
కావలి గ్రీష్మకు ఎమ్మెల్సీ
గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఆశించిన గ్రీష్మ
అడ్డుకున్న కోండ్రు వర్గం
ఇప్పుడు ఎమ్మెల్సీ పదవితో తెరపైకి
ఇదివరకే ఉమెన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు
ఇంతలోనే మరో పదవి
ఆశపడ్డ కిమిడి నాగార్జున, కొల్ల అప్పలనాయుడు, గొంప కృష్ణ, తదితరులకు భంగపాటు
తెరవెనుక పెద్ద నేత
రాజాం : టీడీపీని నమ్ముకుని 2019 సార్వత్రిక ఎన్నికల్లో తల్లి భంగపడింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూతురుకు నిరాశే మిగిలింది. తల్లీకూతుల్లిద్దరు ఇంటిముఖం పట్టేశారని అందరూ అనుకున్నారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో ఇంతలోనే కుమార్తెకు నామినేటెడ్ పదవి ఇచ్చి కొంతమేర ఉపశమనం. ఆ పదవి కూడా రాకుండా అడ్డుకున్న మరో వర్గానికి మరో షాక్ తగిలేలా ఎమ్మెల్సీ పదవి ఆమెకు లభించింది.
ఆమె రాజాం నియోజకవర్గంలో సంతకవిటి మండలం కావలి గ్రామానికి చెందిన కావలి గ్రీష్మ. ఈమె తల్లి కావలి ప్రతిభా భారతి సీనియర్ టీడీపీ నాయకురాలు. ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి 1983, 1985, 1989, 1994, 1999లో ఐదు దఫాలు ఎమ్మెల్యేగా గెలుపొంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా స్పీకర్‌గా పని చేశారు. 27 ఏళ్లకే ఎన్‌టీఆర్ మంత్రివర్గంలో క్యాబినెట్ ర్యాంకు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నియోజకవర్గాల విభజన తరువాత వరుసగా రాజాం నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి కోండ్రు మురళీమోహన్ టీడీపీలోకి వచ్చి ప్రతిభా భారతికి 2019లో టిక్కెట్ దక్కకుండా చేశారు.
2024లో ప్రతిభాభారతి కుమార్తె గ్రీష్మ టిక్కెట్ కోసం ప్రయత్నించగా, ఆమెకు కూడా టిక్కెట్ రాకుండా అడ్డుకట్టు వేసి టిక్కెట్ తాను దక్కించుకోవడమే కాకుండా ఎమ్మెల్యేగా గెలిచిన కోండ్రు సిట్టింగ్ అభ్యర్థి, సీనియర్ నాయకురాలైన కావలి ప్రతిభాభారతి కుటుంబానికి ప్రాధాన్యత లేకుండా చేశారు. దీంతో అటు ప్రతిభాభారతితో పాటు ఆమె కుమార్తె గ్రీష్మ విశాఖపట్నంకు పరిమితమయ్యారు. టీడీపీ అధికారంలో లేని సమయంలో పార్టీ తరఫున కార్యక్రమాలకు సొంత ఆస్తులు తగలబెట్టడమే కాకుండా అధికార పార్టీపై ఇష్టానుసారం మాటలిసిరిన కావలి గ్రీష్మకు నిరాశే మిగిలింది. అనంతరం జరిగిన పరిణామాల్లో గ్రీష్మకు టీడీపీ ఉమెన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ చైర్‌పర్సన్ పదవిని కట్టబెట్టింది. దీంతో మళ్లీ తెరమీదకు వచ్చిన గ్రీష్మకు ఇంతలోనే ఎమ్మెల్సీగా టిక్కెట్ లభించింది.
ఆశావహులకు చెక్
రాష్ట్ర వ్యాప్తంగా ఆశావహులు, సీనియర్ నేతలు పదుల సంఖ్యలో నామినేటెడ్ పదవుల నిమిత్తం ఎదురు చూస్తున్నారు. ఇందులో విజయనగరం జిల్లా నుంచి కిమిడి నాగార్జున, కర్రోతు బంగార్రాజు, గొంప కృష్ణ, బొబ్బిలి చిరంజీవులు, కేఏ నాయుడు, కొల్ల అప్పలనాయుడు, తెంటు లక్షున్నాయుడు తదితరులు ఉన్నారు. కావలి గ్రీష్మకు మూడు నెలలు క్రితమే ఉమెన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ చైర్‌పర్సన్ పదవి ఇవ్వడంతో ఆమె పేరు ఎవరూ ఊహించలేదు. కిమిడి నాగార్జున, గొంప కృష్ణ, కొల్ల అప్పలనాయుడు, కేఏ నాయుడులాంటి నేతల పేర్లు తప్పించి, గ్రీష్మకు ఎమ్మెల్సీ పదవి రావడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ పదవి వెనుక రాజాం నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత హస్తం ఉందనేది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
ఎవరికి చెక్ పెట్టేందుకు..
రాజాం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యేగా కోండ్రు గెలిచిన తరువాత మంత్రి పదవి ఆశించారు. కనీసం విప్‌గా అవకాశం వస్తుందని చూశారు. ఈ రెండు లేకపోయేసరికి ఆయన వర్గంలో అలజడి ప్రారంభం అయ్యింది. కోండ్రు కూడా పెద్దగా నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ సమస్యలపై దృష్టి పెట్టడం లేదని, ఇక్కడ ఉండడం లేదనే గుసగుసలు ఉన్నాయి. అతని సోదరుడు జగదీష్ కనుసన్నల్లోనే మొత్తం తంతు జరుగుతోంది. దీంతో కావలి ప్రతిభాభారతి వర్గీయులతో పాటు కిమిడి కళావెంకటరావు వర్గీయులు, ఆది నుంచి టీడీపీని నమ్ముకున్న టీడీపీ కార్యకర్తలు ఈ విషయాన్ని అధిష్టానానికి చేరవేశారని తెలుస్తుంది.
ఫలితంగా కావలి గ్రీష్మకు ఎన్‌ఫోర్స్‌మెంట్ చైర్మన్ పదవి ఇచ్చి తెరమీదకు తెచ్చినా ఆమెకు ఎమ్మెల్యే వర్గం ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి నియోజకవర్గంలో టీడీపీ పాత వర్గానికి లోకేష్ టీం జీవం పోసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు రాజాం నియోజకవర్గంలో కోండ్రు మురళీమోహన్‌తో సమానంగా కావలి గ్రీష్మకు ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో, కార్యక్రమంలో కుర్చీ వేయాల్సి ఉంటుందని, కోండ్రుకు చెక్‌పెట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారనే వార్తలు ఊపందుకున్నాయి. ఇంకో వైపు సంతకవిటి మండలానికి చెందిన టీడీపీ సీనియర్ నేత కొల్ల అప్పలనాయుడు కూడా ఈ ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్నప్పటికీ ఆయనకు ఈ పదవి ఇవ్వకపోవడంతో సంతకవిటి మండలంలో కొల్ల వర్గీయులు టీడీపీ తీరును తప్పుపడుతున్నారు.
అడ్రస్ లేని ఆ నేతలు
టీడీపీ కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీ పార్లమెంట్ అధ్యక్షులుగా, జిల్లాకు పెద్ద దిక్కు గా కిమిడి నాగార్జున వ్యవహరించారు. 2024లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఆయనకు దక్కకుండా పార్టీ వ్యవహరించింది. కనీసం ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆశపడ్డ ఆయనకు నిరాశే మిగిలింది. ఆయన పేరు ఈ నామినేటెడ్ పదవుల్లో అడ్రస్ లేకుండా పోయింది. గొంప కృష్ణ, కేఏ నాయుడు, కొల్ల అప్పలనాయుడు తదితర నేతల పరిస్థితి కూడా ఇదే మా దిరిగా మారింది. వీరిప్పుడు అధిష్టానం నిర్ణయాన్ని కక్కలేని, మింగలేని పరిస్థితిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment