ఓ గెస్ట్‌హౌస్ అడ్డాగా ఎంసీ క్యాచర్ల ఏర్పాటు
ఆయనతోపాటు కుటుంబీకులపై నిఘా కోసమే
నేరుగా పర్యవేక్షించిన ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు
డీఎస్పీ ప్రణీత్‌రావు నేతృత్వంలో సాగిన ఫోన్ ట్యాపింగ్
రాధాకిషన్‌రావు విచారణలో గుర్తించిన సిట్ అధికారులు
సాక్షి, హైదరాబాద్: ఎస్‌ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోపాటు ఆయన కుటుంబీకులు, అనుచరులపై నిఘా ఉంచడానికి ఓ గెస్ట్‌హౌస్ తీసుకున్నట్టు తెలిసింది. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసానికి సమీపంలో ఉన్న దీంట్లో ప్రణీత్‌రావు వార్‌రూమ్ నిర్వహించాడు. ఈ గెస్ట్‌హౌస్ కేంద్రంగానే భారీ సెటిల్‌మెంట్లు కూడా జరిగినట్టు తెలిసింది. పోలీసు కస్టడీలో ఉన్న హైదరాబాద్ టాస్‌్కఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు విచారణలో ఈ విషయాలు గుర్తించిన అధికా రులు ఆదివారం రాత్రి ఆ గెస్ట్‌హౌస్‌లో సోదాలు చేశారు.
మరోపక్క రాధాకిషన్‌రావు కస్టడీ బుధవారంతో ముగి యనుండటంతో సిట్ అధికారులు తమ దర్యా ప్తు, విచారణ ముమ్మరం చేశారు. నిఘా అధికారులు చేసిన ఫోన్ ట్యాపింగ్ కారణంగానే 2015 నాటి ‘ఓటుకు కోట్లు’వ్యవహారం, 2022లో చోటు చేసుకున్న ‘ఎమ్మెల్యేలకు ఎర’అంశం వెలుగులోకి వచ్చాయి. ప్రభాకర్‌రావు ఎస్‌ఐబీ చీఫ్‌గా మారిన తర్వాత ట్యాపింగ్ దుర్వినియోగం కావడం మొదలైంది. తొలినాళ్లలో ఈ విభాగం నిబంధనల ప్రకారమే అవసరమైన ఫోన్‌నంబర్లను లీగల్ ఇంటర్‌సెప్షన్‌గా (ఎల్‌ఐ) పిలిచే చట్టబద్ధమైన విధానం ద్వారానే ట్యాప్ చేసింది.
అయితే 2018 ఎన్నికల నుంచి వీరి ట్యాపింగ్ పంథా మారిపోయింది. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఫోన్లతోపాటు సోషల్‌మీడియాను ట్యాప్ చేయాలని భావించారు. ప్రణీత్‌రావు, తిరుపతన్న, వేణుగోపాల్‌రావు తదితరులను ఎస్‌ఐబీలోకి తీసుకున్న తర్వాత, భుజంగరావు పొలిటికల్ ఇంటెలిజెన్స్ బాధ్యతలు చేపట్టడంతో ప్రభాకర్‌రావు ట్యాపింగ్‌ను కొత్త పుంతలు తొక్కించారు. దీనికోసం విదేశాల నుంచి ఉపకరణాలు, సాఫ్ట్‌వేర్స్ అక్రమంగా దిగుమతి అయ్యాయి.
టెక్నాలజీ కన్సల్టెంట్ రవిపాల్ అలియాస్ పాల్ రవికుమార్ సహకారంతో ఇజ్రాయెల్ నుంచి సాఫ్ట్‌వేర్స్, ఎంసీ క్యాచర్స్ సమీకరించుకున్నారు. సూట్‌కేస్‌లో ఇమిడిపోయి ఉండే ఈ ట్యాపింగ్ పరికరం మ్యాన్ ఇన్ ది మిడిల్ (ఎంఐటీఎం) ఎటాక్స్‌కు వినియోగించారు. దీన్ని ప్రణీత్‌రావు టీమ్ ఓ వాహనంలో పెట్టుకొని టార్గెట్ చేసిన వ్యక్తి ఇల్లు, కార్యాలయ సమీపంలో మాటు వేసేది. ఈ పరికరానికి ఓ కృత్రిమ సెల్‌ఫోన్ టవర్‌గా మారిపోయి 300 మీటర్ల పరిధిలో పనిచేస్తున్న ప్రతి ఫోన్ ద్వారా జరిగే కమ్యూనికేషన్ తెలుసుకునే సామర్థ్యం ఉంది.
వాటిలో తమకు కావాల్సిన దాన్ని ఎంచుకొని, దానికి సంబంధించిన సోషల్‌మీడియా సహా ప్రతి కమ్యూనికేషన్‌ను ట్యాప్ చేసే అవకాశం దానిని ఆపరేట్ చేసే వ్యక్తికి ఉంటుంది. ఇలాంటి ఓ ఉపకరణాన్నే ప్రణీత్‌రావు బృందం రేవంత్‌రెడ్డి ఇంటికి సమీపంలో తీసుకున్న గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసింది. అక్కడ నుంచే రేవంత్‌తోపాటు ఆయన కుటుంబీకులు, ప్రధాన అనుచరుల ఫోన్లపై నిఘా ఉంచింది. రాధాకిషన్‌రావు, భుజంగరావులు ఇదే గెస్ట్‌హౌస్ కేంద్రంగా కొన్ని సెటిల్‌మెంట్లు కూడా చేశారని తెలుస్తోంది. ఈ వ్యవహారాలను ప్రభాకర్‌రావు నేరుగా పర్యవేక్షించి భారీ వసూళ్లకు తెర లేపినట్టు పోలీసులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment