకు ఎలాంటి నేర చరిత్ర లేదు. జీవితంతో ఎంతో చూడాల్సి ఉంది. ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సి ఉంది. నేను బాగా చదువుకున్నా. కావాలంటే ఇవి చూడండి..’’ అంటూ అమాయకంగా జడ్జి చేతికి తన సర్టిఫికెట్లను అందించింది గ్రీష్మ. తన ఛాంబర్ సీట్లో కూర్చున్న న్యాయమూర్తి వాటిని చూస్తూ.. ఒక్కసారిగా నిట్టూర్పు విడిచారు.కేరళ పరసాలలో మూడేళ్ల కిందట(2022లో) సంచలనం సృష్టించిన షరోన్ రాజ్ హత్య కేసులో.. జనవరి 20వ తేదీన తీర్పు వెలువడనుంది. ఈ కేసులో శుక్రవారం(జనవరి 17న) షరోన్ ప్రేయసి గ్రీష్మను, ఆమె మేనమామ నిర్మలాకుమారన్ నెయ్యట్టింకర అదనపు సెషన్స్ కోర్టు దోషులుగా ప్రకటించింది. అయితే.. శిక్షలు ఖరారు కావాల్సి ఉంది. అయితే.. వ్యక్తిగతంగా ఆమె విజ్ఞప్తి చేయడంతో.. శనివారం ఉదయం తన ఛాంబర్‌కు రప్పించుకుని న్యాయమూర్తి ఏఎం బషీర్ మాట్లాడారు. ఈ క్రమంలో.. తన శిక్ష విషయంలో కనికరం ప్రదర్శించాలని గ్రీష్మ ఆయన్ని వేడుకుంది.అసలేం జరిగిందంటే..పరసాలా ప్రాంతానికి చెందిన షరోన్ రాజ్(23), గ్రీష్మలు కొన్నాళ్లు ప్రేమించుకున్నారు. అయితే ఆమెకు మరో వ్యక్తితో వివాహాం నిశ్చయమైంది. ఆ తర్వాత షరోన్-గ్రీష్మల మధ్య దూరం పెరిగింది. వృత్తి రిత్యా వేరే ఊర్లో ఉంటున్న షరోన్.. అక్టోబర్ 10న షరోన్ పరసాలాకు వచ్చాడు. అక్టోబర్ 14న ఉదయం షరోన్‌కు ఉష ఫోన్ చేసింది. కలవాలని ఉందని.. బయటకు వెళ్దామని చెప్పింది. దీంతో తన స్నేహితుడితో కలిసి రామవర్మంచిరై(కన్యాకుమారి, తమిళనాడు)లో ఉష ఇంటికి వెళ్లాడు షరోన్.స్నేహితుడు బయటే ఎదురుచూస్తుండగా.. ఒక్కడే ఇంట్లోకి వెళ్లాడు. అయితే.. కాసేపటికే పొట్టచేత పట్టుకుని వాంతులు చేసుకుంటూ బయటకు వచ్చాడు షరోన్. దీంతో కంగారుపడ్డ స్నేహితుడు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆ దారిలోనూ ఇద్దరూ చాట్ చేసుకున్నారు. ‘‘కషాయంలో ఏం కలిపావు?’’ అని షరోన్ ఉషను నిలదీశాడు. అయితే తానేం కలపలేదని.. బహుశా వికటించిందేమో అని సమాధానం ఇచ్చిందామె. అక్కడితో వాళ్లిద్దరి ఛాటింగ్ ఆగిపోయింది. నీలిరంగులో వాంతులు చేసుకున్న షరోన్‌ను పరసాలా ప్రభుత్వాసుపత్రిలో చేర్చాడు స్నేహితుడు. ఆపై మెరుగైన వైద్యం కోసం తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అయితే.. అక్కడ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు నార్మల్ రావడంతో.. ఇంటికి పంపించేశారు. రెండు రోజుల తర్వాత షరోన్ పరిస్థితి విషమించింది. దీంతో తిరిగి తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్సలో షరోన్‌కు లంగ్స్, కిడ్నీ ఒక్కొక్కటిగా దెబ్బ తింటూ వచ్చాయి. ఈలోపు షరోన్ నుంచి మెజిస్ట్రేట్ సమక్షంలో వాంగ్మూలం సేకరించారు పోలీసులు. మరోవైపు వైద్యులు.. అతను తాగిన డ్రింక్‌లో పురుగుల మందు కలిసిందని నిర్ధారించుకున్నారు. అవయవాలన్నీ పాడైపోయి అక్టోబర్ 25వ తేదీన గుండెపోటుతో షరోన్ ప్రాణం విడిచాడు.ఎస్కేప్.. అరెస్ట్..తమ బిడ్డ చావుకు గ్రీష్మ కుటుంబం కారణమంటూ షరోన్ పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న ఆ కుటుంబం కోసం గాలించారు. చివరకు.. అదే ఏడాది నవంబర్ 22న గ్రీష్మ కుటుంబాన్ని అరెస్ట్ చేశారు. అయితే పీఎస్‌లో ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించడం నాటకీయ పరిణామాలకు దారి తీసింది. వాదనలు ఇలా.. ఇది అత్యంత అరుదైన కేసు అని ప్రాసిక్యూషన్ వాదించారు. ఆమె కేవలం ఓ యువకుడ్ని మాత్రమే చంపలేదు. ప్రేమ అనే భావోద్వేగాన్ని ప్రదర్శించి ఓ ప్రాణం బలి తీసుకుంది. అనుకున్న ప్రకారమే.. ఆమె ప్రేమను అడ్డుపెట్టి మరీ అతన్ని తన ఇంటికి రప్పించి ఘోరానికి తెగబడింది. అతని చంపడానికి ఆమె అన్నివిధాల ప్రయత్నించింది. ఆస్పత్రిలో చికిత్స పేరిట 11 రోజులపాటు అతను నరకం అనుభవించాడు. ఇదేదో హఠాత్తుగా జరిగింది కాదు. షరోన్ కూడా ఎన్నో కలలు కన్నాడు. కానీ, గ్రీష్మ వాటిని చెరిపేసింది. కాబట్టి, ఆమెపై కనికరం చూపించాల్సిన అవసరం లేదు. ఆమెకు ఉరే సరి అని వాదించారు.మరోవైపు.. గ్రీష్మ తరఫున వాదనలు వినిపించిన లాయర్ అజిత్ కుమార్.. కేసులో వాస్తవ ఆధారాలు(Circumstantial Evidence) లేనప్పుడు మరణశిక్ష విధించడం కుదరని వాదించారు. ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలో గ్రీష్మ ఆత్మహత్యకు ప్రయత్నించింది. వాస్తవానికి ఆమె షరోన్ నుంచి బయటపడేందుకు ప్రయత్నించింది. కానీ, ఆ యువకుడు ఆమెను వదల్లేదు. వ్యక్తిగత చిత్రాలు చూపించి బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. బెడ్రూం వీడియోలు బయటపెడతానని బెదిరించాడు. మానసికంగా ఆమెను ఎంతో వేధించాడు. అలాంటప్పుడు ఏ మహిళ అయినా ఎందుకు ఊరుకుంటుంది. ఆమె మెరిట్ విద్యార్థిని. శిక్ష విషయంలో కనికరం చూపించాల్సిందే’’ అని వాదించారు.దాదాపు రెండేళ్లపాటు ఈ కేసు విచారణ జరిగింది. చివరకు.. జనవరి 17వ తేదీన గ్రీష్మను, ఆమె మేనమామ నిర్మలాకుమారన్‌ను దోషులుగా నిర్ధారించింది. అదే సమయంలో గ్రీష్మ తల్లి సింధును నిర్దోషిగా ప్రకటించి విడుదల చేసింది. జనవరి 20 సోమవారం శిక్షలు ఖరారు చేయనుంది. అయితే ఆమెకు కఠిన శిక్ష పడుతుందా? లేదంటే కోర్టు కనికరం ప్రదర్శిస్తుందా? చూడాలి. మూఢనమ్మక కోణం!మూఢనమ్మకంతో గ్రీష్మ కుటుంబం తమ బిడ్డ ప్రాణం తీసిందని షరోన్ కుటుంబం ఆరోపించింది. ఆమెకు ఎంగ్మేజ్మెంట్ అయ్యాక మనసు విరిగిన షరోన్.. తన పనిలో తాను ఉన్నాడని, గ్రీష్మానే ఫోన్ చేసి అతన్ని పరసాలాకు రప్పించిందన్నారు. ‘‘గ్రీష్మ కుటుంబానికి షరోన్ రాజ్ నచ్చలేదు. అందుకే మరో వ్యక్తితో ఆమెకు పెళ్లి ఫిక్స్ చేసి.. ఎంగేజ్మెంట్ కూడా కానిచ్చేశారు. ఆపై పెళ్లిని అర్ధాంతరంగా వాయిదా వేశారు. అయితే.. గ్రీష్మకు పెళ్లైన వెంటనే భర్త మరణించే గండం ఉంది. ఆ దోషం పొగొట్టేందుకు షరోన్‌ను బలి పశువును చేశారు. బలవంతంగా ఆమె నుదుట కుంకుమ పెట్టించారు. ఉష ఇంటి నుంచి బయటకు వచ్చిన షరోన్ నుదుటిపై కూడా కుంకుమ ఉందని, ఆ విషయాన్ని వెంట ఉన్న స్నేహితుడు సైతం నిర్ధారించాడని అంటోంది. పక్కా ప్లాన్‌తో ఆమెతో బలవంతపు వివాహం జరిపించి.. ఆపై పురుగుల మందు తాగించి షరోన్ మరణానికి కారణమయ్యారని ఆరోపిస్తూ వచ్చింది. అయితే పోలీసులు ఈ వాదనను తోసిపుచ్చారు.