‘‘సర్.. నా వయసు 24 ఏళ్లు. నేనింకా చిన్నదాన్నే. నాకు ఎలాంటి నేర చరిత్ర లేదు. జీవితంతో ఎంతో చూడాల్సి ఉంది. ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సి ఉంది. నేను బాగా చదువుకున్నా. కావాలంటే ఇవి చూడండి..’’ అంటూ అమాయకంగా జడ్జి చేతికి తన సర్టిఫికెట్లను అందించింది గ్రీష్మ. తన ఛాంబర్ సీట్‌లో కూర్చున్న న్యాయమూర్తి వాటిని చూస్తూ.. ఒక్కసారిగా నిట్టూర్పు విడిచారు.
కేరళ పరసాలలో మూడేళ్ల కిందట(2022లో) సంచలనం సృష్టించిన షరోన్ రాజ్ హత్య కేసులో.. జనవరి 20వ తేదీన తీర్పు వెలువడనుంది. ఈ కేసులో శుక్రవారం(జనవరి 17న) షరోన్ ప్రేయసి గ్రీష్మను, ఆమె మేనమామ నిర్మలాకుమారన్ నెయ్యట్టింకర అదనపు సెషన్స్ కోర్టు దోషులుగా ప్రకటించింది. అయితే.. శిక్షలు ఖరారు కావాల్సి ఉంది. అయితే.. వ్యక్తిగతంగా ఆమె విజ్ఞప్తి చేయడంతో.. శనివారం ఉదయం తన ఛాంబర్‌కు రప్పించుకుని న్యాయమూర్తి ఏఎం బషీర్ మాట్లాడారు. ఈ క్రమంలో.. తన శిక్ష విషయంలో కనికరం ప్రదర్శించాలని గ్రీష్మ ఆయన్ని వేడుకుంది.
అసలేం జరిగిందంటే..
పరసాలా ప్రాంతానికి చెందిన షరోన్ రాజ్(23), గ్రీష్మలు కొన్నాళ్లు ప్రేమించుకున్నారు. అయితే ఆమెకు మరో వ్యక్తితో వివాహాం నిశ్చయమైంది. ఆ తర్వాత షరోన్-గ్రీష్మల మధ్య దూరం పెరిగింది. వృత్తి రిత్యా వేరే ఊర్లో ఉంటున్న షరోన్.. అక్టోబర్ 10న షరోన్ పరసాలాకు వచ్చాడు. అక్టోబర్ 14న ఉదయం షరోన్‌కు ఉష ఫోన్ చేసింది. కలవాలని ఉందని.. బయటకు వెళ్దామని చెప్పింది. దీంతో తన స్నేహితుడితో కలిసి రామవర్మంచిరై(కన్యాకుమారి, తమిళనాడు)లో ఉష ఇంటికి వెళ్లాడు షరోన్.
స్నేహితుడు బయటే ఎదురుచూస్తుండగా.. ఒక్కడే ఇంట్లోకి వెళ్లాడు. అయితే.. కాసేపటికే పొట్టచేత పట్టుకుని వాంతులు చేసుకుంటూ బయటకు వచ్చాడు షరోన్. దీంతో కంగారుపడ్డ స్నేహితుడు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆ దారిలోనూ ఇద్దరూ చాట్ చేసుకున్నారు. ‘‘కషాయంలో ఏం కలిపావు?’’ అని షరోన్ ఉషను నిలదీశాడు. అయితే తానేం కలపలేదని.. బహుశా వికటించిందేమో అని సమాధానం ఇచ్చిందామె. అక్కడితో వాళ్లిద్దరి ఛాటింగ్ ఆగిపోయింది.
నీలిరంగులో వాంతులు చేసుకున్న షరోన్‌ను పరసాలా ప్రభుత్వాసుపత్రిలో చేర్చాడు స్నేహితుడు. ఆపై మెరుగైన వైద్యం కోసం తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అయితే.. అక్కడ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్‌లు నార్మల్ రావడంతో.. ఇంటికి పంపించేశారు. రెండు రోజుల తర్వాత షరోన్ పరిస్థితి విషమించింది. దీంతో తిరిగి తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్సలో షరోన్‌కు లంగ్స్, కిడ్నీ ఒక్కొక్కటిగా దెబ్బ తింటూ వచ్చాయి. ఈలోపు షరోన్ నుంచి మెజిస్ట్రేట్ సమక్షంలో వాంగ్మూలం సేకరించారు పోలీసులు. మరోవైపు వైద్యులు.. అతను తాగిన డ్రింక్‌లో పురుగుల మందు కలిసిందని నిర్ధారించుకున్నారు. అవయవాలన్నీ పాడైపోయి అక్టోబర్ 25వ తేదీన గుండెపోటుతో షరోన్ ప్రాణం విడిచాడు.
ఎస్కేప్.. అరెస్ట్..
