పవనూ.. మరీ ఇంతకు దిగజారాలా! | KSR Comment: Why Pawan Kalyan Praise CBN In Assembly Always | Sakshi
Sakshi News home page

పవనూ.. మరీ ఇంతకు దిగజారాలా!

Published Sat, Mar 1 2025 11:11 AM | Last Updated on Sat, Mar 1 2025 1:00 PM

KSR Comment: Why Pawan Kalyan Praise CBN In Assembly Always

జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌(Pawan Kalyan) ఏపీ అసెంబ్లీలో చేసిన కొన్ని వ్యాఖ్యలు తమాషాగా ఉన్నాయి. ‘‘కింద పడతాం.. మీద పడతాం.. అవి మా ఇంటి విషయాలు.. కూటమి విషయాలు. ఒక మాట అనవచ్చు. నాకేం అభ్యంతరం లేదు. కానీ గవర్నర్‌కు గౌరవం ఇవ్వని పార్టీ సభలో అడుగు పెట్టకూడదు’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పొంతన లేని అంశాలను బలవంతంగా అతికినట్టుగా అనిపిస్తుంది. ‘‘ఇది తన గురించో,  చంద్రబాబుల గురించి కాదని, ప్రజల కోసం నిలబడి ఉన్నామని, కలిసి ఉండకపోతే ప్రజలకు ద్రోహం చేసినవాళ్లం అవుతామని, అందుకే మాటిస్తున్నానని అంటూ, ఎన్ని ఇబ్బందులు  వచ్చినా వాటిని అధిగమనించి మరో పదిహేనేళ్లు కలిసి ఉంటాము’’ అని పవన్ అనడం దేనికి సంకేతం?.. 

తెలుగుదేశంతో పొత్తు పుణ్యమా అని పవన్‌ కల్యాణ్‌ ఎలాగోలా శాసనసభలోకి అడుగుపెట్టి డిప్యూటీ సీఎం కూడా అయిపోయారు. అభిమానులకు, జనసేన కార్యకర్తలకు అది సంతోషమే. కానీ ఆయన సమస్యలపై ప్రశ్నించకుండా.. ప్రభుత్వంలో జరిగే తప్పులపై గొంతెత్తకుండా ఆత్మపరిశీలన చేసుకోకుండా, చేసిన బాసలను గాలికి వదలి  పలాయన వాదంతో ప్రవర్తిస్తున్నారని చెప్పడానికి ఈ వ్యాఖ్యల కన్నా ఉదాహరణ అవసరం లేదేమో!.

👉ఇంతకీ పవన్‌ చేసిన ఆ వ్యాఖ్యల సారాంశం ఏమిటి? తమలో తాము ఎన్ని గొడవలు పడ్డా కలిసే ఉంటామని చెప్పడమే కదా! ఈ మాట అంటున్నారంటేనే  ప్రజలకు ద్రోహం చేయడం అవుతుంది.  ప్రభుత్వం సమర్థంగా పని చేస్తుందని హామీ ఇవ్వకుండా వీరిద్దరూ తిట్టుకుంటే ఎవరికి కావాలి? కిందపడితే ఏంటి? మీద పడితే ఎవరికి ఆసక్తి? ఆయన అన్నట్టే అది వారి అంతర్గత వ్యవహారం. ప్రజలకు సంబంధించిన అంశం కాదు. అయితే... శాసనసభ ఎన్నికలకు ముందు ఆయన చెప్పిన మాటలేమిటి? చేసిన వాగ్దానాలేమిటి? ఇప్పుడు వాటిని గాలికి వదిలేసిన వైనం ఏమిటి? వీటిని ప్రశ్నించకుండా ఎవరూనా ఎలా ఉండగలరు? 

సుగాలి ప్రీతి మృతి కేసు నుంచి 31 వేల మంది మహిళలు మిస్సింగ్ అయ్యారంటూ సంచలనం కోసం పిచ్చి ఆరోపణలు చేసిన పవన్ కల్యాణ్‌.. తీరా పదవి వచ్చాక వాటి గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ఈ మధ్య కాలంలో జరిగిన వివిధ పరిణామాలలో పవన్ పలు అవమానాలకు గురయ్యారని జనసేన కార్యకర్తలు బాధ పడ్డారు. కానీ పవన్‌ తన మాటల ద్వారా ఆ అవమానాలను పట్టించుకోబోనని చెప్పినట్లు అయ్యింది. ఎంత పదవిలో ఉంటే మాత్రం పవన్ టీడీపీకి ఇంతగా లొంగి ఉండాలా అన్నది జనసేన కార్యకర్తల ఆవేదన. 

తిరుపతి తొక్కిసలాట ఘటన(Tirumala Stampede Incident) తర్వాత పవన్ కల్యాణ్‌  ఓవరాక్షన్ చేశారని టీడీపీ ముఖ్యనేతలే వ్యాఖ్యానించిన సంగతిని ఆయన పట్టించుకోకపోవచ్చు. కానీ ఆత్మాభిమానం కలిగిన జనసేన క్యాడర్ సహించలేక సోషల్ మీడియాలో టీడీపీ వారికి పోటీగా ఎలా పోస్టులు పెట్టిందో తెలియదా! ఇవన్ని ఎవరి ఇంటి విషయాలు..? అంటే జనసేన కూడా టీడీపీలో భాగమని చెబుతున్నారా? కూటమి విషయాలైతే ఎన్నడైనా చర్చించుకున్నారా? అంత దాకా ఎందుకు.. 

పిఠాపురంలో పోలీసులు తన మాట వినడం లేదని ఎందుకు చెప్పారు? నెల రోజుల పాటు ఎవరి మీద అలిగి ఫైళ్ల జోలికి వెళ్లకుండా ఉన్నారు? ఇది ఎవరి ప్రయోజనం కోసం? సనాతని వేషధారణ వేసుకున్నాక, ధర్మ బద్దంగా ఉండాలి కదా! అసత్య వచనాలు పలకరాదని కదా ఆ ధర్మం చెబుతోంది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని కదా ఏ ధర్మం అయినా చెప్పేది. కాని పవన్ కల్యాణ్‌ వాటిని పాటిస్తున్నారా?. 

తిరుమల లడ్డూ విషయంలో(Tirumala Laddu Row) ఆయన చేసిన వ్యాఖ్యలు హిందూ ధర్మానికి అపచారం కాదా? వలంటీర్ల పొట్టకొట్టబోనని పవన్ హామీ ఇచ్చారా? లేదా? అధికారం ఎంజాయ్ చేస్తూ వారి గురించి మాట్లాడకపోగా.. అసలు వలంటీర్లు  ఎక్కడ ఉన్నారని వ్యాఖ్యానించడం పొట్ట కొట్టడం అవుతుందా? లేదా? ఇదేనా సనాతన ధర్మం చెప్పేది? శాసనసభలో ఆయన మాట్లాడిన  విషయాలలో సత్యదూరమైనవి ఎన్ని ఉన్నాయి? 

వైఎస్సార్‌సీపీ(YSRCP) వాళ్లు నినాదాలు చేసినందుకే... గవర్నర్‌కు గౌరవం ఇవ్వని పార్టీ సభలోకి అడుగు పెట్టకూడదని ఆయన కొత్త సూత్రం చెబుతున్నారే..! మరి గవర్నర్ వ్యవస్థే వద్దన్న టీడీపీతో పొత్తు ఎలా పెట్టుకున్నారు? గతంలో గవర్నర్ ఈఎస్‌ఎల్‌ నరసింహన్ ప్రసంగిస్తుంటే..  తెలుగుదేశం సభ్యులు ఆయన కుర్చీని కూడా లాగి పారేశారు. అలా చేసిన వారిలో ఒకరైనా రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. గత టర్మ్‌లో గవర్నర్ హరిచందన్ స్పీచ్  సమయంలో కానీ,  స్పీకర్ పై కానీ టీడీపీ సభ్యులు ఎన్ని అల్లర్లు చేశారో ఒకసారి రికార్డులు  తిరగేస్తే తెలుస్తుంది. తన సహ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ   ఒక విజిల్ పట్టుకువచ్చి సభలో ఈల వేస్తూ తిరిగారే. మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు కాగితాలు చింపి, స్పీకర్ తమ్మినేని సీతారామ్‌ను బెదిరించేవారే! కొందరు టీడీపీ నేతలు ఎలా దూషించారో ఆయనకు గుర్తు ఉండకపోవచ్చు. ఇవన్ని మంచి పద్దతులేనా? అలాంటి పార్టీతో కలిసి అధికారంలోకి వచ్చాక సుద్దులు చెబితే సరిపోతుందా?. 

ఏమిటో కొత్తగా స్టేట్ రికన్సిలియేషన్ కేబినెట్ (Reconciliation Cabinet) అని అంటున్నారు. స్వాతంత్రం వచ్చాక ఎన్నికలకు ముందు ఏదో జరిగిందని, ఇప్పుడు కూడా అలాగే ఉందని అనడం ఏమిటో?. బాబూ రాజేంద్ర ప్రసాద్ కూడా నెహ్రూ కేబినెట్ లో ఉన్నా ఆయా అంశాలపై విబేధించేవారని అన్నారు. అంటే ఏపీలో కూడా అలాగే చంద్రబాబును నిలదీస్తారా? ఆ ధైర్యం పవన్‌కు నిజంగా ఉందా?  అలా ఉంటే ఇప్పటివరకు జరిగిన అనేక పరిణామాలలో ఒక్కసారైనా ప్రజల పక్షాన మాట్లాడారా? శాంతిభద్రతల విషయంలో మాట్లాడినట్లే మాట్లాడి వెంటనే ఎందుకు జారిపోయారు? ప్రతిపక్షం ముఖం చాటేస్తే తామే ఆ బాధ్యత నిర్వహిస్తామని అన్నారు. 

👉పవన్ ఆ పని చేసినా, చేయకపోయినా, ముందుగా సూపర్ సిక్స్ గురించి చంద్రబాబును ప్రశ్నించి ఉంటే, తన బాధ్యత ఏమిటో చెప్పి ఉంటే అప్పుడు ఆయన ఏమి చెప్పినా జనం నమ్మవచ్చు. తన శాఖకు సంబంధించి ఆయన గ్రామ సభలు, గోకులాలు అంటూ ఏవేవో చెప్పుకున్నారు. కాని వాటిని టీడీసీ వారే ఎవరూ పట్టించుకోవడం లేదన్న సంగతి ఆయనకు కూడా తెలిసి ఉండాలి. 

ఆంధ్రులకు కుల భావన ఉందని శాసనసభలో బాధ పడినట్లు నటించారు. మరీ ఇదే  పవన్ కల్యాణ్‌  గతంలో కనీసం కుల భావన అయినా తెచ్చుకోండని అన్నారే! తనకైనా ఫలానా కులం వారు ఓట్లు వేయాలని అన్నది వాస్తవం కాదా! దీనికి సంబంధించి అప్పట్లో వీడియోలు వచ్చాయే! ఎవరిని మభ్య పెట్టడానికి ఈ మాటలు?. 

👉విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆగిందని అంటున్నారు. సంతోషమే కానీ.. భవిష్యత్తులో కూడా జరగదని చెప్పగలిగితే బాగుంటుంది. ఒకపక్క అక్కడ అనేక మందిని ఉద్యోగాలనుంచి తొలగిస్తుంటే, మరోపక్క పవన్ ఇలా మాట్లాడుతున్నారు. బూతులు ఎవరు మాట్లాడినా తప్పే. కాని టీడీపీ, జనసేనల దూషణలకు, పెట్టిన బూతు పోస్టింగ్‌లకు  ఆయన ఎలా మద్దతు ఇస్తున్నారు?. 

తిరుపతిలో కిరణ్ రాయల్ అనే స్థానిక నేతపై మహిళల వేధింపు ఆరోపణలు వస్తే కనీసం పార్టీ నుంచి సస్సెండ్ కూడా చేయలేక పోయారే! ఆ మాటకు వస్తే ఎన్నికల సమయంలో పవన్ ఎన్ని దూషణలకు పాల్పడింది ఆధార సహితంగా ఉన్నాయి కదా! 2009లోనే యువరాజ్యం అధ్యక్షుడుగా ఉండి కాంగ్రెస్ వాళ్ల పంచెలు ఊడగొడతానని అన్నది ఈయనే గదా అని పలువురు గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబును జైలులో ఎందుకు పెట్టింది తెలియదా? స్కిల్ స్కామ్‌లో తొలుత కేసు  పెట్టింది ఈడి కాదా? గతంలో కులాలు, మతాల మధ్య గొడవలు వచ్చేలా రోజుల తరబడి మీడియా సమావేశాలు పెట్టి లైవ్ లో  మాట్లాడిన ఒక నేతను ఇప్పుడు పెద్ద పదవిలో కూటమి కూర్చోపెట్టుకుందే!. 

చంద్రబాబు, లోకేష్‌లతో ఏదో జిగిరి దోస్తి ఉన్నట్లు ఇప్పుడు చెబుతున్నారు కాని, 2018లో ఇదే పవన్ వారిని ఉద్దేశించి ఎన్ని తీవ్రమైన అవినీతి ఆరోపణలు  చేసింది తెలియదా? రాజకీయాలలోకి వచ్చి చెగువేరా అన్నారు. ఆ తర్వాత చంద్రబాబు, మోదీ అన్నారు. తదుపరి వారిని కాదని బీఎస్పీ అధినేత్రి మాయావతి, వామపక్షాలతో కలిసి జట్టుకట్టారు. ఆ తర్వాత మళ్లీ మోదీ, చంద్రబాబు అన్నారు. 

.. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఎవరు చెబుతారు? నిజంగానే కిందా, మీద పడి పదవిలోకి వచ్చిన పవన్.. ఆ పదవి మీద మోజు పెంచుకోవడం తప్పు కాదు. కానీ అదే ప్రధానమన్నట్లుగా  వ్యవహన్నారనే భావన ఏర్పడుతోంది. ప్రజల కోసం నిలబడకుండా చంద్రబాబు, లోకేష్ ల  మెప్పు కోసం పనిచేస్తూ, సనాతని వేషం ధరించి కూడా అబద్దాలు, అర్ధ సత్యాలు చెప్పడం ఏ ధర్మం అవుతుందో ఆయనకే తెలియాలి!. 

:::కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement