
కన్విన్స్ చేయలేకపోతే కన్ఫ్యూజ్ చేయాలన్నది ఒక థియరీ. దీన్ని బాగా వంటబట్టించుకున్న వాళ్లలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందువరుసలో ఉంటారు. రాజకీయ చరిత్ర మొత్తం ప్రజలను గందరగోళం పరచడం ద్వారా లేదంటే మాయ చేయడం ద్వారానే సాగిందని ఇట్టే అర్థమైపోతుంది. ఈ కారణం వల్లనే ప్రజలకు ఆయనపై అంత విశ్వాసలేమి!. కొన్ని ఇతర కారణాల వల్ల ఆయన నాలుగుసార్లు ముఖ్యమంత్రి స్థానాన్నైతే సంపాదించుకోగలిగారు. కానీ ఆ స్థాయిలోనే ప్రజల నుంచి గౌరవం, ఆదరణ, మన్నన పొందుతున్నారా? సందేహమే.
ఈ చర్చ ఇప్పుడెందుకు వస్తోందంటే.. తాజాగా ఆయన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా చేసిన వ్యాఖ్యలు. అవి నిజంగానే చంద్రబాబు(Chandrababu) మనసులోంచి వచ్చాయా? లేక ఇంకోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారా? అంటే బదులుండదు. పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేయడంలోనూ బాబు గారు దిట్టే. తద్వారా పరిస్థితి ఏదైనా క్రెడిట్ మాత్రం తన ఖాతాలోనే పడేలా వ్యవహరిస్తూంటారు. సూపర్ సిక్స్ పేరుతో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలనే తీసుకుందాం.. అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా వాటి అమలు ఊసేలేదు. కానీ మాటలు మాత్రం బోలెడన్నిసార్లు మార్చేశారు.
ఒకసారేమో.. బటన్ నొక్కితే సరిపోతుందా? అంటారు.. ఇంకోసారి సూపర్ సిక్స్ అమలు చేస్తామని అంటారు. మరోపక్క ఢిల్లీలో కేజ్రీవాల్, ఏపీలో జగన్ మోడల్ సంక్షేమం విఫలమయ్యాయి అనేస్తారు. అలాగే.. సంపద సృష్టించకుండా ప్రజలకు డబ్బు పంచే హక్కు రాజకీయ నేతలకు ఎక్కడ? అని ప్రశ్నిస్తారు!. ఎన్నికల ముందు సంపద తాను సృష్టించగలనని గంభీర ఉపన్యాసాలు చేసేదీ ఈయనే.. అధికారంలోకి వచ్చాక సంపద ఎలా సృష్టించాలో తన చెవిలో చెప్పండని జనాన్ని అడిగేదీ ఈయనే కావడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.

ఇటీవలి అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ చేసిన ప్రసంగంలో చంద్రబాబు ఒక మాట చెప్పించారు. అదేమిటంటే 'ఒక వ్యక్తికి చేపలు ఇవ్వడం కాదని, చేపల వల ఇవ్వాలి" అనే సూక్తిని చంద్రబాబు అనుసరిస్తారని తెలిపారు. ఏమిటి దాని అర్థం? సంక్షేమ పథకాల వల్ల డబ్బు వృథా అవుతుందనా? ప్రజలకు నగదు పంపిణీ వల్ల నష్టమనే కదా? వీటిని సమర్థించే వారు కూడా ఉండవచ్చు. కానీ.. వారికి షాక్ ఇచ్చే తీరులో ఆ మరుసటి రోజే చంద్రబాబు అందరికన్నా తానే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తానని ప్రకటించారు. సూపర్‌సిక్స్ సహా హామీలన్నీ అమలు చేస్తానని కూడా ఆయన ప్రకటించేశారు. ఇందుకోసం ఏడాదికి రూ.1.5 లక్షల కోట్లు ఖర్చువుతుందని అంచనా.
జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా అమలు చేసిన సంక్షేమ పథకాలకు ఏటా రూ.70 వేల కోట్లు అవుతూంటేనే విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు అందుకు రెట్టింపు మొత్తాన్ని ఇస్తానంటే నమ్మగలమా?. గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి క్షీణించిందని అంటారు. మరి అలాంటప్పుడు అవే విధానాలను కొనసాగిస్తానని చెప్పడమే కాకుండా, జగన్ కంటే ఎక్కువ ఇస్తానని అనేవారా? కాదా? నాలుగుసార్లు సీఎం అయినా ఈ ఆర్థిక పరిస్థితి ఎప్పుడూ లేదని అంటారు. ఒకసారి పాత రికార్డులు తిరగేస్తే వాస్తవాలు తెలుస్తాయి!

👉1994లో తొలిసారి ఆర్దిక మంత్రి అయిన వెంటనే చంద్రబాబు చేసిన పని ఏమిటంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం అంతా నాశనం చేసేసిందంటూ శ్వేతపత్రాలు విడుదల చేయడం. ఆ తరువాత ఎన్టీఆర్‌ను సీఎం సీటు నుంచి లాగి పడేశాక కూడా అదే మాట.
👉1996 లోక్ సభ ఎన్నికల తర్వాత ఎన్టీఆర్ టైమ్‌లో ఉన్న మద్య నిషేధం, రెండు రూపాయలకు కిలో బియ్యం మొదలైన వాటిపై ప్రజాభిప్రాయ సేకరణ అంటూ ఒక తంతు నడిపి మొత్తం మార్చేశారు. లోక్ సభ ఎన్నికలలో మాత్రం మద్య నిషేధాన్ని కఠినతరం చేస్తామని ప్రచారం చేశారు.
👉2004 ఎన్నికల్లో కూడా ఇదే వ్యవహారం. అప్పటి వరకు విద్యుత్ సంస్కరణల పేరుతో ఛార్జీల పెంపు, 56 ప్రభుత్వ రంగ సంస్థల మూసివేత, జన్మభూమి కింద ప్రజల నుంచి ఆయా పనులకు డబ్బులు వసూలు చేయడం వంటివి చేశారు. ఎన్నికలు వచ్చాక కోటి వరాలు అంటూ ప్రజలకు స్కీములు ప్రకటించారు.
👉2009లో సైతం నగదు బదిలీతోసహా అనేక వాగ్దానాలు చేశారు. టీడీపీ వాగ్దానాల డొల్లతనాన్ని అప్పటి సీఎం రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో ఎండగట్టిన వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. 2004 నుంచి 2024 వరకు ఎన్ని విన్యాసాలు చేసింది తెలిసిన చరిత్రే.
తాను ప్రతిపక్షంలో ఉంటే ప్రజలంతా కష్టాలలో ఉన్నట్లు చెబుతారు. రైతుల రుణమాఫీతో సహా అన్ని సంక్షేమ పథకాలు ఇవ్వాలని అంటారు. అధికారంలోకి రాగానే అవన్ని వృధా ఖర్చు అని సూక్తులు చెబుతారు. తాజాగా తొమ్మిది నెలల పాలనలో కన్నా, అంతకుముందు ఏడాది జగన్ పాలన(YS Jagan Term)లో ఆర్థికాభివృద్ది రేటు, జీఎస్టీ, జీఎస్డీపీ వంటివి అధికంగా ఉన్నాయని లెక్కలు చెబుతున్నా, ఆయన మాత్రం తన పంథాలో విధ్వంసం జరిగిందని ఆరోపిస్తారు. అలాగని ఆ విధ్వంసం ఏమిటో వివరిసారా? ఊహూ లేదు!పడికట్టు పదాలతో, కొత్త కొటేషన్లతో జనాన్ని మాయ చేయగలిగితే చాలన్నది ఆయన విధానంగా కనిపిస్తుంది.
తాజాగా తల్లికి వందనం(Thalliki Vandanam) పథకాన్ని మే నెలలో అమలు చేస్తామని ప్రకటించారు. చేస్తారో లేదో ఇంకేమి మతలబు పెడతారో తెలియదు. కానీ.. ఏడాది కాలం ఈ పథకాన్ని ఎగవేసిన సంగతి దాచేస్తారు. పైగా మే నెలలో స్కూళ్లు తెరవరు. మరి ఏ ప్రాతిపదికన ఈ పథకానికి ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు చొప్పున ఇస్తారో చూడాలి మరి!. అదే కాదు. ఒక్క ఫించన్లు, అన్న క్యాంటిన్లు, అరకొర ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ తప్ప, మిగిలిన ఏ పథకం కూడా అమలు కాలేదు. వాటికి ఇంతవరకు షెడ్యూలే ఇవ్వలేదు. ప్రతి మహిళకు రూ.1500, నిరుద్యోగ భృతి కింద రూ.మూడు వేలు, రైతు భరోసా రూ.20 వేలు, బీసీలకు ఏభై ఏళ్లకే ఫించన్ తదితర హామీలను అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది తుంగలో తొక్కేశారు.

చంద్రబాబు భావన ప్రకారం.. గవర్నర్ స్పీచ్‌లో చెప్పించినట్లుగా అయితే ఈ స్కీములన్నీ చేపలే అవుతాయి. కాని, చేపలు పట్టే వలలు కావు కదా! వాటి మీద క్లారిటీతో చెప్పే ప్రయత్నం చేయరు. ఒకప్పుడు అసలు భారీ ప్రాజెక్టులంటేనే నమ్మకం లేని వ్యక్తి చంద్రబాబు. అవి వెంటనే పూర్తి కావని, ఎన్నికలకు ఉపయోగపడవన్నది ఆయన అభిప్రాయం. కాని ఎన్నికలకు ముందు భారీ సాగునీటి ప్రాజెక్టులకు మాత్రం జోరుగా శంకుస్థాపనలు చేస్తుంటారు. 1999 ఎన్నికలకు ముందు పలు సాగునీటి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి వదలివేస్తే, అప్పటి విపక్షనేత రాజశేఖర రెడ్డి ఆ ప్రాంతాలకు వెళ్లి పూలు పెట్టి వచ్చారు. తన హయాంలో పోలవరం, పులిచింతల ప్రాజెక్టులను చేపట్టడానికి కూడా సుముఖత చూపని చంద్రబాబు... వైఎస్ చొరవతో ముందుకు వెళ్లిన తరువాత పోలవరం తన కల అంటూ ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు కొత్తగా రూ. 85 వేల కోట్లతో ‘జల్ జీవన్’ మిషన్ కింద స్కీమును, రూ.80వేల కోట్లతో పోలవరం-బనకచర్ల స్కీమును అమలు చేస్తామని చెబుతున్నారు. వీటిలో ప్రైవేటు భాగస్వామ్యం ఉంటుందంటున్నారు. అవి ఎలా ముందుకు వెళుతాయన్నది ఎవరికి తోచిన విధంగా వారు ఊహించుకోవచ్చు.
సామాన్యుడికి మద్యం అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు చంద్రబాబు చెప్పడాన్ని పలువురు ఆక్షేపిస్తున్నారు. మద్యపానాన్ని నిరుత్సాహపరచవలసిన సీఎం అలా మాట్లాడితే ఎలా? అని విమర్శిస్తున్నారు. ఇక స్వర్ణాంధ్ర, విజన్ 2047, కొత్తగా పీ-4 వంటి అంశాలతో ప్రజలను ఊహాలోకాలలోకి తీసుకువెళ్లడానికి తన ప్రసగంలో అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ సోషల్ మీడియా యుగం వచ్చాక చంద్రబాబు మాయలన్ని తెలిసిసోతున్నాయి. అదే ఆయనకు సమస్యగా ఉంది. దాంతో సోషల్ మీడియా వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. చంద్రబాబు చిత్తశుద్దితో హామీలు అమలు చేస్తూ, నిర్మాణాత్మకంగా ప్రగతి వైపు ప్రభుత్వాన్ని నడిపితే సంతోషమే. కానీ ఆయన చేసే మాటల గారడీ రీత్యా ఆ పరిస్థితి కనబడడం లేదు.
:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత
Comments
Please login to add a commentAdd a comment