![KSR Comment: CM Chandrababu Aparichitudi Statements in AP Politics](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/CM-Chandrababu-Aparichitudi.jpg.webp?itok=Yz0M9m-R)
వాన రాకడ, ప్రాణం పోకడ ఎవరూ చెప్పలేరని ఒకప్పుడు అనేవారు. దీంట్లో వాస్తవం మాటెలా ఉన్నా... రాజకీయాల్లో చంద్రబాబు వంటి వారు చేసే ప్రకటనలకు మాత్రం ఈ సామెతను వర్తింపజేసుకోవచ్చు. ఎందుకంటారా? బాబుగారి ప్రకటనలు ఎప్పుడు ఎలా ఉంటాయో కనిపెట్టడం కష్టమే మరి!. అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు ఆయన చిత్రవిచిత్రమైన ప్రకటనలు చేస్తూంటారు. వినేవారి మతిపోతుంది ఈ ప్రకటనలు వింటే. కొందరు వీటిని మతిలేని ప్రకటనలని కూడా అంటుంటారు. కాని, ఆయన తెలివిగానే ఎప్పటికి ఏది అవసరమో ఆ మాటలే మాట్లాడుతుంటారు.
కొద్ది రోజుల క్రితం ఆయన రెండు ప్రకటనలు చేశారు. సంపద సృష్టి ఎలాగో తనకు చెవిలో చెప్పమన్న ప్రకటన కూడా అలాంటిదే. ఎన్నికలకు ముందు తానే సంపద సృష్టికర్తనని వీర బిల్డప్ ఇచ్చిన ఆయన అకస్మాత్తుగా.. బేలగా.. అదెలా చేయాలో నాకు చెవిలో చెప్పండి అని అడుగుతారని ఎవరైనా ఊహించగలరా?. ఇదొక్కటే కాదు... ఢిల్లీలో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ రాజకీయ నేతలు సంపద సృష్టించకుండా దాన్ని పంచే అధికారం లేదని అన్నారు. అంటే ఏమిటి దీని అర్థం? సబ్సిడీ పథకాలు అమలు చేయరాదని చెప్పడమే కదా!. ప్రజలకు నగదు బదిలీని వ్యతిరేకించడమే కదా! మరి ఇదే చంద్రబాబు(Chandrababu) ఎన్నికల సమయంలో బోలెడన్ని ఉచిత వరాల వర్షం ఎందుకు కురిపిస్తారు? ఆ తర్వాత వాటిని పట్టించుకోకుండా పోతారు?
సోషల్ మీడియా యుగంలో అవన్ని వెలుగులోకి వస్తుండడంతో ఆయన ప్రభుత్వం చికాకు పడుతూ ప్రశ్నించిన వారిపై రెడ్ బుక్ ప్రయోగిస్తుంటుంది.
మాట మార్చడంలో దేశంలోనే ఒక రికార్డు సాధించిన చంద్రబాబు ఇప్పుడు అసలుకే ఎసరు పెడుతున్నట్లు అనిపిస్తుంది. ఎన్నికల ప్రచారంలో సూపర్‌సిక్స్ అని, ఎన్నికల ప్రణాళిక అని తెగ ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక మాత్రం చంద్రబాబు పలు గందరగోళ ప్రకటనలు చేస్తూ ప్రజలకు పిచ్చెక్కెస్తున్నారనే చెప్పాలి.
ఎన్నికలకు ముందేమో సంపద గురించి చెప్పకుండా తాము వస్తే సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తామని ఒకటికి పదిసార్లు ప్రకటించే వారు. తెలుగుదేశం మహానాడు(TDP Mahanadu)లో సూపర్ సిక్స్ హామీల ప్రకటన చేసి 'తమ్ముళ్లూ అదిరిపోయిందా" అంటూ సంబరపడితే ఆయనకు మద్దతు ఇచ్చే ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి ఆహా.. ఓహో అంటూ శరభ.. శరభ అని గంతులేశాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై శరాలు వదిలారని ప్రచారం చేశాయి. అంతవరకు ఆనాటి ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల హామీలు అమలులో భాగంగా వివిధ స్కీములలో లబ్దిదారులకు ఆర్థిక సాయం చేస్తుంటే.. బటన్ నొక్కడం తప్ప ఏమి చేస్తున్నారని తప్పుడు కథనాలు ఇచ్చేవారు. మూలనున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుందని, అదేమంత పెద్ద పనా అని వ్యాఖ్యానించారు. తాను ఇంకా ఎక్కువ చేయగలనన్నట్లు బిల్డప్ ఇచ్చేవారు. అంతేకాదు.. రూ.70 వేల కోట్ల మేర స్కీములను అమలు చేస్తేనే రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని చెప్పిన చంద్రబాబు అంతకు రెండు రెట్లు అధికంగా అంటే రూ.1.5 లక్షల కోట్ల విలువైన స్కీములను బటన్ నొక్కడం ద్వారా పేదలకు అమలు చేస్తామని అనేవారు. అదెలా సాధ్యమైని ఎవరికైనా అనుమానం వస్తుందని, ముందుగానే తనకు సంపద సృష్టించే అనుభవం ఉందని దబాయించేవారు.
అధికారంలోకి వచ్చాక సంపద సృష్టి మాటేమో కాని, అప్పుల మీద అప్పులు చేస్తున్నారు. ఇప్పటికే రూ.80 వేల కోట్ల బడ్జెట్ అప్పులు చేస్తే, బడ్జెట్ తో సంబంధం లేకుండా మరో రూ.40 వేల కోట్లకు పైగా అప్పు చేశారు. పోనీ వీటినేమైనా పేదల కోసం ఖర్చు చేస్తున్నారా? ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడానికి వ్యయం చేస్తున్నారా అంటే అదేమీ లేదు. అభివృద్ది పనులకైనా ఖర్చు పెడుతున్నారా? అంటే అదీ కనపడదు.
జగన్ టైంలో వచ్చిన ఓడరేవులు, మెడికల్ కాలేజీల వంటివాటిని ప్రైవేటు పరం చేస్తానంటున్నారు. రాయచోటి వద్ద జరిగిన ఫించన్ల పంపిణీ కార్యక్రమ సభలో ఒక రైతు.. తమకు అన్నదాత సుఖీభవ నిధులు ఎప్పుడు ఇస్తారని చంద్రబాబును ప్రశ్నించారు. వర్కవుటు చేస్తున్నామని చెబుతూ, అవి ఇవ్వాలంటే ముందు డబ్బులు సంపాదించాలని, లేదంటే డబ్బు సంపాదించే మార్గం తనకు చెవిలో చెప్పాలని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరు తెలివితేటలతో ఆర్థికంగా ఎదగాలని కూడా ఒక సలహా పారేశారు. ఈ మాత్రం దానికి సూపర్ సిక్స్ అని, ఎంతమంది పిల్లలనైనా కనండి.. వారందరి చదువు కోసం తాను తల్లికి వందనం కింద రూ.15 వేల చొప్పున డబ్బు ఇస్తానని ఎందుకు చెప్పారు?.. అని ఎవరికైనా ఒక సందేహం వస్తే అది వారి ఖర్మ అనుకోవాలన్నమాట. ఆ వెంటనే రైతు భరోసా కూడా మూడు విడతలుగా అందించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ రెండిటిలో ప్రజలు ఏది నమ్మాలి?
ఇక ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ 'నాకు దేశ అభివృద్ధి, భవిష్యత్తు ముఖ్యం. సరైన అభివృద్ధే సరైన రాజకీయం.., దేశంలో సంపద పెంచకుండా పంచడం సరైనది కాదు" అని సందేశం ఇచ్చారు. దీనిపై చర్చ జరగాలని అంటూ, సంపద సృష్టించకుండా దానిని పంచే హక్కు రాజకీయ నేతలకు ఎక్కడిదని ప్రశ్నించారు. ఈ సందర్భంలో ఢిల్లీలో ఆప్ పాలనను విమర్శించి వారి పాలన విఫల ప్రయోగం అని వ్యాఖ్యానించారు. ఇదే చంద్రబాబు 2019లో కేజ్రీవాల్‌ను గొప్ప పాలకుడని, విద్యావంతుడు అని అభివర్ణించిన విషయాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. అది వేరే విషయం.
ఇప్పుడు సంపద సృష్టించకుండా పంచే హక్కు నేతలకు లేదని అంటున్నారంటే, ఏపీలో ఇప్పట్లో సూపర్ సిక్స్ అమలు చేయలేమని చెప్పడమే అవుతుంది కదా అనే విశ్లేషణ వస్తుంది. ఒకసారేమో తాను చెప్పినదాని కన్నా ఎక్కువే ఇస్తానని అంటారు. మరో సారి డబ్బు ఎక్కడ ఉందని అంటారు. ఎన్నికలకు ముందు కరెంటు ఛార్జీలను పెంచబోనని, తగ్గిస్తానని చెబుతారు. అధికారంలోకి రాగానే రూ.15 వేల కోట్ల భారం మోపారు. తాజాగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు, భూముల విలువలను పెంచడం ద్వారా వేల కోట్ల అదనపు ఆదాయం పొందే యత్నం చేశారు. ప్రజలకు సంపద పంచుతానని చెప్పిన చంద్రబాబు వారేదో కాస్తో, కూస్తో సంపాదించుకున్న దానిని ఇలా లాక్కుంటున్నారేమిటని సందేహం రావచ్చు. అదే సంపద సృష్టి అన్న అభిప్రాయం వస్తుందన్న మాట.
ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష జరిపి.. ప్రజలపై అదనపు భారం మోపలేం అని అన్నారట. మరి ఇప్పటి వరకు వేసిన భారం సంగతేమిటి? అని అడిగే అవకాశం ప్రజలకు ఉండదు. ఏ ఒక్కరు పన్ను ఎగవేతకు పాల్పడకుండా చూడాలని, అలాగని వ్యాపారులను వేధింపులకు గురి చేయవద్దని అధికారులకు చెప్పారు. వేధింపులు వద్దని పైకి చెప్పడం బాగానే ఉన్నా, ప్రభుత్వ సిబ్బంది ఏమి చేస్తారో ఊహించుకోవడం కష్టం కాదు. గత ఏడాది జగన్ ప్రభుత్వంలో వచ్చిన ఆదాయంతో పోల్చితే ఈ ఏడాది చంద్రబాబు పాలనలో ఆదాయం తగ్గింది. అయినా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయని చంద్రబాబు అంటారు. ప్రజలపై అదనపు భారం మోపలేమని ఆయన అన్నారట. ఇంతకన్నా కపటత్వం ఏమి ఉంటుంది?
జగన్ టైంలో తలసరి ఆదాయం పెరిగినా, జీఎస్డీపీ, జీఎస్టీ గణనీయంగా అభివృద్ది చెందినా.. అసలేమీ జరగలేదని చెబుతారు. అదే చంద్రబాబు గొప్పదనం. రెండు లక్షల కోట్ల ఆదాయం వస్తుందని చంద్రబాబు ప్రభుత్వం అంచనా వేసుకుంటే ఇప్పుడేమో లక్ష రెండువేల కోట్ల దగ్గరే ఉందని అధికారులు చెబుతున్నారు. అంటే చంద్రబాబు అస్తవ్యస్త ఆర్థిక విధానాల వల్లే ఈ పరిస్తితి ఏర్పడిందనే కదా అర్థం? అయినా భజంత్రి మీడియా ఉంది కనుక ఏమి చెప్పినా చెల్లుబాటు అయిపోతోంది!.
:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment