
సూపర్ సిక్స్ హామీలు, ఎన్నికల ప్రణాళికలోని అంశాలతో తనకు సంబంధం లేనట్లు, అదేదో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్‌ల బాధ్యత అన్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారు. ప్రశ్నించడానికే పార్టీని పెట్టానని గొప్పగా చెప్పుకున్న పవన్.. ఇప్పుడు చంద్రబాబు, లోకేశ్‌లను రాజకీయంగా మోయడానికి, తన ఉప ముఖ్యమంత్రి పదవిని ఎంజాయ్ చేయడానికే అన్నట్లు ప్రవర్తిస్తున్నారని విమర్శ. దీంతో ఆయనకు ఇప్పుడిప్పుడే నిరసన సెగ తగులుతోంది.
కొద్ది రోజుల క్రితం విశాఖ, గిరిజన ప్రాంతాలకు వెళ్లినప్పుడు వలంటీర్లు పవన్ కల్యాణ్(Pawan Kalyan)ను నిలదీసే యత్నం చేశారు. ఇప్పటికే ఆయా చోట్ల వలంటీర్లు ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. అయినా కూటమి ప్రభుత్వంలో కనీస స్పందన లేదు. కూటమి పెద్దలకు చీమ కుట్టినట్లుగా కూడా లేదు. దాంతో వలంటీర్లు నేతలను ప్రశ్నించడానికి సిద్ధమవుతున్నారు. నిజానికి వీరే కాదు. సూపర్ సిక్స్ తదితర హామీలు ఏమయ్యాయంటూ మహిళలు, నిరుద్యోగులు తదితర వర్గాలు నిరసన ర్యాలీలు చేయడం ఆరంభమైంది.
వలంటీర్లకు సంబంధించి పవన్ చేసిన ప్రకటనను గమనిస్తే ఆయన ఎలా మాట మార్చుతున్నది ఇట్టే తెలిసిపోతుంది. గత ప్రభుత్వం వలంటీర్లను అధికారికంగా నియమించలేదని చంద్రబాబు, లోకేశ్‌లు క్యాబినెట్ సమావేశంలో చెప్పారని, వారికి ఇచ్చేది జీతం కాదు.. గౌరవ వేతనం మాత్రమేనని, అందుకే ఏమీ చేయలేదని తెలియ చేశారని పవన్ అన్నట్లుగా మీడియాలో కథనం వచ్చింది. లక్షన్నర మంది జీవితాలను నట్టేట ముంచేసి, అదేదో స్వల్ప విషయమన్నట్లుగా పవన్ వ్యవహరించడం శోచనీయం.
👉ఎన్నికల ప్రణాళికలో వలంటీర్లకు పదివేల జీతం ఇస్తామని, వారి సేవలను కొనసాగిస్తామని ప్రకటించింది వాస్తవం కాదా? పలు ఎన్నికల ప్రచార సభలలో పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు వలంటీర్ల అంశం ప్రస్తావించారో గుర్తు లేదా? వలంటీర్ల కడుపు కొట్టబోమని, అందులోను లక్షమంది యువతులకు అన్యాయం చేస్తానా? అని ప్రసంగించారు. వాస్తవానికి రాష్ట్రంలో రెండున్నర లక్షల మంది వలంటీర్లు ఉండే వారు. కాని ఎన్నికల సమయంలో సుమారు ఎనభై వేల నుంచి లక్ష మంది వరకు రాజీనామాలు సమర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఉంటే వారిని కూడా బాధ్యతలలోకి తీసుకునే వారు. కాని కూటమి ప్రభుత్వం రావడంతో తమకు గౌరవ వేతనం పెరుగుతుందని రాజీనామా చేయని వలంటీర్లు ఆశపడ్డారు. తీరా చూస్తే కూటమి ప్రభుత్వం అసలుకే మోసం తెచ్చింది.
👉వలంటీర్లు(Volunteers) అంటే స్వచ్ఛందంగా సేవలందించే వారని, వారికి గత జగన్ ప్రభుత్వం గౌరవ వేతనం ఇచ్చిందన్న సంగతి పవన్ కళ్యాణ్ కు తెలియదా? ఆ విషయం తెలియకుండానే, గుడ్డిగా చంద్రబాబుతో కలిసి ఎన్నికల ప్రణాళికపై సంతకం చేశారని నమ్మాలా? అదే వాస్తవం అయితే పవన్ కళ్యాణ్ ఈ పదవిలో ఉండడానికి అర్హుడవుతారా? పైగా క్యాబినెట్లో చంద్రబాబు, లోకేశ్‌లు ఏదో చెప్పారని వారిపై నెట్టేసి తప్పించుకునే యత్నం చేస్తారా? ప్రభుత్వంలో వారు ఏమి చేసినా సమర్థిస్తున్న పవన్ కళ్యాణ్ వలంటీర్ల విషయం తనకు ఏమీ తెలియదన్నట్లుగా నటించడం ధర్మమేనా?.
వలంటీర్లకు ఇచ్చేది గౌరవ వేతనం కనుక ,వారికి ఆ బాధ్యతలు అప్పగించడం కుదరదని చంద్రబాబు, లోకేశ్ లు చెబితే పవన్ కళ్యాణ్ చెవిలో పువ్వు పెట్టుకుని విన్నారా?మనం హామీ ఇచ్చాం కదా! ఎందుకు చేయలేం. ప్రభుత్వం అనుకుంటే ఇది ఒక పెద్ద సమస్యా?అ ని పవన్ కళ్యాణ్ ప్రశ్నించి ఉండాలి కదా? ఉగాది పర్వదినానా పవిత్రమైన పూజలు నిర్వహించి మరీ వలంటీర్లకు హామీ ఇచ్చారు కదా? ఇప్పుడు కాదంటే పాపం కదా అని చంద్రబాబును అడగాలి కదా? అలా అడగలేదంటే ఏమిటి దాని అర్థం? వలంటీర్లు సామాన్యులు కనుక, వారిని ఏమి చేసినా ఏమీ కాదన్న భావనే కదా?.
👉జగన్ ప్రభుత్వం(Jagan Govt) విజయవంతంగా నిర్వహించిన వలంటీర్లు అంటే చంద్రబాబు, లేదా పవన్ కళ్యాణ్‌లకు ఎప్పుడూ గౌరవం లేదు. వారిని అసలు సమాజంలో గౌరవనీయమైన వ్యక్తులుగా చూడడానికి కూడా ఇష్టపడలేదు. చంద్రబాబు నాయుడు వీరిని మూటలు మోసే వారని, ఆడవాళ్ళు ఇళ్లలో ఉన్నప్పుడు వెళ్లి వేధించేవారని ఒకసారి నీచమైన రీతిలో వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ అయితే మరీ దారుణంగా వలంటీర్లను కిడ్పాపర్లతో పోల్చారు. ఏపీలో 30 వేల మంది అమ్మాయిలు తప్పిపోయారని అంటూ వలంటీర్లపై ఆరోపణలు చేశారు. కాని ప్రజలలో వలంటీర్ల పట్ల ఉన్న సానుకూలత వల్ల అది వైఎస్సార్‌సీపీకి ఎక్కడ అడ్వాంటేజ్ అవుతుందోనన్న భయంతో, మాట మార్చి తాము అధికారంలోకి వస్తే వలంటీర్లను కొనసాగించడమే కాకుండా, గౌరవ వేతనం రూ.ఐదు వేల నుంచి రూ.పది వేలు చేస్తామని ప్రకటించారు. అప్పటికి వారికి అధికారం వస్తుందన్న నమ్మం లేదు. కాని అనూహ్యంగా గెలిచేసరికి, ఇప్పుడు సూపర్ సిక్స్‌తో సహా అనేక అంశాలపై స్వరం మార్చుతున్నారు.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందు సినీ నటుడు. ఆ తర్వాతే రాజకీయ నేత. సినిమాలలో వకీల్ సాబ్‌గా ఆయన నటన అభిమానులను మెప్పించింది. కానీ రాజకీయ జీవితంలో మాత్రం ఆయన వ్యవహారశైలి వకీల్‌సాబ్ పాత్రకు భిన్నంగా ఉంది. ఈ సంగతిని ప్రజలూ గుర్తిస్తున్నారు. కరడుకట్టిన, గుడ్డి అభిమానులు మినహా మిగిలిన వారిలో పవన్ కళ్యాణ్ మాట మార్చేస్తున్నారన్న భావన క్రమేపీ బలపడిపోతోంది.
👉అబద్దాలు బాగా ఆడతారన్న పేరు ఉన్న చంద్రబాబుకు తానా అంటే తందానా అని తబలా వాయిస్తున్న చందంగా పవన్ వ్యవహరిస్తున్నారు. ఆయనతో పోటీ పడి అసత్యాలు చెబుతున్నారు. తాము మాట మార్చుతున్నామని ధైర్యంగా పవన్ కళ్యాణ్ చెప్పి ఉంటే కొంతైనా బెటర్‌గా ఉండేది. అలా కాకుండా చంద్రబాబు, లోకేశ్‌లదే తప్పు అన్నట్లు, తనకేమీ సంబంధం లేదన్నట్లు పవన్ కళ్యాణ్ డ్రామా ఆడినట్లు డైలాగులు చెబితే ప్రజలను పిచ్చివాళ్లను చేసినట్లు కాదా? వలంటీర్లను మోసం చేయడం కాదా? 30 వేల మంది అమ్మాయిల మిస్సింగ్ గురించి ఏపీ అంతటా తిరిగి చేసిన ప్రచారం అంతా అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్దం అని తేలింది కదా! కేవలం 47 మంది మాత్రమే మిస్ అయ్యారని, వారిలో ఎక్కువ మంది తిరిగి వచ్చారని అసెంబ్లీలో సమాధానం చెప్పింది కూటమి ప్రభుత్వమే కదా? పవన్ కళ్యాణ్ పచ్చి అబద్దం ప్రచారం చేసి ఆంధ్ర సమాజాన్ని చీట్ చేసినట్లు అవుతుందా? అవ్వదా?.
చంద్రబాబు, లోకేశ్‌ల పట్ల పవన్ కళ్యాణ్ ఎంత విధేయుడిగా ఉన్నా ప్రజలకు అభ్యంతరం లేదు. కాని ఎన్నికల ప్రణాళికను చంద్రబాబుతో కలిసి ఆయన కూడా విడుదల చేశారన్న సంగతి మర్చిపోకూడదు కదా! వకీల్ సాబ్ పాత్రను సినిమాలలో పోషించడం కాదు.. ప్రజా జీవితంలో ఆ మాదిరి నిలబడితేనే మంచి పేరు వస్తుంది. పవన్ కళ్యాణ్ విశాఖ వెళ్లినప్పుడు ఆయన కాన్వాయ్ కోసం పోలీసులు ఆంక్షలు విధించడం, తత్పలితంగా సుమారు 30 మంది జెఈఈ పరీక్షలు రాయలేకపోయిన ఘటన కూడా కూటమి ప్రభుత్వ తీరుకు అద్దం పడుతుంది. పవన్ కళ్యాణ్ పదవిని ఎంజాయ్ చేసే మోజులో విద్యార్ధుల భవిష్యత్తును కూడా దెబ్బతీశారన్న విమర్శకు ఆస్కారం ఇచ్చారు. ఏది ఏమైనా వలంటీర్లను చంద్రబాబు, లోకేశ్‌లే కాదు.. పవన్ కళ్యాణ్ కూడా మోసం చేసినట్లే!.
:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.