
గాలి కబుర్లు...సోది లెక్కలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని ఉందా? ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ చూడండి! ముఖ్యమంత్రి చంద్రబాబును పొగిడేందుకు.. షాడో సీఎం లోకేష్‌ను సంతోషపెట్టేందుకు మంత్రిగారు రాష్ట్ర ఇమేజీని దెబ్బతీసేందుకూ వెనుకాడలేదు.. అబద్ధాలు చెప్పడానికి సిగ్గుపడలేదు! బడ్జెట్ ప్రసంగం మొత్తం మ్మీద వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, గత ప్రభుత్వం అంటూ పదే పదే ప్రస్తావించి కేశవ్ తన లోపలి భయాన్ని బయటపెట్టేసుకున్నట్లు అనిపించింది. కాకపోతే ఈ క్రమంలో ఆయన పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పాలనను కూడా విధ్వంసంతో పోల్చేశారు.
ఒకపక్క రాష్ట్రానికి రుణాలు వచ్చే అవకాశం సున్నా అంటూనే.. ఇంకోపక్క లక్ష కోట్ల రూపాయల రుణం తీసుకోబోతున్నామని చెప్పడం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికే చెల్లింది. రాజధాని అమరావతి కోసం ప్రభుత్వ ధనం ఒక్క రూపాయి అవసరం లేదంటూనే బడ్జెట్ ద్వారా రూ.ఆరు వేల కోట్లు వ్యయం చేయబోతున్నామని అంటారు. అంతేకాదు.. రూ.31 వేల కోట్ల అప్పు తీసుకువస్తూ ఆ మాటను ధైర్యంగా చెప్పలేని దుస్థితి కేశవ్‌ది.

👉సాధారణంగా ఎవరైనా తమ రాష్ట్రం అభివృద్ది పథంలో ఉంది. గొప్పగా పని చేస్తున్నామని చెప్పుకుంటారు. కూటమి ప్రభుత్వం మాత్రం రివర్స్‌లో నడుస్తోంది. రాష్ట్రం నాశనమైపోయిందని, విధ్వంసమైందని.. రెండో ప్రపంచయుద్ధంలో అణుబాంబు దాడికి బుగ్గయిన హిరోషిమాతో పోల్చడం ఎంత దుర్మార్గం!. ఆంధ్రప్రదేశ్‌పై ప్రేమాభిమానాలు ఉన్నవారు ఎవరైనా ఇలాంటి దిక్కుమాలిన పోలికలు చేస్తారా?. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించడం కాదా! ఈ మాటలను సీరియస్‌గా తీసుకుంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారా?. అంతేకాదు..
👉ఏకంగా ఏపీకి రుణం తీసుకునే సామర్ధ్యం సున్నా అని రాశారంటే ఏమనుకోవాలి? అది నిజమే అయితే కొత్త బడ్జెట్‌లో రూ.1.03 లక్షల కోట్ల రుణం తెచ్చుకుంటామని ఎలా చెప్పారు? ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.1.31 లక్షల కోట్ల రుణం ఎలా తీసుకువచ్చారు? ఎవరినో మాయ చేయాలన్న ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎవరికి ప్రయోజనం. సంపద సృష్టిస్తామని ఊదరగొట్టిన వీరు.. YSRCP ప్రభుత్వ హయాంలో వచ్చినదానికంటే తక్కువ ఆదాయం వచ్చిన దానిపై మాత్రం కిమ్మనరు! రుణాలే సంపద అనుకోవాలనా?.
ప్రతి వైఫల్యాన్ని గత జగన్ ప్రభుత్వంపై నెట్టేస్తే.. ప్రజలకు వచ్చే లాభం ఏమిటి? ఇప్పుడు చేస్తున్న విమర్శలన్నీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినవే కదా! అయినా జగన్ కంటే మూడు రెట్లు అధికంగా హామీలు ఎలా ఇచ్చారంటే జవాబు చెప్పరు. ఇప్పుడు ఆ సూపర్ సిక్స్, తదితర హామీలన్నీ ఎగవేయడానికి వైఎస్సార్‌సీపీ ఆరోపణలు చేసి ప్రజలను పిచ్చోళ్లను చేస్తారా?. ఇదేమైనా ధర్మమేనా!.
అదే సమయంలో చంద్రబాబును పొగడడం కోసం ఎన్టీఆర్‌ను సైతం భ్రష్టు పట్టించేశారు. 1995లో ఎన్టీఆర్‌ను పదవి నుంచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదట. దానికి కారణం ఒక్క ఎన్టీఆరేనా? ఆయన తీసుకొచ్చిన పథకాలేనా? అలాంటప్పుడు అదే ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఆర్థిక, రెవెన్యూ శాఖల మంత్రిగా ఉన్నదెవరు? చంద్రబాబే కదా?. పయ్యావుల కేశవ్‌కు ఎన్టీఆర్‌పై ఉన్న గౌరవం ఏమిటో ఈ బడ్జెట్ ప్రసంగంతో తేలిపోయింది. గత ఏడాది బడ్జెట్ లో ఏమి చెప్పాం..ఏమి చేశాం..అన్నదానితో నిమిత్తం లేకుండా ఒక ఉపన్యాసం తయారు చేసుకుని శాసనసభలో చదివితే సరిపోతుందా?.

విచిత్రం ఏమిటంటే.. 2024-25 బడ్జెట్‌ను రూ.2.94 లక్షల కోట్లతో ప్రవేశపెట్టినా అందులో ఎంత శాతం అమలైందన్నది ప్రశ్నార్థకం. ఎందుకంటే రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందన్న అంచనాతో వేసిన బడ్జెట్ అది. అయితే జనవరి నాటికి వచ్ని ఆదాయం కేవలం ఒక లక్ష ఒక వెయ్యి కోట్లు మాత్రమే. అంటే సగం ఆదాయం కూడా లేకుండా పోయిందన్నమాట. పరిస్థితి ఇలా ఉంటే.. తాజా బడ్జెట్ కేటాయింపులు ఎకాఎకిన రూ.3.22 లక్షల కోట్లు అని ఎలా చెప్పారో అర్థం కాదు. కేవలం కాకి లెక్కలతో పుస్తకాలు నింపేసి ప్రజలను మభ్యపెట్టడం కాకపోతే? ఒకవైపు రాష్ట్రం ఆర్ధికంగా విధ్వంసమైందంటూనే.. మరోపక్క ఆదాయం పెరుగుతుందని ఎలా అంటారు?.
సూపర్ సిక్స్ వంటి ఆచరణ కాని హామీలు ఇవ్వడం, వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం ఎలా అనేదానిపైనే అధికంగా దృష్టి పెట్టారన్న విమర్శలు వస్తున్నాయి. ధైర్యం ఉంటే టీడీపీ, జనసేన కూటమి ఇచ్చిన హామీలు ఏమిటి? వాటి అమలుకు బడ్జెట్‌లో జరిపిన కేటాయింపులు ఎంత? కేటాయించకపోతే ఎందుకు చేయలేకపోయారు అన్నవి మాటమాత్రం మాట్లడకుండా ఊకదంపుడు కబుర్లు చెబితే ఏమి ఉపయోగం?. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తల్లికి వందనం పథకం కోసం రూ.ఆరు వేల కోట్లు కేటాయించి ఒక్క రూపాయి వ్యయం చేయలేదు. అలాగే.. అన్నదాత సుఖీభవ కింద రూ.వెయ్యి కోట్లు కేటాయించి రైతుకు నయాపైసా ఇవ్వలేదు. అంటే..పేరుకు కేటాయింపులు జరపడం.. ఆ తర్వాత గాలికి వదలి వేయడం అనేకదా!
ఆడపడుచుకుల నెలకు రూ.1,500 ఆడబిడ్డ నిధి పేరిట సాయం
మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం
బీసీలకు యాభై ఏళ్లకే ఫించన్.. వీటి ఊసే లేదు.
అలాగే వలంటీర్ వ్యవస్థకు మంగళం పాడేశారు.
👉అమరావతి కోసం రూ.ఆరు వేల కోట్లు కేటాయించారు కానీ.. అంతా ఖర్చు చేస్తే చేయవచ్చు. ఎందుకంటే రాష్ట్రం ఏమైపోయినా అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటే చాలన్నట్లుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న భావన నెలకొంది. అంతేకాదు. రూ.31 వేల కోట్ల అప్పు తీసుకు వస్తున్న విషయాన్నీ నిజాయితీగా ఒప్పుకోకపోవడం గమనార్హం. అదేదో కేంద్రం ఊరికే ఇస్తున్న డబ్బు అన్నట్లు పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.ఇదంతా ఏపీలో అన్ని ప్రాంతాల ప్రజలపై పడే భారమే అవుతుంది.వారు చెల్లించే పన్నులనే వాడుకోవాలి. ఇక్కడ మరో మాట చెప్పాలి.
జగన్ ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి స్కూళ్లు బాగు చేసి అనేక సంస్కరణలు తీసుకువస్తే కేశవ్ తన ప్రసంగంలో గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసిందని దుర్మార్గంగా వ్యాఖ్యానించారు. లోకేష్‌ను ప్రసన్నం చేసుకోవడానికి ఇంతలా దిగజారవలసిన అవసరం లేదు. చంద్రబాబు వస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగిపోతుందని ఎన్నికల సమయంలో ఊదరగొట్టారు. కాని తీరా చూస్తే జగన్ టైమ్‌లో రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా సుమారు రూ.13 వేల కోట్ల ఆదాయం వస్తే, చంద్రబాబు సర్కార్ పది నెలల పాలనలో అది రూ. తొమ్మిది వేల కోట్లకు కూడా చేరలేదు!. కేటాయింపుల గురించి చూస్తే ఫించన్లకు రూ.33 వేల కోట్లు అవసరమని గవర్నర్ ప్రసంగంలో చెబుతారు. బడ్జెట్‌లో మాత్రం రూ.27 వేల కోట్లే చూపుతారు. అన్నదాత సుఖీభవ కింద కేంద్రం ఇచ్చేదానితో సంబంధం లేకుండా ప్రతి రైతుకు రూ.20 వేలు ఇస్తామన్న ఎన్నికల హామీపై మాటమార్చిన చంద్రబాబు ఒక ఏడాది ఎగ్గొటడమే కాకుండా.. తాజా బడ్జెట్‌లో సరిపడా కేటాయింపులూ చేయలేదు. తల్లికి వందనం కింద విద్యార్ధులు ఒకొక్కరికి రూ.15 వేల చొప్పున ఇచ్చేందుకు రూ.12 వేల కోట్లు అవసరం కాగా.. కేటాయించింది రూ. ఎనిమిది వేల కోట్లే. పైగా స్పీచ్ లో ఎక్కడా ప్రతి విద్యార్థికీ అని చెప్పకుండా ప్రతి తల్లికీ అని తెలివిగా చెప్పారు. దీనిపై వివరణ ఇస్తారేమో చూడాలి.
కేశవ్ బడ్జెట్ ప్రసంగం మొత్తమ్మీద 22 సార్లు విమర్శలు చేయడం ద్వారా జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణను చూసి కూటమి సర్కారు ఎంత భయపడుతున్నది బయటపెట్టుకున్నారు. మొత్తం మీద బడ్జెట్ ద్వారా ప్రజలను మళ్లీ మభ్య పెట్టే యత్నం చేసే క్రమంలో వారి డొల్లతనాన్ని వారే బయట పెట్టుకున్నారు. కాకపోతే ఈనాడు ,ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియాకు మాత్రం ఇది బాహుబలిగా.. పండంటి ప్రగతికి పది సూత్రాలుగా కనిపించవచ్చు. ఎందుకంటే ప్రజలకంటే ఈ ఎల్లో మీడియా వారికే వారికే ఈ ప్రభుత్వం వల్ల అధిక గిట్టుబాటు కనుక.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment