వెంకయ్య నాయుడు గారూ.. అవేం మాటలు? | KSR Comment On Venkaiah Naidu Praise Chandrababu | Sakshi
Sakshi News home page

వెంకయ్య నాయుడు గారూ.. అవేం మాటలు?

Published Tue, Mar 11 2025 12:54 PM | Last Updated on Tue, Mar 11 2025 1:10 PM

KSR Comment On Venkaiah Naidu Praise Chandrababu

మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పొగడ్తలతో ముంచెత్తారు. మనకెవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. అయితే.. ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలపై మాత్రం చర్చ జరగాల్సిందే. ఎన్నికల్లో గెలిచేందుకు మూడు పార్టీలు కలిసికట్టుగా వచ్చి అబద్ధాలు ప్రచారం చేయడం, ఆచరణ సాధ్యం కానీ అనేక హామీలివ్వడం.. ఆపై వాటిని విస్మరించడం వంటి అంశాలపై వెంకయ్య నాయుడు తన అభిప్రాయం చెప్పకుండా.. చేయగలిగిన పనులపైనే ఎక్కువ దృష్టి పెడితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇంతకీ ఈ వ్యాఖ్యకు అర్థమేమిటి?. 

ఎన్నికల హామీలు పట్టించుకోవద్దని చెప్పడమే అవుతుంది కదా?. ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన తరువాత వెంకయ్య నాయుడు(M Venkaiah Naidu).. రాజకీయాలకు దాదాపుగా దూరంగా ఉంటున్నారు. బీజేపీ కార్యక్రమాల్లోనూ అప్పుడప్పుడూ మాత్రమే పాల్గొంటున్నారు. స్వర్ణభారతి ట్రస్టు కార్యకలాపాల్లో భాగస్వామి అవుతుంటారు.  ఆయన ఉచిత పథకాలకు వ్యతిరేకమని ప్రతీతి. ఈ విషయాన్ని ఆయన చాలాసార్లు బహిరంగంగానే చెప్పుకున్నారు కూడా. అయితే.. కొన్ని దశాబ్దాలుగా మిత్రుడిగా ఉన్న చంద్రబాబు నాయుడికి ఈ విషయాలేవీ ఆయన చెప్పినట్లు కనిపించదు. 

👉ఇటీవల వెంకయ్య నాయుడు విశాఖపట్నంలో మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన పుస్తక ఆవిష్కరణ సభలో చంద్రబాబు(Chandrababu)ను అభివృద్ది కాముకుడిగగా ప్రశంసించారు. అయితే సూపర్‌సిక్స్‌తోపాటు 150 ఇతర హామీలు ఇవ్వడంలో ఆయనకు ఏ అభివృద్ధి కాముకత కనిపించిందో తెలియదు. ఏదో రకంగా మిత్రుడు గెలిచారన్న ఆనందం ఉంటే ఉండవచ్చు??. చంద్రబాబు ప్రభుత్వం చేసిన హామీలను అమలు చేస్తోందా? లేదా? అనేది ఆయనకు  తెలియకుండా ఉంటుందా!. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని హామీలు అమలు చేయాలని సూచించాల్సిన వెంకయ్య.. చేయగలిగిన పనులపైనే దృష్టి పెట్టాలని చెప్పడం ప్రజలను మోసం చేయడమే అవుతుంది కదా. 

👉చంద్రబాబు ఆలోచనలు మంచివని వెంకయ్య సర్టిఫికెట్ ఇస్తూ.. అవి చాలా ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. అవి ఏరకంగా ఉంటాయి? సూపర్‌సిక్స్‌తో సహా అనేక వాగ్దానాలు చేయడంలో ఉన్న మంచి ఆలోచనలు ఏమిటో కాస్త వివరంగా చెప్పి ఉంటే జనానికి కూడా బాగా అర్థమయ్యేది కదా?. 

ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున  ఇస్తామని టీడీపీ, జనసేనలు ఎన్నికల హామీ ఇచ్చాయి. కాని తాజాగా ప్రవేశపెట్టన బడ్జెట్‌లో ఆ ఊసే ఎత్త లేదు. ఇది మంచి ఆలోచనా కాదా? 

  • అదే కాదు..నిరుద్యోగులకు రూ.3,000 భృతి ఇస్తామని,.. 

  • వలంటీర్లకు జీతం రూ.10,000 చేస్తామని 

  • రాష్ట్రంలో ఎక్కడైనా తిరిగే విధంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని, 

  • బలహీన వర్గాల వారికి 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని, 

  • తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్ధికి రూ.15 వేలు పంపిణీ చేస్తామని.. పలు వాగ్దానాలు చేశారు. 

ఇవన్నీ చంద్రబాబులో వచ్చిన మంచి ఆలోచనలే అని వెంకయ్య చెప్పదలిచారా?.. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు  కలిసి చేసిన వాగ్దానాల విలువ ఏడాదికి సుమారు లక్షన్నర కోట్ల వరకు ఉండొచ్చు. కేవలం సూపర్ సిక్స్ హామీలకే రూ.79,179 కోట్లు అవసరమవుతాయి. కాని చంద్రబాబు ప్రభుత్వం కేవలం రూ.17,179 కోట్లే కేటాయించడం మంచి ఆలోచనేనని వెంకయ్య చెబుతారా?. 

👉విద్య సంగతి ఎలా ఉన్నా మద్యం బాగా సరఫరా చేస్తున్నామని చెబుతున్న ఏపీ ప్రభుత్వం తీరు చూసి వెంకయ్య నాయుడు పరవశిస్తున్నారా?. చంద్రబాబు మాతృబాషలోనే విద్యా బోధన జరగాలని అన్నందుకు వెంకయ్య సంతోషించారు. విద్యాబోధన పదో తరగతి వరకు మాతృభాషలోనే ఉండాలని కూడా ఆయన సలహా ఇచ్చారు. ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులో జరగాలని అన్నారు. మరి ప్రభుత్వంలో ఆ పరిస్థితి ఉందో, లేదో వెంకయ్య అడిగి తెలుసుకుని ఉండాలి. అలాగే చంద్రబాబు మనుమడు కాని, ఆయన బంధుమిత్రులలో ఎందరు తెలుగు మీడియంలో విద్యను అభ్యసిస్తున్నారో ఆరా తీసుకుని మెచ్చుకుని ఉంటే బాగుండేది కదా!. 

👉ఇక్కడే సమస్య వస్తోంది. తెలుగు మీడియం అంటూ ప్రచారం చేసే  చంద్రబాబు, వెంకయ్య నాయుడు తదితర ప్రముఖుల కుటుంబాలలో ఎంతమంది దానిని పాటిస్తున్నారో ఇంతవరకు ఎవరూ  చెప్పడం లేదు. కేవలం పేదలు, బలహీన వర్గాల వారు చదువుకునే ప్రభుత్వ స్కూళ్లలో మాత్రమే తెలుగు మీడియం ఉండాలని అనడంలో ఆంతర్యం ఏమిటో తెలియదు. 

సోషల్ మీడియాను అదుపులో పెట్టకపోతే పరిణామాలేమిటో ఏపీలో చూశామని, దాని పరిణామాలు అనుభవిస్తున్నారని ఆయన అన్నారు. వెంకయ్య నాయుడు కూడా ఏదో తెలుగుదేశం నాయకుడు మాట్లాడినట్లే స్పీచ్ ఇవ్వడం దురదృష్టకరం. వైఎస్సార్‌సీపీ హయాంలో టీడీపీ సోషల్ మీడియా ఎంత అరాచకంగా పోస్టులు పెట్టినా ఈయన ఎన్నడైనా నోరు తెరిచారా? అప్పుడేమో భావ వ్యక్తికరణ స్వేచ్చ అని చంద్రబాబు.. ఎల్లో మీడియా ప్రచారం చేశారే. సీఎంగా ఉన్న జగన్‌ను  పట్టుకుని బూతులు తిట్టినా కేసులు పెట్టడానికి వీలులేదని వాదించారే. ఆ విషయాలు వెంకయ్య నాయుడుకు తెలియకుండా ఉంటాయా? 

👉అధికారంలోకి వచ్చాక సైతం వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ వారు ఎంత అరాచకంగా వ్యవహరిస్తునేది ఆయన తెలుసుకోలేక పోతున్నారు. కావాలంటే టీడీపీ వారు పెట్టిన బండబూతుల పోస్టింగులు చూడాలని ఆయన భావిస్తే.. మాజీ మంత్రులు రోజా, అంబటి రాంబాబు వంటివారు పంపిండానికి సిద్దంగా ఉంటారు. అచ్చంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి చదివి అవి రాసే పచ్చి అబద్దాలనే ఆయన ప్రచారం చేస్తున్నట్లుగా ఉంది. ఉప రాష్ట్రపతి పదవి చేసిన పెద్దాయన ఎవరూ అభ్యంతరకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టరాదని అన్ని పార్టీల వారికి చెప్పాలి కాని, ఒకవైపే మాట్లాడడం సమంజసం అనిపించదు.

👉అంతెందుకు జగన్ ప్రభుత్వం(Jagan Government)పై ఎన్ని అసత్య ఆరోపణలు చంద్రబాబు, పవన్, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ప్రచారం చేసింది తెలియదా?. వెంకయ్య నాయుడుకు అవి సూక్తి ముక్తావళిలా నిపించేవేమో తెలియదు. అప్పులపై చంద్రబాబు, పవన్, పురందేశ్వరి తదితరులు చేసిన పచ్చి అబద్దాలు ఇప్పుడు ఆధార సహితంగా కనిపిస్తున్నాయే. అసెంబ్లీ సాక్షిగానే స్వయంగా ఆర్థిక మంత్రి కేశవ్ అవి అబద్దాలని అంగీకరించారే. అలా ఆర్గనైజ్డ్‌గా మూడు పార్టీల నేతలు అబద్దాలు  ప్రచారం చేయడం నేరమో, కాదో వెంకయ్య నాయుడు చెప్పగలిగి ఉంటే బాగుండేది. వైఎస్సార్‌సీపీ వారికి పనులు చేయవద్దని ఆదేశిస్తున్న చంద్రబాబు నాయుడును అభివృద్ధి కాముకుడని, మంచి ఆలోచనలు కలిగిన వ్యక్తి అని ప్రశంసిస్తుంటే ప్రజలు ఏమనుకోవాలి?. కనీసం అలాంటి వివక్ష వద్దని చంద్రబాబుకు సలహా ఇవ్వలేక పోయారే! ఏది ఏమైనా ఎమర్జెన్సీలో జైలుకు వెళ్లిన  వెంకయ్య నాయుడు.. ఏపీలో ఇప్పుడు ఉన్న ఎమర్జెన్సీని సమర్థిస్తున్నట్లు మాట్లాడడం, కనిపిస్తున్న కక్షపూరిత రాజకీయాలు, అరాచక పరిస్థితులపై స్పందించ లేకపోవడం బాధాకరం.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాలా వ్యాఖ్యాత.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement