పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులపై కూటమి సర్కారు నిర్దయ
ప్రిలిమ్స్‌లోనూ అర్హత సాధించిన అభ్యర్థులు
కోర్టు కేసు, ఎన్నికలతో అప్పట్లో ఆగిన దేహదారుఢ్య పరీక్షలు
రెండునెలల క్రితం వాటి ప్రకటన జారీ
ఇప్పుడు వయసు మీరిందంటూ పలువురిని అనుమతించని అధికారులు
ఇదేం న్యాయమంటూ అభ్యర్థుల గగ్గోలు
అనంతపురం : పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులపట్ల టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్దయతో వ్యవహరిస్తోంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన పలువురిని దేహదారుఢ్య పరీక్షలకు అనుమతించకుండా తీరని అన్యాయం చేస్తోంది. రెండేళ్ల క్రితం ఇచ్చిన నోటిఫికేషన్ నాటికి వారు వయసు రీత్యా అర్హులే. కానీ.. కోర్టు కేసు, ఎన్నికల కారణంగా గతంలో దేహదారుఢ్య పరీక్షలు ఆగిపోయాయి. ఎన్నికల అనంతరం« అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వెంటనే ఈవెంట్స్ పెట్టి, నియామకాలు చేపట్టకుండా ఐదు నెలలపాటు కాలయాపన చేసింది. ఇప్పుడు వయసు మీరిపోయిందంటూ అనేకమందిని ఇళ్లకు పంపేస్తోంది.
వారు అర్హులైనప్పటికీ, వారి తప్పేమీ లేకపోయినప్పటికీ నిర్దయగా తిరస్కరిస్తోంది. దీంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇదేమిటని సెలక్షన్ అధికారులను అడిగితే.. తామేమీ చేయలేమని, ఏదైనా ఉంటే రిక్రూట్‌మెంట్ బోర్డుకు విన్నవించుకోవాలని సూచిస్తున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 411 ఎస్‌ఐ, 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎస్‌ఐ పోస్టులకు ప్రిలిమ్స్, దేహదారుఢ్య పరీక్షలు పూర్తయ్యాయి. కానిస్టేబుల్ పోస్టులకు 2023 జనవరి 22న ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించారు. తమ సర్వీసును సైతం పరిగణనలోకి తీసుకోవాలని హోంగార్డులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈవెంట్స్ (దేహదారుఢ్య పరీక్షలు) బ్రేక్‌పడింది. అనంతరం సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
అనంతరం.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐదునెలల పాటు ఈ పోస్టుల భర్తీని పట్టించుకోలేదు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులంతా మళ్లీ ఆన్‌లైన్‌లో ఈవెంట్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని రెండునెలల క్రితం ప్రకటించింది. అప్పట్నుంచి కష్టపడి దేహదారుఢ్య పరీక్షలకు సిద్ధమైన పలువురు అభ్యర్థులను వయసు మీరిందంటూ అనుమతించకపోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
అన్యాయమైన నిర్ణయం
దేహదారుఢ్య పరీక్షలు జనవరి 17న నిర్వహిస్తున్నట్లు హాల్‌టికెట్ ఇచ్చారు. అనంతపురంలోని నీలం సంజీవరెడ్డి స్టేడియానికి వెళ్లాక.. ‘మీకు వయసు అయిపోయింది. అర్హతలేద’ని చెప్పారు. నోటిఫికేషన్ జారీ సమయానికి వయసును పరిగణనలోకి తీసుకోవాలిగానీ అందుకు విరుద్ధంగా తీసుకుంటున్నారు. ఈ పరీక్షలకు నెలన్నర నుంచి సిద్ధమయ్యాను. తీరా ఇప్పుడు అర్హతలేదనడంతో కానిస్టేబుల్ కల చెదిరిపోతోంది. నాలాగ ఒక్క ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే 100 మంది వరకు అన్యాయానికి గురయ్యారు. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు మా విన్నపాన్ని పరిగణనలోకి తీసుకుని న్యాయం చేయాలి. – ఎన్. చంద్రశేఖర్, కానిస్టేబుల్ అభ్యర్థి, అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment