సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష మరోసారి రద్దుకావడం కలకలం రేపుతోంది. ఇప్పటికే ఓసారి రద్దుకావడంతో రెండోసారి పరీక్ష రాయాల్సి వచ్చిందని, ఇప్పుడు మళ్లీ పరీక్ష రాయాలంటే ఎలాగని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ కష్టపడి చదివామని, వేలు, లక్షలు ఖర్చుపెట్టి శిక్షణ తీసుకున్నామని.. ఇప్పుడంతా వృధా అయినట్లే అని ఆవేదన చెందుతున్నారు. మళ్లీ ప్రిలిమ్స్ నిర్వహించినా అది ఎప్పుడు ఉంటుందో, అప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందోనని వాపోతున్నారు.
లీకేజీతో ఓసారి.. నిర్లక్ష్యంతో మరోసారి
వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 503 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి గతేడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్ జారీకాగా.. 3,80,081 మంది దరఖాస్తు చేసుకున్నారు. టీఎస్‌పీఎస్సీ గతేడాది అక్టోబర్ 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి మెయిన్స్ పరీక్ష తేదీలను కూడా ప్రకటించింది. కానీ టీఎస్‌పీఎస్సీ కార్యాలయం నుంచి ప్రశ్నపత్రాలు లీకైన వ్యవహారం బయటపడటంతో గ్రూప్–1 ప్రిలిమ్స్‌ను పరీక్షను రద్దు చేసింది.
మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులు ఈ నిర్ణయంతో గందరగోళంలో పడ్డారు. ఆ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అందరికీ తిరిగి జూన్ 11న ప్రిలిమ్స్ పరీక్షలను నిర్వహిస్తామని టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఈ క్రమంలో రెండోసారి ప్రిలిమ్స్‌కు 3,09,323 మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోగా.. 2,33,248 మంది పరీక్ష రాశారు. ఈసారి ప్రిలిమ్స్ నిర్వహణ లోపభూయిష్టంగా, అక్రమాలకు తావిచ్చేలా ఉందని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. రెండో ప్రిలిమ్స్‌నూ రద్దు చేయాలని సర్కారును ఆదేశించింది.
రద్దయితే వచ్చే ఏడాదే?
గ్రూప్–1 ప్రిలిమ్స్ రద్దు తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీలు చేయాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. ఒకవేళ రద్దు తీర్పును డివిజన్ బెంచ్ సమర్థిస్తే.. మూడోసారి ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించాల్సి వస్తుంది. ఇదే జరిగితే ఇప్పట్లో ప్రిలిమ్స్ నిర్వహణ సాధ్యంకాకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిబంధనల ప్రకారం.. పరీక్ష కోసం కనీసం రెండు నెలల గడువు ఇస్తూ తేదీని ప్రకటించాల్సి ఉంటుంది.
వచ్చే నెలలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వస్తుందని ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వస్తే తర్వాత రెండు నెలల పాటు అధికార యంత్రాంగం ఎన్నికల పనిలోనే బిజీగా ఉంటుంది. ఈ క్రమంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య గ్రూప్–1 ప్రిలిమ్స్ నిర్వహించడం కష్టమనే అభిప్రాయం ఉంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోక్‌సభ ఎన్నికలూ జరగాల్సి ఉంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది మే వరకు గ్రూప్–1 పరీక్షలు వాయిదాపడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అభ్యర్థులు ఆగమాగం
గతేడాది ఏప్రిల్‌లో గ్రూప్–1 నోటిఫికేషన్ రావడంతోనే లక్షలాది మంది అభ్యర్థులు పరీక్షలకు సిద్ధమవడంపై దృష్టిపెట్టారు. చిన్నపాటి ఉద్యోగాలు చేస్తున్నవారు అది మానేసి, కొందరు దీర్ఘకాలిక సెలవులు పెట్టి పరీక్ష కోసం శిక్షణ తీసుకున్నారు. దీనికితోడు ఏళ్లుగా పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నవారు మరింత ఫోకస్ పెట్టారు. పకడ్బందీగా చదువుకుని ప్రిలిమ్స్ పరీక్షలు రాశారు.
కానీ లీకేజీ వ్యవహారంతో పరీక్ష రద్దుకావడంతో నిరుత్సాహానికి గురయ్యారు. అయితే టీఎస్‌పీఎస్సీ వేగంగా చర్యలు చేపట్టి, తిరిగి ప్రిలిమ్స్ నిర్వహించే తేదీని ప్రకటించడంతో.. అభ్యర్థులంతా ఎంతో ఆశతో రెండోసారి పరీక్ష కోసం సిద్ధమయ్యారు. అలా ఈ ఏడాది జూన్ 11న పరీక్ష రాశారు. ఫలితాల విడుదల, మెయిన్స్‌కు 1ః50 నిష్పత్తిలో ఎంపిక జాబితా కోసం ఎదురుచూస్తున్న తరుణంలో.. తాజాగా హైకోర్టు తీర్పుతో దిక్కుతోచని స్థితి లో పడ్డారు. మూడోసారి పరీక్ష కోసం చదవాల్సి రావడమేంటన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మళ్లీ పరీక్ష రాయాలంటే భయంగా ఉంది
గ్రూప్–1 ఉద్యోగం సాధించాలని రెండేళ్లుగా సన్నద్ధమవుతున్నాను. ప్రిలిమ్స్ రద్దు తో సమయం, డబ్బు వృథా అయ్యాయి. మరోసారి పరీక్ష రాయాలంటేనే భయం వేస్తోంది. పరీక్ష నిర్వహణలో టీఎస్‌పీఎస్సీ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకసారి లీకేజీ, మరోసారి నిర్వహణ లోపాలతో రద్దు చేశారు. మొదటిసారి ప్రశ్నపత్రంలో 5 ప్రశ్నలు, రెండోసారి 7 ప్రశ్నలు తొలగించారు. ఇంత నిర్లక్ష్యమైతే ఎలా? – బి.అనిల్ కుమార్, హనుమకొండ
Comments
Please login to add a commentAdd a comment