prelims
-
గ్రూప్–1 ప్రిలిమ్స్ వాయిదాకు హైకోర్టు నిరాకరణ
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 9న ఇంటెలిజెన్స్ బ్యూరో డిపార్ట్మెంట్ పరీక్ష ఉన్నందున గ్రూప్–1 ప్రిలిమ్స్ వాయిదా వేయాలన్న పిటిషనర్ల అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చి0ది. అయితే పిటిషనర్లు ఈ నెల 1న ఇచ్చిన వినతిపత్రాన్ని పరిశీలించి చట్టప్రకారం నిర్ణయం తెలియజేయాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సరీ్వస్ కమిషన్ (టీజీపీఎస్సీ)కు స్పష్టం చేసింది. పిటిషన్లో విచారణను ముగించింది. ఇంటెలిజెన్స్ బ్యూరో డిపార్ట్మెంట్ పరిధిలోని అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్– ఐఐ/ఎగ్జిక్యూటివ్ పోస్టుకు 2వ స్క్రీనింగ్ టెస్ట్ ఈ నెల 9న ఉందని, అదేరోజు నిర్వహిస్తున్న గ్రూప్–1 ప్రిలిమ్స్‌ను వాయిదా వేయాలని కోరుతూ ఎం.గణేశ్, భూక్యా భరత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ పుల్ల కార్తీక్ మంగళవారం విచారణ చేపట్టారు. టీజీపీఎస్సీ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ..‘గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి షెడ్యూల్ ముందుగానే ప్రకటించాం. 9న పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం. 4,03,645 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారందరూ పరీక్షకు సిద్ధమయ్యారు. కొందరి కోసం లక్షల మందిని ఇబ్బంది పెట్టడం...పరీక్ష వాయిదా వేయడం సాధ్యం కాదు. అయినా పిటిషనర్ల వినతిపత్రంపై అధికారులు చట్టప్రకారం నిర్ణయం తీసుకుంటారు’అని వెల్లడించారు. వాదనలు విన్న న్యాయమూర్తి...ఈ పిటిషన్లో మెరిట్స్‌లోకి వెళ్లడంలేదని, చట్టప్రకారం టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. -
APPSC Group 2 Prelims Result: గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
సాక్షి,విజయవాడ: గ్రూప్- 2 పరీక్ష ప్రిలిమ్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ బుధవారం(ఏప్రిల్10) ప్రకటించింది. ఫలితాలను ఏపీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. జులై 28న గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష జరగనుందని తెలిపింది. 1:100 నిష్పత్తిలో గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. గత ఏడాది డిసెంబర్ 7న గ్రూప్ -2 నోటిఫికేషన్ జారీ అయింది. ఫిబ్రవరి 25న గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డుస్ధాయిలో ఏడు వారాల్లో గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలీను ఏపీపీఎస్సీ ప్రకటించింది. రాష్డ్ర వ్యాప్తంగా 899 పోస్టులకి గ్రూప్-2 పరీక్షలను నిర్వహిస్తున్నారు. మొత్తం 4,04,037 మంది అభ్యర్ధులు గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్షలు రాయగా 92 వేల మంది క్వాలిఫై అయ్యారు. త్వరలోనే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫలితాలను కూడా ఏపీపీఎస్సీ ప్రకటించనుంది. ఇదీ చదవండి.. వాలంటీర్లకు గాలం వేయడం నీ తరం కాదు -
AP: గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్–1 స్క్రీనింగ్ పరీక్ష (ప్రిలిమ్స్) ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 301 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం 1,48,881 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఇక, ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్–2 పరీక్ష జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో పరీక్ష కేంద్రాల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించామని వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఇద్దరు పురుష, ఇద్దరు మహిళా పోలీసులు ఉంటారన్నారు. అలాగే పరీక్షల పర్యవేక్షణ కోసం ప్రతి జిల్లాకు ఒక ఐఏఎస్ అధికారిని ఇన్చార్జిగా నియమించామని తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రానికి జిల్లా స్థాయి సీనియర్ అధికారులను లైజన్ అధికారులుగా నియమించి పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలన్నారు. అలాగే అన్ని పరీక్ష కేంద్రాల్లోనూ నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీరు, ప్రథమ చికిత్స సౌకర్యాన్ని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ ద్వారా పరీక్షలు జరుగుతున్న తీరును నిరంతరం పర్యవేక్షించాలని ఏపీపీఎస్సీ అధికారులకు సూచించారు. పరీక్ష అనంతరం ఆన్సర్ షీట్లు, ఇతర సామగ్రిని కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. -
గ్రూప్–1 కొత్త నోటిఫికేషన్.. 563 ఖాళీల భర్తీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 563 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సోమవారం సాయంత్రం కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసింది. 503 గ్రూప్–1 ఉద్యోగ నియామకాల కోసం 2022 ఏప్రిల్ 26న జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. తాజా నోటిఫికేషన్ మేరకు 18 శాఖల్లో 563 పోస్టులకు సంబంధించిన ప్రిలిమ్స్ రాత పరీక్ష కోసం ఈ నెల 23 నుంచి ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కమిషన్ వెల్లడించింది. మార్చి 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. వాటిల్లో పొరపాట్లు సవరించుకునేందుకు మార్చి 23వ తేదీనుంచి 27వ తేదీ సాయంత్రం 5 వరకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. ప్రిలిమినరీ పరీక్షను ఈ ఏడాది మే లేదా జూన్ నెలలో నిర్వహించనున్నట్లు కమిషన్ తెలిపింది. మెయిన్ పరీక్షలను ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో నిర్వహించనున్నట్లు వివరించింది. పరీక్షలకు వారం రోజుల ముందు నుంచి పరీక్ష సమయం కంటే 4 గంటల ముందు వరకు వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. వివిధ కారణాలతో 2022లో విడుదల చేసిన గ్రూప్–1 నోటిఫికేషన్ రద్దు చేయగా... అప్పుడు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కూడా మళ్లీ తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని, ఫీజు మాత్రం చెల్లించక్కర్లేదని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్ (ఆప్టికల్ మార్కింగ్) లేదా సీబీఆర్టీ (కంప్యూటర్ బేస్డ్) పద్ధతిలో నిర్వహించనున్నట్లు తెలిపింది. పోస్టుల వారీగా అర్హతలు, పరీక్షల నిర్వహణ, మార్కులు, సిలబస్ తదితర పూర్తిస్థాయి వివరాలతో కూడిన నోటిఫికేషన్‌ను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. పెరిగిన పోస్టుల సంఖ్య మహిళలకు హారిజాంటల్ (సమాంతర) పద్ధతి (ప్రత్యేకంగా ఎలాంటి రోస్టర్ పాయింట్ మార్కింగ్ లేకుండా)లో రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఈ నేపథ్యంలో మహిళలకు కేటగిరీల వారీగా పోస్టులను ప్రత్యేకంగా రిజర్వ్ చేయలేదు. కానీ మొత్తంగా 33 1/3 (33.3) శాతం ఉద్యోగాలను మాత్రం కేటాయించనుంది. ఈ క్రమంలో మల్టీజోన్ల వారీగా పోస్టులు, అదేవిధంగా జనరల్ కేటగిరీతో పాటు కమ్యూనిటీ రిజర్వేషన్ల వారీగా ఉన్న పోస్టులను కమిషన్ వెల్లడించింది. తాజా నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్య 60 పెరగడం గమనార్హం. పరిస్థితులపై చర్చించి రద్దు నిర్ణయం గ్రూప్–1 ఉద్యోగ నియామకాల విషయంలో నెలకొన్న పరిస్థితులపై టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎం.మహేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కూలంకషంగా చర్చించామని, 2022 ఏప్రిల్ 26న జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్ నికొలస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. అసలేం జరిగిందంటే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా భారీ సంఖ్యలో గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ 2022 ఏప్రిల్ 26న నోటిఫికేషన్ జారీ చేసింది. అవకతవకలకు తావు లేకుండా ఉద్యోగాల భర్తీ కోసం అప్పటి ప్రభుత్వం ఇంటర్వ్యూలను రద్దు చేసింది. 503 ఉద్యోగాల కోసం ఏకంగా 3,80,081 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2022 అక్టోబర్ 16న గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షలను నిర్వహించింది. అదే ఏడాది చివర్లో పెద్ద సంఖ్యలో అభ్యర్థులకు అవకాశం కల్పించే లక్ష్యంతో 1:50 నిష్పత్తిలో అర్హుల జాబితాను విడుదల చేసింది. 2023 ఏడాది ఆగస్టులో మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించడంతో అభ్యర్థులు కఠోర దీక్షతో సన్నద్ధతను ప్రారంభించారు. కానీ గతేడాది మార్చిలో పలు టీఎస్పీఎస్సీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగు చూసింది. గ్రూప్–1 ప్రశ్నపత్రాలు సైతం బయటకు వెళ్లాయని తేలడంతో ప్రిలిమినరీ పరీక్షను కమిషన్ రద్దు చేసింది. 2023 జూన్ 11న మరోమారు ప్రిలిమ్స్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అయితే రెండోసారి టీఎస్పీఎస్సీ ప్రిలిమ్స్ నిర్వహించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. పరీక్ష నిర్వహణలో లోపాలు జరిగాయని నిర్ధారిస్తూ హైకోర్టు పరీక్ష రద్దుకు ఆదేశించింది. దీనిపై టీఎస్పీఎస్సీ సుప్రీకోర్టును ఆశ్రయించింది. అ తర్వాత రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగడం, కా>ంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేపట్టడం, కొత్త కమిషన్‌ను ఏర్పాటు చేయడం, కొత్తగా మరో 60 గ్రూప్–1 ఖాళీలను గుర్తించడం లాంటి పరిణామాలు వరుసగా చోటు చేసుకున్నాయి. తాజాగా గ్రూప్–1 నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించడంతో గత కొంతకాలంగా నెలకొన్న గందరగోళానికి తెరపడింది. పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతించినట్లు కమిషన్ తెలిపింది. అయితే గత నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన టీఎస్పీఎస్సీ..ఏ కారణాలతో రద్దు చేసిందీ పూర్తిస్థాయిలో వివరించలేదు. ప్రిలిమ్స్ మూడోసారి..! రికార్డు స్థాయిలో గ్రూప్–1 ఉద్యోగ ఖాళీలు ఉండడంతో గతంలో నిరుద్యోగులు ఎన్నో ఆశలతో దరఖాస్తు చేసుకున్నారు. కానీ కఠోర దీక్షతో అభ్యర్థులు పడిన శ్రమ వృథా ప్రయాసే అయ్యిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నోటిఫికేషన్ వెలువడి దాదాపు రెండు సంవత్సరాలు కాగా.. అభ్యర్థులు ఇప్పటికే రెండుసార్లు ప్రిలిమినరీ పరీక్షలు రాయడం గమనార్హం. కాగా కొత్త నోటిఫికేషన్ జారీతో మూడోసారి ప్రిలిమ్స్ రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
గ్రూప్–2 ప్రిలిమ్స్‌కు సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి: ఈ నెల 25న నిర్వహించనున్న గ్రూప్–2 ప్రిలిమ్స్‌కు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 14 నుంచి హాల్‌టికెట్ల జారీ మొదలుకాగా ఇప్పటివరకు దాదాపు 3.40 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. కాగా ఈ నెల 25న ప్రిలిమ్స్ పరీక్ష రోజే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మెయిన్స్ పరీక్ష ఉంది. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ ఉన్నతాధికారులు.. ఎస్బీఐ ఉన్నతాధికారులతో ఈ అంశంపై చర్చించారు. దీంతో గ్రూప్–2తో పాటు ఎస్బీఐ పరీక్ష రాసే అభ్యర్థులకు మార్చి 4న పరీక్ష నిర్వహించేందుకు బ్యాంకు అంగీకారం తెలిపింది. దీంతో గత కొన్నిరోజులుగా ఈ అంశాన్ని సాకుగా చూపి గ్రూప్ –2 పరీక్షను వాయిదా వేయించాలని కొన్ని రాజకీయ పక్షాలు చేసిన ప్రయత్నాలకు అడ్డుకట్ట పడింది. అడ్డంకులన్నీ తొలగడంతో ముందే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గ్రూప్–2 ప్రిలిమ్స్‌ను నిర్వహించనున్నారు. 4,83,525 మంది దరఖాస్తు.. గ్రూప్–2 పరీక్షల షెడ్యూల్‌ను గత డిసెంబర్ 7న ఏపీపీఎస్సీ ప్రకటించింది. మొత్తం 899 పోస్టులకు 4,83,525 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 15న ఎస్బీఐ ప్రిలిమ్స్ ఫలితాలను వెల్లడించింది. ఫిబ్రవరి 25, మార్చి 4ను మెయిన్స్ తేదీలుగా ప్రకటించింది. దీంతో కొన్ని రాజకీయ పక్షాలు ఫిబ్రవరి 25న గ్రూప్–2 ప్రిలిమ్స్ నిర్వహిస్తే అదే రోజు ఎస్బీఐ, గ్రూప్స్ రెండు పరీక్షలు రాసే అభ్యర్థులు నష్టపోతారని ప్రచారం మొదలుపెట్టాయి. దీనివల్ల 5 వేల మందికి పైగా నష్టం కలుగుతుందన్నాయి. అభ్యర్థుల వివరాలు పంపండి.. ఈనెల 25న గ్రూప్–2 ప్రిలిమ్స్‌తోపాటు ఎస్బీఐ మెయిన్స్ రాసే అభ్యర్థులు తమ వివరాలను తమకు పంపాలని ఏపీపీఎస్సీ ఒక ప్రకటనలో కోరింది. అభ్యర్థులు తమ వివరాలను ఈ నెల 19 రాత్రి 12 గంటల లోగా appschelpdesk@gmail.com కు మెయిల్ చేయాలని సూచించింది. ఎస్బీఐకి లేఖ రాసిన ఏపీపీఎస్సీ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఏపీపీఎస్సీ అధికారులు.. ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్‌కు లేఖ రాశారు. ఏపీపీఎస్సీ గ్రూప్–2 ప్రిలిమ్స్ తేదీని డిసెంబర్లోనే ప్రకటించామని తెలిపారు. ఈ పరీక్షకు 4,83,525 మంది చేసుకున్నారని, పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తిచేశామని వివరించారు. ఈ నేపథ్యంలో గ్రూప్–2తో పాటు ఎస్బీఐ మెయిన్స్ రాసే అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా మార్చి 4న జరిగే ఎస్బీఐ స్లాట్‌లో వారికి అవకాశం కల్పించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎస్బీఐ అధికారులు.. ఈనెల 25న గ్రూప్–2 ప్రిలిమ్స్‌కు హాజరయ్యే ఎస్బీఐ అభ్యర్థులకు మార్చి 4న జరిగే స్లాట్‌లో అవకాశం కల్పించేందుకు అంగీకరించారు. దీంతో రెండు పరీక్షలు రాసే అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ సేకరిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటివరకు గ్రూప్–2తో పాటు ఎస్బీఐ పరీక్ష కూడా రాసేవారు 14 మంది ఉన్నట్టు తేలింది. పరీక్ష నాటికి ఎంత మంది అభ్యర్థులు ఉంటే వారందరి వివరాలను ఏపీపీఎస్సీ.. ఎస్బీఐకి అందించనుంది. దీంతో గ్రూప్–2 ప్రిలిమ్స్‌ను యధావిధిగా నిర్వహించనున్నారు. -
TSPSCపై హైకోర్టు ఆగ్రహం.. విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై తెలంగాణ హైకోర్టు నేడు(మంగళవారం) విచారణ చేపట్టింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష విషయంలో ఎన్నిసార్లు నిర్లక్ష్యం వహిస్తారంటూ టీఎస్పీఎస్సీ కమిషన్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలు మీరే ఉల్లంఘిస్తే ఎలా అంటూ మండిపడింది. ఒకసారి పేపర్ లీక్, ఇప్పుడేమో బయోమెట్రిక్ సమస్య పేరుతో విద్యార్థుల జీవితాలో ఆడుకుంటున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. గ్రూప్-1 పరీక్షలో బయోమెట్రిక్ ఎందుకు పెట్టలేదని హైకోర్టు ప్రశ్నించింది. పరీక్షల నిర్వహణలో టీఎస్పీఎస్సీ విఫలం అయ్యిందని, రెండోసారి కూడా నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యం వహించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై పూర్తి వివరాలు సమర్పించాలని టీఎస్పీఎస్సీని ఆదేశిస్తూ తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. కాగా జూన్‌లో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ ఈనెల 23న హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను టీఎస్పీఎస్సీ ఆశ్రయించింది. వాస్తవానికి 11 ఏళ్ల తర్వాత గతేడాది అక్టోబరు 16న తొలిసారి ప్రిలిమ్స్ నిర్వహించారు. తరువాత ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం వెలుగుచూడటంతో కమిషన్ ఆ పరీక్షను రద్దు చేసింది. తరువాత మళ్లీ ఈ ఏడాది జూన్ 11న ప్రిలిమ్స్ నిర్వహించగా.. ఈ పరీక్షను కూడా రద్దు చేస్తున్నట్లు ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ రెండుసార్లు రద్దవడంతో ఇటు అభ్యర్థులతోపాటు కమిషన్లోనూ తీవ్ర ఆందోళన నెలకొంది. చదవండి: ట్యాంక్ బండ్‌పై భారీగా ట్రాఫిక్ జామ్ -
గ్రూప్–1 అభ్యర్థుల్లో గుబులు!
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష మరోసారి రద్దుకావడం కలకలం రేపుతోంది. ఇప్పటికే ఓసారి రద్దుకావడంతో రెండోసారి పరీక్ష రాయాల్సి వచ్చిందని, ఇప్పుడు మళ్లీ పరీక్ష రాయాలంటే ఎలాగని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ కష్టపడి చదివామని, వేలు, లక్షలు ఖర్చుపెట్టి శిక్షణ తీసుకున్నామని.. ఇప్పుడంతా వృధా అయినట్లే అని ఆవేదన చెందుతున్నారు. మళ్లీ ప్రిలిమ్స్ నిర్వహించినా అది ఎప్పుడు ఉంటుందో, అప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందోనని వాపోతున్నారు. లీకేజీతో ఓసారి.. నిర్లక్ష్యంతో మరోసారి వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 503 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి గతేడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్ జారీకాగా.. 3,80,081 మంది దరఖాస్తు చేసుకున్నారు. టీఎస్పీఎస్సీ గతేడాది అక్టోబర్ 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి మెయిన్స్ పరీక్ష తేదీలను కూడా ప్రకటించింది. కానీ టీఎస్పీఎస్సీ కార్యాలయం నుంచి ప్రశ్నపత్రాలు లీకైన వ్యవహారం బయటపడటంతో గ్రూప్–1 ప్రిలిమ్స్‌ను పరీక్షను రద్దు చేసింది. మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులు ఈ నిర్ణయంతో గందరగోళంలో పడ్డారు. ఆ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అందరికీ తిరిగి జూన్ 11న ప్రిలిమ్స్ పరీక్షలను నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ క్రమంలో రెండోసారి ప్రిలిమ్స్‌కు 3,09,323 మంది హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోగా.. 2,33,248 మంది పరీక్ష రాశారు. ఈసారి ప్రిలిమ్స్ నిర్వహణ లోపభూయిష్టంగా, అక్రమాలకు తావిచ్చేలా ఉందని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. రెండో ప్రిలిమ్స్‌నూ రద్దు చేయాలని సర్కారును ఆదేశించింది. రద్దయితే వచ్చే ఏడాదే? గ్రూప్–1 ప్రిలిమ్స్ రద్దు తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీలు చేయాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. ఒకవేళ రద్దు తీర్పును డివిజన్ బెంచ్ సమర్థిస్తే.. మూడోసారి ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించాల్సి వస్తుంది. ఇదే జరిగితే ఇప్పట్లో ప్రిలిమ్స్ నిర్వహణ సాధ్యంకాకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిబంధనల ప్రకారం.. పరీక్ష కోసం కనీసం రెండు నెలల గడువు ఇస్తూ తేదీని ప్రకటించాల్సి ఉంటుంది. వచ్చే నెలలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వస్తుందని ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వస్తే తర్వాత రెండు నెలల పాటు అధికార యంత్రాంగం ఎన్నికల పనిలోనే బిజీగా ఉంటుంది. ఈ క్రమంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య గ్రూప్–1 ప్రిలిమ్స్ నిర్వహించడం కష్టమనే అభిప్రాయం ఉంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోక్‌సభ ఎన్నికలూ జరగాల్సి ఉంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది మే వరకు గ్రూప్–1 పరీక్షలు వాయిదాపడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థులు ఆగమాగం గతేడాది ఏప్రిల్‌లో గ్రూప్–1 నోటిఫికేషన్ రావడంతోనే లక్షలాది మంది అభ్యర్థులు పరీక్షలకు సిద్ధమవడంపై దృష్టిపెట్టారు. చిన్నపాటి ఉద్యోగాలు చేస్తున్నవారు అది మానేసి, కొందరు దీర్ఘకాలిక సెలవులు పెట్టి పరీక్ష కోసం శిక్షణ తీసుకున్నారు. దీనికితోడు ఏళ్లుగా పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నవారు మరింత ఫోకస్ పెట్టారు. పకడ్బందీగా చదువుకుని ప్రిలిమ్స్ పరీక్షలు రాశారు. కానీ లీకేజీ వ్యవహారంతో పరీక్ష రద్దుకావడంతో నిరుత్సాహానికి గురయ్యారు. అయితే టీఎస్పీఎస్సీ వేగంగా చర్యలు చేపట్టి, తిరిగి ప్రిలిమ్స్ నిర్వహించే తేదీని ప్రకటించడంతో.. అభ్యర్థులంతా ఎంతో ఆశతో రెండోసారి పరీక్ష కోసం సిద్ధమయ్యారు. అలా ఈ ఏడాది జూన్ 11న పరీక్ష రాశారు. ఫలితాల విడుదల, మెయిన్స్‌కు 1ః50 నిష్పత్తిలో ఎంపిక జాబితా కోసం ఎదురుచూస్తున్న తరుణంలో.. తాజాగా హైకోర్టు తీర్పుతో దిక్కుతోచని స్థితి లో పడ్డారు. మూడోసారి పరీక్ష కోసం చదవాల్సి రావడమేంటన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ పరీక్ష రాయాలంటే భయంగా ఉంది గ్రూప్–1 ఉద్యోగం సాధించాలని రెండేళ్లుగా సన్నద్ధమవుతున్నాను. ప్రిలిమ్స్ రద్దు తో సమయం, డబ్బు వృథా అయ్యాయి. మరోసారి పరీక్ష రాయాలంటేనే భయం వేస్తోంది. పరీక్ష నిర్వహణలో టీఎస్పీఎస్సీ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకసారి లీకేజీ, మరోసారి నిర్వహణ లోపాలతో రద్దు చేశారు. మొదటిసారి ప్రశ్నపత్రంలో 5 ప్రశ్నలు, రెండోసారి 7 ప్రశ్నలు తొలగించారు. ఇంత నిర్లక్ష్యమైతే ఎలా? – బి.అనిల్ కుమార్, హనుమకొండ -
పేపర్లు లీక్ చేసి రూ.వేల కోట్లకు అమ్ముకున్నారు!
సాక్షి, పెద్దపల్లి: టీఎస్పీ ఎస్సీ పరీక్ష పేపర్లు లీక్‌చేసి రూ.వేల కోట్లకు అమ్ముకున్న గజదొంగ కేసీఆర్ అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఉద్యోగ నోటి ఫికేషన్ల పేరిట రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిన కేసీఆర్‌ను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని పార్టీ శ్రేణులను కోరారు. శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లా డారు. జూన్ 11న టీఎస్పీఎస్సీ రెండోసారి నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమ్స్‌ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు టీఎస్పీ ఎస్సీ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. పేపర్ల లీకేజీ సూత్రధారులు ముఖ్యమంత్రి కార్యాల యంలోనే ఉన్నారని ఆరోపించారు. గ్రూప్–1 ప్రిలిమ్స్‌కు హాజరైన వారికంటే అదనంగా 270 ఓఎంఆర్ షీట్లు ఎలా వచ్చాయో ఆ సంస్థ చైర్మన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశా రు. చైర్మన్ జనార్దన్‌రెడ్డి, సభ్యులను తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి హనుమయ్య, కార్యదర్శి దేవునూరి సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
AP: గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రశాంతం
సాక్షి, అమరావతి: గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఏపీపీఎస్సీ పకడ్బందీగా ఏర్పాట్లు చేయడంతో కేవలం ఒక్క చోట స్వల్ప ఘటన మినహా సజావుగా పూర్తయ్యాయి. 2022 గ్రూప్–1 పరీక్షకు 1,26,449 మంది రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 1,06,473 మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోగా 87,718 మంది (82.38 శాతం) పరీక్ష రాశారు. గతంలో జరిగిన 2018 గ్రూప్–1 పరీక్షకు 73 శాతం మంది పరీక్షకు హాజరు కాగా ఈసారి మరింత పెరిగింది. రెవెన్యూ, పోలీసు శాఖల సహకారంతో ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ ధన్యవాదాలు తెలిపారు. ప్రశ్నల సరళి ఎలా ఉందంటే...? ఈసారి నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో ప్రశ్నలు అత్యున్నత ప్రమాణాలతో ఆయా అంశాలపై అభ్యర్థుల సమగ్ర అవగాహన, పరిజ్ఞానాన్ని పరీక్షించేలా ఉన్నాయని పలువురు నిపుణులు, అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఎక్కడా డైరెక్ట్ ప్రశ్నలు లేవన్నారు. ఈదఫా గ్రూప్–1 ప్రిలిమ్స్ ప్రశ్నలు సివిల్స్ తరహాలో ఉన్నాయని గతంలో గ్రూప్–1 పరీక్షకు హాజరు కావడంతోపాటు సివిల్స్‌లో సైతం ఇంటర్వ్యూ వరకు వెళ్లిన ఓ అభ్యర్థి తెలిపారు. పేపర్ 1లో ఇచ్చిన 120 ప్రశ్నల్లో ఆరు మినహా తక్కినవన్నీ ఆయా అంశాలపై పూర్తి అవగాహన ఉన్నవారే కచ్చితమైన సమాధానం రాయగలుగుతారని చెప్పారు. పేపర్ 1, 2లో ప్రశ్నలకు ఇచ్చిన బహుళైచ్చిక సమాధానాలన్నీ సరైనవే అన్నట్లుగా ఉన్నాయని విశాఖలో తొలిసారి ఈ పరీక్షకు హాజరైన ఓ యువతి పేర్కొంది. సబ్జెక్టుపై పూర్తి అవగాహనతోపాటు క్షుణ్ణంగా అర్థం చేసుకొన్న వారే సరైన సమాధానం గుర్తించగలిగేలా ప్రశ్నలు అడిగారని తెలిపారు. పేపర్ 1 కంటే పేపర్ 2లో ప్రశ్నలు కష్టం గా ఉన్నాయని చెప్పారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆప్టిట్యూడ్ ప్రశ్నలకు సరైన సమాధానాలు కనుక్కోవడం ఇబ్బంది అయిందని మరో అభ్యర్థి పేర్కొన్నారు. పేపర్ 2 లో జనరల్ స్టడీస్ అంశాలు పూర్తిగా గత ఏడాదిలో చోటు చేసుకున్న పరిణామాల పరిధిలోనివేనని తెలిపారు. గతంలో అనువాదం సరిగాలేక తప్పులు దొర్లడంతో తెలుగు మీడియం అభ్యర్థులకు నష్టం వాటిల్లిందని, ఈసారి మాత్రం తెలుగు అనువాదంలో ఎక్కడా తప్పులు దొర్లలేదని పలువురు అభ్యర్థులు వెల్లడించారు. 1 : 50లో మెయిన్స్‌కు అవకాశమివ్వాలని వినతి ఉన్నత ప్రమాణాలతో గ్రూప్–1 ప్రిలిమ్స్ నిర్వహించారని, దీనివల్ల మంచి పరిజ్ఞానం, నైపుణ్యం ఉన్నవారు అర్హత సాధించగలుగుతారని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే మెయిన్స్‌కి ఎక్కువ మందికి అవకాశం కల్పించాలని నిపుణులతో పాటు అభ్యర్థులు కోరుతున్నారు. గతంలో గ్రూప్–1 ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కి 1 : 50 చొప్పున అనుమతించేవారు. అయితే టీడీపీ హయాంలో దాన్ని మార్పు చేసి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కి ఏ మేరకు అభ్యర్థులను ఎంపిక చేయాలో నిర్ణయం తీసుకునే అధికారాన్ని కమిషన్‌కి కట్టబెట్టారు. గత ప్రభుత్వ హయాంలో 2018 గ్రూప్–1లో 1 : 50 ప్రకారం కాకుండా 1 : 12కి తగ్గించి అభ్యర్థులకు మెయిన్స్‌కి అవకాశమిచ్చారు. దీనివల్ల అనేకమంది ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కి అవకాశం లభించక నష్టపోయారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ బీసీ తదితర రిజర్వుడ్ కేటగిరీల అభ్యర్థులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ వర్గాల అభ్యర్థులు మెరిట్ మార్కులతో జనరల్ కేటగిరీలో చేరాల్సి ఉన్నా వారిని కేవలం వారి కేటగిరీకే పరిమితం చేశారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ తరువాత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక అదే మెయిన్స్‌ను కోర్టు ఆదేశాలతో మళ్లీ నిర్వహించాల్సి రాగా 1 : 50 చొప్పున అవకాశం ఇచ్చారని అభ్యర్థులు గుర్తు చేస్తున్నారు. దీనివల్ల అంతకు ముందు అవకాశం కోల్పోయిన వారు మెయిన్స్ రాయడంతో పాటు అందులో మెరిట్లో నిలిచారని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి కూడా ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కి 1 : 50 ప్రకారం అవకాశం ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు. విజయవాడలో పట్టుబడ్డ అభ్యర్థి: విజయవాడ బెంజి సర్కిల్ సమీపంలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఆదివారం గ్రూప్–1 పరీక్షలో కాపీ కొడుతూ పట్టుబడ్డ ఓ అభ్యర్థిపై కేసు నమోదైంది. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకికి చెందిన కె.వెంకటేష్ లోదుస్తుల్లో దాచిన సెల్ఫోన్లో జవాబులు చూసి రాస్తుండగా ఇన్విజిలేటర్లు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. -
రేపు ఏపీలో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష
-
జనవరి 8న గ్రూప్–1 ప్రిలిమ్స్
సాక్షి, అమరావతి: గ్రూప్–1 పోస్టుల భర్తీకి ప్రిలిమ్స్ పరీక్షను జనవరి 8న నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. పాలనా కారణాలతో డిసెంబర్ 18న జరగాల్సిన ఈ పరీక్షను వాయిదా వేస్తున్నామన్నారు. డిసెంబర్ 17 నుంచి 20 తేదీ వరకు బ్యాంకింగ్ పరీక్షలు జరగనున్నందున అభ్యర్థుల మేలు కోసం గ్రూప్–1 పరీక్షలను వాయిదా వేసినట్లు తెలిపారు. గ్రూప్–1 పోస్టుల నియామక ప్రక్రియను 9 లేదా 10 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్లతో పాటు త్వరలో వెలువరించనున్న వాటికీ నియామక ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ‘సాక్షి’కి వివరించారు. ఇప్పటికే ప్రభుత్వం అనుమతులిచ్చిన అనేక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేశామని గుర్తు చేశారు. వీటిలో కొన్నింటికి పరీక్షలు నిర్వహించి ఫలితాలను కూడా ప్రకటించామని తెలిపారు. సవాంగ్ ఇంకా ఏం చెప్పారంటే.. పకడ్బందీ ప్రణాళికతో ముందుకు.. గ్రూప్–1తో సహా అన్ని పోస్టుల భర్తీలో ఎక్కడా జాప్యం లేకుండా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. న్యాయవివాదాలు, పలుమార్లు ఫలితాల వెల్లడి, మెయిన్స్ మూల్యాంకనం రెండుసార్లు నిర్వహించాల్సి రావడం వంటి కారణాలతో 2018 గ్రూప్–1 పోస్టుల భర్తీ ప్రక్రియలో జాప్యం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వ చొరవతో ఆ న్యాయ వివాదాలన్నింటినీ పరిష్కరించి ఆ పోస్టులను భర్తీ చేశాం. సెప్టెంబర్ 30న గ్రూప్–1 కొత్త నోటిఫికేషన్ ఇచ్చాం. దీనిద్వారా 92 గ్రూప్–1 పోస్టులను భర్తీ చేస్తాం. గత గ్రూప్–1 నోటిఫికేషన్లో భర్తీ కాని పోస్టులు ఈ కొత్త నోటిఫికేషన్లో చేరతాయి. దీంతో ప్రస్తుత నోటిఫికేషన్‌లోని పోస్టుల సంఖ్య కొంత పెరిగే అవకాశముంది. కొన్ని పొరపాట్లతో అప్పటి గ్రూప్–1 పోస్టులకు వయోపరిమితి మించిపోయి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. అలాంటి వాటికి ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. గ్రూప్–1 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 2తో ముగిసినా 5 వరకు అవకాశం ఇచ్చాం. దీంతో 1.26 లక్షల దరఖాస్తులు వచ్చాయి. త్వరలో గ్రూప్–2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తాం. ఈ పోస్టుల భర్తీకి సీఎం అనుమతి కూడా ఇచ్చారు. అత్యంత ప్రతిభావంతుల ఎంపిక ఏపీపీఎస్సీ పకడ్బందీ చర్యలతో వివిధ కేడర్ పోస్టుల్లో అత్యంత ప్రతిభావంతులు ఎంపికవుతున్నారు. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా 2018 గ్రూప్–1 పోస్టులకు అత్యంత ప్రతిభావంతులు ఎంపికయ్యారు. 2018 గ్రూప్–1 మెయిన్స్ డిజిటల్ వాల్యుయేషన్‌పై న్యాయ వివాదం ఏర్పడడంతో హైకోర్టు ఆదేశాల మేరకు మాన్యువల్‌గా 55 రోజుల్లో మూల్యాంకనాన్ని పూర్తి చేయించాం. ఇంటర్వ్యూలను గతంలో మాదిరి ఒక్క బోర్డుతో కాకుండా మూడు బోర్డులతో నిర్వహించాం. గతంలో కమిషన్ చైర్మన్ ఆధ్వర్యంలో ఒకే బోర్డుతో వీటిని నిర్వహించేవారు. ఇప్పుడు మూడు బోర్డుల్లోనూ కమిషన్ సభ్యులతోపాటు ఇద్దరు చొప్పున సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, సబ్జెక్టు నిపుణులుగా యూనివర్సిటీ వీసీ/విశ్రాంత వీసీలను నియమించాం. దీంతో 11 రోజుల్లోనే ఇంటర్వ్యూలను పూర్తిచేశాం. ఐఏఎస్‌కు ఎంపికైననలుగురు, ఐపీఎస్‌కు ఎంపికైన ఇద్దరు ఈ గ్రూప్–1 పోస్టులకు ఎంపికయ్యారు. సాధ్యమైనంత త్వరగా పోస్టుల భర్తీ ఈసారి గ్రూప్–1 పోస్టులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నాం. ముఖ్యంగా న్యాయపరమైన అవాంతరాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇందుకు అనుగుణంగా నిర్దిష్ట విధానాలను రూపొందించాం. సాధ్యమైనంత త్వరగా పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తాం. ప్రభుత్వం నుంచి కూడా çసహకారాలు అందుతున్నాయి. -
గ్రూప్–1 ప్రిలిమ్స్ కటాఫ్ తీరే వేరు!
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షలకు సమయం దగ్గర పడుతోంది. జూలై లేదా ఆగస్టులో ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఇప్పటికే నోటిఫికేషన్లో వెల్లడించింది. పరీక్షల గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థులు కూడా మరింత సన్నద్ధతతో దీక్ష చేస్తున్నారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికే మెయిన్ పరీక్షలకు అవకాశం ఉంటుంది. ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్ పరీక్షలకు ఎంపిక చేయనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ప్రస్తుతం భర్తీ చేయనున్న 503 గ్రూప్–1 ఉద్యోగాలకు రాష్ట్రవ్యాప్తంగా 25,150 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధిస్తారు. దీంతో ఎక్కువ మార్కులు సాధించిన వారికే మెయిన్స్‌కు అవకాశం దక్కనుండగా.. ఈ ఎంపిక విధానంలోనూ టీఎస్పీఎస్సీ మల్టీజోన్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, జెండర్, ఈడబ్ల్యూఎస్, డిజేబుల్, స్పోర్ట్స్ కేటగిరీలో మెరిట్ ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఒక్కో పోస్టుకు 700 మంది... ఇప్పటివరకు గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో జనరల్ మెరిట్ ప్రకారం ఎంపిక జరిగేది. దీంతో కటాఫ్ మార్కులు ఒక సంఖ్య దగ్గర ఆగిపోయేవి. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత స్థానిక అభ్యర్థులకే ఉద్యోగాలు దక్కాలనే ఉద్దేశంతో తెచ్చిన నూతన జోనల్ విధానంతో ఎంపిక విధానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో గ్రూప్–1 కటాఫ్ మార్కులు ఒక్కో జోన్లో, ఒక్కో కేటగిరీలో ఒక్కో రకంగా ఉండనున్నాయి. రాష్ట్రంలో రెండు మల్టీ జోన్లు ఉండగా.. ఒక్కో మల్టీజోన్‌లో కటాఫ్ మార్కులు ఒక్కోలా ఉంటాయి. అదేవిధంగా రిజర్వేషన్లు, జెండర్ ప్రకారం కటాఫ్ మార్కులు మరోవిధంగా ఉంటాయి. గ్రూప్–1 కొలువులకు ఇప్పటివరకు 3.5 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. మరో రెండ్రోజుల్లో దరఖాస్తులు మరిన్ని వచ్చే అవకాశముంది. ప్రస్తుత గణాంకాల ప్రకారం చూస్తే ఒక్కో పోస్టుకు సగటున 700 మంది పోటీపడుతున్నారు. పోటీ ఎక్కువగా ఉండటం, కటాఫ్ నిర్ధారణలోనూ జోన్ల వారీగా వేర్వేరుగా ఉండటంతో అభ్యర్థులు మరింత కఠిన సాధన చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రిలిమ్స్ మార్కులను కేవలం మెయిన్ పరీక్షల ఎంపిక వరకే పరిగణిస్తామని, తుది ర్యాంకింగ్‌లో వీటిని పరిగణించబోమని టీఎస్పీఎస్సీ ఇప్పటికే స్పష్టం చేసింది. కటాఫ్ ఇలా... అభ్యర్థుల స్థానికత ఆధారంగా మల్టీజోన్లను కేటాయిస్తారు. ఈ క్రమంలో గ్రూప్–1 మెయిన్స్‌కు ఎంపిక రెండు మల్టీజోన్ల ఆధారంగా చేపడతారు. ఆ తర్వాత రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, డిజేబుల్, స్పోర్ట్స్ రిజర్వేషన్లను అమలు చేస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దీంతో కటాఫ్ మార్కులు ఒక్కో జోన్లో ఒక్కో రకంగా ఉంటాయి. ఉదాహరణకు మల్టీజోన్–1లోని బీసీ–ఏ కేటగిరీలో ఎంపికైన అభ్యర్థి మార్కులు.. మల్టీజోన్–2లో బీసీ–ఏ కేటగిరీలో ఎంపికైన అభ్యర్థి మార్కులు ఒకేరకంగా ఉండవు. ఇదే తరహాలో మిగిలిన కేటగిరీల్లో ఒక్కో జోన్లో కటాఫ్ మార్కులు ఒక్కోవిధంగా ఉండనున్నాయి. గ్రూప్–1 ఒక్క పోస్టుకు 756 మంది పోటీ.. మొత్తం దరఖాస్తులు 3,80,202 రాష్ట్ర సివిల్ సరీ్వసుగా చెప్పుకునే గ్రూప్–1 కొలువుకు పోటీ విపరీతంగా ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలిసారిగా చేపడుతున్న గ్రూప్–1 ఉద్యోగాలను దక్కించుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగానే కుస్తీ పడుతున్నారు. పలు ప్రభుత్వ శాఖల్లో గ్రూప్–1 కేటగిరీలో ఉన్న 503 ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ ఏప్రిల్ నెలాఖరులో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మే 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. జూన్ 4 నాటికి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగియగా 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తులు సమరి్పంచినట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఇందులో పురుషులు 2,28,951, మహిళలు 1,51,192, ట్రాన్స్జెండర్లు 59 ఉన్నారు. ఇక డిజేబుల్ కేటగిరీలో 6,105, ప్రభుత్వ ఉద్యోగులు 51,553 మంది ఉన్నారు. ఈక్రమంలో ఒక్కో ఉద్యోగానికి సగటున 756 మంది పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. జూలై లేదా ఆగస్టు నెలలో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు, డిసెంబర్లో మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ఇప్పటికే నోటిఫికేషన్లో తెలిపింది. ఇదివరకు ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన 312 గ్రూప్–1 ఉద్యోగాలకు 3 లక్షల దరఖాస్తులు వచ్చాయి. -
మీ తప్పులకు మేము బలవ్వాలా?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) అడ్డగోలు నిబంధనలు విధిస్తూ, వాటిని తరచూ మార్పు చేస్తూ తమ జీవితాలతో చెలగాటమాడుతోందని అభ్యర్థులు మండిపడుతున్నారు. ఏపీపీఎస్సీ తప్పులకు తాము బలవ్వాలా అని నిలదీస్తున్నారు. ఇప్పటికే మే 26న జరిగిన గ్రూప్–1 ప్రిలిమ్స్‌కు సంబంధించి కమిషన్ నిర్ణయంతో అన్యాయం జరిగిందని పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గతేడాది డిసెంబర్ 31న విడుదల చేసిన గ్రూప్–1 నోటిఫికేషన్లో నాన్ ప్రోగ్రామబుల్ క్యాలిక్యులేటర్‌ను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఇస్తామని ఏపీపీఎస్సీ పేర్కొంది. అయితే.. పరీక్షకు వారం ముందు అనుమతించబోమని ప్రకటించింది. నాన్ ప్రోగ్రామబుల్ క్యాలిక్యులేటర్‌కు అనుమతి ఇవ్వకుండా పరీక్ష నిర్వహించడంతో నష్టపోయామని అభ్యర్థులు వాపోతున్నారు. అలాగే పరీక్షలో ఆంగ్లం నుంచి తెలుగులో అనువాదం చేసి ఇచ్చిన ప్రశ్నలు తప్పులతడకలుగా ఉండడంతో తీవ్రంగా నష్టపోయారు. వీటిపైనా అభ్యర్థులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. డీఏవో పరీక్షకూ షరతులు జూలై 7న నిర్వహించే డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో) ప్రిలిమ్స్ పరీక్షకు కూడా క్యాలిక్యులేటర్ అనుమతిస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్న ఏపీపీఎస్సీ శుక్రవారం అనుమతి ఇవ్వబోమని వెబ్‌నోట్ విడుదల చేసింది. నోటిఫికేషన్లో ఒకటి పేర్కొని పరీక్ష సమయంలో మరో నిర్ణయం తీసుకోవడం అన్యాయమని అభ్యర్థులు అంటున్నారు. క్యాలిక్యులేటర్‌ను అనుమతించబోమని నోటిఫికేషన్లో ముందే పేర్కొని ఉంటే దానికనుగుణంగా సన్నద్ధమయ్యేవారమని చెబుతున్నారు. ఇదంతా పరిశీలిస్తే.. సకాలంలో పరీక్షలు నిర్వహించకుండా కాలయాపన చేసేందుకు, అభ్యర్థులు కోర్టు మెట్లు ఎక్కేలా కావాలనే ఇలా చేస్తుందనే అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక నిష్పత్తి పైనా.. కాగా.. ఏపీపీఎస్సీ ఇంతకు ముందు తీసుకున్న నిర్ణయాలు కూడా అభ్యర్థులకు శాపంగా మారుతున్నాయి. గతంలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసేవారు. కానీ.. ప్రభుత్వం జీవో నెంబర్ 5 ద్వారా అభ్యర్థుల నిష్పత్తిపై నిర్ణయాన్ని ఏపీపీఎస్సీకి అప్పగించింది. ఏ నిష్పత్తిలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు ఎంపిక చేస్తారో ఏపీపీఎస్సీ ముందుగా వెల్లడించడం లేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో గతంలోని నోటిఫికేషన్ పోస్టులకు అదనంగా 400 పోస్టులు జత చేసి 1:50 నిష్పత్తిలో ఎంపికకు అవకాశం కల్పించారని అభ్యర్థులు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగాల సంఖ్య పెరగకపోయినా కనీసం మెయిన్స్‌కు అవకాశం కల్పించాలని నిరుద్యోగులు వేడుకుంటున్నా కమిషన్ వారి మొర ఆలకించడం లేదు. గతంలో గ్రూప్–1కు మాత్రమే స్క్రీనింగ్ టెస్ట్ ఉండగా ఇప్పుడు అన్నింటికీ ప్రిలిమ్స్‌ను తప్పనిసరి చేసింది. దీంతో అభ్యర్థులు ప్రిలిమ్స్‌కు, మెయిన్స్‌కు శిక్షణా కేంద్రాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఆప్టిట్యూడ్ ప్రశ్నలపైనా అదే తీరు యూపీఎస్సీ తరహా అంటూనే ఏపీపీఎస్సీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. గతంలో యూపీఎస్సీ.. సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీశాట్)ను ప్రవేశపెట్టింది. దీనిలో పూర్తిగా అర్థమెటిక్ అంశాలు ఉంటాయి. అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌కు చెందిన పరీక్షలో అర్థమెటిక్ అవసరం లేదని, మెంటల్ ఎబిలిటీ, లాజికల్ థింకింగ్ అంశాలు ఉంటే చాలని పలువురు అభిప్రాయపడ్డారు. అర్థమెటిక్ అంశాల వల్ల తమకు నష్టం జరుగుతుందని నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఆందోళనలు చేశారు. దీంతో యూపీఎస్సీ సీ–శాట్ పేపర్‌ను కేవలం క్వాలిఫైయింగ్ పేపర్‌గా మార్చింది. కానీ ఇప్పుడు ఏపీపీఎస్సీ అదే ఆప్టిట్యూడ్ ప్రశ్నలను గ్రూప్–1లో ప్రవేశపెట్టడంతో నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు అవస్థలు పడుతున్నారు. తెలుగులో ప్రశ్నలు ఇవ్వకుండా.. కొన్ని కేటగిరీల పోస్టులకు ఆంగ్ల మాధ్యమంలోనే ప్రశ్నలు అడుగుతామని, తెలుగు మాధ్యమంలో ప్రశ్నలు ఉండవని నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రకటించడం కూడా వివాదాస్పదంగా మారింది. దీనివల్ల గ్రామీణ ప్రాంత అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారు. యూపీఎస్సీ, బ్యాంకింగ్ నియామక సంస్థలే అన్ని ప్రాంతీయ భాషల్లో ప్రశ్నలు అడుగుతుండగా ఏపీపీఎస్సీ దీనికి భిన్నంగా వ్యవహరిస్తోంది. మరోపక్క కొన్ని కేటగిరీల్లో ఆంగ్ల మాధ్యమంతోపాటు తెలుగు మాధ్యమంలోనూ ప్రశ్నలు అడుగుతున్నా అనువాదంలో అనేక తప్పులు ఉండడంతో అభ్యర్థులు నష్టపోతున్నారు. ఇటీవల ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమ్స్ తెలుగు మాధ్యమ ప్రశ్నల్లో ఏకంగా 36 ప్రశ్నలు తప్పులతడకలుగా ఉండడంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కమిషన్ చైర్మన్ తీరుపై నిరసన కాగా.. గతంలో ఎన్నడూ లేని వివాదాలు ప్రస్తుత చైర్మన్ పి.ఉదయభాస్కర్ హయాంలోనే ఏపీపీఎస్సీని చుట్టుముడుతున్నాయి. చంద్రబాబు సీఎంగా ఉండగా నియమితులైన ఈయన ప్రభుత్వ పెద్దల అండతో ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. గతంలో గ్రూప్–2లో పేపర్ లీకేజీ ఆరోపణల వివాదంపై పలువురిపై అక్రమంగా కేసులు పెట్టించారని, ఇప్పటికీ విచారణకు రావాల్సిందిగా సీఐడీ నుంచి నోటీసులు వస్తున్నాయని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చైర్మన్‌ను తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత చైర్మన్ హయాంలో తమకు న్యాయం జరగదని, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని తమను ఆదుకోవాలని కోరుతున్నారు. -
సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాల విడుదల
న్యూఢిల్లీ: ఐఏఎస్, ఐపీఎస్ తదితర సర్వీసుల ఎంపికకు నిర్వహించిన సివిల్ సర్వీసెస్–2018 ప్రిలిమ్స్ ఫలితాలను యూపీఎస్సీ శనివారం విడుదల చేసింది. మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. తెలంగాణ నుంచి సుమారు 12 వేల మంది ఈ పరీక్షకు హాజరు కాగా, 600 మంది మెయిన్స్‌కు అర్హత పొందారు. సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 7 వరకు మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. దానికి మూడు వారాల ముందు ఈ–అడ్మిట్ కార్డులు, టైం టేబుల్‌ను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. ప్రిలిమ్స్ గట్టెక్కిన అభ్యర్థులు మెయిన్స్‌కు దరఖాస్తు చేసుకోవడానికి ప్రత్యేకంగా డిటెయిల్డ్ అప్లికేషన్ ఫారం(డీఏఎఫ్)ను నింపాలి. ఈ నెల 23 నుంచి ఆగస్టు 6 మధ్య యూపీఎస్సీ వెబ్సైట్లో ఆ ఫారం అందుబాటులో ఉంటుంది. -
పంచాయతీ కార్యదర్శుల ప్రిలిమ్స్ హాల్‌టిక్కెట్లు
మెయిన్స్‌కు సెంటర్ల ఆప్షన్ మార్పునకు అవకాశం అమరావతి: రాష్ట్రంలోని 1055 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీపీఎస్సీ ఈనెల 23వ తేదీన నిర్వహించనున్న స్క్రీనింగ్ టెస్టు (ప్రిలిమ్స్) పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. అభ్యర్ధులకు హాల్టిక్కెట్ల జారీ ప్రక్రియను కమిషన్ చేపట్టింది. హాల్‌టిక్కెట్లు కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నామని కమిషన్ కార్యదర్శి వైవీఎస్టీ సాయి తెలిపారు. ఈరోజు ఉదయం 11 గంటల తరువాత నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. హాల్‌టిక్కెట్లను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.పీఎస్సీ.ఏపీ.జీఓవీ.ఐఎన్ లేదా హెచ్‌టీటీపీ://ఏపీపీఎస్‌సీఏపీపీఎల్‌ఐసీఏటీఐఓఎన్‌ఎస్17.ఏపీపీఎస్సీ.జీఓవీ.ఐఎన్వెబ్ సైట్ల ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించారు. ఇలా ఉండగా పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసిన అభ్యర్ధులు తమ సొంత జిల్లాల్లో కాకుండా వేరే జిల్లా కేంద్రాల్లో స్క్రీనింగ్ టెస్టు రాసేలా ఆప్షన్లు ఇచ్చారు. తాము ఆ పరీక్ష రాసే జిల్లాల్లో స్థానికేతరులుగా మారిపోతామని, దీనివల్ల ఎంతో నష్టపోతామని ఆందోళన చెందారు. తాము సొంతజిల్లాల్లో పరీక్ష రాసేందుకు వీలుగా ఆప్షన్ల మార్పునకు అవకాశం కల్పించాలని ఏపీపీఎస్సీకి విన్నవించారు. వీరి అభ్యర్ధనలపై ఏపీపీఎస్సీ సానుకూలంగా స్పందించింది. స్క్రీనింగ్ టెస్టులో స్థానికత అన్నది పరీక్ష కేంద్రం ఆధారంగా నిర్ణయించేది కాదని ఏపీపీఎస్సీ మంగళవారం మరో ప్రకటనలో స్పష్టంచేసింది. మెయిన్స్‌లో మాత్రమే స్థానికత, ఇతర రిజర్వేషన్లు అమలు కానున్నందున ఆమేరకు మెయిన్స్‌కు పరీక్ష కేంద్రాల మార్పునకు అవకాశం కల్పించింది. ఈనెల 24వ తేదీనుంచి 30వ తేదీ వరకు అభ్యర్ధులు తమ పరీక్ష కేంద్రాలు మార్పు చేసుకోవచ్చని కమిషన్ వివరించింది. స్క్రీనింగ్ టెస్టు ఎక్కడ రాసినా మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేసుకున్న కేంద్రమున్న జిల్లా ప్రాతిపదికన మాత్రమే స్థానికత, స్థానికేతర అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. -
గ్రూప్–2లో ‘డా.లక్ష్మయ్య’ విద్యార్థుల సత్తా
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ గ్రూప్–2 ప్రిలిమినరీ పరీక్షలో తమ స్టడీ సర్కిల్‌కు చెందిన 415 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ పి.పద్మజారాణి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో తమ స్టడీ సర్కిల్ సహకారంతో విద్యార్థులను ఆన్లైన్ పరీక్ష ద్వారా ఎంపిక చేసి, వారికి ఉచితంగా శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. వారిలో కూడా దాదాపు వెయ్యి మంది మెయిన్స్‌కు అర్హత సాధించారని, వీరందరికీ హైదరాబాద్‌లో మెయిన్స్‌కు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని వెల్లడించారు. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను సంస్థ చైర్మన్ డాక్టర్ లక్ష్మయ్య సన్మానించినట్లు తెలిపారు. -
సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: అఖిల భారత స్థాయి ఉద్యోగుల ఎంపిక కోసం నిర్వహించే సివిల్స్ ప్రాథమిక పరీక్షల (ప్రిలిమ్స్) ఫలితాలను శుక్రవారం యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) విడుదల చేసింది. ఆగస్టు 7న జరిగిన ఈ పరీక్షకు వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు. మెయిన్స్‌కు అర్హత సాధించిన ఉద్యోగార్థులు కమిషన్ వెబ్‌సైట్‌లోని నిర్దేశిత పేజీకి వెళ్లి తమ పూర్తి సమాచారం నింపి దరఖాస్తు చేయాలనీ, ఈ పేజీ అక్టోబరు 7 నుంచి 20 సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని కమిషన్ పేర్కొంది. తుది ఫలితాలు వెలువడిన తర్వాతనే అభ్యర్థుల మార్కులు, కటాఫ్ మార్కులు, సమాధానాల కీలను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామని యూపీఎస్సీ చెప్పింది. -
ఏపీ గ్రూప్స్ పరీక్ష విధానం ఖరారు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ గ్రూప్ పరీక్షలకు సంబంధించి పరీక్షా విధానం ఖరారు అయింది. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్ష విధానాన్ని వెల్లడించింది. ఈ మేరకు గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టుల పరీక్ష విధానాలపై ప్రభుత్వం సోమవారం జీవో విడుదల చేసింది. గ్రూప్-2, 3లకు రెండు పరీక్షలు, ప్రిలిమ్స్, మెయిన్స్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే మెయిన్స్ పరీక్షను ఆన్లైన్లో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
కాసేపట్లో సివిల్స్ పరీక్ష.. అంతలో ప్రమాదం
న్యూఢిల్లీ: మరి కొద్ది సేపట్లో సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష. అప్పటి వరకు చేసిన ప్రిపరేషన్ మొత్తాన్ని పరీక్షలో చూపాలన్న ఆరాటం. కానీ, ఆ సివిల్స్ ఆశావాహికి నిరాశ ఎదురైంది. ఆమెను దురదృష్టం కారు ప్రమాదం రూపంలో వెంటాడింది. పరీక్ష కోసం ఉదయాన్నే సిద్ధమై రోడ్డు దాటి పుట్ ఫాత్పై అడుగేస్తుండగానే వెనుక నుంచి ఓ కారు బలవంతంగా ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో ఆమె పరీక్ష హాలుకు బదులు ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కవితా శర్మ అనే యువతి ఢిల్లీలో ఉండి సివిల్స్ ప్రిపేర్ అవుతుంది. ఆదివారం ఉదయం సివిల్స్ పరీక్ష ఉండటంతో అందుకు సిద్ధమై ఢిల్లీలోని తోడాపూర్ జంక్షన్ వద్ద రోడ్డు దాటి ఫుట్‌పాత్‌పై అడుగుపెట్టబోయింది. ఇంతలోనే అనూహ్యంగా వేగంగా వచ్చిన హోండా సిటీ కారు ఢీకొట్టింది. పైగా ఆమెపైనే కేకలు వేస్తూ ఆ కారు డ్రైవర్ వేగంగా వెళ్లిపోయాడు. దీంతో సమీపంలోని స్థానికులు వచ్చి ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె కాలి చీలమండలానికి తీవ్ర గాయం కాగా పలుచోట్ల తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా యాక్సిడెంట్ చేసిన కారును, డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
వ్యక్తిత్వంలో విజయానికి..
సివిల్స్- 2014 పర్సనాలిటీ టెస్ట్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధిస్తే..లక్షల్లో ఉండే పోటీని తట్టుకొని మలిదశ మెయిన్స్‌కు చేరుకున్నట్లే! మెయిన్స్ మెట్టు కూడా దాటితే అభ్యర్థితో పోటీకి నిలిచిన వారు లక్షల నుంచి వేలల్లోకి తగ్గినట్లే! చివరి అడుగైన పర్సనాలిటీ టెస్ట్‌లో విజయం సాధిస్తే కల సాకారమైనట్ల్లే! సివిల్స్-2014 ఇంటర్వ్యూలు మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో కీలకమైన పర్సనాలిటీ టెస్ట్‌లో విజయానికి ఉపయోగపడే మార్గాలు... యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మెయిన్స పరీక్షలు రాసిన అభ్యర్థులు త్వరలో వెలువడనున్న ఫలితాల కోసం ఎదురుచూస్తూ.. మరోవైపు పర్సనాలిటీ టెస్ట్‌కు సిద్ధమవుతున్నారు. రెండు దశల రాత పరీక్షలలో(సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్) విజేతలుగా నిలిచిన అభ్యర్థులకు పర్సనాలిటీ టెస్ట్ పేరిట యూపీఎస్సీ ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌తోపాటు దాదాపు 20 కేంద్ర సర్వీసుల పోస్టుల్లో నియామకానికి నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియలో పర్సనాలిటీ టెస్ట్(ఇంటర్వ్యూ)ది కీలక పాత్ర. నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఇంటర్వ్యూ వరకూ.. దాదాపు సంవత్సరానికిపైగా సాగే సివిల్స్ ఎంపిక క్రతువులో విజయం సాధించేందుకు అహోరాత్రులు శ్రమించి ఇంటర్వ్యూ దశకు చేరుకుంటారు. కొంతమంది మొదటిసారే ఇంటర్వ్యూలో విజయం సాధిస్తుండగా.. మరికొందరు చివరి అటెంప్ట్‌లో కానీ గెలుపు గమ్యం చేరుకోలేకపోతున్నారు. వ్యక్తిత్వాన్ని, మానసిక పరిణితిని పరీక్షించే పర్సనాలిటీ టెస్ట్‌లో చిన్నపాటి పొరపాట్లతో అవకాశాలు చేజార్చుకుంటున్నారు. అయితే కొద్దిపాటి మెళకువలతో ఇంటర్వ్యూలో ఉత్తమంగా రాణించి కలలను సాకారం చేసుకోవచ్చని సూచిస్తున్నారు నిపుణులు. సానుకూల దృక్పథం: సివిల్స్ ఇంటర్వ్యూలో విజయానికి మొదటి సాధనం.. సానుకూల దృక్పథం. ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులు, ప్రాంతీయ మీడియంలలో చదివిన అభ్యర్థుల్లో ఆశించిన స్థాయిలో ఆత్మవిశ్వాసం ఉండటంలేదు. మెట్రో నగరాలు, ప్రొఫెషనల్ డిగ్రీ ఉత్తీర్ణులతో పోల్చుకుని ఆందోళన చెందుతున్నారు. ఆత్మన్యూనతకు లోనవుతున్నారు. ఇంటర్వ్యూలో రాణించగలమా? లేదా? అనే సందేహాన్ని విడనాడాలి.ప్రిలిమ్స్‌లో లక్షల పోటీని, మెయిన్సలో వేలమందిని ఎదుర్కొని 1:2 లేదా 1:2.5 పోటీ వరకు వచ్చాం కదా.. ! అనే ఆత్మస్థైర్యం, సానుకూల వైఖరులను అలవర్చుకోవాలి. స్వతహాగా బిడియస్తులైతే ఇప్పటినుంచే బృంద చర్చల ద్వారా ఆ సమస్యను అధిగమించాలి. పర్సనాలిటీ టెస్ట్.. ఉద్దేశం: సివిల్స్ ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులు అసలు పర్సనాలిటీ టెస్ట్ ఉద్దేశం ఏంటో తెలుసుకోవడం ముఖ్యం. వాస్తవానికి యూపీఎస్సీ పర్సనాలిటీ టెస్ట్ ప్రధాన ఉద్దేశం.. అభ్యర్థి భావవ్యక్తీకరణ, నిర్వహణ నైపుణ్యం, నిర్ణయాత్మక సామర్థ్యం, ఎదుటివారి అభిప్రాయాలను స్వీకరించగలిగే మనస్తత్వం, సామాజిక సమస్యలపై అవగాహన వంటి లక్షణాలను పరీక్షించడం. ముఖ్యంగా అభ్యర్థులకు భవిష్యత్తు లక్ష్యం గురించి స్పష్టత ఉండాలి. ఇటీవల కాలంలో ఇంజనీరింగ్, మెడికల్ తదితర ప్రొఫెషనల్ కోర్సుల గ్రాడ్యుయేట్లు ఎక్కువగా సివిల్స్ వైపు వస్తున్నారు. దాంతో భవిష్యత్తు లక్ష్యం గురించి అడుగుతున్నారు. ఓ ఎంఎన్సీలో మూడేళ్లుగా పనిచేస్తూ, గతేడాది తొలి అటెంప్ట్‌లోనే ఇంటర్వ్యూ దశకు చేరుకున్న అభ్యర్థిని అడిగిన ప్రశ్న.. ‘మీరు ఎంతో పేరున్న ఇన్స్టిట్యూట్లో బీటెక్ చదివారు. ప్రస్తుతం లక్షల్లో వార్షిక వేతనం అందుకుంటున్నారు. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ వైపు రావాలనుకోవడానికి కారణం?’ ఈ ప్రశ్న కు ఆ అభ్యర్థి చెప్పిన సమాధానంతో బోర్డ్ సభ్యులు సంతృప్తి చెందలేదు. కారణం.. సివిల్ సర్వీసెస్ ద్వారా సంఘంలో హోదా లభిస్తుందని, ఉన్నత స్థానంలో ఉండొచ్చని చెప్పడమే! అయితే, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేటప్పుడు సామాజిక అభ్యున్నతికి దోహదపడేందుకు సమున్నత మార్గంగా సివిల్ సర్వీసెస్ నిలుస్తుందనే భావం వచ్చేలా, తమ వ్యక్తిగత లక్ష్యం కూడా అదే అని బోర్డును ఒప్పించే విధంగా సమాధానం చెప్పాలి. నిర్ణయాత్మకత, సమయస్ఫూర్తి, భావవ్యక్తీకరణ: సివిల్స్ పర్సనాలిటీ టెస్ట్‌లో రాణించేందుకు అభ్యర్థులకు ఉండాల్సిన మూడు ప్రధాన లక్షణాలు.. నిర్ణయాత్మక సామర్థ్యం, సమయస్ఫూర్తి, భావ వ్యక్తీకరణ. ప్రజలకు ప్రత్యక్షంగా సేవచేసే ఉద్యోగిగా సివిల్ సర్వెంట్‌కు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే నైపుణ్యం ఎంతో అవసరం. ఉన్నతాధికారుల అనుమతి కోసం వేచి చూడకుండా నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భాలు కూడా ఎదురవుతాయి. సరైన నిర్ణయం తీసుకోవడంతోపాటు, స్వీయ నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి సంబంధించి అధికారులను మెప్పించే నేర్పు వంటి లక్షణాలు కూడా కలిగుండాలి. ఈ లక్షణాలు ప్రతిబింబించేలా ఇంటర్వ్యూ సమయంలో వ్యవహరించాలి. పరిపాలన, నిర్వహణకు సంబంధించి నిర్ణయాత్మక శక్తి, సమయస్ఫూర్తి సివిల్ సర్వెంట్లకు ప్రధాన లక్షణంగా నిలుస్తుంటే.. భావ వ్యక్తీకరణ సామర్థ్యం మరో కీలకమైన అవసరం. తాము చెప్పే విషయం స్పష్టంగా, సూటిగా, ఎలాంటి తడబాటు లేకుండా చెప్పగలగాలి. సంభాషణలో అభ్యర్థి మాట్లాడే పదాలు కూడా ప్రధానమే. అనవసరపు పదాడంబరాల జోలికి వెళ్లకూడదు. సరళమైన భాషలోనే తమ అభిప్రాయాలను చెప్పాలి. ఇంగ్లిష్ దినపత్రికలు లేదా వ్యాసాల్లోని పదాలను వినియోగించాలని భావించడం కూడా సరికాదు. ఎందుకంటే.. అలాంటి వ్యాసాలు లేదా ఎడిటోరియల్స్ రాసేది సంబంధిత రంగంలో నిపుణులని గుర్తించాలి. అభ్యర్థులు ‘నేర్చుకునే’ కోణంలో ఆ స్థాయిలో ముందుకు సాగడం సబబే. కానీ.. కీలకంగా నిలిచే 20 నుంచి 25 నిమిషాలు జరిగే ఇంటర్వ్యూలో ప్రయోగాలు చేయకూడదనేది నిపుణుల అభిప్రాయం. వాక్చాతుర్యం.. సమతుల్యత: ఇటీవల కాలంలో సివిల్ సర్వీసెస్ పర్సనాలిటీ టెస్ట్ శైలి మారుతోంది. అభ్యర్థుల బయోడేటా, హాబీలకు సంబంధించిన ప్రశ్నలు నేరుగా అడుగుతుండగా.. మిగతా ప్రశ్నలు చర్చకు దారితీసే విధంగా ఉంటున్నాయి. గతేడాది ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలు ఇలా ఉన్నాయి.. ఈ రెండు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే ఒక చిన్నపాటి డిబేట్‌కు దారి తీస్తుంది. ఇలాంటి సందర్భాల్లోనే అభ్యర్థుల్లోని వాక్చాతుర్యం, చర్చించే నైపుణ్యం, ఆయా అంశాలపై వారికున్న వాస్తవ అభిప్రాయాలు వెలుగులోకి వస్తాయి. ముఖ్యంగా ‘మీ అభిప్రాయం ఏంటి?’ వంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటప్పు డు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎక్కడా బ్యాలెన్స్ తప్పకుండా చక్కటి వాక్పటిమతో ఆకట్టుకునే రీతిలో సమాధానం ఇవ్వాలి. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు, ఆయా విభాగాల్లో అవినీతి తదితర అంశాలపై ప్రశ్నలు ఎదురైనప్పుడు మరింత సమతుల్యత పాటించాలి. నిందాపూర్వకమైన అభిప్రాయాలు వ్యక్తం చేయడం సరికాదు. సమస్యను వివరిస్తూనే పరిష్కార మార్గాలను సూచించే విధంగా స్పందించాలి. అప్పుడే బోర్డ్ సభ్యుల మన్ననలు అందుకోవడానికి ఆస్కారం ఉంటుంది. బయోడేటా.. డ్రస్సింగ్.. విషింగ్: పర్సనాలిటీ టెస్ట్ విషయంలో అభ్యర్థులు తమ బయోడేటాలో పేర్కొన్న అంశాలపైనా కసరత్తు చేయాలి. తద్వారా నాణ్యమైన సమాధానాలు మదిలో నిక్షిప్తం చేసుకుని ఇంటర్వ్యూకు హాజరుకావాలి. చాలామంది చేసే పొరపాటు ‘హాబీ’గా పేర్కొన్న అంశం గురించి లోతైన అవగాహన పెంచుకోకపోవడం! అభ్యర్థి హాబీ గురించి సుదీర్ఘ చర్చ జరిగే సందర్భాలు కూడా ఉంటాయి. ఉదా: సినిమాలు చూడటం ఇష్టం అని పేర్కొంటే.. సినిమాల ఆవిర్భావం నుంచి ఇటీవల ఆస్కార్ విజేతల వరకు ఎలాంటి ప్రశ్నలైనా అడగొచ్చు. డ్రెస్సింగ్.. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్.. సివిల్స్ పర్సనాలిటీ టెస్ట్‌కు హాజరవుతున్న అభ్యర్థులు గుర్తించాల్సిన అంశమిది. కాబట్టి మొదటగా డ్రెస్సింగ్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. హుందాతనం ఉండాలి తప్ప.. ఆడంబరం పనికిరాదు. పురుష అభ్యర్థులు లేత రంగు షర్ట్లు, ముదురు రంగు ప్యాంటులు, షూస్ ధరించడం మంచిది. సూట్ ధరించే విషయంలో ఆయా అభ్యర్థులు తమ అలవాటును బట్టి వ్యవహరించాలి. మహిళా అభ్యర్థులు చీరలు ధరించడం మంచిది. విషింగ్ అంటే.. ఇంటర్వ్యూ గదిలోకి అడుగుపెట్టాక బోర్డ్ సభ్యులను పలకరించే విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. సభ్యులందరినీ చూస్తూ అభివందనం చేయడంపై ప్రాక్టీస్ చేయాలి. మన సంప్రదాయం ఉట్టిపడేలా నమస్తే అని సంబోధించడం మేలు. స్వస్థలం మొదలు అన్నిటిపై అవగాహన సివిల్స్ ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ స్వస్థలం నుంచి సమకాలీన పరిణామాల వరకూ.. అన్ని అంశాలపై సమాచార సేకరణ చేసుకోవాలి. తమ స్వస్థలం చారిత్రక ప్రాశస్త్యం కలిగుంటే దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం ముఖ్యం. అదే విధంగా అభ్యర్థుల ఇంటిపేర్లు కూడా కొన్ని సందర్భాల్లో చర్చకు దారి తీస్తాయి. అదే ఇంటిపేరు కలిగిన ప్రముఖులు, వారు చేసిన సేవలు వంటి వాటిపైనా ప్రశ్నలు అడిగే అవకాశాలుంటాయి. ఇంటర్వ్యూల శైలి విభిన్నంగా మారుతోంది. ప్రధానంగా అభ్యర్థుల్లోని పాలనాదక్షతను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతున్నారు. ఏదైనా ఒక సమస్యను ప్రస్తావించి మీరే కలెక్టర్ అయితే ఏం చేస్తారు? వంటివి. అదేవిధంగా ఇటీవల కాలంలో మన దేశం చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలు, వాటి ఉద్దేశాలు వంటి వాటిపైనా దృష్టిసారించాలి. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం గల అభ్యర్థులు.. ఇంటర్వ్యూ అంటే ఆందోళన పోగొట్టుకోవాలి. ఏ బోర్డ్ సభ్యులైనా అభ్యర్థులకు ఆహ్లాదకర వాతావరణం కలిగించేలా వ్యవహరిస్తారు. దీన్ని గమనించి ముందుగా మానసికంగా సంసిద్ధత పొందితే పర్సనాలిటీ టెస్ట్‌లో విజయావకాశాలు మెరుగుపరచుకోవచ్చు. - ఆర్.సి.రెడ్డి, డెరైక్టర్, ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ లక్ష్యంపై ప్రశ్నలకు స్పష్టత సివిల్స్ ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ లక్ష్యంపై స్పష్టతతో ఉండాలి. సివిల్స్ ద్వారా సమాజానికి సేవచేసే అవకాశం లభిస్తుందని ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థుల్లో నూటికి 90 శాతం మంది చెప్పే సమాధానం. అయితే ఇంటర్వ్యూ ఆసాంతం ఇదే ప్రశ్న-సమాధానంపై జరిగే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఇంజనీరింగ్, సైన్స్ నేపథ్యం కలిగిన అభ్యర్థులు, ఇప్పటికే పలు ఎంఎన్సీల్లో మంచి హోదాల్లో లక్షల వేతనంతో పని చేస్తున్న వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ తరహా అభ్యర్థులు తమ అకడమిక్ నాలెడ్జ్‌ను పరిపాలన విభాగాల్లో అన్వయించేందుకు గల మార్గాలను తెలియజేసే విధంగా నైపుణ్యం పొందాలి. ఇంజనీరింగ్ విద్యార్థులైతే.. ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాలు, పథకాలను దృష్టిలో పెట్టుకుని డిజిటలైజేషన్ ఆఫ్ ఇండియా, ఐసీటీ వంటి విధానాల ద్వారా అమలు చేస్తున్న పలు పథకాలకు తమ నైపుణ్యాలు ఉపయోగపడతాయనే రీతిలో సమాధానాలు ఇవ్వాలి. ఇక వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు ఎదురవుతున్న మరో ప్రశ్న.. మీరు సేవే లక్ష్యంగా సివిల్స్‌వైపు రావాలనుకుంటున్నారా?ఎంపిక కాకపోతే ఏం చేస్తారు? దీనికి సమాధానం ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎంపిక కాకపోయినా మరోసారి ప్రయత్నిస్తానని చెప్పడం మంచిది. అంతేతప్ప ఎంపిక కాకపోతే పూర్వ వృత్తికి వెళతాననే సమాధానాలు ప్రతికూల ప్రభావం చూపుతాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఇంటర్వ్యూకు సన్నద్ధం కావాలి. - శ్రీరంగం శ్రీరామ్, శ్రీరామ్స్ ఐఏఎస్ కరెంట్ అఫైర్స్‌పై పట్టు సివిల్స్ ఇంటర్వ్యూ అభ్యర్థులు కరెంట్ అఫైర్స్‌పై పట్టు సాధించాలి. ముఖ్యంగా కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చోటు చేసుకున్న ముఖ్య పరిణామాలు, అంతర్జాతీయ ఒప్పందాలు; పలు ప్రభుత్వ పథకాలు, వాటి ఉద్దేశం, నేపథ్యం, క్షేత్ర స్థాయిలో అమలు తీరుతెన్నులు, సమస్యలు.. ఇలా అన్ని కోణాల్లో అవగాహన పెంచుకోవాలి. ఈసారి వరల్డ్ కప్ క్రికెట్ గురించి కూడా ప్రశ్నలు అడిగే అవకాశాలున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఎక్కువగా ప్రాంతీయ ప్రాధాన్యత అంశాల్లో భాగంగా రెండు ప్రభుత్వాలు అభివృద్ధి దిశగా తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న పథకాలు, అవి ఆయా రాష్ట్రాల పురోగతికి దోహదం చేసే విధానం, ఈ రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారిన అంశాలు (నీటి పంపిణీ, విద్యుత్ పంపిణీ తదితర)పై పరిజ్ఞానం పొందాలి. - వి.గోపాలకృష్ణ, డెరైక్టర్, బ్రెయిన్ ట్రీ అకాడమీ మంచి సర్వీస్ రావాలంటే.. సివిల్స్ ఎగ్జామ్ ద్వారా ఎంపిక చేసే 20కు పైగా కేంద్ర సర్వీసుల్లో అభ్యర్థులు తమకు నచ్చిన సర్వీస్‌లో స్థానం పొందడానికి పర్సనాలిటీ టెస్ట్‌లో చూపే ప్రతిభ కీలకంగా మారుతోంది. చాలా మంది అభ్యర్థులు మెయిన్స్ రాత పరీక్షలో అధిక మార్కులు సాధించినా, ఇంటర్వ్యూలో తక్కువ మార్కులు పొందడం వల్ల తుది జాబితాలో నిలుస్తున్నారు. కానీ తమకు నచ్చిన సర్వీస్‌కు ఎంపిక కాలేకపోతున్నారు. దీన్ని గుర్తించి మెయిన్స్‌లో బాగా రాశాం కదా? అనే ధోరణితో ఇంటర్వ్యూ విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. పర్సనాలిటీ టెస్ట్‌లో కూడా ఉత్తమంగా రాణించేందుకు కసరత్తు చేయాలి. ఇటీవల కాలంలో ఎథిక్స్, మోరల్ వాల్యూస్ సంబంధిత ప్రశ్నలు ఎక్కువవుతున్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఒక విభాగాధిపతిగా తమ నిబద్ధత, నిజాయతీని ప్రతిబింబించే విధంగా సమాధానాలు ఇచ్చే నైపుణ్యం సొంతం చేసుకోవాలి. ప్రస్తుత సమయంలో మాక్ ఇంటర్వ్యూలకు హాజరవడం ఎంతో మేలు చేస్తుంది. - కె.శశాంక, సివిల్స్-2012, ఆల్ ఇండియా ర్యాంకు 16 ఆ రోజు వ్యవహరించే శైలే కీలకం సివిల్స్ లక్ష్యం దిశగా ఎన్నేళ్లు కష్టపడినా.. ఇంటర్వ్యూ రోజు 25 నుంచి 30 నిమిషాలు పాటు వ్యవహరించే శైలి ఎంతో కీలకం. ఆ సమయాన్ని నిర్మాణాత్మకంగా వినియోగించుకుంటే సానుకూల ఫలితాలు అందుకోవచ్చు. తమ విషయ పరిజ్ఞానం, తమ నైపుణ్యాలను సివిల్ సర్వీసెస్ ద్వారా సమాజ సేవకు ఎలా వినియోగిస్తారో బోర్డ్ సభ్యులను మెప్పించేలా చెప్పగలగాలి. ఇందుకోసం మాక్ ఇంటర్వ్యూలకు హాజరవ్వాలి. తమ పర్సనాలిటీ పరంగా మెరుగుపరచుకోవాల్సిన అంశాలపై దృష్టి పెట్టాలి. అదే విధంగా అకడమిక్ నేపథ్య సబ్జెక్ట్ నాలెడ్జ్‌ను పునశ్చరణ చేసుకోవాలి. క్రమం తప్పకుండా దినపత్రికలు చదవాలి. - కృత్తిక జ్యోత్స్న, సివిల్స్-2013 ఆల్ ఇండియా ర్యాంకు 30 మాక్ ఇంటర్వ్యూలు, గ్రూప్ డిస్కషన్స్ సివిల్స్ పర్సనాలిటీ టెస్ట్‌లో విజయసాధనకు మాక్ ఇంటర్వ్యూలు, గ్రూప్ డిస్కషన్స్ మంచి ఉపకరణాలు. మాక్ ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులకు డ్రెస్ కోడ్ మొదలు కంటెంట్ పరంగా మెరుపరచుకోవాల్సిన అంశాలపై నిపుణుల సలహాలు లభిస్తాయి. గ్రూప్ డిస్కషన్స్ తో తమకు తెలియని కొత్త విషయాలపై అవగాహన పెంచుకోవచ్చు. - జె.కీర్తి, సివిల్స్-2012 ఆల్ ఇండియా ర్యాంకు 89 సివిల్స్ ఇంటర్వ్యూ- దృష్టి సారించాల్సిన అంశాలు మేక్ ఇన్ ఇండియా స్కీం భూ సేకరణ చట్టంలో మార్పులు జనధన్ యోజన ఒబామా పర్యటన - భారత్-అమెరికా సంబంధాలపై ప్రభావం ఇన్సూరెన్స్‌లో ఎఫ్‌డీఐల పెంపు - పర్యవసానాలు అంతర్జాతీయ ఒప్పందాలు {పణాళిక సంఘం స్థానంలో నీతి అయోగ్ ఏర్పాటు- ఉద్దేశాలు అంతర్జాతీయంగా ఆయా దేశాల్లో పెరుగుతున్న అంతర్గత ఉగ్రవాదం- ఇతర దేశాలపై ప్రభావం శాసన, పరిపాలన వ్యవస్థల్లో తరచుగా న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాల్సి రావడానికి కారణాలు జాతీయ స్థాయి విద్యా సంస్థల విస్తరణ నిర్ణయం సివిల్స్ 2012, 2013 పర్సనాలిటీ టెస్ట్ కటాఫ్స్ 275 మార్కులకు నిర్వహించే సివిల్స్ పర్సనాలిటీ టెస్ట్‌లో 2012, 2013 కటాఫ్స్ వివరాలు.. సంవత్సరం జనరల్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ 2012 211 208 209 197 2013 236 229 210 205 సివిల్స్ - 2014 ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్: మొత్తం పోస్ట్‌లు - 1291 {పిలిమ్స్కు హాజరైంది - 4,51,602 మెయిన్స్‌కు అర్హత సాధించింది - 16,993 ఇంటర్వ్యూకు అర్హత లభించేది - సుమారు 2,500 -
వర్తమానమూ... విజయసూత్రమే
అస్పష్టత.. క్లిష్టత:కొన్ని ప్రశ్నల సమాధానాలు సులభంగానే అనిపిస్తాయి. కానీ క్లిష్టంగా, అస్పష్టంగా, తికమక పెట్టేలా ఉంటాయి. ఇలాంటివాటికి తొందరపాటు పనికిరాదు. అలా చేస్తే భారీ మూల్యం తప్పదు. ఉదాహరణ:కేంద్ర మంత్రి మండలి ఎవరికి బాధ్యత వహిస్తుంది? లోక్‌సభకా? పార్లమెంట్‌కా? దీని వివరణ కోసం ఆర్టికల్ 75లో సమగ్రంగా చదివితే స్పష్టత వస్తుంది. అదే విధంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం రాజ్యాంగ పీఠిక, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలకు సంబంధించిన విషయాలు కూడా ఇలాగే ఇబ్బందిపెడతాయి. అందువల్ల వీటిపై సమ గ్ర అధ్యయనం అవసరం. ప్రిలిమ్స్‌కు స్వల్పవ్యవధి మాత్ర మే ఉంది. ఈ కొద్ది సమయాన్ని సరైన ప్రణాళికతో సద్వినియోగపరచుకోవచ్చు. అందుకు మేలైన దారుల్లో కొన్ని... పాత ప్రశ్నపత్రాలతో పూర్తి అవగాహన: పాత పేపర్లను క్షుణ్నంగా చదివితే పూర్తిస్థాయి అవగాహన ఏర్పడుతుంది. పాత ప్రశ్నపత్రాలకు మించిన ఉత్తమ వనరులు వేరేవేమీ లేవనడంలో సందేహం లేదు. సివిల్స్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థులు చేయాల్సిన మొదటి పని ఇదే. ఇలా చేస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఎకానమీ సబ్జెక్ట్‌కు 15 సంవత్సరాల పాత ప్రశ్నపత్రాలను, మిగతా సబ్జెక్టులకైతే 20-30 సంవత్సరాల పేపర్లను నిశితంగా పరిశీలించాలి. వీటిని అధ్యయనం చేస్తే మానసికంగా కొంత విజయం సాధించినట్లే. గత పదేళ్లలో నిర్వహించిన ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాలను క్షుణ్నంగా పరిశీలించి ప్రశ్నల సరళిపై అవగాహన ఏర్పరచుకోవాలి.ప్రశ్నల ప్రాతిపదికకు సంబంధించి ముఖ్యాంశాలను నోట్స్‌లో రాసుకోవాలి. ఏడాదిగా సివిల్స్ కోసం సాధన సాగించిన వారు నోట్స్‌లో రాసుకున్న అంశాలను పునశ్చరణ చేయాలి. క్లిష్టమైన అంశాలను మరింత గుర్తుండి పోయేలా పాకె ట్ బుక్‌లో రాసుకుంటే మంచిది. రాజ్యాంగం, ఎకనామిక్స్, చరిత్ర.. ఇలా ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన కీలక పాయింట్లను ఇందులో రాసుకోవాలి. ప్రిలిమ్స్.. మెయిన్సకు ఉపయుక్తమే: సాధారణంగా ప్రిలిమ్స్ కోసం చదివిన అంశాలు మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్‌కు అంతగా ఉపకరించవని అనుకుంటారు. కానీ ఈ భావన తప్పు. ప్రిలిమ్స్ అంశాలు పూర్తిగా కాకున్నా కొంతమేర దోహద పడతాయి. ప్రిలిమ్స్, మెయిన్స్ మధ్య చాలావరకు భిన్నత్వం ఉంటుంది. ఈ రెంటికీ సిలబస్ కూడా వేర్వేరు. అయితే అంశాలకు సంబంధించి స్పష్టత, అనుబంధ సమాచారం, మానసిక క్రమశిక్షణ, మార్గదర్శక సూత్రాల అమలులో రెండు పరీక్షలకు ఒకేలా ఉంటుంది. వర్తమాన అంశాలపై పట్టు: ఇటీవల 16వ లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల సరళి, ఎన్నికల కమిషన్. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ల మధ్య పోలిక మొదలైన అంశాలు చదవాలి. 14వ ఆర్థిక సంఘం తుది నివేదిక కొద్ది నెలల్లో సమర్పిస్తుంది. దీనిపై ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ఇటీవల గవర్నర్ల నియామకం - తొలగింపు (ఆర్టికల్ 123) వివాదాస్పదంగా మారింది. ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం వ్యవస్థకు జ్యుడీషియల్ కమిషన్ మధ్య వివాదం... ఇలా వర్తమానవ్యవహారాలకు సంబంధించి ప్రశ్నలు రావచ్చు. జాతీయ అత్యయిక పరిస్థితి (ఆర్టికల్ 352), రాష్ట్రపతి పాలన మొదలైనవి. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ తరచూ రాష్ట్రపతిని కలవడానికి ప్రధాన కారణాలు, ద్రవ్యోల్బణం, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో), మానిటరీ పాలసీ, సెబీ ఆర్డినెన్స్, చెల్లింపుల్లో సమతూకం (బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్), రాయితీలు, ఎఫ్ఆర్బీఎం, పన్ను వసూలు భావనలు (ట్యాక్సేషన్ కాన్సెప్ట్స్), విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, పెట్టుబడుల పంపిణీ మొదలైన అంశాలపై ప్రిలిమ్స్‌తో పాటు మెయిన్స్‌లోనూ తరచూ ప్రశ్నలు వస్తుంటాయి. ఈ అంశాలు వర్తమాన వ్యవహారాలకు సంబంధించినవే అయినా ఏటా మారుతుంటాయి. కాబట్టి ఈ అంశాలపై ఎల్లప్పుడూ విశ్లేషణాత్మక అధ్యయనం సాగిస్తే ప్రిలిమ్స్, మెయిన్సకు తోడ్పడుతుంది. సైన్స్ అంశాల నుంచి: ప్రిలిమినరీలో కరెంట్ ఐఫైర్స్ విభాగం ప్రత్యేకమైంది. రాజ్యాంగం, ఎకానమీ, సైన్స్‌లో సాధించిన పురోగతిపై అధికంగా ప్రశ్నలు వస్తున్నాయి. జాతీయ స్థాయి పత్రికల్లో తరచూ వచ్చే అంశాలపై అంటే సైన్స్‌లో ఎబోలా వైరస్, క్రయోజెనిక్ ఇంజిన్, శుద్ధి చేసిన యురేనియం, అణు సంబంధ పదార్ధాలు తదితర విషయాలపై ప్రశ్నలు వస్తున్నాయి. ఎకానమీ, జాతీయ విధానం అంశాలు కూడా కరెంట్ అఫైర్స్‌లో అడుగుతున్నారు. అన్ని రంగాల నుంచి పలు రూపాల్లో ప్రశ్నలు రావొచ్చు. వీటితోపాటు సంప్రదాయ జీవ, భౌతిక శాస్త్రాల అంశాలు కరెంట్ అఫైర్స్‌లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నాయి. ఇటీవల జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జన్యు మార్పులు, జన్యు సాంకేతికతపై పలు నివేదికలు వెలువడ్డాయి. డీఆర్డీవో పరిశోధ నలు, బ్రిక్స్ బ్యాంక్ ఏర్పాటు.. ఇలా పలు అంశాలపై పట్టు సాధిస్తే ప్రిలిమ్స్‌తో పాటు మెయిన్స్‌కూ ఉపయుక్తం. దినపత్రికలతోనే దిశ-దశ: సివిల్స్‌కు సన్నద్ధమయ్యే వారు ప్రామాణిక దినపత్రికలను చదవడం ఉత్తమం. పత్రికల్లో వచ్చే వర్తమాన వ్యవహారాలు, ఆర్థిక, సామాజిక, రక్షణ రంగాలకు చెందిన విశ్లేషణలు మనం చదివినవాటికి మరింత అదనపు సమాచారాన్ని అందిస్తాయి. ఉదాహరణకు ఆర్థిక సర్వే-2013. ఇందులో ఆర్థికపరమైన అంశాలన్నీ వివరణాత్మకంగా పత్రికల్లో వచ్చాయి. ఆర్థిక నిపుణులు తమ ఆలోచనలు, అనుభవాలను రంగరించి రూపొందించిన ఈ నివేదికలోని అంశాలను చదివితే ఎంతో ప్రయోజనం. ఇటీవల ఎక్కువగా స్మార్ట్‌సిటీల గురించి ప్రస్తావన వస్తోంది. వీటితోపాటు కేంద్రం చేపట్టిన కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు పాతపేర్లను తొలగించి వాటి స్థానంలో దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, శ్యామప్రసాద్ ముఖర్జీ, జయప్రకాశ్ నారాయణ్, మదన్మోహన్మాళవీయ పేర్లను పెడుతున్నారు. వీటిపై అభ్యర్థులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. చదవని అంశాల గురించి ఆందోళన చెందకుండా చదివిన అంశాలను ఏ మేర విశ్లేషణతో ఆకళింపు చేసుకున్నారో స్వీయ మూల్యాంకనం చేసుకోవాలి. కొత్తగా ప్రాధాన్యమనిపించిన విషయాలేవైనా గుర్తించినట్లైతే అలాంటి వాటిపై పట్టు సాధించేందుకు మరింత కృషి చేయాలి. చర్చా కార్యక్రమాలు: టీవీల్లో ప్రసారమయ్యే చర్చా కార్యక్రమాలను చూస్తే విశ్లేషణ శక్తి పెరుగుతుంది. కొన్ని చానెళ్లు విషయ పరిజ్ఞానం లేనివారితో చర్చలు కొనసాగిస్తుంటాయి. వాటి జోలికి వెళ్లకుండా ఆయా రంగాల్లో నిపుణులైన వారితో చేపట్టే కార్యక్రమాలను వీక్షిస్తే ఫలితం ఉంటుంది. కొందరు టీవీ చర్చా కార్యక్రమాలను చూస్తున్నాం కాబట్టి పత్రికలను చదవాల్సిన అవసరం లేదనుకుంటారు. అలాంటివారు ఈ ధోరణి విడనాడాలి. కనీసం ఒక ప్రామాణిక దినపత్రికనైనా చదవాలి. పరీక్షకు అవసరమైన వార్తలు, సమీక్షలు, సంఘటనలపై ఎప్పటికప్పుడు నోట్స్ రూపొందించుకోవాలి. జయాపజయాలను నిర్ణయించేది ప్రిలిమ్స్‌లో కరెంట్ అఫైర్స్ విభాగం నుంచి కనీసం 40 నుంచి 45 ప్రశ్నలు వస్తాయి. ఎవరైతే ఇందులో 40 ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తిస్తారో వారు విజయానికి చేరువవుతారు. ఓ రకంగా చెప్పాలంటే జయాపజయాలను నిర్ణయించే విభాగం ఇదే. కరెంట్ అఫైర్స్‌కు ప్రిపేరవ్వాలనుకునేవారు ప్రామాణిక దినపత్రికలు, వార్తా మ్యాగజైన్లను చదివితే మంచిది. వాటిలో కీలకమైన పాయింట్లను గుర్తించి, దాన్ని ప్రశ్న రూపంలో ఇలా అడగొచ్చు అని ఏవరికి వారు విశ్లేషించుకోవాలి. ఒక్కో అంశాన్ని నాలుగు కోణాల్లో ఆలోచించి సమాధానం గుర్తించడం సాధన చేయాలి. గత ప్రిలిమ్స్‌లో ఏ రూపంలో ప్రశ్నలు వచ్చాయో వాటికి అనుగుణంగా నోట్స్ రాసుకోవాలి. ఇలా చేయడం నాకు ఎంతో ఉపకరించింది. ప్రభుత్వ రంగ సంస్థల అధినేతలు, పభుత్వ పథకాలు, వాటి లక్ష్యాలు, అంతర్జాతీయ సంఘటనలపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. వార్తల్లోకెక్కిన ప్రదేశాలపై పట్టుకోసం అట్లాస్ చూస్తే మరింతగా గుర్తుండి పోతుంది. ఇలా సాధన సాగిస్తే కరెంట్ అఫైర్స్ విభాగంలో 95 శాతం విజయం సాధించవచ్చు. - శశాంక ఆల, సివిల్స్- 2013 విజేత. రిఫరెన్స్ బుక్స్ హిస్టరీ: ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ - బిపన్ చంద్ర ఫాసెట్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్ - స్పెక్ట్రమ్ (కల్చర్) జాగ్రఫీ: జాగ్రఫీ ఆఫ్ ఇండియా - మాజిద్ హుస్సేన్ ఆక్స్ఫర్డ స్కూల్ అట్లాస్ - ఆక్స్ఫర్డ్ సర్టిఫికెట్ ఫిజికల్ అండ్ హ్యూమన్ జాగ్రఫీ- జి చాంగ్ లియోంగ్ ఎకానమీ: ఇండియన్ ఎకానమీ - ఎన్సీఈఆర్టీ 10, 12 తరగతుల సిలబస్-ఎకానమీ ఆక్స్ఫర్డ్/పెంగ్విన్ డిక్షనరీ ఆఫ్ ఎకానమిక్స్ సోషియో ఎకనమిక్ సర్వే (2013) సైన్స అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఇండియా- కల్పనా రాజారామ్, స్పెక్ట్రమ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఫ్రమ్ క్రైసిస్ టు క్యూర్ - రెండో ఎడిషన్-ఆర్.రాజగోపాలన్ (ఎన్విరాన్మెంట్) కరెంట్ అఫైర్స-జీకే ఇండియా ఇయర్ బుక్ 2014 మనోరమ ఇయర్ బుక్ 2014 పామాణిక కెరీర్ జర్నల్ న్యూస్ మ్యాగజైన్స్ సెలెక్టివ్ రీడింగ్ ఫ్రమ్ వికీపీడియా -
సివిల్స్ బాటలో తొలి అడుగులో తళుకులకు...
ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ తదితర ఉన్నత సర్వీసుల్లో అడుగుపెట్టి, ఒకవైపు కెరీర్‌ను సువర్ణశోభితం చేసుకుంటూ, మరోవైపు ప్రజాసేవలో భాగమయ్యే సదవకాశాన్ని కల్పించే వేదిక సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్! ఔత్సాహికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సివిల్స్ నోటిఫికేషన్‌ను యూపీఎస్సీ మే 31న విడుదల చేసింది. ఈ ఏడాది నుంచి అభ్యర్థులు అదనంగా రెండుసార్లు పరీక్ష రాసే వెసులుబాటును కల్పించింది. దీంతో పోటీ కూడా పెరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో సివిల్స్ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో వేసే తొలి అడుగు అయిన ప్రిలిమ్స్‌లో విజయానికి నిపుణుల సక్సెస్ సూత్రాలు.. సివిల్ సర్వీసెస్ పరీక్షలో ప్రిలిమ్స్ (ఆబ్జెక్టివ్ విధానం), మెయిన్స్ (రాత పరీక్ష), పర్సనాలిటీ టెస్ట్ (మౌఖిక పరీక్ష) ఉంటాయి. ప్రిలిమ్స్‌లో రెండు పేపర్లుంటాయి. జనరల్ స్టడీస్ పేపర్ 1లో వంద ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున మొత్తం పేపర్‌కు 200 మార్కులు కేటాయించారు. జనరల్ స్టడీస్ రెండో పేపర్ (ఆప్టిట్యూడ్ టెస్ట్)లో 80 ప్రశ్నలుంటాయి. దీనికి 200 మార్కులు కేటాయించారు. ఒక్కో పేపర్‌కు రెండు గంటల సమయమిచ్చారు. ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, హిందీలో ఉంటాయి. పేపర్ 1 - జీఎస్ కరెంట్ అఫైర్స్: కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు ఏ విభాగం, ఏ మూల నుంచైనా రావచ్చు. ఈ విభాగంపై పట్టు సాధించాలంటే ప్రతి రోజూ కనీసం రెండు వార్తా పత్రికలను పరీక్షను దృష్టిలో ఉంచుకొని చదవాలి. పరీక్ష తేదీకి కనీసం 8 నెలల ముందు వరకు ఉన్న జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్య అంశాలను చదవాలి. హిస్టరీ సివిల్స్ ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్ హిస్టరీ సిలబస్‌లో ‘భారత దేశ చరిత్ర, భారతదేశ స్వాతంత్య్రోద్యమం’ అని పేర్కొన్నారు. చరిత్రలో ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక భారతదేశ చరిత్ర విభాగాలుంటాయి. హిస్టరీ నుంచి 15-20 ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. అభ్యర్థులు భారత స్వాతంత్య్ర ఉద్యమం గురించి పూర్తిస్థాయిలో తెలుసుకోవాలి. ప్రాచీన భారతదేశ చరిత్ర నుంచి అడుగుతున్న కొన్ని ప్రశ్నలు పూర్తిగా ఫిలాసఫీకి సంబంధించినవి ఉంటున్నాయి. ఉదాహరణకు మతాలు, మత సిద్ధాంతాలపై అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు మత గ్రంథాల్లో మాత్రమే ఉంటున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇండియన్ హిస్టరీ నుంచి రాజకీయ కోణం నుంచి కాక సామాజిక, సాంస్కృతిక అంశాలపై ప్రశ్నలు వస్తున్నాయి. ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి సంఘసంస్కరణ ఉద్యమాలు, జాతీయ ఉద్యమం- ముఖ్య ఘట్టాలు, చట్టాలు- ఫలితాలు వంటి వాటిపై దృష్టిసారించాలి. రీజనల్ హిస్టరీ నుంచి కూడా ప్రశ్నలు వస్తున్నాయి. అవి కూడా చాలా లోతుగా ఉంటున్నాయి. ఇవి ముఖ్యమైనవి అనుకున్న అంశాల నుంచి కాకుండా, మారుమూల అంశాల నుంచి కూడా ప్రశ్నలు వస్తున్నాయి. అందువల్ల అభ్యర్థులు పూర్తిస్థాయిలో విశ్లేషణాత్మక ప్రిపరేషన్ సాగించాలి. ప్రిపరేషన్‌కు ప్రాథమికంగా ఎన్సీఈఆర్టీ పాత పుస్తకాలు అక్కరకొస్తాయి. ప్రాచీన చరిత్రకు ఆర్.శర్మ, రొమిల్లా థాపర్; మధ్యయుగ చరిత్రకు సతీష్ చంద్ర; ఆధునిక చరిత్రకు బిపిన్ చంద్ర పుస్తకాలు ఉపయోగపడతాయి. జాగ్రఫీ జాగ్రఫీ, ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ నుంచి 24-30 ప్రశ్న లు వస్తున్నాయి. ఈ ఏడాది కూడా ఇదే తరహాలో ప్రశ్నలు వచ్చే అవకాశముంది. ప్రిలిమ్స్‌లో జాగ్రఫీ, ఎకాలజీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు కాబట్టి అభ్యర్థులు ప్రిపరేషన్ ప్రణాళికలో వీటికి అధిక సమయం కేటాయించాలి. సిలబస్‌లో ‘భారతదేశం, ప్రపంచ భౌతిక, సామాజిక, ఆర్థిక భూగోళశాస్త్రం’ అని పేర్కొన్నారు. అభ్యర్థులు భారత్-భౌగోళిక అంశాలపై ఎక్కువగా దృష్టిసారించాలి. మన దేశానికి సంబంధించి వ్యవసాయం- వ్యవసాయ సంక్షోభం, రుతువులు, నదులు, అడవులు- అటవీ భూముల ఆక్రమణ, అంతరిస్తున్న జీవజాతులు, శక్తి వనరులు తదితరాలపై అవగాహన పెంపొందించుకోవాలి. రవాణా, పట్టణీకరణ ప్రక్రియ, సరిహద్దుల వివాదాలు వంటివీ ముఖ్యమే. కోర్ ఎకాలజీ నుంచి ప్రధానంగా రెండు అంశాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. అవి.. ఎకాలజీ బేసిక్ కాన్సెప్టులు (ఉదా: ఎకలాజికల్ రిచ్‌నెస్..); అప్లైడ్ ఎకాలజీ (ఉదా: గ్లోబల్ వార్మింగ్ పర్యావరణాన్ని ఎలా నాశనం చేస్తుంది?). విపత్తులకు సంబంధించి భూకంపాలు, సునామీలు, తుపానులు, అగ్నిపర్వత పేలుళ్లు, వరదలు వంటి వాటికి సంబంధించిన శాస్త్రీయ పరిజ్ఞానంపై ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పుడు స్టేట్మెంట్ ఆధారిత ప్రశ్నలు వస్తున్నాయి. ఒకే ప్రశ్న ద్వారా వివిధ అంశాల్లో అభ్యర్థికున్న పరిజ్ఞానాన్ని పరీక్షించేలా ఉంటున్నాయి. అందువల్ల అభ్యర్థులు విశ్లేషణాత్మక ప్రిపరేషన్‌ను కొనసాగించాలి. ఎన్సీఈఆర్టీ 10, 11, 12 తరగతుల పుస్తకాలు; సర్టిఫికెట్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ- గో చెంగ్ లియాంగ్; ఇండియన్ ఇయర్‌బుక్‌లోని అగ్రికల్చర్, ట్రాన్స్పోర్ట్, ఎన్విరాన్మెంట్ అంశాలు; ఎకనమిక్ సర్వే ప్రిపరేషన్‌కు తోడ్పడతాయి. పాలిటీ సివిల్స్ ప్రిలిమినరీలోని జనరల్ స్టడీస్ పేపర్లో పాలిటీ నుంచి దాదాపు 16-18 ప్రశ్నలు వస్తాయి. విస్తృత పఠనం, తార్కిక విశ్లేషణ, వర్తమాన రాజకీయ అంశాలను, సంఘటనలను రాజ్యాంగ పరంగా అన్వయించుకుంటూ చదివితే పాలిటీలో అధిక మార్కులు పొందొచ్చు. భారత రాజ్యాం గం, రాజకీయ వ్యవస్థ, పరిపాలన, పంచాయతీరాజ్ వ్యవస్థ, పబ్లిక్ పాలసీ, హక్కుల సమస్యలను సిలబస్‌లో పేర్కొన్నారు. వీటిని సమకాలీన అంశాలకు అన్వయించుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించాలి. సాధారణంగా పరీక్షలో వస్తున్న ప్రశ్నలు విషయ పరిజ్ఞానానికి, విషయంపై అవగాహనకు, విషయ అనువర్తనకు సంబంధించినవై ఉంటున్నాయి. అభ్యర్థులు రాజ్యాంగ చరిత్ర- రాజ్యాంగ పరిషత్; కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు; స్థానిక స్వపరిపాలన; రాజ్యాంగ సంస్థలు; ప్రభుత్వ విధానాలు; హక్కుల సమస్యలు తదితర అంశాలను చదవాలి. ప్రిపరేషన్‌కు ఎన్సీఈఆర్టీ 10-12 తరగతి సివిక్స్ పుస్తకాలు; అవర్ పార్లమెంట్, అవర్ కాన్స్టిట్యూషన్, అవర్ జ్యుడీషియరీ- నేషనల్ బుక్ ట్రస్ట్; ఇంట్రడక్షన్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా- డి.డి.బసు పుస్తకాలు ఉపయోగపడతాయి. ఎకానమీ గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ఎకానమీ నుంచి 15-20 ప్రశ్నలు వస్తున్నాయి. ప్రిలిమ్స్‌కు ప్రిపరేషన్ కొనసాగిస్తున్న అభ్యర్థులు మెయిన్స్ జీఎస్ పేపర్లలోని ఎకానమీ సిలబస్ ను పరిశీలించి ఉమ్మడిగా అధ్యయనం సాగించాలి. ఉపాధి; ప్రణాళికలు, అభివృద్ధి; ద్రవ్యం-బ్యాంకింగ్; విదేశీ వాణి జ్యం; వ్యవసాయం; అవస్థాపనా సౌకర్యాలు; ప్రభుత్వ విత్తం; జనాభా, పేదరికం వంటి అంశాల నుంచి ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి. 2013 పరీక్షలో ఎకానమీకి సంబంధించి అధిక ప్రశ్నలు కాన్సెప్టుల ఆధారంగా వచ్చాయి. అం దువల్ల కాన్సెప్టులపై శ్రద్ధ వహించాలి. దీనికోసం ఎన్సీఈఆర్టీ 6-12 తరగతుల సిలబస్‌ను అధ్యయనం చేయాలి. చదవాల్సిన అంశాలు: కమిటీలు- నివేదికలు; వ్యవసాయ రంగం; పారిశ్రామిక రంగం; సేవా రంగం; బ్యాంకింగ్; పన్నుల వ్యవస్థ; జాతీయాదాయం; యూఎన్డీపీ మానవాభివృద్ధి నివేదిక; 12వ ప్రణాళిక; విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు; ప్రపంచ వాణిజ్య సంస్థ; ఐఎంఎఫ్; ప్రపంచ బ్యాంకు; ద్రవ్యం- బ్యాంకింగ్; పేదరికం; సాంఘిక భద్రత; సుస్థిర అభివృద్ధి; ద్రవ్యోల్బణం వంటి అంశాలను చదవాలి.ఫరెన్స్: ఎన్సీఈఆర్టీ 6-12 తరగతి పుస్తకాలు; ఇండియా ఇయర్‌బుక్; ఇండియా ఎకనమిక్ సర్వే; ఇండియన్ ఎకానమీ- ఎస్కే మిశ్రా, పూరి. జనరల్ సైన్స్, టెక్నాలజీ జనరల్ సైన్స విభాగంలోని జీవశాస్త్రంపై పట్టు ఉంటేనే.. ఆవరణ శాస్త్రం (ఉఛిౌౌజడ) లోని అంశాలపై సమగ్ర అవగాహన పొందడం సాధ్యమవుతుంది. జనరల్ సైన్సలో జీవశాస్త్రం, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంశాలు ఉంటాయి. అదే సమయం లో టెక్నాలజీకి సంబంధించిన ప్రశ్నలను కూడా ఇస్తారు. అయితే వీటిని సమకాలీన దృక్పథంలో అడుగుతారనే విషయాన్ని గమనించాలి. జీవశాస్త్రంలో అభ్యర్థులు వృక్ష-జం తు వర్గీకరణ, వాటి లక్షణాలు, ప్రత్యేకతలపై దృష్టి సారించాలి. మానవ శరీర ధర్మశాస్త్రం, వ్యాధులు వంటి అంశాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. శరీర అవయవాల పనితీరు, వాటికి సంక్రమించే వ్యాధులపై ప్రశ్నలు వస్తాయి. భౌతికశాస్త్రంలో అన్వయంతో కూడిన (అప్లైడ్) అంశాలు ఎక్కువగా అడుగుతున్నారు. వివిధ భౌతిక ప్రక్రియల సూత్రాల ఆధారంగా పని చేస్తున్న యంత్రాలపై ప్రశ్నలు వస్తాయి. రసాయన శాస్త్రంలో అడిగే ప్రశ్నల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దైనందిన జీవితంలో మానవుడు ఉపయోగించే వివిధ రసాయనాలు, అదే విధంగా ప్లాస్టిక్, పాలిమర్స కాంపొజిట్స్‌కు సంబంధించిన సమాచారాన్ని తప్పనిసరిగా సేకరించాలి. వీటికి అదనంగా లోహ సంగ్రహణ శాస్త్రం, ఆవర్తన పట్టిక, డైమండ్, బంగారం, రంగురాళ్లు, రత్నాలు మొదలైన వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. పేపర్-2 ఆప్టిట్యూడ్ టెస్ట్ రెండో పేపర్లో ఎక్కువ వెయిటేజీ లభిస్తున్న విభాగాలు కాంప్రహెన్షన్, డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఇంగ్లిష్ వొకాబ్యులరీ, స్పీడ్ రీడింగ్, సమయస్ఫూర్తి వంటి లక్షణాలు అలవర్చుకోవాలి. వొకాబ్యులరీ, స్పీడ్ రీడింగ్ కోసం నిరంతరం ప్రామాణిక ఇంగ్లిష్ దినపత్రికలు, వాటిలో వ్యాసాలు, వాక్య నిర్మాణాలు, వినియోగించిన పదాలను గుర్తించాలి. కాంప్రెహెన్షన్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రెహెన్షన్‌కు సంబంధించి అడిగే ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే ప్రశ్నలోని కీలక పదాన్ని గుర్తించే నేర్పు సొంతం చేసుకోవాలి. దీనికి మార్గం నిరంతర ప్రాక్టీసే. అనలిటికల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్: ఇందులో ప్రధానంగా సిల్లాయిజమ్, స్టేట్మెంట్స్ అండ్ కన్‌క్లూజన్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు రావొచ్చు. డెసిషన్ మేకింగ్: ఏదో ఒక సందర్భం ఇచ్చి.. ఆ సందర్భంలో మనం తీసుకునే నిర్ణయాలపై ప్రశ్నలు వస్తాయి. ఇటువంటి ప్రశ్నలకు సమాధానం గుర్తించే సందర్భంలో న్యాయబద్ధంగా ఉన్న వాటికి ప్రాధాన్యతనివ్వాలి. బేసిక్ న్యూమరసీ అండ్ జనరల్ మెంటల్ ఎబిలిటీలో బేసిక్ న్యూమరసీ అంటే 10వ తరగతిలోపు గణిత శాస్త్రం లో ఉన్న అంశాలను నేర్చుకుంటే సరిపోతుంది. దీనికో సం ప్రాథమిక సంఖ్యావాదం, భాజనీయత సూత్రాలు, 35 వరకు వర్గాలు, 15 వరకు ఘనాలు, కాలం-దూరం, కాలం-పని, సరాసరి, నిష్పత్తి-అనుపాతం, శాతాలు, లాభం-నష్టం, భాగస్వామ్యం, సాధారణ వడ్డీ(బారు వడ్డీ), చక్రవడ్డీ వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి. డేటా ఇంటర్‌ప్రిటేషన్ నుంచి కనీసం రెండు లేదా మూడు ప్రశ్నలు రావచ్చు. ఈ విభాగం కోసం బ్యాంక్ పీఓ ప్రీవియస్ పేపర్లను ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. జనరల్ మెంటల్ ఎబిలిటీ అనేది అకాడమీ పుస్తకాల్లో లేని కొత్త అంశం. ఇందులో పజిల్స్ నుంచి ఎక్కువ శాతం ప్రశ్నలు వస్తున్నాయి. వీటితోపాటు రక్త సంబంధాలు, దిక్కులు, సీటింగ్ అరేంజ్మెంట్స్ మొదలగు అంశాలను నేర్చుకోవాలి. ఈ విభాగం కోసం ఆర్ఎస్ అగర్వాల్ రాసిన A Modern Approach to Verbal Reasoning పుస్తకం చదవాలి. విజయ సోపానాలు సివిల్స్ ప్రిలిమ్స్‌లో విజయం సాధించాలంటే పేపర్ 1, పేపర్ 2.. రెండింటికీ సమాన ప్రాధాన్యం ఇస్తూ ప్రిపరేషన్ కొనసాగించాలి. ఏదో ఒక పేపర్‌పై మాత్రమే ఎక్కువ లేదా తక్కువగా దృష్టిసారించడం మంచిది కాదు. ఇంజనీరింగ్/ మేనేజ్మెంట్ అకడమిక్ నేపథ్యం ఉన్న విద్యార్థులకు పేపర్-2 (ఆప్టిట్యూడ్ టెస్ట్) తేలికైనదని, అదే విధంగా ఆర్ట్స్ నేపథ్యం ఉన్న విద్యార్థులకు పేపర్-1 (జనరల్ స్టడీస్) తేలికనే అభిప్రాయం ఉంది. ఇలాంటి వాటిని విస్మరించాలి. అకడమిక్ నేపథ్యాన్ని పట్టించుకోకుండా ఔత్సాహికులు రెండు పేపర్లకూ సమాన ప్రాధాన్యం ఇచ్చి, పటిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్ కొనసాగించాలి. పేపర్ 1కు సంబంధించి సిలబస్‌లో ఉన్న అన్ని అంశాలపైనా పట్టు సాధించేందుకు ప్రయత్నించాలి. ప్రాథమిక అంశాలను అర్థం చేసుకుంటూ చదవాలి. కాన్సెప్టులపై పూర్తిస్థాయి అవగాహన సంపాదించిన వారికి విజయం ఖాయం. ఇక పేపర్ 2లో మంచి మార్కులు చేజిక్కించుకునేందుకు ప్రాక్టీస్‌కు మించిన మేలైన సాధనం లేదు. రోజువారీ ప్రాక్టీస్ ద్వారా ఇందులోని అంశాలపై పట్టు సాధించవచ్చు. తొలిసారి పరీక్షకు హాజరవుతున్న వారు తప్పనిసరిగా గత మూడేళ్ల ప్రశ్నపత్రాలను పరిశీలించాలి. దీనివల్ల ప్రశ్నల స్వరూపం అర్థమవుతుంది. ప్రిపరేషన్ సమయంలో ఆత్మస్థైర్యం తొణికిసలాడాలి. నిలకడగా, కష్టపడి చదివితే ప్రిలిమ్స్‌లో విజయం తథ్యం! - జె.మేఘనాథరెడ్డి, ఐఏఎస్ ట్రెయినీ, ముస్సోరి. ముఖ్య తేదీలు దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: జూన్ 30, 2014. సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: ఆగస్టు 24, 2014. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వెబ్సైట్: ] www.upsconline.nic.in