తమ బిడ్డ చావుకు గ్రీష్మ కుటుంబం కారణమంటూ షరోన్ పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న ఆ కుటుంబం కోసం గాలించారు. చివరకు.. అదే ఏడాది నవంబర్ 22న గ్రీష్మ కుటుంబాన్ని అరెస్ట్ చేశారు. అయితే పీఎస్‌లో ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించడం నాటకీయ పరిణామాలకు దారి తీసింది.
వాదనలు ఇలా..
ఇది అత్యంత అరుదైన కేసు అని ప్రాసిక్యూషన్ వాదించారు. ఆమె కేవలం ఓ యువకుడ్ని మాత్రమే చంపలేదు. ప్రేమ అనే భావోద్వేగాన్ని ప్రదర్శించి ఓ ప్రాణం బలి తీసుకుంది. అనుకున్న ప్రకారమే.. ఆమె ప్రేమను అడ్డుపెట్టి మరీ అతన్ని తన ఇంటికి రప్పించి ఘోరానికి తెగబడింది. అతని చంపడానికి ఆమె అన్నివిధాల ప్రయత్నించింది. ఆస్పత్రిలో చికిత్స పేరిట 11 రోజులపాటు అతను నరకం అనుభవించాడు. ఇదేదో హఠాత్తుగా జరిగింది కాదు. షరోన్ కూడా ఎన్నో కలలు కన్నాడు. కానీ, గ్రీష్మ వాటిని చెరిపేసింది. కాబట్టి, ఆమెపై కనికరం చూపించాల్సిన అవసరం లేదు. ఆమెకు ఉరే సరి అని వాదించారు.
మరోవైపు.. గ్రీష్మ తరఫున వాదనలు వినిపించిన లాయర్ అజిత్ కుమార్.. కేసులో వాస్తవ ఆధారాలు(Circumstantial Evidence) లేనప్పుడు మరణశిక్ష విధించడం కుదరని వాదించారు. ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలో గ్రీష్మ ఆత్మహత్యకు ప్రయత్నించింది. వాస్తవానికి ఆమె షరోన్ నుంచి బయటపడేందుకు ప్రయత్నించింది. కానీ, ఆ యువకుడు ఆమెను వదల్లేదు. వ్యక్తిగత చిత్రాలు చూపించి బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. బెడ్‌రూం వీడియోలు బయటపెడతానని బెదిరించాడు. మానసికంగా ఆమెను ఎంతో వేధించాడు. అలాంటప్పుడు ఏ మహిళ అయినా ఎందుకు ఊరుకుంటుంది. ఆమె మెరిట్ విద్యార్థిని. శిక్ష విషయంలో కనికరం చూపించాల్సిందే’’ అని వాదించారు.
దాదాపు రెండేళ్లపాటు ఈ కేసు విచారణ జరిగింది. చివరకు.. జనవరి 17వ తేదీన గ్రీష్మను, ఆమె మేనమామ నిర్మలాకుమారన్‌ను దోషులుగా నిర్ధారించింది. అదే సమయంలో గ్రీష్మ తల్లి సింధును నిర్దోషిగా ప్రకటించి విడుదల చేసింది. జనవరి 20 సోమవారం శిక్షలు ఖరారు చేయనుంది. అయితే ఆమెకు కఠిన శిక్ష పడుతుందా? లేదంటే కోర్టు కనికరం ప్రదర్శిస్తుందా? చూడాలి.
మూఢనమ్మక కోణం!
మూఢనమ్మకంతో గ్రీష్మ కుటుంబం తమ బిడ్డ ప్రాణం తీసిందని షరోన్ కుటుంబం ఆరోపించింది. ఆమెకు ఎంగ్మేజ్‌మెంట్ అయ్యాక మనసు విరిగిన షరోన్.. తన పనిలో తాను ఉన్నాడని, గ్రీష్మానే ఫోన్ చేసి అతన్ని పరసాలాకు రప్పించిందన్నారు. ‘‘గ్రీష్మ కుటుంబానికి షరోన్ రాజ్ నచ్చలేదు. అందుకే మరో వ్యక్తితో ఆమెకు పెళ్లి ఫిక్స్ చేసి.. ఎంగేజ్‌మెంట్ కూడా కానిచ్చేశారు. ఆపై పెళ్లిని అర్ధాంతరంగా వాయిదా వేశారు. అయితే.. గ్రీష్మకు పెళ్లైన వెంటనే భర్త మరణించే గండం ఉంది. ఆ దోషం పొగొట్టేందుకు షరోన్‌ను బలి పశువును చేశారు. బలవంతంగా ఆమె నుదుట కుంకుమ పెట్టించారు. ఉష ఇంటి నుంచి బయటకు వచ్చిన షరోన్ నుదుటిపై కూడా కుంకుమ ఉందని, ఆ విషయాన్ని వెంట ఉన్న స్నేహితుడు సైతం నిర్ధారించాడని అంటోంది. పక్కా ప్లాన్‌తో ఆమెతో బలవంతపు వివాహం జరిపించి.. ఆపై పురుగుల మందు తాగించి షరోన్ మరణానికి కారణమయ్యారని ఆరోపిస్తూ వచ్చింది. అయితే పోలీసులు ఈ వాదనను తోసిపుచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment